అంతర్జాతీయ విదేశీ మారక ద్రవ్య మార్కెట్లో రూపాయి వేగంగా పతనమవుతోంది. డాలర్‌ను కొనుగోలు చేయాలంటే మరిన్ని రూపాయలు వెచ్చించాలి. విలువ తగ్గిన కరెన్సీ వల్ల దిగుమతులు మరింత ఖర్చుతో కూడిన వ్యవహారంగా మారిపోతాయి. భారత్ తన ఇంధన అవసరాల్లో 85 శాతం దిగుమతుల ద్వారానే తీర్చుకుంటోంది. రూపాయి విలువ పతనం మన అంతర్జాతీయ వాణిజ్యాన్ని దెబ్బతీస్తుంది. ద్రవ్యోల్బణం మరింతగా పెరిగిపోతుంది. పరిశ్రమ లాభదాయికతను అడ్డుకుంటుంది. జీవన వ్యయాన్ని పెంచుతుంది. వీటన్నింటి కారణంగా విదేశీ రుణాలపై వడ్డీ చెల్లింపులు అధికమవుతాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తగ్గిపోతాయి. రిజర్వ్ బ్యాంక్ విధానపరమైన జోక్యం ద్వారా కేంద్రప్రభుత్వం రూపాయి పతనాన్ని అడ్డుకోవచ్చు.
అంతర్జాతీయ మార్కెట్‌లో అమెరికా డాలర్‌తో పోలిస్తే భారతీయ రూపాయి మారక విలువ ఇటీవలి సంవత్సరాల్లో దిగజారిపోతూ వచ్చింది. దీంతో ఆర్థికవ్యవస్థ, అంతర్జాతీయ నగదు బదిలీలు ప్రభావితం అయ్యాయి. డాలర్‌తో పోలిస్తే భారతీయ కరెన్సీ సాపేక్షిక బలం ఈ సంవత్సరం 5.9 శాతానికి పడిపోయింది. దీంతో అంతర్జాతీయ విదేశీ మారక ద్రవ్య మార్కెట్లో రూపాయి బలం వేగంగా పతనమవుతూ వస్తోంది. అంటే డాలర్‌ను కొనుగోలు చేయాలంటే మరిన్ని రూపా యలు వెచ్చించాలన్నమాట.
రూపాయి విలువ పతనమవుతున్నదంటే, స్థూల ఆర్థిక ప్రాథమిక సూత్రాల బలహీనతకు అది సంకేతం. స్థూల ఆర్థిక చరాంకాల్లో వడ్డీ రేటు, అంతర్జాతీయ వాణిజ్యం, ద్రవ్యోల్బణం, ప్రభుత్వ రుణం, నిరు ద్యోగిత, మదుపు అనేవి ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యానికి సూచికలు. ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ చాలినన్ని చర్యలు చేపట్టకపోవడం... రూపాయి పతనం సహా, స్థూల ఆర్థిక వ్యవస్థ ప్రాథమిక అంశాలు దిగ జారడాన్ని అనుమతించినట్టయింది. రూపాయి పతనమవుతున్న రేటు సమీప భవిష్యత్తులో భారతీయ ఆర్థిక వ్యవస్థ ప్రమాదాలను ఎదుర్కొనబోతోందన్న సంకేతాలను వెలువరిస్తోంది.
మారకపు రేటు అస్థిరత్వం అంతర్జాతీయ, దేశీయ ఆర్థిక పరిణా మాలతో నేరుగా ప్రభావితం అవుతుంది. అంతర్జాతీయంగా చూస్తే, చుక్కలనంటిన చమురు ధరలు, చమురు దిగుమతులపై భారతదేశం అత్యధికంగా ఆధారపడటం అనేవి స్వేచ్ఛాయుతంగా చలించే మార కపు రేటు వ్యవస్థలో రూపాయి విలువను తీవ్రంగా ప్రభావితం చేశాయి. విలువ తగ్గిపోయిన భారతీయ కరెన్సీ వల్ల దిగుమతులు మరింత ఖర్చుతో కూడిన వ్యవహారంగా మారిపోయాయి. భారత్ తన ఇంధన అవసరాల్లో 85 శాతం మేరకు ముడి చమురు దిగుమతుల ద్వారానే తీర్చుకుంటోంది.
ప్రపంచంలోనే చమురును అధికంగా దిగుమతి చేసుకుంటున్న మూడో దేశం భారత్. ఏటా 212.2 మిలియన్ టన్నుల ముడి చమురును భారత్ దిగుమతి చేసుకుంటోంది. 2021–22లో ఈ దిగు మతులు విలువ 119 బిలియన్ డాలర్లు. బ్రెంట్ ఆయిల్ ధర బ్యారెల్ 110 డాలర్లకు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు అమ్మ కాలు డాలర్లలోనే జరుగుతున్నాయి కనుక డాలర్‌కు డిమాండ్ కూడా పెరుగుతోంది. రూపాయి విలువ పడిపోవడం అనేది మన ఎగుమతు లకు సాయం చేసినప్పటికీ, దిగుమతులపై అధికంగా ఆధారపడటం కారణంగా భారత్ దెబ్బతింటోంది.
దేశీయంగా చూస్తే, భారత్ ఇప్పటికే 9.6 బిలియన్ డాలర్లతో రికార్డు స్థాయిలో కరెంట్ అకౌంట్ లోటు సమస్యను ఎదుర్కొంటోంది. ఇది దేశ స్థూలదేశీయోత్పత్తిలో 1.3 శాతానికి సమానం. రూపాయి బలహీనపడుతుండటంతో కరెంట్ అకౌంట్ లోటు మరింతగా పెరగవచ్చు. పైగా, జీడీపీలో 6.4 శాతం అధిక ద్రవ్యలోటు వల్ల 2022–23 సంవత్సరంలో భారత విదేశీ రుణం రూ. 1,52,17,910 కోట్లకు పెరుగుతుందని అంచనా. దీంతో 9.41 లక్షల కోట్ల మేరకు అధిక వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. లేదా ఇది మొత్తం రెవెన్యూ వ్యయంలో 29 శాతం. రూపాయి విలువ పతనం కావడం అగ్నికి ఆజ్యం పోసినట్టు అవుతుంది.
పైగా, ద్రవ్యోల్బణం అత్యధికంగా 7 శాతానికి చేరడం, విదేశీ సంస్థాగత మదుపుదారులు 2022లో 28.4 బిలియన్ డాలర్ల విదేశీ నిధులను ఉపసంహరించుకోవడం కూడా డాలర్ మారక రూపాయి క్షీణించడానికి దారి తీసింది. ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోవడం వల్ల తాము పెట్టిన పెట్టుబడులకు తక్కువ రాబడులు రావడం లేదా లాభ దాయకత తగ్గిపోవడంతో పెట్టుబడుల ఉపసంహరణ వేగం పుంజు కుంది. లాభాలను ఆశించడంతోపాటు, తాము పెట్టుబడులను పెట్టా లంటే స్థిరమైన, నిలకడైన స్థూల ఆర్థిక వ్యవస్థ ఉండాలని విదేశీ సంస్థాగత మదుపుదారులు కోరుకుంటారు.
మరోవైపున రూపాయి కొనుగోలు శక్తి బలహీనపడటం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో దిగుమతుల ఖర్చులు అత్యధికంగా పెరిగి పోయాయి. అధిక ద్రవ్యోల్బణం రేటు రూపాయి విలువను దిగజార్చి వేసింది. అంటే జీవనవ్యయం పెరిగిపోయిందని అర్థం. దీని ఫలి తంగా ఉత్పత్తి ఖర్చులు, జీవన వ్యయం పెరిగి, పరిశ్రమలు, మదుపు దారులు లాభాలు సాధించే అవకాశం హరించుకుపోయింది.
అంతర్జాతీయ విదేశీ మారక మార్కెట్‌లోని ‘హాట్ కరెన్సీ’తో పోలిస్తే ఒక దేశం కరెన్సీ విలువ పెరగడాన్ని బట్టే ఆ దేశ ఆర్థిక శక్తి నిర్ణయించబడుతుందని ఇది సూచిస్తుంది. 2025 నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల విలువైన ఆర్థికవ్యవస్థగా మారాలని భారత్ ఆకాంక్షిస్తోంది. కానీ ఇతర దేశాలతో సమానంగా భారత ఆర్థిక శక్తిని నిర్ణయించడంలో అంతర్జాతీయ విదేశీ మారక మార్కెట్ ముఖ్యపాత్ర వహిస్తుందని మరవరాదు.
విధానపరమైన జోక్యం ద్వారా రూపాయి పతనాన్ని అడ్డుకోలేక పోయినట్లయితే ఆర్థిక సంక్షోభం మరింత ముదిరే ప్రమాదముంది. రూపాయి విలువ పతనం వల్ల చెల్లింపుల సమస్య మరింత దిగజారిపోతుంది, మన అంతర్జాతీయ వాణిజ్యాన్ని దెబ్బతీస్తుంది. ద్రవ్యోల్బణం మరింతగా పెరిగిపోతుంది. పరిశ్రమల లాభదాయిక తను అడ్డుకుంటుంది. జీవన వ్యయాన్ని పెంచుతుంది. విదేశాలకు వెళ్లే భారతీయులపై భారం పెరిగిపోతుంది. వీటన్నింటి కారణంగా విదేశీ రుణాలపై వడ్డీ చెల్లింపులు అధికమవుతాయి. నిరుద్యోగం అమాంతం పెరుగుతుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తగ్గిపోతాయి.
రిజర్వ్ బ్యాంక్ సకాలంలో, కఠినమైన విధాన పరమైన జోక్యం చేసుకోవడం ద్వారానే డాలర్ మారక రూపాయి విలువ పతనాన్ని కేంద్రప్రభుత్వం అడ్డుకోవచ్చు. పెరిగిపోతున్న ఎక్స్‌చేంజ్ రేట్లను సమర్థంగా నిర్వహించడం ద్వారానే ఇది సాధ్యమవుతుంది. అంతకు మించి భారత్‌లో ద్రవ్యోల్బణాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. డీజిల్, పెట్రోల్ వంటి ఉత్పత్తులపై కేంద్ర ఎక్సైజ్ పన్నులు అధికంగా ఉన్నాయి. వీటిని కుదించాల్సిన అవసరం ఉంది. డాలర్ల రూపంలో విదేశీ మారకద్రవ్యాన్ని 49 బిలియన్ డాలర్ల వద్ద స్థిరపర్చడంలో, విదేశీ మారక ద్రవ్య నిల్వలను 600 బిలియన్ డాలర్ల వద్ద స్థిర పర్చడంలో ఆర్బీఐ సమర్థంగా పనిచేస్తోంది. విదేశీ మారక ద్రవ్య నిల్వల రూపంలో ఉంచిన డాలర్లను విడుదల చేయడం ద్వారా మన కరెన్సీ విలువను స్థిరపర్చడానికి ఆర్బీఐ జోక్యం తోడ్పడుతుంది.
మన రూపాయికి విదేశీ విలువ పైనే ఆర్థిక పురోగతి, ద్రవ్య సుస్థిరత ఆధారపడి ఉంటాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి మదుపు దారులు, ప్రవాస భారతీయ మదుపుదారులను ప్రోత్సహించాలంటే రూపాయి విలువకు విదేశాల్లో స్థిరత్వాన్ని ఆర్బీఐ కలిగించాలి. ఎందుకంటే ఆఫ్ షోర్ కరెన్సీ, ఇతర ద్రవ్యపరమైన రిస్కులు ఆర్థిక వ్యవస్థపై వేగంగా ప్రభావం చూపుతున్నాయి.
కాబట్టి, బలమైన ఆఫ్‌షోర్ రూపీ మారక మార్కెట్‌ను అభివృద్ధి చేయడం ద్వారా విదేశీ మారక స్థిరత్వాన్ని తీసుకురావడమే కాకుండా, డాలర్ మారక రూపాయి అంతర్జాతీయంగా ఎదుర్కొంటున్న ఆటు పోట్లను తగ్గించవచ్చు కూడా. దీనికి సంబంధించి ఉషా తోరట్ అధ్యక్షతన ఆఫ్‌షోర్ రూపీ మార్కెట్లపై టాస్క్ ఫోర్స్ రూపొందించిన నివేదిక సిఫార్సులను రిజర్వ్ బ్యాంక్ తప్పనిసరిగా పరిగణించాల్సి ఉంది. బలమైన దేశీయ, విదేశీ రూపీ మార్కెట్‌ను అభివృద్ధి చేస్తే, అది స్థిరమైన ధరల నిర్ణాయకం లాగా వ్యవహరిస్తుందనీ, విదేశీ మారక ద్రవ్య మార్కెట్లో మన రూపాయిపై డాలర్ కలిగించే షాక్‌లను తట్టు కునేలా చేస్తుందనీ ఈ నివేదిక సూచించింది.
కృష్ణ రాజ్
వ్యాసకర్త ప్రొఫెసర్, ఇనిస్టిట్యూట్ ఫర్ సోషల్ అండ్ ఎకనమిక్ చేంజ్, బెంగళూరు
(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment