ఒక దేశపు కరెన్సీ మారకం రేటు ఎందుకు తగ్గుతుంది? దేశాల మధ్య ఎగుమతులు, దిగుమతుల విలువ సమానంగా ఉంటే, మారకాల సమస్య, ఎకౌంట్లు చూసుకునే సాంకేతిక సమస్య మాత్రమే. కానీ, 2 దేశాల మధ్య ఎగుమతులూ దిగుమతులూ సమానంగా వుండడం ఎప్పుడో గానీ జరగదు.
ఇటీవల తరచుగా వినిపిస్తున్న ఒక వార్త: ‘డాలరుతో మారకంలో రూపాయి విలువ పడి పోతోంది’–అని. రూపాయి ‘మారకం విలువ రేటు’లో మార్పునకి కారణాన్ని తెలుసుకోవా లంటే, ‘మారకం’ అంటే ఏమిటో, ‘మారకం విలువ’ అంటే ఏమిటో ముందు తెలియాలి.
సరుకుల ‘మారకం’ అంటే, ఒక వ్యక్తిగానీ, ఒక దేశంగానీ, ఒక సరుకుని బైటికి ఇచ్చి, ఇంకో సరుకుని బైటినించీ తీసుకోవడమే. సరుకుకి ‘మారకం విలువ’ అంటే, ఆ సరుకుని తయారు చేయడానికి పట్టిన శ్రమ కాలమే. ఎక్కువ శ్రమ జరిగితే ఎక్కువ విలువ, తక్కువ శ్రమకి తక్కువ విలువ.
ఏ సరుకుని తయారు చేయడానికైనా, మొదట ప్రకృతిలో దొరికే సహజ పదార్థం ఏదో ఒకటి వుండాలి. ప్రకృతి సహజ పదార్థం మీద శ్రమ జరిగితే, ఏదో ఒక వస్తువు తయారవుతుంది. ఆ వస్తువుని అమ్మకానికి పెడితే, అదే ‘సరుకు’. ఒక సరుకు తయారు కావడానికి జరిగిన శ్రమని కొలవడానికి వున్న సాధనం అది జరిగిన ‘కాలమే’. గంటలో, రోజులో, నెలలో, సంవత్సరాలో!
సరుకుని, మారకం కోసం ఇవ్వడం అంటే, దాన్ని అమ్మడమే. అప్పుడు ఆ సరుకు వల్ల ‘కొంత డబ్బు’ వస్తుంది. ‘డబ్బు’ అంటే, సరుకుని తయారుచేసిన శ్రమ కాలమే– అని గ్రహించాలి. డబ్బుకి వెనక, ఆధారంగా వుండేది బంగారం అనే లోహం! బంగారం కూడా ఇతర సరుకుల లాగే, మొదట గనుల్లో దొరికే సహజ పదార్థం తోటీ, దానిమీద జరిగే శ్రమల తోటీ తయారవుతుంది. మారకం విలువ రేటునీ, తర్వాత ఆ రేటులో మార్పునీ తెలుసుకోవడానికి, మొదట ఇంత వరకూ చూసిన విషయాలు చాలు.
2 దేశాల డబ్బుల మధ్య మారకం విలువ రేటు ఏర్పడడానికి ఆధారం – ఆ 2 దేశాల డబ్బుకీ వెనక వుండే కొంత కొంత బరువుగల బంగారాలే. డాలర్ దేశపు డబ్బు వెనక 4 గ్రాముల బంగారం వుందనీ, రూపాయి దేశపు డబ్బు వెనక 2 గ్రాముల బంగారం వుందనీ అనుకుందాం. అప్పుడు ఒక డాలరు= 2 రూపాయలు అవుతుంది. ఇది, ఆ రెండు దేశాల డబ్బులకు వున్న మారకం విలువ రేటు. ఇది, ఆ దేశాల డబ్బు వెనక వున్న బంగారాల కొలతల్ని బట్టే! ఈ కొలతలు మారడానికి, వేరే వేరే కారణాలు కూడా వుండొచ్చు.
2వ ప్రపంచ యుద్ధకాలం తర్వాత, డాలర్ దేశంలో (అమె రికాలో), ఆర్థిక పరిస్థితులు ఇతర దేశాలలో కన్నా ‘అభివృద్ధి’ చెంది వున్నాయి. ముఖ్యంగా, ఆ నాడు ఏ దేశంలోనూ లేనన్ని బంగారు నిల్వలు డాలరు దేశంలో వున్నాయి. దానివల్ల, డాలరు దేశపు ఆధిక్యం పెరిగింది. అప్పట్నించీ ‘అంతర్జాతీయ ధనం’గా డాలరుని దాదాపు అన్ని దేశాలూ అంగీకరిస్తూనే వున్నాయి. వేరు వేరు దేశాల మధ్య ఎగుమతులతో, దిగుమతులతో ‘విదేశీ వర్తకాలు’ జరుగుతూ వుంటాయి. ఒక దేశం ఇంకో దేశానికి కొంత డబ్బు ఇవ్వవలిసి వస్తే, ఆ డబ్బు లెక్కని, ఆ 2 దేశాల డబ్బులకూ వున్న మారకం రేటు ప్రకారమే లెక్క చూడాలి. ఒక దేశం నించి, ఆ రెండో దేశం డబ్బుకి ఎన్ని డాలర్లు వస్తాయో కూడా లెక్క చూసి, ఆ డబ్బుని డాలర్లలోనే చెల్లించాలి.
ఇప్పుడు అసలు ప్రశ్న, ఒక దేశపు కరెన్సీ మారకం విలువ రేటు ఎందుకు తగ్గుతుంది? దేశాల మధ్య ఎగుమతుల విలువలూ, దిగుమతుల విలువలూ సమానంగా వుంటే, వేరు వేరు దేశాల డబ్బు మారకాల సమస్య, కేవలం ఎకౌంట్లు చూసుకునే సాంకేతిక సమస్యగా మాత్రమే వుంటుంది. కానీ, 2 దేశాల మధ్య ఎగుమతులూ దిగు మతులూ సమానంగా వుండడం ఎప్పుడో గానీ జరగదు.
భారత దేశం ఏ దేశానికి చెల్లించవలిసి వచ్చినా, సాధారణంగా డాలర్లలోనే చెల్లించాలి కాబట్టి, అప్పుడు భారత దేశానికి డాలర్లు అవసరం. ఆ డాలర్లు ఎంత మొత్తంలో కావాలీ – అనేది, భారత దేశం ఇతర దేశాలకు చేసిన ఎగుమతుల, దిగుమతుల విలువ ఎంతా– అనే లెక్క (కరెంట్ ఎకౌంటు) మీద ఆధార పడి వుంటుంది. గత కొంత కాలంగా, భారత దేశానికి దిగుమతుల కోసం (ఉదాహరణకి: క్రూడ్ ఆయిల్ కోసం) అయ్యే ఖర్చు ఎక్కువగా వుండడం వల్ల, భారత దేశం ఇతర దేశాల దిగుమతుల కోసం చెల్లించేదాన్ని ఎక్కువ డాలర్లలోనే చెల్లించాలి. కాబట్టి డాలర్లని కొనడం కోసం డాలర్లు అమ్మే కరెన్సీ మార్కెట్‌కి వెళ్ళాలి. డాలరు అనేది, బియ్యం లాంటి వాడకం సరుకు కాకపోయినప్పటికీ, అది కరెన్సీలను అమ్మే, కొనే మార్కెట్‌లో ఒక సరుకుగా అయింది. ఏ సరుకుకి అయినా, దాని సప్లై తక్కువగా వుంటే, అది దొరకడం కష్టం కాబట్టి దాని కోసం డిమాండ్ పెరిగి, దాని ధర పెరుగుతుంది. అలాగే, డాలర్లని కొనవలిసిన పరిస్థితిలో, దాని ధర తగ్గడమో, పెరగడమో జరుగుతుంది. ఈ దశలో, ఏ దేశం అయినా, ఇతర దేశాలకు చెల్లించవలిసిన దిగుమతుల డబ్బుని డాలర్లలోనే చెల్లించాలి కాబట్టి, డాలర్లకి డిమాండు ఎక్కువగా వుంటుంది. అప్పుడు డాలర్లని ఎక్కువ ధరలతో కొనాలి. అలాంట ప్పుడు ఒక డాలర్‌కి, గతంలో కంటే ఎక్కువ రూపాయిలు ఇచ్చి కొన వలిసి వస్తుంది. ఉదాహరణకి, డాలరు ధర పెరుగుతూ, పెరుగుతూ, కిందటి నెలలో 70 రూపాయిలు అయింది. ఆ ధర ఇప్పుడు 80 కూడా దాటేసింది. పత్రికల్లో, ‘‘డాలరు మిలమిల, రూపాయి వెల వెల!’’ అనే హెడ్డింగులు కనిపిస్తున్నాయి. అంటే, రూపాయి విలువ తగ్గుతూ, తగ్గుతూ పోతోంది. అంటే, డాలరుని ప్రతీసారీ ఎక్కువ రూపా యలతో కొనవలిసి వస్తోంది. అలా కొన్న డాలర్లని, దిగుమతుల చెల్లింపుల కోసం ఇవ్వాలి. రూపాయి దేశం, డాలర్ల కోసం, వేల వేల రూపాయల్ని ఖర్చు పెట్టెయ్యవలిసి వస్తుంది. (రూపాయి మారకం విలువ తగ్గిన ఈ సమస్య ఈ దేశంలోనే సరుకుల్ని కొనడానికి వర్తిస్తుందా? దీన్ని ఇక్కడ వివరించలేము.)
ఈ సమస్యకు పరిష్కారం, వీలైనంత వరకూ ప్రతీ దేశమూ, తన దగ్గిరవున్న వనరులతో, కావలిసిన వస్తువుల్ని సొంతంగా తయారు చేసుకోవడమే! తప్పనిసరి వాటికోసం మాత్రమే వేరే దేశాల దిగుమతుల మీద ఆధారపడొచ్చు. కానీ, లాభాల కోసం పోటీపడే పెట్టుబడిదారీ విధానంలో, అది సాధ్యం కాదు. ఎందుకంటే, పెట్టు బడిదారుల మధ్య, ‘దేశంలో ఎన్ని సరుకుల్ని అమ్మగలం? విదేశాలకు ఎన్ని సరుకుల్ని అమ్మగలం?’ అనే ఒక సమష్టి ప్లానింగు వుండదు. సమష్టి ప్లానింగు వుండని చోట ఎగుమతులూ, దిగుమతులూ సమానంగా వుండవు. అలా వుండనప్పుడు మారకం రేట్లు కూడా స్థిరంగా వుండవు.
రంగనాయకమ్మ
వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి
Comments
Please login to add a commentAdd a comment