
విజయదశమి నుంచి ప్రారంభమైన బంగారం ధరల పెరుగుదల.. ధన త్రయోదశి, దీపావళి పండుగల నాటికి జీవితకాల గరిష్టాలను తాకింది. ప్రస్తుతం 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 82వేలుకు చేరువలో ఉంది. ఆంటే ఒక్క గ్రామ్ పసిడి కొనుగోలు చేయాలంటే రూ. 8,200 చెల్లించాల్సిందే అని స్పష్టమవుతుంది. ఇలాంటి సమయంలో బంగారం మీద పెట్టుబడులు సురక్షితమేనా అనే విషయం ఇక్కడ తెలుసుకుందాం.
ప్రస్తుతం భారీగా పెరుగుతున్న బంగారం ధరలు, మళ్ళీ ఒక్కసారిగా పడిపోయే అవకాశం ఉంటుందా అని పెట్టుబడిదారులు కొంత గందరగోళానికి గురి కావచ్చు. అయితే గత ఐదేళ్లలో పసిడి ధరలు భారీగా పెరగడం బహుశా ఇదే మొదటిసారి అని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి భవిష్యత్తులో గోల్డ్ రేటు భారీగా తగ్గే అవకాశాలు లేదు.
బంగారం ధరలు గణనీయంగా పెరగడానికి ప్రధాన కారణం.. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యూఎస్ ఫెడ్ రేట్ల కోతలు, అమెరికా అధ్యక్ష ఎన్నికలని తెలుస్తోంది. అంతే కాకుండా యుద్ధం లాంటి పరిస్థితి ప్రపంచ వృద్ధి రేటును ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఇది కూడా గోల్డ్ రేటు పెరగడానికి కారణమవుతోంది. భారతదేశంలో బంగారంపై కస్టమ్స్ డ్యూటీలో కోత.. ధరల పెరుగుదలకు హేతువు అయింది.
ఇదీ చదవండి: 102 టన్నుల బంగారం.. ఆర్బీఐ సీక్రెట్ ఆపరేషన్!
డిమాండ్ అనేది సరఫరాను మించి ఉన్నప్పుడు.. ధరల పెరుగుదల సర్వసాధారణం. కాబట్టి ఇలాంటి సమయంలో బంగారంపైన నిశ్చింతగా పెట్టుబడులు పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో పసిడిపై పెట్టిన పెట్టుబడులు తప్పకుండా లాభాలను తెచ్చిపెడతాయని చెబుతున్నారు.