
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు భారీగా బంగారం నిల్వలు ఉన్నాయి. దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ భారీగా బంగారాన్ని దాచింది ఆర్బీఐ. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో తాజాగా 102 టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ వాల్ట్‌ల నుండి స్వదేశానికి తిరిగి తీసుకొచ్చింది.
‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం ప్రకారం.. లండన్‌లోని భూగర్భ వాల్ట్‌ల నుండి బంగారాన్ని భారత్‌కు తీసుకురావడం గత మే నెల తర్వాత ఇది రెండవసారి. ఆర్బీఐ మొత్తం 855 టన్నుల బంగారాన్ని కలిగి ఉంది. ఇందులో దాదాపు 510.5 టన్నుల బంగారం దేశంలోనే ఉంది. 2022 నుండి దాదాపు 214 టన్నుల పసిడిని స్వదేశానికి తీసుకొచ్చింది ఆర్బీఐ.
పెరుగుతున్న ప్రపంచ ఆందోళనలు ఆర్బీఐ, భారత ప్రభుత్వాన్ని కలవరపరిచాయి. దీంతో మన బంగారాన్ని స్వదేశానికి తెచ్చుకోవడం సురక్షితమని భావించిన అధికారులు ఈ తరలింపు చేపట్టారు. 1990లలో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ సంక్షోభం కారణంగా చేపట్టిన తరలింపు తర్వాత ఇదే మొదటి భారీ తరలింపు.
ప్రత్యేక విమానం.. హై సెక్యూరిటీ
ప్రత్యేక విమానం, అత్యంత భారీ భద్రతా ఏర్పాట్ల సహాయంతో ఆర్బీఐ, భారత ప్రభుత్వం సంయుక్తంగా బంగారం తరలింపు మిషన్‌ను అమలు చేశాయని వార్తా నివేదిక తెలిపింది. భవిష్యత్తులో మరిన్ని తరలింపులు ఉండవచ్చని కూడా అధికారులు చెబుతున్నారు.
భారత్ ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్‌మెంట్‌లో 324 టన్నుల బంగారం కలిగి ఉంది. ఇందులో ఎక్కువ మొత్తం యూకేలోనే ఉంది. అందులోనూ 20 టన్నుల పసిడి డిపాజిట్ల రూపంలో అక్కడ ఉంచింది. కాగా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ తన తొమ్మిది భూగర్భ వాల్ట్‌లలో వివిధ దేశాలకు చెందిన దాదాపు 400,000 బార్లు (సుమారు 5,350 టన్నులు) బంగారం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment