Bank Of England
-
102 టన్నుల బంగారం.. ఆర్బీఐ సీక్రెట్ ఆపరేషన్!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు భారీగా బంగారం నిల్వలు ఉన్నాయి. దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ భారీగా బంగారాన్ని దాచింది ఆర్బీఐ. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో తాజాగా 102 టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ వాల్ట్‌ల నుండి స్వదేశానికి తిరిగి తీసుకొచ్చింది.‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం ప్రకారం.. లండన్‌లోని భూగర్భ వాల్ట్‌ల నుండి బంగారాన్ని భారత్‌కు తీసుకురావడం గత మే నెల తర్వాత ఇది రెండవసారి. ఆర్బీఐ మొత్తం 855 టన్నుల బంగారాన్ని కలిగి ఉంది. ఇందులో దాదాపు 510.5 టన్నుల బంగారం దేశంలోనే ఉంది. 2022 నుండి దాదాపు 214 టన్నుల పసిడిని స్వదేశానికి తీసుకొచ్చింది ఆర్బీఐ.పెరుగుతున్న ప్రపంచ ఆందోళనలు ఆర్బీఐ, భారత ప్రభుత్వాన్ని కలవరపరిచాయి. దీంతో మన బంగారాన్ని స్వదేశానికి తెచ్చుకోవడం సురక్షితమని భావించిన అధికారులు ఈ తరలింపు చేపట్టారు. 1990లలో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ సంక్షోభం కారణంగా చేపట్టిన తరలింపు తర్వాత ఇదే మొదటి భారీ తరలింపు.ప్రత్యేక విమానం.. హై సెక్యూరిటీప్రత్యేక విమానం, అత్యంత భారీ భద్రతా ఏర్పాట్ల సహాయంతో ఆర్బీఐ, భారత ప్రభుత్వం సంయుక్తంగా బంగారం తరలింపు మిషన్‌ను అమలు చేశాయని వార్తా నివేదిక తెలిపింది. భవిష్యత్తులో మరిన్ని తరలింపులు ఉండవచ్చని కూడా అధికారులు చెబుతున్నారు.భారత్ ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్లో 324 టన్నుల బంగారం కలిగి ఉంది. ఇందులో ఎక్కువ మొత్తం యూకేలోనే ఉంది. అందులోనూ 20 టన్నుల పసిడి డిపాజిట్ల రూపంలో అక్కడ ఉంచింది. కాగా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ తన తొమ్మిది భూగర్భ వాల్ట్‌లలో వివిధ దేశాలకు చెందిన దాదాపు 400,000 బార్లు (సుమారు 5,350 టన్నులు) బంగారం ఉంది. -
తగ్గనున్న కీలక వడ్డీ రేట్లు..?
బ్రిటన్‌లో ద్రవ్యోల్బణం స్థిరంగా నమోదవుతున్న నేపథ్యంలో ఆగస్టు 1న బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ కీలక వడ్డీరేట్లలో కోత విధిస్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. బ్రిటన్‌లో ద్రవ్యోల్బణం 2 శాతం దరిదాపుల్లో స్థిరంగా ఉంటున్న నేపథ్యంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.2021 జులైలో బ్రిటన్‌లో చివరి సారిగా ద్రవ్యోల్బణం 2 శాతంగా నమోదైంది. కానీ క్రమంగా అది పెరుగుతూ 2022 నాటికి 11 శాతానికి చేరింది. దాంతో కీలక వడ్డీరేట్లను పెంచుతూ వచ్చారు. అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో క్రూడాయిల్ ధర పెరుగడంతో వడ్డీరేట్లలో మార్పులు చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడితో ఇంధన ఖర్చులూ అధికమయ్యాయి. అయితే కొంతకాలం నుంచి క్రమంగా ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతూ వస్తోంది. ప్రస్తుతం బ్రిటన్ ద్రవ్యోల్బణం 2 శాతానికి దరిదాపుల్లోకి రావడంతో ఆగస్టు 1న వడ్డీరేట్లను తగ్గిస్తారని నిపుణులు భావిస్తున్నారు. బ్రిటన్‌లో 5.25 శాతం వడ్డీరేటు ఉంది.ఇదీ చదవండి: రూ.2 వేలకోట్ల ఆర్థిక సహాయానికి ఏడీబీ ఆమోదంఇదిలాఉండగా, ఇటీవల అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఛైర్మన్ జెరొమ్ ఫావెల్ మీడియాతో మాట్లాడుతూ యూఎస్‌లో కీలకవడ్డీ రేట్లను పెంచే పరిస్థితులు కనిపించడం లేదన్నారు. అయితే తగ్గిస్తారా? అని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ వడ్డీ రేట్లను తగ్గించాలంటే మరికొన్ని నివేదికలు అవసరమన్నారు. జులైలో 30-31న జరిగే ఫెడ్ సమావేశంలో దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని మార్కెట్ భావిస్తుంది. -
ఫెడ్ పాలసీ, బడ్జెట్‌పై ఫోకస్
ముంబై: మధ్యంతర కేంద్ర బడ్జెట్ 2024 – 25 ప్రభావిత అంశాలు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ద్రవ్య పాలసీ నిర్ణయాలు ఈ వారం మార్కెట్‌కు అత్యంత కీలకం కానున్నాయని స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. వాహన విక్రయ డేటా, అదే నెలకు సంబంధించి కొన్ని స్థూల ఆర్థిక గణాంకాలు వెల్లడికానున్నాయి. దేశీయ కార్పొరేట్ డిసెంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు తుది దశకు చేరుకున్నాయి. వీటితో పాటు సాధారణ అంశాలైన విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు, రూపాయి కదిలికలు, కమోడిటీ, క్రూడాయిల్ ధరలూ సూచీల ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. ట్రేడింగ్ 3 రోజులే జరిగిన గతవారంలో స్టాక్ సూచీలు ఒకశాతం నష్టపోయాయి. కార్పొరేట్ క్యూ3 ఆర్థిక ఫలితాలు నిరాశపరచడం, ఎఫ్ఐఐల వరుస విక్రయాలు, మధ్యంతర బడ్జెట్, ఫెడ్ పాలసీ ప్రకటనకు అప్రమత్తతతో గతవారంలో నిఫ్టీ 270 పాయింట్లు, సెన్సెక్స్ 982 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. ‘‘అమెరికా, బ్రిటన్ కేంద్ర బ్యాంకుల ద్రవ్య పాలసీ నిర్ణయాల వెల్లడి నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్లు స్థిరీకరణకు లోనయ్యే అవకాశం ఉంది. ఈ వారంలో పలు పెద్ద కంపెనీలు తమ క్యూ3 ఫలితాలు విడుదల చేస్తున్న నేపథ్యంలో స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. అమ్మకాలు కొనసాగితే సాంకేతికంగా నిఫ్టీకి దిగువున 21050 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు ఉంది. ఈ స్థాయిని కోల్పోతే 20,970 – 20,770 శ్రేణిలో మరో మద్దతు ఉంది. సానుకూల పరిణామాలు నెలకొని కొనుగోళ్లు జరిగితే ఎగువ స్థాయిలో 21,640 పాయింట్ల వద్ద నిరోధాన్ని చేధించాల్సి ఉంటుంది.’’ అని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు. క్యూ3 ఆర్థిక ఫలితాల ప్రభావం దేశీయ కార్పొరేట్ కంపెనీలు క్యూ3 ఆర్థిక ఫలితాల ప్రకటన తుది అంకానికి చేరుకుంది. ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్, ఎల్అండ్టీ, సన్ ఫార్మా, మారుతీ సుజుకీ, టైటాన్, అదానీ పోర్ట్స్‌తో ఈ వారంలో మొత్తం 475 కంపెనీలు తమ డిసెంబర్ ఫలితాలను వెల్లడించనున్నాయి. వీటితో పాటు ఎన్టీపీసీ, అదానీ ఎంటర్ప్రైజెస్, బీపీసీఎల్, అదానీ టోటల్ గ్యాస్, కొచి్చన్ షిప్‌యార్డ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, పిరమిల్ ఫార్మా, స్ట్రైడ్స్ ఫార్మా, వోల్టాస్, బ్యాంక్ ఆఫ్ బరోడా, డాబర్ మూడో త్రైమాసిక ఫలితాలు ప్రకటించే జాబితాలో ఉన్నాయి. కార్పొరేట్ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీల యాజమాన్యం అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు పరిశీలిస్తాయి. స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. స్థూల ఆర్థిక డేటాపై దృష్టి కేంద్ర గణాంకాల శాఖ డిసెంబర్ నెలకు సంబంధించి ద్రవ్య లోటు, మౌలిక రంగ ఉత్పత్తి గణాంకాలను బుధవారం వెల్లడించనుంది. మరుసటి రోజు ఫిబ్రవరి ఒకటిన(గురువారం) ఆటో కంపెనీలు తమ జనవరి నెల వాహన విక్రయ గణాంకాలను వెల్లడించనున్నాయి. అదే రోజున తయారీ రంగ పీఎంఐ డేటా వెల్లడవుతుంది. వారాంతాపు రోజున (శుక్రవారం) జనవరి 26తో ముగిసిన ఫారెక్స్ రిజర్వ్ డేటాను ఆర్బీఐ విడుదల చేస్తుంది. వ్యవస్థ పనితీరును ప్రతిబింబింప చేసే ఈ స్థూల ఆర్థిక గణాంకాలు మార్కెట్ ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపగలవు. రెండు లిస్టింగులు, ఒక ఐపీఓ ఇదే వారంలో ఇటీవల ఇష్యూలను పూర్తి చేసుకున్న ఈప్యాక్ డ్యూరబుల్ జనవరి 30న, మరుసటి రోజు (31న)నోవా ఆగ్రిటెక్ కంపెనీల షేర్లు ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. బీఎల్ఎస్ ఈ–సరీ్వసెస్ పబ్లిక్ ఇష్యూ బుధవారం ప్రారంభమై ఫిబ్రవరి ఒకటిన ముగుస్తుంది. అందరి చూపు ఫెడ్ సమావేశం పైనే అమెరికా సెంట్రల్ బ్యాంక్ యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమావేశం మంగళవారం(జనవరి 30న) ప్రారంభమవుతుంది. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ బుధవారం(జనవరి 31)రోజున ప్రకటిస్తారు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గుముఖం పట్టినట్లయితే ఈ ఏడాదిలో మూడు దఫాలు వడ్డీరేట్ల కోత ఉంటుందని గతేడాది డిసెంబర్లో పాలసీ ప్రకటన సందర్భంగా ఫెడ్ సంకేతాలిచ్చింది. ఈ దఫా ఫెడ్ కీలకవడ్డీ రేట్లను ప్రస్తుత స్థాయి (5.25 – 5.50 వద్ద) యథాతథంగా కొనసాగవచ్చు. అయితే బాండ్ల కొనుగోలు, ఆర్థిక వ్యవస్థ పనితీరుపై పావెల్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారోనని ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు ఆసక్తి ఎదురుచూస్తున్నాయి. యూఎస్ జీడీపీ అంచనాలకు మించి నమోదైన నేపథ్యంలో మార్కెట్ వర్గాలు ఫెడ్ చైర్మన్ పావెల్ వ్యాఖ్యలను నిశీతంగా పరిశీలించే వీలుంది. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు అమెరికా ట్రెజరీ బాండ్లపై రాబడులు పెరుగుతుడంతో భారత ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు ఈ జనవరి 25వ తేదీ నాటికి రూ.24,700 కోట్ల షేర్లను విక్రయించారు. ఇదే సమయంలో డెట్ మార్కెట్లో రూ.17,120 కోట్లు పెట్టుబడులు పెట్టారు. అమెరికా బాండ్లపై రాబడులు ఆందోళనలను కలించే అంశమే కాకుండా నగదు మార్కెట్లో అమ్మకాలను ప్రేరేపిస్తుందని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ హెడ్ వీకే విజయ్ కుమార్ కుమార్ తెలిపారు. ఆటో, ఆటో ఉపకరణాలు, మీడియా ఎంటర్టైన్మెంట్, ఐటీ షేర్లను విక్రయించారు. ఆయిల్‌అండ్‌గ్యాస్, విద్యుత్, ఎంపిక చేసుకున్న ఫైనాన్స్ షేర్లను కొనేందుకు ఆసక్తి చూపారు. మధ్యంతర బడ్జెట్‌పై ఆసక్తి ఫెడ్ పాలసీ తర్వాత దలాల్ స్ట్రీట్ వర్గాలు అత్యంత ఆస్తకిగా ఎదురుచూసే మరో కీలక ఘట్టం బడ్జెట్. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటిన మధ్యంతర బడ్జెట్ 2024–25 ను ప్రవేశపెట్టనున్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ ప్రజాకర్షక బడ్జెట్ ఉండొచ్చనేది అత్యధిక వర్గాల అంచనా. ముఖ్యంగా ద్రవ్య పరమైన కార్యాచరణ, మూలధన ఆధారిత పెట్టుబడుల విస్తరణ, గ్రామీణాభివృద్ధికి ప్రణాళికలకు మధ్యంతర బడ్జెట్ అధిక ప్రాధ్యాన్యత ఇవ్వొచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ఏదిఏమైనా మార్కెట్‌కు అనుకూలంగా నిర్ణయాలుంటే సూచీలు, షేర్లు ఇప్పటికే భారీ ర్యాలీ చేసిన నేపథ్యంలో లాభాలు పరిమితంగా ఉండొచ్చు. ప్రతికూల నిర్ణయం వెలువడితే మరింత లాభాల స్వీకరణ చోటుచేసుకొని సూచీలు పతనాన్ని చవిచూడొచ్చు. -
ఆర్బీఐ వద్ద పసిడి నిల్వలు 795 టన్నులు
ముంబై: ఆర్బీఐ వద్ద బంగారం నిల్వలు ఏడాది కాలంలో 5 శాతం పెరిగాయి. ఈ ఏడాది మార్చి చివరికి 794.64 టన్నులకు చేరాయి. ఇందులో 56.32 మెట్రిక్ టన్నులు గోల్డ్ డిపాజిట్లు రూపంలో ఉన్నాయి. 2022 మార్చి నాటికి ఇవి 760.42 టన్నులుగా ఉన్నాయి. అప్పటికి గోల్డ్ డిపాజిట్లు 11.08 మెట్రిక్ టన్నులతో పోలిస్తే, గణనీయంగా వృద్ధి చెందాయి. మొత్తం మీద గత ఆర్థిక సంవత్సంలో ఆర్బీఐ 34.22 టన్నుల బంగారం నిల్వలను పెంచుకుంది. మార్చి చివరినాటికి ఆర్బీఐ వద్దనున్న 794.64 టన్నుల బంగారంలో 437.22 టన్నులు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (బీఐఎస్) వద్ద సురక్షితంగా ఉందని, 301.10 టన్నులు దేశీయంగా నిల్వ ఉన్నట్టు ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. 2023 మార్చి నాటికి ఆర్బీఐ వద్దనున్న మొత్తం విదేశీ మారకం నిల్వల విలువలో (డాలర్లలో) బంగారం నిల్వల విలువ 7.81 శాతానికి పెరిగింది. 2022 సెప్టెంబర్ నాటికి ఇది 7.06 శాతంగా ఉంది. ఆర్బీఐ వద్ద విదేశీ మారకం నిల్వలు 2022 సెప్టెంబర్ నాటికి 532.66 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2023 మార్చి నాటికి 578.45 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఈ మొత్తంలో విదేశీ కరెన్సీ ఆస్తుల రూపంలో 509.69 బిలియన్ డాలర్లు ఉంది. 411.65 బిలియన్ డాలర్లను సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేయగా, 75.51 బిలియన్ డాలర్లు ఇతర సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్లలో ఇన్వెస్ట్ చేసి ఉంది. 22.52 బిలియన్ డాలర్లు విదేశీ వాణిజ్య బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో ఉన్నట్టు ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. -
బ్రిటన్కేమైంది? ముసురుకుంటున్న మాంద్యం.. తీవ్ర ఆర్థిక సంక్షోభం!
యునైటెడ్ కింగ్డమ్. స్థిరత్వానికి మారుపేరు. ఎన్ని సంక్షోభాలు, ప్రపంచ యుద్ధాలు జరిగినా ఆర్థిక మూలాలు చెక్కు చెదరని దేశం. కానీ ఇప్పుడు ఆ దేశం కనీవినీ ఎరుగని గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది. ఏడాదిలో ముగ్గురు ప్రధానమంత్రులు మారారు. అయినా బలహీనపడిపోతున్న ఆర్థిక వ్యవస్థని కాపాడే దిక్కు లేకుండా పోయింది. ధనిక దేశాల కంటే అన్నింట్లోనూ వెనుకబడిపోతూ మాంద్యం ఉచ్చులో చిక్కుకుంటోంది. నానాటికీ పతనం... బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకి పతనమైపోతోంది. ధరాభారం ప్రజల జేబుల్ని గుల్ల చేస్తోంది. పెరుగుతున్న ధరలకి తగ్గట్టుగా ఆదాయాలు పెరగకపోవడంతో ప్రజలకి కొనుక్కొని తినే స్థోమత కూడా కరువు అవుతోంది.దీంతో సమాజంలోని వివిధ వర్గాలు వేతనాల పెంపు డిమాండ్‌తో సమ్మెకు దిగుతున్నాయి. ప్రపంచంలోని మిగిలిన అభివృద్ధి చెందిన దేశాలు ఈ ఏడాది ఆర్థికంగా పుంజుకుంటే బ్రిటన్ మరింత క్షీణిస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) అంచనా వేస్తోంది. ఆర్థిక మాంద్యం ఎదుర్కోక తప్పదని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రతో చమురు లభ్యత చాలా దేశాలకు అతి పెద్ద సమస్యగా మారింది. అమెరికా తన సొంత గడ్డపై లభించే శిలాజ ఇంధనాలపై ఆధారపడితే, ఫ్రాన్స్ అణు విద్యుత్‌పైనా, నార్వే జలవిద్యుత్‌పైన ఆధారపడ్డాయి. యూకే గ్యాస్‌పైనే ఆధారపడే దేశం కావడంతో విద్యుత్ బిల్లులు తడిసిపోపెడైపోయాయి. ఒకానొక దశలో 100% పెరిగాయి. దేశం ఆర్థికంగా కుదేలు కావడానికి ఇంధనం అసలు సిసలు కారణమని ఫిస్కల్ స్టడీస్ ఇనిస్టిట్యూట్ డిప్యూటీ డైరెక్టర్ కార్ల్ ఎమ్మర్సన్ అభిప్రాయపడ్డారు. జీ–7 దేశాల్లో వెనక్కి అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్ వంటి సంపన్న దేశాల కంటే బ్రిటన్ ఎందుకు వెనుకబడిందనే చర్చ జరుగుతోంది. కరోనా మహమ్మారి, ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ప్రపంచ ఆర్థిక వ్యవస్థలనే ఛిన్నాభిన్నం చేశాయి. కరోనా విసిరిన సవాళ్ల నుంచి కోలుకునే దశలో ఉక్రెయిన్‌పై రష్యా ప్రారంభించిన యుద్ధం పులి మీద పుట్రలా మారింది. అన్నింటిని తట్టుకొని ధనిక దేశాలు మళ్లీ పూర్వ స్థితికి వస్తూ ఉంటే బ్రిటన్ మాత్రం కోలుకోలేకపోతోంది. ఇందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి. రాజకీయాలు, వాతావరణ పరిస్థితులు వంటివి కూడా ప్రభావం చూపిస్తాయి. ఇతర దేశాలు విద్య, ఆరోగ్య రంగం ఆధారంగా పరిస్థితుల్ని అంచనా వేస్తే బ్రిటన్ మాత్రం సేవల ఆధారంగా నిర్ణయిస్తుంది. జీ–7 దేశాలన్నీ ఈ ఏడాది కోలుకుంటాయని ఐఎంఎఫ్ వంటి సంస్థలు అంచనా వేస్తున్నాయి. కానీ బ్రిటన్ పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. డాలర్‌తో పౌండ్ విలువ : 0.83 బ్రిటన్ జీడీపీ వృద్ధి రేటు అంచనా: 0.6% ద్రవ్యోల్బణం : 10.1% బ్రెగ్జిట్ దెబ్బ... ప్రపంచదేశాలు కరోనా, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం వంటి సంక్షోభాలను ఎదుర్కొంటే బ్రిటన్ ఆర్థిక సమస్యలకు బ్రెగ్జిట్ అదనపు కారణంగా నిలిచింది. 2016లో యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచీ దేశానికి ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి. బ్రెగ్జిట్ కారణంగా యూకే ఆర్థిక వ్యవస్థకు ఏడాదికి ఏకంగా 10 వేల కోట్ల పౌండ్ల నష్టం వాటిల్లుతోందని బ్లూమ్‌బర్గ్ నివేదిక వెల్లడించింది. దీర్ఘకాలంలో బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ 4 శాతానికి తగ్గుతుందని తెలిపింది. 2021 జనవరి నుంచి బ్రిటన్ నుంచి ఈయూకు ఎగుమతులు 16% పడిపోయాయి. ఈయూ నుంచి వచ్చే పెట్టుబడులు 2,900 కోట్ల పౌండ్లు తగ్గిపోయాయి. శ్రామికులు కావలెను... బ్రెగ్జిట్ ముందు వరకు ఈయూ నుంచి బ్రిటన్‌కి స్వేచ్ఛగా పని చేయడానికి వచ్చేవారు. ఇప్పుడు వర్కర్లు రావడం మానేశారు. ఫలితంగా ఆతిథ్యం, వ్యవసాయం, సేవా రంగాల్లో సిబ్బంది కొరత ఏర్పడింది. యువత పని చేయడం కంటే ఉన్నత చదువులపై దృష్టి పెడుతూ ఉంటే, వయసు మీద పడ్డ వారు ముందస్తుగా పదవీ విరమణ చేస్తున్నారు. అత్యధికులు రోగాల పాలై ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్నారే తప్ప పని చేసే వారి సంఖ్య తగ్గిపోతూ వస్తోంది. ఇవన్నీ దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కింగ్ చార్లెస్-3 ఫొటోతో కొత్త కరెన్సీ నోట్లు.. ఫొటోలు వైరల్..
లండన్: బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్-III ఫొటోలతో కూడిన కొత్త కరెన్సీ నోట్లను బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ మంగళవారం విడుదల చేసింది. ప్రస్తుతం వీటి ముద్రణ జరుగుతోంది. 2024 జూన్ నాటికి అందుబాటులోకి రానున్నాయి. అయితే చార్లెస్ ఫొటో ఉన్న కొత్త 5, 10, 20, 50 యూరో నోట్లు క్షణాల్లోనే సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈయన ఫొటోతో ఒక నాణేన్ని కూడా విడుదల చేశారు. దాదాపు 70 ఏళ్లు బ్రిటన్ రాణిగా ఉన్న క్వీన్ ఎలిజబెత్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో మరణించారు. దీంతో ఆయన కుమారుడు చార్లెస్-3 కొత్త రాజు అయ్యారు. బ్రిటన్‌లో రాజు లేదా రాణి ఫొటోలను కరెన్సీ నోట్లపై ముద్రిస్తారు. కొత్త నోట్లు అందుబాటులోకి వచ్చాక పాత నోట్లు కూడా చెల్లుతాయని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ స్పష్టం చేసింది. రాణి ఫొటోలు ఉన్న కరెన్సీ నోట్లు మొత్తం బ్యాంకులకు చేరుకునేందుకు సమయం పడుతుందని చెప్పింది. కొత్త నోట్లపై కింగ్ చార్లెస్ ఫొటో మాత్రమే మారింది. మిగతా డిజైన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. చదవండి: షాకింగ్.. మరికొన్ని రోజుల్లో ఊహించని రీతిలో కరోనా కేసులు..! -
రాణి బొమ్మతో ఉన్న కరెన్సీ నోట్ల మార్పు! విలువెంతంటే..
లండన్: బ్రిటిష్ కరెన్సీ నోట్లపై క్వీన్ ఎలిజబెత్-2 బొమ్మ ఇంతకాలం ఒక హుందాగా ఉండిపోయింది. నోట్లే కాదు.. నాణేలు, పోస్టల్ స్టాంపులుగా యూకేవ్యాప్తంగా అధికారికంగా చెలామణిలో ఉన్నాయి. ఇవి మాత్రమే కాదు.. పాస్‌పోర్ట్, ఇతర డాక్యుమెంట్లలోనూ రాజముద్ర కనిపించేంది. అయితే.. ఆమె మరణంతో ఇప్పుడు పరిస్థితి ఏంటన్న దానిపై అక్కడ జనాల్లో ఒక గందరగోళం నెలకొంది. కరెన్సీ నోట్లపై ఇక నుంచి ఆమె చిత్రాన్ని ముద్రిస్తారా? రద్దు చేస్తారా? చేస్తే తమ దగ్గరున్న కరెన్సీ మాటేంటని ఆరాలు తీస్తున్నారు. ఈ తరుణంలో.. యూకే కేంద్ర బ్యాంక్ ‘బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్’ సమాధానం ఇచ్చింది. బ్యాంక్ నోట్లతో పాటు రాణి ముఖచిత్రం ఉన్న కాయిన్లు ప్రస్తుతానికి చెల్లుతాయని స్పష్టత ఇచ్చింది. అంతేకాదు.. సంతాప దినాలు ముగిశాక బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ బ్యాంక్, నోట్ల విషయంలో మరో ప్రకటన చేయనుంది. అయితే ప్రస్తుతానికి కరెన్సీ చెల్లుబాటు అయినా.. కరెన్సీ నోటుపై రాణి చిత్రాన్ని తప్పనిసరిగా మార్చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే.. నేషన్స్ బ్యాంక్ నుంచి కరెన్సీ నోట్స్, రాయల్ మింట్ నుంచి కాయిన్స్ ముద్ర అవుతాయి అక్కడ. ఇంగ్లాండ్‌లో బ్యాంక్ నోట్లపై చిత్రం ప్రచురితమన మొదటి రాణిగా ఎలిజబెత్‌కు గుర్తింపు దక్కింది. కానీ స్కాటిష్,నార్త్ ఐరిష్ బ్యాంకు నోట్లపై మాత్రం ఆ రాణి బొమ్మ ఉండదు. ఆమె వారసుడిగా రాజ్యాధికారం దక్కించుకున్న రాజు ఛార్లెస్-3 చిత్రాలను కరెన్సీ నోట్లు, కాయిన్లపై భర్తీ చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ ముందు ఇప్పుడు పెద్ద పనే ఉంది. రాజు బొమ్మతో ఉన్న నోట్లు, కాయిన్లు ముద్రించాల్సి ఉంటుంది బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్. యూకే వ్యాప్తంగా రాణి చిత్రం ఉన్న దాదాపు 95 బిలియన్ అమెరికన్ డాలర్లు(ఒక బిలియన్ డాలర్లు అంటే.. ఏడున్నర వేల కోట్ల రూపాయలకు పైనే విలువ)తో కూడిన కరెన్సీనోట్లు, 29 బిలియన్ల నాణేలు ఉన్నట్లు యూకే కేంద్ర బ్యాంక్ చెబుతోంది. రాణి బొమ్మలతో ఉన్న నోట్లు, కాయిన్లు క్రమక్రమంగా కనుమరుగై.. రాజు బొమ్మతో కొత్తగా రానున్నాయి. రాజు బొమ్మతో ఎలాగంటే.. కింగ్ ఛార్లెస్-3 బొమ్మతో ఉన్న కాయిన్లు, కరెన్సీ నోట్లపై ఇప్పటి నుంచే కసరత్తులు మొదలయ్యాయి. కరెన్సీ నోట్ల సంగతి మాటేమోగానీ.. నాణేలపై రాజవంశస్తుల బొమ్మల్ని 17వ శతాబ్దం నుంచి ముద్రిస్తున్నారు. కింగ్ ఛార్లెస్-2 హయాం నుంచి ఇది మొదలైంది. సాధారణంగా.. ఒక తరం వాళ్ల బొమ్మను కుడి వైపు, మరో తరంవాళ్లను ఎడమవైపు ముద్రిస్తూ వస్తున్నారు. ఎలిజబెత్ రాణి బొమ్మ కాయిన్లకు కుడివైపు ఉండేది. కాబట్టి, ఛార్లెస్ బొమ్మను ఎడమవైపే ముద్రించడం ఖాయమైంది. ఇక పాస్‌పోర్ట్, ఇతర డాక్యుమెంట్లు పని చేసినా.. అందులో రాణికి సంబంధించిన ప్రస్తావన బదులు, రాజుకు సంబంధించిందిగా మారనుంది. ఇదీ చదవండి: బ్రిటన్ పార్లమెంట్లో కింగ్ చార్లెస్–3 తొలి ప్రసంగం -
27 ఏళ్ల తరువాత యూకే కేంద్ర బ్యాంక్ షాకింగ్ నిర్ణయం
సాక్షి,న్యూఢిల్లీ: అమెరికా ఫెడ్ బాటలో పయనించిన బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ వడ్డీ రేట్లను భారీగా పెంచేసింది. ద్రవ్యోల్బణం ముప్పు, అధిక ధరలు, ఇంధన ధరలు తదితర ఆందోళనల నేపథ్యంలో కీలక వడ్డీ రేట్లను 1.25 నుంచి 1.75 శాతానికి పెంచింది. పెరుగుతున్న ధరల కట్టడికి ఈ పెంపు నిర్ణయం తీసుకున్నట్టు బ్యాంకు ప్రకటించింది. పలువురు విశ్లేషకులు,పెట్టుబడిదారుల అంచనాల కనుగుణంగానే బీవోఈ గవర్నర్ ఆండ్రూ బెయిలీ 50 బీపీఎస్ పాయింట్ల వడ్డీరేట్ల పెంపును ప్రకటించారు. 1995 తర్వాత ఇదే అతిపెద్ద పెంపు. ఆహార, ఇంధన ధరల సంక్షోభంతో యూకే ద్రవ్యోల్బణం 9.4 శాతం వద్ద జూన్‌లో 40 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరింది. తరువాత ఇది దాదాపు 11 శాతానికి చేరుతుందని అంచనా. (Suryansh Kumar: వావ్!13 ఏళ్లకే 56 కంపెనీలకు బాస్! మరి ఆదాయం!) వచ్చే ఏడాది ప్రారంభం నాటికి వినియోగదారుల ధరల సూచీ ద్రవ్యోల్బణం 15 శాతానికి చేరుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. 27 ఏళ్లలో అతిపెద్ద వడ్డీ రేటు పెంపు ప్రకటించడం గమనార్హం. రుణాలు తీసుకోవడం, ఖర్చుల తగ్గింపు లాంటి చర్యల్ని ప్రోత్సహించే చర్యల్లో భాగంగా వడ్డీరేట్లను పెంచడం వరుసగా ఇది ఆరోసారి. (ఇదీ చదవండి: Honda Dio Sports: హోండా డియో స్పోర్ట్స్ లాంచ్, ఆశ్చర్యంగా ధర తక్కువే!) -
ఫారెక్స్ నిల్వల్లో భారీ వృద్ధి
ముంబై: విదేశీ మారకద్రవ్య నిల్వలు 2021 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య 58.38 బిలియన్ డాలర్లు పెరిగి 635.36 బిలియన్ డాలర్లకు చేరినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నివేదిక పేర్కొంది. విదేశీ మారకద్రవ్య నిల్వల నిర్వహణపై అర్థ వార్షిక నివేదికను ఆర్బీఐ ఆవిష్కరించింది. 2021 మార్చి ముగింపునకు భారత్ విదేశీ మారకపు నిధులు 17.4 నెలల దిగుమతులకు సరిపోయేంతగా ఉంటే, 2021 జూన్ నాటికి ఈ కాలం 15.8 నెలలకు సరిపోయినట్లు పేర్కొంది. 2021 సెప్టెంబర్ నాటికి ఆర్బీఐ 743.84 మెట్రిక్ టన్నుల పసిడి నిల్వలను కలిగి ఉందని తెలిపింది. 451.54 మెట్రిక్ టన్నుల బంగారాన్ని విదేశాల్లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అలాగే బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (బీఐఎస్) వద్ద సురక్షిత కస్టడీలో ఉంచగా, దేశీయంగా 292.30 టన్నుల బంగారం నిల్వ ఉందని నివేదిక వివరించింది. మొత్తం విదేశీ మారకపు నిల్వల్లో బంగారం వాటా 2021 మార్చి నాటికి 5.87 శాతంగా ఉంటే, సెప్టెంబర్ నాటికి 5.88 శాతానికి పెరిగినట్లు పేర్కొన్నారు. 2020 జూన్ 5తో ముగిసిన వారంలో మొట్టమొదటిసారి భారత్ ఫారెక్స్ నిల్వలు అర ట్రిలియన్ స్థాయిని అధిగమించి 501.70 బిలియన్ డాలర్లకు చేరాయి. అటు తర్వాత కొంచెం ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, నిల్వలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఏడాది తిరిగే సరికి నిల్వలు మరో 100 బిలియన్ డాలర్లపైగా పెరిగాయి. 2021 జూన్ 4వతేదీతో ముగిసిన వారంలో మొదటిసారి 600 బిలియన్ డాలర్లను దాటాయి. -
డేంజర్ బెల్: రోబోలతో కూలనున్న కొలువులు
లండన్ : రోబోలతో సామాజిక అశాంతి తప్పదని.ఇవి గుంపగుత్తగా ఉద్యోగాలను కొల్లగొడతాయని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ చీఫ్ ఎకనమిస్ట్ ఆండీ హెల్దానే హెచ్చరించారు. మనిషి ఆలోచించి చేసే పనులను సైతం యంత్రాలు అవలీలగా చేసే రోజులను నాలుగో పారిశ్రామిక విప్లవం ప్రపంచం ముందుంచనుందని ఆండీ స్పష్టం చేశారు. విక్టోరియా రోజులకు మించి ఈ మార్పులు మానవ జాతి పెను విధ్వంసానికి దారితీస్తాయని హెచ్చరించారు. అకౌంటెన్సీ సహా పలు రంగాలు రోబోల ధాటికి ఉద్యోగాలను పెద్ద సంఖ్యలో కోల్పోతాయని చెప్పారు. ఆటోమేషన్ రాకతో గల్లంతయ్యే ఉద్యోగాలను కాపాడుకోవడానికి అభ్యర్థులు అత్యున్నత నైపుణ్యాలను సంతరించుకోవడమే ప్రత్యామ్నాయమన్నారు. దీర్ఘకాలం ఉద్యోగాలను కోల్పోయే క్రమంలో బతుకుతెరువు కోసం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి సామాజిక అశాంతికీ దారితీయవచ్చని హెచ్చరించారు. తొలి మూడు పారిశ్రామిక విప్లవాలు అధికంగా శ్రమతో కూడుకున్న పనులనే యంత్రాలు చేపట్టగా, నాలుగో పారిశ్రామిక విప్లవం ఈ మూడింటికీ భిన్నమైనదన్నారు. ఆధునిక యంత్రాలు మనుషులు ఆలోచించి చేసే పనులనే కాకుండా, నైపుణ్యంతో కూడిన పనులనూ చేస్తాయని చెప్పుకొచ్చారు. మరోవైపు రానున్న రెండు దశాబ్ధాల్లో నూతన సాంకేతిక మార్పులతో బ్రిటన్‌లో 70 లక్షల ఉద్యోగాలు మటుమాయం అవుతాయని అకౌంటెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ నివేదిక పేర్కొన్న సంగతి తెలిసిందే. రిటైల్, రవాణా, తయారీ పరిశ్రమల్లో ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయని ఈ నివేదిక అంచనా వేసింది. ఇతర రంగాలు సైతం తీవ్ర ముప్పును ఎదుర్కొంటాయని నివేదిక స్పష్టం చేసింది. నాలుగో పారిశ్రామిక విప్లవంలో భాగంగా ఇంటెలిజెంట్ కంప్యూటర్స్ అన్నిరంగాల్లోనూ ఉద్యోగాలు కుదేలవుతాయని పేర్కొంది. -
బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ సంచలన నిర్ణయం
లండన్: బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ సంచలన నిర్ణయం తీసుకుంది. సుదీర్ఘ కాలం తరువాత బెంచ్‌మార్క్ వడ్డీరేట్లను స్వల్పంగా పెంచుతూ కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. దాదాపు 10 ఏళ్ల తరువాత మొదటిసారిగా వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లనుపెంచుతున్నట్టు గురువారం ప్రకటించింది. దీంతో 0.25నుంచి 0.50శాతానికి చేరింది. పాలసీ సమీక్ష చేపట్టిన బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ వడ్డీ రేటులో 2007 ప్రపంచ ఆర్థిక సంక్షోభం తరువాత తొలిసారిగా వడ్డీరేట్లను 0.25 శాతం మేర పెంచడంతో మాణిక వడ్డీ రేటు 0.50 శాతానికి చేరింది. అలాగే తదుపరి మూడు సంవత్సరాలలో క్రమంగా స్వల్ప పెరుగుదల ఉంటుందని అంచనాలను వెల్లడించింది ఈ స్వల్ప పెంపునకు , ద్రవ్య విధాన కమిటీ 7-2 ఓటుతో ఆమోదం తెలిపిందని బీఓఈ డిప్యూటీ గవర్న్‌ర్లు జాన్ కున్లిఫ్ఫ్ , డేవ్ రామ్స్‌డెన్ వెల్లడించారు. మరోవైపు రేటు పెంపుపై అక్కడి ఆర్థిక వేత్తలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉన్న పరిస్థితుల్లో విధానాలను మరింత పటిష్టం చేయడం అవసరమని బీఓఈ గవర్నర్ మార్క్‌కార్నే అభిప్రాయపడ్డారు. కాగా 2007 ప్రపంచ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో బ్రిటన్ ఆర్థికవ్యవస్థ దశాబ్దాలుగా తీవ్ర మాంద్యంలో చిక్కుకుంది. అలాగు ఆగస్టు 2016 లో బ్రెగ్జిట్ అనంతరం అత్యవసర రేట్‌కట్‌ను ప్రకటించింది. -
మార్కెట్లకు ‘బ్రిటన్’ బూస్ట్!
♦ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ రేట్ల కోత, ఉద్దీపనలతో ప్రపంచ మార్కెట్ల జోరు... ♦ సెన్సెక్స్ 354 పాయింట్లు జూమ్; మళ్లీ 28 వేల పైకి... ♦ నిఫ్టీ 132 పాయింట్లు అప్..8,683 వద్ద ముగింపు... ♦ జీఎస్టీ బిల్లుకు ఆమోదంతో పెరిగిన సెంటిమెంట్... ముంబై: బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్(బీఓఈ) ప్రకటించిన భారీ ఉద్దీపన ప్యాకేజీ.. ఇన్వెస్టర్లలో ఉత్సాహం నింపింది. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు జోరందుకోవడంతో దేశీ సూచీలు కూడా పరుగులు తీశాయి. దీనికితోడు వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) బిల్లుకు చరిత్రాత్మక ఆమోదం కూడా సానుకూల సెంటిమెంట్‌కు దోహదం చేసింది. మొత్తంమీద ఈ పరిణామాలతో బీఎస్ఈ సెన్సెక్స్ శుక్రవారం 364 పాయింట్లు దూసుకెళ్లి మళ్లీ 28,000 పాయింట్ల పైన స్థిరపడింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 134 పాయింట్లు ఎగబాకి 8,683 వద్ద ముగిసింది. యూరప్ మార్కెట్ల జోరుకుతోడు... ఆసియాలో ప్రధాన సూచీలు ఎగబాకడంతో శుక్రవారం బీఎస్ఈ సెన్సెక్స్ క్రితం ముగింపు 27,714తో పోలిస్తే 96 పాయింట్ల గ్యాప్ అప్‌తో మొదలైంది. ఆ తర్వాత క్రమంగా పుంజుకుంటూ ఒకానొక దశలో 28,110 పాయింట్ల గరిష్టాన్ని కూడా తాకింది. చివరకు 1.31 శాతం (354 పాయింట్లు) లాభంతో 28,079 వద్ద ముగిసింది. గత నెల 11 తర్వాత (500 పాయింట్లు) సెన్సెక్స్ ఒకే రోజు ఇంతగా పెరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ విషయానికొస్తే... దాదాపు 50 పాయింట్ల గ్యాప్ అప్‌తో ఆరంభమై మళ్లీ 8,600 స్థాయిని అధిగమించింది. ఇంట్రాడేలో 8,689 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. చివరకు 1.54 శాతం ఎగసి 8,683 వద్ద ముగిసింది. జీఎస్టీ జోష్... ఏళ్లతరబడి పెండింగ్‌లో ఉన్న చరిత్రాత్మక జీఎస్టీ బిల్లుకు ఎట్టకేలకు రాజ్యసభలో కీలక ఆమోదం లభించడం... చట్టం అమలుకు కేంద్రం రోడ్‌మ్యాప్‌ను కూడా ప్రకటించడంతో ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరిగిందని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. మరోపక్క, జీఎస్టీ అమలు భారత్ ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తుందని... ద్రవ్యోల్బణంపై పెద్దగా ప్రభావం లేకుండానే.. వృద్ధి రేటు జోరందుకోగలదంటూ అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ పేర్కొనడం కూడా మార్కెట్లలో సెంటిమెంట్‌కు దోహదం చేసింది. మొత్తం మీద జీఎస్టీకి పచ్చజెండా, బ్రిటన్ తాజాగా ప్రకటించిన భారీ ఉద్దీపనల ప్రభావంతో ప్రపంచ మార్కెట్లలో సెంటిమెంట్ మెరుగుపడటం మన మార్కెట్లను పరుగులు పెట్టించినట్లు బీఎన్పీ పారిబా మ్యూచువల్ ఫండ్(ఈక్విటీస్) ఫండ్ మేనేజర్ శ్రేయష్ దేవాల్కర్ వ్యాఖ్యానించారు. ఇతర ముఖ్యాంశాలివీ... ⇔ దేశీ సూచీల జోరుకు ప్రధానంగా వాహన, చమురు-గ్యాస్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగ షేర్ల ర్యాలీ ఊతమిచ్చింది. ⇔ బీఎస్ఈలో ఆటోమొబైల్ రంగం సూచీ అత్యధికంగా 3.14% దూసుకెళ్లింది. ఇక చమురు-గ్యాస్ ఇండెక్స్ 2.74%, మెటల్స్ 2.56 శాతం, క్యాపిటల్ గూడ్స్ సూచీ 2.34 శాతం, బ్యాంకింగ్ సూచీ 2 శాతం చొప్పున లాభపడ్డాయి. ⇔ బీఎస్ఈ సెన్సెక్స్‌లో హీరోమోటోకార్ప్ 5.02% ఎగసి టాప్‌లో నిలిచింది. ఇక బజాజ్ ఆటో(4.38 శాతం), యాక్సిస్ బ్యాంక్(3.62%), టాటా మోటార్స్(3.21%), ఎస్బీఐ(3.21%), ఎంఅండ్ఎం(3.16%), ఎల్అండ్టీ(2.88%), అదానీ పోర్ట్స్(2.61%), ఓఎన్జీసీ(2.59%), భారీగా లాభపపడ్డాయి. ⇔ ఇక సన్‌ఫార్మా(0.79%), పవర్‌గ్రిడ్(0.67%) చొప్పున నష్టపోయాయి. ⇔ టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో.... 0.65 శాతం వరకూ నష్టపోయాయి. ⇔ ఇక శుక్రవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) రూ. 436 కోట్ల నికర పెట్టుబడులు వెచ్చించారు. దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(డీఐఐ) కూడా రూ.616 కోట్లను నికరంగా వెచ్చించడం గమనార్హం. ⇔ శుక్రవారం కూడా యూరప్ మార్కెట్లు.. భారీ లాభాలతో ముగిశాయి. బ్రిటన్ సూచీ ఎఫ్టీఎస్ఈ 0.8%, ఫ్రాన్స్ 1.5%, జర్మనీ 1.4% చొప్పున ఎగబాకాయి. ఇక అమెరికా సూచీలూ లాభాలతోనే ఆరంభమయ్యాయి. కడపటి సమాచారం మేరకు డోజోన్స్ 0.8%, నాస్డాక్ 1.2% చొప్పున లాభాలతో ట్రేడవుతున్నాయి. బ్రిటన్ ప్యాకేజీ ఇదీ... యూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలగడం(బ్రెగ్జిట్), అక్కడి ఆర్థిక వ్యవస్థ మందగమనం నేపథ్యంలో బీఓఈ చరిత్రాత్మక నిర్ణయాన్ని ప్రకటించింది. ముఖ్యంగా రుణాలు మరింత చౌకగా అందుబాటులో ఉండేలా కీలక వడ్డీరేటును ఇప్పుడున్న 0.5 శాతం నుంచి పావు శాతం తగ్గించి 0.25 శాతానికి చేర్చింది. 322 ఏళ్ల బీఓఈ చరిత్రలో ఇదే రికార్డు కనిష్టస్థాయి. 2009 తర్వాత తొలి రేటు కోత కూడా. మరోపక్క, ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు వీలుగా ఇప్పటికే అమలవుతున్న ఉద్దీపన ప్యాకేజీకి తాజాగా మరింత జతచేసింది. వచ్చే ఆరు నెలలపాటు అదనంగా 60 బిలియన్ పౌండ్ల(79 బిలియన్ డాలర్లు) ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేయనున్నట్లు బీఓఈ ప్రకటించింది. దీనికితోడు కార్పొరేట్లకు మరిన్ని నిధులను అందించేచర్యల్లో భాగంగా వారి నుంచి 10 బిలియన్ పౌండ్ల విలువైన బాండ్లను కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. తగ్గిన వడ్డీరేట్లను రుణగ్రహీతలకు పూర్తిగా అందుబాటులోకి తెచ్చేందుకు 100 బిలియన్ పౌండ్ల వరకూ నిధులను బ్యాంకులకు ఇవ్వనున్నట్లు కూడా బీఓఈ తాజా సమావేశంలో నిర్ణయించింది. ‘ప్రస్తుత పరిస్థితుల్లో తక్షణ కార్యాచరణ చాలా అవసరం. అందుకే ఈ చర్యలు చేపట్టాం. దీనివల్ల అనిశ్చితికి తెరదించడంతోపాటు విశ్వాసం పెంచేందుకు వీలవుతుంది. అంతేకాదు మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు చేయూత లభిస్తుందని భావిస్తున్నాం’ అని బీఓఈ గవర్నర్ మార్క్ కార్నీ వ్యాఖ్యానించారు. -
బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ సంచలన నిర్ణయం
లండన్ : బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ సంచలన నిర్ణయం తీసుకుంది. పాలసీ సమీక్ష నిర్వహించిన ఇంగ్లండ్ కేంద్ర బ్యాంకు వడ్డీ రేటులో 0.25 శాతం మేర కోత పెట్టింది. దీంతో ప్రామాణిక వడ్డీ రేటు 0.25 శాతానికి చేరింది. సహాయక ప్యాకేజీకింద 10 బిలియన్ పౌండ్లతో యూకే కార్పొరేట్ బాండ్లను కొనుగోలు చేసేందుకు నిర్ణయించినట్టు గురువారం వెల్లడించింది. మానిటరీ పాలసీ రివ్యూ నిర్వహించిన బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ గవర్నర్ మార్క్ కార్నేఈ వివరాలను ప్రకటించారు. సుదీర్ఘ కాలం తరువాత 2009 తరువాత మొట్టమొదటి సారి వడ్డీ రేట్లు కట్ చేసింది. మార్కెట్ అంచనాలను అనుగుణంగా తన ముఖ్య లెండింగ్ రేటు తగ్గించింది. వడ్డీరేట్లను0.5 శాతం నుంచి 0.25 శాతానికి తగ్గించింది. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ 2016 సం.రంలో ఆర్థిక స్థిరంగా ఉంటుందని, అయితే వచ్చే ఏడాదంతా బలహీనమైన వృద్ధి ఉండనుందని సెంట్రల్ బ్యాంక్ వ్యాఖ్యానించింది. దీంతోపాటు యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగిన పరిణామాలనుంచి బయటపడడానికి 60 బిలియన్ పౌండ్ల ప్రభుత్వం రుణం కొనుగోలు చేయనున్నట్టు చెప్పింది. జూన్ 23 బ్రెగ్జిట్ పరిణామంతో స్టెర్లింగ్ పౌండ్ విలువ భారీ పతనం, గణనీయింగా పెరిగిన ద్రవ్యోల్బణం కారణాలతో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతోపాటుగా కొన్ని కొత్త పథకాలను ప్రకటించింది. బ్యాంకుల స్థిరీకరణ కోసం వంద బిలియన్ పౌండ్లు, పది బిలియన్ పౌండ్ల కార్పొరేట్ బాండ్ల కొనుగోలు తదితర అంశాలను ప్రకటించింది. కాగా ఆర్థిక వేత్తల సహా, పోర్బ్స్ కూడా కార్పొరేట్ రుణ కొనుగోళ్లకు వ్యతిరేకంగా స్పందించారు. 2009 సం.రం తరువాత మొట్టమొదటి వడ్డీరేట్లలో కోత పెట్టిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. మరోవైపు కేంద్ర బ్యాంక్ ప్రకటనతో పౌండ్ విలువమరింత క్షీణించింది. ఒక శాతానికిపైగా నష్టపోయింది.