ముంబై: విదేశీ మారకద్రవ్య నిల్వలు 2021 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య 58.38 బిలియన్ డాలర్లు పెరిగి 635.36 బిలియన్ డాలర్లకు చేరినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నివేదిక పేర్కొంది. విదేశీ మారకద్రవ్య నిల్వల నిర్వహణపై అర్థ వార్షిక నివేదికను ఆర్‌బీఐ ఆవిష్కరించింది. 2021 మార్చి ముగింపునకు భారత్ విదేశీ మారకపు నిధులు 17.4 నెలల దిగుమతులకు సరిపోయేంతగా ఉంటే, 2021 జూన్ నాటికి ఈ కాలం 15.8 నెలలకు సరిపోయినట్లు పేర్కొంది. 2021 సెప్టెంబర్ నాటికి ఆర్‌బీఐ 743.84 మెట్రిక్ టన్నుల పసిడి నిల్వలను కలిగి ఉందని తెలిపింది.
451.54 మెట్రిక్ టన్నుల బంగారాన్ని విదేశాల్లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అలాగే బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్‌మెంట్స్ (బీఐఎస్) వద్ద సురక్షిత కస్టడీలో ఉంచగా, దేశీయంగా 292.30 టన్నుల బంగారం నిల్వ ఉందని నివేదిక వివరించింది. మొత్తం విదేశీ మారకపు నిల్వల్లో బంగారం వాటా 2021 మార్చి నాటికి 5.87 శాతంగా ఉంటే, సెప్టెంబర్ నాటికి 5.88 శాతానికి పెరిగినట్లు పేర్కొన్నారు. 2020 జూన్ 5తో ముగిసిన వారంలో మొట్టమొదటిసారి భారత్ ఫారెక్స్ నిల్వలు అర ట్రిలియన్ స్థాయిని అధిగమించి 501.70 బిలియన్ డాలర్లకు చేరాయి. అటు తర్వాత కొంచెం ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, నిల్వలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఏడాది తిరిగే సరికి నిల్వలు మరో 100 బిలియన్ డాలర్లపైగా పెరిగాయి. 2021 జూన్ 4వతేదీతో ముగిసిన వారంలో మొదటిసారి 600 బిలియన్ డాలర్లను దాటాయి.
Comments
Please login to add a commentAdd a comment