vishleshana
-
అంబేడ్కర్ స్ఫూర్తి ప్రతిఫలించేదెప్పుడు!
సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, ప్రజాస్వామ్యం, మానవ హక్కులు వంటి వాటన్నింటినీ వాగ్దానం చేస్తున్న భారత రాజ్యాంగ నిర్దేశాలకు విలువే లేకుండా పోతోంది. అతి కొద్దిమందిగా ఉన్న అత్యధిక సంపన్నులను ఒక వైపు, అత్యధికులైన అతి పేదలను మరొక వైపు చూస్తున్నాం. ఈ విషయంగా మనం తప్పక బాబా సాహెబ్ అంబేడ్కర్ ఆలోచనలను మననం చేసుకోవలసిన అవసరం ఉంది. సామాజిక అసమానతల్ని తొలగించే క్రమంలోనే ఆర్థిక అసమానతలూ తొలగాలని అంబేడ్కర్ అన్నారు. అలాగే దేశంలోని ప్రజలందరూ ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ సాంకేతిక రంగాల న్నింటిలో సమానతను సాధించుకోవడమే రాజ్యాంగ లక్ష్యమని బాబాసాహెబ్ స్పష్టంగా ప్రకటించారు. ఆ మార్గంలో నడవడం మన పాలకుల ధర్మం. భారతదేశాన్ని ఎందరో పరిపాలించారు. వారందరికీ భారతదేశం అర్థం కావాలని ఏమీ లేదు. ఆర్యులకు, యవనులకు, కుషానులకు, అరబ్బులకు, మొఘలు లకు, బ్రిటిష్ వాళ్ళకు కూడా భారతదేశం అర్థం అయ్యిందని చెప్పలేం. వారంతా మూలవాసుల్ని అణచివేయడానికి ప్రయత్నించిన వారే. సామరస్యమూ, శాంతి, ప్రేమతో కూడిన మూలవాసుల భావన లను ధ్వంసం చేసే క్రమంలో వారంతా భారత చరిత్ర వక్రీకరణకు కారణం అయినవారే. ప్రస్తుత పాలకులు సైతం మన పూర్వ పాల కుల్లా నిజమైన సంస్కృతీ వికాసం మతవాదుల్లో ఉందనే నమ్ము తున్నారు. నిజానికి ఆ వికాసం హేతువాదులు, భౌతికవాదులు, అంబేడ్కర్ వాదులు, లౌకికవాదుల్లో వుంది. అసలు భారతదేశానికి మొదటి దర్శనం చార్వాక దర్శనం, రెండవ దర్శనం జైన దర్శనం, మూడు బౌద్ధ దర్శనం, నాలుగు సాంఖ్య దర్శనం. ఇవన్నీ నిరీశ్వర వాద దర్శనాలే. బౌద్ధ దర్శనం సాంఘిక సమానత్వానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలబడింది. అది మూలవాసుల నుండి జనించింది. మాన వాళి పట్ల దయార్ధ్ర దృష్టితో మెలగడం కరుణ అనీ, సాటి వారి పట్ల సౌహార్ద్ర దృష్టిని కలిగి ఉండటమే మైత్రి అనీ, ఈ సౌశీల్య విధానాలు ప్రతి ఒక్కరూ శక్తివంచన లేకుండా పాటించాలనీ బుద్ధుడు ప్రబోధించాడు. వ్యక్తి నిర్మలత్వానికి కూడా ఆయన ప్రాధాన్యం ఇచ్చాడు. బుద్ధుని సిద్ధాంతాలు.. అప్పటి వరకు వైదిక సంస్కృతి ఆచరణలోకి తీసుకు వచ్చిన మూఢ నమ్మకాలను, యజ్ఞ యాగాదులను, వ్యక్తి స్వార్థాన్ని, దుష్ట ప్రవర్తనను ఖండించి నూత్న సామాజిక దృక్పథాన్ని కలిగించాయి. క్రీ.పూ. 6వ శతాబ్దం నుండే భారతదేశం బౌద్ధ సంస్కృతిలో నడిచింది. భారత రాజ్యాంగంలో అంబేడ్కర్ ఈ బౌద్ధ సూత్రాలనే పొందు పరిచారు. ఆ ప్రకారం.. ఏ మతానికి చెందిన పాలకులైనా ఆ మతాన్ని వ్యక్తిగతంగానే ఉంచుకోవాలిగాని, దాన్ని రాజ్యం మీద రుద్దకూడదు. అయితే మతం, మతస్వేచ్ఛ గురించి చర్చించుకునే క్రమంలో మనం ప్రధానంగా గమనించాల్సింది ఏమిటంటే లౌకిక భావంతో వ్యవహ రించాల్సిన ప్రభుత్వాలే మతతత్వాన్ని ప్రేరేపిస్తుండటం! మరోవైపు సుసంపన్నమైన దేశంగా పరిగణన పొందుతున్న మన నేలలో ఆకలి చావులతో మరణిస్తున్న వారి సంఖ్య పెరగడం ఆశ్చర్యం కలిగించే విషయం. ముఖ్యంగా అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. కుల, మత, అసమానతలు నిరంతరం వృద్ధి చెందుతున్నాయనీ; అణచివేతలు, గృహహింస విపరీతంగా పెరిగిపోతున్నాయనీ సామాజిక సర్వేలు చెపుతున్నాయి. ఇదే సమ యంలో కార్పొరేట్ పెట్టుబడిదారీ సామ్రాజ్యాన్ని కొన్ని శక్తులు యథేచ్ఛగా విస్తరించుకుంటూ వెళ్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలన్ని టినీ ప్రైవేటు వ్యక్తులకు అధీనం చేయడం వల్ల భారతదేశంలో దళిత బహుజన యువకులకు ఉద్యోగ వసతి గగన కుసుమం అయింది. వ్యవసాయరంగం దారుణంగా దెబ్బతిన్నది. అయితే ఇది వ్యవసాయ ఉత్పత్తులు తగ్గడం మూలాన కాదు. వ్యవసాయ ఉత్పత్తి ధరలు విప రీతంగా పడిపోవడం వల్ల. దీంతో వ్యవసాయం గిట్టుబాటు కాకుండా పోయింది. రైతులు రుణగ్రస్థులయ్యారు. లక్షలాదిమంది జీవన వ్యవస్థలు కుంటుపడ్డాయి. గ్రామాల నుంచి వలసలు పెరిగాయి. ఈ సంక్షోభం నుండి రైతాంగాన్ని కాపాడటానికి బదులు పాలకులు వ్యవసాయ రంగం కార్పొరేటీకరణను ప్రోత్సహిస్తున్నారు. ప్రపంచ వాణిజ్య (డబ్ల్యూటీఓ) షరతులు కూడ మన దేశ రైతాంగానికి ప్రతికూలంగా ఉన్నాయి. అధికార పార్టీ తన సంఖ్యాబలంతో పార్ల మెంటరీ కమిటీల పరిశీలనలు, పార్లమెంటరీ ప్రొసీజర్లు లేకుండానే చట్టాలకు దారి ఏర్పచుకుంటోంది. ముఖ్యమైన చట్టాలు ఎలాంటి చర్చ లేకుండా గందరగోళాల మధ్యనే ఆమోదం పొందుతున్నాయి. అందుకే పార్లమెంట్లో అంతర్గత నియంతృత్వం కొనసాగుతోందన్న విమర్శలు వస్తున్నాయి. పార్లమెంట్ పట్ల తన జవాబుదారీతనం నుండి ప్రభుత్వం తప్పుకుంటున్నది. నూట పదకొండుమంది ఎస్సీ, ఎస్టీ ఎంపీలు పార్లమెంట్లో సామాజిక న్యాయాన్ని సాధించటంలో నిరంతరం విఫలం అవుతున్నారు. మహిళా ఎంపీల హక్కుల పోరాట స్వరాలు నిష్ఫలం అవుతున్నాయి. సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, ప్రజాస్వామ్యం, మానవ హక్కులు వంటి వాటన్నింటినీ వాగ్దానం చేస్తున్న భారత రాజ్యాంగ నిర్దేశాలకు విలువే లేకుండాపోతోంది. పేదలకు భూమి పంపకం లేదు. గిరిజనుల భూములకు రక్షణ లేదు. ఆదివాసుల జీవన ప్రమా ణాలు, విద్యా వైద్య వసతులు నానాటికీ కుంటుపడుతున్నాయి. రక్తలేమితో బాధపడుతున్న స్త్రీల సంఖ్య పెరుగుతోంది. గర్భవతులకు, వితంతువులకు సంరక్షణ లేదు. ఆర్థిక సామాజిక, రాజకీయ అంత రాలు ఎక్కువవుతున్నాయి. అతి కొద్ది మందిగా ఉన్న అత్యధిక సంపన్నులు ఒకవైపు, అత్యధికులైన అతి పేదలు మరొక వైపు అన్నట్లుగా ఉంది. ఈ విషయంగా మనం తప్పక బాబా సాహెబ్ అంబేడ్కర్ ఆలోచనలను మననం చేసుకోవలసిన అవసరం ఉంది. సామాజిక అసమానతల్ని తొలగించే క్రమంలోనే ఆర్థిక అసమా నతలూ తొలగాలని చెబుతూ అంబేడ్కర్... శ్రామికవర్గం హక్కులు, ప్రాతినిధ్యం, సాధికారతల గురించి చాలా నిశితమైన వివరణల్ని 1943 సెప్టెంబర్ 6, 7 తేదీల్లో కొత్త ఢిల్లీలో జరిగిన కార్మిక సమ్మేళనంలో వ్యక్తపరిచారు. అందులోని చాలా అంశాల ఉల్లంఘన నేడు మనకు దృశ్యీకృతం అవుతోంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ కింద అత్యధికుల అభీష్టం మేరకు శాసన, పాలనా విధానాలు అమల వుతున్నాయి. ఎవరైతే సంఘానికి ఆర్థిక నిర్మాణాన్ని దేశ సామాజికత ఆధారంగా రూపకల్పన చేయదలిచారో... వారు ప్రాథమిక ఆవశ్యకతను విస్మరించకుండా తమ లక్ష్యాన్ని పూర్తిచేయాలని గుర్తుంచుకోవాలి. సంఘ ఆర్థిక నిర్మాణాన్ని రాజ్యాంగం నిర్దేశించాలన్న ప్రతిపాదన నిర్వివాదాంశం. ఆర్థిక నిర్మాణ విధానం ఎలా ఉండాలన్నదే మిగిలి ఉన్న ప్రశ్న. దానిని ఈ మూడు విధానాల నుండి ఎంపిక చేయాలి. 1. పెట్టుబడిదారీ విధానం, 2. సోషలిజం, 3. కమ్యూనిజం. మరి శ్రామికుల ఎంపిక ఎలా ఉండాలి? శ్రామికులు పెట్టుబడిదారీ విధానాన్ని ఎంపిక చేసుకోలేరు, ఆ విధంగా పెట్టుబడిదారీ విధానాన్ని ఎంపిక చేసుకుంటే శ్రామికులు వారి స్వేచ్ఛను కోల్పో తారు. అందుకే వారి భవితవ్యానికి ముఖ్యమైన ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛ, సంతోషాలు పొందడంలో ప్రజాస్వామ్య దేశాలు అవలంబించవలసిన మార్గాలు ఏంటంటే... ప్రభుత్వ అధికారాన్ని రాజకీయ రంగంలో తక్కువగా జోక్యం చేసుకోనివ్వడం; చాలా శక్తిమంతమైన వ్యక్తుల ఆధిక్యతను అణచటానికి సాధారణ శాసనాధికారాన్ని మేల్కొల్పి, తక్కువ శక్తిమంతమైన ఆర్థికరంగంపై అసంబద్ధమైన ఇబ్బందులను విధించకుండా ఉండడం. ఈ విధమైన అంబేడ్కర్ ఆలోచనలు రాను రాను భారతీయ సమాజాన్ని పున ర్నిర్మించడానికి అత్యవసరం అవుతున్నాయి. ఆయన రాజ్యాంగ రచనకు ముందూ, వెనుకా అన్ని తరగతుల ప్రజల జీవన ప్రమాణాలను దర్శించారు. ‘‘భారతదేశానికి అనేక మతాలు వచ్చాయి, అనేక మతాలు ఇక్కడే ఆవిర్భవించాయి. అయితే ఏ మతా ధిపత్యంలోకీ భారతదేశం వెళ్లకూడదు. భారతదేశం లౌకిక రాజ్యంగానే మనగలగాలి. భారతదేశంలో ప్రతీ పౌరుడు ఒకే సామాజిక, ఆర్థిక, రాజకీయ గౌరవాన్ని కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడే నేను రూపొందించిన రాజ్యాంగం అన్ని దిశలా ప్రతిఫలిస్తుంది’’ అని అంబేడ్కర్ భావించారు. రాజ్యాంగ రూపకల్పన కృషిలో అంబేడ్కర్ తన ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టారు. భారతదేశంలోని ప్రజలందరూ ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ సాంకేతిక రంగాల న్నింటిలో సమానతను సాధించుకోవడమే ఈ రాజ్యాగం లక్ష్యమని ఆయన ప్రకటించారు. ఆ మార్గంలో నడుద్దాం. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళిత ఉద్యమ నేత ‘ 98497 41695 -
కేంద్ర బడ్జెట్: పంపకంలో ప్రజలకు వాటా దక్కేనా?
నేడు దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో 2023–24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టబోతున్నారు. దేశంలో నెలకొని ఉన్న దశాబ్దాల రికార్డు స్థాయి నిరుద్యోగం, పెరిగిపోతోన్న కటిక పేదల సంఖ్య, నింగినంటుతోన్న ధరలు, పడిపోతోన్న దేశీయ ఆర్థిక వృద్ధిరేటు వంటి సమస్యల వలన నేడు ప్రజల దృష్టి, ఈ సమస్యల పరిష్కారం కోసం బడ్జెట్ ఏమైనా చేయగలదా అనే దానిపై కేంద్రీకరించి ఉంది. ఏ బడ్జెట్ అయినా ఒక్కసారిగా, ఆ ఒక్క ఆర్థిక సంవత్సర కాలంలోనే సమస్యలన్నింటినీ పరిష్కరించేయలేదు. కానీ, అందుబాటులో ఉన్న వనరుల మేరకు ఆ దిశగా సాధ్యమైనంత మేరకు ప్రయత్నం చేయటం వీలయ్యేదే! ఆ పని తాజా బడ్జెట్ చేస్తుందా? ఒక దేశం తాలూకూ బడ్జెట్‌ను, ఆ దేశంలోని సంపదను సృష్టించే ఉద్యోగులు, కార్మికులు, రైతాంగం తదితర సామాన్య జనానికి మేలు చేసే విధంగానూ రూపొందించొచ్చు; ధనవంతులు, కార్పొరేట్లు లేదా ఆ దేశంలో పెట్టుబడులు పెట్టే విదేశీ మదుపుదారుల ప్రయోజనాల కోసమూ రూపొందించవచ్చు. మన దేశీయ బడ్జెట్లు ఇప్పటివరకూ ఏ తరహాలో రూపొందాయి? దీనికి జవాబు సరళం. గతంలో మన బడ్జెట్లు, ప్రభుత్వ విధానాలు అందుబాటులో ఉన్న సంపదలో అత్యధిక వాటా దానిని సృష్టించిన ప్రజలకు పంపిణీ చేసి ఉంటే, నేడు మన దేశంలో ‘కె’ (ఆంగ్లాక్షరం కె ఆకృతిలో; ధనవంతులు పైకి, పేదలు కిందికి) తరహా తీవ్ర ఆర్థిక అసమానతల పరిస్థితి ఉండేది కాదు. ఆర్థిక అసమానతలు తీవ్ర స్థాయిలో ఉన్నా మన దేశం పై స్థానంలో ఉండడం గమనార్హం. ఆర్థిక సంస్కరణల క్రమంలో సంపద సృష్టి జరిగింది. కానీ, ఆ సంపద సృష్టికర్తలకు చేతిలో మొబైల్ ఫోన్ మినహా దక్కిందేమీ లేదు. ఈ సంస్కరణలు తెచ్చిన ప్రైవేటీకరణ విధానాలు కనీస అవసరాలైన విద్య, వైద్యాలను ఖరీదైనవిగా మార్చేశాయి. మొత్తంగా బడ్జెట్ల క్రమంలో లబ్ధి పొందింది – ఒక వైపున అంతర్జాతీయ (కొంతమేరకు దేశీయ) ఫైనాన్స్ పెట్టుబడిదారులు, మరోవైపున కార్పొరేట్ సంస్థలు మాత్రమే. ఈ రెండు తరహాల వారికీ మేలు చేసేందుకే – ప్రతీ బడ్జెట్లోనూ ద్రవ్యలోటును తగ్గించటం... అలాగే కార్పొరేట్లకు అనేకానేక రాయితీల వంటివి నిండుగా ఉంటాయి. ద్రవ్యలోటును ఆర్థిక వ్యవహారాలకు కేంద్ర బిందువుగా చేయటం ఎందుకోసం? సుమారుగా నాలుగు దశాబ్దాల క్రితం, అంటే 1980ల ముందర – ఈ ద్రవ్యలోటు అంశానికి అటు బడ్జెట్లలోనూ, ఇటు ఆర్థిక వ్యవహారాలలోనూ ప్రాధాన్యత లేదు. నాడు ప్రపంచంలోని మార్కెట్ ఆర్థిక వ్యవస్థలు అన్నింటిలోనూ – ‘కీన్స్’ సిద్ధాంతాల ప్రాతిపదికన నడిచిన సంక్షేమ రాజ్యానిదే పెద్దపేట. నాడు ప్రభుత్వాల ప్రధాన బాధ్యత– దేశంలోని ప్రజల బాగోగులు కోరి... అలాగే కార్పొ రేట్ల మనుగడకు కూడా అనుకూలమైన విధంగా – జన సామాన్యం తాలూకూ కొనుగోలు శక్తిని... అంటే మార్కెట్లో సరుకులు, సేవలకు డిమాండును కాపాడటం. ఈ పరిస్థితి 1980ల అనంతరం మారి పోయింది. సరుకులు, సేవలను ఉత్పత్తి చేసి లాభాలను పొందే కార్పొరేట్ సంస్థల ప్రాధాన్యత తగ్గి... గతంలో ఈ కార్పొరేట్ సంస్థల స్థాపనకూ, లేదా వాటి కార్యకలాపాల నిర్వహణకూ పెట్టుబడులను సరఫరా చేసే ఫైనాన్స్ పెట్టుబడులది పై చేయి అయ్యింది. అప్పటి వరకూ పారిశ్రామిక వ్యవస్థకు కేవలం వెన్నుదన్నుగా మాత్రమే ఉన్న ఫైనాన్స్ పెట్టుబడులు పూర్తిస్థాయిలో స్వతంత్రంగానూ... మరో మాటలో చెప్పాలంటే, ఉత్పాదక, పారిశ్రామిక పెట్టుబడుల కంటే శక్తి మంతంగానూ తయారయ్యాయి. ఈ క్రమంలోనే – షేర్ మార్కెట్లు, ఫైనాన్స్ వ్యాపారాలు (ప్రస్తుతం ‘వెంచర్ క్యాపిటల్’ అని పిలిచే వాటితో సహా), రియల్ ఎస్టేట్ వంటి స్పెక్యులేటివ్ పెట్టుబడులది పై చేయి అయ్యింది. ఈ తరహా పెట్టుబడుల అవసరాల కోసంముందుకు వచ్చిందే ‘ద్రవ్యలోటు’ ఉండరాదు అనే సూత్రీకరణ. దీనిలో భాగంగానే ప్రపంచంలోని దరిదాపు అన్ని దేశాల కేంద్ర బ్యాంకులకు ద్రవ్యోల్బణాన్ని ఒక నిర్దిష్ట స్థాయిలో అదుపులో ఉంచటం గురుతర బాధ్యత అయింది. ద్రవ్యలోటు అధికంగా ఉండటమంటే, ప్రభుత్వం తాలూకూ ఖర్చులు దాని ఆదాయం కంటే అధికంగా ఉండటం అని. ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంటే ఆ అదనపు ఖర్చుకు అవసరమైన డబ్బును ప్రభుత్వం ముద్రించవలసి రావచ్చు లేదా అప్పుగా తెచ్చుకోవాల్సి రావచ్చు. దీని వలన వాస్తవ ఆర్థిక వ్యవస్థలో డబ్బు చలామణీ పెరిగి– ద్రవ్యోల్బణం పెరుగుతుందనేది లెక్క. ద్రవ్యో ల్బణం పెరగటమంటే... అనివార్యంగా ఆ దేశం తాలూకూ కరెన్సీ విలువ తగ్గుదలే. ఈ కరెన్సీ విలువ తగ్గుదల ఆ దేశీయ షేర్ మార్కెట్లలో లేదా ఇతరత్రా స్పెక్యులేటివ్ వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టినవారి లాభాల తాలూకు నికర విలువ తగ్గుదలకు దారితీస్తుంది. కాబట్టి ఈ ఫైనాన్స్ పెట్టుబడిదారులు – మన కరెన్సీ విలువ తగ్గ రాదని కోరుకుంటారు. ఇది వారి లాభాలను కాపాడుకోవటం కోసం. దీని కోసం వారు మన ప్రభుత్వం ప్రజల అవసరార్థం వ్యయాలను పెంచుకోవడాన్ని అంగీకరించలేరు. కాబట్టి ఈ ద్రవ్యలోటు సిద్ధాంతకర్తలు – వివిధ దేశాల ప్రభుత్వాలు పొదుపు చర్యలను పాటించాలనీ, సాధ్యమైనంతగా ప్రజలకు లభించే సంక్షేమ పథకాలపై కోతలు పెట్టాలనీ కోరుకుంటారు. ఆర్థిక సంస్కరణలు ఆరంభమైన తర్వాత మన పాలకులు కూడా ఈ ద్రవ్యలోటును లక్ష్మణరేఖగా ఆమోదించుకొని, దానికి లోబడే తమ ఆర్థిక కార్యకలాపాలను నిర్వహించుకుంటున్నారు. ఈ క్రమంలోనే నిరుద్యోగం, పేదరికం పెరగటం వంటి ఎన్ని సమస్యలు ఉన్నా మన ప్రభుత్వం సంక్షేమ పథకాలు, ఉపాధి కల్పనా కార్యక్రమాలపై పెట్టే ఖర్చులను ఇంకా తగ్గిస్తూనే పోతోంది. దీనిలో భాగంగానే నేడు ఆర్థిక మాంద్యం లేదా మందగమన పరిస్థితులు ఉన్నా – ప్రభుత్వం మాత్రం బడ్జెట్లో తన ఆర్థిక లోటు లక్ష్యాన్ని ప్రస్తుతం ఉన్న 6.4 శాతం నుంచి 2024 ఆర్థిక సంవత్సరం చివరికి 5.9 శాతానికి తగ్గించటంగా చేసుకుందనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎరువుల సబ్సి డీలపై వేటు, ఆహార సబ్సిడీల కుదింపు వంటివి ఉండనున్నాయి. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ సబ్సిడీలకు పాలకులు ఇప్పటికే మంగళ హారతి పాడేశారు. ఇక తరువాతిది కార్పొరేట్ పెట్టుబడిదారులకు రాయితీలు ఇవ్వటం. ఇది గత 8 సంవత్సరాల బీజేపీ హయాంలో మరింత నిర్మొహమాటంగా వేగం పుంజుకుంది. 2019లో కార్పొరేట్ ట్యాక్సును భారీగా 10 శాతం మేర తగ్గించేశారు. దీని వలన ప్రభు త్వానికి సాలీనా 1.45 లక్షల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది. అలాగే, కార్మిక సంస్కరణల పేరిట – ఉద్యోగులు, కార్మికులు, గిగ్ వర్కర్ల వంటివారిని పిండి పిప్పిచేసి తమ లాభాలను పెంచుకొనేందుకు కార్పొరేట్లకు మరిన్ని దారులను తెరుస్తున్నారు. ప్రొడక్టివిటీ లింక్డ్ ఇన్సెంటివ్ పేరిట – ఉత్పత్తిని తగిన మేరకు పెంచిన కార్పొరేట్లకు రాయితీల పేరు చెప్పి లక్షల కోట్ల రూపాయలను ధారాదత్తం చేస్తున్నారు. ఇంత చేసినా వాస్తవంలో ఈ కార్పొరేట్ల నుంచి – ఇటు కొత్త పెట్టుబడుల రూపంలో గానీ, అటు అదనపు ఉపాధి కల్పన రూపంలో గానీ ఫలితం ఏమీ దక్కడం లేదు. వాస్తవ ఆర్థిక వ్యవస్థలో ప్రజల చేతిలో డబ్బు లేదనీ లేదా వారికి కొనుగోలు శక్తి లేదనే విషయాన్ని విస్మరిస్తూ... బడ్జెట్ తర్వాత బడ్జెట్‌ను మూస తరహాలో వేస్తూనే పోతోంది ప్రభుత్వం. హరిత ఇంధనానికి ప్రోత్సాహం, మౌలిక వనరులకు ఊతం వంటి పేర్లేవి చెప్పినా... అదంతా అంతిమంగా కార్పొరేట్లకు రాయితీలు, కానుకలుగా మాత్రమే ఉండిపోగలదు. స్థూలంగా కాకులను కొట్టి గద్దలకు వేసే సరళిలో సాగుతోన్న ప్రభుత్వ విధానాలు రానున్న ఎన్నికల నేపథ్యంలో కాస్తంత కరుకుదనాన్ని తగ్గించుకున్నా – అవి పెద్దగా మారి ప్రజానుకూలంగా సంపదను పంపిణీ చేసే సాహసానికి దిగలేవు. సంవత్సరానికి ఒక రోజు ముందుకు వచ్చే ఈ బడ్జెట్ రోజునైనా లేకుంటే మిగతా 364 రోజులైనా జరుగుతోంది ఒకటే... అది జనం మీద భారాలు... కార్పొరేట్లు, ధనవంతులకు నజరానాలు! కాదూ కూడదంటే ఈ దేశంలోని కూలీ జనం కులీనులూ లేదా పన్ను చెల్లింపుదారుల పైసలను ‘ఉచితాలుగా’ దిగమింగేస్తున్నారంటూ ఎదురుదాడులు! ధనికుల, ధనస్వామ్య ఆరాధనలో... వినిమయ సమాజపు వస్తు వ్యామోహంలో పడి వాస్తవాలను చూడలేని దుఃస్థితిలో జన సామాన్యం కొనసాగినంత కాలం ఈ దగాకూ, దాని మనుగడకూ ఢోకా లేదు. డి. పాపారావు వ్యాసకర్త ఆర్థిక రంగ నిపుణులు మొబైల్: 98661 79615 -
పులులు పెరిగాయ్... బతికే చోటేదీ?
దేశంలో పెద్ద పులుల సంఖ్య పెరుగుతోంది. కానీ ప్రతి మూడు పులుల్లో ఒకటి రిజర్వ్ ఫారెస్టుకు వెలుపల ఉండాల్సి వస్తోంది. ఇది మానవ–జంతు ఘర్షణలకు దారి తీస్తోంది. రక్షిత ప్రాంతాల వెలుపల పులులు మాత్రమే కాక, అనేక జీవజాతులు కూడా మనుగడ కోసం పోరాడుతున్నాయి. 80–100 పులుల జనాభాను పోషించడానికి పెద్దపులులకు 800 నుంచి 1,200 చదరపు మీటర్ల మేర ఇతరులు చొరబడలేని స్థలం అవసరం. కానీ, మనలాంటి చిక్కటి జనసాంద్రత కలిగిన దేశంలో... అలాంటి సహజమైన అరణ్యాలను ఆశించడం ఆశావహమైన కోరిక మాత్రమే. వన్యప్రాణులు సంచరించే స్థలాలు తగ్గిపోతున్నట్లు పలు శాస్త్రీయ నివేదికలు చెబుతున్నప్పటికీ మనం ఇప్పటికీ పులుల సంఖ్య పెరుగుదలను మాత్రమే పట్టించుకుంటున్నాము. ఈ సంవత్సరం వార్తాయోగ్యమైన రెండు ఘటనలు జరిగాయి. ఒకటి – ప్రపంచంలోనే అత్యధిక జనాభా విషయంలో భారతదేశం చైనాను దాటేసింది. కేవలం 2 శాతం భూప్రాంతం కలిగిన దేశం 145 కోట్ల ప్రజలు లేదా విశ్వ మానవ జనాభాలో 18 శాతం మందికి ఆవాస ప్రాంతంగాఉంటోందని ఊహించండి. జనసాంద్రత రీత్యా, భారతదేశం... చైనా కంటే మూడు రెట్ల రద్దీతో ఉంటోంది. రెండు – భారతదేశంలో అత్యంత విజయవంతమైన వన్యప్రాణి రక్షణ పరిశ్రమ అయిన ప్రాజెక్ట్ టైగర్ ఏర్పడి ఈ ఏప్రిల్ నాటికి 50 ఏళ్లు దాటుతుంది. పెరుగుతున్న పులుల సంఖ్య విషయంలో రికార్డు అంచనాలు ఉన్నాయి. 2022 నాటి పెద్దపులుల జనాభా లెక్కలు కూడా ఈ సంవత్సరంలోనే విడుదల చేయవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే దేశంలో పులుల సంఖ్య 3 వేలను దాటి ఉంటుందని ఒక అంచనా. దేశంలో ప్రాజెక్టు టైగర్ 1973 ఏప్రిల్ 1న ప్రారంభమైంది. 2014 నాటికి దేశంలో 2,226 పులులు ఉండగా, 2018లో వీటి సంఖ్య 2,967కి పెరిగిందని జాతీయ పులుల పరిరక్షణ అథారిటీ (ఎట్టీసీఏ) నివేదించింది. దేశంలో పులుల సంఖ్యలో అమాంతం 33 శాతం పెరుగుదల నమోదు కావడం మీడియా దృష్టిని ఆకర్షించింది. ప్రపంచంలో అతిపెద్ద వన్యప్రాణి సర్వేగా ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులకు ఎక్కింది. 2006లో పులుల జనాభా లెక్కల ప్రక్రియను శాస్త్రీయమైన బిగువుతో, కెమెరా ట్రాప్ టెక్నాలజీతో సరిదిద్దినప్పటి నుంచి నాలుగేళ్లకోసారి జరిపే పులుల జనాభా లెక్కల్లో సంఖ్యలు పెరుగుతూ వచ్చాయి. 2006లో దేశంలో 1411 పులులు ఉండేవనీ, 2010 నాటికి వాటి సంఖ్య 1706కు పెరిగిందనీ ఎన్టీసీఏ అంచనా వేసింది. విజయవంత మైన పులుల పరిరక్షణ ఏర్పాట్లకు ఈ సంఖ్యలు సాక్ష్యంగా నిలుస్తు న్నప్పటికీ దీనిలో నాణేనికి మరో వైపు కూడా ఉంది. పులులు ఒంటరి జీవులు. వీటికి నిర్దిష్టంగా స్థలం అవసరం. పెద్దపులులు వాటితోపాటు సాధారణంగా వన్యప్రాణులు కూడా మానవులు గీసిన హద్దులు కానీ, మ్యాప్‌లను (జాతీయ పార్కులను, వన్యప్రాణి కేంద్రాలను లేదా టైగర్ రిజర్వ్‌లను) కానీ అర్థం చేసుకోవు. గత నెల అస్సాంలో, ఒక పులి బ్రహ్మపుత్ర నదీ ప్రవాహం వెంబడి 120 కిలోమీటర్ల దూరం నడిచి వచ్చిన వార్త పతాక శీర్షికలకు ఎక్కింది. ఒరాంగ్ నేషనల్ పార్కు నుంచి గౌహతిలోని ఉమానంద ద్వీపం వరకు అది నడిచివచ్చింది. 79 చదరపు కిలోమీటర్ల పరిధిలోని చిన్న కీలకమైన ప్రాంతంలో ఉండే ఒరాంగ్, తనలో పెరుగుతున్న పులుల జనాభాకు తగినట్టు ఆశ్రయం ఇవ్వలేక కొట్టుమిట్టాడుతోంది. మానవుల ఆవాసానికి లోపలా, వెలుపలా పులులు తిరగడం రోజువారీ వ్యవహారం అయింది. బిహార్ పశ్చిమ చంపారణ్ ప్రాంతంలోని వాల్మీకి టైగర్ రిజర్వ్ వంటి అతి పెద్ద రక్షిత ప్రాంతాలు కూడా ఇదే విధమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. దశాబ్దం క్రితం వాల్మీకి టైగర్ రిజర్వ్... పెద్ద పులుల సంరక్షణ మ్యాప్‌లో స్థానం కోల్పోయింది. కానీ బిహార్ అటవీ శాఖ, ఇతర లాభరహిత పరిరక్షణ సంస్థల ప్రయత్నాల కారణంగా ఇప్పుడది భారతదేశంలోనే అత్యుత్తమంగా పనిచేసే టైగర్ రిజర్వులలో ఒకటిగా నిలిచింది. 2021లో కన్జర్వేషన్ అస్యూర్డ్ టైగర్ స్టాండర్డ్స్ (సీఏటీఎస్) గుర్తింపు పొందిన దేశంలోని 14 టైగర్ రిజ ర్వులలో ఒకటయ్యింది. పులుల పరిరక్షణలో ఉత్తమ ఆచరణలు, ప్రమాణాలకు సంబంధించి ఇది ఒక అంతర్జాతీయ గుర్తింపు. అయితే ఈ విజయం అటు అటవీ శాఖకూ, ఇటు స్థానిక కమ్యూ నిటీకీ కొత్త తలనొప్పికి కారణమైంది. గత అక్టోబర్‌లో తొమ్మిది మంది ప్రజల హత్యకు కారణమైన మూడేళ్ల మగపులిపై కనిపిస్తే కాల్చివేత ఆదేశం ఇవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత దాన్ని కాల్చి చంపారు. జనవరి 10న ఈ ప్రాంతం నుంచే ఒక మైనర్ బాలికపై మరో పులి దాడి చేసిన ఘటన వార్తలకెక్కింది. దేశవ్యాప్తంగా ఇలాంటి కొన్ని దురదృష్టకర ఘటనలు జరగడంతో ప్రజలు పులులకు వ్యతిరేకంగా మారుతున్నారు. మన జాతీయ జంతువును కాపాడే మంచి పరిరక్షణ కృషికి వీరు వ్యతిరేకమవు తున్నారు. పెరుగుతున్న పులుల సంఖ్య పులుల పరిరక్షణ విజయానికి తిరుగులేని నిదర్శనం కాగా, అదే సమయంలో దానికి వ్యతిరేక పరి స్థితి కూడా రంగం మీదికొచ్చింది. ఎన్టీసీఏ అంచనా ప్రకారం చూసినప్పటికీ దేశంలోని ప్రతి మూడు పులుల్లో ఒకటి రక్షిత అభయా రణ్య ప్రాంతాల వెలుపల నివసిస్తున్నాయి. ప్రపంచ పులుల జనాభాలో 70 శాతం ఉన్న భారత్ అతిపెద్ద టైగర్ జనాభా కేంద్రంగా వెలుగుతోంది. 1973లో దేశంలో 9 టైగర్ రిజర్వులుఉండగా 2022 నాటికి ఈ సంఖ్య 53కు పెరిగింది. ఈ వెయ్యికిపైగా పులులను తరచుగా భారతదేశ నిరుపేద, నిరాశ్రయ పులులుగా పేర్కొంటూ ఉంటారు. ఇప్పుడు దేశంలోని 53 టైగర్ రిజర్వులు 75 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండవచ్చు. కానీ వీటిలో ఎక్కువ భాగం మనుషులు నివసించే ప్రాంతాలే. ఇవి చిన్నవిగానూ, లేదా ముక్కచెక్కలైపోయిన అటవీ భాగాలుగా ఉంటూ వస్తున్నాయి. టైగర్ రిజర్వులు పులులకు, వన్యప్రాణులకు మాత్రమే సంబంధించినవని అందరూ ఊహిస్తుంటారు కానీ వాటిలో అనేక గ్రామీణ ఆవాసాలు ఉంటున్నాయి. వేలాది ప్రజలు, పశువులు ఉండటంతోపాటు రోడ్లు, రైలు పట్టాలు కూడా వీటిగుండా పోతుంటాయి. దీనికి పశ్చిమబెంగాల్ లోని బక్సా టైగర్ రిజర్వ్ ఒక మంచి నిదర్శనం అని చెప్పాలి. కేంద్ర ప్రాంతంలో కనీసం 80–100 పులుల జనాభాను పోషించడానికి పెద్దపులులకు 800 నుంచి 1,200 చదరపు మీటర్ల మేరకు ఇతరులు చొరబడకూడని స్థలం అవసరమవుతుందని రీసెర్చ్ డేటా సూచిస్తోంది. కానీ మనలాంటి చిక్కటి జనసాంద్రత కలిగిన దేశంలో, సహజమైన అరణ్యాలు కోరుకోవడం ఆశావహమైన కోరిక మాత్రమే. దానికి తోడుగా రెండు లేదా అంతకంటే ఎక్కువ రక్షిత ప్రాంతాలను అనుసంధానిస్తున్న అటవీ కారిడార్లు... మనుషులు, వన్యప్రాణుల మధ్య ఇరుకైన స్థలాన్ని మాత్రమే మిగుల్చుతున్నాయి. భారతదేశ స్థానిక ప్రజలు, వెనుకబడిన కమ్యూనిటీలు సాంస్కృతికంగా, సామా జికంగా, ఆర్థికంగా ఈ రిజర్వు ప్రాంతాల్లో నివసించాల్సిన పరిస్థితుల్లోనే ఉన్నారు. మధ్యప్రదేశ్‌లోని బాంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్ లోపల, వెలుపల నివసిస్తున్న ప్రజలు ఇప్పుడు అదనంగా ఛత్తీస్‌గఢ్ నుంచి వలస వస్తున్న అటవీ ఏనుగులతో కూడా వ్యవహరించాలి. ఉమరియా జిల్లా (బాంధవ్‌గఢ్) ప్రజలకు తరతరా లుగా ఏనుగులతో తలపడిన చరిత్ర లేదు. కానీ ఇప్పుడు మాత్రం మానవులు–పులులు, మానవులు–ఏనుగుల మధ్య ఘర్షణ తలెత్తే పరిస్థితులు రావడం వన్యప్రాణుల పరిరక్షణలో కీలకమైన సవాలుకు దారితీస్తోంది. పెరుగుతున్న పులుల సంఖ్యలు మాత్రమే విజయానికి కొల బద్దగా ఉంటున్న సమాజంలో పులుల సంఖ్య క్షీణించడం సమీప భవిష్యత్తులో సాధ్యం కాదు. ప్రకృతి మనకు విధిస్తున్న పరిమితులను గుర్తించి మసులుకోవడం మనకు సాధ్యం కావడం లేదు. వన్య ప్రాణులు సంచరించే స్థలాలు తగ్గిపోతున్నట్లు పలు శాస్త్రీయ నివేది కలు చెబుతున్నప్పటికీ మనం పులుల సంఖ్య పెరుగుదలను మాత్రమే పట్టించుకుంటున్నాం. పులులు, సింహాలు, ఏనుగులు లేదా ఖడ్గమృగాల వంటి జీవుల సంఖ్య పట్ల మన ఆసక్తి పెరుగుతోంది. దేశంలో మరిన్ని ప్రాంతాలు శీఘ్రంగా నగరీకరణకు గురవుతుండడంతో... మన నగరాల అంచుల్లో, తగ్గిపోతున్న అడవుల్లో, వ్యవసాయ క్షేత్రాల్లో లేదా ఎస్టేట్లలో పులులు ఉనికి కోసం పోరాడుతున్నాయి. ఒక్క పులులే కాదు... ఈ మారుతున్న ప్రపంచంలో తమ ఉనికి కోసం అనేక జీవజాతుల పరిస్థితీ అదే! ఆనంద బెనర్జీ వ్యాసకర్త రచయిత, ఆర్టిస్ట్, వన్యప్రాణి పరిరక్షణవాది (‘ది హిందుస్తాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
ఆ పొత్తు చైనాకు తప్పదా?
చైనా కమ్యూనిస్టు పార్టీ 20వ కాంగ్రెస్‌లో తిరుగులేని అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటి నుంచి ఆ దేశాధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఇంటా బయటా సమస్యలనూ, విమర్శలనూ ఎదుర్కొంటున్నారు. అమెరికా నేతృత్వంలో చైనాపై ఆంక్షలు మరింత పెరగడం, ఆసియాలో తన బలమైన పోటీదారైన భారత్‌కు పాశ్చాత్య పెట్టుబడులు తరలిపోతుండటం జిన్‌పింగ్‌కి కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టాయి. నూరు చైనా కంపెనీలకు మైక్రోచిప్‌ల ఎగుమతిపై అమెరికా, దాని మిత్రదేశాలు కొనసాగిస్తున్న ఆంక్షలు జిన్‌పింగ్‌ను కలతపెడుతున్నాయి. దీంతో పాలనా విధానాలు, సంస్కరణలపై తన వైఖరిని ఆయన సడలించుకుంటున్నారు. అమెరికాతో సంబంధాలను మెరుగుపర్చుకునే దిశగా అనేక చర్యలు తీసుకున్నారు. జీరో–కోవిడ్ పాలసీకి వ్యతిరేకంగా నవంబర్‌లో చైనావ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్త డంతో గత మూడు నెలలుగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ పేరు ప్రతిష్ఠలు దెబ్బతిన్నాయి. ప్రజానిరసనల తర్వాత జిన్‌పింగ్ తన పాలసీని వదిలేయవలసి వచ్చింది. దీంతో చైనాలో కోవిడ్–19 ఇన్ఫెక్షన్ల వేవ్స్ ఉద్ధృతంగా వ్యాపించాయి. నూతన సంవత్సర వేళ తాను చేసిన ప్రసంగంలో, తన జీరో–కోవిడ్ పాలసీపై వెల్లువెత్తిన ప్రజా వ్యతిరేకత గురించి జిన్‌పింగ్ తప్పకుండా ప్రస్తావించాల్సి వచ్చింది. ‘‘ఒక పెద్ద దేశంలో ఒకే సమస్యపై వివిధ రకాల ప్రజలు వివిధ రకాల అభిప్రాయాలను కలిగి ఉండటం సహజం’’ అని పేర్కొన్నారు. కోవిడ్ వల్ల జనాభాలో అత్యధిక శాతం మందికి ఇన్ఫెక్షన్లు సోకాయి. వృద్ధులు, ఇతర వ్యక్తులు పెద్ద సంఖ్యలో మరణించారు. అనేక ప్రాపర్టీ కంపెనీలు దివాలా తీయడంతో మధ్యతరగతి ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. అనేక కంపెనీలు మూసివేతకు గురవడంతో చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో జిన్‌పింగ్ పాలనకు వ్యతిరేకంగా అసమ్మతి గణనీయంగా పెరిగిపోయింది. దేశీయ శాంతి, సుస్థిరత, పాలనా నిర్వహణ జిన్‌పింగ్‌కే కాకుండా చైనా కమ్యూనిస్టు పార్టీ పాలనకు కూడా అత్యంత ప్రాధాన్యం కలిగిన విషయం. దీంతో తన పాలసీలపై విమర్శను అడ్డుకోవడానికి జిన్‌పింగ్ అతి చురుకుగా పనిచేయాల్సి వచ్చింది. ఆయన తన నూతన సంవత్సర ప్రసంగంలో అమెరికా, తదితర దేశాలకు చేరువ కావడం కోసం చైనా మాతృభూమితో తైవాన్ పునరేకీకరణ అనే ఊతపదాన్ని వదిలేసుకున్నారు. తైవాన్ జలసంధికి ఇరువైపులా ఉన్న ప్రజలు ఒకే కుటుంబ సభ్యులు అని చెప్పారు. శరవేగంగా చైనా జాతి శ్రేయస్సు సాధించడానికి తమ రెండు దేశాలూ కలిసి పనిచేస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. స్వదేశంలోని విభిన్న గ్రూపులతో మాట్లాడుతున్న సమయంలో తన జీరో–కోవిడ్ పాలసీని జిన్‌పింగ్ సమర్థించుకున్నారు. ఇది దేశంలో కేసుల నిష్పత్తిని తగ్గించిందనీ, మరణాల రేటును అత్యంత తక్కువ శాతానికి తగ్గించివేసిందనీ చెప్పారు. అయితే జి¯Œ పింగ్‌ను దుర్వార్తలు వెంటాడుతున్నాయి. 2022లో చైనా జనాభా 8.5 లక్షల మేర పడిపోయిందని చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ జనవరి 17న ప్రకటించింది. వరదలు, కరవుల కారణంగా, మావో అమలుపర్చిన గొప్ప ముందంజ పారిశ్రామిక విధానం 1961లో కుప్పకూలిన తర్వాత చైనాలో జనాభా తగ్గిపోవడం ఇదే మొదటిసారి. దారిద్య్రాన్ని వేగంగా అధిగమించడానికి ఒకే సంతానం పాలసీని దాని దీర్ఘకాలిక పర్యవసానాలపై అధ్యయనం చేయకుండానే అమలు చేయాలని 1979లో చైనా పాలకులు నిర్ణయించడంతో చైనా జనాభా తగ్గుతూ వస్తోంది. అమెరికాకు చెందిన పరిశోధకుడు ప్రొఫెసర్ యి ఫుక్సియన్ ప్రకారం, చైనాలో సంతాన సాఫల్య రేటు 1.3 శాతానికి పడిపోయింది. (జనాభా భర్తీ రేటు 2.1 శాతం). దేశం తన సంతాన సాఫల్య రేటును 1.2 శాతం వద్ద స్థిరపర్చగలిగితే చైనా జనాభా 2050 నాటికి 1.07 బిలియన్లకు, 2100 నాటికి 48 కోట్లకు పడిపోతుంది. జనాభా తగ్గి పోవడం అంటే... ఉద్యోగుల సంఖ్య తగ్గిపోవటం, వృద్ధుల ఆరోగ్య సమస్యలపై ఖర్చు పెరగడం, సామాజిక సంక్షేమ అవసరాలు కుంచించుకుపోవడం, పొదుపు మొత్తాలు తగ్గిపోవడం, వీటికి మించి వస్తూ త్పత్తి, ఎగుమతులు, ప్రభుత్వ ఆదాయాలు పడిపోవడం, ప్రజల కొను గోలు శక్తి సన్నగిల్లిపోవడం, ఆర్థిక వృద్ధి పతనమవడం అని అర్థం. పైగా దేశ వస్తూత్పత్తి రంగం, వ్యవసాయం, శ్రమశక్తి, సామగ్రి సరఫరా, ఆరోగ్య సంరక్షణ, విద్యుత్ తదితర రంగాల్లో మరింతగా రోబోలను దింపాలని చైనా పథకరచన చేసింది. అయితే ఇప్పటికే ప్రతి 10 వేలమంది ప్రజలకు 322 రోబోలను అందుబాటులో ఉంచిన చైనాపై తాజా పథకం చూపే ప్రభావం పెద్దగా ఉండదు. ప్రపంచ రోబోటిక్స్ రిపోర్ట్–2022 ప్రకారం రోబోల వినియోగంలో అమె రికాను చైనా అధిగమించడమే కాక, ప్రపంచంలో రోబోల వినియోగంలో అయిదో స్థానంలో నిలిచింది. నూరు చైనా కంపెనీలకు మైక్రోచిప్‌ల ఎగుమతిపై అమెరికా, దాని మిత్రదేశాలు కొనసాగిస్తున్న ఆంక్షలకు సంబంధించిన వార్తలు కూడా జిన్‌పింగ్‌ను కలతపెడుతున్నాయి. దీనికి తోడు చైనాను ‘కనీవినీ ఎరుగని వ్యూహాత్మక సవాలు’గా అభివర్ణించిన జపాన్ 2027 నాటికి జీడీపీలో రక్షణ బడ్జెట్ 2 శాతం పెంచాలని నిర్ణయించుకుంది. అంతేకాక చైనాకు, ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా జపాన్ కొత్త క్షిపణులు, మానవ రహిత వ్యవస్థలకు చెందిన టెక్నాలజీలు, సైబర్ స్పేస్, అంతరిక్షం, ఎలక్ట్రో మాగ్నెటిక్ స్పెక్ట్రమ్, కృత్రిమ మేథ వంటి ఎదురుదాడి సామర్థ్యాలను మిక్కుటంగా సేకరించనుంది. 2046 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 26 లక్షల డాలర్లకు చేరుకుంటుందనీ, 2025 నాటికి చైనా నుంచి 25 శాతం అమెరికన్ సెల్ఫోన్ల ఉత్పత్తిని భారత్‌కు తరలించాలనీ అమెరికా సెల్‌ఫోన్ మాన్యు ఫ్యాక్చరింగ్ సంస్థ యాపిల్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ఎర్నెస్ట్ అండ్ యంగ్ ప్రకటించిన అంచనాలు జిన్‌పింగ్‌కి సంతోషం కలిగించవు. ఆసియా ప్రాంతంలో భారత్ పురోగతిని అడ్డుకుని తన ఆధిక్యాన్ని చాటుకోవాలని చైనా ఇప్పటికే లక్ష్యం పెట్టుకుంది. ఈ నేపథ్యంలో చైనా ఆర్థిక శక్తిని బలహీనపర్చడానికి భారత్ – అమెరికా పొత్తు పెట్టుకోవడం మరో ఉదాహరణగా జిన్‌పింగ్ అభిప్రాయ పడవచ్చు. ఈ అన్ని పరిణామాల వెలుగులో అమెరికాతో సంబంధాలను మెరుగుపర్చుకునే దిశగా జిన్‌పింగ్ అనేక చర్యలు తీసుకున్నారు. మొదటి చర్యగా అమెరికా ప్రభుత్వంపై వాడే తీవ్ర పదజాలాన్ని చైనా ప్రభుత్వం తగ్గించుకుంది. విదేశీ వ్యవహారాలు, జాతీయ భద్రత, ద్రవ్యవ్యవస్థ, పర్యావరణ మార్పు తదితర మంత్రిత్వ శాఖలతో భేటీకి చైనా అధ్యక్షుడు సమ్మతి తెలియజేశారు. చైనాకు వ్యతిరేకంగా అమెరికా తదితర దేశాలు చేసే చిన్న విమర్శలను కూడా తీవ్ర పద జాలంతో తిప్పికొట్టే ధోరణిని జిన్‌పింగ్ మంత్రులు ఇప్పుడు పక్కన పెట్టేశారు. తమ పట్ల అమెరికాకు మించి మరింత స్వతంత్ర వైఖరితో వ్యవహరిస్తున్న జర్మనీ, ఫ్రా¯Œ ్స, ఇటలీ దేశాలతో బలమైన సంబంధాలు ఏర్పరచుకోవడానికి కూడా చైనా తహతహలాడుతోంది. గ్లోబల్ పెట్టుబడికీ, మార్కెట్ సంస్కరణలకూ తలుపులు తెరిచి మార్పునకు తాము సిద్ధమేనంటూ సంకేతాలు వెలువరించడంలో భాగంగా దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సమాఖ్య వార్షిక సదస్సుకు చైనా ప్రతినిధిగా చైనా ఉప ప్రధాని, తన పూర్వ ఆర్థిక సలహాదారు అయిన లియూ హేని చైనా అధ్యక్షుడు పంపించారు. పాశ్చాత్య బడా కంపె నీలకు లియూ హే సుపరిచితుడు కావడం విశేషం. అయితే 2022 అక్టోబర్‌లో జరిగిన చైనా కమ్యూనిస్టు పార్టీ 20వ కాంగ్రెస్ సందర్భంగా లియూ హేని పోలిట్ బ్యూరో పదవి నుంచి జిన్‌పింగ్ తొలగించడం విశేషం. అయితే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అవలంబించిన లోపభూయిష్ఠ విధానాల కారణంగా అమెరికా, పలు యూరోపియన్, ఆసియా దేశాల, కంపెనీల విశ్వాసం దారుణంగా దెబ్బతింది. ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్న ఆర్థిక వాతావరణం నుంచి బయటపడే ఎత్తుగడలో భాగంగా మాత్రమే జిన్‌పింగ్ విధానాల్లో వెనుకడుగు వేస్తున్నారనీ, తన వైఖరిని మార్చుకుంటున్నారనీ విదేశీ కంపెనీలు భావిస్తున్నాయి. చైనా ఆర్థిక ప్రగతిని బలహీనపరచడానికి ఆ దేశంపై తమ ఒత్తిడిని ఇవి కొనసాగించనున్నాయి. జిన్‌పింగ్ దూకుడునూ, ఆధిపత్యాన్నీ ప్రతిఘ టించడానికి చైనా సాంకేతిక పురోగతిని దెబ్బతీయాలని కూడా ఇవి గతంలోనే నిర్ణయించుకున్నాయన్నది గమనార్హం. యోగేశ్ గుప్తా వ్యాసకర్త మాజీ రాయబారి (‘ది ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
డాక్యుమెంటరీ అంతా డొల్లతనమే!
భారత ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ గతవారం ప్రసారం చేసిన డాక్యుమెంటరీ.. ‘ఇండియా : ది మోదీ క్వశ్చన్’ ప్రపంచవ్యాప్తంగా పెను వివాదాన్ని రాజేసింది. డాక్యుమెంటరీపై ఇండియా తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఆ లింకులను తక్షణం బ్లాక్ చేయాలని ట్విట్టర్, యూట్యూబ్‌లను ఆదేశించింది. బ్రిటన్ ప్రధాని రుషి సునాక్ డాక్యుమెంటరీలోని అంశాలను తాను పూర్తిగా అంగీకరించడం లేదని ఇప్పటికే ప్రకటించగా, తాజాగా అమెరికా స్పందించింది. ‘భారత్–అమెరికా’ భాగస్వామ్య విలువలే తమకు ముఖ్యం అంటూ.. వివాదానికి దూరంగా జరిగింది! కాగా, 2002 నాటి గుజరాత్ అల్లర్లు కేంద్ర బిందువుగా బీబీసీ ఈ డాక్యుమెంటరీని ప్రసారం చేసిన సమయంలోనే భారత్‌లోని ఆ సంస్థ రిపోర్టర్ ఒకరు గత 20 ఏళ్లలో దేశంలో భారీస్థాయి హింసాత్మక సంఘటనలు తగ్గిపోయాయని ఒక కథనం ప్రసారం చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ డాక్యుమెంటరీ వ్యవహారం చూస్తూంటే... మిగతా విపరిణామాలతో పాటూ భారత్‌తో యూకే సంబంధాలూ దెబ్బతినే ప్రమాదం ఉందేమో అనిపిస్తోంది. ‘ద బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్’ (బీబీసీ) యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వ అధికార ప్రజా ప్రసార సంస్థ. రాయల్ ఛార్టర్ కింద ఏర్పాటైంది. బీబీసీకి ఆర్థిక నిధులు ప్రధానంగా యూకే ప్రజల నుంచి వసూలు చేసే లైసెన్స్ ఫీజు ద్వారా అందుతాయి. ఇలా ప్రజల సొమ్ము బీబీసీకి ఇవ్వడంపై ఇటీవల విమర్శలూ వచ్చాయి. ఇందుకు కారణాలు లేకపోలేదు. ప్రేక్షకులు, వీక్షకులు.. ఓటీటీలతో పాటు, ఇతర డిజిటల్ మాధ్యమాల వైపు మళ్లుతూండటం, బీబీసీ సంపాదకీయ వర్గ పోకడలపై తీవ్రమైన ప్రశ్నలు వస్తూండటం, రాజకీయ వివక్ష వంటివి ఆ కారణాల్లో కొన్ని. తాము స్వతంత్రంగానే ఉన్నామని, నిష్పాక్షికంగానే వ్యవహరిస్తున్నామని బీబీసీ చెబు తున్నా దేశపు వ్యూహాత్మక లక్ష్యాల సాధనకు అది బ్రిటిష్ నిఘా వర్గాలకు సాయంగా నిలవడం దశాబ్దాలుగా జరుగుతున్న విషయంబహిరంగ రహస్యం కూడా. వివక్షాపూరితం భారత్‌లో ఇటీవలి కాలంలోనూ బీబీసీ సంపాదకీయ వర్గం పోకడలు వివక్షాపూరితంగా ఉన్న ఆరోపణలు వచ్చాయి. మరీ ముఖ్యంగా ‘సిటిజన్ షిప్ ఎమెండ్మెంట్ యాక్’్టపై ఢిల్లీలో జరిగిన అల్లర్ల విషయంలో బీబీసీ రెచ్చగొట్టేలా వ్యవహరించిందని, కోవిడ్ మరణాలపై కూడా సున్నితంగా వ్యవహరించలేదని ఆరోపణలున్నాయి. అందుకే.. బీబీసీ ప్రధాని నరేంద్రమోదీ, ముస్లిం సమాజాలను కేంద్రంగా చేసు కుని రెండు భాగాల డాక్యుమెంటరీ ప్రసారం చేయాలని నిర్ణయించడం పెద్దగా ఆశ్చర్యం కలిగించదు. ఈ డాక్యుమెంటరీల్లో తొలి భాగం జనవరి 17వ తేదీ ప్రసారమైంది. ఆ డాక్యుమెంటరీని చూస్తే ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. యూకే ప్రజల సొమ్ముతో నడిచే బీబీసీ... భారత్ లాంటి దేశాల్లో వాణిజ్య అవసరాల కోసమే పనిచేస్తూండవచ్చునని అనుకోవచ్చు. మరిన్ని ఎక్కువ క్లిక్‌లు వచ్చేలా శీర్షికలు పెట్టడం కూడా అందుకే. అయితే 2002 నాటి గుజరాత్ అల్లర్లు కేంద్ర బిందువుగా బీబీసీ ఒక డాక్యుమెంటరీని ప్రసారం చేసిన సమయంలోనే భారత్ లోని ఆ సంస్థ రిపోర్టర్ ఒకరు గత 20 ఏళ్లలో దేశంలో భారీస్థాయి హింసాత్మక సంఘటనలు తగ్గిపోయా యని ఒక కథనం ప్రసారం చేయడం ఆసక్తి రేకెత్తిస్తోంది. భారత్‌లో మతాల మధ్య అంతరాన్ని ఉపయోగించుకోవాలని బీబీసీ ఎందుకు అను కుంటోందన్నది పెద్ద ప్రశ్న. అది కూడా పెద్దపెద్ద ఘర్షణలనేవి దాదాపుగా లేని ఈ పరిస్థితుల్లో? ఈ విషయాలను కాసేపు పక్కనబెట్టినా ఈ డాక్యుమెంటరీలో గుజరాత్ అల్లర్ల విషయాన్ని చూపిన విధానంపై మాత్రం నిశిత పరిశీలన జరపాల్సిందే. ఎందుకంటే.. ఈ దేశపు అత్యున్నత న్యాయ స్థానం తన అభిప్రాయాన్ని స్పష్టం చేసిన అంశంపై ఈ డాక్యుమెంటరీ మళ్లీ ప్రశ్నలు లేవనెత్తుతోంది. అంతేకాదు.. భారత్, యూకేల మధ్య దౌత్య సంబంధాలను కూడా దెబ్బతీసేలా ఉందీ డాక్యుమెంటరీ. తొలి భాగం మొత్తం 2002 నాటి గుజరాత్ మతఘర్షణలు తరువాతి పరిణామాలపై తీశారు. బీబీసీ ఆ కాలంలో తీసిన వీడియో ఫుటేజ్‌లు, అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీతో జరిపిన ఇంట ర్వ్యూలను ఈ డాక్యుమెంటరీలో వాడుకున్నారు. ఇది ఓ తప్పుడు వాదన తాలూకూ పునరుక్తి మినహా మరోటి కాదు. ఈ రకమైన వాదనతోనే అల్లర్లపై ఇరవై ఏళ్లపాటు కోర్టు కేసులు నడిచాయి. ఆ తరువాత సుప్రీంకోర్టు వాటిని చెత్తబుట్టలో వేసేసింది. గుర్తు తెలియని మోదీ వ్యతిరేకులపై ఆధారపడుతూ చేసిన ఈ డాక్యుమెంటరీ కొత్తగా చెప్పేదేమీ లేదు... పాతగాయాలను మళ్లీ రెచ్చగొట్టి కోపం, విద్వేషా లను పెంపొందించడం మినహా! ఘటనల క్రమాన్ని మార్చింది ఈ డాక్యుమెంటరీలోని మొత్తం విషయంలో ఐదు అంశాల గురించి వివరణ అవసరమవుతుంది. మొట్టమొదటగా చెప్పుకోవాల్సింది ఘటనల క్రమాన్ని మార్చిన విధం. 2002 ఫిబ్రవరిలో జరిగిన గోధ్రా ఘటన తరువాత డిసెంబరులో గుజరాత్ ఎన్నికలు జరిగినట్లు చూపించారు. వర్గాలుగా చీల్చే ప్రయత్నం అన్నమాట. ఈ క్రమంలో సెప్టెంబరులో అక్షరధామ్‌పై జరిగిన ఉగ్రదాడి గురించి అస్సలు ప్రస్తావనే లేదు. అలాగే అక్షరధామ్ దాడి తరువాత పరిస్థితిని అత్యద్భుతంగా చక్కదిద్దిన వైనమూ లేకుండా పోయింది. ఇక రెండో విషయానికి వద్దాం. అది.. హింసకు సంబంధించిన లెక్కల్లోని డొల్లతనం. కొన్ని ఘటనలను పెద్దవిగా చూపేందుకు గ్రాఫిక్‌లు కూడా వేశారు కానీ.. 2002 అల్లర్లను పోలీసులు ఎలా అదుపు చేశారన్న విషయంలో వాస్త వాలను విస్మరించారు. మొత్తం 4,247 కేసులు నమోదయ్యాయనీ, 26,974 మందిని అరెస్ట్ చేశారనీ, గుంపులను చెదరగొట్టేందుకుఏకంగా 15,369 భాష్పవాయు గోళాలు వాడారనీ, తొలి 72 గంట ల్లోనే పోలీసులు 5450 రౌండ్ల బుల్లెట్లు ప్రయోగించిన ఫలితంగా 101 మంది ఆందోళనకారులు మరణించారనీ బీబీసీకి తెలియకుండా ఏమీ ఉండదు. బీబీసీ డాక్యుమెంటరీతో వచ్చిన మూడో చిక్కే మిటంటే.. వాళ్లూ వీళ్లూ చెప్పిన విషయాలపై ఎక్కువగా ఆధార పడటం. సాక్షులు, సాక్ష్యాలు ఏవీ కొత్తగా లేకపోవడం. నిజానికి రెండు దశాబ్దాలపాటు నరేంద్ర మోదీని ఏదో ఒకరకంగా వ్యక్తిగతంగానైనా 2002 అల్లర్లలో ఇరికించాలని బోలెడన్ని ప్రయత్నాలు జరిగాయి. ఇవన్నీ కూడా తప్పుడు ఆరోపణలు,సందేహాస్పద వ్యక్తుల మాటలపై ఆధారపడి చేసినవే. న్యాయ స్థానాలు వీటి డొల్లతనాన్ని ఎప్పుడో తేల్చేశాయి. ఊరూపేరూ లేని వారి మాటలను వ్యాప్తి చేయడం.. అపవాదులు మోపడం మాత్రమే నని స్పష్టం చేశాయి. నాలుగవ సమస్య గురించి చూద్దాం. ఇందులో వ్యక్తు లను ఉదాహరించిన పద్ధతి ప్రశ్నార్థకమైంది. సుప్రీంకోర్టు సమగ్రతను ప్రశ్నించేలా ఉన్నాయి ఇవి. చివరదైన ఐదవ సమస్య... బ్రిటిష్ దౌత్య కార్యాలయం నిర్వహించిందని చెబుతున్న రహస్య విచారణ. ఇందులో సత్యమెంతో, అవాస్తవాలెన్నో ఎవరికీ తెలియదు. చిచ్చు పెట్టేందుకే... అయితే.. ఈ డాక్యుమెంటరీలో బ్రిటిష్ విదేశీ వ్యవహారాల శాఖ మాజీ మంత్రి రహస్య విచారణపై అధికారికంగా ప్రకటన చేయడం వివాదా స్పద పోకడకు శ్రీకారం చుట్టినట్టు అవుతుంది. బీబీసీ తనదైన విదేశీ విధానాన్ని అమలు చేయాలని.. దౌత్యపరమైన ఇబ్బందులతో తమకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. భారత్‌లో మరోసారి మత ఘర్షణల చిచ్చు పెట్టేందుకు బీబీసీ చేసిన ఈ ప్రయత్నం.. తుది శ్వాస తీసుకుంటున్న తరుణంలో మనుగడ కోసం చేసిన నిష్ఫల ప్రయత్నంగా తోస్తోంది. బీబీసీ అధ్యక్షుడు ఇటీవల బీబీసీ ఏర్పాటు ఉద్దేశాల్లో పబ్లిక్ సర్వీస్ అన్నది తొలిగి పోయేలా ఉందని వ్యాఖ్యానించడం ఇక్కడ చెప్పుకోవాలి. ఈ డాక్యు మెంటరీ వ్యవ హారం చూస్తూంటే... భారతీయ ప్రజాస్వామ్య సుస్థిరతను, అత్యు న్నత ప్రభుత్వ సంస్థల సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ.... బీబీసీ పబ్లిక్ సర్వీసును పూర్తిగా వదులుకోవడమే కాకుండా.. భారత్‌తో యూకే సంబంధాలను కూడా దెబ్బతీస్తున్నట్లు కనిపిస్తోంది. వెంపటి శశి శేఖర్ వ్యాసకర్త ప్రసార భారతి మాజీ ఛైర్మన్ (‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో) -
మారువేషంలో కొలీజియంలోకా?
అసలంటూ ప్రస్తుతం ఉనికిలోనే లేని ‘శోధన, మూల్యాంకన కమిటీ’లో ప్రభుత్వ ప్రతినిధులు కూడా ఉండాలన్న కేంద్ర న్యాయమంత్రి సూచన తీవ్రమైనది! కేవలం న్యాయమూర్తులను మాత్రమే కలిగి ఉన్న కొలీజియంలో ప్రవేశించడానికి ప్రభుత్వం తెలివిగా మారువేషంలో వేస్తున్న తొలి అడుగుగా దీన్ని భావించాలి. న్యాయమూర్తుల ఎంపిక కమిటీలో ప్రభుత్వ ప్రాతినిధ్యం న్యాయవ్యవస్థ స్వతంత్రతను ధ్వంసం చేస్తుందని న్యాయ మూర్తుల నియామక కమిటీ చట్టం కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పేర్కొంది. న్యాయమంత్రి సూచన ఆ తీర్పును తోసిపుచ్చే ప్రయత్నమే. అలాగని హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల ప్రాతిపదికలో ఎలాంటి తప్పూ లేదని సూచించడం లేదు. ఇక్కడే శోధన ప్రారంభం కావలసి ఉంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల నియామకాల కోసం ‘శోధన, మూల్యాంకన కమిటీ’ (సెర్చ్ కమ్ ఎవాల్యుయేషన్ కమిటీ)ని నియమించాలంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌కు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు లేఖ రాసినట్టు తెలిసింది. ఈ విషయాన్ని చర్చించేముందుగా మంత్రి సూచించిన శోధన, మూల్యాంకన కమిటీ అనేది ఉనికిలో లేదని గమనించాలి. ప్రస్తుతం ఉనికిలో ఉన్న చట్టం ప్రకారం ప్రధాన న్యాయమూర్తి, ఇద్దరు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులతో కూడిన కొలీజియం... హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను నియమిస్తూ ఉంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించినంతవరకూ ప్రధాన న్యాయమూర్తి, నలుగురు అత్యంత సీనియర్ న్యాయమూర్తులతో కూడిన కొలీజయం సిఫార్సు చేస్తుంది. శోధన, మూల్యాంకన కమిటీ అవసరం ఇప్పుడు ఉందా? సమాధానం నిశ్చయాత్మకంగా అవును అన్నట్లయితే, అలాంటి కమిటీ పొందిక ఎలా ఉండాలి అనేది మరో ప్రశ్న. హైకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించడం సంప్రదాయంగా వస్తోంది. అయితే తాను పనిచేసే హైకోర్టులో ఆయన్ని ప్రధాన న్యాయమూర్తిగా నియమించరు. అలాగే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియ మించే సందర్భంలోనే సుప్రీంకోర్టులో రాష్ట్రాల భౌగోళిక ప్రాతి నిధ్యాన్ని లెక్కిస్తారు. కాబట్టి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన ప్రాతి పదిక ఇప్పటికే స్పష్టంగా ఉంది. కాబట్టి, కొత్తగా శోధన, మూల్యాంకన కమిటీ అవసరం లేదని తెలుస్తున్నది. దీనికి బదులుగా సీనియారిటీ నిబంధనను పక్కన పెట్టి చేసే నియామకాలకు ప్రాతిపదిక అవసరం. పరిధి ప్రాతిపదికను పరిగణించే అవకాశం పైన చెప్పినట్టుగా పరిమితం. కాబట్టి కేంద్ర మంత్రి సూచించిన శోధన, మూల్యాంకన కమిటీ ఈ సంప్రదాయానికి చేసే జోడింపు పెద్దగా లేదనే చెప్పాలి. ఇక జడ్జీల పనితీరు మూల్యాంకనం కూడా సుప్రీంకోర్టు న్యాయ మూర్తుల విధి. సుప్రీంకోర్టుకు నియమించాల్సిన న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పుల బాగోగులను సుప్రీంకోర్టు న్యాయమూర్తులే చక్కగా మూల్యాంకన చేయగలరు. దీన్ని పక్కనబెడితే, న్యాయ నిర్ణయాలు చాలా తరచుగా సుప్రసిద్ధ న్యాయ పత్రికల్లో తీవ్రమైన విద్యాత్మక విమర్శలకు గురవుతుంటాయి. న్యాయమూర్తుల మూల్యాంకనకు ఇది సుపరిచితమైన పద్ధతి. ఇలాంటి పరిస్థితుల్లో శోధన, మూల్యాంకన కమిటీలో ప్రభుత్వ ప్రతినిధులు కూడా ఉండాలన్న కేంద్ర న్యాయమంత్రి సూచన తీవ్రమైనది! కేవలం న్యాయమూర్తులను మాత్రమే కలిగి ఉన్న కొలీజియంలో ప్రవేశించడానికి ప్రభుత్వం తెలివిగా మారు వేషంలో వేస్తున్న తొలి అడుగుగా దీన్ని భావించాలి. స్పష్టంగా చెప్పాలంటే, భారత రాజ్యాంగం నిర్దేశించిన అధికా రాల విభజన సూత్రాన్ని న్యాయమంత్రి తాజా సూచన ధ్వంసం చేస్తుంది. ఈ అధికారాల విభజన రాజ్యాంగ ప్రాథమిక లక్షణాల్లో ఒకటి. అన్ని రాజ్యాంగ బద్ధ సంస్థల్లో న్యాయవ్యవస్థ మాత్రమే, ప్రభు త్వాన్ని ఎన్నుకున్న మెజారిటీ ప్రజాభిప్రాయానికి ప్రతితులనాత్మకంగా ప్రభుత్వ పనితీరు పట్ల నిరోధ సమతౌల్యాన్ని అందించగలదు. ప్రభుత్వ పనితీరుకు నిరోధ సమతౌల్యంగా ఉండాల్సిన న్యాయ మూర్తుల నియామక కమిటీలో అదే ప్రభుత్వం భాగమైతే, ప్రభుత్వ ఇతర విభాగాలను తనిఖీ చేసే కోర్టు విధిని అది ధ్వంసం చేస్తుంది. ఇది ‘కోళ్ళగూటిలోకి నక్కను స్వయంగా ఆహ్వానించడమే’ అవుతుంది. న్యాయమూర్తుల ఎంపిక కమిటీలో ప్రభుత్వ ప్రాతినిధ్యం అనేది న్యాయవ్యవస్థ స్వతంత్రతను ధ్వంసం చేస్తుందని న్యాయమూర్తుల నియామక కమిటీ చట్టం కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో న్యాయ మంత్రి సూచన ఆ తీర్పును తోసిపుచ్చే ప్రయత్నమే. సుప్రీంకోర్టు ద్వారా ప్రకటితమైన చట్టాన్ని మార్చడానికి రెండు సుపరిచిత మార్గాలు ఉన్నాయి. మొదటిది, సముచితమైన శాసనం ద్వారా న్యాయస్థానం అన్వయించిన తీర్పు ప్రాతిపదికనే మార్చి వేయడం. రెండో మార్గం ఏమిటంటే, విస్తృత ధర్మాసనం ద్వారా ఆ తీర్పును తోసిపుచ్చడానికి ప్రయత్నించడం. ప్రభుత్వం ఈ రెండింటిలో ఏ ఒక్కదానికీ పూనుకోలేదు. బదులుగా, భారత ఉపరాష్ట్రపతి, న్యాయమంత్రి వంటి అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారే న్యాయస్థానం తీర్పునకు భిన్నంగా ప్రకటనలు చేస్తూ వచ్చారు. న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టే ప్రయ త్నంలో, మొత్తంగా న్యాయవ్యవస్థ చట్టబద్ధతనే రద్దుపరిచే ప్రయత్నంలో భాగంగా ఇదంతా జరుగుతూండటం గమనార్హం. న్యాయమూర్తుల నియామక విధానాన్ని మార్చాలని ప్రభుత్వం తీవ్రంగా భావిస్తూ ఉన్నట్లయితే, న్యాయమూర్తుల నియామక చట్టాన్ని తోసిపుచ్చిన తర్వాత ఒక కొత్త చట్టాన్ని తీసుకురాకుండా దాన్ని ఏదీ అడ్డుకోలేదు. అయితే ఈ మార్గాన్ని ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే చేపట్టడం లేదు. అసలు అలాంటి చట్టాన్ని రూపొందించే అవసరాన్నే ప్రభుత్వం పరిగణించలేదు. ఎందుకంటే, ప్రభు త్వంతో సంప్రదింపుల తర్వాతే నియామకాలను చేపడుతున్న పక్షంలో అలాంటి న్యాయమూర్తులతో ప్రభుత్వం ఎంతో సౌకర్యవంతంగా ఉంటూ వస్తోంది. రాష్ట్రపతి ఆదేశంతో నిమిత్తం లేకుండా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని గానీ, న్యాయమూర్తులను గానీ కొలీజియం సిఫార్సు చేసిన సందర్భం ఒక్కటి కూడా లేదు. అలాగే కొలీజియం చేసిన ఏ సిఫారసు అయినా ప్రభుత్వానికి అసౌకర్యంగా మారి వ్యతిరేకించిన పక్షంలో అలాంటి సూచనలను న్యాయవ్యవస్థ వెనక్కు తీసుకోవడం కూడా జరిగేది కాదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తిగా ఎన్నికైన జస్టిస్ ఎన్వీ రమణ యూపీఏ ప్రభుత్వ హయాంలో ఎంపికైన చివరి న్యాయమూర్తి కావడం తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన ప్రధాన న్యాయమూర్తులు ఎన్డీయే ప్రభుత్వ హయాంలోనే నియ మితులవుతూ వచ్చారు. అలాగని హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల ఎంపిక ప్రాతిపదికలో ఎలాంటి తప్పూ లేదని ఇక్కడ సూచించడం లేదు. ఇక్కడే శోధన ప్రారంభం కావలసి ఉంది. ముఖ్యంగా, హైకోర్టుల నియామకాల కోసం ప్రాతిపదిక గురించి న్యాయ మంత్రి తాజా లేఖ పేర్కొనడం లేదు. సమస్య ఇక్కడే ఉందని నేను నమ్ముతున్నాను. న్యాయమూర్తులను నియమించే దశలోనే శోధన, మూల్యాంకనకు ప్రాధాన్యత ఉంటుంది. అయితే న్యాయమూర్తులతో కూడిన కమిటీనే దాన్ని చేపట్టాలి. న్యాయమూర్తుల నియామకాలకు నిర్దిష్ట ప్రాతిపదిక ఉండాలి. ఆ ప్రాతిపదికను ముందుగానే ప్రకటించి ప్రచురించాలి. అందుబాటులో ఉన్న ఉత్తమ అభ్యర్థిని న్యాయమూర్తిగా ఎంపిక చేయడానికి సరైన మార్గం ఏదంటే, ప్రస్తుతం లోపభూయిష్టంగా ఉంటున్న న్యాయమూర్తుల నియామక వ్యవస్థను అధిగమించడం. దానికిగానూ సంబంధిత అభ్యర్థులు తమ ఆసక్తిని వ్యక్తపర్చడానికీ, స్వయంగా నామినేషన్ దాఖలు చేయడానికీ అనుమతించాలి. అప్పుడు మాత్రమే జడ్జీల నియమాకానికి చెందిన పరిగణన పరిధి విస్తృతం అవుతుంది. ప్రజలకు బహిరంగంగా తెలుస్తుంది కూడా. స్వీయ నామినేషన్ వ్యవస్థ మాత్రమే వర్గం, కులం, జాతి, లైంగిక ధోరణికి సంబంధించిన వైవిధ్యతకు హామీ ఇస్తుంది. ధర్మాసనంలో మనం చూడవలసిన బహుళత్వం, వైవిధ్యం గురించి అర్థం చేసు కోవడానికి అది వీలు కలిగిస్తుంది. ఇందిరా జైసింగ్ వ్యాసకర్త సీనియర్ న్యాయవాది, భారత మాజీ అదనపు సొలిసిటర్ జనరల్ (‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో) -
రూపాయి విలువ తగ్గింది, ఎందుకు?
ఒక దేశపు కరెన్సీ మారకం రేటు ఎందుకు తగ్గుతుంది? దేశాల మధ్య ఎగుమతులు, దిగుమతుల విలువ సమానంగా ఉంటే, మారకాల సమస్య, ఎకౌంట్లు చూసుకునే సాంకేతిక సమస్య మాత్రమే. కానీ, 2 దేశాల మధ్య ఎగుమతులూ దిగుమతులూ సమానంగా వుండడం ఎప్పుడో గానీ జరగదు. ఇటీవల తరచుగా వినిపిస్తున్న ఒక వార్త: ‘డాలరుతో మారకంలో రూపాయి విలువ పడి పోతోంది’–అని. రూపాయి ‘మారకం విలువ రేటు’లో మార్పునకి కారణాన్ని తెలుసుకోవా లంటే, ‘మారకం’ అంటే ఏమిటో, ‘మారకం విలువ’ అంటే ఏమిటో ముందు తెలియాలి. సరుకుల ‘మారకం’ అంటే, ఒక వ్యక్తిగానీ, ఒక దేశంగానీ, ఒక సరుకుని బైటికి ఇచ్చి, ఇంకో సరుకుని బైటినించీ తీసుకోవడమే. సరుకుకి ‘మారకం విలువ’ అంటే, ఆ సరుకుని తయారు చేయడానికి పట్టిన శ్రమ కాలమే. ఎక్కువ శ్రమ జరిగితే ఎక్కువ విలువ, తక్కువ శ్రమకి తక్కువ విలువ. ఏ సరుకుని తయారు చేయడానికైనా, మొదట ప్రకృతిలో దొరికే సహజ పదార్థం ఏదో ఒకటి వుండాలి. ప్రకృతి సహజ పదార్థం మీద శ్రమ జరిగితే, ఏదో ఒక వస్తువు తయారవుతుంది. ఆ వస్తువుని అమ్మకానికి పెడితే, అదే ‘సరుకు’. ఒక సరుకు తయారు కావడానికి జరిగిన శ్రమని కొలవడానికి వున్న సాధనం అది జరిగిన ‘కాలమే’. గంటలో, రోజులో, నెలలో, సంవత్సరాలో! సరుకుని, మారకం కోసం ఇవ్వడం అంటే, దాన్ని అమ్మడమే. అప్పుడు ఆ సరుకు వల్ల ‘కొంత డబ్బు’ వస్తుంది. ‘డబ్బు’ అంటే, సరుకుని తయారుచేసిన శ్రమ కాలమే– అని గ్రహించాలి. డబ్బుకి వెనక, ఆధారంగా వుండేది బంగారం అనే లోహం! బంగారం కూడా ఇతర సరుకుల లాగే, మొదట గనుల్లో దొరికే సహజ పదార్థం తోటీ, దానిమీద జరిగే శ్రమల తోటీ తయారవుతుంది. మారకం విలువ రేటునీ, తర్వాత ఆ రేటులో మార్పునీ తెలుసుకోవడానికి, మొదట ఇంత వరకూ చూసిన విషయాలు చాలు. 2 దేశాల డబ్బుల మధ్య మారకం విలువ రేటు ఏర్పడడానికి ఆధారం – ఆ 2 దేశాల డబ్బుకీ వెనక వుండే కొంత కొంత బరువుగల బంగారాలే. డాలర్ దేశపు డబ్బు వెనక 4 గ్రాముల బంగారం వుందనీ, రూపాయి దేశపు డబ్బు వెనక 2 గ్రాముల బంగారం వుందనీ అనుకుందాం. అప్పుడు ఒక డాలరు= 2 రూపాయలు అవుతుంది. ఇది, ఆ రెండు దేశాల డబ్బులకు వున్న మారకం విలువ రేటు. ఇది, ఆ దేశాల డబ్బు వెనక వున్న బంగారాల కొలతల్ని బట్టే! ఈ కొలతలు మారడానికి, వేరే వేరే కారణాలు కూడా వుండొచ్చు. 2వ ప్రపంచ యుద్ధకాలం తర్వాత, డాలర్ దేశంలో (అమె రికాలో), ఆర్థిక పరిస్థితులు ఇతర దేశాలలో కన్నా ‘అభివృద్ధి’ చెంది వున్నాయి. ముఖ్యంగా, ఆ నాడు ఏ దేశంలోనూ లేనన్ని బంగారు నిల్వలు డాలరు దేశంలో వున్నాయి. దానివల్ల, డాలరు దేశపు ఆధిక్యం పెరిగింది. అప్పట్నించీ ‘అంతర్జాతీయ ధనం’గా డాలరుని దాదాపు అన్ని దేశాలూ అంగీకరిస్తూనే వున్నాయి. వేరు వేరు దేశాల మధ్య ఎగుమతులతో, దిగుమతులతో ‘విదేశీ వర్తకాలు’ జరుగుతూ వుంటాయి. ఒక దేశం ఇంకో దేశానికి కొంత డబ్బు ఇవ్వవలిసి వస్తే, ఆ డబ్బు లెక్కని, ఆ 2 దేశాల డబ్బులకూ వున్న మారకం రేటు ప్రకారమే లెక్క చూడాలి. ఒక దేశం నించి, ఆ రెండో దేశం డబ్బుకి ఎన్ని డాలర్లు వస్తాయో కూడా లెక్క చూసి, ఆ డబ్బుని డాలర్లలోనే చెల్లించాలి. ఇప్పుడు అసలు ప్రశ్న, ఒక దేశపు కరెన్సీ మారకం విలువ రేటు ఎందుకు తగ్గుతుంది? దేశాల మధ్య ఎగుమతుల విలువలూ, దిగుమతుల విలువలూ సమానంగా వుంటే, వేరు వేరు దేశాల డబ్బు మారకాల సమస్య, కేవలం ఎకౌంట్లు చూసుకునే సాంకేతిక సమస్యగా మాత్రమే వుంటుంది. కానీ, 2 దేశాల మధ్య ఎగుమతులూ దిగు మతులూ సమానంగా వుండడం ఎప్పుడో గానీ జరగదు. భారత దేశం ఏ దేశానికి చెల్లించవలిసి వచ్చినా, సాధారణంగా డాలర్లలోనే చెల్లించాలి కాబట్టి, అప్పుడు భారత దేశానికి డాలర్లు అవసరం. ఆ డాలర్లు ఎంత మొత్తంలో కావాలీ – అనేది, భారత దేశం ఇతర దేశాలకు చేసిన ఎగుమతుల, దిగుమతుల విలువ ఎంతా– అనే లెక్క (కరెంట్ ఎకౌంటు) మీద ఆధార పడి వుంటుంది. గత కొంత కాలంగా, భారత దేశానికి దిగుమతుల కోసం (ఉదాహరణకి: క్రూడ్ ఆయిల్ కోసం) అయ్యే ఖర్చు ఎక్కువగా వుండడం వల్ల, భారత దేశం ఇతర దేశాల దిగుమతుల కోసం చెల్లించేదాన్ని ఎక్కువ డాలర్లలోనే చెల్లించాలి. కాబట్టి డాలర్లని కొనడం కోసం డాలర్లు అమ్మే కరెన్సీ మార్కెట్‌కి వెళ్ళాలి. డాలరు అనేది, బియ్యం లాంటి వాడకం సరుకు కాకపోయినప్పటికీ, అది కరెన్సీలను అమ్మే, కొనే మార్కెట్లో ఒక సరుకుగా అయింది. ఏ సరుకుకి అయినా, దాని సప్లై తక్కువగా వుంటే, అది దొరకడం కష్టం కాబట్టి దాని కోసం డిమాండ్ పెరిగి, దాని ధర పెరుగుతుంది. అలాగే, డాలర్లని కొనవలిసిన పరిస్థితిలో, దాని ధర తగ్గడమో, పెరగడమో జరుగుతుంది. ఈ దశలో, ఏ దేశం అయినా, ఇతర దేశాలకు చెల్లించవలిసిన దిగుమతుల డబ్బుని డాలర్లలోనే చెల్లించాలి కాబట్టి, డాలర్లకి డిమాండు ఎక్కువగా వుంటుంది. అప్పుడు డాలర్లని ఎక్కువ ధరలతో కొనాలి. అలాంట ప్పుడు ఒక డాలర్‌కి, గతంలో కంటే ఎక్కువ రూపాయిలు ఇచ్చి కొన వలిసి వస్తుంది. ఉదాహరణకి, డాలరు ధర పెరుగుతూ, పెరుగుతూ, కిందటి నెలలో 70 రూపాయిలు అయింది. ఆ ధర ఇప్పుడు 80 కూడా దాటేసింది. పత్రికల్లో, ‘‘డాలరు మిలమిల, రూపాయి వెల వెల!’’ అనే హెడ్డింగులు కనిపిస్తున్నాయి. అంటే, రూపాయి విలువ తగ్గుతూ, తగ్గుతూ పోతోంది. అంటే, డాలరుని ప్రతీసారీ ఎక్కువ రూపా యలతో కొనవలిసి వస్తోంది. అలా కొన్న డాలర్లని, దిగుమతుల చెల్లింపుల కోసం ఇవ్వాలి. రూపాయి దేశం, డాలర్ల కోసం, వేల వేల రూపాయల్ని ఖర్చు పెట్టెయ్యవలిసి వస్తుంది. (రూపాయి మారకం విలువ తగ్గిన ఈ సమస్య ఈ దేశంలోనే సరుకుల్ని కొనడానికి వర్తిస్తుందా? దీన్ని ఇక్కడ వివరించలేము.) ఈ సమస్యకు పరిష్కారం, వీలైనంత వరకూ ప్రతీ దేశమూ, తన దగ్గిరవున్న వనరులతో, కావలిసిన వస్తువుల్ని సొంతంగా తయారు చేసుకోవడమే! తప్పనిసరి వాటికోసం మాత్రమే వేరే దేశాల దిగుమతుల మీద ఆధారపడొచ్చు. కానీ, లాభాల కోసం పోటీపడే పెట్టుబడిదారీ విధానంలో, అది సాధ్యం కాదు. ఎందుకంటే, పెట్టు బడిదారుల మధ్య, ‘దేశంలో ఎన్ని సరుకుల్ని అమ్మగలం? విదేశాలకు ఎన్ని సరుకుల్ని అమ్మగలం?’ అనే ఒక సమష్టి ప్లానింగు వుండదు. సమష్టి ప్లానింగు వుండని చోట ఎగుమతులూ, దిగుమతులూ సమానంగా వుండవు. అలా వుండనప్పుడు మారకం రేట్లు కూడా స్థిరంగా వుండవు. రంగనాయకమ్మ వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి -
ములాయం ప్రాభవం కొనసాగేనా?
యాదవుల పార్టీగా మొదలైన సమాజ్ వాదీని మొత్తం ఓబీసీల బలానికి సంకేతంగా ములాయం సింగ్ యాదవ్ మార్చివేశారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీని సవాలు చేయగలిగిన ఏకైక పార్టీగా సమాజ్ వాదీ రంగం మీద ఉందంటే దానికి దశాబ్దాలపాటు ములాయం సిద్ధపర్చిన పునాదే కారణం. మూలాలను అంటిపెట్టుకోవడం, గ్రామస్థాయి కార్యకర్తలు ప్రతి ఒక్కరితోనూ సంబంధాలు నెరపడం, తనకు మద్దతు పలికిన వారికి సహాయం చేయడంలో ములాయం చూపించిన శ్రద్ధ దీనికి కారణం. ములాయం అనంతర సమాజ్ వాదీలో ఈ గుణాలు కొరవడుతున్నందున యాదవులు వేరే రాజకీయ వేదికలను వెతుక్కునే వీలు ఏర్పడుతోంది. అదే జరిగితే సమాజ్‌వాదీ పార్టీపై ములాయం ప్రభావం, ప్రాభవం ముగిసిపోతాయి. భారతదేశంలో 1970ల అనంతరం సోషలిస్టు ఉద్యమానికి సంబంధించి అత్యంత సుపరిచితుడైన నేత ములాయం సింగ్ యాదవ్. ఆయన అస్తమ యంతో భారత రాజకీయాల్లో ఒక గొప్ప శకం ముగిసిపోయింది. ములాయం 1950లలో స్కూల్ టీచర్‌గా పని చేశారు. 1967లో తొలుత ఉత్తరప్రదేశ్ శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అది కాంగ్రెస్ పార్టీ తన అగ్రకుల (ప్రధానంగా బ్రాహ్మణుల) పునాదితో ఉత్తరప్రదేశ్ రాజకీయాలను శాసిస్తున్న కాలం. 1974లో జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమ ప్రధాన ప్రతిరూపంగా ములాయం ఆవిర్భవిం చారు. కాలం గడిచేకొద్దీ యాదవ కుల నేతగా, దాని పొడిగింపుగా వెనుకబడిన కులాల నేతగా ములాయం తన స్థానాన్ని బలోపేతం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో, తక్కిన దేశంలో కూడా చాలా విషయా లకు ఆయన గుర్తుండిపోతారు. కానీ ఆయన ప్రధాన విజయం, యూపీ రాజకీయాల్లో యాదవ ఆధిపత్యాన్ని సంఘటిత పర్చడమే. కాంగ్రెస్ పార్టీకి ఇది తెలిసి ఉండదని చెప్పలేము. ఎందుకంటే అత్యంత ఆధిపత్యం, దూకుడుతనం, రాజకీయ జాగరూకతతో కూడిన యాదవ కుల ప్రాధాన్యతను ఆ పార్టీ గుర్తించింది. అనేకమంది నాయకుల పూర్వ వైభవం దీనికి సాక్షీభూతంగా నిలుస్తుంది. వీరిలో మొదటివారు చంద్రజిత్ యాదవ్. ఈయన 1967లో, 1971లో లోక్‌సభలో అజాంగఢ్ ఎంపీగా వ్యవహరించారు. ఇందిరా గాంధీ మంత్రివర్గంలో ఉక్కు, గనుల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. కాంగ్రెస్‌లో ఉంటూ తన ప్రాధాన్యతను నిరూపించుకోవడానికి గట్టిగా ప్రయత్నించిన మరొక యాదవ నేత బలరాం సింగ్ యాదవ్. ఎమ్మెల్యేగా, యూపీ మంత్రిగా, ఎంపీగా, ఏఐసీసీ సభ్యుడిగా, కేంద్ర ఉక్కు, గనుల శాఖా మంత్రిగా చాలాకాలం ఈయన కాంగ్రెస్‌లోనే కొనసాగారు. కాంగ్రెస్‌తో 38 సంవత్సరాల అనుబంధం తెగదెంపులు చేసుకుని 1997లో పార్టీని వదిలిపెట్టేశారు. ములాయంకు అపరిమితా నందం కలిగిస్తూ సమాజ్‌వాదీ పార్టీలో చేరిపోయారు. 1977 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం చెందాక యూపీలో యాదవ సామాజిక వర్గం బలం మరింత పెరిగింది. దీనితో కొత్తగా ఏర్పడిన జనతా పార్టీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా రామ్ నరేశ్ యాదవ్‌ను ఎంపిక చేసుకోవలసి వచ్చింది. అయితే ఈయన రాజకీయంగా దుర్బలుడు కావడంతో ములాయం ప్రభ ముందు వీగిపోయారు. ప్రధానంగా పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో యాదవ కుటుంబాలను ఏకం చేయడంలో ములాయం అవిశ్రాంతంగా కృషి చేశారు. రాష్ట్రంలోని తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లోని యాదవుల మధ్య పెద్దగా సామాజిక, సాంస్కృతిక సంబంధాలు ఉండేవి కావు. ఈ రెండు ప్రాంతాల్లో గ్రూపులుగా విడిపోయి ఉండటం కంటే రాష్ట్ర వ్యాప్తంగా యాదవులు బలం పెంచుకోవలసిన అవసరం ఉందని నచ్చజెప్పడంలో కూడా ములాయం విజయం సాధించారు. ములాయంపై ప్రజా విశ్వాసం ఎంతగా పెరిగిందంటే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పదిసార్లు గెలుపొందుతూ వచ్చారు. అలాగే ఏడుసార్లు లోక్‌సభ ఎన్నికల్లో గెలిచారు. ఈ కాలం పొడవునా, ఆయన తన సమీప, దూరపు కుటుంబ సభ్యులను తాలూకా, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాజకీయాల్లోకి చేరేలా సిద్ధం చేస్తూ వచ్చారు. ఒక సమయంలో ఇలా రాజకీయాల్లో చేరిన ఆయన బంధువుల సంఖ్య మూడు డజన్లకు మించి ఉండేదని చెప్పుకొనేవారు. క్షేత్రస్థాయి రాజకీయాల్లోనూ, తన ఓటు పునాదిని బలోపేతం చేసుకోవడంలోనూ ములాయం అంకిత భావానికి ఇది కొలమానంగా చెప్పవచ్చు. అదే సమయంలో బిహార్‌లో జేపీ ఉద్యమం నుంచి లాలూ ప్రసాద్ యాదవ్, రామ్ విలాస్ పాశ్వాన్, కర్పూరీ ఠాకూర్, నితీశ్ కుమార్ వంటి పలువురు నేతలు పుట్టుకురాగా, ఉత్తరప్రదేశ్‌లో మాత్రం ములాయం ఏకైక నేతగా ఆవిర్భవించారు. జనతా, జనతాదళ్, లోక్ దళ్ ఎక్కడున్నా సరే... యాదవ నేతలు ఆయన వెన్నంటే నిలిచేవారు. పొత్తులు పెట్టుకోవడంలో, వాటిని విచ్ఛిన్నపర్చడంలో ములాయం సత్తాను ఇతర నేతలందరూ ఆమోదించాల్సి వచ్చింది. కాంగ్రెస్, జనతాదళ్, భారతీయ జనతాపార్టీ, వామపక్షాలు, బహుజన్ సమాజ్ పార్టీ వంటి అన్నిపార్టీలలో తనకు ప్రయోజనం కోరుకున్న ప్రతి సందర్భంలోనూ ములాయం ఈ శక్తిని ఉపయోగించుకున్నారు. ఈ క్రమంలోనే ములాయం మూడుసార్లు యూపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1989లో బీజేపీతో పొత్తు కలిపి యూపీలో ప్రభుత్వాన్ని ఏర్పర్చడం ములాయం రాజకీయ దురంధరత్వానికి మచ్చుతునక. తర్వాత 1991 నుంచి రామాలయ ఉద్యమాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. బీఎస్పీతో పొత్తుతో 1993లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పర్చారు. ఆ తర్వాత బీఎస్పీ అధినేత్రి మాయావతితో దశాబ్దాలపాటు వ్యక్తిగత స్థాయిలో బద్ధ శత్రుత్వం కొనసాగింది. తర్వాత కాంగ్రెస్ మద్దతుతో 2003లో ప్రభుత్వం ఏర్పర్చారు. ఆ వెనువెంటనే విదేశీ మూలాలున్న వ్యక్తి ప్రధాని కాకూడదనే దృక్ప థంతో సోనియాగాంధీ అభ్యర్థిత్వాన్నే అడ్డుకున్నారు. రాజకీయంగా ములాయం వేసిన కుప్పిగంతులను మల్లయుద్ధ విన్యాసాలుగా పేర్కొనేవారు. ఈ కుప్పిగంతులు యూపీ రాజకీయాల్లో కీలకమైన రాజకీయశక్తిగా నిలబెట్టడంలో ములాయంకు ఎల్లవేళలా తోడ్పడ్డాయి. ముస్లిం–యాదవ సమ్మేళనంతో ఎన్నికల్లో గెలుపొందడంపై ఆరోపణలను ఎదుర్కొన్నారు. కానీ మైనారిటీలను బుజ్జగిస్తున్నారని వచ్చిన ఆరోపణలు ములాయంకు ఎన్నడూ హాని చేకూర్చలేదు. 1990లలో యూపీలో పోలీసు, పురపాలన యంత్రాంగంలో యాదవుల ఆధిపత్యాన్ని పెంచి పోషించారని వచ్చిన ఆరోపణలు కూడా రాజకీయంగా దెబ్బతీయలేక పోయాయి. ఈ అన్ని ఆరోపణలూ వాస్తవానికి ములాయం స్థాయిని అజేయశక్తిగా పెంచాయి. దీనివల్ల ఆయన ప్రాభవం ఉత్తరప్రదేశ్‌ను దాటి ఆయన పార్టీని జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర నిర్వహించే వరకు తీసుకుపోయింది. అయితే, 2012లో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి పదవిని తనయుడు అఖిలేశ్ యాదవ్‌కు కట్టబెట్టాలని ములాయం తీసుకున్న నిర్ణయం ఆయన రాజకీయ నిర్ణయాలపై ప్రజా విశ్వాసాన్ని దెబ్బతీసింది. పార్టీలోని శక్తి కేంద్రాల మధ్య కీలుబొమ్మలా ఉంటున్నారని వ్యాపించిన పుకార్ల మధ్యనే 2012 నుంచి 2017 వరకు అఖిలేశ్ యూపీని పాలించారు. దీనివల్ల అటు పార్టీలోనూ, ఇటు కుటుంబంలోనూ పతనం మొదలైంది. ఈ నేప థ్యంలో ములాయం యూపీ వ్యవహారాల నుంచి మరింతగా దూరం జరిగారు. అదే సమయంలో అఖిలేశ్ ప్రాభవం పెరిగింది. అప్పటి నుంచి ములాయం తన మునుపటి వ్యక్తిత్వానికి కేవలం ఒక ఛాయలా కొనసాగుతూ వచ్చారు. అలాంటి పరిస్థితిలోనూ లాలూ ప్రసాద్ యాదవ్‌తో, ప్రధాని మోదీతో సన్నిహితంగా మెలగడం ద్వారా ములాయం తన రాజకీయ నేర్పరితనాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీని సవాలు చేయగలిగిన ఏకైక పార్టీగా సమాజ్ వాదీ మాత్రమే రంగం మీద నిలబడగలిగిందంటే దానికి దశాబ్దాలపాటు ములాయం సిద్ధపర్చిన పునాదే కారణం. మూలా లను అంటిపెట్టుకోవడం, గ్రామస్థాయి కార్యకర్తలు ప్రతి ఒక్కరితో సంబంధాలు నెరపడం, తనకు మద్దతు పలికిన వారికి సహాయం చేయడంలో ములాయం చూపించిన శ్రద్ధ దీనికి కారణం. కేవలం యాదవుల పార్టీగా మొదలైన సమాజ్‌వాదీ పార్టీని మొత్తం ఓబీసీల బలానికి సంకేతంగా ములాయం మార్చి వేశారు. ములాయం అనంతర సమాజ్ వాదీ పార్టీలో ఈ గుణాలు కొరవడుతున్నందున, యాదవులు తమ రాజకీయ పలుకుబడిని మరెక్కడైనా చూపించుకునే వీలుంది. అదే జరిగిన పక్షంలో సమాజ్ వాదీ పార్టీపై ములాయం ప్రభావం, ప్రాభవం కచ్చితంగానే ముగిసి పోతాయి. రతన్ మణి లాల్ వ్యాసకర్త కాలమిస్టు, టీవీ కామెంటేటర్ (‘ద డైలీ గార్డియన్’ సౌజన్యంతో) -
ఎంత గాలి వీచేను?
తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు భారత్ రాష్ట్ర సమితిగా పేరు మార్చుకుని ప్రజల ముందుకొచ్చింది. సాంకేతికంగా ఎన్నికల సంఘం ఆమోదం రావాల్సి ఉన్నప్పటికీ, అదేమీ సమస్య కాకపోవచ్చు. దీనివల్ల ఎలాంటి రాజకీయ ప్రయోజనం కలుగుతుందన్న చర్చ వస్తుంది. కేసీఆర్ నిజానికి వచ్చే శాసనసభ ఎన్నికలలో విజయం సాధించిన తర్వాత జాతీయ పార్టీ ప్రతిపాదనపై ముందుకు వెళ్లవచ్చని చాలామంది ఊహించారు. అందుకు భిన్నంగా జాతీయ పార్టీగా టీఆర్ఎస్ను మార్చడం వల్ల శాసనసభ ఎన్నికలలో కూడా లబ్ధి చేకూరుతుందన్న అంచనాకు ఆయన వచ్చి ఉండాలి. తన కుమారుడు కేటీఆర్‌ను సీఎంను చేయడం కూడా ఇందులో ఒక లక్ష్యమంటారు. అయితే పార్టీ ప్రభావం ఏపీలో ఎంత ఉంటుందన్నది అనుమానమే! కేసీఆర్‌కు సెంటిమెంట్లు, నమ్మకాలు ఎక్కువే. ఎవరో తాంత్రికుడు చెప్పాడని పార్టీ పేరు మార్చారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరో పించారు. వాస్తు దోషం ఉందని సచివాలయాన్ని పడగొట్టి, కొత్త సచి వాలయం నిర్మిస్తున్నారు. ఇవన్నీ నమ్మకాల ఆధారంగా తీసుకున్న నిర్ణయాలా, కాదా? అన్నదానికి జవాబు చెప్పలేం. తెలంగాణ పేరుతో పార్టీ ఉంటే జాతీయ రాజకీయాలలో ఎంత క్రియాశీలకంగా ఉన్నా, కొన్ని పరిమితులు ఉంటాయి. ఒక రాష్ట్రం పేరుతో ఉన్న పార్టీని ఇతర రాష్ట్రాలలో విస్తరించడం సాధ్యపడదు. దానిని అధిగమించాలంటే పాన్ ఇండియా... అంటే దేశ వ్యాప్తంగా అందరూ ఆకర్షితులయ్యే విధంగా పార్టీ పేరు ఉండాలని ఆయన తలపెట్టారు. తదనుగుణంగా టీఆర్ఎస్ కాస్తా బీఆర్ఎస్గా మారిపోయింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అఖిల భారత స్థాయిలో పలువురు తెలుగు ప్రముఖులు రాజకీయాలలో తమ ప్రభావాన్ని చూపారు. వారిలో కొద్దిమంది జాతీయ పార్టీలకు అధ్యక్షులు అయ్యారు. నీలం సంజీవరెడ్డి, దామోదరం సంజీవయ్య, కాసు బ్రహ్మానందరెడ్డి, పీవీ నరసింహారావు ఏఐసీసీ అధ్యక్షులుగా ఎన్నికకాగా, వెంకయ్య నాయుడు బీజేపీ అధ్యక్ష పదవిని అలంకరించారు. సినీనటుడు, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్.టి.రామారావు కూడా జాతీయ పార్టీని స్థాపిం చాలని గట్టి ప్రయత్నాలే చేశారు. తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు వారికే పరిమితం అవుతుంది కనుక భారతదేశం పేరుతో మరో పార్టీ పెట్టాలనుకున్నారు. ఆచరణలో చేయలేక పోయారు. కానీ జాతీయ స్థాయిలో వివిధ పార్టీలను కలిపి నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు కావడంలో ముఖ్య భూమిక పోషించారు. ఆ ఫ్రంట్‌కు ఆయనే ఛైర్మన్‌గా ఉండే వారు. ఎంత ఛైర్మన్ అయినా, 1989లో ఆయన అధికారం కోల్పో వడంతో ప్రధాని రేసులో నుంచి తప్పుకోవలసి వచ్చింది. ఎన్టీఆర్ అభిమానిగా తెలుగుదేశంలో చేరి, తదనంతర కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నేతగా, రెండు టరమ్లు విజయం సాధించి ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తిగా కేసీఆర్ దేశస్థాయిలో ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే టీఆర్ఎస్ పేరు మార్పు వల్ల ఇంతవరకూ ఆ పేరుకు ఉన్న బ్రాండ్ ఇమేజీ దెబ్బతినే అవకాశం ఉందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఒక్క పదం తప్ప మిగిలిన దంతా యథాతథంగా ఉంటుందనీ, పార్టీ రంగు, గుర్తు ఏవీ మారవు కాబట్టి ప్రజలు తేలికగానే అడ్జస్టు అవుతారనీ బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కాకపోతే పార్టీ జెండాలో తెలంగాణ మ్యాప్ బదులు భారతదేశ మ్యాప్ ఉంచాలి. జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్‌లను ఈ కొత్త జాతీయ పార్టీ ఎదుర్కోగలదా అంటే అప్పుడే సాధ్యం కాదని చెప్పక తప్పదు. తెలంగాణ రాష్ట్ర సాధనకు కేసీఆర్ ఒంటరిగానే ప్రయాణం ఆరం భించి, తన పోరాటం, వ్యూహాలతో లక్ష్యాన్ని సాధించారనీ, ఇప్పుడు కూడా భారత్ రాష్ట్ర సమితిని విజయపథంలో నడిపిస్తారనీ టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. వాదన వినడానికి బాగానే ఉన్నా, ఆయా రాష్ట్రాలలో తనకు కలిసి వచ్చే శక్తులు, వ్యక్తులను గుర్తించి ముందుకు వెళ్లడం అంత తేలిక కాదు. కర్ణాటకలో జేడీఎస్‌తో కలిసి బీఆర్ఎస్ పోటీ చేస్తుందనీ, ఈ కూటమి అధికారంలోకి వస్తుందనీ కేసీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. 224 సీట్లు ఉన్న కర్ణాటక అసెంబ్లీలో జేడీఎస్‌కు 35 సీట్లే ఉన్నాయి. వారి బలమే అంతంతమాత్రంగా ఉన్నప్పుడు వారి పొత్తు బీఆర్ఎస్కు ఎంత మేర ఉపయోగపడు తుందన్నది ప్రశ్నార్థకం. అందువల్లే కర్ణాటక శాసనసభ ఎన్నికలలో బీఆర్ఎస్తో పొత్తు ఉండదని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి స్పష్టం చేశారు. ఒకప్పటి హైదరాబాద్ రాష్ట్ర పరిధి కర్ణాటకలోని కొన్ని జిల్లాలు, మహారాష్ట్రలోని కొన్ని జిల్లాల్లో కేసీఆర్ ప్రభావం ఉండవచ్చని కొందరు చెబుతున్నారు. ఈ రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉండే కొన్ని గ్రామాలవారు తెలంగాణ ప్రభుత్వ స్కీములకు ఆకర్షితు లవుతున్నారని కథనం. కాంగ్రెస్, జేడీఎస్‌లతో పాటు బీఆర్ఎస్ కలిస్తే కేసీఆర్‌కు రాజకీయంగా ప్రయోజనం ఉంటుంది. కానీ కాంగ్రెస్‌తో జత కడతామని ఇప్పటికిప్పుడు చెప్పలేని స్థితిలో కేసీఆర్ ఉన్నారు. అదే సమయంలో తోటి తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పుడు రంగంలోకి దిగేది కేసీఆర్ నేరుగా చెప్పలేదు. ఆయన మంత్రివర్గ సహచరులు ఎర్రబెల్లి దయాకరరావు వంటివారు మాత్రం సంక్రాంతికి విజయవాడ, గుంటురులలో కేసీఆర్ భారీ బహిరంగ సభ ఉండ వచ్చని చెప్పారు. పలువురు ఏపీ నేతలు తమతో టచ్‌లో ఉన్నారని కూడా వారు అంటున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన ఒక ప్రముఖ టీడీపీ నేత, ఆయన సోదరుడి పేరు వినవస్తోంది. కానీ ధ్రువీకరణ కాలేదు. ఇదే సమయంలో బీజేపీ తెలంగాణ, ఏపీ నేతలు గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రావారిని ఉద్దేశించి కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారనీ, ఆంధ్రలో ఏమని ప్రచారం చేస్తారనీ ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రావారి సంస్కృతి, ఆహారపు అలవాట్లు, భాషను ఎద్దేవా చేస్తూ మాట్లాడారని వారు గుర్తు చేస్తున్నారు. కృష్ణానదీ జలాల వివాదం, ఆస్తుల విభజన మొదలైన సమస్యలు ఉండగా, ఏపీలో కేసీఆర్ ఏం చెబుతారని అడుగుతున్నారు. ఏపీలో అధికార వైసీపీతో గానీ, ముఖ్యమంత్రి జగన్‌తో గానీ ఇంతవరకూ వ్యక్తిగత విభేదాలు లేవు. కానీ ఈ మధ్యకాలంలో విధాన పరమైన విషయాలలో తేడాలు వచ్చాయి. దానికితోడు కొందరు తెలంగాణ మంత్రులు ఆంధ్ర ప్రభుత్వాన్ని విమర్శించడం, దానిపై ఏపీ మంత్రులు రియాక్ట్ కావడం వంటివి జరిగాయి. అయినా కేసీఆర్ ఆంధ్రలో బీఆర్ఎస్ స్థాపించవచ్చు. టీడీపీ వారే ఎక్కువగా చేరే అవకాశం ఉందని అంచనా. గతంలో కేసీఆర్ తెలుగుదేశంలో ప్రము ఖుడిగా ఉండి పలువురితో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. ఆ పరిచ యాలు పనిచేస్తే హైదరాబాద్ ఆర్థిక ప్రయోజనాలతో ముడిపడి ఉన్న కొంతమంది చేరవచ్చు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో గానీ, టీడీపీ అధినేత చంద్రబాబుతో గానీ కలిసి బీఆర్ఎస్ పనిచేసే అవ కాశం ఉందా అన్న దానిపై ఊహాగానాలు ఉన్నా, అవి తేలికగా సాధ్య పడేవి కావు. పైగా సెంటిమెంట్‌తో ముడిపడి ఉన్న రాజకీ యాలు అన్న సంగతి మర్చిపోకూడదు. చంద్రబాబు ఎలాంటి వ్యాఖ్య చేయ కుండా నవ్వి ఊరుకున్నారంటే అందులో చాలా అర్థాలు ఉండవచ్చు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ఉద్దేశించి డర్టియస్ట్ పొలిటీషి యన్ అంటూ కేసీఆర్ చేసిన విమర్శల వల్ల వీరి మధ్య బంధం ఏర్పడకపోవచ్చు. అయితే వైసీపీ వారు తమకు బీఆర్ఎస్ వల్ల ఎలాంటి సమస్యా ఉండదని స్పష్టం చేశారు. తమిళనాడుకు చెందిన తిరుమావళవన్ పొత్తు పెట్టుకున్నా, ఆ రాష్ట్రంలో బీఆర్ఎస్ పుంజుకోవడం కష్టసాధ్యం. ఇప్పటికే దేశంలో పలు జాతీయ పార్టీలు ఒకటి, రెండు రాష్ట్రాలకే పరిమితమై ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభజన తర్వాత జాతీయ పార్టీ అని చెప్పు కొన్నప్పటికీ, తన కార్యక్షేత్రం విభజిత ఏపీకే పరిమితం అయింది. ఎస్పీ, బీఎస్పీ, ఎన్సీపీ, తృణమూల్ కాంగ్రెస్, జేడీయూ, ఆర్జేడీ వంటివి జాతీయ పార్టీలు అని చెప్పుకొంటున్నా, వాస్తవానికి అవి తమకు ప్రాబల్యం ఉన్న రాష్ట్రాలలోనే ప్రభావం చూపగలుగు తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం ఢిల్లీ నుంచి పంజాబ్‌కు విస్తరించి అధికారం సాధించింది. ఇప్పుడు పేరు, స్వరూపం మార్చుకుని ఏర్పడ్డ బీఆర్ఎస్ దేశం అంతటా వ్యాపించగలిగితే గొప్ప విషయమే అవుతుంది. ప్రధాని మోదీ పైనా, భారతీయ జనతా పార్టీ పైనా కేసీఆర్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తమ కుటుంబ అవినీతి బయట పడకుండా, సీబీఐ, ఈడీ కేసులు వస్తాయేమోనన్న భయంతోనే ఈ కొత్త ఆలోచన చేశారని బీజేపీ వ్యాఖ్యానిస్తోంది. ఏది ఏమైనా ఒక తెలుగునేతగా కేసీఆర్ చేస్తున్న సాహసాన్ని అభినందించవచ్చు. కాక పోతే అది దుస్సాహసంగా మారకుండా ఉంటేనే ఆయనకూ, ఆ పార్టీకీ మేలు జరుగుతుంది. కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
‘భావజాల’ విముక్తే ప్రత్యామ్నాయానికి దారి
భారతదేశం ఈనాడు అంబేడ్కర్ మార్గంలో నడవాలా? గాంధీ మార్గంలో నడవాలా? అనే పెద్ద ప్రశ్న దేశంలోని పార్టీల ముందు ఉంది. భారత దేశంలో ఈనాడు రాజకీయ కూటములు ఎక్కువ ఏర్పడు తున్నాయి. బీజేపీ కూటమి గాంధీ, సర్దార్ వల్లభాయి పటేల్ భావజాలాల్లో నడుస్తోంది. కాంగ్రెస్ కూటమి గాంధీ, నెహ్రూ భావజాలాల్లో నడుస్తున్నది. కేసీఆర్, నితీష్ కుమార్, మమతా బెనర్జీ, శరద్ పవార్ వంటి వారితో ఏర్పడుతుందని చెబుతున్న మూడవ కూటమి ఇంకా తన భావజాలాన్ని ప్రస్పుటం చేయలేదు. కానీ భారతదేశంలో సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాలలో మౌలికమైన మార్పు రావాలంటే తప్పకుండా అంబేడ్కర్ భావజాలమే ఈనాడు భారతదేశానికి అవసరం. బీజేపీ పైకి గాంధీ పేరు చెప్తున్నా అది హిందూ మతోన్మాద భావజాలాన్ని ఆర్ఎస్ఎస్ మార్గంలో నడుపుతోంది. హిందూ మతోన్మాదాన్ని భారతదేశంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సరిగ్గా అంచనా వేశారు. హిందూ మతాన్ని నిర్మూలించకుండా భారతీయ సామాజిక విప్లవం విజయవంతం కాదనీ, హిందూ మతోన్మాదం ప్రమాదకరమైనదనీ అంబేడ్కర్ నొక్కి వక్కాణించాడు. భారత సామాజిక విప్లవాన్ని ముందుకు తీసుకుపోయిన బౌద్ధ ఉద్యమంలోని మాన వతా వాదాన్ని ఆయన పరివ్యాప్తం చేశాడు. కమ్యూని స్టులు ప్రాచీన భారత సామాజిక ఉద్యమకారులను, ఆధునిక సామాజిక ఉద్యమకారులైన మహాత్మాఫూలే, అంబేడ్కర్, పెరియార్ వంటి వారినీ; వారి సిద్ధాంతా లనూ నిర్లక్ష్యం చేశారు. దాని ఫలితంగా భారతదేశంలో ఈనాడు మతోన్మాదం తెట్టెం కట్టుకుపోయింది. మతోన్మాదులు, సామ్రాజ్యవాదుల అండ తీసుకొని మరింతగా బలపడటం ప్రారంభించారు. ఇక దీనికి రాజ్య వ్యవస్థ తోడైందంటే ఎంత ప్రమాదమో చూడండి! అంబేడ్కర్ విషయానికి వస్తే... మొదటి నుండి ఆర్ఎస్ఎస్ భావజాలానికి ప్రత్యామ్నా యంగా... భారతదేశంలో సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, విద్యా, తాత్విక రంగాలలో ప్రామాణికమైన కాంగ్రెస్ నాయకులు మహాత్మాగాంధీ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూలను ఎదిరిస్తూ వచ్చాడు. తన ‘వాట్ కాంగ్రెస్ అండ్ గాంధీ హావ్ డన్ టు ది అన్‌టచ్‌బుల్స్’ అనే గ్రంథంలో కాంగ్రెస్ నాయకుల నిజ స్వరూపాన్ని బయటపెట్టాడు. నిజానికి కాంగ్రెస్‌లో అంత ర్గతంగా హిందూయిజం వుంది. బీజేపీ తమ సిద్ధాంతకర్తలుగా కాంగ్రెస్ నాయకులను తలకెత్తు కోవడంలోని ఆంతర్యం అదే. అంబేడ్కర్ అసలు హిందూమతం అంటే ఏమిటి? హిందూ మత భావజాలంతో నడిచేవి అసలు పార్టీలు అవుతాయా? అని ప్రశ్నించాడు. నిషేధాల శిక్షాస్మృతినే హిందూ మతంగా చలామణీ చేసి ప్రజల స్వేచ్ఛా స్వాతంత్య్రాలను హరించడం జరుగుతోందని అంబే డ్కర్ అన్నారు. ఒక వర్గానికి ఒక న్యాయం, మరొక వర్గానికి మరొక న్యాయం... వీటిలో ఎప్పటికీ మార్పు లేకుండా చేసి అన్యాయాన్ని శాశ్వతీకరించడం మరీ దురన్యాయం అన్నారాయన. లేని ‘హిందూ’ మతాన్నీ, వాదాన్నీ గాంధీ తలకెత్తుకున్నాడు. దానితో ముస్లిం లీగ్ విజృంభించింది. మతవాద రాజకీయాలు, స్వాతంత్య్ర ఉద్యమాలతోనే హిందూ రాజకీయ వాదం ప్రారం భమైంది. హిందూ శబ్దం వేదాల్లో లేదు. భారత, రామాయణ, భాగవత అష్టాదశ పురాణాల్లో లేదు. వైదిక మతం, బ్రాహ్మణమతం ఉన్నాయి కానీ హిందూ మతం లేదు. ఇప్పుడు బీజేపీ హిందూ మతోన్మాదాన్నీ, కాంగ్రెస్ హిందూ సాంప్రదాయ వాదాన్నీ ముందుకు తెస్తున్నాయి. ఇప్పటికే అంబేడ్కర్ హిందూ ప్రత్యా మ్నాయ రాజకీయ వ్యవస్థను రూపొందించారు. ఆయన కొత్త మ్యానిఫెస్టోలు ఎప్పటికప్పుడు రచిం చారు. అంబేడ్కర్ రాజకీయ ఉద్యమంలో బౌద్ధ తత్వ ప్రభావం వుంది. బౌద్ధ తాత్వికతలో వున్న సమసమాజ నిర్మాణ భావన ఆయనలో వ్యక్తమయ్యింది. అంబేడ్కర్ మానవతావాది. హేతువాది సామ్య వాది. ఆయన జాన్‌డ్యూయీ శిష్యుడు. జాన్‌డ్యూయి లోని ప్రజాస్వామ్య భావాలనూ, కారల్ మార్క్స్‌లోని సామ్యవాద భావాలనూ, కబీరులోని మానవతావాద భావాలనూ ఆయన రాజకీయాలతో సమన్వయిం చారు. ఆయన నిర్మించిన రాజకీయ పార్టీలో సామ్య వాద భావాలు నిండి వున్నాయి. మార్క్స్ భావజాలాన్ని కూడా ఆయన తన రాజకీయ ప్రణాళికలో చేర్చాడు. మార్క్సియన్ పద్ధతిలో కాకపోయినా, భారతీయ సామాజిక విప్లవకారుడిగా సమసమాజం కోరుతున్న అంబేడ్కర్ కుల నిర్మూలనా వాదం వర్గపోరాటానికి సజీవశక్తి అనడంలో అతిశయోక్తి లేదు. అంబేడ్కర్ కొన్ని అంశాల్లో మార్క్స్‌తో విభేదించాడు. కొన్ని అంశాల్లో అంగీకరించాడు. అంగీకరించిన ప్రధాన అంశం ‘సమ సమాజం’. అంగీకరించని అంశం సాధించే పద్ధతిలోనే బలప్రయోగం లక్ష్యం. ఇద్దరిదీ సమ సమాజమే. సాధించే పద్ధతిలోనే కొంత తేడా వుంది. ఇద్దరి సామా జిక తత్త్వవేత్తల వైరుద్ధ్యాలను, సమన్వయాలను పరి శీలించి భారత సామాజిక విప్లవానికి వారిరువురి సిద్ధాంతాలను ఉపయుక్తం చేసుకోవలసిన ‘సమ సామాజిక వాదులు’ ఆ చారిత్రక బాధ్యతను విస్మరిం చారు. కులవాదం మీద అంబేడ్కర్ విశ్లేషణలను మార్క్స్ మీద అంబేడ్కర్ చేసిన విశ్లేషణలుగా ప్రచారం చేసి అంబేడ్కర్‌ను మార్క్స్ వ్యతిరేకిగా చిత్రించడంలో హిందూ కమ్యూనిస్టులు కృతకృత్యులయ్యారు. అంబేడ్కర్, లోహియా, మార్క్స్‌ల భావజాలాల సమన్వయమే హిందూ భావజాల రాజకీయాలకు ప్రత్యామ్నాయం. దళిత బహుజన మైనార్టీ లౌకిక వాదులు ఈ మార్గంలో నడిస్తేనే భారతదేశానికి భావ జాల విముక్తి. భావజాల విముక్తి వల్లే రాజకీయాలకు ప్రత్యామ్నాయ యుగం ఆవిర్భవిస్తుంది. ఆ దిశగా పయనిద్దాం. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నేత మొబైల్: 98497 41695 -
విధాన చికిత్సతోనే ఆర్థికారోగ్యం
అంతర్జాతీయ విదేశీ మారక ద్రవ్య మార్కెట్లో రూపాయి వేగంగా పతనమవుతోంది. డాలర్‌ను కొనుగోలు చేయాలంటే మరిన్ని రూపాయలు వెచ్చించాలి. విలువ తగ్గిన కరెన్సీ వల్ల దిగుమతులు మరింత ఖర్చుతో కూడిన వ్యవహారంగా మారిపోతాయి. భారత్ తన ఇంధన అవసరాల్లో 85 శాతం దిగుమతుల ద్వారానే తీర్చుకుంటోంది. రూపాయి విలువ పతనం మన అంతర్జాతీయ వాణిజ్యాన్ని దెబ్బతీస్తుంది. ద్రవ్యోల్బణం మరింతగా పెరిగిపోతుంది. పరిశ్రమ లాభదాయికతను అడ్డుకుంటుంది. జీవన వ్యయాన్ని పెంచుతుంది. వీటన్నింటి కారణంగా విదేశీ రుణాలపై వడ్డీ చెల్లింపులు అధికమవుతాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తగ్గిపోతాయి. రిజర్వ్ బ్యాంక్ విధానపరమైన జోక్యం ద్వారా కేంద్రప్రభుత్వం రూపాయి పతనాన్ని అడ్డుకోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్‌తో పోలిస్తే భారతీయ రూపాయి మారక విలువ ఇటీవలి సంవత్సరాల్లో దిగజారిపోతూ వచ్చింది. దీంతో ఆర్థికవ్యవస్థ, అంతర్జాతీయ నగదు బదిలీలు ప్రభావితం అయ్యాయి. డాలర్‌తో పోలిస్తే భారతీయ కరెన్సీ సాపేక్షిక బలం ఈ సంవత్సరం 5.9 శాతానికి పడిపోయింది. దీంతో అంతర్జాతీయ విదేశీ మారక ద్రవ్య మార్కెట్లో రూపాయి బలం వేగంగా పతనమవుతూ వస్తోంది. అంటే డాలర్‌ను కొనుగోలు చేయాలంటే మరిన్ని రూపా యలు వెచ్చించాలన్నమాట. రూపాయి విలువ పతనమవుతున్నదంటే, స్థూల ఆర్థిక ప్రాథమిక సూత్రాల బలహీనతకు అది సంకేతం. స్థూల ఆర్థిక చరాంకాల్లో వడ్డీ రేటు, అంతర్జాతీయ వాణిజ్యం, ద్రవ్యోల్బణం, ప్రభుత్వ రుణం, నిరు ద్యోగిత, మదుపు అనేవి ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యానికి సూచికలు. ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ చాలినన్ని చర్యలు చేపట్టకపోవడం... రూపాయి పతనం సహా, స్థూల ఆర్థిక వ్యవస్థ ప్రాథమిక అంశాలు దిగ జారడాన్ని అనుమతించినట్టయింది. రూపాయి పతనమవుతున్న రేటు సమీప భవిష్యత్తులో భారతీయ ఆర్థిక వ్యవస్థ ప్రమాదాలను ఎదుర్కొనబోతోందన్న సంకేతాలను వెలువరిస్తోంది. మారకపు రేటు అస్థిరత్వం అంతర్జాతీయ, దేశీయ ఆర్థిక పరిణా మాలతో నేరుగా ప్రభావితం అవుతుంది. అంతర్జాతీయంగా చూస్తే, చుక్కలనంటిన చమురు ధరలు, చమురు దిగుమతులపై భారతదేశం అత్యధికంగా ఆధారపడటం అనేవి స్వేచ్ఛాయుతంగా చలించే మార కపు రేటు వ్యవస్థలో రూపాయి విలువను తీవ్రంగా ప్రభావితం చేశాయి. విలువ తగ్గిపోయిన భారతీయ కరెన్సీ వల్ల దిగుమతులు మరింత ఖర్చుతో కూడిన వ్యవహారంగా మారిపోయాయి. భారత్ తన ఇంధన అవసరాల్లో 85 శాతం మేరకు ముడి చమురు దిగుమతుల ద్వారానే తీర్చుకుంటోంది. ప్రపంచంలోనే చమురును అధికంగా దిగుమతి చేసుకుంటున్న మూడో దేశం భారత్. ఏటా 212.2 మిలియన్ టన్నుల ముడి చమురును భారత్ దిగుమతి చేసుకుంటోంది. 2021–22లో ఈ దిగు మతులు విలువ 119 బిలియన్ డాలర్లు. బ్రెంట్ ఆయిల్ ధర బ్యారెల్ 110 డాలర్లకు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు అమ్మ కాలు డాలర్లలోనే జరుగుతున్నాయి కనుక డాలర్‌కు డిమాండ్ కూడా పెరుగుతోంది. రూపాయి విలువ పడిపోవడం అనేది మన ఎగుమతు లకు సాయం చేసినప్పటికీ, దిగుమతులపై అధికంగా ఆధారపడటం కారణంగా భారత్ దెబ్బతింటోంది. దేశీయంగా చూస్తే, భారత్ ఇప్పటికే 9.6 బిలియన్ డాలర్లతో రికార్డు స్థాయిలో కరెంట్ అకౌంట్ లోటు సమస్యను ఎదుర్కొంటోంది. ఇది దేశ స్థూలదేశీయోత్పత్తిలో 1.3 శాతానికి సమానం. రూపాయి బలహీనపడుతుండటంతో కరెంట్ అకౌంట్ లోటు మరింతగా పెరగవచ్చు. పైగా, జీడీపీలో 6.4 శాతం అధిక ద్రవ్యలోటు వల్ల 2022–23 సంవత్సరంలో భారత విదేశీ రుణం రూ. 1,52,17,910 కోట్లకు పెరుగుతుందని అంచనా. దీంతో 9.41 లక్షల కోట్ల మేరకు అధిక వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. లేదా ఇది మొత్తం రెవెన్యూ వ్యయంలో 29 శాతం. రూపాయి విలువ పతనం కావడం అగ్నికి ఆజ్యం పోసినట్టు అవుతుంది. పైగా, ద్రవ్యోల్బణం అత్యధికంగా 7 శాతానికి చేరడం, విదేశీ సంస్థాగత మదుపుదారులు 2022లో 28.4 బిలియన్ డాలర్ల విదేశీ నిధులను ఉపసంహరించుకోవడం కూడా డాలర్ మారక రూపాయి క్షీణించడానికి దారి తీసింది. ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోవడం వల్ల తాము పెట్టిన పెట్టుబడులకు తక్కువ రాబడులు రావడం లేదా లాభ దాయకత తగ్గిపోవడంతో పెట్టుబడుల ఉపసంహరణ వేగం పుంజు కుంది. లాభాలను ఆశించడంతోపాటు, తాము పెట్టుబడులను పెట్టా లంటే స్థిరమైన, నిలకడైన స్థూల ఆర్థిక వ్యవస్థ ఉండాలని విదేశీ సంస్థాగత మదుపుదారులు కోరుకుంటారు. మరోవైపున రూపాయి కొనుగోలు శక్తి బలహీనపడటం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో దిగుమతుల ఖర్చులు అత్యధికంగా పెరిగి పోయాయి. అధిక ద్రవ్యోల్బణం రేటు రూపాయి విలువను దిగజార్చి వేసింది. అంటే జీవనవ్యయం పెరిగిపోయిందని అర్థం. దీని ఫలి తంగా ఉత్పత్తి ఖర్చులు, జీవన వ్యయం పెరిగి, పరిశ్రమలు, మదుపు దారులు లాభాలు సాధించే అవకాశం హరించుకుపోయింది. అంతర్జాతీయ విదేశీ మారక మార్కెట్లోని ‘హాట్ కరెన్సీ’తో పోలిస్తే ఒక దేశం కరెన్సీ విలువ పెరగడాన్ని బట్టే ఆ దేశ ఆర్థిక శక్తి నిర్ణయించబడుతుందని ఇది సూచిస్తుంది. 2025 నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల విలువైన ఆర్థికవ్యవస్థగా మారాలని భారత్ ఆకాంక్షిస్తోంది. కానీ ఇతర దేశాలతో సమానంగా భారత ఆర్థిక శక్తిని నిర్ణయించడంలో అంతర్జాతీయ విదేశీ మారక మార్కెట్ ముఖ్యపాత్ర వహిస్తుందని మరవరాదు. విధానపరమైన జోక్యం ద్వారా రూపాయి పతనాన్ని అడ్డుకోలేక పోయినట్లయితే ఆర్థిక సంక్షోభం మరింత ముదిరే ప్రమాదముంది. రూపాయి విలువ పతనం వల్ల చెల్లింపుల సమస్య మరింత దిగజారిపోతుంది, మన అంతర్జాతీయ వాణిజ్యాన్ని దెబ్బతీస్తుంది. ద్రవ్యోల్బణం మరింతగా పెరిగిపోతుంది. పరిశ్రమల లాభదాయిక తను అడ్డుకుంటుంది. జీవన వ్యయాన్ని పెంచుతుంది. విదేశాలకు వెళ్లే భారతీయులపై భారం పెరిగిపోతుంది. వీటన్నింటి కారణంగా విదేశీ రుణాలపై వడ్డీ చెల్లింపులు అధికమవుతాయి. నిరుద్యోగం అమాంతం పెరుగుతుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తగ్గిపోతాయి. రిజర్వ్ బ్యాంక్ సకాలంలో, కఠినమైన విధాన పరమైన జోక్యం చేసుకోవడం ద్వారానే డాలర్ మారక రూపాయి విలువ పతనాన్ని కేంద్రప్రభుత్వం అడ్డుకోవచ్చు. పెరిగిపోతున్న ఎక్స్చేంజ్ రేట్లను సమర్థంగా నిర్వహించడం ద్వారానే ఇది సాధ్యమవుతుంది. అంతకు మించి భారత్‌లో ద్రవ్యోల్బణాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. డీజిల్, పెట్రోల్ వంటి ఉత్పత్తులపై కేంద్ర ఎక్సైజ్ పన్నులు అధికంగా ఉన్నాయి. వీటిని కుదించాల్సిన అవసరం ఉంది. డాలర్ల రూపంలో విదేశీ మారకద్రవ్యాన్ని 49 బిలియన్ డాలర్ల వద్ద స్థిరపర్చడంలో, విదేశీ మారక ద్రవ్య నిల్వలను 600 బిలియన్ డాలర్ల వద్ద స్థిర పర్చడంలో ఆర్బీఐ సమర్థంగా పనిచేస్తోంది. విదేశీ మారక ద్రవ్య నిల్వల రూపంలో ఉంచిన డాలర్లను విడుదల చేయడం ద్వారా మన కరెన్సీ విలువను స్థిరపర్చడానికి ఆర్బీఐ జోక్యం తోడ్పడుతుంది. మన రూపాయికి విదేశీ విలువ పైనే ఆర్థిక పురోగతి, ద్రవ్య సుస్థిరత ఆధారపడి ఉంటాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి మదుపు దారులు, ప్రవాస భారతీయ మదుపుదారులను ప్రోత్సహించాలంటే రూపాయి విలువకు విదేశాల్లో స్థిరత్వాన్ని ఆర్బీఐ కలిగించాలి. ఎందుకంటే ఆఫ్ షోర్ కరెన్సీ, ఇతర ద్రవ్యపరమైన రిస్కులు ఆర్థిక వ్యవస్థపై వేగంగా ప్రభావం చూపుతున్నాయి. కాబట్టి, బలమైన ఆఫ్‌షోర్ రూపీ మారక మార్కెట్‌ను అభివృద్ధి చేయడం ద్వారా విదేశీ మారక స్థిరత్వాన్ని తీసుకురావడమే కాకుండా, డాలర్ మారక రూపాయి అంతర్జాతీయంగా ఎదుర్కొంటున్న ఆటు పోట్లను తగ్గించవచ్చు కూడా. దీనికి సంబంధించి ఉషా తోరట్ అధ్యక్షతన ఆఫ్‌షోర్ రూపీ మార్కెట్లపై టాస్క్ ఫోర్స్ రూపొందించిన నివేదిక సిఫార్సులను రిజర్వ్ బ్యాంక్ తప్పనిసరిగా పరిగణించాల్సి ఉంది. బలమైన దేశీయ, విదేశీ రూపీ మార్కెట్‌ను అభివృద్ధి చేస్తే, అది స్థిరమైన ధరల నిర్ణాయకం లాగా వ్యవహరిస్తుందనీ, విదేశీ మారక ద్రవ్య మార్కెట్లో మన రూపాయిపై డాలర్ కలిగించే షాక్‌లను తట్టు కునేలా చేస్తుందనీ ఈ నివేదిక సూచించింది. కృష్ణ రాజ్ వ్యాసకర్త ప్రొఫెసర్, ఇనిస్టిట్యూట్ ఫర్ సోషల్ అండ్ ఎకనమిక్ చేంజ్, బెంగళూరు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
‘బురద జల్లుదాం ఛలో ఛలో’
ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు భావన చూడండి. ఆంధ్రప్రదేశ్ అప్పుడే శ్రీలంకలా మారిందట. అయినా ప్రజలు ఇంకా తిరుగుబాటు చేయడం లేదట. శ్రీలంక ప్రజలకన్నా ఏపీ ప్రజలకే ఎక్కువ ఓర్పు ఉందట. ఎప్పుడు ఏపీ శ్రీలంకలా మారి ప్రజలలో తిరుగుబాటు వస్తే అప్పుడు తాను గద్దె ఎక్కవచ్చన్న అత్యాశతో ఆయన ఉండవచ్చు. కానీ పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నందున అవేవీ తమకు వద్దని ప్రజలు జగన్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలా? అమ్మ ఒడి, చేయూత, విద్యాకానుక వంటి వాటి కింద ఆర్థిక సాయం చేస్తున్నందుకు తిరగబడాలా? అది సాధ్యం కాదని తెలిసినా, చంద్రబాబు తనను తాను మోసం చేసుకుంటూ, ప్రజలను మోసం చేయడానికి చేస్తున్న ప్రయత్నంగా ఇది కనబడుతోంది. గోదావరి వరద బాధితులను పరామర్శించ డానికి ఆయన పశ్చిమ గోదావరి, కోనసీమ లకు వెళ్లారు. తన పర్యటనను రాజకీయ దండయాత్ర మాదిరి, ఎన్నికల ప్రచారం మాదిరి చేశారే తప్ప పరామర్శించడానికి చేసినట్లు కనిపించదు. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా, పదిహేనేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు ఇలా వ్యవహరించవచ్చా? ఆయన పాత తరహా ఫ్యూడల్ రాజకీయాలకు అలవాటు పడి పోయారు. ఏపీ, శ్రీలంకలా కావాలని ఎవరైనా కోరుకుంటారా? కొన్ని విషయాలలో శత్రువుకు కూడా ఇలాంటి కష్టం రాకూడదని అను కుంటాం. అలాంటిది ఒక రాష్ట్రం మొత్తానికి ఆ పరిస్థితి రావాలని అభి లషిస్తున్నారంటే, తన ఓటమిని ఇంకా ఎలా జీర్ణించుకోలేకపోతు న్నారో స్పష్టం అవుతోంది. తన హయాంలో లక్షా పదకొండు వేల కోట్లకు సంబంధించి లెక్కలు ఎందుకు ఇవ్వలేదన్నదానికి చంద్ర బాబు సమాధానం చెప్పాలి. ఆ తర్వాత శ్రీలంక గురించి మాట్లాడాలి. కరోనా సమయంలో అప్పో సప్పో చేసి ఆదుకున్నందుకు నిరసనగా ప్రజలు ఉద్యమించాలా? రైతు భరోసా కేంద్రాల ద్వారా సేవలు అందిస్తున్నందుకు రైతులు తిరగబడాలా? గ్రామాలలో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి పాలన అందిస్తున్నందుకు నిరసన చెప్పాలా? తమ ఇళ్ల వద్దకే పెన్షన్ ఎందుకు తెస్తున్నారని ప్రజలు నిలదీయాలా? ముప్పై లక్షల ఇళ్ల పట్టాలు ఎందుకు ఇస్తున్నారని లబ్ధిదారులు పోరాడాలా? పోనీ ఆ స్కీములకు తాను వ్యతిరేకిననీ, వాటివల్ల నష్టం జరుగు తున్నదనీ చంద్రబాబు చెప్పరు. పైగా ముఖ్యమంత్రి జగన్ కంటే తాను ఇంకా ఎక్కువగా సంక్షేమం అమలు చేస్తానంటారు. అప్పుడు ఏపీ శ్రీలంక కాదా? ఇది సింపుల్ లాజిక్ కదా! అసలు వరద బాధితు లకూ, శ్రీలంకకూ సంబంధం ఏమిటి? అర్థం పర్థం లేకుండా ఆయన మాట్లాడడం, అదేదో భగవద్గీత మాదిరి టీడీపీ అనుబంధ మీడియా ప్రచారం చేయడం... ఆ మాటకు వస్తే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసులో చిక్కుకుని ఆంధ్రుల పరువు తీసినందుకూ, పదేళ్ల రాజధాని హైదరాబాద్‌ను వదలుకున్నందుకూ, గోదావరి పుష్కరాలలో తన ప్రచార యావకు 29 మంది బలయి నందుకూ... ఇలా ఆయన హయాంలో అనేక విషయాలలో జనం తిరగబడి ఉండాలి కదా? చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే తనకు సన్నిహితులుగా ఉన్న కొందరు ప్రముఖులు బ్యాంకులకు ఎగవేసిన డబ్బును చెల్లించేలా చూడవచ్చు కదా! ఆ డబ్బును ఏపీలో వ్యయం చేయమని బ్యాంకు లను కోరవచ్చు కదా. అది జరిగితే ఆయనకు మంచి పేరు వస్తుంది కదా. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ నలభై ఐదువేల కోట్లు, సుజనా చౌదరి ఏడు వేల కోట్లు, రాయపాటి సాంబశివరావు ఎనిమిది వేల కోట్లు, రఘురాజు వెయ్యి కోట్ల మేర బ్యాంకులకు బాకీ పడిన సంగతి తెలియదా? ఇలా పలువురు ఆయనతో రాజకీయ సంబం ధాలు ఉన్నవారే కదా? ఏపీలో పేదలకు ఇస్తున్న పథకాల వల్ల పేద లకు వేల కోట్ల వ్యయం అవుతోందని బాధపడేవారికి ఇది ఒక జవాబే. నిజంగానే వరద బాధితులకు ప్రభుత్వ పరంగా సాయం అందకపోతే ఆ విషయాన్ని ప్రస్తావించి తగు న్యాయం చేయాలని కోరవచ్చు. అలాకాకుండా ఉన్నవి లేనివి మాట్లాడడం టీడీపీకే చెల్లింది. ఎంత రెచ్చగొట్టినా ఆయన ఆశించిన విధంగా ప్రజలలో ప్రభుత్వంపై వ్యతిరేకత రాకపోవడంతో నిరాశతో ఆయన ప్రసంగాలు చేస్తున్నారు. మిగిలిన ప్రభుత్వాలకూ, ఈ ప్రభుత్వానికీ తేడా ఏమిటంటే, క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగాన్ని జగన్ ప్రభుత్వం సమర్థంగా ఏర్పాటు చేసుకోగలిగింది. గతంలో పదుల సంఖ్యలో ఉన్న సహాయ సిబ్బంది ఇప్పుడు వందల సంఖ్యకు పెరిగారు. తన హయాంలో వచ్చిన ప్రకృతి వైపరీత్యాలకు బాగా స్పందించేవాడినని చంద్రబాబు సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు. తిత్లి తుపాను సమయంలో వరద బాధితులను ఎలా గదిమింది సోషల్ మీడియాలో వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. కేంద్ర జల సంఘం ముందస్తుగా హెచ్చరిం చినా వరదలను నియంత్రించలేకపోయారని విమర్శించారు. ఇంకా నయం... తనకు మాదిరి తుపానును ఆపలేకపోయారనీ, అమరావ తిలో ఎండలు తగ్గించాలని తన మాదిరి అధికారులను ఆదేశించ లేకపోయారనీ అనలేదు. గోదావరి వరద ఆరంభం కాగానే అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటారు. అందుకే 36 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా ఎక్కడా పెద్దగా ఇబ్బంది రాలేదు. ఈ స్థాయిలో వరద వచ్చినప్పుడు లంక గ్రామాలు మునిగిపోవడం సర్వసాధారణం. 1986లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇదే స్థాయిలో వరద వస్తే గోదావరి గట్లకు గండ్లు పడి రెండు జిల్లాల్లో పెద్ద నగరాలు, పట్టణాలతో సహా వందలాది గ్రామాలు నీట మునిగాయి. రోజుల తరబడి ప్రజలు తీవ్ర కష్టాలు పడ్డారు. 1996, 98లలో వచ్చిన తుపానుల కారణంగా పలువురు మరణించారు. ఆ విషయాలు మర్చిపోతే ఎలా! ప్రజలకు మంచి నీళ్లు కూడా ఇవ్వలేదనీ, మరో రెండు రోజుల్లో ఇవ్వకపోతే టీడీపీ అందిస్తుందనీ ఆయన అన్నారట. నిజంగానే ప్రభుత్వం నీరు అందిం చకపోతే వెంటనే తన పార్టీ ద్వారా సాయం చేస్తానని అనాలి కానీ, మరో రెండు రోజులు గోదావరి బురద నీరు తాగండి, ఆ తర్వాత నీరు తెస్తాం అన్నట్లు మాట్లాడడాన్ని ఏమనుకోవాలి? రాజంపేట ప్రాంతంలో పర్యటించినప్పుడు చంద్రబాబు, సహాయ కార్యక్రమాలపై ప్రజలు తిరుగుబాటు చేయరా? మీరు సంతృప్తి చెంది జగన్‌కు జేజేలు పలుకుతారా అని కుళ్లుకున్నారు. వరద బాధితులకు రెండువేల రూపాయల సాయం కాదు, తెలంగా ణలో మాదిరి పదివేలు ఇవ్వాలని అన్నారు. తెలంగాణలో ప్రకటన వచ్చింది కానీ ఇంకా మొదలు కాలేదు. జగన్ తాను చెప్పిన మేరకు సహాయ శిబిరాల నుంచి ఇళ్లకు వెళ్లేవారికి రెండువేల రూపాయలు అందించి పంపుతున్నారు. పోనీ తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరదలు, కరువులు వచ్చినప్పుడు ఒక్కొక్కరికి ఎంత ఇచ్చారో చెప్పి, ఆ తర్వాత చంద్రబాబు డిమాండ్లు పెట్టవచ్చు. ఆ పని చేయరు. ఎందుకంటే ఆయన ఏమీ ఇవ్వలేదు కదా! లంకల్లో నష్టపోయిన ప్రతి రైతుకు ఏభై వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేయరాదు. అదే సమయంలో అందరికీ వేలకు వేల సాయం చేయాలి. ఇలాంటి వింత వాదనలతో చంద్రబాబు తన పరువు తానే తీసుకుంటున్నారు. చివరికి చంద్రబాబు టీమ్ పడవ లలో పర్యటించినప్పుడు అధికారులు వారించినా వినకుండా, అధిక సంఖ్యలో వాటిలో ఎక్కడం, ఆ తర్వాత ప్రమాదం సంభవించడం, అదృష్టవశాత్తూ ముప్పు తప్పడం జరిగింది. కానీ దీనిపై కూడా టీడీపీ నేత వర్ల రామయ్య యధాప్రకారం భద్రతా ఏర్పాట్లలో ప్రభుత్వ వైఫల్యం అని విమర్శించారు. ఇంకా నయం. జగన్ ప్రభుత్వ కుట్ర వల్లే పడవ నుంచి టీడీపీ నేతలు పడిపోయారని చెప్పలేదు. చివరిగా ఒక మాట. పార్టీ తరపున చంద్రబాబు సాయం చేసినా, చేయకపోయినా ఫర్వాలేదు. కానీ శక్తివంచన లేకుండా సహాయ చర్యలు చేపట్టిన ప్రభుత్వంపై బురద చల్లకుండా ఉండగలిగితే మంచిది. సొంత ఖర్చులతో బాధితులకు సాయం చేస్తున్న రంగనాథ రాజు వంటి ఎమ్మెల్యేలపై దూషణలకు దిగకుంటే అదే పదివేలు. అధికారం పోయిందన్న దుగ్ధతో ఉన్న చంద్రబాబు విచక్షణ, విజ్ఞత కోల్పోయి వ్యవహరించడమే దురదృష్టకరం. కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
చేద్దామా? చద్దామా?
సెకనుకు సుమారు 13.3 హిరోషిమా అణ్వాయుధాలు లేదా రోజుకు 11,50,000 అణ్వాయుధాలు పడితే ఎలా ఉంటుంది? ప్రస్తుతం భూగోళం ఎదుర్కొంటున్న సమస్య ఇంత తీవ్రంగా ఉంది. ఈ మంటలు పుట్టించే వేడికి ఏ దేశమూ మినహాయింపు కాదు. చల్లటి ప్రాంతాలుగా పేరొందిన యూరోపియన్ దేశాలు సైతం ఎండలకు మాడిపోతున్నాయి. ఇంకోవైపు కనీవినీ ఎరుగని స్థాయిలో వర్షాలు పడుతున్నాయి. వాతావరణం అదుపు తప్పిందన్నది నిజం. ఎప్పటికో అనుకున్నది ఇప్పటికే వచ్చేసింది. కొందరు నమ్ముతున్నట్టు ఏ కొత్త టెక్నాలజీనో వచ్చి అమాంతం సమస్యను పరిష్కరించలేదు. ప్రభుత్వాల స్థాయిలో, వ్యక్తిగత స్థాయిలో చర్యలు మొదలుకావాలి. లేదంటే, ‘వాతావరణ ఆత్మహత్యలే’ శరణ్యం. విపరీత వాతావరణం పుణ్యమా అని గత వారంలో స్పెయిన్, పోర్చుగల్‌లలో వెయ్యి మంది ప్రాణాలు కోల్పోయారంటే పరిస్థితి ఏమిటన్నది అర్థం చేసుకోవచ్చు. బ్రిటన్‌లోనైతే రికార్డులు బద్దలు కొడుతూ 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకుని జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించేశారు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి అంటోనియో గుటెరస్ ఈ వడగాడ్పులను సామూహిక ఆత్మహత్యలకు ఏమాత్రం తీసిపోని పరిణామమని హెచ్చరించారు. వాతావరణ మార్పుల మీద జరిగిన రెండు రోజుల సమావేశంలో 40 దేశాలకు చెందిన మంత్రులతో మాట్లాడుతూ... ‘‘మానవాళిలో సగం ఇప్పటికే వరదలు, కరవులు, తుపాన్లు, కార్చిర్చుల ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ ప్రమాదం నుంచి ఏ దేశానికీ మినహాయింపు లేదు. అయినా మనం శిలాజ ఇంధనాల వ్యసనాన్ని కొనసాగి స్తున్నాం. ఇప్పుడు మన ముందు ఒక అవకాశం ఉంది. కలిసికట్టుగా సమస్యను అధిగమించే ప్రయత్నం చేద్దామా? లేక అందరమూ కలిసికట్టుగా ఆత్మహత్య చేసుకుందామా? నిర్ణయం మన చేతుల్లోనే ఉంది’’ అని వ్యాఖ్యానించారు. ప్రకృతి వైపరీత్యాల ప్రకోపం పతాక స్థాయికి చేరిన ఈ తరుణంలో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి హెచ్చరిక అనూహ్యమేమీ కాదు. ఎవరో అన్నట్లు... ఇవి వాతావరణ మార్పులు కాదు, ‘వాతావరణ ఆత్మహత్యలు’. యూరప్, ఉత్తర అమెరికాల్లో చాలా భాగాల్లో కార్చిచ్చులు కలవరపెడుతున్నాయి. ఇంకోవైపు భారత్‌లో కనీవినీ ఎరుగని స్థాయిలో వర్షాలు పడుతున్నాయి. ధ్రువ ప్రాంతాల్లో ఏటికేడాదీ కుంచించుకుపోతున్న మంచు! అదే సమ యంలో ఆఫ్రికాలోని పలు ప్రాంతాల్లో కరవు పరిస్థితులు! ఇవన్నీ చూస్తే ప్రపంచ వాతావరణం అదుపు తప్పినట్లే కనిపిస్తోంది. వాతా వరణ మార్పుల ప్రభావం ఎలా ఉంటుందో తెలిసినప్పటికీ... ఎప్పుడో వస్తున్నాయనుకున్నవి ఇప్పుడే వచ్చేస్తూండటం, జరుగు తున్న నష్టం తీవ్రంగా ఉండటం ఆందోళన కలిగించే విషయం. ఒహాయో యూనివర్సిటీ మాజీ గణిత శాస్త్రవేత్త ఇలియట్ జాకబ్సన్‘వాచింగ్ ద వరల్డ్ గో బై’ పేరుతో ఓ లెక్క చెప్పారు. ‘‘ఈ గ్రహంపై సెకనుకు 13.3 హిరోషిమా అణు బాంబులు పేలితే పుట్టేంత వేడి పుడుతోంది. అంటే రోజుకు 11,50,000 అణు బాంబులంత వేడన్నమాట’’ అని విస్పష్టంగా పేర్కొన్నారు. సముద్ర జలాల ఉష్ణోగ్రతలు కూడా సెకనుకు 12 హిరోషిమా అణుబాంబుల స్థాయిలో పెరుగుతున్నాయని ఆయన చెప్పారు. తలుచుకుంటేనే భయం పుట్టే స్థాయి. అయినా సరే, మనం కలిసికట్టుగా పనిచేసేం దుకు సిద్ధంగా లేము. అందుకేనేమో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి కూడా ప్రభుత్వాలు చెప్పేదొకటీ, చేసేది ఇంకోటీ అని నిష్టూరమాడారు. పచ్చిగా మాట్లాడాల్సి వస్తే దేశాలన్నీ అబద్ధాలు చెబుతున్నాయన్నారు. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ తాజా నివేదిక విడుదలైన సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఈ శతాబ్దాంతానికి భూమి సగటు ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ పెరగకూడదనుకుంటే... 2022 నాటికి కర్బన ఉద్గారాలు పతాకస్థాయికి చేరాలని ఈ నివేదిక స్పష్టం చేసింది. ఇంకోలా చెప్పాలంటే, 2023 నుంచి ఉద్గారాలు గణనీయంగా తగ్గాలే తప్ప మరి పెరగకూడదన్నమాట. అయితే వాస్తవ పరిస్థితులు దీనికి పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. కానీ సమయమేమో మించిపోతోంది. హెచ్చరికలు బేఖాతరు... వాతావరణం మనకిప్పటికే అన్ని రకాల హెచ్చరికలు చేస్తున్నా అన్నీ బేఖాతరవుతున్నాయి. రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, ఆర్థిక వేత్తలు, శాస్త్రవేత్తలు, మీడియా ప్రతినిధులు కూడా నిమ్మకు నీరెత్తి నట్లు వ్యవహరిస్తున్నారు. సమాజాన్ని ప్రభావితం చేయగల వీరు ఇస్తున్న సందేశమేమిటి? ఏం ఫర్వాలేదు; కొత్త కొత్త టెక్నాలజీ లొస్తున్నాయి; వాతావరణ సమస్యలకు ఇవి సమాధానం చెబుతాయి; అందోళన అనవసరం అని! ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుత ప్రకృతి వైపరీ త్యాలకూ వాతావరణ మార్పుల ప్రభావానికీ సంబంధం లేదని కూడా కథనాలు వెలువడుతున్నాయి! అంతేకాకుండా... ఆర్థికాభివృద్ధి పేరుతో ప్రకృతి వనరుల విధ్వంసాన్ని కూడా కొందరు సమర్థించుకుంటున్నారు. ఈ రకమైన ఆర్థిక విధానాలకు ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. శిలాజ ఇంధనాలను త్యజించాలన్న డిమాండ్ పెరుగుతోంది కూడా. ప్రధాన స్రవంతిలోని ఆర్థికవేత్తలకు భిన్నంగా ఆలోచిస్తున్న బ్రిటిష్ మంత్రి జాక్ గోల్డ్ స్మిత్ ఒక ట్వీట్ చేస్తూ... ‘‘యూరప్ మొత్తమ్మీద కార్చిచ్చులు చెలరేగుతున్నాయి. ఉష్ణోగ్రతల రికార్డులు బద్ధలవు తున్నాయి. అడవులు, పర్యావరణ వ్యవస్థలు కూడా రికార్డు వేగంతో నశించిపోతున్నాయి. అయినా పర్యావరణ పరిరక్షణకు డబ్బులు ఖర్చు చేయడం ఏమంత లాభదాయకం కాదనే రాజకీయ నేతలు మళ్లీ పదవులకు ఎన్నికవుతున్నారు’’ అని వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్య సమితి మాజీ ప్రధాన కార్యదర్శి బాన్ –కీ మూన్ గతంలో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ, వాతావరణ విధ్వంసానికి కారణమవుతున్న ఆర్థిక విధానాలను చక్కదిద్దే నాయకత్వపు అవసరం ఇప్పుడు ఎంతైనా ఉందని చెప్పడం ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. ఈ సమస్యకు పరిష్కారం కూడా ఇదేననీ, రాజకీయ నేతలు ఈ గట్టి నిర్ణయం తీసుకోలేకపోతున్నారనీ నా నమ్మకం కూడా. అభివృద్ధికి సూచిక స్థూల జాతీయోత్పత్తి అన్న వ్యామోహం నుంచి బయటపడనంత వరకూ వాతావరణ సమస్య లకు పరిష్కారం లభించనట్లే. మనకిష్టమైనా, కాకపోయినా సరే... ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ నిర్మాణం సమాజంలో అంతరాలను పెంచిం దన్నది మాత్రం నిజం. అంతేకాకుండా... పర్యావరణ సమస్యలను తెచ్చిపెట్టిందీ, ప్రపంచం అంతరించిపోయే స్థితికి చేర్చింది కూడా ఇవే. కాబట్టి ఆర్థిక వ్యవస్థ సమూల ప్రక్షాళన తక్షణావసరం. ప్రస్తుత అస్తవ్యస్త వ్యవహారం ఇకపై ఎంతో కాలం కొనసాగే అవకాశాలు లేవు. బహుశా ప్రస్తుతం వీస్తున్న వడగాడ్పులు ఓ షాక్ థెరపీనేమో. మానవాళి మేల్కొనేందుకు అవసరమైనదే కావచ్చు. నిర్మాణాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాల్సిన అవసరాన్ని గుర్తుచేసే సందర్భమూ ఇదే. ఎందుకంటే, ఇది పోతే ఇంకోటి ఉందిలే అని భూమి గురించి అనుకోలేము కదా! కర్బన ఉద్గారాలకు, వాతావరణ సమస్యలకు, సంపద సృష్టికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందన్నది నిర్వివాదాంశం. ఆర్థికాభివృద్ధి ఎంత ఎక్కువైతే, అంతేస్థాయిలో కర్బన ఉద్గారాలూ పెరుగుతాయి. స్థూలజాతీయోత్పత్తిని పెంచు కోవాలన్న తపనలో భూమి వేడి కూడా పెరిగిపోతోంది. ఈ నేపథ్యం లోనే మేరీల్యాండ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీకి చెందిన డాక్టర్ హెర్మన్ డాలీ ‘స్టెడీ స్టేట్ ఎకానమీ’కి మద్దతిచ్చారు. ‘‘ప్రతి రాజకీయ నాయ కుడూ వృద్ధికి అనుకూలంగా ఉన్నాడు. అర్థం చేసుకోదగ్గ విషయమే. కానీ అసలు ప్రశ్నకు సమాధానం మాత్రం దాటవేస్తారు’’ అని ఆయన పేర్కొన్నారు. అయితే, వృద్ధి మనల్ని నిజంగానే ధనవంతులను చేస్తోందా? లేక లాభాలకంటే ఖర్చుల్ని ఎక్కువ చేస్తోందా? అన్నది కూడా ఆలోచించాలి. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థను సమర్థిస్తున్న వారు సమాధానమివ్వాల్సిన ప్రశ్న కూడా ఇదే. ఆర్థికవేత్తల ఆలోచనలు ఎలా ఉన్నా, సామాన్యుల వ్యవహారశైలిలోనూ కొన్ని మార్పులు అని వార్యం. వినియోగాన్ని తగ్గించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల ప్రభా వాన్ని తగ్గించుకోవచ్చు. వాతావరణ సమస్య మనం సృష్టించింది కాకపోయినా, ఇప్పటివరకూ కొనసాగడంలో మాత్రం మనవంతు భాగస్వామ్యం తప్పకుండా ఉంది. దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు ఈ–మెయిల్: hunger55@gmail.com (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
Agnipath: బంధాలను తెంచుతున్న అగ్నిపథ్
‘చావుకు భయపడటం లేదని ఏ సైనికుడు అయినా అన్నాడంటే, అతడు అబద్ధమాడుతూ ఉండాలి, లేదా గోర్ఖా అయి ఉండాలి’ అని ఫీల్డ్ మార్షల్ శామ్ మానెక్షా చెప్పేవారు. పిరికివాడిగా ఉండటం కంటే చావడం మేలనేది వీరి ఆదర్శం. స్వాతంత్య్ర కాలం నుంచీ వీరు భారత సైన్యంలో విడదీయలేని శక్తిగా ఉంటున్నారు. సాహసానికి పేరొందిన నేపాలీ గోర్ఖాలకు ఇప్పటికీ తొలి ప్రాధాన్యం సైన్యంలో చేరడమే. వీరంతా నేపాల్‌లో బలమైన భారత్ అనుకూల బృందంగా ఉంటున్నారు. 1947లో భారత్, బ్రిటన్, నేపాల్ మధ్య కుదిరిన త్రైపాక్షిక ఒప్పందానికి తీవ్ర ప్రభావం కలిగిస్తూ, గోర్ఖా యువత ఆకాంక్షలను దెబ్బ తీయబోతున్న అగ్నిపథ్ పథకం గురించి నేపాల్‌ను భారత్ సంప్రదించలేదు. గోర్ఖా జానీ, గోర్ఖా సాథీ, లహురే... పేరు ఏదైనా కావొచ్చు; కీర్తి, సంపద ఆర్జించడం కోసం వీరు మహారాజా రంజిత్ సింగ్ సైన్యంలో చేరడానికి అప్పట్లో లాహోర్ వరకు వెళ్లారు. వీరిని నేపాలీ అమ్మాయిలు ఏరికోరి పెళ్లాడేవారు. ఇప్పటికీ చేసుకుంటున్నారు. ‘గోర్ఖాలు మీతో యుద్ధానికి దిగారు’ అనేది వీరి సమర నినాదం. పిరికివాడిగా ఉండటం కంటే చావడం మేలనేది వీరి ఆదర్శం. అలా వీరి పేర్లలో బహదూర్ (సాహసి), జంగ్ (సమరం) అనేవి వచ్చి కలిసేవి. ఫీల్డ్ మార్షల్ శామ్ మానెక్షాకు ‘శామ్ బహదూర్’ అని గుర్తింపు ఉండటం తెలిసిందే. తాను చావుకు భయపడటం లేదని ఏ సైనికుడు అయినా మీతో అన్నాడంటే, అతడు అబద్ధమాడుతూ ఉండాలి, లేదా గోర్ఖా అయివుండాలి అని మానెక్షా చెప్పేవారు. ఇండియన్ మిలిటరీ అకాడెమీలో నన్ను ఇష్టమైన మూడు ఆయుధాలు ఎంచుకొమ్మ న్నప్పుడు... నేను గోర్ఖాలు, గోర్ఖాలు, గోర్ఖాలు అని చెప్పేవాడిని. ఇప్పుడు చరిత్రలో మొదటిసారిగా వారిని అగ్నిపథ్ గోర్ఖాలు అని పిలవనున్నారు. ఈ బిరుదు, లేదా గుర్తింపు వారికి ఏమాత్రం సరిపోనిది అనే చెప్పాలి. ‘కిరాయి’ సైనికులు కాదు దేశ విభజనకు ముందు భారతీయ అధికార్లను గోర్ఖాల్లో చేరడానికి బ్రిటిష్ అధికార్లు అనుమతించేవారు కాదు. 1947 తర్వాత అంటే గోర్ఖా ట్రూప్ కమాండ్‌ను భారతీయ అధికారులు ప్రారంభించిన తర్వాతే బ్రిటిష్, ఇండియన్ ఆర్మీల మధ్య గోర్ఖా రెజిమెంట్లను విభజించారు. 1947లో కుదిరిన త్రైపాక్షిక రిక్రూట్మెంట్ ఒప్పందం... బ్రిటిష్, ఇండియన్, నేపాలీ సైన్యాల్లో నేపాలీ గోర్ఖాలను చేరడానికి అనుమతించింది. అయితే వేతనాలు, పెన్షన్లలో తేడాలు ఉండేవి. గోర్ఖాలను కిరాయి సైనికులు అని పిలవవద్దని నేపాల్ షరతు పెట్టడమే ఈ ఒప్పందంలోని చివరి అంశం. నేపాలీ గోర్ఖాలు ఇప్పుడు ఫ్రెంచ్ ఆర్మీలో చేరుతున్నారు. అనేకమంది రిటైరయిన గోర్ఖాలు ప్రైవేట్ కాంట్రాక్టర్లుగా చేరుతున్నారు. సారాంశంలో, మాతృ బెటాలియన్లతో సాంప్రదాయ వారసత్వ బంధం కారణంగా గోర్ఖాలు ఇప్పటికీ భారతీయ రెజిమెంట్లలో చేరుతున్నారు. మన సైన్యంలోని 1,3,4,5,8 సంఖ్యలు గల గోర్ఖా రెజిమెంట్లు ప్రధానంగా మాగర్లు, గురుంగులతోనూ; 9వ గోర్ఖా రెజిమెంట్ ఛెత్రీలు, ఠాకూర్లతోనూ; 11వ గోర్ఖా రెజిమెంట్ రాయిలు, లింబూలతోనూ ఉంటున్నాయి. వీళ్లందరూ భారతీయ సైన్యంలో భాగంగా ఉంటున్నారు. దివంగత భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ 11వ గోర్ఖా రైఫిల్స్‌కి చెందిన 5వ బెటాలియన్‌కి నాయకత్వం వహించేవారు. బ్రిటిష్ ఆర్మీ నాయకత్వం 1947 తర్వాత 2, 6, 7, 10 రెజిమెంట్లను తమతో తీసుకుపోయింది. వాటిని ఇప్పుడు కేవలం రెండు బెటాలియన్లుగా కుదించారు. గోర్ఖా రెజిమెంట్లలోకి నియామకాలను ప్రారంభంలో భారత్–నేపాల్ సరిహద్దులోని భైర్హవా సమీపంలోని నౌతన్వాలో జరిగేవి. తర్వాత కుంరాఘాట్, గోరఖ్‌పూర్, డార్జిలింగ్ సమీపంలోని ఘూమ్ ప్రాంతాలను శాశ్వత ప్రాంతాలుగా ఎంపిక చేశారు. ఈ రిక్రూట్మెంట్ డిపార్ట్మెంట్లకు యువ గోర్ఖాలను తీసుకురావడానికి గల్లా వాలాస్ అని పిలిచే నేపాలీ రిక్రూటర్లను ఉపయోగించుకునే వారు. భారతీయ సైన్యంలో భర్తీ కావడం కోసం వీరు 20 నుంచి 24 రోజులపాటు ట్రెక్కింగ్ చేసి వచ్చేవారు. శారీరక, వైద్య పరీక్షలు అనంతరం ఎంపికైన∙వారిని రెజిమెంటల్ శిక్షణా కేంద్రాలకు పంపించేవారు. వ్యూహాత్మక సంపద తర్వాతి కాలంలో భారతీయ సైన్య నియామక బృందాలు నేపాల్ మారుమూల ప్రాంతాలకు వెళ్లి రాటుదేలిన యువత కోసం ప్రయత్నించడంతో సైనిక రిక్రూట్మెంట్ వ్యవస్థ మారిపోయింది. నేపాల్ పశ్చిమ, తూర్పు ప్రాంతాల్లోని పోఖ్రా, ధరాన్ తదితర చోట్ల రిక్రూట్మెంట్ ర్యాలీలను నిర్వహించేవారు. నియామక వ్యవస్థ పూర్తి పారదర్శకంగా ఉంటూ వచ్చింది. ఇప్పుడు దానికి రాత పరీక్షను కూడా చేర్చారు. మొదట్లో నేపాల్ నుంచే 100 శాతం చేర్చుకునేవారు. తర్వాత దీన్ని కాస్త మార్చి, నేపాల్ దేశస్థులైన గోర్ఖాల నుంచి 70 శాతం, భారతీయ గోర్ఖాల నుంచి 30 శాతం రిక్రూట్ చేస్తూ వచ్చారు. కోవిడ్ మహమ్మారి రిక్రూట్‌మెంట్‌ను అడ్డుకున్నప్పుడు రిక్రూట్మెంట్ విభాగాలు 60:40 నిష్పత్తిలో చేర్చుకున్నాయి. 2018లో 6/1 గోర్ఖా రైఫిల్స్‌ని పూర్తిగా భారతీయ గోర్ఖాల నుంచే తీసుకున్నారు. సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో నేపాల్‌కు రాజకీయ సందేశాన్ని ఇవ్వడమే దీని ఉద్దేశం. నేపాల్‌లోని కమ్యూనిస్టులు కూడా 1990లో పాలక పక్షానికి విధించిన తమ 40 పాయింట్ల డిమాండ్లలో ఒకటి, భారత సైన్యంలో నేపాలీల చేరికను ఆపడం. కానీ సైనికుడు కావాలన్న కోరిక గోర్ఖాల్లో ఇప్పటికీ అలాగే ఉంది. 1970లలో భారత సైన్యం నుంచి గోర్ఖాలను తొలగించాలంటూ వచ్చిన సంకుచిత ప్రతిపాదనను భారత్ తోసి పుచ్చింది. నాటి ఆర్మీ చీఫ్ జనరల్ గోపాల్ బెవూర్ నాటి ప్రధాని ఇందిరాగాంధీకి గోర్ఖాలు మనకు వ్యూహాత్మక సంపద అని నొక్కి చెప్పారు. భారత అనుకూల బృందం రెజిమెంటల్ వ్యవస్థను కొనసాగిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. అయితే అగ్నిపథ్ పథకం నేపాలీ గోర్ఖాలకు కూడా వర్తిస్తుంది. భారతీయ సైన్యంలో 38 ఇన్ఫాంట్రీ బెటాలియన్లు, రెండు రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియన్లు, రెండు టెరిటోరియల్ ఆర్మీ బెటాలియన్లు, ఆర్టిల్లరీకి చెందిన 64 ఫీల్డ్ రెజిమెంట్లు మొత్తం గోర్ఖాలతో కూడి ఉన్నాయి. అందుకే భారత గోర్ఖా బ్రిగేడ్ అతిపెద్ద రెజిమెంట్‌గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం భారతీయ సైన్యంలో పనిచేస్తున్న, రిటైర్ అయిన గోర్ఖాలు 17 లక్షల మంది ఉన్నారని అంచనా. వీరంతా నేపాల్‌లో బలమైన భారత్ అనుకూల బృందంగా ఉంటున్నారు. చైనా ప్రభావంలో ఉన్న నేపాల్‌తో ప్రత్యేక సంబంధాలు కొనసాగించడానికి, ఆ దేశంతో పూర్వ ప్రాధాన్యతా స్థానం పొందడానికి ఈ బృందం చాలా అవసరం. మాజీ సైనికులు నేపాల్ వ్యాప్తంగా ఇండియన్ రెజిమెంటల్ అసోసియేషన్లను ఏర్పర్చుకున్నారు. బెటాలియన్లలో తాము ఎదిగిన రోజులను తల్చుకుంటూ, యుద్ధ గౌరవాలను అందుకుంటూ ఇండియా సైనికులతో వీరు పరస్పర సంబంధాలు కొనసాగిస్తున్నారు. సైన్యంలో తాత్కాలిక నియామకాలకు సంబంధించి భారత ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ పథకంపై నేపాల్ ఇంతవరకూ అధికారికంగా స్పందించలేదు. 1947లో త్రైపాక్షిక ఒప్పందంపై తీవ్ర ప్రభావం కలిగిస్తూ, గోర్ఖా యువత ఆకాంక్షలను దెబ్బ తీయబోతున్న అగ్నిపథ్ పథకం గురించి నేపాల్‌ను భారత్ సంప్రదించలేదు. అగ్నిపథ్ ఒక పెద్ద అసంతృప్తి పథకంగా కనబడుతోంది. నాలుగేళ్లపాటు నియంత్రణ రేఖ, వాస్తవాధీన రేఖల వద్ద ప్రాణాలు పణంగా పెట్టి సైన్యంలో పనిచేయటం కంటే, ఏ దుబాయ్‌లోనో మరింతగా సంపాదించగలరు. మొత్తం మీద చూస్తే, ఏదో ఒకరోజున గోర్ఖా వారసత్వానికి ముగింపు పలకాలని బీజేపీ ప్రభుత్వం చూస్తోంది. 2014లో నేపాల్‌ని తొలిసారిగా సందర్శించినప్పుడు గోర్ఖా సైనికుల త్యాగాలను ఎత్తిపడుతూ తానాడిన మాటల్ని ప్రధాని నరేంద్రమోదీ అప్పుడే మర్చిపోయినట్లు కనబడుతోంది. భారత్‌తో గోర్ఖా బంధాన్ని అగ్నిఫథ్ బలహీనపరుస్తుంది. అశోక్ కె. మెహతా వ్యాసకర్త ఆర్మీ మేజర్ జనరల్ (రిటైర్డ్) (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ఇవేం రాతలు, ఇవేం కూతలు?
కాలమూ, విలువలూ మారిపోవడం అంటే ఇదే కావొచ్చు. ఒకప్పుడు మీడియా తన రాతల పట్ల బాధ్యతగా ఉండేది. ఏదైనా తప్పు జరిగితే దానికి సంబంధించిన సవరణ చేయడానికి ప్రయత్నించేది. అప్పుడు కూడా ఆయా రాజకీయ పార్టీలకు కొంత మద్దతిచ్చినా, ప్రస్తుతం టీడీపీ మీడియా వ్యవహరిస్తున్నంత అరాచకంగా అయితే ఉండేది కాదు. తాము మద్దతిస్తున్న టీడీపీని అధికారంలోకి తేవడమే తమ కర్తవ్యం అన్న చందంగా అబద్ధాలు రాయడానికి ఈ వర్గం మీడియా ఏ మాత్రం సిగ్గు పడడం లేదు. అలాగే ప్రతిపక్షాలు కూడా ఆరోపణలు చేసినా, వాటికి ఆధారాలు ఉన్నవో లేదో చూసుకునేవి. కానీ ఇప్పుడు అసత్యాలు ప్రచారం చేయడానికి ఏమాత్రం వెనకాడటం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టడమే లక్ష్యంగా టీడీపీ, దాని మీడియా విశ్వయత్నం చేస్తున్నాయి. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తనకు అండగా ఉండే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా అబద్ధాల ప్రచారానికి వెరవడం లేదు. తాము చెప్పే విషయాలు అబద్ధాలు అని తేలితే పరువు పోతుందని కూడా వారు ఫీల్ కావడం లేదు. గత మూడేళ్లుగా ఇదే తంతు సాగుతోంది. ఇటీవలికాలంలో జరిగిన కొన్ని ఘటనలను పరిశీలిస్తే ఈ విషయాలు బోధపడతాయి. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అక్రమ మైనింగ్ చేస్తున్నారనీ, ఒక చోట ఒక గుట్ట మిగిలిందనీ, దానిపైన ఒక బోర్ ఉందనీ... దానిని ఎలా వాడుకోవాలీ అంటూ వార్త ఇచ్చారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఒక ఎగ్జిబిషన్ పెట్టి ఇలాంటి ఫొటోలను ప్రచారం చేశారు. ఇక ‘ఎల్లో’ పత్రికలు పూనకం వచ్చినట్లు ఆ వార్తను ప్రచురించేశాయి. తీరా చూస్తే ఆ గుట్ట తవ్వకం జరిగింది 2018 లోనే అని తేలింది. మరి ఇప్పుడు తప్పు ఎవరిది? దీనికి టీడీపీ గానీ, ఆ పార్టీకి ప్రచారం చేసే మీడియా గానీ ఏం సమాధానం ఇస్తాయి? తెలుగుదేశానికి జనసేన తోడయింది. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు ‘గుడ్ మార్నింగ్ సీఎం’ అంటూ గోతులు పడిన రోడ్లను పోస్టు చేస్తున్నారు. అవి నిజమైనవే అయితే మంచిదే. ప్రభుత్వం చర్య తీసుకోవచ్చు. కానీ కొన్ని చోట్ల రోడ్లను వారే తవ్వి, ఆ రోడ్డు పాడైపోయిందని పోస్టు పెట్టారు. సత్తెనపల్లి వద్ద అలా రోడ్డు తవ్వుతున్న జనసేన కార్యకర్తలను స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారట. పవన్ సోదరుడు నాగబాబు రోడ్డు లేని చోట ఫొటో దిగి పోస్టు చేశారట. ఇంకో ఆయన ఏకంగా మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో గోతులు పడిన ఫొటోలను ఆంధ్రప్రదేశ్విగా చూపిం చారట. ఇలాంటివి సినిమాల్లో చేస్తే చెల్లుతుందేమోగానీ, నిజ జీవి తంలో అలా చేస్తే పరువు పోతుందని పవన్ కల్యాణ్ గ్రహించక పోవడమే ఆశ్చర్యకరం. సోషల్ మీడియా ప్లాట్ఫారంను ఏ పార్టీ అయినా, ఏ వ్యక్తి అయినా వాడుకోవచ్చు. కానీ అందులో వాస్తవ విషయాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. లేకుంటే వారి విశ్వసనీయతే దెబ్బతింటుందన్న సంగతి గుర్తించాలి. సాధారణంగా కొన్ని వ్యవస్థలు కక్షలు, కోప తాపాలు వంటివాటికి అతీతంగా ఉండాలి. ముఖ్యంగా న్యాయ వ్యవస్థ, మీడియా వ్యవస్థ. దురదృష్టవశాత్తూ ఈ రెండూ కూడా వీటికి దూరంగా ఉండలేకపోతున్నాయి. న్యాయ వ్యవస్థ అయితే ఎవరైనా విమర్శలు చేస్తే వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వారిని ఎలా శిక్షిం చాలా అన్న ఆలోచన చేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. ఎవరైనా అనుచితంగా, అసభ్యంగా కామెంట్లు చేస్తే చర్య తీసుకోవడం తప్పు కాదు. కానీ న్యాయ వ్యవస్థ కక్షతో ఉందనీ, కొందరి పట్ల ఒక రకంగానూ, మరికొందరి పట్ల ఇంకోరకంగానూ ఉందన్న భావన ప్రజలలోకి వెళ్లకుండా జాగ్రత్తపడాలి. ఇక మీడియా అయితే ఎంతో సంయమనంతో ఉండాలి. ఒకవేళ రాజకీయ పార్టీ దేనికైనా మద్దతు ఇవ్వదలిస్తే, ఆ విషయాన్ని ధైర్యంగా ప్రకటించి ఆ పని చేయవచ్చు. అప్పుడు కూడా అబద్ధాలు ప్రచారం చేయకూడదు. కానీ టీడీపీకి మద్దతు ఇచ్చే మీడియా శైలి దారుణంగా ఉంటోది. ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు వ్యతిరేకంగా ఏమి రాయాలి? టీవీలలో ఏమి చూపించాలి? అన్న భావనతోనే పని చేస్తున్నాయి. ఏపీలో వరద సహాయక కార్యక్రమాల గురించి ఈనాడు ఎలా మొదటి పేజీలో వార్తలు ఇస్తున్నదో అంతా గమనిస్తున్నారు. అందుకే వైసీపీ నేత కొడాలి నాని రాజకీయ భోజనం లేనిది రామోజీరావుకూ, టీడీపీ ఇతర మీడియా సంస్థలకూ అనీ; పాలు లేనిది రాజకీయాలలో పిల్లలైన లోకేశ్, దత్తపుత్రుడు పవన్ కల్యాణ్‌లకూ అనీ ఎద్దేవా చేశారు. ఒకవేళ వారు ఇస్తున్న వార్తలలో ఏవైనా నిజాలు ఉంటే ప్రభుత్వం చర్యలు తీసుకున్నా వాటికి అసలు ప్రాధాన్యం ఇవ్వరు. గత ఏడాది వర్షాకాలంలో రోడ్లు దెబ్బతిన్నాయి. దాంతో కొంత ఇబ్బంది ఎదురయ్యే మాట నిజం. ఆ వార్తలు ఇవ్వవచ్చు. కానీ ప్రభుత్వం స్పందించి వందల కోట్లు వెచ్చించి రోడ్లను బాగు చేసినా, వాటిని పట్టించుకోకుండా ఎక్కడెక్కడో మూల పాడై ఉండే రోడ్డును బ్యానర్ కథనంగా ఇచ్చే దుఃస్థితికి ప్రధాన పత్రిక పడిపోతుందని ఊహించలేకపోయాం. జిల్లా పత్రికలు, జోనల్ పేజీలలో ఇవ్వవలసిన వార్తలను మొదటి పేజీలో వేస్తున్నారంటే వారి దురుద్దేశం అర్థం చేసుకోవడం కష్టం కాదు. వీటిపై తెలుగుదేశం ఏదో కార్యక్రమం చేపట్టడం, ఆ వెంటనే దానిని జనసేన అందుకోవడం నిత్యకృత్యం అయింది. ఒకరకంగా ప్రభుత్వంపై వీరంతా మూకు మ్మడిగా దాడి చేస్తున్నారు. ఎప్పుడైనా ఒకసారి ఏడిస్తే వారిని ఓదార్చ వచ్చు. రోజూ రోదించేవారిని ఎవరు ఓదార్చగలరు? ప్రస్తుతం వీరందరి పరిస్థితి అలాగే ఉంది. ఇక సోషల్ మీడియాలో సాగుతున్న యుద్ధం కూడా చిన్నది కాదు. తమ రాజకీయ అవసరాలకు సోషల్ మీడియాను వాడుకో వడాన్ని ఎవరూ ఆక్షేపించరు. కానీ ఏ పార్టీ అయినా అభ్యంతరకరంగా పోస్టులు పెట్టరాదు. కానీ ఈ నియమాన్ని ఎవరూ పాటించడం లేదు. సోషల్ మీడియా ట్రెండ్ దేశ వ్యాప్తంగా ఇలాగే ఉంది. అయితే ఆయా రాష్ట్రాలలో పోలీసులు కేసులు పెడుతున్నారు. అరెస్టు చేస్తున్నారు. ఎక్కడా కోర్టులు కూడా అభ్యంతరం పెట్టడం లేదు. కానీ ఏపీలో మాత్రం ఆయా వ్యక్తులపై చర్యలు తీసుకుంటే వెంటనే సంబంధిత నిందితులకు అడ్వాన్స్ బెయిల్ వచ్చిన ఘటనలు జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ నేప«థ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పరిస్థితిని అర్థం చేసుకుని పోటాపోటీ పోస్టులు పెడుతోంది. ఉదాహరణకు రోడ్డు బాగోలేదని ఏదైనా పోస్టు వస్తే, అది వాస్తవం అయితే వెంటనే రిపేరు జరిగేలా చర్య తీసుకోవడం, అవాస్తవం అయితే ఆ విషయాన్ని వెలుగులోకి తేవడం చేస్తోంది. ఈ క్రమంలో పలు సంగతులు కూడా బయటపడుతున్నాయి. ఆ మధ్య తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో పాడైన ఒక రోడ్డును ఏపీ బొమ్మగా చూపుతూ ఒక పోస్టును వైరల్ చేశారు. అది బోగస్ అని రుజువులతో సహా ఏపీ ప్రభుత్వం చూపగలిగింది. అంతేకాదు, గతంలో చంద్రబాబు టైమ్‌లో రోడ్ల దుఃస్థితికి సంబంధించిన ఫొటో లనూ, ఇప్పటి ప్రభుత్వం ఆ రోడ్లను బాగు చేసిన ఫొటోలనూ పోస్టు చేశారు. ఇది రోజూవారి వ్యవహారంగా మారిపోయింది. ఇక సర్వేల పేరుతో తప్పుడు ప్రచారానికి కూడా వెనుకాడడం లేదు. టీడీపీకి వ్యతిరేకంగా ఉండే వార్తలను ఇవ్వకుండా దాచిపెట్టడం అన్నది కూడా ఒక కార్యక్రమంగా పెట్టుకున్నారు. ఉదాహరణకు తెలుగుదేశం పార్టీ మంగళగిరి వద్ద నిర్మించిన భవనం తాలూకూ ఇరవై ఒక్క కోట్ల రూపాయలను సంబంధిత కాంట్రాక్ట్ సంస్థకు చెల్లించలేదట. ఆ విషయం కోర్టు వరకూ వెళ్లింది. అదే కనుక వైసీపీకి చెందిన కార్యాలయం అయి ఉంటే, టీడీపీ మీడియా రచ్చ రచ్చ చేసి ఉండేది. అంతదాకా ఎందుకు? మైనింగ్ అక్రమాలు అంటూ రోజూ ప్రచారం చేస్తున్న వీరు టీడీపీ హయాంలో జరిగిన స్కామ్‌లపై ఒక్క వార్త కూడా ఇవ్వడం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడు అంత అవుతుంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం సోషల్ మీడియాను మరింత సమర్థంగా వాడుకోవడం తప్ప మరో గత్యంతరం లేదు. కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
వివక్షే ఆర్థికాభివృద్ధికి గొడ్డలిపెట్టు
భారత దేశ ఆర్థిక, సామాజిక, రాజకీయ వ్యవస్థలన్నీ... కులం, కులానికి పునాదైన మతం వల్ల ప్రభావితమై ఉన్నాయి. అందువల్లనే దేశ ఆర్థిక వ్యవస్థ ఉత్పత్తి, పంపిణీల్లో తీవ్రమైన అసమానతలతో కునారిల్లుతోంది. కులానికో ఉత్పత్తి బాధ్యత ఉన్న దేశంలో ఆయా కులాల పట్ల వివక్ష చూపడం, వారికి భూమిని దక్కకుండా చేయడం వల్ల ఉత్పత్తిని స్తబ్ధత ఆవరించిందని అంబేడ్కర్ అన్నాడు. భారతదేశంలో ప్రారంభమైన ఏ విప్లవమైనా కులం ఊబిలోనే సతమతమవుతోంది. కులానికి పునాది అయిన మతాన్ని విస్మరించి మన ఉపరితలంలో ఎంత మాట్లాడుకున్నా మూలం ఘనీభవిస్తూనే ఉంటుంది. మళ్లీ భారతదేశాన్ని పునర్నిర్మించాలంటే అంబేడ్కర్‌ను అధ్యయనం చేయాల్సిన అవసరం ఇక్కడే తప్పనిసరి అవుతుంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రూపొందించిన భారత రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని మనకు అవగతమవుతోంది. అంబేడ్కర్... రాజకీయాల్లో వ్యక్తిత్వం, ఆదర్శం, నీతి, నిజాయితీ చాలా అవసరమని చెప్పి ఆయన స్వయంగా ఆచరించాడు. నాయకులకు వ్యక్తిత్వం శూన్యమైతే భారత సామాజిక, సాంస్కృతిక వ్యవస్థ సంక్షోభంలో పడక తప్పదు. భారతదేశ వ్యాప్తంగా అవినీతి పెరిగింది. అందువల్ల దేశ సంపద అంతా అధికంగా నాయకులు, కార్పొరేట్లు, పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్లింది. ఈ క్రమంలో ప్రతి పదిమందిలో ఒకరు దుర్భరమైన చాకిరీ చేస్తే కానీ బతకలేని స్థితి దాపురించింది. వీళ్ళందరిలో ఎస్సీ, ఎస్టీల పిల్లలు తొంభై శాతం అని సర్వేలు చెబుతున్నాయి. ఇప్పటికీ చాలామంది బొగ్గు క్వారీల్లో, హోటళ్లలో పనిచేస్తూ... రైల్వే ట్రాక్‌ల మీద కాగితాలు, విసిరేసిన సీసాలు ఏరుకుంటూ కాలే కడుపుతో కళ్ళు పీక్కుపోయి బతుకుతున్నారు. రాజ్యాంగం వీరికి కల్పించిన హక్కులు కాలరాయబడుతున్నాయి. భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న మరో విషయం నిరుద్యోగం. సంస్కరణలు వృద్ధి రేటును పెంచినట్టు చూపిస్తున్నాయి. కానీ నిరుద్యోగం అధికమవుతోంది. రెగ్యులర్ ఎంప్లాయీస్‌ను తగ్గిస్తూ క్యాజువల్ లేబర్‌ను పెంచుతున్నారు. దానివల్ల ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం లేకుండా పోయింది. శ్రామిక సంక్షోభానికి తూట్లు పొడిచారు. ఆర్థిక వ్యవస్థ కుంటుపడడానికి కారణమైన లాకౌట్లు యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల జరిగినవే. సంస్కరణల పేరుతో వ్యవస్థాపకులు శాశ్వత శ్రామికుల్ని తొలగించి తాత్కాలిక ఉద్యోగుల్ని నియమిస్తూ వస్తున్నారు. శాశ్వత శ్రామిక వర్గాన్ని అంతరింపజేయాలనీ; సమ్మె, పోరాటం అనే రాజ్యాంగ హక్కులను దెబ్బతీయాలనీ పెద్ద ప్రయత్నం జరుగుతోంది. వ్యయసాయ రంగ విస్తరణ తొమ్మిదో ప్రణాళిక నుండి పధ్నాలుగో ప్రణాళిక వరకూ రెండు శాతం దగ్గరే స్తబ్ధంగా ఉండిపోయింది. దీనికి కారణం వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడుల శాతం తగ్గిపోవడమే. భారతదేశ వ్యాప్తంగా వ్యవసాయ రంగానికి సరైన ప్రోత్సాహం లేదు. వరి, గోధుమ వంటి పంటలను ప్రోత్సహించి భూసారాన్ని సహజంగా పెంచే ప్రక్రియకు తిలోదకాలిచ్చారు. అలాగే వ్యవసాయ కూలీలుగా ఉన్న ముప్పై కోట్ల మంది ఎస్సీ, ఎస్టీలకు ఒక్క శాతం భూమి కూడా లేదు. అంబేడ్కర్ భూమిని పంచకుండా ఆర్థిక సామాజిక వ్యవస్థ బలపడదని స్పష్టంగా చెప్పాడు. ప్రధానంగాఎస్సీ, ఎస్టీలకు భూమి పంపకం జరగలేదు. దానివల్ల దళితుల్లో వ్యక్తిత్వ నిర్మాణం జరగడం లేదు. ‘భారతదేశంలో నేనొక వ్యక్తిని, నాదొక కుటుంబం’ అనే భరోసా రావాలంటే అది భూమి పంపకంతో సాధ్యమవుతుందని అంబేడ్కర్ చెప్పాడు. రైతులు అంటే అన్ని రాష్ట్రాల్లో భూమి కలిగిన ఐదు అగ్ర కులాలను చెప్పుకోవడంలోనే నిర్లక్ష్యం దాగి ఉంది. అంబేడ్కర్ దేశంలోని ప్రతి గ్రామంలోనూ నివసిస్తున్న దళితులందరికీ విద్యుత్ సౌకర్యం ఉచితంగా అందించినప్పుడే వారిలో వెలుగు వస్తుందని చెప్పాడు. ఇప్పటివరకూ నలభై శాతం దళిత వాడల్లో విద్యుత్తు లేదు. ఎస్సీ, ఎస్టీలు చీకటి గుహల్లో జీవిస్తున్నారు. అటువంటి సమయంలో వారి పిల్లలకు విద్యావకాశాలు ఎలా మెరుగు పడతాయని ఈనాటి సామాజిక శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. దళితులను వ్యవసాయ కూలీల నుండి వ్యవసాయ దారులుగా మార్చకపోయినట్లయితే భారతదేశ ఉత్పత్తులు పెరగవని అంబేడ్కర్ ఆనాడే చెప్పాడు. భారతదేశంలో ఉత్పత్తులు స్తబ్ధతలో ఉండడానికి కారణం దళితులకు భూమీ, నీరూ, విద్యుత్తు, విద్య, ఉద్యోగ, ఉపాధి కల్పనల్లో తగిన వాటా లభించకపోవడమే. ఇకపోతే 2017–18 నాటి యునెస్కో లెక్కల ప్రకారం ముప్పై ఐదు శాతం మంది చదవడం, రాయడం రానివారు భారతదేశంలోనే ఉన్నారని తేలింది. ఇందులో నిరక్షరాస్యులుగా ఉంది ఎస్సీ, ఎస్టీలే. నిరక్షరాస్యులుగా ఉంచి మతభావాలు, కులభావాలు కలిగించడం ద్వారా ఓట్లు కొల్లగొట్టాలనే రాజకీయ వ్యూహం నుండి దళితులను, దళిత వయోజనలను బయటకు తీసుకు వచ్చినప్పుడే దళిత విద్యార్థులు విద్యాపరంగా అభివృద్ధి చెందుతారు. ప్రకృతి శక్తులైన దళిత శ్రామికుల మీద చూపిస్తున్న నిర్లక్ష్యం... రాజ్యాంగేతర భావజాలంతో పెరుగుతోంది. అంబేడ్కర్ భారతదేశంలోని కుల, మతాలను అర్థం చేసుకుని, ఆ దృక్కోణంలోనే ఆర్థిక, రాజకీయ వ్యవస్థలను అధ్యయనం చేశాడు. అందుకే భారత రాజకీయాలనూ, ఆర్థిక వ్యవస్థనూ కులం, దానికి పునాది అయిన మతం నేపథ్యంలోనే వ్యాఖ్యానించారు. మార్క్సిస్టులు ఈ అవగాహన నుండి ఇంతవరకు ఆర్థిక శాస్త్రాన్ని చూడలేకపోయారు. భారతదేశంలో ప్రారంభమైన ఏ విప్లవమైనా అది కులం ఊబిలోనే సతమతమవుతోంది. కులానికి పునాది అయిన మతాన్ని విస్మరించి మన ఉపరితలంలో ఎంత మాట్లాడుకున్నా మూలం ఘనీభవిస్తూనే ఉంటుంది. మళ్లీ భారతదేశాన్ని పునర్నిర్మించాలంటే అంబేడ్కర్‌ను అధ్యయనం చేయాల్సిన అవసరం ఇక్కడే తప్పనిసరి అవుతుంది. అంబేడ్కర్ ఇలా అన్నాడు: ‘అధికారంలో ఉన్న వ్యక్తులు దేశ ప్రయోజనాల పట్ల నిర్ద్వంద్వమైన నిబద్ధత కలిగి ఉండేటటువంటి ప్రభుత్వం మనకు రావాలి. న్యాయాన్ని ఇచ్చే సామాజిక, ఆర్థిక నియమావళిని సవరించేటటువంటి ప్రభుత్వం మనకు రావాలి’. ఇకపోతే ఇప్పటికీ ఉద్యోగ వ్యవస్థలో బ్రాహ్మణ, బనియాలదే పెద్ద పాత్ర. ‘ఈపీడబ్ల్యూ’ భారతదేశ అధికార వర్గ వ్యవస్థ గురించి ఇలా పేర్కొంది. దేశ కార్పొరేట్ బోర్డ్ డైరెక్టర్లు... కులాల ప్రకారం బ్రాహ్మణులు 44.6 శాతం, వైశ్యులు 46.0 శాతం ఉంటే, ఎస్సీ, ఎస్టీలు కేవలం 1 శాతంగా ఉన్నారు. 1989–90లో ప్రభుత్వ సంస్థలు 1,160 ఉంటే 2010 నాటికి అవి 21,642కు పెరిగాయి. అదే ప్రైవేటు రంగ కంపెనీలు 1990లో రెండు లక్షలు ఉంటే ఇప్పుడు 8.5 లక్షలకు పెరిగాయి. వాటిలో పెట్టుబడి 64 వేల కోట్ల నుండి 11 లక్షల కోట్లకు పెరిగింది. తాజా అంచనాల ప్రకారం భారత కుబేరుల మొత్తం సంపద జీడీపీలో 15 శాతానికి సమానం. ఐదేళ్ల కిందట ఇది 10 శాతం గానే ఉంది. ప్రస్తుతం దేశంలో 166 మంది బిలియనీర్లు ఉన్నారు. ఆదాయం, వినియోగం, సంపద విషయాల్లో ప్రపంచంలోనే అత్యంత అసమానతలు ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. కులం, మతం, ప్రాంతం, లింగ భేదాలతో కునారిల్లుతున్న భారతీయ సమాజానికి ఆర్థిక అసమానతలు మరింత ఆందోళన కలిగించేవే. ఈ ఆర్థిక అసమానతల వల్ల దళిత, మైనారిటీల స్త్రీల పరిస్థితి అధోగతి పాలయ్యింది. అంబేడ్కర్ ఆర్థిక శాస్త్ర సంపన్నుడు. ఆయన భారత దేశంలో కులం, అçస్పృశ్యత, స్త్రీ వివక్ష పోయినప్పుడు మాత్రమే ఆర్థిక సంపద పెరుగుతుందని చెప్పాడు. ఈ విషయాన్ని ముఖ్యంగా కమ్యూనిస్టులు అర్థం చేసుకోలేకపోయారు. అందువల్ల హిందూవాదులు కులాన్నీ, అస్పృశ్యతనూ స్థిరీకరించే క్రమంలో కార్పొరేట్ వ్యవస్థను విస్తృతం చేసి, రాజ్యాంగ సూత్రాలు దళితులకు అన్వయం కాకుండా చేసి, అçస్పృశ్య భారతాన్ని కొనసాగించాలనే దుర్వ్యూహంలో ఉన్నారు. అంబేడ్కర్ కుల నిర్మూలన, అçస్పృశ్యతా నిర్మూలన భావజాలంతో భారతదేశాన్ని ప్రేమించి, దేశంలో ఉన్న ప్రతి పౌరునికీ ఆర్థిక స్వావలంబనకు అవకాశం కల్పించి, భారతదేశ ఆర్థిక ఉత్పత్తుల్ని పెంచి, కుల రహిత గ్రామీణాభి వృద్ధీ, కుల వివక్ష లేని ఉద్యోగిత; మత అణచివేత లేని, స్త్రీ అణచివేత లేని సామాజిక వాదం సమ్మిశ్రితంగా నూతన ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక విప్లవాన్ని అంబేడ్కర్ మార్గంలో నిర్మిద్దాం. డాక్టర్ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు, కవి. 98497 41695 -
Pawan Kalyan: ఉండాలంటాడా? పోవాలంటాడా?
ఎవరైనా బాణాన్ని గురి చూసి కొడతారు. పవన్ కల్యాణ్ ప్రత్యేకత ఏమిటంటే, ఆయన దాన్ని ఊరికే గాల్లోకి వేస్తారు. అది ఎవరికి తగులుతుందో ఆయనకే తెలీదు. ఒక్కోసారి అది తిరిగొచ్చి ఆయనకే గుచ్చుకోవచ్చు కూడా! ‘కులభావన’ అని ఆయన మాట్లాడిన వాగ్బాణాల విషయంలో జరిగింది ఇదే. పవన్ తెలిసి మాట్లాడారో, అమాయకంగా మాట్లాడారో గానీ, ఏపీలో అన్ని కులాలూ ముఖ్యమంత్రి జగన్‌కు మద్దతు ఇస్తున్నాయన్న అర్థం వచ్చింది. దాన్ని కవర్ చేయడానికి ఎల్లో మీడియా ఆ వార్తనే తిప్పిరాసింది. ఇంతకీ కులభావన చచ్చిపోతే సంతోషించవలసింది పోయి, అది ఉండాలని చెబుతున్నారంటే పవన్ దిగజారి మాట్లాడారని అనుకోవాలా? లేక, ఆయన ఒరిజినాలిటీ బయటపడిందని భావించాలా? ‘‘నేను అడుగుతున్నాను. ఏపీలో కుల భావన అన్నా పెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. కుల భావన కూడా సచ్చిపోయింది. ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి... అన్ని కులాల వ్యక్తులను చూడండి... కాపులకు సంబంధించిన వ్యక్తులు ఉంటారు.. ఎస్సీలకు సంబంధించిన వ్యక్తులు ఉంటారు. అందరూ కలిపి వారి కులాలకు చేసుకున్నా నేను ఆనందపడతా! కానీ అలా చేయడం లేదు. ఆయన బాగుంటే చాలు, మా ముఖ్యమంత్రి నవ్వితే చాలు... అన్నట్లుగా ఉంటున్నారు. కడుపు నిండిపోతుందనుకుంటున్నారు. వారు చివరికి తమ సొంత కులాలను కూడా తిట్టుకునే స్థాయికి వెళ్లిపోయారు.’ ఇదీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్య. సోషల్ మీడియాలో ఇది సహజంగానే వైరల్ అయింది. ఆ వీడియో చూస్తే, అందులో ఎడిటింగ్ జరిగినట్లు కనిపించదు. ఒకవేళ అందుకు భిన్నంగా అని ఉంటే దానిని కూడా తప్పుపట్టాలి. దీనికి ఈనాడు పత్రిక రాసిన వార్త చూడండి: ‘వివిధ కులాలకు చెందిన మంత్రులు వారి వర్గాల ప్రజలను అభివృద్ధి చేసే పరిస్థితి ఇక్కడ లేదు. మంత్రులంతా కలిసి మా సీఎం నవ్వితే చాలు అన్నట్లు వ్యవహరిస్తున్నారని పవన్ కల్యాణ్ విమర్శించారు’ అని పేర్కొంది. నిజంగా పవన్ ఈ మాట అని ఉంటే అలా రాయడం తప్పు కాదు. అలాకాకుండా సోషల్ మీడియాలో వచ్చినది కరెక్టు అనుకుంటే, ఈనాడు పత్రిక ఎంత మోసపూరితంగా వార్తా కథనాన్ని ఇచ్చిందో ఇట్టే తెలిసిపోతుంది. అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తులు అని పవన్ అంటే, ఈనాడు మాత్రం దానిని మంత్రులను ఉద్దేశించి అన్నట్లుగా రాసింది. ఒకవేళ పవన్ ఆ మాట అని ఉంటే అభ్యంతరం లేదు. కానీ ముందుగా అన్న విషయాన్ని కూడా రాసి, ఆ తర్వాత పవన్ సర్దుకున్నారని రాస్తే అది నిజమైన జర్నలిజం అవుతుంది. అలాకాకుండా పవన్ తనకు నష్టం కలిగేలా మాట్లాడారని గ్రహించిన ఈనాడు దానిని సరిచేసే యత్నం చేసిందా అన్న సందేహం సహజంగానే వస్తుంది. అందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టిన దుష్టచతుష్టయంలో ఈనాడు మీడియా కూడా చేరిందన్న భావన ఏర్పడుతుంది. దుష్టచతుష్టయానికి తోడు దత్తపుత్రుడు అని కూడా ఆయన అంటుంటారు. ఆ దత్తపుత్రుడిని కాపాడుకునే పనిలో ఈనాడు గట్టిగానే పనిచేస్తోందని అనుకోవచ్చు. పవన్ టీడీపీ భాషలోనే మాట్లాడడమే కాదు, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాదిరి మాటలు మార్చడంలోనూ పోటీ పడుతున్నారు. ఒక్కోసారి అసలు కులం ఏమిటి? మతం ఏమిటి? కాపులకు రిజర్వేషన్ ఏమిటి? అంటూ ప్రసంగాలు చేసిన ఆయన ఇప్పుడు ఏపీలో ఆయా వ్యక్తులు తమ కులాలకు పని చేసుకోవాలని చెబుతున్నారు. కుల భావన సచ్చిపోయింది అంటే దానర్థం వివిధ కులాలు కలిసిమెలిసి ఉంటున్నాయనే కదా! కాపు కులానికి చెందినవారు కూడా తనకు పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వలేదన్న ఆక్రోశం ఆయనలో కనిపిస్తుంది. అక్కడికి పవన్ కాపు సామాజిక వర్గం అధికంగా ఉండే గాజువాక, భీమవరం నియోజకవర్గాలను ఎంపిక చేసుకుని పోటీచేసినా, రెండు చోట్లా ఓడిపోయారు. అది ఆయనకు జీర్ణించుకోలేని అంశమే. ఈ నేపథ్యంలోనే పవన్ నుంచి ఇలాంటి మాటలు వస్తున్నాయనిపిస్తుంది. ఆయా కులాల వారు ముఖ్యమంత్రి జగన్ నవ్వితే చాలు అన్నట్లు చూస్తున్నారని అంటే దానర్థం ఆయన వారందరినీ బాగా చూసుకుంటున్నట్లే కదా! ఒక రకంగా జగన్‌కు పవన్ కల్యాణ్ సర్టిఫికెట్ ఇచ్చారన్నమాట. పవన్ కల్యాణ్ జనవాణి పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమం, ఆ తర్వాత మీడియాతో సంభాషించినప్పుడు చేస్తున్న వ్యాఖ్యలు గమనిస్తే... అచ్చంగా తెలుగుదేశం–2 అని ఎవరైనా అనుకుంటే అందులో తప్పు కనబడదు. చంద్రబాబు నాయుడు ఏ విమర్శలు చేస్తున్నారో, వాటినే పవన్ కూడా చేస్తున్నారు. టీడీపీ చెప్పే అసత్యాలనే ఈయన కూడా భుజాన వేసుకుంటున్నారు. ఈయనకు సొంతంగా భాష, భావం లేవా? అన్న ప్రశ్నకు ఆస్కారం ఇస్తున్నారు. జనవాణి నిర్వహించడం మంచిదే. కానీ ప్రజల సమస్యల పరిష్కారం కన్నా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్‌పై ఎంత వీలైతే అంత బురద జల్లాలన్న తాపత్రయం కనబడుతుంది. ఉదాహరణకు రేణిగుంట వద్ద ఒక మహిళకు సంబంధించిన ఇంటి స్థలాన్ని ప్రభుత్వం రద్దు చేసిందన్న ఆరోపణ వచ్చింది. ఆ మహిళను బహుశా స్థానిక జనసేన నేతలు తెచ్చి ఉంటారు. వారికి వాస్తవం తెలిసి ఉండాలి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఆమె స్థలం రద్దు అయింది. దానికి కారణం ఆమె అక్కడ నిబంధన ప్రకారం ఇల్లు నిర్మించుకోకపోవడమే. ఆ తర్వాత మరో వ్యక్తికి అధికారులు స్థలం కేటాయించారు. అయినా ఆమెకు మళ్లీ స్థలం ఇవ్వాలని కోరితే తప్పు పట్టనవసరం లేదు. అలా కాకుండా వైసీపీ నేతల దౌర్జన్యం అని పవన్ ప్రచారం చేశారు. దీనిపై వైసీపీ వాస్తవాలు వెలుగులోకి తెచ్చింది. ఇలా అవకాశం ఇవ్వడం ద్వారా పవన్ తనకు కూడా విశ్వసనీయత లేదని చెప్పకనే చెప్పినట్లయింది. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు జతచేయడంపై చెలరేగిన వివాదంలో టీడీపీ, జనసేనల పాత్రపై; మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్లను దగ్ధం చేసిన తీరుపై అప్పుడే పవన్ ఖండించి ఉన్నట్లయితే ఆయనకు మంచి పేరు వచ్చేది. అప్పుడేమో టీడీపీ లాగానే కులచిచ్చు అన్నారు. ఇప్పుడు అంబేడ్కర్ జిల్లాను స్వాగతిస్తున్నామని చెబుతూనే, ఏదో పథకాన్ని ప్రభుత్వం రద్దు చేసిందనీ, అలా చేస్తూ ఒక జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టడం వల్ల ప్రయోజనం ఏమిటనీ ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ పవన్ కల్యాణ్ మనస్ఫూర్తిగా అంబేడ్కర్ పేరును ఒక జిల్లాకు పెట్టడాన్ని స్వాగతిస్తున్నట్లా, లేదా? ఒక స్టూడియో యజమానిని విశాఖలో వైసీపీ నేతలు బెదిరించారని ఆయన ఆరోపించారు. దాన్ని స్పష్టమైన ఆధారాలతో బయటపెడితే ప్రభుత్వం ఆత్మరక్షణలో పడుతుంది కదా! ఆ పనిచేయరు. అది ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడమేనన్నమాట. వైసీపీ నేతల తీరుకు వ్యతిరేకంగా ప్రజలంతా ఒక గొడుగు కిందకు వచ్చి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. సరిగ్గా కొద్ది రోజుల క్రితం చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తూ, ఇంటికి ఒకరు బయటకు వచ్చి ప్రభుత్వంపై తిరగబడాలని కోరారు. తదుపరి మూడు రోజులకు పవన్ నోట అవే పలుకులు వచ్చాయి. తన ఆర్థిక మూలాలపై దెబ్బకొడుతున్నారని కూడా పవన్ కల్యాణ్ ఆరోపించారు. అదెలా సాధ్యం? పవన్‌కు ఏపీలో ఏమైనా ఆస్తులుంటే వాటిని ప్రభుత్వం లాక్కుందా? ఆయనకు వచ్చే సంపాదన రాకుండా చేసిందా? తన సినిమాలు ఆపేస్తున్నారని ఆయన అన్నారు. కొంతకాలం క్రితం ఆయన సినిమా విడుదలైంది కదా! ఎవరైనా ఆపగలరా? నిజంగా అలా జరిగితే ఈ పాటికి కోర్టుకు వెళ్లి గందరగోళం చేసేవారు కాదా? వైసీపీ ప్రభుత్వానికి బాధ్యత ఎలా నిర్వర్తించాలో తామే తెలియజేస్తామని ఆయన అన్నారు. మంచిదే. అంతకు ముందుగా తాను ఒక బాధ్యత కలిగిన రాజకీయ నేతగా వ్యవహరించాలి కదా! సినిమా షూటింగులా మధ్యలో వచ్చి డైలాగులు చెప్పి వెళ్లిపోవడానికి ఇది సినిమా కాదు కదా! ప్రజా జీవితంలో గానీ, వ్యక్తిగత జీవితంలో గానీ తాను ఎంత బాధ్యతగా ఉన్నానన్న విషయాన్ని ఆయనే ఆత్మ విమర్శ చేసుకోవాలి. సింççహాసనం ఖాళీ చేయండి... ప్రజలు వస్తున్నారు... అని ఒక కవి మాటలను పవన్ ఉటంకించడం బాగానే ఉంది. కానీ ప్రజాస్వామ్యంలో అదే ప్రజలు వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేశారన్న సంగతిని గుర్తించడానికి ఆయన మనసు ఒప్పుకోవడం లేదు. అదే అసలు సమస్య. తనను ఘోరంగా ఓడించి, జగన్‌ను ఇంత ఘనంగా గెలిపిస్తారా అన్న దుగ్ధ. సరిగ్గా చంద్రబాబు కూడా ఇదే సిండ్రోమ్‌తో బాధ పడుతున్నారు. జగన్ తనకంటూ ఒక సొంత అజెండాను పెట్టుకుని జనంలోకి వెళ్లి, వాళ్ల ఆదరణ పొందారు. కానీ పవన్ కల్యాణ్ వేరేవారి అజెండా కోసం తన జెండాను మోస్తున్నారు. కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
సామాజిక న్యాయమే పాలన అజెండా
అభివృద్ధి, రాజ్యాధికారం అట్టడుగు వర్గాలకు బదిలీ కావడం రాజ్యాంగ నిర్మాతల లక్ష్యం. ఆంధ్రప్రదేశ్‌లో గత మూడేళ్ల పాలనలో వైఎస్సార్ కాంగ్రెస్ 75 ఏళ్ల స్వతంత్ర భారత్ కనీ వినీ ఎరుగని ఘట్టాలకు నాంది పలికింది. విప్లవాత్మకమైన విధానాల ద్వారా సామాజిక న్యాయాన్ని సాధించడమే అజెండాగా వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ పాలన సాగిస్తున్నారు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా సాధికారతే లక్ష్యమని స్పష్టంగా కనిపిస్తోంది. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడం వెనుకా ఉద్దేశం ఇదే. వైసీపీ ప్లీనరీ జరుగుతున్న నేపథ్యంలో, ఈ దిశగా వైసీపీ ప్రభుత్వ కృషిని తలుచుకోవడం ఎంతైనా సముచితం. బలహీన వర్గాలు పాలితులుగా కాదు, పాల కులుగా ఉండాలన్నదే ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంతి వైఎస్ జగన్ లక్ష్యం. ఆ దిశలోనే ఈ మూడేళ్లలో ప్రభుత్వ పాలన కొనసాగింది. సీఎం విశాల దృక్పథం వల్ల రాష్ట్రంలో వాస్తవ రాజ్యాధికార బదిలీ జరిగింది. సంక్షేమ రంగంతో పాటు, సామాజిక న్యాయం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణ యాలూ, చేసిన పనులూ ఇవాళ దేశంలోని అన్ని రాష్ట్రాలకూ ఆదర్శంగా నిలుస్తున్నాయి. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ జరగనంత సామాజిక న్యాయం జగన్ వల్ల, జగన్ చేత పేద వర్గాలకు జరిగింది. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ముఖ్యమంత్రులున్న రాష్ట్రాలలో కుడా పేద కులాలకు ఇంత పెద్ద ఎత్తున సామాజిక న్యాయం జరగలేదు. అధికారంలో, సంపదలో, సామాజిక గౌరవంలో, విద్యలో... జనాభా ప్రకారం ఎవరి వాటా వారికి ఇచ్చిన దేశంలోనే మొదటి ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి. ఆర్థికంగా, రాజకీయ సాధికారత పరంగా, సామాజిక హోదా పరంగా, విద్యా పరంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఈ ప్రభుత్వం ఎంతో మేలు చేస్తోంది. సామాజిక న్యాయం కోసం బాబాసాహెబ్ అంబేడ్కర్, జ్యోతిబా ఫూలే, బాబూ జగ్జీవన్‌రాం, మౌలానా ఆజాద్, కొమురం భీమ్ కోరు కున్న సమాజం దిశగా ఈ ప్రభుత్వ పాలన కొనసాగుతోంది. కేబినెట్ కూర్పు నుంచి కార్పొరేషన్, నామినేటెడ్ పదవులు, రాజ్యసభ సభ్యత్వాల వరకూ... పదవులు ఏవైనా అన్నింటా ఒకటే సూత్రం: అదే సోషల్ జస్టిస్. తన కేబినెట్లో దాదాపు 70 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్. శాసన సభ స్పీకర్ పదవిని బీసీ వర్గానికీ, శాసన మండలి ఛైర్మన్ ఎస్సీ వర్గానికీ ఇచ్చిన నాయకుడు కూడా ఆయనే. పార్లమెంటులో రెండేళ్ల క్రితం బీసీ బిల్లు పెట్టి చట్టసభలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని పార్లమెంటు చరిత్రను తిరగరాసింది వైసీపీ. దీనికి మద్దతుగా 14 రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టింది. అధికార బీజేపీ పార్టీ వ్యతిరేకించడంతో బిల్లు పెండింగ్‌లో పడిపోయింది. విశేషం ఏమిటంటే, గత 74 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా పార్ల మెంటులో బిల్లు పెట్టలేదు. చివరకు బీసీ పార్టీలుగా చలామణీ అవుతున్న డీఎంకే, అన్నాడీఎంకే, పీఎంకే, ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ, అప్నా దళ్, జనతాదళ్ లాంటి పార్టీలు కూడా బీసీ బిల్లు పెట్ట లేదు. జగన్‌కు బీసీల చరిత్రలో శాశ్వత స్థానం ఉంటుంది. నామినేటెడ్ పోస్టులలో 50 శాతం స్థానాలు వెనుకబడిన వర్గాలకు కల్పిస్తూ, అలాగే కాంట్రాక్టు పనులలో 50 శాతం కోటా ఇస్తూ అసెంబ్లీలో చట్టం చేసి దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ ముఖ్య మంత్రులకు వైసీపీ ప్రభుత్వం సవాల్ విసిరింది. ఏపీలో ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 చైర్మన్ పదవులలో 53 బీసీ కులాలకు (39 శాతం) ఇచ్చారు. ఈ కార్పొరేషన్లలోని 484 డైరెక్టర్ పదవులలో 201 బీసీలకు (42 శాతం) ఇచ్చారు. కార్పొరేషన్ చైర్మన్ పదవులలో, డైరెక్టర్ పదవులలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు కలిపి 58 శాతం పదవులు ఇచ్చి సామాజిక న్యాయం పాటించారు. 56 ప్రత్యేక బీసీ కార్పొరేషన్లు, 3 ఎస్సీ కార్పొరేషన్లు, ఒక ఎస్టీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి అందులోని చైర్మన్, డైరెక్టర్ పదవులన్నింటినీ (684) ఆయా కులాల వారితోనే భర్తీ చేశారు. 193 కార్పొరేషన్లలో 109 కార్పొరేషన్ చైర్మన్ పదవులు బీసీలకే దక్కడం చూసి ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు దిమ్మతిరిగింది. మొత్తం 58 శాతం చైర్మన్ పదవులు బీసీలకే దక్కాయన్నమాట. దీని మూలంగా ఆయా కులాల నాయకత్వం పెరిగింది. ఈ కులాలలో ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతోంది. ఆ కులాలలో తరతరాలుగా పేరుకుపోయిన భావ దాస్యం, బానిస ఆలోచనా విధానం పోయి నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. నామినేటెడ్ పదవులలో 50 శాతం బలహీన వర్గాలకు ఇవ్వాలని చట్టం చేయడమే కాదు, అమలులో 70 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చి ఈ వర్గాలలో అచంచల విశ్వాసం చూరగొన్నారు. శాశ్వత ప్రాతి పదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 11న చేపట్టిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ మరో చరిత్రాత్మకమైంది. 25 మంది సభ్యుల మంత్రివర్గంలో ఏకంగా 17 పదవులను (70 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకే ఇవ్వడం ద్వారా సరికొత్త సామాజిక మహావిప్లవాన్ని జగన్ ఆవిష్క రించారు. అందులో బీసీ, మైనారిటీలకు 11 పదవులు ఇచ్చారు. ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులు ఇస్తే... నాలుగింటిని (80 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే ఇచ్చారు. దేశ చరిత్రలో రాష్ట్ర హోం మంత్రిగా ఎస్సీ మహిళను రెండోసారీ నియమించడం ఇదే ప్రథమం. రాజ్యసభలో మొత్తం 9 మంది వైసీపీ సభ్యులు ఉంటే... అందులో మెజారిటీ సభ్యులు(ఐదుగురు) బీసీలే. ఇటీవల నాలుగు ఖాళీలు ఏర్పడితే... అందులో రెండు బీసీలకే! శాసనసభ స్పీకర్‌గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాం ఎన్నికయ్యేలా చొరవ తీసుకున్నారు. మండలి చైర్మన్‌గా ఎస్సీ వర్గానికి చెందిన కొయ్యే మోషేన్ రాజు, మండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా మైనారిటీ మహిళ జకియా ఖానమ్‌కు అవకాశం కల్పించారు. మండ లిలో వైసీపీకి 32 మంది సభ్యులు ఉంటే, 18 మంది (56.25 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలవారే. అలాగే స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతంకు తగ్గిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెబితే... దానిని పార్టీ పరంగా అదనంగా 20 శాతం పెంచి మొత్తం 44 శాతం స్థానాలకు పైగా బీసీలకు అవకాశం ఇచ్చింది వైసీపీ. ఇది జగన్‌కు బీసీల అభివృద్ధి పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. జిల్లా పరిషత్ ఎన్నికల్లో మొత్తం 13 జిల్లా పరిషత్‌లను వైసీపీ గెలువగా అందులో తొమ్మిది పదవులను (70 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనా రిటీలకే కేటాయించారు. మండల పరిషత్ ఎన్నికల్లో... 648 మండలా లకుగానూ వైసీపీ 635 మండల పరిషత్ అధ్యక్ష పదవులను గెలిచింది. అందులో ఈ వర్గాలకు 442 స్థానాలు (67 శాతం) కేటాయించారు. 13 మున్సిపల్ కార్పొరేషన్లలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఏడు మేయర్ పదవులు బీసీలకు ఇచ్చారు. మొత్తం మేయర్ పదవుల్లో 92 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారికే ఇచ్చారు. 87 మున్సి పాల్టీల్లో 84 మున్సిపాల్టీలను వైసీïపీ రికార్డు స్థాయిలో గెలవగా... చైర్పర్సన్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 73 శాతం ఇచ్చి ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు సవాల్ విసిరారు. రాష్ట్రంలో 196 వ్యవ సాయ మార్కెటింగ్ కమిటీ(ఏఎంసీ) చైర్మన్ పదవుల్లో 76 అంటే 39 శాతం బీసీలకు ఇచ్చారు. మొత్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 60 శాతం పదవులు ఇచ్చారు.. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇచ్చిన శాశ్వత ఉద్యోగాలు దాదాపు 1.30 లక్షలు. వీటిలో 83 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనా రిటీలకే. ఈ 29 నెలల్లోనే ఇచ్చిన 2.70 లక్షల వలంటీర్ ఉద్యోగాలు, ఇతర ఉద్యోగాలు కలుపుకొని మొత్తం 6.03 లక్షల మందికి ఉద్యో గాలు కొత్తగా వచ్చాయి. ఇందులోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ లకు కనీసం 75 శాతానికి పైగా ఉద్యోగాలు ఇచ్చారు. ‘జగనన్న అమ్మ ఒడి’, ‘వైఎస్సార్ రైతు భరోసా’, ‘వైఎస్సార్ చేయూత’, ‘వైఎస్సార్ ఆసరా’, ‘వైఎస్సార్ ఈబీసీ నేస్తం’, ‘వైఎస్సార్ సున్నా వడ్డీ’ వంటి పథకాల ద్వారా చేసిన ప్రత్యక్ష నగదు బదిలీ వల్ల జరిగిన మొత్తం లబ్ధి రూ. 1,87,916.46 కోట్లు. ఇందులో బీసీలకు డీబీటీ, నాన్ డీబీటీ కలిపి రూ. 90,415.92 కోట్లు అందింది. అంటే దాదాపుగా సగం లబ్ధి బీసీలకే చేకూరింది. ఇలా అన్ని రంగాల్లోనూ సామాజిక న్యాయపరంగా వైసీపీ ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తోంది. ఆర్. కృష్ణయ్య వ్యాసకర్త రాజ్యసభ సభ్యులు ‘ మొబైల్: 90000 09164 -
కేసీఆర్ పేరెత్తకుండా పై ఎత్తు.. మోదీ వ్యూహమిదేనా..?
హైదరాబాద్‌లో జరిగిన విజయ్ సంకల్ప సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించిన తీరు ఎలా ఉంది? ఒక జాతీయ పార్టీ నేత, దేశ ప్రధాని కేవలం ఒక ప్రాంత విషయాలకే పరిమితమై మాట్లాడటంలో మతలబు ఏమిటి? బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో తెలంగాణ రాజకీయాలపై ప్రత్యేక డిక్లరేషన్ ఇవ్వడం దేనికి సంకేతం? తెలంగాణలో వచ్చే శాసనసభ ఎన్నికలలో ఎలాగైనా గెలవాలన్న దృఢ సంకల్పంతో బీజేపీ ఉంది. కానీ, ఎక్కడా కేసీఆర్ పేరెత్తకుండా మోదీ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తెలంగాణలో అధికారంలోకి రాగలిగితే సరేసరి. రాలేకపోయినా, ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలన్నది బీజేపీ ప్రయత్నం. తద్వారా కాంగ్రెస్ స్థానాన్ని పొంది, భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేలా ఎత్తుగడలు వేస్తోంది. జాతీయ నేత అయిన మోదీ ప్రాంతీయ ఉపన్యాసం చేస్తే, ప్రాంతీయ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు జాతీయ స్థాయి ఉపన్యాసం చేయడం గమనించవలసిన అంశం. ఇద్దరికీ వేర్వేరు లక్ష్యాలు ఉన్నాయి. మోదీ బహిరంగ సభకు ముందు రోజే కేసీఆర్ రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హాను హైదరాబాద్‌కు రప్పించి మొత్తం సీన్ అంతా బీజేపీ వైపే వెళ్లకుండా తన వాటా తాను పొందేలా యత్నించారు. అంతవరకూ కొంత సఫలం అయ్యారని చెప్పవచ్చు. ఆ సందర్భంగా ఆయన అనేక జాతీయ, అంతర్జాతీయ ప్రశ్నలు లేవ నెత్తారు. శ్రీలంకలో మోదీపై వచ్చిన ఆరోపణలు మొదలు, అమెరికాలో ట్రంప్ కోసం మోదీ ప్రచారం చేశారన్న విషయాల వరకూ; నల్లధనం తెచ్చి భారతీయులకు పంచుతానన్న హామీ నుంచి, రూపాయి విలువ పతనం అయిన తీరు వరకూ పలు ప్రశ్నలు సంధించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశానికే మార్గదర్శకం అంటూ వివిధ శాఖలలో జరుగుతున్న ప్రగతిని వివరిస్తూ పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చారు. ఇది కూడా వ్యూహాత్మకమైనదే. గతంలో మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాగే తన రాష్ట్ర ప్రగతి వివరిస్తూ, భారీ ప్రచారం నిర్వహించేవారు. అది బాగా సఫలం అయి, దేశంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకూ, తద్వారా తనకు ప్రధాని పదవి దక్కడానికీ ఉపయోగపడింది. బీజేపీకి దేశ వ్యాప్తంగా బలం, బలగం ఉన్నాయి. టీఆర్ఎస్కు అంతటి పరిస్థితి లేదు. కేసీఆర్ భారత రాష్ట్ర సమితి పేరుతో పార్టీ పెట్టాలని అనుకున్నా, కొంత వెనుకడుగు వేయక తప్పలేదు. అంతకుముందు ఫెడరల్ ఫ్రంట్ అని హడావుడి చేసినా అదీ సఫలం కాలేదు. ఇప్పుడు జాతీయ రాజకీయాల గురించి గట్టిగా మాట్లాడినా, కేసీఆర్ తక్షణ లక్ష్యం వచ్చే శాసనసభ ఎన్నికలన్నది తెలియనిది కాదు. అలాగే కేసీఆర్ చేసిన విమర్శలకు మోదీ ఎక్కడా జవాబు ఇవ్వకపోవడం కూడా ఇలాంటిదే. ఆయన కేవలం తెలంగాణ గురించి మాట్లాడి తాను ఈ రాష్ట్రానికి చాలా చేస్తున్నాననీ, బీజేపీకి అధికారం ఇస్తే డబుల్ ఇంజన్‌లా పనిచేసి మరింత అభివృద్ధి సాధిస్తామనీ చెప్పారు. కేసీఆర్ చేసిన జాతీయ, అంతర్జాతీయ విమర్శలకు సమాధానం ఇస్తే, వాటికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుందనీ, ఒక ప్రాంతీయ పార్టీ వ్యాఖ్యలను అంత సీరియస్‌గా తీసుకుని ప్రధాని స్థాయిలో స్పందించనవసరం లేదనీ మోదీ భావించి ఉండాలి. పైగా కేసీఆర్‌కు దేశ వ్యాప్త ప్రచారం రావడానికి తాను ఎందుకు దోహదపడాలని అనుకున్నట్లుగా ఉంది. అదే సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాత్రం కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు గుప్పించి, వచ్చేది తమ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ డిక్లరేషన్‌లో కూడా టీఆర్ఎస్పై విమర్శలు గుప్పించారు. విజయ్ సంకల్ప్ సభకు జనం ఏ మాత్రం వచ్చారన్నదానిపై రకరకాల అంచనాలు ఉన్నా, రెండు లక్షల మంది వచ్చినా అది విజయవంతం అయినట్లే లెక్క. అంతేకాక ప్రధానితో సహా ఆయా వక్తలు మాట్లాడుతున్నప్పుడు వచ్చిన స్పందన కూడా బాగానే ఉంది. వచ్చిన ప్రజానీకాన్ని చూసి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ను అందరికీ తెలిసేలా మోదీ అభినందించారు. బీజేపీ తెలంగాణ శాఖ నిజానికి ఇంకా అంత బలం పుంజుకోకపోయినా, ఈ సభను విజయవంతం చేయడం విశేషమే అని చెప్పాలి. కేసీఆర్ పేరు చెప్పి, తీవ్రమైన విమర్శలు, ఆరోపణలు చేస్తే బీజేపీలో మరింత ఉత్సాహం వచ్చి ఉండేదేమో! అమిత్ షా, నడ్డా, పీయూష్ గోయల్, కిషన్ రెడ్డి వంటి కేంద్ర మంత్రులు ఎన్ని విమర్శలు చేసినా, మోదీ మాట్లాడకపోతే అంత ఊపు రాదు. కానీ మోదీ వ్యూహాత్మకంగానే ఇలా చేశారని అనుకోవాలి. పైగా రాజకీయ ప్రత్యర్థులపై ఏమీ మాట్లాడలేదంటే, భవిష్యత్తులో సీరియస్ పరిణామాలు ఉండవచ్చు. తీవ్ర విమర్శలు చేసి, తదుపరి టీఆర్ఎస్ ప్రభుత్వంపై చర్యలకు అడుగులు వేస్తే, రాజకీయంగా ఇబ్బంది రావచ్చు. ఎందుకంటే ఇప్పటికే కేంద్రం తెలంగాణ వ్యవహారాలపై బాగానే దృష్టి పెట్టింది. ఆర్బీఐ నుంచి అప్పు పొందే విషయంలో కూడా యక్ష ప్రశ్నలు వేయడమే ఇందుకు ఉదాహరణ. మోదీ హైదరాబాద్‌లో ఉన్న సమయంలోనే టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరావు కంపెనీకి చెందిన ఆస్తులు జప్తు చేయడం కాకతాళీ యమా, కాదా అన్నది అప్పుడే చెప్పలేకపోయినా, ఏదో బలమైన సంకేతంగానే ఎక్కువ మంది తీసుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్లో ఎన్నికలకు ముందు పలువురు తృణమూల్ కాంగ్రెస్ నేతలను బీజేపీలోకి ఆకర్షించడం ఒక ఎత్తు అయితే, వారిలో కొంతమంది అంతకుముందు సీబీఐ కేసులు, విచారణలు ఎదుర్కో వడం గమనార్హం. వారు బీజేపీలో చేరితేగానీ సేఫ్ కాలేమన్న భావనకు వచ్చారు. శారదా చిట్‌ఫండ్ స్కామ్, నారదా స్టింగ్ ఆపరేషన్ వంటి వాటిలో తృణమూల్ కాంగ్రెస్ నేతలు పలు సమస్యలు ఎదుర్కొన్నారు. ఆ పార్టీ అధినేత మమతా బెనర్జీ వీటన్నిటినీ తట్టుకుని బెంగాల్ గౌరవాన్ని ముందుకు తెచ్చి మరోసారి అధికారంలోకి రాగలిగారు. గుజరాతీయులైన మోదీ, అమిత్ షా పెత్తనం బెంగాల్ పైనా అంటూ ఆమె చేసిన ప్రచారం బాగానే పని చేసింది. అదే రీతిలో తెలంగాణ ప్రభుత్వం కూడా ఇటీవలి కాలంలో ప్రతిదానికీ గుజరాత్‌ను తెరపైకి తెస్తూ, రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని చెబుతోంది. టీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ గుజరాత్‌కు కేంద్రం ఇస్తున్న నిధులు, గిఫ్ట్ సిటీ, ఆర్బిట్రేషన్ సెంటర్ అహ్మదాబాద్‌లో ఏర్పాటు చేయడం వంటివి ఉదాహరిస్తూ తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టే యత్నానికి శ్రీకారం చుట్టినట్లుగా ఉంది. ఈ వ్యూహం ఫలిస్తే టీఆర్ఎస్ మరోసారి గెలవడం తేలికవుతుందని వారు అంచనా వేస్తుండవచ్చు. మరోవైపు బీజేపీ త్రిపుర మోడల్ ప్రయోగానికి వెళుతుందా అన్న అనుమానం కలుగుతోంది. త్రిపురలో ఒకప్పుడు బీజేపీ జాడే లేదు. కానీ గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అంతటినీ ఖాళీచేయించి బీజేపీలో కలుపుకొన్నారు. తద్వారా అక్కడి అధికార పక్షం సీపీఎంను ఓడించగలిగారు. తెలంగాణలో కూడా అలాంటి ఆలోచన ఏమైనా చేస్తుందా అన్న సందేహం కలుగుతోంది. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలలో గెలిచినా, హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో గణనీయంగా ఫలితాలు సాధించినా, తెలంగాణ అంతటా క్షేత్ర స్థాయిలో బీజేపీకి కార్యకర్తలు అంతగా లేరన్నది వాస్తవం. దానిని తీర్చుకోవాలంటే అయితే టీఆర్ఎస్, లేదా కాంగ్రెస్‌ల నుంచి కొందరు ముఖ్యమైన నేతలను ఆకర్షించవలసి ఉంటుంది. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీలో చేరడం కూడా ఇందుకు ఒక ఉదాహరణగా కనిపిస్తుంది. కాంగ్రెస్‌కు క్షేత్ర స్థాయిలో కొంత బలం ఉన్నా, అంతర్గత పోరుతో బాగా ఇబ్బంది పడుతోంది. టీఆర్ఎస్ను మోదీ ఒక్క మాట అనకపోవడాన్ని మ్యాచ్ ఫిక్సింగ్‌గా కాంగ్రెస్ వ్యాఖ్యానిస్తోంది. ఒకవేళ టీఆర్ఎస్పై ప్రజలలో వ్యతిరేకత ఉంటే, కాంగ్రెస్ అయితేనే దాన్ని ఓడించగలుగుతుందని నమ్మకం కుదిరితే తప్ప, ఆ పార్టీకి విజయా వకాశాలు ఉండవు. ఆ దిశలో కాంగ్రెస్ ప్రయత్నాలు సాగిస్తోంది. మొత్తం మీద కేసీఆర్ ప్రస్తావన తేకుండా, కాంగ్రెస్ గురించి విమర్శలు చేయకుండా మోదీ వారికి ప్రాముఖ్యత ఇవ్వకుండా జాగ్రత్తపడితే, మోదీపై కేసీఆర్ విమర్శలు చేసి జాతీయ ప్రాముఖ్యత పొందడానికి ప్రయత్నించారు. వీరిద్దరిలో ఎవరు సఫలం అవుతారన్నది వచ్చే ఎన్నికలలో తేలుతుంది. కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
అతడు మానవవాద విప్లవకారుడు!
అలుపెరుగని సత్యాన్వేషి, కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుడు, ప్రపంచ మానవ వాద విప్లవకారుడు ఎంఎన్ రాయ్– తీవ్ర జాతీయ వాదంలోంచి, ప్రపంచ కమ్యూనిస్ట్ రాజకీయాలతో మమేకమై, తర్వాత కాలంలో రాడికల్ డెమోక్రటిక్ పార్టీ స్థాపకుడయ్యారు. ఒక వ్యక్తి శక్తిగా ఎలా మారగలడో తెలుసుకోవాలంటే ఎంఎన్ రాయ్ జీవితాన్ని అధ్యయనం చేయాలి. భారతీయుడైన రాయ్, మెక్సికన్ కమ్యూనిస్ట్ పార్టీ స్థాపకుడు (1917) కావడమేమిటీ? విచిత్రమని పిస్తుంది. కానీ అది వాస్తవం. ఆయనలోని నిరంతర భావజాల సంఘర్షణ ఆయనని ఏదో ఒక ఆలోచనా ధోరణికి కట్టుబడి ఉండనివ్వలేదు. రాడికల్ డెమోక్రటిక్ పార్టీ స్థాపనతో పాటూ భారత రాజ్యాంగ చిత్తుప్రతిని కూడా తయారు చేసి, ప్రచురించారు. భారతదేశానికి స్వాతంత్య్రం లభించిన సమయానికే ఆయన ‘నూతన మానవ వాదాని’కి మేనిఫెస్టోను రూపొందించి విడుదల చేశారు. ఒక జీవితకాలంలో ఒక వ్యక్తి ఇన్ని పనులు ఎలా చేయగలిగా రన్నది అంతుపట్టని విషయం. డెహ్రాడూన్‌లో తన నివాసమున్న చోటనే ‘ఇండియన్ రినైజాన్స్ ఇనిస్టిట్యూట్’ను స్థాపించారు. ఇది ఆ కాలంలో ‘హ్యూమనిస్ట్ హౌస్’గా పేరు పొందింది. భారతీయ సమాజంలో మనువాదుల ప్రభావంతో శతాబ్దాలుగా వేళ్ళూనుకుని ఉన్న మతతత్వ భావనకి వ్యతిరేకంగా పనిచేయడమే తన సంస్థ ప్రథమ కర్తవ్యమన్నారు రాయ్. ఎంఎన్ రాయ్ అసలు పేరు నరేంద్రనాథ్ భట్టాచార్య. 21 మార్చి 1887న పశ్చిమ బెంగాల్ 24 ఉత్తర పరగణాల్లో ఒక పూజారి కుటుంబంలో పుట్టారు. బాల్యంలో తండ్రి దీనబంధు భట్టాచార్య దగ్గరే సంస్కృతం, కొన్ని సనాతన శాస్త్రాలు చదువుకున్నారు. అప్పుడే అతనిలో కొత్త ఆలోచనలు ప్రారంభమయ్యాయి. 14 వ ఏట వెళ్ళి ‘అనుశీలన్ సమితి’ అనే విప్లవ సంస్థలో చేరారు. కానీ కొద్ది కాలానికే ఆ సంఘం నిషేధానికి గురయ్యింది. ఆ తర్వాత జతిన్ ముఖర్జీని కలవడమే తన జీవితంలో ఒక గొప్ప మలుపు – అని తన గ్రంథం (చైనాలో నా అనుభవాలు)లో రాసుకున్నారు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘జుగాంతర్’ సభ్యులు ఎన్నో కార్యక్రమాలు చేస్తుండేవారు. 1914లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. ఆ కాలంలో రాయ్ జర్మన్ల సహాయంతో బ్రిటిష్ వాళ్లను తరమడానికి ఆయుధాల సేకరణకు ప్రయత్నించారు. 1916లో రాయ్ అమెరికా చేరుకున్నారు. కానీ, బ్రిటిష్ గూఢచారులు అతని కదలికల్ని గమనిస్తూనే ఉన్నారు. రాయ్ శాన్ఫ్రాన్సిస్కోలో అడుగు పెట్టగానే అక్కడి ప్రాంతీయ వార్తా పత్రికలో రాయ్ గురించి ఓ సంచలన వార్త ప్రచురితమై ఉంది. ‘‘ప్రఖ్యాత బ్రాహ్మణ విప్లవకారుడు, ప్రమాదకారి అయిన జర్మన్ గూఢచారి నరేంద్రనాథ్ భట్టాచార్య అమెరికాలో అడుగు పెట్టాడ’’న్నది ఆ వార్త సారాంశం. దొరక్కుండా ఉండటానికి రాయ్ వెంటనే క్యాలిఫోర్నియాకు వెళ్ళిపోయారు. అక్కడ పేరు మార్చుకుని, మానవేంద్రనాథ్ రాయ్ (ఎంఎన్ రాయ్)గా చలా మణీ అయ్యారు. క్యాలిఫోర్నియా నుండి తప్పనిసరై మెక్సికో చేరుకున్నారు. అనతి కాలంలోనే అక్కడి సోషలిస్ట్‌లతో కలిసి ‘మెక్సికన్ కమ్యూనిస్ట్ పార్టీ’ని స్థాపించారు. ఆ తర్వాత మూడేళ్ళకు 1920లో మరో ఆరుగురు నాయకులతో కలిసి భారత కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించగలిగారు. రాయ్ తర్వాత కాలంలో లెనిన్, స్టాలిన్లను కలిసి 1926లో కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ స్థాపించారు. 1930లో ఆయన భారత దేశానికి తిరిగి రాగానే, బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఆరేళ్ళు జైలు శిక్ష విధించింది. ఆ కాలంలోనే రాయ్ తొమ్మిది సంపుటాల ‘‘ప్రిజన్ డైరీలు’’ రాశారు. జైలు నుండి విడుదలైన తరువాత 1946లో రాయ్ డెహ్రా డూన్లో ‘ఇండియన్ రినైజాన్స్ ఇనిస్టిట్యూట్’ స్థాపించారు. ఆ సంస్థ ఆధునిక భౌతిక శాస్త్ర దృక్కోణంలో మానవ వాదాన్ని ప్రచారం చేసింది. పత్రికలు, పుస్తకాలు ముద్రించడం; సభలూ, సమావేశాలే కాదు, కార్యాశాలలు నిర్వహించడం నిరంతరం కొనసాగుతూ ఉండేవి. ఫలితంగానే బలమైన మానవ వాద సాహిత్యం వచ్చింది. రాయ్ జీవితం నుండి, ఆయన ప్రతి పాదించిన రాడికల్ హ్యూమనిజం నుండి దేశంలోని సోషలిస్ట్లు, కమ్యూనిస్ట్‌లు, కాంగ్రెస్ వాదులు, పార్టీ రహిత కార్యకర్తలు ఎంతో మంది ప్రేరణ పొందారు. మతతత్వంపై పోరాడిన రాయ్, 25 జనవరి 1954న తన 67వ ఏట, గుండెపోటుతో కన్నుమూశారు. ప్రస్తుత క్లిష్ట పరి స్థితుల్లో మానవవాద ఆలోచనా ధోరణిని బలోపేతం చేసు కోవాల్సి ఉంది. ఈ బాధ్యత దేశంలోని యువతరానిదే! దేవరాజు మహారాజు వ్యాసకర్త కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు గ్రహీత, జీవ శాస్త్రవేత్త. -
పుష్కరం కిందే యుద్ధ బీజాలు
ఇవ్వాళ ప్రపంచాన్ని పీడిస్తున్న సమస్య రష్యా–ఉక్రెయిన్ యుద్ధమే. ఈ యుద్ధానికి కారణం ఉక్రెయిన్ నాటో సభ్యత్వాన్ని తీసుకోవడానికి చేసిన ప్రయత్నం మాత్రమే కాదు. అది ఒక సాకు మాత్రమే. అమెరికా–రష్యాల మధ్య ఉన్న ఆధిపత్య పోరే అసలు హేతువు. నిజానికి ఉక్రెయిన్‌కు నాటోలో సభ్యత్వం పొందే అర్హత లేదు. ఎందుకంటే, ఆగ్రూపులో సభ్యత్వం పొందాలనుకునే దేశానికి సరిహద్దు గొడవలు ఉండకూడదు. అయినా అమెరికా నాటోలో సభ్యత్వం ఇవ్వడానికి అంగీకరించింది. అంతేకాక ఇతర దేశం ఏదైనా అడ్డొస్తే... తను ఉక్రెయిన్‌కు మద్దతు ఇస్తానని హామీ ఇచ్చింది. ఈ హామీతోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ రష్యాని ఏమాత్రం లెక్కచేయకుండా తన ప్రజలను యుద్ధోన్ముఖులను చేసి ఇప్పుడు తలపట్టుకుంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇరువర్గాల సైనికులనే కాదు ఉక్రె యిన్ పౌరులనూ బలి తీసుకుంటోంది. సామాన్య ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉక్రెయిన్ను విడిచి వెళ్తున్నారు. యుద్ధం వల్ల ఈ రెండు దేశాలు మాత్రమే కాక మొత్తం అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలూ దెబ్బతింటాయి. అలాగే అంతర్జాతీయ సంబం«ధాలు ఎక్కువగా ప్రభావిత మవుతాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత సోవియట్ యూనియన్ అతి శక్తిమంతమైన దేశంగా అవతరించింది. తరువాత కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థలో జడత్వం, తూర్పు యూరోప్ దేశాల ఆర్థిక వ్యవస్థల బాధ్యత, అవినీతి, నిరుద్యోగం లాంటి అనేక కారణాల వల్ల 1991లో పదిహేను స్వతంత్ర దేశాలుగా అది విడిపోయింది. వ్లాదిమిర్ పుతిన్ 2000 సంవత్సరంలో రష్యా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి దేశాన్ని ఆర్థికంగా, రక్షణ పరంగా ఎంతో పటిష్ఠపరిచారు. కానీ 2004లో ఒకప్పటి సోవియట్ యూనియన్‌లో భాగంగా ఉన్న లిథువేనియా, లాత్వియా, ఇస్తోనియాలు తమ ఆర్థికాభివృద్ధి, సార్వ భౌమాధికారం, సరిహద్దు రక్షణల కోసం ఆర్థికంగా అభివృద్ధి చెందిన పశ్చిమదేశాల ఆర్థిక కూటమి అయిన యూరోపియన్ యూనియన్లోనూ, రక్షణ కూటమి అయిన నాటోలోనూ చేరిపోయాయి. దీంతో నాటో బల గాలు ఆయా దేశాల్లో తమ స్థావరాలను ఏర్పాటు చేసుకున్నాయి. ఈ చర్య తన భద్రతకు ముప్పు కలిగించేదని రష్యా మొదటి నుంచీ భావి స్తున్నది. కొత్తగా ఇప్పుడు ఉక్రెయిన్ కూడా పశ్చిమ దేశాల పొంతన చేరటానికి చేస్తున్న ప్రయత్నాలు రష్యాకు కోపం తెప్పించాయి. అసలు ఈ సంక్షోభానికి 2010లోనే బీజాలు పడ్డాయి, ఉక్రెయిన్‌లో ఉన్న నౌకాశ్రయాన్ని ఉపయోగించుకునేందుకు అప్పటి అధ్యక్షుడు విక్టర్ యనుకోవిచ్ రష్యాతో 25 సంవత్సరాలు కొనసాగే ఒప్పందం చేసుకున్నారు. దానికి ప్రతిఫలంగా రష్యా తన సహజ వాయువును 30 శాతం తక్కువ ధరకు ఉక్రెయిన్‌కు సరఫరా చేయ డానికి అంగీకరించింది. కానీ ఈ ఒప్పందం ఉక్రెయిన్ ప్రజలకు నచ్చ లేదు. తర్వాత 2013లో ఉక్రెయిన్‌కు ఈయూ సభ్యత్వ ప్రతిపాదనను తిరస్కరించటం, ఆ తర్వాత జరిగిన సంఘటనల కారణంగా ఉక్రె యిన్ ప్రజల్లో అతని పట్ల వ్యతిరేకత పెరిగింది. దీంతో విక్టర్ అధ్యక్ష పదవినుండి వైదొలగి రష్యాకి పారిపోయాడు. ఉక్రెయిన్‌లో ఉన్న 70 శాతం ఉక్రైనీ భాష మాట్లాడే ప్రజలు తమ దేశం యూరోపియన్ యూనియన్‌లో చేరితే ఉద్యోగ, వ్యాపార అవకాశాలు ఎక్కువగా ఉంటాయనీ, ఆర్థికాభివృద్ధి జరుగుతుందనీ భావించారు. కానీ మిగతా 30 శాతం రష్యన్ భాష మాట్లాడే ప్రజలు ఉక్రెయిన్ రష్యాలో కలవాలనీ, పశ్చిమ దేశాలు తమను బానిసలుగా చూస్తారనీ తలిచారు. ఇదే అదనుగా తీసుకోని రష్యా, 2014లో ఉక్రెయిన్ తూర్పు ప్రాంతమైన క్రిమియాను ఆక్రమించింది. ఆ తర్వాత క్రిమియాలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపించి దానిని పూర్తిగా తన భూభాగంలో కలుపుకొంది. అప్పటినుండి ఉక్రెయిన్‌లోని మిగతా రెండు– డోనెట్సక్, లుహాన్సక్ ప్రాంతాల్లో వేర్పాటువాదులకు రష్యా సహాయం చేస్తోంది. అయితే 2019లో అధ్యక్షుడైన జెలెన్స్కీ ఆధ్వర్యంలో మళ్లీ ఉక్రెయిన్... నాటో సభ్యత్వం విషయం తెరపైకి తీసుకొచ్చింది. నాటోలో ఉక్రెయిన్‌కి సభ్యత్వం లభిస్తే... తన భద్రతకు ముప్పువాటిల్లే అవకాశం ఉందని రష్యా భావిస్తోంది. అందుకే అధ్యక్షుడు పుతిన్ వ్యతిరేకిస్తూ వస్తున్నాడు. ఇదే విషయమై రష్యా కొంత కాలంగా పశ్చిమ దేశాలపైనా ఒత్తిడి తెస్తూనే ఉంది. దానిలో భాగంగానే, రష్యా తన మిత్ర దేశమైన బెలారస్‌తో సైనిక విన్యాసాలు చేసింది. తర్వాత తన రక్షణ దళాలను ఉక్రెయిన్ తూర్పు సరిహద్దుల్లో మోహరించి, రష్యన్ భాషను మాట్లాడే ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా గుర్తిస్తున్నామని హెచ్చరించింది. అయినా అటు అమెరికా, పశ్చిమ దేశాల నుండి కానీ; ఇటు ఉక్రెయిన్ నుండి కానీ నాటో విస్తరణ ఉండబోదని ఎలాంటి హామీ రాలేదు. పైగా ఆర్థిక ఆంక్షలు విధిస్తామని బెదిరింపులకు దిగాయి. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి రష్యా మిలిటరీ ఆపరేషన్ మొదలు పెట్టింది. అయితే ఉక్రెయిన్ ఆక్రమణ తమ ఉద్దేశం కాదనీ, కేవలం మిలిటరీ ప్రదేశాలను నిర్వీర్యం చేయడమే తమ లక్ష్యం అనీ పుతిన్ చెప్పుకొచ్చాడు. అమెరికా, పశ్చిమ దేశాలపై ఒత్తిడి తెచ్చి ఉక్రెయిన్‌ని నాటోలో చేర్చుకోలేమని ప్రకటన చేయించటం లేదా ప్రస్తుతం ఉక్రెయిన్‌లో అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని కూలగొట్టి రష్యాకి సన్ని హితమైన ప్రభుత్వాన్ని అధికారంలో ఉంచి నాటో విస్తరణ జరగ కుండా అడ్డుకోవటం అనే లక్ష్యాలతో రష్యా సైనిక చర్యకు దిగింది. కానీ ఉక్రెయిన్ మాత్రం మొదటగా రష్యానే 1994లో జరిగిన బుడాపెస్ట్ ఒప్పందాన్ని ఉల్లంఘించి 2014లో క్రిమియాని ఆక్రమించిందని వాదిస్తో్తంది. ఈ ఒప్పందం ప్రకారం ఉక్రెయిన్ తన దగ్గర ఉన్న అణుశక్తి సంపదను రష్యాకి అప్పజెప్పినందుకు బదులుగా తను ఉక్రెయిన్ సార్వభౌమాధికారాన్ని గుర్తించి రక్షణ కల్పించాలి. ఆ పని చేయకపోగా తమ భూభాగమైన క్రిమియాను రష్యా ఆక్రమిం చిందనీ, ముందు ముందు తమ దేశంలోని మిగతా ప్రాంతాలను కూడా రష్యా ఆక్రమిస్తుందనీ, దాన్ని ఎదుర్కోవాలంటే తమ రక్షణ సామర్థ్యం సరిపోదు కాబట్టి నాటోలో భాగస్వామి కావాలను కుంటున్నామనీ ఉక్రెయిన్ అంటోంది. యూరోపియన్ యూని యన్‌లో చేరితే తమ దేశ ఆర్థికాభివృద్ధి జరుగుతుందనీ, అందువల్ల దానిలో చేరాలని భావిస్తున్నట్లూ పేర్కొంది. వాస్తవానికి ఉక్రెయిన్‌కు నాటోలో సభ్యత్వం పొందే అర్హత లేదు. ఎందుకంటే, ఆ గ్రూపులో సభ్యత్వం పొందాలనుకునే దేశానికి సరి హద్దు గొడవలు ఉండకూడదు. అయినా అమెరికా నాటోలో సభ్యత్వం ఇవ్వడానికి అంగీకరించింది. అంతేకాక ఇతర దేశం ఏదైనా అడ్డొస్తే... తను ఉక్రెయిన్‌కు మద్దతు ఇస్తానని హామీ ఇచ్చింది. దానితో అమెరికా, పశ్చిమదేశాలు తనకు యుద్ధంలో సహాయం చేస్తాయనీ, ఆర్థిక ఆంక్షలు విధిస్తే రష్యా ప్రపంచంలో ఒంటరి అయిపోతుందనీ ఉక్రెయిన్ అనుకుంది. జరిగిన ఈ తతంగమంతా చూస్తుంటే రష్యా– అమెరికాల మధ్య ఆధిపత్య పోరే ప్రస్తుత యుద్ధానికి అసలు కారణ మని స్పష్టమవుతోంది. ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో రష్యా బాధ్యత ఎంత ఉందో అమెరికాకు కూడా అంతే బాధ్యత ఉంది. అమె రికా ఎప్పుడూ మొదట ఒక దేశాన్ని యుద్ధంలోకి తోసి తను మెల్లగా జారుకుంటుంది. అది అఫ్గానిస్థాన్∙కావొచ్చు లేదా ఉక్రెయిన్ కావొచ్చు... మధ్యలో అనవసరంగా బలయ్యేది అమాయకులైన ప్రజలే అని అర్థం చేసుకోవాలి. భారత దేశానికి ఉక్రెయిన్, రష్యా రెండూ మంచి మిత్రదేశాలు కాబట్టి రెండు దేశాలతో మాట్లాడి గతంలో జరిగిన ఒప్పందాన్ని గౌరవించేలా ఒప్పించాలి. ఇరువర్గాల మధ్య ఉన్న భద్రతా పరమైన ఆందోళనకు తెరదించేలా... ఆంక్షలు విధించకుండా దౌత్యంతోనే సమస్యని పరిష్కరించుకునేట్లు చేయాలి. ఈ యుద్ధం వలన భారత్ పైన ఆర్థిక ప్రభావం కన్నా వ్యూహాత్మక ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే రష్యా మొదటినుండీ అన్ని విషయాలలో ముఖ్యంగా కశ్మీర్ విషయంలో ప్రతి అంతర్జాతీయ వేదికపైనా సమర్థిస్తూ, భద్రతా మండలిలో అనుకూలంగా ఓటువేసి భారత్‌ను సమర్థించుకుంటూ వచ్చింది. ఇప్పటికే భారత్ అంతర్జాతీయ వేదిక పైన రష్యాను ఏకాకిని చేసే విషయంలో ఓటింగుకు దూరంగా ఉండి దానికి అనుకూలంగా వ్యవహరించిందనే చెప్పాలి. రష్యా– ఉక్రెయిన్లు తమ సమస్యలను యుద్ధంతో కాక చర్చల ద్వారానే పరిష్కరించుకోవడానికి భారత్ తన పలుకుబడిని ఉపయోగించాలి. డా. నరేష్ సుధావేణి – వ్యాసకర్త అసిస్టెంట్ ప్రొఫెసర్; సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్, హైదరాబాద్ -
అమెరికా పక్కా ప్లాన్! ఆయుధాల అమ్మకమే ఆ దేశ లక్ష్యం
అమెరికా సామ్రాజ్యవాద యుద్ధాలకూ, ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధానికీ తేడా ఉంది. ఉక్రెయిన్ గగనతలాన్ని రష్యా దిగ్బం ధించింది. విమానాశ్రయా లను ఆక్రమించింది. ఉక్రె యిన్‌లో అమెరికా, నాటో దేశాల ప్రవేశానికి అవకాశం లేకుండా చేసింది. ప్రజా సమూహాల మీద దాడిచేయ లేదు. ప్రాణ నష్టం కనిష్ఠంగా ఉంది. పౌర కమ్యూని కేషన్ వ్యవస్థను నాశనం చేయలేదు. యుద్ధ సమాచార వ్యవస్థను మాత్రమే ధ్వంసం చేస్తున్నది. పౌరుల కదలికల కోసం యుద్ధ విరమణ ప్రకటించింది. అందుకే ప్రజలు సెల్ఫోన్లు వాడుతూనే ఉన్నారు. కన్నయ్య కుమార్ విషయంలో మోదీ మాధ్య మాలు చేసినట్లు పాశ్చాత్య మాధ్యమాలు దృశ్యాలను కాలాంతరీకరించాయి. విషయాంతరీకరించాయి (morphed and doctored). అబద్ధాలు, అతిశ యోక్తులు ప్రదర్శించాయి. యుద్ధంలో సైనిక, జన, ఆస్తి నష్టాలు తప్పవు. ఈ యుద్ధంతో దాదాపు 20 లక్షల ప్రజలు ఇతర దేశాలకు వలస వెళ్లారు. స్వీడన్ లాంటి ఐరోపా దేశాలు ఈ వలసదారులకు మూడేళ్ల పాటు వీసా లేకుండా ప్రవేశం కల్పించాయి. వసతి, ఉపాధి, తిండి, జీవితావసరాలు ఏర్పాటు చేశాయి. రష్యా తాత్కాలికంగా నష్టపోయింది. అమెరికా బాగా లాభపడింది. రష్యా నుండి జరగవలసిన దిగుమతులు అమెరికా నుండి జరుగుతాయి. చమురు, సహజవాయువు, లోహాలు, ముడిపదార్థాల కోసం రష్యాపై ఆధారపడ్డ నాటో, పాశ్చాత్య దేశాలు విపరీతంగా నష్టపోయాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలయింది. మార్కెట్లు పతనమయ్యాయి. యుద్ధా నికి ముందు 90లలో ఉన్న బ్యారెల్ ముడి చమురు ధర 140 డాలర్లకు చేరింది. 300 డాలర్లకూ చేరు తుందని అంచనా. దీంతో ద్రవ్యోల్బణం, మొత్తం ప్రజల జీవన వ్యయం పెరిగింది. అమెరికా ద్రవ్యో ల్బణం 40 ఏళ్ల గరిష్ఠానికి చేరింది. అమెరికా ఒత్తిడిలో ప్రపంచం ఏకధ్రువం నుండి ఏకఛత్రంగా మారింది. మునుపు పిల్లికి బిచ్చం పెట్టని దేశాలు ఉక్రెయిన్‌కు ఆయుధ సాయం చేశాయి. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత యుద్ధ తటస్థంగా ఉన్న స్వీడన్, అతి తటస్థ స్విట్జర్లాండ్ కూడా ఉక్రెయిన్‌కు ఆయుధాలు ఇచ్చాయి. ఈ ఏకఛత్రం భయానకం. ప్రసార మాధ్యమాలు ఆమెరికాకు వంత పాడాయి. పాలకులు సమయస్ఫూర్తి, వివేకం, విచక్షణ, ప్రజాప్రయోజనాలను వదిలి ఉద్రేకంగా ఉపన్యసించారు. నాటో, పశ్చిమ దేశాల నాయకులు అమానవీయంగా ప్రవర్తిస్తూనే గుండె లోతుల్లో ఉక్రె యిన్ గురించి బాధపడుతున్నామంటారు. రష్యా లేని ప్రపంచం అనూహ్యమని పుతిన్ బెదిరిస్తారు. అమెరికా సైన్యాన్ని పంపననడం ఆశ్చర్యం కాదు. యుద్ధ సామగ్రి అమ్మకమే లక్ష్యంగా గల అమెరికా ఇలానే చేస్తుంది. ఉక్రెయిన్ను రెచ్చగొట్టి మోసం చేసింది. ఈ మాట ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీయే అన్నారు. అమెరికాతో సహా మిగతా దేశాల ఆలోచనా విధానం ఇలాగే కొనసాగితే... ఉక్రెయిన్ను రష్యా ఆక్రమిస్తుంది. కీలుబొమ్మ ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది. రష్యా క్రిమియాను ఆక్రమించినపుడు మిన్నకుండినట్లే అమెరికా ఇప్పుడు కూడా తమాషా చూస్తూ ఊరకుంటుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అమెరికా నేతృ త్వంలోని నాటో దేశాల మోసాన్ని గుర్తించారు. బాధ పడ్డారు. నాటో సభ్యత్వం అక్కరలేదన్నారు. డొనేట్సక్, లుహాన్సక్ రిపబ్లిక్ల స్వతంత్రతపై చర్చించాలన్నారు. ఇది యుద్ధవిరమణకు దారితీస్తుందని ఆశిద్దాం. భవిష్యత్తులో అమెరికా, నాటో, పాశ్చాత్య దేశాల పాల కులు అధికార దాహం, కార్పొరేట్ పక్షపాతాన్ని వదిలి ప్రజాపక్షం వహించాలని కోరుకుందాం. సంగిరెడ్డి హనుమంత రెడ్డి వ్యాసకర్త ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి, మొబైల్: 94902 04545 -
ఈ విజయం ప్రతిపక్షాలకు గుణపాఠం
మారుతున్న మనోభావాలకు ప్రతిస్పందించడం ద్వారా బీజేపీ 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాగ్రహం నుంచి తప్పించుకుంది. ప్రత్యామ్నాయ కృషిని ప్రజల ముందు ఉంచనంతవరకూ, మోదీని నిందించడం ద్వారా మాత్రమే ప్రతిపక్ష పార్టీలు ప్రజా విశ్వాసాన్ని పొందలేవు. ఎన్నికలు సమీపిస్తుండగా కొద్ది నెలల పాటు ర్యాలీలను నిర్వహించి ఊరుకోవడం ఇకపై పనిచేయదు. ఎందుకంటే బీజేపీ, ఆరెస్సెస్ కలిసి 365 రోజులూ పోటీపడేలా రాజకీయాలను మార్చేశాయి. సమాజంలో నిజమైన మార్పును తీసుకొచ్చేది ఆశలను నెరవేర్చడమే గానీ నిరాశాపరులకు నచ్చజెప్పడం కాదు. ఇటీవలి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సరైన గుణపాఠాలు తీసుకోవడానికి సిద్ధపడితే ప్రతిపక్షాలకు ప్రయోజనకరం. భారతదేశ రాజకీయ పరిదృశ్యాన్ని బీజేపీ ఎంతగా మార్చివేసిందనే అంశాన్ని ఇటీవలే ముగిసిన అసెంబ్లీ ఎన్నికలు మరోసారి చర్చకు పెట్టాయి. ఎన్నికల ఫలితాలను ఇస్లామోఫోబియా అనే యధాలాప నిర్ధారణతో తేల్చి పడేయడం కంటే ఆ ఫలితాలపై సరైన గుణపాఠాలు తీసుకోవడానికి సిద్ధపడితే అందరికీ ప్రయోజన కరం. ఇస్లామోఫోబియా అనే భావన అనేక వర్ణనలు, వ్యూహాలతో కలిసి ఉంటుందని మనం అర్థం చేసు కోవాలి. ఇలాంటివన్నీ ఏకకాలంలో ప్రభావం కలిగిస్తుంటాయి. బీజేపీ దీర్ఘకాలంగా మనగలుగుతుండటానికి కారణం– సామాజిక, సాంస్కృతిక అంశాలు, రాజకీయాలను కలగలపడమే. మెజారిటీ వాదాన్ని ఎత్తిపట్టడం, నిర్మొహమాటంగా ముస్లింల పట్ల మినహా యింపులు కలిగి ఉండటం కొనసాగిస్తున్నప్పటికీ, దేశంలో సాంస్కృ తిక అంశాల గురించి ఆలోచించే సమర్థత కలిగిన ఏకైక పార్టీ బీజేపీనే అని ఒప్పుకోవాలి. సామాజిక రంగాన్ని చర్చించడానికి ప్రత్యామ్నాయ మార్గం ఏదన్నది ప్రతిపక్షాల ముందు ప్రశ్నగా నిలుస్తోంది. సంస్కృతి గురించిన చర్చను పక్కన పెట్టడం లేదా దానితో ఆటాడటం పైనే లౌకిక పార్టీలు సతమతమవుతున్నాయి. బీజేపీ మతతత్వ పార్టీనే కావచ్చు, కానీ సంస్కృతిపరమైన, మతపరమైన వ్యత్యాసాల విష యంలో ఏం చేయాలని తాను కోరుకుంటోందో దాన్ని చేయగల స్థానంలో ఆ పార్టీ ఉంది. తన సాంస్కృతిక ప్రతీకాత్మత ద్వారా ఒక లోతైన అర్థాన్ని ఆ పార్టీ ప్రతిపాదిస్తోంది. మతపరమైన ద్వేష భావా నికి బీజేపీ ప్రజల నుంచి ఆమోదం పొందగలగడంలో వారి ఉనికికి సంబంధించిన భావన పనిచేస్తోంది. ఇలాంటి సానుకూలత ప్రతిపక్షా నికి అసలు లేదు. ముజఫర్ నగర్ దాడుల విషయంలో సమాజ్ వాదీ పార్టీ మౌనం పాటించింది. కాంగ్రెస్ కూడా దీనికి భిన్నంగా లేదు. ప్రతిపక్షం ఇక్కడినుంచే ప్రారంభం కావలసి ఉంది. రాజకీయ ప్రయోజనాలను పొందడానికి సామాజిక, సాంస్కృతిక అంశాలను ప్రతిపక్షం చర్చకు పెట్టాలి. వివిధ సామాజిక బృందాలను అవి ఏకం చేయాలి. క్రాస్ కల్చరల్ చర్చలను నిర్వహించి, ఉద్రిక్తతలను తగ్గించాల్సి ఉంది. రెడీ మేడ్‌గా అందుబాటులో ఉండదు కాబట్టి ఒక కొత్త దార్శనికతను ప్రతిపక్షాలు నిర్మించాల్సి ఉంది. భారత్‌లో రాజ్యాంగపరమైన నీతి అనేది ఉనికిలో లేదు కాబట్టి, దాన్ని నిర్మించాల్సి ఉందని అంబేడ్కర్ ఏనాడో సూచించారు. సౌభ్రాతృత్వం అనేది రాజ్యాంగపరమైన సూత్రంగా ఉండదని ఆయన చెప్పారు. నిర్దిష్ట వాస్తవికత నుంచి చేయ వలసిన అలాంటి నిఖార్సయిన పరిశీలనలు కొన్ని కీలకమైన ప్రశ్నలు సంధించడానికి ప్రారంభ బిందువుగా ఉంటాయి. హిందూ–ముస్లిం సంబంధాలు ఎలా ఉండాలి? రాబోయే దశా బ్దాల్లో కులాంతర సంబంధాలు ఎలా ఉండాలి? సామాజిక అంత రాలు, దురభిప్రాయాలను పట్టించుకోకుండా రాజకీయ పొత్తులతో అతుకులేసే రోజులు పోయాయి. ఇది బీజేపీ విజయంలోనే కాకుండా, మజ్లిస్, బీఎస్పీ పార్టీల పరాజయంలో కూడా స్పష్టంగా కనిపిస్తున్న ఆహ్వానించదగిన మార్పు. మతపరమైన వాక్చాతుర్యం రెడీమేడ్‌గా ఎవరికీ అందుబాటులో ఉండదు. ఆరెస్సెస్, దాని అనుబంధ సంస్థలు దాన్ని నిర్మించాయి. కోవిడ్–19 మహమ్మారిని అదుపు చేయడంలో బీజేపీ ప్రదర్శిం చిన నిర్లక్ష్యాన్ని మనం తప్పుపట్టవచ్చు. కానీ అఖిలేశ్ యాదవ్ కూడా దీనికి భిన్నంగా లేరు మరి. సెకండ్ వేవ్ విజృంభిస్తున్నప్పుడు అఖిలేశ్ కనిపించకపోవడం కూడా వ్యతిరేక భావనలను కలిగించింది. తాము విజయం సాధించడానికి ఇతరుల వైఫల్యాలను ఏకరువు పెట్టడం ఒక్కటే మార్గం కాదు. ఏం చేసినా తాము పడి ఉంటామనే భావనను ప్రజలు సవాలు చేస్తున్నారు. మారుతున్న మనోభావాలకు ప్రతిస్పం దించడం ద్వారా బీజేపీ ప్రజాగ్రహం నుంచి తప్పించుకుంది. ప్రత్యా మ్నాయ కృషిని ప్రజల ముందు ఉంచనంతవరకూ, మోదీని నిందిం చడం ద్వారా మాత్రమే ప్రజా విశ్వాసాన్ని పొందలేరు. పశ్చాత్తాపానికి చెందిన నిజమైన చర్యగా, నీళ్లు నిండిన కళ్లతో ప్రతిపక్షాలు జనం ముందుకు రావాలి. తాము పశ్చాత్తాపపడుతున్న ఉద్దేశాన్ని ప్రదర్శి స్తూనే వారు నేరుగా ప్రజలముందు స్పందించాలి. ప్రతిపక్షాలు ఇక్కడ పొందిన వైఫల్యమే పాలకపక్షం విజయంగా మారిపోయింది. ఎన్నికలు సమీపిస్తుండగా కొద్దినెలల పాటు ర్యాలీలను నిర్వ హించి ఊరుకోవడం ఇకపై పనిచేయదు. ఎందుకంటే బీజేపీ, ఆరెస్సెస్ కలిసి 365 రోజులు పోటీపడేలా రాజకీయాల యాంటె న్నాను మార్చిపడేశాయి. ఫలితాలకు అతీతంగా నిజాయితీగా పని చేయడానికి ఇప్పుడు ఇదే కొలమానమైపోయింది. ప్రజల దృష్టిలో కష్టించి పనిచేసేవారికే విలువ ఉంటుంది. అనియత రంగంలో పని చేసేవారే మనదేశంలో ఎక్కువమంది కాబట్టి రాజకీయాల్లో విరామం లేకుండా పనిచేసేవారిని సులభంగా గుర్తిస్తారు. ఒక్క మమతా బెనర్జీ తప్ప ఉత్తరాదిన ప్రతిపక్షాల్లో ఏ ఒక్క నాయకుడూ ప్రజల దృష్టిలో ఇలాంటి ఇమేజ్‌కి దగ్గర కాలేకపోయారు. సామాన్య ప్రజలతో మమేకం కావడం గొప్ప సెంటిమెంటును కలిగిస్తుంది. ప్రజల రోజువారీ జీవితాలను స్పృశించకుండా, సంవత్సరంపాటు ప్రజలతో మమేకం కాకుండా ఉండివుంటే బీజేపీకి ఇంత చక్కటి విజయాలు లభ్య మయ్యేవి కాదు. కులమత ప్రాతిపదికనే బీజేపీ రాజకీయం చేస్తోందన్నది వాస్తవమే కావచ్చు గానీ కుల మతాలకు అతీతంగా బీజేపీ ఈ దఫా ఎన్నికల్లో స్వరం పెంచడం దానిపట్ల సానుకూలతను పెంచింది. అయితే కులనిర్మూలన వంటి గంభీర పదాల జోలికి వెళ్ళకుండా ఆధిపత్య రాజకీయాల నుంచి బయటపడాలని చెబుతూ వచ్చింది. ఒక పార్టీకి, వ్యక్తికి మేలు చేసే తరహా కుల రాజకీయాలు తాను చేయ లేనని బీజేపీ గట్టిగా చెప్పింది. చరణ్‌జీత్ సింగ్ చన్నీ, మాయావతి, అసదుద్దీన్ ఒవైసీ వంటి నేతలు ఈ ఎన్నికల్లో ఎందుకు వెనుక బడ్డారంటే తమది ఫలానా కులమనీ, మతమనీ ముద్ర వేయించు కుంటే నడిచే రాజకీయాలకు ఇప్పుడు కాలం కాదు. సామాజిక న్యాయం కుల ప్రాతినిధ్యంతో ఇక సిద్ధించదు. అలా ఎవరైనా చెబితే జనం నమ్మే పరిస్థితి పోయింది. మన సమాజం అంతరాలతో కూడిన అసమానతల సమాజం అని డాక్టర్ అంబేడ్కర్ మనకు మళ్లీ గుర్తు చేస్తున్నారు. వీళ్ల కోసం పనిచేయడమే, వీరికి మేలు చేకూర్చడమే నిజమైన మార్పునకు దారితీస్తుంది. తాజా అసెంబ్లీ ఎన్నికలను ఆర్థిక కష్టాలపై సంస్కృతి విజ యంగా భావించలేం. దానికి బదులుగా ఆర్థిక అవసరాలు సాంస్కృ తిక సులోచనాల ద్వారా వ్యక్తమవుతున్నాయి. బీజేపీ సాంస్కృతిక విలువల పునాదిపైనే తన ఆర్థిక కార్యక్రమాలను తీసుకొచ్చింది. బీజేపీ ఉజ్వల పేరుతో పథకం ప్రకటించిందిగానీ సిలిండర్‌ని రీఫిల్ చేసుకోవాల్సిన బాధ్యతను లబ్ధిదారులపైనే పెట్టింది. విమర్శనాత్మక చింతనాపరుడు రేమాండ్స్ విలియమ్స్ ఒక విష యాన్ని స్పష్టంగా చెప్పారు. సమాజంలో నిజమైన మార్పును తీసు కొచ్చేది ఆశలను నెరవేర్చడమే గానీ నిరాశాపరులకు నచ్చజెప్పడం కాదు. ఇన్నాళ్లుగా మన ప్రతిపక్షాలు చేస్తూ వచ్చింది– నిరాశాజీవులకు నచ్చచెబుతూ రావడమే! ఊరకే బాధల గురించి ట్వీట్ చేయడం, నరేంద్ర మోదీ తప్పుల గురించి ఊదరగొట్టడం అనేవి ప్రతిపక్షాలకు ప్రత్యామ్నాయాన్ని సృష్టించిపెట్టవు. మెజారిటీ ప్రజల్లోని నిరాశకు మార్గాన్ని చూపిస్తూనే, జాతీయ భంగిమను ప్రదర్శించడం ద్వారా మోదీ ఏకకాలంలో అటు పాలకుడిగానూ, ఇటు ప్రతిపక్ష నేతగానూ వ్యవహరించారు. అదే ఈ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ విజయానికి అసలు కారణం! అజయ్ గుడవర్తి వ్యాసకర్త అసోసియేట్ ప్రొఫెసర్, జేఎన్‌యూ, ఢిల్లీ (‘ద వైర్’ సౌజన్యంతో) -
2024 సాధారణ ఎన్నికలకు సూచికే
- సాక్షికి ప్రత్యేకం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మరోసారి తన రాజకీయ ఆధిపత్యాన్ని చాటిచెప్పింది. ప్రభుత్వ సానుకూల ఓటుతో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్లలో విజయ ఢంకా మోగించి, గోవాలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సకాలంలో చేర్చడంలో యూపీ ప్రభుత్వం విజయవంతం కావడం ఆ రాష్ట్రంలో బీజేపీ విజయ కారణాల్లో ఒకటి. వ్యవసాయ చట్టాల కారణంగా జాట్ రైతుల్లో పెల్లుబికిన ఆగ్రహాన్ని, ముస్లిం వర్గాల వారిని ఏకాకులను చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ఓట్లుగా మార్చుకోవడంలో ఎస్పీ విఫలమైంది. ఇక పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని ‘హస్త’గతం చేసుకుంది. ఈ విజయం ఆ పార్టీ అవినీతి రహితమైంది, అభివృద్ధి కోసం కృషి చేసేదన్న అంచనాల ద్వారా దక్కినదే! ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగిం టిని గెలుచుకుని భారతీయ జనతా పార్టీ మరోసారి తన రాజకీయ ఆధిపత్యాన్ని చాటిచెప్పింది. ప్రభుత్వ సాను కూల ఓటుతో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్లలో విజయ ఢంకా మోగించి, గోవాలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈసారి ఎన్నికల ఫలితాలను ఎగ్జిట్ పోల్స్ సరిగ్గానే అంచనా వేశాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం ఎవరిపై ఉంటుంది? ఎన్నికల్లో ఎవరు ఎందుకు ఓటు వేశారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యూపీలో మోడీ–యోగీ హవా! ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ విజయానికి మోడీ–యోగీ ద్వయం కారణ మన్నది నిర్వివాదాంశం. మొత్తం 403 స్థానాల్లో 255 బీజేపీకి దక్కడం, అది కూడా 41 శాతం ఓటుషేరుతో కావడం భారీ విజయం గానే చెప్పుకోవాలి. 2017 ఎన్నికలతో పోలిస్తే 57 సీట్లు తగ్గాయి. ఈసారి బీజేపీతో కలిసి పోటీ చేసిన అప్నాదళ్ (సోనేలాల్) పన్నెండు స్థానాలు గెలుచుకోగా, నిర్బల్ ఇండియన్ శోషిత్ హమారా ఆమ్ దళ్ ఇంకో ఆరు సీట్లు గెలుచుకుంది. సమాజ్‌వాదీ పార్టీ గత ఎన్నికల కంటే 73 స్థానాలు ఎక్కువగా, మొత్తం 111 స్థానాల్లో విజయం సాధించడం గమనార్హం. సైకిల్ గుర్తుకు పడ్డ ఓట్లూ 32 శాతానికి చేరాయి. ఎన్నిక లకు ముందు ఎస్పీతో జట్టు కట్టిన ఆర్ఎల్డీ 8, ఎస్బీఎస్పీ 6 స్థానాల్లో విజయం సాధించాయి. మాజీ ముఖ్యమంత్రి మాయావతి నేతృత్వంలో బీఎస్పీ 13 శాతం ఓట్లు సాధించినప్పటికీ ఒకే ఒక్క సీటుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ రెండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఏతావాతా యూపీ రాజకీయాల్లో తమకు తిరుగులేదని భారతీయ జనతా పార్టీ మరోసారి నిరూపించుకుంది. ఈ ఎన్నికలు శాంతి భద్రతలకూ, సమాజ్‌వాదీ గూండా రాజ్యానికీ మధ్య జరుగుతున్నాయన్న బీజేపీ ప్రచారం బాగానే పనిచేసిందని ఫలితాలు చెబుతున్నాయి. రాష్ట్ర పునర్నిర్మాణానికి యోగీ అవసరమని భావించిన ఓటర్లు తమ తీర్పును విస్పష్టంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే గతంలో ఎన్నడూలేని విధంగా ఒక పార్టీకి వరుసగా రెండోసారి అధికారం చేపట్టే అవకాశం దక్కింది. అలాగే ‘ఎన్సీఆర్’ ప్రాంతంలోని నోయిడాను సందర్శించిన వారు యూపీ గద్దెనెక్కలేరన్న గుడ్డి నమ్మకాన్ని కూడా యోగీ ఆదిత్యనాథ్ వమ్ము చేశారు. బీజేపీ ఈ ఎన్నికల్లో రాణించడానికి పలు కారణా లున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి యోగీ ఆదిత్య నాథ్‌ల చరిష్మాతో పాటు కేంద్రం, రాష్ట్రం రెండింటిలోనూ అధి కారంలో ఉండటమూ కలిసొచ్చింది. మోడీ హవా సామాజిక వర్గా లను దాటుకుని అన్ని వర్గాల నుంచి బీజేపీకి ఓట్లు పడేలా చేసింది. అగ్రవర్ణాలు, ఎస్సీలు, చిన్న చిన్న ఓబీసీ వర్గాలతో కలిసి 2014లో సృష్టించుకున్న కూటమి బీజేపీకి దన్నుగా (కొన్ని ప్రాంతాలు మినహా) నిలిచింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సకాలంలో చేర్చడంలో ప్రభుత్వం విజయవంతం కావడం బీజేపీ విజయ కారణాల్లో ఇంకోటి. ఈ పథకాల లబ్ధిదారులు, ముఖ్యంగా మహిళలు బీజేపీకి మూకుమ్మడిగా ఓట్లేశారు. వ్యవసాయ చట్టాల కారణంగా జాట్ రైతుల్లో పెల్లుబికిన ఆగ్రహాన్ని, ముస్లిం వర్గాల వారిని ఏకాకులను చేసేందుకు జరుగు తున్న ప్రయత్నాలను ఓట్లుగా మార్చుకుందామనుకున్న ఎస్పీ ఈ విషయంలో తీవ్ర భంగపాటుకు గురైంది. వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం, బీజేపీ సీనియర్ నేతలు జాట్ నేతలను కలవడం పరిస్థితిని బీజేపీకి కొంత అనుకూలంగా మార్చింది. ఆర్ఎల్డీ, ఇతర చిన్న పార్టీలతో కలిసి ఎన్నికల బరిలోకి దిగితే ఎక్కువ సీట్లు సాధించ వచ్చునన్న ఎస్పీ అంచనా తప్పింది. వేర్వేరు పార్టీల మధ్య ఓట్ల మార్పిడి కూడా సరిగ్గా జరగలేదు. అయితే, ఎస్పీ కూటమికి దక్కిన అదనపు సీట్లు బీజేపీ వ్యతిరేక పార్టీలతో జాతీయ స్థాయి కూటమి కట్టాలన్న ప్రయత్నంలో జరిగిన మార్పు అనుకోవాలి. పంజాబ్‌ను ఊడ్చిన ఆమ్ ఆద్మీ పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ తన పార్టీ గుర్తు అయిన చీపురుతో ప్రతిపక్షాలన్నింటినీ ఊడ్చేసిందంటే అతిశయోక్తి కాదు. అసెంబ్లీ స్థానాలు 117లో ఏకంగా 92 గెలుచుకోవడం ఆషామాషీ వ్యవహారం కాదు. గత ఎన్నికలతో పోలిస్తే పెరిగిన ఓట్లు 22 శాతమే అయి నప్పటికీ సాధించిన అదనపు సీట్లు మాత్రం 72. కాంగ్రెస్ పార్టీ 23 శాతం ఓట్లతో 18 స్థానాలకు పరిమితమైంది. శిరోమణి అకాలీదళ్ – బీఎస్పీ కూటమి నాలుగు స్థానాలు గెలుచుకుంటే, బీజేపీ రెండు స్థానాలతో సరిపెట్టుకుంది. ఆప్‌కు పంజాబ్‌లో దక్కిన అపూర్వ విజయం... ఆ పార్టీ అవినీతి రహితమైంది, అభివృద్ధి కోసం కృషి చేసేదన్న అంచనాల ద్వారా దక్కినదే. అదే సమయంలో ఈ ఓటు భూస్వామ్యవాద పోకడలతో, అవినీతిలో మునిగిపోయిన రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా పడ్డది గానూ చూడవచ్చు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ అంతర్గత కుమ్ము లాటలు, వర్గపోరుల కారణంగా ఓడిపోవాల్సి వచ్చింది. కెప్టెన్ అమరీందర్‌సింగ్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ మధ్య భగ్గుమన్న విభేదాలు పార్టీ మద్దతుదారులు అనేకులు దూరమమ్యేందుకు కారణమైంది. సిద్ధూను పార్టీ అధ్యక్షుడిగా, దళితుడైన చరణ్‌జీత్‌సింగ్ చన్నీని ముఖ్యమంత్రిగా నియమించడం పరిస్థితిని మరింత దిగజార్చింది. చన్నీ, సిద్ధూ ద్వారా రాష్ట్రంలోని 32 శాతం దళిత, 20 శాతం జాట్ ఓటర్లను కూడగట్టాలని అనుకున్న కాంగ్రెస్ పథకం పూర్తిగా బెడిసికొట్టింది. ఆధిపత్య పోకడలకు పోయే జాట్ సిక్కులతో కలిసి ప్రయాణించలేమనుకున్న దళితులు మూకుమ్మడిగా ఆమ్ ఆద్మీ పార్టీ వైపు మొగ్గారు. అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత, ప్రచార లోపాలు అన్నీ ఆమ్ ఆద్మీ పార్టీకి కలిసి వచ్చాయి. ముఖ్యమంత్రి అభ్యర్థిగా భగవంత్ మాన్‌ను ప్రకటించిన క్షణం నుంచి ఆ పార్టీకి అనుకూల పవనాలు వీచాయంటే అతిశయోక్తి కాదు. నిరుద్యోగ భృతి, 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్తు, విద్యా వ్యవస్థలో మార్పులు, ప్రభుత్వ స్కూళ్లలో సంస్కరణలు, ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు, మహిళలకు పింఛన్ల వంటి పథకాలు ప్రజలను ఆప్‌కు ఓటేసేలా చేశాయి. ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా... మోడీ హవాతో ఎన్నికల బరిలో దిగిన బీజేపీకి ఉత్తరాఖండ్‌లో వరుసగా రెండోసారి విజయం దక్కింది. ఉన్న డెబ్భై స్థానాల్లో 47 కైవసం చేసుకుంది. కాంగ్రెస్ మును పటి కంటే ఎనిమిది సీట్లు ఎక్కువ దక్కించుకున్నా అధికారం మాత్రం అందని మానిపండుగానే మిగిలింది. ముఖ్యమంత్రులను మార్చడం, పార్టీలో అంతర్గత విభేదాల కార ణంగా బీజేపీ మూడు శాతం ఓట్లు, పది సీట్లు కోల్పోయింది. కొత్త ఉద్యోగాల కల్పన, ఏడాది పొడవునా చార్ధామ్ యాత్రకు ఉయోగపడేలా రహదారుల నిర్మాణం, కర్ణ ప్రయాగ్, రిషికేశ్‌ల మధ్య రైల్వే లైను వంటి బీజేపీ ఎన్నికల హామీలు పని చేశాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ హరీశ్ రావత్ నేతృత్వంలో తన స్థితిని కొంచెం మెరుగుపరచుకోగలిగింది కానీ, హైకమాండ్ నుంచి తగిన మద్దతు లభించకపోవడం; పార్టీలో వర్గాలు, ప్రచారకర్తల లేమి వంటి కారణాలతో ఓటమి పాలైంది. మణిపూర్‌లో బీరేన్ సింగ్ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ నలభై సీట్లలో విజయం లక్ష్యంగా అరవై స్థానాలున్న అసెంబ్లీకి పోటీ పడింది. దక్కింది 32 స్థానాలు మాత్రమే అయినప్పటికీ... సీపీఐ, సీపీఎం, ఆర్ఎస్పీ, జేడీ(ఎస్), ఫార్వర్డ్ బ్లాక్‌లతో కూడిన కాంగ్రెస్ కూటమికి ఐదు స్థానాలు మాత్రమే లభించాయి. కేంద్రంలో బీజేపీ భాగస్వామి అయిన ఎన్పీపీ ఒంటరిగానే పోటీకి దిగి ఏడు స్థానాలు, జేడీ(యూ) ఆరు స్థానాలు గెలుచుకున్నాయి. ఎన్పీఎఫ్ ఇంకో ఐదు స్థానాలు గెలుచుకోగా మిగిలిన స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. సుస్థిర, శాంతియుతమైన ప్రభుత్వం అందిం చినందుకుగానూ మణిపూర్ ప్రజలు మరోసారి బీజేíపీకి పట్టం కట్టినట్లుగా చెప్పాలి. అభివృద్ధి కార్యక్రమాలు, సామాజిక వర్గాల మధ్య నమ్మకాన్ని పెంపొందించుకోవడమూ కాషాయ పార్టీకి కలిసివచ్చింది. నలభై స్థానాలున్న గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి బహుముఖ పోటీ జరిగింది. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, గోవా ఫార్వర్డ్ పార్టీ, మహా రాష్ట్రవాదీ గోమాంతక్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ కూటమి, ఆమ్ ఆద్మీ పార్టీలు బరిలో నిలిచాయి. ప్రమోద్ సావంత్ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ పాలనపై ప్రజల్లో కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ ప్రతిపక్ష పార్టీల ఓట్లు చీలిపోయి ఉండటం కలిసి వచ్చింది. మోజారిటీకి ఒక స్థానం తక్కువగా 20 స్థానాలు గెలుచు కుని ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి 12, ఆమ్ ఆద్మీ పార్టీ రెండు స్థానాలు దక్కించుకోగా తృణమూల్‌కు ఒక్క స్థానమూ దక్కలేదు. బీజేపీయేతర పార్టీల్లో అనైక్యత ఫలితాలు ఎలా ఉంటాయో గోవా ఎన్నికలు చెప్పకనే చెబుతున్నాయి. మొత్తమ్మీద చూస్తే భారతీయ జనతా పార్టీ నాలుగు రాష్ట్రాల్లో విజయఢంకా మోగించడం వెనుక ఓటర్లు మత ప్రాతిపదికన చీలిపోవడం కారణమన్న వాదనలో అంత పస లేదనే చెప్పాలి. మంచి పాలన, వి«ధానాల ఆధారంగానే ఓటర్లు ఎవరికి ఓటేయాలో నిర్ణయించుకుంటారని ఈ ఎన్నికలు రుజువు చేస్తున్నాయి. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపు జాతీయ రాజకీయాల్లో భవిష్యత్తుకు సూచికగా చూడవచ్చు. పంజాబ్, గోవాల్లో అధికారాన్ని దక్కించు కోవడంలో విఫలమైన కాంగ్రెస్ తన పతనావస్థలో చరమదశకు చేరుకుందని చెప్పాలి. 2024 సాధారణ ఎన్నికలకు ఈ అసెంబ్లీ ఎన్నికలు సూచిక అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ప్రవీణ్ రాయ్ వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు, సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్, ఢిల్లీ -
ఒక తీర్పు – అనేక సందేహాలు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంలో హైకోర్టువారు ఇచ్చిన తీర్పు కొంతమందికి సంతోషం కలిగించింది. మూడు రాజధానుల ఏర్పాటు ద్వారా మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఆశించిన కోట్లాదిమందికి మాత్రం తీర్పు నిరాశను మిగిల్చిందని చెప్పవచ్చు. అదే సమయంలో ఆ తీర్పుపై చాలామందికి సందేహాలు వచ్చాయి. సామాన్య ప్రజానీకం కూడా ఈ తీర్పు పరిణామాలపై చర్చించుకుంటోంది. లేని చట్టాలపై కోర్టులు తీర్పులు ఇవ్వవచ్చా? అమరావతి ప్రాంతాన్ని రాజధాని చేయాలన్న నిర్ణయం గత ప్రభుత్వం చట్టం ద్వారా ఆమోదించినప్పుడు, ఈ ప్రభుత్వానికి ఆ అధికారం ఎలా లేకుండా పోతుంది? గత ప్రభుత్వం మూడు, నాలుగేళ్లలో చేయలేని పని ఈ ప్రభుత్వం ఆరు నెలల్లో ఎలా చేస్తుంది? ఒక తీర్పుపై ఇన్ని సందేహాలు ఉత్పన్నం కాకుండా ఉంటే బాగుండేది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టువారు ఇచ్చిన తీర్పు ఒక రకంగా సంచలనంగానూ, మరో రకంగా వివాదాస్పదంగానూ కనిపిస్తుంది. గౌరవ న్యాయస్థానాన్ని గానీ, గౌరవ న్యాయమూర్తులను గానీ తక్కువ చేయజాలం. అదే సమ యంలో న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై విశ్లేషించుకోవచ్చు. ప్రత్యే కించి రాజధాని అమరావతిలోనే ఉండాలని కోరుకునేవారికి ఈ తీర్పు అమితానందం కలిగిస్తుంది. కానీ మూడు రాజధానుల ఏర్పాటు ద్వారా మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయనీ, ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు గౌరవం, గుర్తింపు, అభివృద్ధి అవకాశాలు వస్తాయనీ ఆశించిన కోట్లాదిమందికి మాత్రం తీవ్ర నిరాశను మిగిల్చిందని చెప్పవచ్చు. గతంలో మన పెద్దలు, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల మధ్య సమతుల్యత కోసం శ్రీబాగ్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దానికి చట్టపరమైన రక్షణ లేకపోవచ్చు. కానీ పెద్దతరహాలో ఆనాటి నేతలు రాజధాని ఒక చోట ఉంటే, హైకోర్టు మరో చోట ఉండాలని నిర్ణయించి కర్నూలులో రాజధాని, గుంటూరులో హైకోర్టు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కాలక్రమంలో తెలంగాణతో కూడిన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌కు రాజధాని, హైకోర్టు అన్నీ మారి పోయాయి. ఇప్పుడు మళ్లీ ఉమ్మడి ఏపీ విభజన జరిగింది. అలాం టప్పుడు ప్రాంతీయ ఆకాంక్షలు సహజంగానే ముందుకు వస్తాయి. కానీ 2014లో ఎన్నికైన చంద్రబాబు ప్రభుత్వం వాటిని విస్మరించి అన్నిటినీ అమరావతి అనే పేరు పెట్టిన రాజధాని ప్రాంతంలోనే కేంద్రీకృతం చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ భూమి లేని చోట, రియల్ ఎస్టేట్ మోడల్లో పూలింగ్ పద్ధతి తెచ్చి మొత్తం అభివృద్ధి అంతటినీ ఒకే చోట కేంద్రీకరించ తలపెట్టింది. తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం అన్ని లక్షల కోట్ల వ్యయం ఒకే చోట పెట్టలేమని భావించి మూడు రాజధానుల విధానం తెచ్చింది. విశాఖ, అమరావతి, కర్నూలులకు ప్రాధాన్యం ఇచ్చింది. అందుకోసం వివిధ కమిటీలతో అధ్యయనం చేయించింది. అప్పటి నుంచి దీనిని వివాదంగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మార్చింది. హైకోర్టులో పలు వ్యాజ్యాలు కూడా వేయించారు. పరిస్థితులను సమీక్షించుకున్న ప్రభుత్వం సంబంధిత మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకుంది. రద్దయిన రాజ ధాని ప్రాంత చట్టాన్ని తిరిగి యధావిధిగా ఉంచుతూ నిర్ణయం తీసు కుంది. అయినా వ్యాజ్యాలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో వచ్చిన ఈ తీర్పుపై పలు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఒకసారి ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుని ఆర్డినెన్సులు జారీ చేసిన తర్వాత హైకోర్టు ఆ వ్యాజ్యాలను కొనసాగించవచ్చా? అంటే లేని చట్టాలపై కోర్టులు తీర్పులు ఇవ్వవచ్చా? భవిష్యత్తులో జరిగే పరిణామాలపై కూడా కోర్టులు ఊహించి తమ ఆదేశాలను ఇవ్వవచ్చా? పంజాబ్ హైకోర్టులో ఒక మాజీ డీజీపీని నిర్దిష్ట తేదీ వరకూ అరెస్టు చేయరాదని ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తప్పుపడుతూ భవిష్యత్తులో ఏదో జరుగుతుందని ఊహించి ఎలా తీర్పులు ఇస్తారని ప్రశ్నించినట్లు వార్త వచ్చింది. అదే సూత్రం ఈ కేసుకు వర్తించదా? కొంతకాలం క్రితం ఈ కేసు విచారణ సందర్భంగా గౌరవ న్యాయమూర్తులు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ చట్టాలు చేయకుండా ఆపజాలమనీ, రాజధాని ఏ ప్రాంతంలో ఉండాలో తాము నిర్దేశించజాలమనీ కూడా ధర్మాసనం పేర్కొంది. కానీ ఇప్పుడు తీర్పు అందుకు భిన్నంగా రావడం ఆశ్చర్యం కలిగించదా? రాజధాని నిర్ణయాధికారం పార్లమెంటుకు ఉందని తీర్పులో చెప్పారు. అలాంటప్పుడు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పదేళ్లు కొనసాగాలి కదా? దానిని ఎందుకు ముందుగానే మార్చారన్న ప్రశ్నను హైకోర్టు వేసి ఉండాలి కదా? అమరావతి ప్రాంతాన్ని రాజధాని చేయాలన్న నిర్ణయం గత ప్రభుత్వం చట్టం ద్వారా ఆమో దించినప్పుడు, ఈ ప్రభుత్వానికి ఆ అధికారం ఎలా లేకుండా పోతుంది? రాజధాని ఎక్కడ ఉండాలన్న నిర్ణయం రాష్ట్ర పరిధిలోనిదే నని కేంద్రం వేసిన అఫిడవిట్‌ను తీర్పులో విస్మరించారా? కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ అమరావతిలో రాజధాని పెట్టవద్దనీ, మూడు పంటలు పండే భూములను చెడగొట్టవద్దనీ స్పష్టంగా చెప్పిన విషయాన్ని కోర్టువారు కూడా పట్టించుకోలేదా? రాజధాని నిర్మాణానికి అసలు 34 వేల ఎకరాల భూమి అవసరమా? ప్రభుత్వ భూమి ఉన్న చోట ఎందుకు పెట్టలేదు? భూములు ఇచ్చిన రైతులు నిజంగానే నష్టపోయారా? ఉపాధి కోల్పోయారా? మరో వైపు రైతులు చాలావరకు తమ భూములను విక్రయించుకున్నారన్నది అవాస్తవమా? కోట్ల రూపాయల ధరకు ఆ భూములు అమ్ముడు పోవడం అసత్యమా? అలాగే ప్రభుత్వం ప్రతి ఏటా ఎకరాకు నలభై ఐదు వేల రూపాయల చొప్పున కౌలు చెల్లిస్తున్నా వారు త్యాగం చేసినట్లుగా కోర్టు ఎలా అభిప్రాయ పడుతుంది? వ్యాజ్యాలు వేసిన కొందరు టీవీల ముందు నిలబడి తాము కోర్టులలో వ్యాజ్యాలు వేసేందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెబుతున్నారు. అలాంటివారు నిరుపేదలు అవుతారా? గత ముఖ్యమంత్రి రాజధాని నిర్మాణానికి నాలుగు నుంచి ఐదు లక్షల కోట్లు అవసరం అవుతాయని బహిరంగంగానే చెప్పారు. కేంద్రం నుంచి లక్షాతొమ్మిదివేల కోట్లు మంజూరు చేయాలని లేఖ కూడా రాశారు. ఇంత భారీ వ్యయం రాష్ట్రం చేయలేదనే కదా దీని అర్థం! మరి అంత మొత్తం ప్రస్తుత ప్రభుత్వం ఎలా పెట్టగలుగుతుందని కోర్టువారు భావిస్తారు? కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి వివిధ స్కీములను అమలు చేస్తున్నారనీ, రాజధానికి ఎందుకు పెట్టరనీ కోర్టువారు అడగడం కరెక్టేనా? రాజధాని ప్రాంతం అంతా కలిపి ఇరవై తొమ్మిది గ్రామాలలోనే ఉంది. ఇక్కడ ప్రభుత్వం లక్షల కోట్లు వ్యయం చేసి అభివృద్ధి చేస్తే కేవలం కొద్దివేల మందికే ప్రయోజనం కలుగుతుందన్నది వాస్తవం కాదా? దీనివల్ల ప్రాంతాల మధ్య, ప్రజల మధ్య అసమానతలు మరింతగా పెరగవా? మరో వైపు ప్రభుత్వ స్కీముల ద్వారా రాజధాని ప్రాంతంతో సహా మొత్తం రాష్ట్రం అంతటా ప్రయోజనం కలగడం లేదా? పైగా కరోనా సంక్షోభం నేపథ్యంలో ఆ పథకాలు పేదలకు ఉపయోగపడిన విషయాన్ని కోర్టువారు గుర్తించరా? అయినా ప్రభుత్వ విధానాలను తప్పుపట్టే నైతిక అధికారం కోర్టులకు ఉంటుందా? మూడు నెలల్లో ప్లాట్లు వేసి, ఆరు నెలల్లో అభివృద్ధి చేయడం అన్నది మానవ సాధ్యమేనా? గత ప్రభుత్వం మూడు, నాలుగేళ్లలో చేయలేని పని ఈ ప్రభుత్వం ఆరు నెలల్లో ఎలా చేస్తుంది? రాజధాని భూములను తాకట్టు పెట్టవద్దని హైకోర్టు చెప్పవచ్చా? ఆర్థిక కారణాలతో ప్రాజెక్టు ఆపరాదని ఆదేశించారు. అలాంటప్పుడు గత ప్రభుత్వం కోరిన విధంగా లక్ష కోట్ల రూపాయల మొత్తాన్ని వెంటనే కేంద్రం విడుదల చేయాలని ఎందుకు ఆదేశించలేదు? అసలు ఈ కేసులో ధర్మాసనం కూర్పుపై ప్రభుత్వం అభ్యంతరం చెప్పిన ప్పుడు గౌరవ న్యాయమూర్తులు దానిని మన్నించకపోవడం ధర్మ మేనా? పైగా సంబంధిత అధికారిపై వ్యంగ్య వ్యాఖ్యలు చేయవచ్చా? శాసనాలు చేసే అధికారం అసెంబ్లీలకు లేకపోతే మరి ఎవరికి ఉంటుంది? గతంలో సుప్రీంకోర్టు కావేరీ జలాలపై ఇచ్చిన తీర్పును తాము అమలు చేయజాలమని కర్ణాటక రాష్ట్ర శాసనసభ తీర్మానం చేసినట్లు కొందరు గుర్తు చేస్తున్నారు. అలాగే ఏపీ అసెంబ్లీలో హైకోర్టు, శాసన వ్యవస్థల పరిధులపై చర్చ జరుపుతామని అంటు న్నారు. ఏపీ అసెంబ్లీలో కూడా తీర్పును తిరస్కరిస్తూ తీర్మానం చేసే అవకాశం ఉంటుందా అన్నదానిపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. గత ముఖ్యమంత్రే అమరావతిపై పదివేల కోట్ల లోపు ఖర్చు అయి నట్లు చెబితే గౌరవ కోర్టువారు గత ప్రభుత్వం రాజధాని ప్రాంత అభివృద్ధికి పదిహేను వేల కోట్లు, మౌలిక వసతుల కల్పనకు 32 వేల కోట్లు వ్యయం చేసినట్లు పేర్కొన్నారు. అంత మొత్తాలు వ్యయం చేసి ఉంటే, ఈపాటికి రాజధానిలో చాలా భాగం అభివృద్ధి చెంది ఉండాలి కదా? దీనిపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన వివరణ ప్రకారం మొత్తం వ్యయం చేసింది రూ. 8,572 కోట్లే. అందులో మూడువేల కోట్ల వరకు తెచ్చిన అప్పులపై కట్టిన వడ్డీలుగా ఉంది. రాజధాని భూములను ఇతర అవసరాలకు వాడరాదని అను కుంటే, మరి గత ప్రభుత్వం ఇప్పటికే కొన్నిటికి భూముల్ని విక్రయిం చింది. అది అభ్యంతరకరం కాదా? ప్రస్తుత ప్రభుత్వం ప్లాట్లు అభి వృద్ధి చేసి ఇస్తామనే చెబుతోంది కదా? విశేషం ఏమిటంటే, ప్లాట్ల కేటాయింపునకు సంబంధించి కొన్ని వేలమంది ప్లాట్లను క్లయిమ్ చేయడం లేదట. అంటే ఎవరో బినామీల పేర ఈ భూములు ఉన్నా యని అనుకోవాలా? కోర్టువారి దృష్టికి ఇలాంటి విషయాలు ఏవీ వెళ్లి ఉండకపోవచ్చు. గత ప్రభుత్వ హామీలు నెరవేర్చాల్సిందేనని కోర్టు వారు అభిప్రాయపడ్డారు. వినడానికి బాగానే ఉన్నా, అది ఆచరణ సాధ్యమేనా అన్న ప్రశ్న వస్తుంది. గత ప్రభుత్వం లక్ష కోట్ల రైతుల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది. దానిని నమ్మి రైతులు టీడీపీకి ఓట్లు వేయడంతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఆ హామీని కొద్దిమేర అమలు చేసి తర్వాత చేతులెత్తేసింది. అలాంటి హామీ లను ఆ తర్వాతి ప్రభుత్వం కొనసాగించాలని ఆశించగలమా? గౌరవ న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులన్నిటిపైనా రకరకాల అభిప్రాయాలు రావచ్చు. కానీ ఒక తీర్పుపై ఇన్ని సందేహాలు ఉత్పన్నం కాకుండా ఉంటే బాగుండేది. ఈ మొత్తం వ్యవహారం రాజధాని ప్రాంతంలోని రైతులు లేదా భూమి సొంతదారులకూ ప్రభుత్వానికీ మధ్య ఉండవలసిన వివాదం. ఇప్పుడు హైకోర్టుకూ, ప్రభుత్వానికీ మధ్య అన్నట్లుగా పరిస్థితి మారిందా అన్న ప్రశ్న కూడా వస్తుందని అనుకోవచ్చా? 2019లో జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎందువల్లో హైకోర్టులో అనేక కేసులలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడటం దురదృష్టకరం. గతంలో ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామా రావు కూడా కొన్ని సందర్భాలలో ఇలాంటి సమస్యనే ఎదుర్కుంటే, ఆయన చివరికి తనకు ప్రజాన్యాయస్థానమే ముఖ్యమని వ్యాఖ్యా నించారు. ఇప్పుడు జగన్‌కు అదే పరిస్థితి ఎదురవుతోందా? కోర్టులు ఒకవైపూ, సామాన్య ప్రజలు మరోవైపూ ఉన్నారన్న అభిప్రాయం కలగడం, సమాజానికీ, న్యాయవ్యవస్థకూ మంచిది కాదని చెప్పాలి. కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
ప్రజాభిమానానికి అధికార ముద్ర
పని చేస్తే ఫలితం దక్కుతుంది; ప్రజలు మెచ్చితే అన్ని కుట్రలూ వీగిపోతాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వెల్లడైన సరళమైన సత్యం ఇది. స్థానిక ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు జనం బ్రహ్మరథం పట్టడం దాన్నే తెలియజేస్తోంది. ఈ ఎన్నికలు చాలా కారణాల వల్ల చరిత్ర. జరగాల్సినవి జరగక పోవడం, జరగాల్సిన సమయంలో జరగకపోవడం, జరిగినట్టే జరిగి ఆగిపోవడం, జరిగినా వెంటే ఫలితాలు తెలియకపోవడం... ఎన్నికల చరిత్రలో ఇవి చెరిగిపోవాల్సిన పేజీలు. ఇన్ని జరిగినా నాలుగు దశాబ్దాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కనీవినీ ఎరుగని రీతిలో అధికార పార్టీ గెలవడం సువర్ణాక్షరాలతో రాయాల్సిన పుట. ఇది ప్రజాభిమానం వల్లే సాధ్యమైంది. చేస్తున్న పాలనకు వారి అధికార ముద్ర పడ్డందువల్లే సంభవమైంది. ఉమ్మడి ఏపీ చరిత్రలో గానీ, విభజిత ఏపీలో గానీ ఎన్నడూ లేని విధంగా స్థానిక ఎన్నికల అన్నిటిలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ విజయం సాధించింది. ఇది అధికార దుర్వినియోగంతోనో, మరో అక్రమంతోనో సాధ్యమయ్యేది కాదు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి కూడా గత అసెంబ్లీ ఎన్నికలలో నలభై శాతం ఓట్లు వచ్చాయి. దానర్థం ఏమిటి? ఆయా చోట్ల అధికార పార్టీ ఏమైనా గొడవలు చేస్తే ఎదుర్కొనేవారు గణనీయంగానే ఉన్నా రన్నమాట. దానికి తోడు ఆయా వ్యవస్థల అండ ఎటూ ఉంది. అలాంటిది స్థానిక ఎన్నికలలో నిజంగా తెలుగుదేశంకు గట్టి పోటీ ఇచ్చే పరిస్థితే ఉంటే ఆ పార్టీ ఊరుకుంటుందా? టీడీపీ ఇక్కడ కూడా రెండు కళ్ల సిద్ధాంతాన్ని అమలు చేసింది. ఒక పక్క జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్క రించామని చెబుతూనే, వివిధ నియోజకవర్గాలలో తమ పార్టీ అభ్య ర్థులకు బీఫారాలు ఇచ్చారు. 8 వేలకు పైగా ఎంపీటీసీలు వైసీపీ గెలిస్తే, 9 వందలకు పైగా టీడీపీ గెలిచింది. మరి పోటీలో ఉన్నట్లా, లేనట్లా? నామినేషన్లు వేసిన తర్వాత చాలాకాలం ఎన్నికలు జరగకుండా చేయడంలో టీడీపీ సఫలమైంది. ఏడాదిన్నరపాటు ఎన్నికల ప్రక్రియ నడిచిన సందర్భం దేశంలో ఇదొక్కటే కావచ్చు. కరోనా కేసులు లేన ప్పుడు ఎన్నికలను వాయిదా వేయించింది. ఆ తర్వాత కరోనా కేసులు ఉధృతంగా ఉన్న రోజుల్లో జడ్పీ, మండల ఎన్నికలను పక్కనబెట్టి గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను నిర్వహించేలా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ద్వారా పథకం అమలు చేయిం చింది. ఈ ఎన్నికలలో పూర్తిగా పరాజయం చెందడంతో కొత్త వ్యూహంలోకి వెళ్లారు. జడ్పీ, ఎంపీటీసీ ఎన్నికలు జరపకుండా ఆపు చేయించారు. చాలా చిత్రంగా నామినేషన్లు పూర్తయిన ఎన్నికలను ఎన్నికల కమిషన్ నిర్వహించకపోవడం కూడా ఒక చరిత్రే. స్థానిక ఎన్నికలపై ఎవరైనా పరిశోధన చేయదలిస్తే, ఇవన్నీ ఆసక్తికర అధ్య యన అంశాలు అవుతాయి. మధ్యలో ఏపీ ప్రభుత్వంపై ఎన్నికల కమిషనర్ చాలా దారుణ మైన లేఖను కేంద్రానికి రాయడం జరిగింది. నిజానికి ఈ లేఖ టీడీపీ ఆఫీసులో తయారైందని ఎక్కువ మంది నమ్మకం. మొదట ఆ లేఖతో తనకు సంబంధం లేదని చెప్పిన నిమ్మగడ్డ, ఆ తర్వాత కేసును సీఐడీ టేకప్ చేయడంతో టీడీపీని రక్షించడం కోసం తానే రాశానని చెప్పు కోవలసి వచ్చింది. అలాగే ఈ ఎన్నికలపై కోర్టులలో పడినన్ని వ్యాజ్యాలు బహుశా మరే ఎన్నికలపై పడి ఉండకపోవచ్చు. సింగిల్ బెంచ్ జడ్జీ ఎన్నికలు నిర్వహించవద్దని అనడం, డివిజన్ బెంచ్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, అయినా మళ్లీ సింగిల్ జడ్జీ ఈసారి ఎన్నికలనే రద్దు చేయడం, తిరిగి అప్పీల్లో డివిజన్ బెంచ్ నాలుగు న్నర నెలల సమయం తీసుకుని ఓట్ల లెక్కింపునకు అనుమతి ఇవ్వడం జరిగింది. మామూలుగా అయితే స్థానిక ఎన్నికలు జాప్యం అయితే న్యాయస్థానాలు ప్రభుత్వాలను మందలిస్తుంటాయి. ఈసారి మాత్రం న్యాయ వ్యవస్థ వల్ల కూడా ఎన్నికలు జాప్యం అవడం మరో చిత్రం అని చెప్పాలి. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలకు కోడ్ అమలు చేసి, జడ్పీ, మండల ఎన్నికలకు అది వర్తింపచేయకుండా కోడ్ ఎత్తివేసి నిమ్మగడ్డ ఈ ఎన్నికలను వాయిదా వేయడమే కుట్రగా కనిపిస్తుంది. ఆ తర్వాత వచ్చిన ఎన్నికల కమిషనర్ నీలం సహానీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇస్తే దానిని లిటిగేషన్‌గా మార్చాయి టీడీపీ, జనసేన. ఒక పక్క తాము ఎన్నికలను బహిష్కరించామని చెబుతూనే మరో పక్క ఎన్నికలను రద్దు చేయాలని టీడీపీ కోర్టుకు వెళ్లడం ఆశ్చర్యమే. నలభై శాతం ఓట్లు కలిగిన తెలుగుదేశం పార్టీ పూర్తిగా కాడి వదలివేయడానికి కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్య మంత్రి జగన్ ప్రభుత్వం అమలు చేసిన పలు సంక్షేమ పథకాలు, అవినీతికి ఆస్కారం లేకుండా నేరుగా బలహీనవర్గాలకు చేరాయి. కులం, ప్రాంతం, పార్టీలతో సంబంధం లేకుండా ప్రయోజనాలు దక్కాయి. దాంతో టీడీపీకి చెందినవారు కూడా వైసీపీ వైపు మొగ్గుతున్నారని అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వానికి పాజిటివ్ వేవ్ లేకుంటే చంద్రబాబుకు కంచుకోట వంటి కుప్పం నియోజకవర్గంలో నాలుగు జడ్పీటీసీలు, తొంభై శాతానికి పైగా ఎంపీటీసీ స్థానాలు వైసీపీ ఖాతాలోకి ఎలా వస్తాయి? ఇది కచ్చితంగా చంద్రబాబుకు అప్రతిష్టే. ఈ 32 ఏళ్లలో కుప్పంలో టీడీపీ తప్ప మరో పార్టీ గెలవ లేదు. గత ఎన్నికలలో 30 వేల మెజారిటీతో చంద్రబాబు గెలిచారు. పంచాయతీ ఎన్నికలలోనే వైసీపీ గెలుపుతో బిత్తరపోయిన చంద్ర బాబు, తన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి వచ్చారు. అయినా జడ్పీ, మండల ఎన్నికలలో ఫలితం దక్కకపోవడం విశేషం. పంచాయతీ ఎన్నికలలో చంద్రబాబు స్వగ్రామమైన నారావారి పల్లెలో టీడీపీ గెలిస్తే మీడియాలో అది పెద్ద వార్తగా ప్రచారం అయింది. కానీ ఇప్పుడు ఎంపీటీసీ ఎన్నికలలో ఆ స్థానం వైసీపీకి దక్కింది. తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామా రావు స్వగ్రామం నిమ్మకూరును టీడీపీకి బలమైన గ్రామంగా భావి స్తారు. అక్కడ కూడా ఈసారి వైసీపీ గెలిచింది. మాజీ మంత్రి దేవినేని ఉమా ఇలాకాతో సహా అనేక చోట్ల టీడీపీకి ఒకటి, అరా తప్ప సీట్లు రాలేదు. గత నాలుగు దశాబ్దాలలో ఏ ప్రభుత్వానికి ఇలాంటి విజయం నమోదు కాలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ప్పుడు 2001లో ఉమ్మడి ఏపీలో జరిగిన జడ్పీ ఎన్నికలలో అధికార టీడీపీ పది జడ్పీలను మాత్రమే గెలుచుకుంటే, ప్రతిపక్ష కాంగ్రెస్ పదింటిని, టీఆర్ఎస్ రెండింటిని కైవసం చేసుకుంది. మండలాల ఎన్నికలలో టీడీపీకి 482 దక్కితే, ప్రతిపక్ష కాంగ్రెస్‌కు 430, టీఆర్ఎస్కు 83 వచ్చాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్‌కు 19 జడ్పీలు, టీడీపీకి రెండు, టీఆర్ఎస్కు ఒకటి వచ్చాయి. మండల ఎన్నికలలో కాంగ్రెస్‌కు 620, టీడీపీకి 355, ఇతర పార్టీలు 45 గెలుచుకున్నాయి. అంటే వైఎస్ ఉన్నప్పుడు కూడా టీడీపీ తన ఉనికిని నిలబెట్టుకోగలిగింది. 2014లో టీడీపీ ఆధిక్యత ప్రదర్శించగలిగినా, వైసీపీ తన పట్టును గట్టిగానే ఉంచుకోగలిగింది. టీడీపీకి 372 జడ్పీటీసీలలో తొమ్మిది జడ్పీలు, వైసీపీ 271 జడ్పీటీసీ లతో మూడు జిల్లా పరిషత్‌లు కైవసం చేసుకున్నాయి. ఒక చోట ఇండిపెండెంట్ గెలిచారు. మండల పరిషత్‌లలో టీడీపీకి 386 వస్తే, వైఎస్సార్ కాంగ్రెస్‌కు 205 వచ్చాయి. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా మారింది. 12 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగితే అన్నింటిలోనూ వైసీపీనే విజయం సాధించింది. 83 శాతం డివిజన్లు వైసీపీ కైవసం చేసుకుంటే, 11 శాతం డివిజన్లే టీడీపీకి వచ్చాయి.75 మున్సిపాలిటీలకు గానూ 74 వైసీపీ ఖాతాలో జమ య్యాయి. తాజాగా వెల్లడైన జడ్పీ, మండల ఎన్నికల ఫలితాలలో తొంభై శాతంపైగా వైసీపీకి రావడం టీడీపీకి జీర్ణం కాని విషయమే. ఇవన్నీ రికార్డులే. సాధారణంగా స్థానిక ఎన్నికలలో అధికార పార్టీకి కొంత మొగ్గుంటుంది. ఒక్క 2014లో కాంగ్రెస్ స్వయంకృతాపరాధం వల్ల పూర్తిగా నష్టపోయింది. అది వేరే విషయం. కానీ ఈసారి ఎన్నికల ప్రత్యేకత ఏమిటంటే– ఎనభై, తొంభై శాతం ఫలితాలు అధికార వైసీపీకి అనుకూలంగా రావడం; ప్రతిపక్ష టీడీపీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోవడం. ఇదే సమయంలో ఒక విషయం కూడా హెచ్చరించాలి. స్థానిక ఎన్నికలలో ఇంత పెద్ద ఎత్తున గెలిచిన వైఎస్సార్ కాంగ్రెస్‌పై మరింత బాధ్యత పెరిగింది. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో ముందంజలోనే ఉన్నా, వచ్చే రెండున్నరేళ్లు పూర్తి అప్రమత్తంగా ఉండి, ప్రజలలో ఎలాంటి అసంతృప్తి లేకుండా చూసుకోవలసి ఉంటుంది. ఏ చిన్న ఘటన జరిగినా చిలవలు పలవలు చేయగల సత్తా టీడీపీకి, ఆ పార్టీకి మద్దతిచ్చే మీడియాకు ఉంది. తిమ్మిని బమ్మిగా చేయగల నేర్పరులు వారు. తస్మాత్ జాగ్రత్త! కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
సంక్షేమ సేవల చోదకశక్తి పర్యాటకమే!
ఈశాన్య రాష్ట్రాల పర్యాటక–సాంస్కృతిక శాఖ మంత్రుల సదస్సును కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ నిర్వహించడానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈశాన్య భారత రాష్ట్రాలు భారత దేశానికి మిరుమిట్లు గొలిపే వజ్రాభరణాల వంటివి. దేశీయ పర్యాటకుల పర్యటన ప్రణాళికలో ఇవి తప్పక ఉండాల్సిందే. మంచుకప్పిన పర్వత శిఖరాలు, పరుగులెత్తే నదులు, లోతైన లోయలు, అచ్చెరువు గొలిపే సుందర ప్రకృతి దృశ్యాలు తదితరాలతో ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నో సందర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి. ఈ నేల, సంస్కృతి, ప్రజానీకంపై గణనీయమైన సానుకూల ప్రభావం చూపగల శక్తి పర్యాటక రంగానికి ఉంది. ఈ ప్రాంతంలోని స్థానిక ఉత్పత్తుల తయారీని చక్కగా ప్రోత్సహించడం మన బాధ్యత. మూడంచెల వ్యూహంలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రధాని మోదీ అవిశ్రాంతంగా కృషి చేశారు. ప్రగతి, ఉపాధి అవకాశాలతో ఈశాన్య ప్రాంత సమాజాలకు ప్రత్యక్ష లబ్ధి చేకూర్చే పర్యాటక రంగాన్ని సంక్షేమ ప్రదానంలో ఒక ముఖ్యమైన ఉపకరణంగా ప్రధానమంత్రి పరిగణిస్తున్నారు. భారతదేశం ఇవాళ్టికి 75 కోట్ల జనాభాకు టీకాలు వేసే కార్యక్రమానికి చేరువైంది. పర్యాటక రంగానికి ఇంతకన్నా ఉత్తేజమిచ్చే అంశం మరొకటి లేదని చెప్పవచ్చు. ఎందుకంటే– అంతర్జాతీయ విమానయానంపై ఇప్పటికీ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఫలితంగా ప్రపంచ పర్యాటక రంగం పూర్వస్థాయిలో ఊపందుకోవడానికి మరింత సమయం పట్టవచ్చు. ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది చివరికల్లా మన జనాభాలో అత్యధిక శాతానికి టీకాలు వేయడం పూర్తవుతుంది. కాబట్టి దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు మనకిదే అద్భుతమైన అవకాశం. ఈ నేపథ్యంలో కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ ఈశాన్య భారత రాష్ట్రాల పర్యాటక–సాంస్కృతిక శాఖ మంత్రుల సదస్సు ప్రారంభ సమావేశం నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈశాన్య భారతంలోని ‘అష్టలక్ష్మి’ రాష్ట్రాలకు ప్రధానమంత్రి హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది. అందుకే మూడంచెల వ్యూహంలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన అవి శ్రాంతంగా కృషిచేశారు. ఇందులో మొదటిది– నరేంద్రమోదీ నాయకత్వంలో పలు ఒప్పందాలపై సంతకాల ఫలితంగా వివిధ తిరుగుబాటు బృందాలు హింసకు వీడ్కోలు పలికి దేశ ప్రగతి కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు దారితీయడం జరిగింది. దీనితో ఈశాన్య ప్రాంతంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు వేగం పుంజుకోగా, ప్రధాని నిరంతరం వాటిని పర్యవేక్షిస్తూ, సకాలంలో తగిన చర్యలు తీసుకుంటూ వాటి అమలులో అడ్డంకులను తొలగిస్తూ వచ్చారు. చివరగా నేటి శాంతియుత వాతావరణం, మౌలిక సదుపాయాల ఆధునీకరణ అనేవి పర్యాటకులను ఆకర్షించడమేగాక వ్యాపార నిర్వహణలో ఆసక్తిగలవారు ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు దోహదపడింది. ఈ నేపథ్యంలో రెండురోజులపాటు సాగే సదస్సు పర్యాటక అభివృద్ధి, ఈశాన్య ప్రాంతంలో అనుసంధాన సమస్యలపై ప్రధానంగా చర్చించనుంది. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని భాగస్వాములందరి మధ్య సమన్వయంపై కూడా దృష్టి సారిస్తుంది. అలాగే ఈశాన్య భారతంలో సామర్థ్య వికాస కార్యక్రమాలు, మానవ వనరుల అభివృద్ధి పథకాలు సహా సాహస క్రీడల సంబంధిత యాజమాన్యం, నిర్వహణ, భద్రత ప్రమాణాలు వంటివాటితోపాటు డిజిటల్ ప్రోత్సాహం–విపణి సంబంధిత అంశాలను కూడా ఈ సెమినార్ పరిగణనలోకి తీసుకోనుంది. ప్రధానమంత్రి 2019లో స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఎర్రకోట బురుజులనుంచి ప్రసంగిస్తూ– మన దేశం 2022లో 75వ స్వాతంత్య్ర వార్షికోత్సవాలు నిర్వహించుకునే నాటికి పౌరులలో ప్రతి ఒక్కరూ కనీసం 15 దేశీయ పర్యాటక ప్రాంతాలను సందర్శించాలని పిలుపునిచ్చారు. తూర్పున మయన్మార్, పడమట బంగ్లాదేశ్, ఉత్తరాన భూటాన్–చైనా సరిహద్దులుగా ఉన్న ఈశాన్య భారత రాష్ట్రాలు భారత దేశానికి మిరుమిట్లు గొలిపే వజ్రాభరణాల వంటివి. అంతేగాక దేశీయ పర్యాటకుల పర్యటన ప్రణాళికలో ఇవి తప్పక ఉండాల్సిందే. మంచుకప్పిన పర్వత శిఖరాలు, పరుగులెత్తే నదులు, లోతైన లోయలు, అచ్చెరువు గొలిపే సుందర ప్రకృతి దృశ్యాలు తదితరాలతో ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నో సందర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి. అదేవిధంగా వివిధ జాతులు, సంస్కృతులు, భాషా వైవిధ్యానికి ఈ రాష్ట్రాలు పట్టుగొమ్మలు. ఈ నేల, సంస్కృతి, ప్రజానీకంపై గణనీయమైన సానుకూల ప్రభావం చూపగల శక్తి పర్యాటక రంగానికి ఉంది. వివిధ అధ్యయనాల ప్రకారం... రూ. 10 లక్షలు పెట్టుబడి పెడితే పర్యాటక రంగం 78 ఉద్యోగాలను సృష్టించగలదు. ఆ మేరకు మన ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థాయి రంగాల్లో అత్యధిక ఉపాధి అవకాశాలు సృష్టించగల సామర్థ్యం పర్యాటకానికి మాత్రమే ఉంది. దేశవ్యాప్తంగా 2019–20లో ఉపాధి అవకాశాల సృష్టికి సంబంధించి పర్యాటక రంగంవాటా 15.34 శాతంగా నమోదైంది. ఆ మేరకు మన ఆర్థిక వ్యవస్థలో మొత్తం 7 కోట్ల 90 లక్షల మేరకు ప్రత్యక్ష–పరోక్ష ఉద్యోగావకాశాలు కల్పిం చింది. ఈ రంగానికిగల ఉపాధి కల్పన సామర్థ్యాన్ని ఈశాన్య ప్రాంతంలో చోదకశక్తిగా మార్చుకునేందుకు ప్రభుత్వం కృషిచేస్తోంది. ఈశాన్య ప్రాంత వాస్తవికతను పరిరక్షించుకుంటూనే ఈ కృషిని మనం సుస్థిరంగా కొనసాగించవచ్చు. ముఖ్యంగా అపారమైన ప్రకృతి సహజ వారసత్వానికి నెలవు కాబట్టి పర్యావరణ, గ్రామీణ, సాహస క్రీడా పర్యాటకానికి ఈ ప్రాంతంలో ఎన్నో అవకాశాలున్నాయి. ఈశాన్య ప్రాంతంలో తేయాకు, ఆరోగ్య, చలనచిత్ర పర్యాటకాల వంటి చెప్పుకోదగిన అనేక పర్యాటక అనుభవాలను పొందే వీలుంది. ఇక ఈ ప్రాంతానికి మాత్రమే ప్రత్యేకమైన 100 రకాల వెదురు జాతులు ప్రకృతి సహజంగా లభించడం ఆసక్తికర అంశం. సాంబ్రాణి కడ్డీలు, వెదురు చాపలతోపాటు పుల్లలు, బద్దలు వంటివి లభ్యమవుతాయి. ఈ ప్రాంతంలోని స్థానిక సమాజాల సౌభాగ్యం దిశగా వీటి తయారీని చక్కగా ప్రోత్సహించడం మన బాధ్యత. అసోంలో ‘మూగా పట్టు’... నాగాలాండ్ ‘నాగా మిరప’... ఏదైనా కావచ్చు.. వాటిని దేశంలోని ఇతర ప్రాంతాలతోపాటు ప్రపంచం మొత్తానికీ అందించాల్సి ఉంది. ఈ సమావేశం నిర్వహణకు ఇంతకన్నా అనువైన సమయం మరొకటి లేదు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ ఇతివృత్తం కింద వివిధ కార్యక్రమాలు సాగుతుండగా, భారతదేశం 75వ స్వాతంత్య్ర వార్షికోత్సవాలు నిర్వహించుకోనుంది. ప్రస్తుతం నిర్వహిస్తున్న కార్యకలాపాలన్నీ మన దేశ సుసంపన్న సంస్కృతి, చరిత్ర, స్పష్టాస్పష్ట వారసత్వాన్ని చాటేవిగా ఉంటున్నాయి. మన దేశ ప్రాచీన మూలాలు, విస్తృత నాగరికతా వారసత్వాలను ప్రముఖంగా ప్రదర్శించడానికి కూడా ఇదొక అవకాశం. అలాగే అత్యాధునిక డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానంతో నడుస్తున్న నవభారత స్ఫూర్తిని అందిపుచ్చుకోవడానికీ ఇదే అదను. అంతేకాకుండా మౌలిక సదుపాయాల వృద్ధిపైనా గట్టిగా దృష్టి సారించడం అవశ్యం. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కింద దేశంలోని వివిధ ప్రాంతాలకు... ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేకమైన భారతదేశ పండుగలను దృశ్యరూపం కల్పించడంపై కూడా మేం దృష్టి సారిస్తున్నాం. ఈ పండుగలు వాస్తవంగా మనను ఓ నాగరిక దేశంగా నిర్వచిస్తూ– ‘ఒకే భారతం–శ్రేష్ఠ భారతం’ భావనను ప్రోదిచేస్తాయి. ఈ ప్రాంతానికిగల మృదువైన శక్తిని ప్రోత్సహించడానికి పర్యాటకం ఒక కీలక ఉపకరణం. అలాగే దేశంలోని ఇతర ప్రాంతాల, ప్రపంచ ప్రజానీకంతో అనుసంధానించే సాధనం కూడా. పర్యాటకాన్ని అత్యున్నత దృష్టితో మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ప్రగతి, ఉపాధి అవకాశాలతో ఈశాన్యప్రాంత సమాజాలకు ప్రత్యక్ష లబ్ధి చేకూర్చే పర్యాటక రంగాన్ని సంక్షేమ ప్రదానంలో ఒక ముఖ్యమైన ఉపకరణంగా ప్రధానమంత్రి పరిగణిస్తున్నారు. భారత్ వంటి దేశంలో ప్రతి గ్రామానికీ ఒక ప్రత్యేకత ఉంటుంది. అది సుసంపన్న వారసత్వం... సహజ లేదా పర్యావరణ వైవిధ్యం లేదా సందర్శకులు పాలుపంచుకోగల కార్యకలాపాలు వంటివాటిలో ఏదో ఒకటిగా ఉండవచ్చు. ఈ సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో అందిపుచ్చుకోవడమే మా లక్ష్యం. జి. కిషన్‌రెడ్డి వ్యాసకర్త కేంద్ర పర్యాటక–సాంస్కృతిక, ఈశాన్యప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి ఈ–మెయిల్: gkishanreddy@yahoo.com -
అంతరాల తొలగింపే... అసలు లక్ష్యం
సంపన్న దేశాల్లో రైతాంగ వ్యవసాయాన్ని పారిశ్రామిక వ్యవసాయం విధ్వంసం చేసింది. ప్రపంచవ్యాప్తంగా స్వేచ్ఛా మార్కెట్లు వ్యవసాయాన్ని తీవ్ర దుఃస్థితిలోకి నెట్టాయి. ఆ చేదు అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని దేశీయ సంస్కరణలను తిరగ రాసుకోవలసిన అవసరం ఉంది. ప్రజారోగ్యం, విద్య, వ్యవసాయ అభివృద్ధి విషయంలో పెరుగుతున్న అవసరాలను పెంపొందించడమే సంస్కరణల విధి. ‘సంస్కరణల పట్ల ఆనందం వ్యక్తం చేయడానికిది సమయం కాదు. వాటిని మరింత లోతుగా పరిశీలించి ఆలోచించాల్సి ఉంది. 1991లో ఏర్పడిన సంక్షోభం కన్నా మించిన ప్రమాదకర పరిస్థితి దేశాన్ని ఆవరిస్తోంది’ అంటూ నాటి సంస్కరణల్లో ప్రధానభూమిక పోషించిన మన్మోహన్ సింగ్ చేసిన తాజా ప్రకటన సంస్కరణల సమర్థకులకు కనువిప్పు. మూడు దశాబ్దాల క్రితం ప్రారంభమైన ఆర్థిక సంస్కరణల 30వ వార్షికోత్సవ సంబ రాలను జరుపుకుంటూ ఆహా ఓహో అంటూ సంస్కరణల సమర్థకులు చంకలు గుద్దుకుంటున్న వేళ, నాటి సంస్కరణల ప్రధాన కర్త తదనం తరం దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మన్మోహన్ సింగ్ తాజా ప్రకటనలో నాటి సంస్కరణల పట్ల ఆనందంతో గంతులేయాల్సిన సమయం కాదనేశారు. ’సంస్కరణల పట్ల ఆనందం వ్యక్తం చేయడా నికిది సమయం కాదు. వాటిని మరింత లోతుగా పరిశీలించి ఆలోచిం చాల్సి ఉంది. 1991లో ఏర్పడిన సంక్షోభం కంటే మించిన ప్రమాదకర పరిస్థితి దేశాన్ని ఆవరిస్తోంది’ వాతావరణ మార్పుపై అంతర్ ప్రభుత్వాల ప్యానెల్ రూపొం దించిన ఆరవ అంచనా నివేదిక తొలి ఇన్స్టాల్మెంట్కి సంబంధించిన అంతర్జాతీయ అధ్యయనం చేసిన ఒక ప్రకటన మానవజాతి మొత్తా నికి ప్రమాద సంకేతాలను పంపించింది. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అంటోనియో గ్యుటెరెస్ స్పష్టంగా ఈ అంశంపై మాట్లా డుతూ, ’మనముందున్న సాక్ష్యాధారాలను తోసిపుచ్చలేం. గ్రీన్ హౌస్ ఉద్గారాలు మన భూ ఖండాన్ని ఆక్రమించేస్తున్నాయి. దీంతో వందల కోట్ల మంది ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి’ అని ప్రకటిం చారు. అయితే జీడీపీని మాత్రమే అభివృద్ధికి కొలమానంగా భావి స్తున్న నయా ఉదారవాద ఆర్థశాస్త్రం నేపథ్యంలో మన భూ ఖండం వాస్తవంగానే మండిపోతోందని గుర్తించడంలో ఈ నివేదిక విఫల మైంది. లేదా, ప్రపంచ జనాభాలో 1 శాతం సగం ప్రపంచం వెలువ రించే ఉద్గారాలకు రెండు రెట్లకు పైగా ఎలా వెలువరిస్తోందన్న వాస్త వాన్ని ఎవరైనా ఎలా వివరించగలరు? మరొక 20 సంవత్సరాల్లో ప్రపంచ ఉష్ణోగ్రత 1.5 సెంటీగ్రేడ్ డిగ్రీల మేరకు పెరగనుండటాన్ని ఎవరూ కాదనలేరని ఈ నివేదిక హెచ్చరిస్తోంది. ఇప్పటికే 1.1 సెంటీగ్రేడ్ డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగింది. మరొక 0.4 సెంటీగ్రేడ్ డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగేందుకు ఇంకెన్ని సంవత్స రాల సమయం పడుతుందో నాకు తెలీదు. కాకుంటే, పారిశ్రామిక అభివృద్ధి ప్రారంభ సంవత్సరాల్లో మాదిరే ప్రపంచ వాతావరణం వేడెక్కుతోంది. దీన్ని బట్టి చూస్తే ఆర్థిక వృద్ధి నమూనాను రూపొందిం చిన మార్గం మౌలికంగానే లోపభూయిష్టంగా ఉందని తెలుపుతుంది. ప్రపంచ ఆర్థిక వేదికపై ఇంటర్నేషనల్ చారిటీ ఆక్స్‌ఫామ్ వరుసగా నివేదించిన అసమానతలపై నివేదిక మరొక అంతర్జాతీయ అధ్యయనంగా మనముందుకొచ్చింది. సంపన్నులు మరింత సంప న్నులెలా అవుతున్నారో, పేదలు మరింత నిరుపేదలుగా ఎలా మారి పోతున్నారో ఈ నివేదికలు స్పష్టంగా వివరించాయి. మన సంస్కర ణలపై పునరాలోచన తక్షణం అవసరమనేందుకు ఇదొక బలమైన సూచికగా కనబడుతుంది. భారత్‌లో ఒక శాతం మంది చేతుల్లో ఉన్న సంపద, 73 శాతం జనాభా సంపద కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉందన్న వాస్తవం ఒక్కటే... అసమానతలను తీవ్రంగా పెంచివేయ డంలో ఆర్థిక సరళీకరణ పాత్రను అర్థం చేసుకోవచ్చు. ఇటీవలే అంత రిక్ష యాత్ర చేసిన జెఫ్ బెజోస్ రోజుకు 8 బిలియన్ డాలర్లను సంపాదిస్తూ కూడా అమెరికాలో స్టెనోగ్రాఫర్ చెల్లించే పన్ను కంటే తక్కువ పన్నును చెల్లిస్తున్నాడు. సంపన్నులు అపారమైన సంపదను పెంచుకోవడంలో ప్రపంచ ఆర్థిక సరళీకరణల నమూనా ఎలా తోడ్ప డుతుందో ఇది స్పష్టంగా తెలుపుతుంది. భారత్‌లో కూడా ఈజీ మనీ, ఆర్థిక ఉద్దీపనలు స్టాక్ మార్కెట్లోకి వెళ్లిపోయాయి. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కొట్టుమిట్టాడుతున్న సమయంలోనూ స్టాక్ మార్కెట్లు పుంజుకుంటున్నాయంటే ఆశ్చర్యపో వలసింది లేదు. అసమానత్వమే చెడు ఆర్థికవ్యవస్థకు సంకేతం. పబ్లిక్ సిటిజన్ సలహా బృందం మనకు చెప్పినట్లుగా అమెరికాలోని బడా టెక్ కంపెనీల సీఈఓల సామూహిక సంపద 2021లో 651 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ మొత్తాన్ని ఉపయోగించి ఉంటే ప్రపంచ క్షుద్బాధను నిర్మూలించవచ్చు. మలేరియాని మటుమాయం చేయ వచ్చు. ప్రపంచం మొత్తానికి కోవిడ్ వ్యాక్సిన్ షాట్లను వేసి ఉండవచ్చు. అమెరికాలోనే ఇళ్లు లేని నిరాశ్రయుల సమస్యకు ముగింపు పలక వచ్చు. అప్పటికీ ఈ బిలియనర్ల వద్ద ఎంతో డబ్బు మిగిలే ఉంటుంది. భారత్‌లో ఒక శాతం సంపన్నుల వద్ద పోగుపడిన భారీ సంప దలో అతి చిన్న భాగాన్ని ఖర్చు చేయచేయగలిగితే మన దేశ దారి ద్య్రాన్ని నిర్మూలించడానికి, దేశీయ ఆకలి చరిత్రను తుడిచిపెట్టడానికి సరిపోతుంది. ఆర్థికవేత్త సుర్జిత్ భల్లా చెప్పినట్లుగా భారత్‌లో ఒక సంవ త్సరం దారిద్య్రాన్ని పూర్తిగా తొలగించాలంటే 48 వేల కోట్ల రూపా యలు కేటాయిస్తే చాలు. 2020 ప్రపంచ క్షుద్బాధా సూచిలో 107 దేశాల జాబితాలో భారత్ 94వ ర్యాంకులో ఉండటానికి మరో కారణం అవసరం లేదని నాకు అనిపిస్తుంది. అది కూడా మన ఆహార ధాన్యాల నిల్వలు పలు సంవత్సరాల పాటు దేశ అవసరాలకు సరిపోయేంత స్థాయిలో పోగు పడివుండటాన్ని ప్రత్యేకించి పరిశీలించాల్సి ఉంది. వ్యవసాయ దుస్థితి కొనసాగింపు కారణంగానే ఢిల్లీ చుట్టుపట్ల రైతుల తీవ్ర నిరసన చోటుచేసుకుంది. అందుకే మరింత కఠిన సంస్కరణలు చేపట్టడం కాదు. మానవీయ రూపంలో సంస్కరణలను తీసుకు రావటం ఇప్పుడెంతో అవసరం. ముఖ్యంగా ప్రజారోగ్యం, విద్య, వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక వ్యత్యాసాల తగ్గింపు అవసరాలను తీర్చగల సంస్కరణలు కావాలిప్పుడు. ఆరోగ్యకరమైన, గౌరవప్రదమైన జీవితం అనేది ఆరోగ్యకరమైన పర్యావరణంతోపాటు పలు అంశాలపై ఆధారపడి ఉంటుంది. 2020 పర్యావరణ పనితీరు సూచీ ప్రకారం 180 దేశాల జాబితాలో భారత్ 168వ స్థానంలోకి పడిపోయింది. దీర్ఘకాలిక లక్ష్యాలతో ప్రజారోగ్య పరిరక్షణ, సహజవనరుల పరిరక్షణ, కర్బన ఉద్గారాల తగ్గింపుపై విశేషంగా కృషి చేసిన దేశాలు అత్యధిక ర్యాంకులను సాధించాయని ఈ సూచి తేల్చి చెప్పింది. అయితే సంపన్న దేశాలు ఈ సామాజిక, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలను సాధించాయని చెప్పలేము. ఎందు కంటే పారిశ్రామిక యుగం ప్రారంభమైనప్పటినుంచి 63 శాతం కాలుష్య ఉద్గారాలను 90 కంపెనీలు మాత్రమే సామూహికంగా విడు దల చేశాయి. అంటే భారత ఆర్థికవేత్తలు, విధాన నిర్ణేతలు మరింత నిలకడైన, సమీకృత మార్గంపై కృషి చేయాల్సి ఉందని ఈ వాస్తవం స్పష్టం చేస్తోంది. ఆర్థిక సంస్కరణల అవసరం గురించి గుండెలు బాదుకుంటూ శోకన్నాలు పెడుతున్న వారికి సంస్కరణలు అంటే ప్రైవేటీకరణ అని మాత్రమే అర్థం కావడంతో దేశం మొత్తంగా ఐఎమ్ ఎఫ్ నేతృత్వంలోని అంతర్జాతీయ ఉచ్చులో చిక్కుకుపోయింది. దీనికి బదులుగా, మధ్య, దిగువ తరగతుల్లోని మెజారిటీ జనాభా మరిం తగా సంపాదించేలా మన విధానాలను మార్చాలి. అప్పుడు మాత్రమే భారీ ఎత్తున గ్రామీణ డిమాండును సృష్టించవచ్చు. ’వాషింగ్టన్ సమ్మతి’ అనే స్పష్టమైన డిజైన్‌ను దాటి ముందుకెళ్లేం దుకు ఒక చారిత్రక అవకాశాన్ని భారతీయ విధాన నిర్ణేతలు కోల్పో యారు. అలాగే వ్యవసాయాన్ని రెండో అభివృద్ధి చోదకశక్తిగా పరిగ ణించే తరహా దేశీయ ఆర్థిక సంస్కరణల నమూనాను చేపట్టే అవకాశం కూడా వీరు చేజార్చుకున్నారు. వ్యవసాయం నుంచి రైతాంగాన్ని పక్కకు నెట్టేయడానికి బదులుగా, వ్యవసాయాన్ని ఆర్థికవృద్ధి శక్తికేంద్రంగా మార్చడంపై మనం ఇకనైనా దృష్టి పెట్టాలి. ఈ కీలక మార్పు ఇప్పటికీ సాధ్యమే. సంపన్న దేశాల్లో వ్యవ సాయ రంగాన్ని విధ్వంసం చేసిన పారిశ్రామిక వ్యవసాయం గుణ పాఠాలను, ప్రపంచ వ్యాప్తంగా స్వేచ్ఛా మార్కెట్లు భారీ ఎత్తున సృష్టించిన వ్యవసాయ దుస్థితి నేర్పుతున్న పాఠాలను దృష్టిలో ఉంచు కుని ఆహార వ్యవసాయ వ్యవస్థను సమర్థంగా నిర్వహించగలిగిన స్థితిలోకి రైతులను తీసుకురావాలి. వీరందరికీ నిర్దిష్టధరపై హామీ ఇస్తూ స్థిర ఆదాయాన్ని అందుకునేలా సంస్కరణలను మార్చాల్సి ఉంది. ప్రజారోగ్యం, విద్య, వ్యవసాయ అభివృద్ధి విషయంలో పెరు గుతున్న అవసరాలను పెంపొందించడమే సంస్కరణల విధి. దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు -
బుజ్జగింపులో వింత కోణం
ఉత్తరప్రదేశ్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బ్రాహ్మణ ఓటర్లను బుజ్జగించే పనిలో అటు బహుజన్ సమాజ్ పార్టీ, ఇటు సమాజ్‌వాదీ పార్టీ తలమునకలవుతున్నాయి. కానీ, గత అసెంబ్లీ ఎన్నికల్లో బ్రాహ్మణ ఓటర్లు ఓటు వేయని కారణంగా ఈ రెండు పార్టీలూ ఓడిపోలేదు. కానీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బ్రాహ్మణ వర్గాన్ని బుజ్జగించడానికి యూపీ వ్యాప్తంగా బ్రాహ్మణ సమ్మేళనాలను నిర్వహిస్తామంటూ బీఎస్పీ ప్రకటించగా, తర్వాత ఎస్పీ కూడా దానికి వంతపాడింది. మరి తమను తాము కొత్తగా ఆవిష్కరించుకుంటున్న క్రమంలో ఇన్నాళ్ళూ ఈ పార్టీలు ప్రబోధిస్తూ వచ్చిన సామాజిక న్యాయం, సెక్యులరిజం సిద్ధాంతాల గతేమిటి అనేది ప్రశ్న. మొత్తం మీద, ఎస్పీ, బీఎస్పీలు తమ రాజకీయాలను సరైన దిశలో నడిపించడానికి బదులుగా సైద్ధాంతిక విలువలను పక్కనబెడుతున్నాయి. ఈ సరికొత్త బుజ్జగింపు యూపీ రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుందనేది ఆసక్తికరం. ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సీ 2018 నవంబర్ 20న ‘బ్రాహ్మణ పితృస్వామ్యాన్ని తుదముట్టించండి’ అనే పోస్టర్ పట్టుకుని తీవ్ర వివాదాన్ని రేకెత్తించారు. దాన్ని చూడగానే కాంగ్రెస్ నేత మనీష్ తివారీ ఆగ్రహోదగ్రులయ్యారు. తివారీ ఆగ్రహం వెనుక సారం లేనప్పటికీ సరిగ్గా మూడేళ్ల తర్వాత ఉత్తరప్రదేశ్‌లో మండల్ రాజకీయాల పతాక ధారులు బీఎస్పీ, ఎస్పీలు తన ప్రకటనను సీరియస్‌గా తీసుకుంటారని తివారీ అసలు ఊహించి ఉండరు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బ్రాహ్మణ కమ్యూనిటీని బుజ్జగించడానికి యూపీ వ్యాప్తంగా బ్రాహ్మణ సమ్మేళనాలను నిర్వహిస్తామంటూ బీఎస్పీ ప్రకటించగా, తర్వాత సమాజ్ వాదీ పార్టీ కూడా దానికి వంతపాడింది. ఈ మార్పు అనేక ప్రశ్నల్ని లేవనెత్తింది. బీఎస్పీ, ఎస్పీ వంటి మండల్ రిజర్వేషన్ల అనుకూల పార్టీలను తమ రాజకీయాలను పునర్నిర్వచించుకునేలా బీజేపీ ఒత్తిడి పెడుతోందా? తమను తాము కొత్తగా ఆవిష్కరించుంటున్న క్రమంలో ఇన్నాళ్లు ఈ పార్టీలు ప్రబోధిస్తూ వచ్చిన సామాజిక న్యాయం, సెక్యులరిజం సిద్ధాంతాల గతేమిటి అనేది ప్రశ్న. ఇలాంటి మౌలిక పరివర్తనతో ఈ పార్టీలు ఎన్నికల్లో ప్రయోజనం సాధిస్తాయా అన్నదీ ప్రశ్నే. 2019 లోక్ సభ ఎన్నికల పోలింగ్ అనంతరం లోక్‌నీతి–సీఎస్డీఎస్ నిర్వహించిన సర్వే ప్రకారం యూపీలో 72 శాతం యాదవేతరులు, కొయిరి–కుర్మీ ఓబీసీలు బీజేపీకే ఓటు వేసినట్లు తేలింది. వీరిలో 18 శాతం మంది మాత్రమే ఘట్బంధన్ కూటమికి ఓట్లేశారు. దిగువ తరగతి ఓబీసీలు, దళితులలో ఇంత మౌలిక మార్పు ఆశ్చర్యం గొలుపుతుంది. ఎందుకంటే బీజేపీలో వారి ప్రాతినిధ్యం కనీస స్థాయిలోకూడా లేదు. ఉత్తరప్రదేశ్‌లో 44.9 శాతం అగ్రకులాలు, 19.7 శాతం ఓబీసీలు గత యూపీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేశారు. ప్రధానంగా అగ్రకులాల ఆధిపత్యం కొనసాగుతున్న బీజేపీకి దిగువ తరగతి ఓబీసీల, దళితుల ఓట్లు తరలిపోవడం ఎలా అర్థం చేసుకోవాలి? దీనికి ప్రధాన కారణం ఉంది. మండల్ రాజకీయాలు యూపీలోని దిగువ తరగతి ఓబీసీలకు, దళితులకు భౌతికపరంగా (ఉద్యోగాలు, విద్య), రాజకీయపరంగా (రాజకీయ ప్రాతినిధ్యం, గుర్తింపు) ఎలాంటి ప్రయోజనాలు కలిగించలేదు. పలుకుబడిన కొన్ని బీసీ, ఓబీసీ కులాలకు మాత్రమే ప్రయోజనాలు సిద్ధించాయి. ఉదాహరణకు, 2017 అక్టోబర్‌లో నియమించిన కమిషన్ కేంద్ర స్థాయిలో ఓబీసీలో ఉప వర్గీకరణకు సంబంధించిన సమస్యను అధ్యయనం చేసింది. యూనివర్సిటీలు, ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఎంలు, ఏఐఐఎమ్లతోపాటు కేంద్ర ఉన్నత విద్యా సంస్థల్లో ఓబీసీల ప్రవేశంపై గత మూడేళ్ల డేటాను చూస్తే 97 శాతం ఓబీసీ కోటా ప్రయోజనాలు ఓబీసీల్లోని 25 శాతం ఉప–కులాలకు మాత్రమే అందాయి. మొత్తం 983 ఓబీసీ కమ్యూనిటీలకు (ఓబీసీల్లో 37 శాతం) ఉద్యోగాలు, అడ్మిషన్లలో సున్నా ప్రాతినిధ్యం దక్కింది. పైగా, ఓబీసీల్లో 10 కమ్యూనిటీలు మాత్రమే 24.95 శాతం ఉద్యోగాలు, అడ్మిషన్లు పొందాయి. అంటే రిజర్వేషన్లు రెండంచుల కత్తిలాగా పనిచేసినట్లు కనిపిస్తోంది. అగ్రకులాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా దిగువ కులాలను ఐక్యం చేయడంలో రిజర్వేషన్లు ఒక సాధనంగా పనిచేసినప్పటికీ, అదే సమయంలో రిజర్వేషన్ల ప్రయోజనాలు ఇంత అసమానంగా పంపిణీ కావడంతో ఒక విస్తృతస్థాయి సంఘీభావం, సామూహిక కార్యాచరణ దిగువకులాల్లో లోపించింది. అదే సమయంలో ఏక జాతి సిద్ధాంతాన్ని బలంగా ప్రబోధించే బీజేపీ వైపు దీర్ఘకాలిక ఆలోచన లేకుండా ఓబీసీల్లో విశ్వాసం పెరగడానికి కూడా ఇదే కారణం. దిగువ కులాలు చీలిపోవడం, బీజేపీ దూకుడుగా వ్యవహరించడం అనేవి మండల్ రాజకీయాలను ద్వంద్వ సంక్షోభంలోకి నెట్టివేశాయి. కుల రాజకీయాల గుణపాఠాలు దిగువ తరగతి ఓబీసీల, దళితుల ఆందోళనలు నిజమైనవే అయినప్పటికీ బీఎస్పీ, ఎస్పీ నాయకత్వం వీరి సమస్యలను చిత్తశుద్ధితో పరిశీలించడంపై నిర్లక్ష్యం వహించాయి. పైగా వారి సమస్యలను కనీ సంగా గుర్తించడంలో కూడా ఈ రెండు పార్టీలు విఫలమయ్యాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఘోర పరాజయానికి కారణాలను సమీక్షించుకోవడంలో కూడా ఈ రెండు పార్టీలు వెనుకబడ్డాయి. పైగా ప్రతి ఎన్నికల్లోనూ ఈ రెండు పార్టీల వ్యూహాల్లో తీవ్రమైన మార్పులు చోటు చేసుకుంటూ వచ్చాయి. ఉదాహరణకు 2017 అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ అభివృద్ధి సాధనను తన నినాదంగా తీసుకొచ్చింది. ఎక్స్‌ప్రెస్ రహదారులు, మెట్రోలు, ల్యాప్‌టాప్‌ల పంపిణీ వంటివి తన ప్రభుత్వ ఘనతగా ప్రచారం చేసుకుంది. కానీ 2019 లోక్ సభ ఎన్నికల సమయానికి సామాజిక న్యాయం వైపు దిశ మార్చి మహాపరివర్తనకు అదొక్కటే మార్గమని ఢంకా భజాయించింది. కానీ ఆ రెండు ఎన్నికల్లోనూ ఎస్పీ ఘోర వైఫల్యం చవిచూసింది. అదే సమయంలో బీఎస్పీ సైతం ముస్లిం ఓటర్లను గెల్చుకోవడానికి ప్రయత్నించి 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 100 టికెట్లను ముస్లింల పరం చేసింది. ఇది కూడా పనిచేయలేదు. కానీ ఇప్పుడు కూడా ఆ పార్టీ బ్రాహ్మణులను బుజ్జగించడం అనే ప్రయోగం చేస్తోంది. అంటే అభివృద్ది పంథా కానీ మండల్ శైలి రాజకీయాలు కానీ ఈ రెండు పార్టీలకు ప్రయోజనాలు కలిగించలేకపోయాయని స్పష్టమవుతోంది. మరోవైపున బీజేపీ నిస్సందేహంగానే కుల ప్రాతిపదికన ఓటర్ల సమీకరణను పునర్నిర్వచించి, ఓబీసీల్లో కొన్ని సెక్షన్లను మరికొన్ని సెక్షన్లకు వ్యతిరేకంగా నిలిపింది. ఇన్నాళ్లూ తమకు మద్దతు పలికిన వర్గాలను తిరిగి గెల్చుకునే ప్రయత్నం చేపట్టడానికి బదులుగా ఎస్పీ, బీఎస్పీలు తాజాగా బ్రాహ్మణులను బుజ్జగించే పనిలో పడిపోయాయి. తమ రాజకీయాలకు కొత్తదనం తీసుకొచ్చే క్రమంలో ఈ రెండు పార్టీలు దళిత బహుజన రాజకీయాలు, సామాజిక న్యాయం, సెక్యులరిజం మౌలిక సూత్రాలకు భిన్న మార్గంలో పయనిస్తున్నాయి. అందుకే సామాజిక న్యాయం, ఉనికిలో ఉన్న కోటాలను అమలు చేయకపోవడం, నీట్ పరీక్షల్లో ఓబీసీ రిజర్వేషన్లను తిరస్కరించడం, కులాలవారీ జనగణనకు ప్రభుత్వ తిరస్కరణ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలుపర్చడం వంటి అనేక కీలక సమస్యలపై ఈ రెండు పార్టీలు ఎలాంటి స్ఫూర్తిదాయకమైన పోరాటాలను చేపట్టలేకపోయాయి. పైగా, అయోధ్యలో బీఎస్పీ నిర్వహించిన బ్రాహ్మణ్ సమ్మేళనం బీజేపీకీ, బీఎస్పీకి మధ్య తేడా లేకుండా చేసింది. ఆ సమ్మేళనంలో బీఎస్పీ ‘జై శ్రీరాం’ అని నినదించడమే కాకుండా పాలక బీజేపీ కంటే రామాలయాన్ని వేగంగా నిర్మిస్తానని శపథం చేసింది కూడా. యూపీలో ఇటీవలి సంవత్సరాల్లో కులపరమైన అత్యాచారాలు, అణచివేత పెరుగుతున్నప్పటికీ బీఎస్పీ తన మౌలిక విలువలతో రాజీపడుతున్నట్లు కనిపిస్తోంది. మొత్తం మీద, ఏస్పీ, బీఎస్పీలు తమ రాజకీయాలను సరైన దిశలో నడిపించడానికి బదులుగా సైద్ధాంతిక విలువలను పక్కనబెడుతున్నాయి. బిహార్‌లో ముస్లింలు మజ్లిస్ పార్టీ వైపు తరలిపోవడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ పార్టీలు ఇకపై ముస్లిం ఓట్లను గంపగుత్తగా ఆకర్షించడం కూడా సాధ్యం కాదు. పంకజ్ కుమార్ వ్యాసకర్త పీహెచ్‌డి స్కాలర్, సెంటర్ ఫర్ పొలిటికల్ స్టడీస్,జేఎన్‌యూ -
ఇలాంటి పాడి ఆవు అక్కడ వద్దా?
భూమి హైదరాబాద్‌కు నలువైపులా ఉండడం తెలంగాణ ప్రభుత్వానికి బాగా కలిసి వచ్చింది. ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పెరగడానికి ఇదే కారణం. అమరావతిలో లక్షల కోట్లు వెచ్చించి దాన్ని ఒక ప్రైవేటు రియల్ ఎస్టేట్ వెంచర్లా చంద్రబాబు మార్చకుండా ప్రభుత్వ భూములలో రాజధాని కట్టి, మిగిలిన అటవీ భూములను అభివృద్ధి చేసే ప్రయత్నం చేసి ఉంటే ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చి ఉండేది! అందుకే ప్రస్తుతం జగన్ ప్రభుత్వం మూడు రాజధానులను ప్రతిపాదించింది. విశాఖలో అసమానాభివృద్ధిని బ్యాలెన్స్ చేసుకోవడం, అలాగే ఏపీలో ఉన్న మరికొన్ని నగరాలను సమాంతరంగా అభివృద్ధి చేయడం ద్వారా కేంద్రీకరణ లేకుండా చేసుకోవచ్చు. అంతేకాక, ఆ నగరాలను ఆదాయ వనరులుగా మార్చుకోవచ్చు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరం ప్రభుత్వానికి పాడి ఆవులా ఉందని అనుకోవాలి. మీడియాలో వస్తున్న కథనాలు చూస్తే ఒక్క హైదరాబాద్ నగరం ద్వారానే వచ్చే కొద్ది నెలల్లో ప్రభుత్వానికి సుమారు 20 వేల కోట్ల నుంచి 25 వేల కోట్ల రూపాయల ఆదాయం రావచ్చని అంచనా వేస్తున్నారు. కొన్ని పత్రికలు ఈ మొత్తం 30 వేల కోట్లకుపైగానే ఉంటుందని కథనాలు ఇస్తున్నాయి. ఇలాంటి లావాదేవీలలో కచ్చితంగా ఇంత మొత్తం వస్తుందని చెప్పలేకపోయినా, భారీగానే ప్రభుత్వానికి ఆర్జన రానుందని అర్థం అవుతుంది. ప్రధానంగా అనధికార లే అవుట్లలోని ప్లాట్ల క్రమబద్ధీకరణ బాగా ఉపయోగపడవచ్చని చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 25.5 లక్షల దరఖాస్తులు ఎల్.ఆర్.ఎస్.కోసం వచ్చాయి. వీటిలో హైదరాబాద్, వరంగల్ వంటి నగరాలలో లక్షకు పైగా ఒక్కోచోట నుంచి వచ్చాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం మార్కెట్ విలువలు ఎలా ఉన్నాయో తెలియంది కాదు. ప్రభుత్వం తొలుత పదివేల కోట్ల రూపాయల ఆదాయం దీనిద్వారా వస్తుందని అనుకుంటే, అంతా సజావుగా జరిగితే ఈ పద్దులో ఇరవైవేల కోట్ల రూపాయల పైగానే రావచ్చని చెబుతున్నారు. ఇక ఖాళీ స్థలాలపై పన్ను, రిజిస్ట్రేషన్ విలువల పెంపు వంటివి స్థూలంగా ఉన్నాయి. అదే సమయంలో ప్రభుత్వం రింగ్ రోడ్లకు అత్యంత సమీపాన కోకాపేట వంటి ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వ భూములను విక్రయించడం ద్వారా ఇప్పటికే 2,700 కోట్ల రూపాయలు ఆర్జించింది. ఈ భూముల అమ్మకంపై ప్రతిపక్షం విమర్శలు చేసింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ పైన, ఆయన కుటుంబ సభ్యులపైనా పలు ఆరోపణలు చేశారు. ప్రభుత్వం వాటిని ఖండించింది. అది వేరే కథ. హైదరాబాద్ వంటి రాజధాని తెలంగాణకు ఖజానా వంటిదని చెప్పాలి. ఎందుకంటే వాణిజ్య పన్నుల రూపేణా, మద్యం షాపుల ఎక్సైజ్ ఆదాయం ద్వారా, తాజాగా భూముల రెగ్యులరైజేషన్ , రిజిస్ట్రేషన్ వంటి వాటిని ప్రభుత్వం చేపట్టడం వల్ల ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పెరుగుతుందని చెప్పాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పడూ చెబుతున్నట్లు తెలంగాణ ధనిక రాష్ట్రం అయిపోయినట్లో కాదో కాని, హైదరాబాద్ వరకు తీసుకుంటే ఆయన చెప్పింది చాలావరకు కరెక్టు అని అంగీకరించాలి. ఉమ్మడి ఏపీకి రాజధానిగా ఉన్న సమయంలో లక్షలాది మంది ఏపీ, తెలంగాణలోని హైదరాబాదేతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడ్డారు. అనేక మంది రకరకాల వ్యాపారాలు చేపట్టారు. దానికి తోడు ఐటీ పరిశ్రమ ఇక్కడ నిలదొక్కుకోవడానికి అవసరమైన సదుపాయాలు ఉన్నాయి. ముఖ్యంగా భూమి హైదరాబాద్‌కు నలువైపులా ఉండడం కలిసి వచ్చింది. దేశంలో ఇలా నాలుగువైపులా విస్తరించే నగరాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో కోకాపేట వంటి చోట్ల ఎకరం అరవైకోట్ల వరకు వెళ్లిందని అనుకోవచ్చు. అదే సమయంలో ప్రభుత్వ భూములు ఇలా అమ్మేస్తే భావితరాలకు, వారి అవసరాలకు భూములు ఎక్కడి నుంచి వస్తాయన్న ప్రశ్నను విపక్షాలు సంధిస్తున్నాయి. భూముల అమ్మకం కేసీఆర్‌తోనే మొదలు కాలేదు. హైకోర్టు కూడా ఈ భూముల అమ్మకాన్ని ఆపలేదు. ఆక్రమణలకు గురయ్యేకన్నా అమ్మడమే బెటర్ అన్న అభిప్రాయం వ్యక్తం చేసింది. నిజంగానే కేసీఆర్ ప్రభుత్వ ఆలోచనలు వాస్తవరూపం దాల్చి ఒక్కసారిగా ముప్పైవేల కోట్ల రూపాయలకు పైగా ఆదాయం సమకూరితే ప్రభుత్వం పంట పండినట్లే అనుకోవాలి. కరోనా సంక్షోభ సమయంలో పడిపోయిన ఆదాయాన్ని ఈ రకంగా సమకూర్చుకోవడానికి కేసీఆర్ ప్రభుత్వానికి కలిసి వచ్చిన అదృష్టంగా అనుకోవచ్చు. ఇది హైదరాబాద్ కథ అయితే ఏపీలో అమరావతి పేరుతో గత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల డబ్బు లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేయాలని అప్పట్లో సంకల్పించారు. వేలాది కోట్ల రూపాయలు వ్యయం చేశారు. దాన్ని ఒక ప్రైవేటు రియల్ ఎస్టేట్ వెంచర్లా మార్చారు. దానివల్ల ప్రభుత్వంకన్నా ప్రైవేటు వ్యక్తులకే అధికంగా మేలు కలిగింది. అప్పట్లో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న నారాయణ ఒక మాట చెప్పేవారు. రైతుల నుంచి సమీకరించిన భూములలో ప్లాట్లు వేసి, మౌలిక వసతులు సమకూర్చి, ప్రభుత్వ అవసరాలకు వాడుకోగా ప్రభుత్వం అమ్ముకోవడానికి మిగిలేది పెద్దగా ఉండదని అనేవారు. పైగా అటవీభూములతో సహా సుమారు ఏభైవేల ఎకరాల మేర విస్తీర్ణం అభివృద్ధి కావాలంటే పాతిక, ముప్పై ఏళ్లు పట్టవచ్చన్నది ఒక అభిప్రాయం. చంద్రబాబు ఈ రియల్ ఎస్టేట్ మోడల్లో కాకుండా ప్రభుత్వ భూములలో రాజధాని కట్టి, మిగిలిన అటవీ భూములను అభివృద్ధి చేసి అమ్మే విధంగా ఏర్పాటు చేసుకుని ఉంటే ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చి ఉండేదేమో! చంద్రబాబు తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం అన్నిటినీ పరిశీలించి, ఒకే చోట లక్షల కోట్ల వ్యయం చేస్తే, మిగిలిన రాష్ట్రం అంతా అన్యాయం అవుతుందని భావించి మూడు రాజధానులను ప్రతిపాదించింది. వీటిలో తెలివైనది విశాఖ నగరాన్ని కార్యనిర్వాహక రాజధానిగా ఎంపిక చేసుకోవడం. కోర్టుల ద్వారా ఇతరత్రా అడ్డంకులు రాకపోతే, విశాఖ వేగంగా అభివృద్ధి చెందుతుంది. అటు విజయనగరం శ్రీకాకుళం వైపు, ఇటు అనకాపల్లి, తుని వైపు బాగా విస్తరించే అవకాశం ఉంటుంది. దానికి తోడు ప్రభుత్వ భూములు కూడా గణనీయంగానే ఉన్నాయి. ప్రభుత్వం లక్షల కోట్లు ఖర్చు చేయాల్సిన పనిలేదు. అక్కడకు ఇప్పటికే ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడ్డారు. ఇంకా పెద్ద సంఖ్యలో అక్కడకు తరలిస్తే, హైదరాబాద్ మాదిరే అది కూడా ఏపీకి మంచి ఆదాయ వనరు అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పటికే పలు పరిశ్రమలు ఉన్నాయి. ఐటీతో సహా వివిధ రంగాల పరిశ్రమలు అక్కడకు వస్తే నగరం ఊపు అందుకుంటుంది. అయితే హైదరాబాద్‌లో అంతా కేంద్రీకరణ అవడం వల్ల కొన్ని సమస్యలు కూడా వచ్చాయి. ఉదాహరణకు ఒక వైపు కోకాపేటలో భూముల విలువ కోట్ల రూపాయలకు పెరిగిందని సంతోషించే పరిస్థితి అయితే, మరో వైపు కాస్త భారీ వర్షాలు వస్తే వందల కాలనీలు వరదనీటిలో నానే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ధనిక ప్రాంతాలు పెరుగుతున్నాయని అనుకునే లోపే పేదవాడలు కూడా విస్తరిస్తున్నాయి. అదే సమయంలో కోకాపేట తదితర ప్రాంతాలలో సామాన్య, మధ్యతరగతి వారికి అవకాశాలు తగ్గిపోతుంటాయి. విశాఖలో వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవడం, అలాగే ఏపీలో ఉన్న మరికొన్ని నగరాలను సమాంతరంగా అభివృద్ధి చేయడం ద్వారా కేంద్రీకరణ లేకుండా చేసుకోవచ్చు. అంతేకాక, ఆ నగరాలను ఆదాయ వనరులుగా మార్చుకోవచ్చు. హైదరాబాద్ వంటి నగరం లేకపోవడం ఏపీకి పెద్ద లోటే కావచ్చు కానీ విశాఖ, రాజమండ్రి, విజయవాడ–గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు వంటి నగరాలు ఉండటం కూడా ఉపయుక్తమే. కాకపోతే వాటిని సరైన దిశలో అభివృద్ధి చేసుకోగలిగితే ఏపీ కూడా హైదరాబాద్‌లాగా అభివృద్ధి చెందుతుంది. చంద్రబాబు అప్పట్లో అంతా ఒకేచోట కేంద్రీకరించడానికి ప్రయత్నించి తప్పు చేశారు. జగన్ ప్రభుత్వం వికేంద్రీకరణకు ప్రయత్నిస్తుంటే చంద్రబాబు, ఇతరులు పదేపదే అడ్డుపడుతున్నారు. ఏపీలో ఉన్న నగరాలకు కొన్ని బలాలు ఉన్నాయి. వాటిని గుర్తించి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తే తమిళనాడులో మాదిరి ఆయా నగరాలకు గుర్తింపు వస్తుంది. ఉదాహరణకు చెన్నై రాజధాని అయినా, కోయంబత్తూరు, సేలం, మదురై తదితర నగరాలు బాగా వృద్ధి చెందాయి. ఒక్కో నగరం ఒక్కో రంగంలో విశిష్టత పొందింది. ఈ అనుభవాలను అధ్యయనం చేసి ఏపీలోని నగరాలను కూడా తీర్చిదిద్దాలి. కాని విశాఖ అభివృద్ధికే ప్రతిపక్షం అడ్డుపడుతోంది. న్యాయ వ్యవస్థ ద్వారానో, మరో రకంగానో ప్రతి విషయంలో ఆటంకాలను సృష్టిస్తోంది. వీటన్నిటిని అధిగమించి జగన్ ప్రభుత్వం ముందుకు సాగాల్సి ఉంది. కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
ఈ వైపరీత్యం ఎవరి పాపం?
పర్యావరణ మార్పుల ప్రభావంతో విధ్వంసం ఏదైనా సరే.. పేదదేశాలకే పరిమితమని పాశ్చాత్య దేశాల ప్రజల్లో సర్వసాధారణంగా ఉన్న అంచనాను గత రెండువారాలుగా జరుగుతున్న పరిణామాలు పటాపంచలు చేశాయి. వరదకు అర్థం తెలీని జర్మనీలో.. అమెరికా, కెనడాల్లో చెలరేగిన వడగాల్పుల్లో వందలాది మంది మృతి చెందడం యావత్ ప్రపంచానికీ గుణపాఠం కావాలి. ఈ ఆకస్మిక వైపరీత్యాల సమస్యను సంపన్నదేశాలు ఏదోలా అధిగమిస్తాయన్న ధీమా గాలికి కొట్టుకుపోయింది. కోవిడ్ కానివ్వండి.. ఇంకో ప్రకృతి విపత్తు కానివ్వండి.. ప్రతి ఒక్కటీ మనకు ఒకే విషయాన్ని గుర్తు చేస్తోంది. ఏ మూల ఏం జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతా కచ్చితంగా ఉంటుందని! యూరప్‌లో వరద బీభత్సం... కెనడాలో చరిత్రలో ఎన్నడూ ఎరగని స్థాయి ఉష్ణోగ్రతలు.. అకాల వర్షాలు... వరదలు!! ఇటీవలి కాలంలో సర్వత్రా వినిపిస్తున్న వార్తలివే. కారణాలు సుస్పష్టం. వాతావరణ మార్పులు. అయితే బాధ్యత ఎవరిదన్న విషయానికి వస్తే మాత్రం ప్రపంచం రెండుగా విడిపోయిందనే చెప్పాలి. జర్మనీలో ఇటీవలి వరదకు సుమారు 200 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశమైనప్పటికీ వరదను సమర్థంగా ఎదుర్కోలేని పరిస్థితిలో ఎందుకుంది? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం నీళ్లు నములుతోంది. ‘‘జరిగిన విధ్వంసాన్ని వర్ణించేందుకు జర్మన్ భాషలో పదాలు కరవయ్యాయి’’ అని చాన్స్‌లర్ ఏంజెలా మార్కెల్ ఓ టీవీ రిపోర్టర్‌తో మాట్లాడుతూ వ్యాఖ్యానిస్తే... ఓ సామాన్య మహిళ మాత్రం ‘‘అసలు వరదల్లాంటివన్నీ పేద దేశాల్లో కదా జరగాలి. జర్మనీలోనూ వస్తాయని నేనెప్పుడూ అనుకోలేదు. వాన ఎంత వేగంగా వచ్చిందో... అంతే వేగంగా మనుషులను తనతో తీసుకెళ్లిపోయింది’’ అని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సంపన్న దేశాలు మినహాయింపు కాదు... ఈ మహిళ తన వ్యాఖ్యలో తెలిసో తెలియకో పాశ్చాత్యదేశాల్లోని మెజార్టీ ప్రజల్లో ఉన్న ఒక తప్పుడు అవగాహనను ఇంకోసారి స్పష్టం చేసింది. వాతావరణ మార్పుల ప్రభావం తాలూకూ విధ్వంసం ఏదైనా సరే.. పేదదేశాలకే పరిమితమన్నది వీరి అంచనా. అధిక జనాభాతో కిటకిటలాడే ఆయా దేశాల తీర ప్రాంతాల్లోనే నష్టం ఎక్కువగా ఉంటుందని.. ధనిక దేశాలకు ఏం ఫర్వాలేదన్న అపోహకు హేతువేమిటో తెలియదు. అంతేకాదు. సంపన్నదేశాలు ఏదోఒకలా ఈ సమస్యను అధిగమిస్తాయన్న ధీమా కూడా వారిలో వ్యక్తమవుతూంటుంది. కానీ వాస్తవం మాత్రం ఇందుకు భిన్నం. ప్రాంతం ఏదైనా.. ప్రకృతి వైపరీత్యాల కారణంగా జరిగే జననష్టం మాత్రం అంతా ఇంతా కాదు. అయితే ఈ సంఘటనలకు మనం ఎలా స్పందిస్తున్నామన్న అంశంపైనే వాతావరణ మార్పులపై జరుగుతున్న చర్చలు విభేదాలకు దారితీస్తున్నాయి. వాతావరణ మార్పుల వల్ల పేద దేశాలే ఎక్కువ నష్టపోతాయన్న అంచనా కూడా ఇలాంటిదే. కానీ కోవిడ్ కానివ్వండి.. ఇంకో ప్రకృతి విపత్తు కానివ్వండి.. ప్రతి ఒక్కటి మనకు ఒకే విషయాన్ని గుర్తు చేస్తోంది. ఏ మూల ఏం జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతా కచ్చితంగా ఉంటుందని! వాతావరణ మార్పులపై ఈ ఏడాది మరోసారి అంతర్జాతీయ స్థాయి చర్చలు జరగనున్నాయి. బ్రిటన్‌లోని గ్లాస్గ్లవ్లో ఈ చర్చ జరగాల్సి ఉండగా.. ఈ ఏడాది కూడా కనివినీ ఎరుగని రీతిలో ప్రకృతి విపత్తులు చవిచూశాం మనం. కాలిఫోర్నియాను అలవికాని దావానలం చుట్టేస్తే.. అమెరికాలో దశాబ్దాల తరువాత వడగాడ్పులు వీస్తున్నాయి. ఉత్తర అమెరికాలో భాగమైన కెనడాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇంకోవైపు జర్మనీలో వరదలు.. వెయ్యేళ్లలో ఎన్నడూ లేనంత స్థాయిలో చైనాలో వాన బీభత్సం. ఇవన్నీ ఇటీవలి పరిణామాలే. చైనాలో ప్రళయాన్ని తలపించేలా కార్లు, విమానాలు నీళ్లలో కొట్టుకుపోతున్న దృశ్యాలు సుదూర భవిష్యత్తులోనూ మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. దేశీయంగా చూస్తే.. నలభై ఏళ్లలో లేనంత స్థాయిలో వర్షాలతో మహారాష్ట్ర అతలాకుతలమైంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కేవలం ఆరు వారాల వ్యవధిలో రెండుసార్లు ప్రమాద హెచ్చరికలను చూడాల్సి వచ్చింది. ఉప్పొంగిన సముద్రకెరటాలు ఒకవైపు.. ఎడతెరిపిలేని వానలు ఇంకోవైపు మహా నగరాన్ని భయంతో కంపించేలా చేశాయంటే అతిశయోక్తి కాదేమో. చిన్నపాటి వర్షానికే నగరాలు చెరువుల్లా మారిపోతూండటానికి నగర ప్రణాళికల్లో లోపం, వరద ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ విపరీతంగా సాగుతున్న కాంక్రీట్ నిర్మాణాలు కొంత కారణమైనప్పటికీ... ఇటీవలి కాలంలో ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువయ్యాయని అందరూ గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మానవ చేష్టల ఫలితంగా వాతావరణంలో మార్పులు జరుగుతున్నాయని.. భవిష్యత్తులో వీటి ప్రభావం మరింత తీవ్రమవుతాయని.. సముద్రతీర ప్రాంతాల్లోని మహానగరాలు నీటమునిగినా ఆశ్చర్యం లేదని అందరూ అంగీకరిస్తున్నా.. కొన్ని ధనికదేశాలు ఈ విపత్తును అధిగమించగలవన్న ఆశ కొనసాగుతూండటం ఆందోళనకరం. ఆధిపత్య భావజాలమా? అతితక్కువ సమయంలో అత్యధిక వర్షపాతం! ఇలాంటి అనూహ్య పరిణామాలు తరచూ జరుగుతుంటాయని వాతావరణ మార్పులపై ఏర్పాటైన ఐక్యరాజ్యసమితి కమిటీ ఐపీసీసీ ఇప్పటికే చాలాసార్లు హెచ్చరికలు జారీ చేసింది. భూతాపోన్నతి కారణంగా సంభవించే వాతావరణ మార్పుల్లో ఇదీ ఒకటని కూడా విస్పష్టంగా పలు నివేదికల్లో పేర్కొంది. ఇది ప్రపంచంలోని అన్నిదేశాలకూ వర్తించే అంశమైనప్పటికీ ఈ విషయమై వివక్ష స్పష్టంగా కనిపిస్తూంటుంది. తెల్లతోలు ఆధిపత్య భావజాలం కనిపిస్తూంటుంది. ప్రకృతి వనరులను రేపన్నది లేని చందంగా వాడేసుకుంటూ వాతావరణ మార్పులకు వారే కారణమవుతున్నా.. నెపం మాత్రం పేద దేశాల్లోని అధిక జనాభాపై నెట్టేయడం ఈ భావజాలానికి ఓ ప్రతీకగా చెప్పుకోవచ్చు. కొందరి సోకు.. అందరి శోకం! వాతావరణ మార్పుల విషయంలో వాస్తవం ఏమిటంటే.. పెట్రోలు, డీజిల్ వంటి శిలాజ ఇంధనాల విచ్చలవిడి వాడకం. ప్రధాన భూమిక దీనిదే. కొందరి కార్బన్ ఫుట్‌ప్రింట్ (మన జీవనశైలి, అలవాట్ల ఫలితంగా ఉత్పత్తి అయ్యే విషవాయువుల మోతాదు. వాహనాల్లో పెట్రోలు వాడకంతో కార్బన్ డయాక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్ వంటి వాయువులు వెలువడుతూంటాయి). అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఒకసారి తరచి చూస్తే.. కేవలం కొన్ని దేశాలు, ప్రజల కార్బన్ ఫుట్‌ప్రింట్ అధిక జనాభా ఉన్న ఇతర దేశాల కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉండటంతోనే ప్రపంచం ఇప్పుడు ఈ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రపంచ వనరులపై 2019 నాటి ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం.. అధిక ఆదాయానికి, భూ వాతావరణంపై పడుతున్న ప్రభావానికి ప్రత్యక్ష సంబంధం ఉందని చెబుతుంది. అధిక జనాభా కానే కాదు. ఆదాయం పెరిగిన కొద్దీ విలాసాలు ఎక్కువవుతాయన్నది అనుభవం. ధనికదేశాల్లో జరుగుతున్నది అదే. జనాభా వృద్ధి రేటు తగ్గుతున్నా.. ఆయా దేశాల్లో వనరుల వినియోగంలో మాత్రం తగ్గుదల నమోదు కావడం లేదు. అంతేకాదు.. తక్కువ ఆదాయమున్న దేశాల్లో జనాభా ఎక్కువవుతున్నా వారి వనరుల కోసం డిమాండ్‌లో మాత్రం వృద్ధి లేకపోవడం గమనార్హం. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం ప్రపంచ వనరుల్లో పేద దేశాల డిమాండ్ మూడు శాతంగానే కొనసాగుతోంది. ఏతావాతా... వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించాలంటే.. జనాభ సమస్యను కాకుండా.. ఐశ్వర్యం అనే సమస్యకు పరిష్కారం వెతకాల్సి ఉంటుంది. రానున్న రోజుల్లో ఈ ఏడాది జర్మనీలో తరహాలోనే పలు ప్రకృతి వైపరీత్యాలను చవిచూడాల్సి వస్తుందని వాతావరణ శాస్త్రవేత్తలు ఇప్పటికే పలు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రపంచం ఒక్కతాటిపైకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే పరిస్థితి ఇంతకంటే దిగజారకుండా జాగ్రత్త పడినాచాలు. ఇది జరగాలంటే రానున్న కాప్ 26 సమావేశాల్లో ధనిక దేశాల వివక్ష సమస్యపై కచ్చితంగా చర్చ జరగాల్సి ఉంటుంది. వాతావరణ మార్పుల ప్రభావం భూమ్మీద ప్రతిఒక్కరిపై ఉంటుందన్న ఎరుక కలిగినప్పుడే దాన్ని సమర్థంగా ఎదుర్కోగలమని, విపత్తును నివారించగలమని అందరూ గుర్తించాలి. బహార్ దత్ వ్యాసకర్త పర్యావరణ జర్నలిస్టు, అధ్యాపకురాలు -
ఆ కుట్రకు... అంతే లేదా?
ఒక పత్రిక ఒక గాలి వార్త రాస్తుంది. చానళ్లు కొన్ని చర్చలు పెడతాయి. ఆ వెంటనే తెలుగుదేశం పార్టీ దానిని అందుకుంటుంది. దానిని మరో మీడియా కూడా ప్రాధాన్యత ఇచ్చి తప్పుడు ప్రచారం చేస్తుంది. ఇలా గత రెండేళ్లుగా సాగుతున్న ఈ తంతు లేదా కుట్రల పర్వం ఇంకెంతకాలం సాగుతుందో చూడాలి. ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక వర్గం మీడియాలో వస్తున్నన్ని కథనాలు బహుశా మరే సీఎంపైనా వచ్చి ఉండకపోవచ్చు. కరోనా సమయంలో కొంత అప్పు ఎక్కువ చేసి, పేదలను ఆదుకునే చర్యలకు జగన్ ప్రభుత్వం పూనుకోకపోతే... ఇదే మీడియా కానీ, తెలుగుదేశం కానీ నానా గగ్గోలు పెట్టేవి. ప్రతి విషయంలోనూ వ్యతిరేక కథనాలు అల్లడంలో ఒక వర్గం మీడియా తీరు నేడు పరాకాష్ఠకు చేరిందనే చెప్పాలి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక వర్గం మీడియాలో వస్తున్నన్ని కథనాలు బహుశా మరే ముఖ్యమంత్రిపైన వచ్చి ఉండకపోవచ్చు. నిజంగానే జగన్ ప్రభుత్వంలో తప్పులు జరుగుతుంటే వార్తలు ఇవ్వడం ఆక్షేపణీయం కాదు. కానీ నిత్యం ద్వేషం, కసి, తాము కోరుకున్న నేతకు సీఎం పదవి దక్కకపోవడమే కాకుండా, తెలుగుదేశం పార్టీ ఆయా ఎన్నికలలో దారుణంగా పరాజయం చెందడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నట్లుగా కనిపిస్తుంది. అందుకే ప్రతిదానిని వివాదం చేయడమో, లేక వాస్తవాలకు మసిపూసి మారేడు కాయ చేయడమో చేస్తున్నారు. నిజంగానే జర్నలిజం విలువలకు అనుగుణంగా వార్తలు ఇస్తే, దానిని బట్టి ప్రభుత్వంలో ఏమైనా తప్పులు జరుగుతుంటే వాటిని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. కానీ అందుకు విరుద్ధంగా తెలుగుదేశం నేతలు ఎవరైనా అక్రమాలకు పాల్పడితే, వాటిపై అధికారులు కేసు నమోదు చేస్తే వాటిని కక్షపూరితం అని ప్రచారం చేస్తున్నాయి. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుని జీఓ ఇచ్చిన వెంటనే అమ్మో.. అలా జరిగిపోతోంది.. ఇలా జరిగిపోతోందంటూ గగ్గోలు పెడుతూ కథనాలు వండి వార్చుతున్నాయి. కొద్దికాలం క్రితం మాజీ ఎంపీ జేసీ దివాకరరెడ్డికి సంబంధించిన మైనింగ్ లీజులో అక్రమాలు జరిగాయని అధికారులు వంద కోట్ల జరిమానా విధించారు. కానీ దానిని టీడీపీ మీడియా కక్ష అని ప్రచారం చేశాయి. అదే సమయంలో విశాఖలో లాటరైట్ ఖనిజానికి సంబంధించిన లీజు ఇవ్వగానే ఇంకేముంది.. చెట్టుకొట్టేస్తున్నారు.. బాక్సైట్ తవ్వేస్తున్నారు అంటూ ప్రచారం చేశారు. తెలుగుదేశం నేతల బృందం ఒకటి పర్యటించి చాలా అక్రమాలు జరిగినట్లు ఆరోపిం చింది. దీనిపై గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ద్వివేది వివరణ ఇచ్చారు. అది హైకోర్టు ఆదేశాల ప్రకారమే ఇచ్చారని, గత ప్రభుత్వ హయాంలో ఆరు లీజులు ఇచ్చారని వివిధ కారణాలతో ఐదు నాన్ ఆపరేషనల్ అయ్యాయని ఆయన వివరించారు. దీనిపై నర్సీపట్నం ఎమ్మెల్యే గణేష్ సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టారు. అయ్యన్నపాత్రుడు టైమ్‌లో జరిగిన కోట్ల రూపాయల అక్రమాలు బయటకు వస్తాయని, అందుకే తప్పుడు ఆరోపణలతో వారు ముందస్తు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. టీడీపీ మీడియాకు మాత్రం గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ఇచ్చిన వివరణ సంతృప్తి కలిగించలేదట. ఇలా ఉంటుంది వారి శైలి. మరో ఉదాహరణ చూద్దాం. ఏపీ ప్రభుత్వం 41 వేల కోట్ల రూపాయల వ్యయానికి సంబంధించిన వివరాలను సరిగా నమోదు చేయలేదనో, సాంకేతికంగా వేరే పద్ధతి అనుసరించారనో కాగ్ వివరణ కోరింది. అందులో వాస్తవం ఎంత ఉందో తెలుసుకోవలసిన బాధ్యత మీడియాకు ఉంటుంది కదా. పీఏసీ చైర్మన్‌గా ఉన్న పయ్యావుల కేశవ్ దానిపై అధికారుల వివరణ తీసుకుని, పీఏసీ మీటింగ్‌లో చర్చించిన తర్వాత గవర్నర్ కు ఫిర్యాదు చేసినా, లేదా మీడియాకు చెప్పినా తప్పుకాదు. అదేమీ చేయకుండానే ఆయన ప్రెస్‌కు ప్రకటన ఇచ్చారు. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రావత్ పై ఆరోపణపై ఖండనతో కూడిన వివరణ ఇచ్చారు. మరి ఇదే తెలుగుదేశం హయాంలో ఏభైవేల కోట్ల రూపాయల మేర ప్రభుత్వ ఖాతా నుంచి పీడీ ఖాతాలకు మరల్చి దుర్వినియోగం చేశారని అప్పట్లో బీజేపీ ఎంపీ జేవీఎల్ నరసింహా రావు ఆరోపణలు చేస్తే ఇంతవరకు దానిపై టీడీపీ వివరణ ఇచ్చినట్లు కనిపించలేదు. అలాగే టీడీపీ మీడియా కూడా దానిని కప్పిపుచ్చేయత్నం చేసింది. రాష్ట్రం అప్పులు చేస్తే అప్పు చేసిందని, కేంద్రం ఏదైనా వివరణ అడిగితే షాక్ ఇచ్చిందని రాయడం పెద్ద ఫ్యాషన్ అయింది. కరోనా సమయంలో కొంత అప్పు ఎక్కువ చేసి, పేదలను ఆదుకునే చర్యలకు జగన్ ప్రభుత్వం పూనుకోకపోతే, ఇదే మీడియా కానీ, తెలుగుదేశం కాని నానా గగ్గోలు పెట్టేవి. ఇతర రాష్ట్రాలలో అసలు అలా పేదలకు ప్రత్యేకంగా ఏదో పథకం ద్వారా ఆర్థిక సాయం అందించకపోయినా, అక్కడ కిక్కురు మనని మీడియా, ఏపీలో మాత్రం ప్రతి విషయంలోను వ్యతిరేక కథనాలు అల్లుతోంది. సుమారు లక్షన్నర మందికి గ్రామ, వార్డు సచివాలయాలలో ఉద్యోగాలు ఇస్తే, వాటిని పట్టించుకోని తెలుగుదేశం కానీ, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియా కానీ, ఉద్యోగాల క్యాలెండర్‌పై ఎంత హడావుడి చేశాయో గమనించాం. ఎక్కడైనా పదిమంది టీడీపీనో, మరోపార్టీ కార్యకర్తలో నిరసన తెలిపితే, మొత్తం రాష్ట్రం అంతా అట్టుడికిపోయినట్లుగా మొదటి పేజీలలో సచిత్ర కథనాలు ఇచ్చాయి. నిరుద్యోగులకు భృతి ఇస్తామని గతంలో చంద్రబాబు ప్రభుత్వం చెప్పి నాలుగేళ్లపాటు ఇవ్వకపోయినా, ఎన్నడైనా ఈ మీడియా ఆ విషయాన్ని గుర్తు చేసిందా? వైఎస్సార్సీపీ అసమ్మతి ఎంపీకి, టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌ల మధ్య జరిగిన చాటింగ్ వివరాలు చూస్తే కుట్రల స్వభావం అర్థం అవుతుంది. దీనిలో ఒక వర్గం మీడియా కూడా భాగస్వామి అవుతోందన్న భావన ఏర్పడుతోంది. ఈ విషయాలు బయటకు వచ్చాక టీడీపీతోపాటు వారికి మద్దతు ఇచ్చే మీడియా గప్‌చుప్ అయిపోయిన తీరు అందుకు ఆస్కారం ఇస్తుంది. సీఐడీ ఫోరెన్సిక్ నివేదిక ద్వారా వెలుగులోకి తీసుకొచ్చిన అంశాలు ఆశ్చర్యం కలిగించేవే. వేరే పార్టీ ఎంపీని టీడీపీ అధినేత తన పావుగా మార్చుకోవడం, చివరికి సీఎం జగన్ బెయిల్‌ను ఎలా రద్దు చేయించాలన్నదానిపై కలిసి పనిచేయడం ఇవన్నీ కుట్రకోణాన్ని స్పష్టపరుస్తున్నాయన్న విశ్లేషణలు వస్తున్నాయి. మామూలుగా అయితే న్యాయ వ్యవస్థలో చీమ చిటుక్కుమన్నా, అది కూడా వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా ఏమన్నా ఉంటే పెద్ద ఎత్తున కథనాలు రాసే ఈ మీడియాకు సుజనా చౌదరి దందా వంటివి కనిపించకపోవడం వారి దృష్టిలోపమా? లేక తమవారిపట్ల వల్లమాలిన అభిమానమా? ఇలా ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. విశాఖలో కొన్ని ప్రభుత్వ భూములు అమ్మాలనో, తనఖా పెట్టి రుణం తీసుకోవాలనో ఏపీ ప్రభుత్వం భావించింది. దాంతో టీడీపీ మీడియా రెచ్చిపోయి విశాఖ ఫర్ సేల్ అంటూ పిచ్చిగా కోతికి కొబ్బరికాయ దొరికిన చందంగా హడావుడి చేశాయి. కొందరు కోర్టుకువెళ్లి ఆపే యత్నం చేస్తున్నారు. అదే మీడియా హైదరాబాద్‌లో భూములు అమ్ముతుంటే, కాసుల పంట అని రాశాయే కానీ, హైదరాబాద్ ఫర్ సేల్ అని ఎందుకు రాయలేదు. తెలంగాణ హైకోర్టు ప్రభుత్వ భూముల అమ్మకాన్ని ఆపజాలమని స్పష్టం చేసింది. మరి దీనికి ఏమి చెబుతారు? ఏపీలో రోడ్లు పాడైపోయాయని, ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఒక మీడియా వరుస కథనాలు ఇచ్చింది. రోడ్లు రిపేరు చేయాలని వార్తలు ఇవ్వడం మంచిదే. కానీ ఒక పక్క వర్షాలు కురుస్తుంటే రోడ్ల మరమ్మతులు ఎలా జరుగుతాయో ఆ మీడియా వివరించాలి కదా! దీనిపై సోషల్ మీడియాలో ఒక వ్యంగ్య వ్యాఖ్య వచ్చింది. రెండేళ్ల క్రితం వరకు చంద్రబాబు ప్రభుత్వమే ఉంది కదా. అప్పుడు నిజంగానే రోడ్లు వేసి ఉంటే ఇంత త్వరగా పాడైపోయాయంటే అంత నాసిరకంగా వేశారా అని ప్రశ్నించారు. పోలవరం నిర్వాసితులకు సంబంధించి ఒకటికి రెండుసార్లు వార్తలు ఇచ్చారు. బాగానే ఉంది. కాని దానికి కేంద్రాన్ని ప్రశ్నిస్తారా? లేక ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేయిస్తారా? ఒక పత్రిక ఒక గాలి వార్త రాస్తుంది. చానళ్లు కొన్ని చర్చలు పెడతాయి. ఆ వెంటనే తెలుగుదేశం పార్టీ దానిని అందుకుంటుంది. దానిని మరో మీడియా కూడా అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రచారం చేస్తుంది. ఇలా గత రెండేళ్లుగా సాగుతున్న ఈ తంతు అనండి, కుట్రల పర్వం అనండి.. ఇంకెంతకాలం సాగుతాయో చూడాలి. కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
మున్ముందు ఈ గొంతు వినిపించేనా?
సొంత సంతానం మీద సవతి తల్లి ప్రేమ చూపడం అనే వ్యక్తీకరణ మీరు ఎప్పుడైనా విన్నారా? టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ విషయంలో కేంద్ర వైఖరికి ఇది సరిగ్గా సరిపోతుంది. కేంద్రం అనుసరిస్తున్న విధానాల వల్ల కొత్త భావాలు పురుడు పోసుకుంటున్నాయి. కానీ అది మాత్రం పాత కంపెనీల ఉసురు తీస్తోంది. ప్రైవేటు టెలికం కంపెనీలు పాపం అప్పులు చెల్లించలేవని వారి కోసం తెగ బాధపడుతున్న కేంద్రం, బీఎస్ఎన్ఎల్కు తానుగా చెల్లించాల్సిన బకాయిలు తీర్చే పుణ్యం మాత్రం కట్టుకోవడం లేదు. ఓ వైపు ప్రైవేటు కంపెనీలు 5జీ సేవలకు ఉరకలు ఎత్తుతుంటే, బీఎస్ఎన్ఎల్ విషయంలో మాత్రం 4జీ సేవలకు పచ్చజెండా ఊపడానికే కేంద్రానికి చేతులు రావడం లేదు. ఇది ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం. కొత్తగా టెలికం శాఖ బాధ్యతలు స్వీకరించిన కొత్త కేంద్ర మంత్రి గారు అయినా ఆ పాత ధోరణిని వదిలించుకుంటారేమో చూడాలి. టెలికం రంగంలోకి 5జీ సేవలు రాబోతున్న తరుణంలో, ఇదివరకే ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ రంగ సంస్థలైన బీఎస్ఎన్ఎల్(భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్), ఎంటీఎన్ఎల్ (మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్) మనుగడపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తమకు సాంకేతిక అభివృద్ధి కోసం పెట్టుబడులు లేవనీ, అప్పులు కూడా పుట్టడం లేదని చెప్పే ప్రైవేటు టెలికం కంపెనీలు ఓ వైపు; మరోవైపు డీఓటీ నుండి సుమారు 30,000 కోట్ల రూపాయల బకాయిలు బీఎస్ఎన్ఎల్కు రావాలన్న డిమాండ్లు, దాదాపుగా రెండేళ్లుగా ఎప్పుడు జీతాలు ఇస్తారో తెలియని స్థితిలో ఉన్న బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు; బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ సంస్థల భూముల అమ్మకం ద్వారా లక్ష కోట్లు ఆర్జించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆశల నేపథ్యంలో కొత్త టెలికం మంత్రి బాధ్యతలు చేప ట్టారు. తన ముందున్న అనేక సమస్యలకు ఆయన పరిష్కారాలు వెతకాల్సి ఉంది. ప్రైవేటుపై ప్రత్యేక ప్రేమ ప్రైవేటు టెలికం కంపెనీలు తాము ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు, ఇతర లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రమ్ చార్జీల లాంటివి చెల్లించలేక పోతున్నామనీ, కనుక తమకు ఈ పన్నులు చెల్లించడానికి మరింత గడువు కావాలనీ కోరుతున్నాయి. తగ్గుతున్న తమ ఆదాయాలు, నిర్వహణ ఖర్చుల్లో పెరుగుదల, సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధికి అయ్యే ఖర్చులు దీనికి కారణంగా అవి చెబుతున్నాయి. ఇటీవల వొడా ఫోన్ ఐడియా సంస్థ తమకు పెట్టుబడులు కూడా రావడం లేదనీ, రుణం తీసుకోవడానికి రిజర్వు బ్యాంకు అడ్డంకులు ఉన్నాయనీ వాపో యింది. మొత్తం టెలికం కంపెనీల అప్పు ఆరు లక్షల కోట్ల రూపా యలు కాగా, అందులో బీఎస్ఎన్ఎల్ అప్పు కేవలం దాదాపుగా రూ. 25,000 కోట్లు మాత్రమే ఉండటం గమనించాలి. కానీ గౌరవ సుప్రీంకోర్టు, టెలికం కంపెనీలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన దాదాపు లక్షన్నర కోట్ల రూపాయల బకాయిలను మూడునెలల్లో చెల్లించాలని తీర్పు ఇస్తే, కేంద్ర ప్రభుత్వమే ఒక పిటిషన్ వేసి టెలికం కంపెనీలు ఇబ్బందులు పడుతున్నాయని కనుక బకాయిలు చెల్లించడానికి 10 ఏళ్ల కాలపరిమితి ఇవ్వాలని వేడుకుంది. దీనికి కోర్టు అనుమతించింది. 2జీ సేవల కోసం కోర్టుకు ప్రైవేటు టెలికం కంపెనీలపై ఇంత ప్రేమ కురిపించిన కేంద్ర ప్రభుత్వం, బీఎస్ఎన్ఎల్ విషయంలో మాత్రం దీనికి పూర్తి భిన్నంగా వ్యవహరించింది. 1–10–2000 నాడు బీఎస్ఎన్ఎల్ ఏర్పాటు చేసిన సమయంలో దానికి మహారత్న స్టేటస్ ఇస్తామనీ, గ్రామీణ సర్వీసుల నిర్వహణ కోసం నిధులు కేటాయిస్తామనీ, గ్రామీణ టెలికం సర్వీ సుల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేస్తామనీ, సంస్థను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తామే ముందు ఉంటామనీ రాత పూర్వకంగా కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ అనంతర కాలంలో తాను ఇచ్చిన అన్ని హామీలను తుంగలో తొక్కింది. అన్ని టెలికం కంపెనీలకు సమాన హక్కులు ఉండాలన్న ప్రైవేటు టెలికం కంపెనీల ఒత్తిడికి తలవొగ్గి, గ్రామీణ ప్రాంతాల్లో టెలికం సర్వీసుల నిర్వహణకు ఇచ్చే ఏడీసీ చార్జీలను (యాక్సెస్ డెఫిసిట్ చార్జెస్), గ్రామీణ ప్రాంతాల్లో టెలికం సర్వీసుల అభివృద్ధికి ఇచ్చే యూఎస్ఓ (యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్) ఫండ్ నుండి ఇచ్చే నిధులను కూడా నిలిపివేసింది. అలాగే 2జీ మొబైల్ సర్వీసులు ప్రారంభించడానికి ప్రైవేటు టెలికం కంపెనీలకు 1994లో అనుమతి ఇవ్వగా, బీఎస్ ఎన్ఎల్ మాత్రం ఢిల్లీ కోర్టుకు వెళ్లి, కోర్టు తీర్పు ప్రకారం ప్రారం భించవలసి వచ్చింది. ఐదో తరంలో 4జీ కోసం పోరు 2006 నాటికి దేశంలో బీఎస్ఎన్ఎల్ రెండవ స్థానంలో ఉండగా, గత యూపీఏ ప్రభుత్వ హయాంలో సంస్థపై కుట్రలు ప్రారంభమ య్యాయి. 3జీ టెండరుకు అడ్డంకులు సృష్టించారు. చైనా పరికరాల వినియోగంపై నిషేధం పేరుతో రెండేళ్ల పాటు ఆటంకాలు కల్పించి పోటీలో వెనుకబడేలా చేశారు. ఇప్పుడు కూడా బీఎస్ఎన్ఎల్ 4జీ టెండర్ విషయంలో ఇదే పద్ధతిని ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తోంది. 5జీ సర్వీసుల కోసం ప్రైవేటు టెలికం కంపెనీలకు స్పెక్ట్రమ్ ట్రయల్ కోసం అనుమతులు ఇచ్చి, బీఎస్ఎన్ఎల్కు మాత్రం ఇవ్వలేదు. 23–10–2019న కేంద్ర క్యాబినెట్ సంస్థకు 4జీ స్పెక్ట్రమ్ ఇచ్చినా ఇప్పటిదాకా అమలులోకి రాలేదు. మరోవైపు రిలయన్స్ జియో ఇటీ వలి తమ వార్షిక సమావేశంలో 5జీ సౌకర్యం ఉన్న ఫోన్ కేవలం 2,000 రూపాయలకే అందుబాటులోకి తెస్తామనీ, తమ 5జీ నెట్వర్క్ విదేశాలకు కూడా ఎగుమతి చేసే స్థాయిలో ఉన్నామనీ ప్రక టించింది. కాంట్రాక్ట్ దిశగా... 31–1–2020 నాడు బీఎస్ఎన్ఎల్లో అమలైన వాలంటరీ రిటైర్మెంట్ పథకంలో 79,518 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేశారు. ఇప్పుడు సంస్థలో ఇంకా కేవలం 62,000 మంది ఉద్యోగులే ఉన్నారు. సంస్థలో దేశవ్యాప్తంగా కాంట్రాక్టు మేనేజ్మెంట్ విధానం అమలు చేయడం ద్వారా, అన్ని ఆఫీసులు, కస్టమర్ సర్వీసు సెంటర్లు, ఫాల్టు రిపేర్లు లాంటివి ప్రయివేటు వ్యక్తులకు ఇవ్వడం ద్వారా, రాబోయే రోజుల్లో వ్యూహాత్మక భాగస్వామ్యం దిశగా బీఎస్ఎన్ఎల్ను ప్రైవేటు పరం చేయాలని ప్రభుత్వ ప్రయత్నం. బకాయిలు చెల్లిస్తే నిల్వలే బీఎస్ఎన్ఎల్కు డీఓటీ (డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్) నుండి గ్రామీణ ఫోన్ల నిర్వహణ కోసం 13,789 కోట్ల రూపాయలు రావాలి. వైమాక్స్ స్పెక్ట్రమ్ సరెండర్ వల్ల రూ. 5,850 కోట్లు, సీడీఎంఏ (కోడ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్) స్పెక్ట్రమ్ సరెండర్ వల్ల రూ. 2,472 కోట్లు, భారత్ నెట్ పథకం అమలు కింద రూ.1,051 కోట్లు, ఉద్యో గుల లీవు రీయింబర్స్మెంట్ కింద రూ. 2,998 కోట్లు... ఇలా దాదాపు 29,540 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్కు బకాయి ఉంది. ప్రైవేటు టెలికం కంపెనీలు ప్రభు త్వానికి చెల్లించాల్సిన బకాయిలు కట్టడానికి ఇబ్బందులు పడుతు న్నాయని కోర్టులో చెప్పిన కేంద్ర ప్రభుత్వం, బీఎస్ఎన్ఎల్ నష్టాలకు మాత్రం ఉద్యోగులే కారణమనీ, వారు అధికంగా ఉన్నారనీ పేర్కొంది. తాను దాదాపు 30,000 కోట్ల రూపాయలు బకాయి ఉన్న సంగతి మాత్రం చెప్పలేదు. బీఎస్ఎన్ఎల్ అప్పు రూ. 25,000 కోట్లు. ప్రభుత్వం తాను ఇవ్వాల్సిన రూ. 30,000 కోట్లు చెల్లిస్తే సంస్థ నగదు నిల్వలోకి వస్తుంది. ప్రైవేటు టెలికం కంపెనీలు ఒకవైపు 5జీ సేవలు ఇవ్వడానికి సమాయత్తం అవుతున్న దశలో, బీఎస్ఎన్ఎల్ మాత్రం 4జీ సర్వీసుల కోసం పోరాటం చేయాల్సి రావడాన్ని గమనించాలి. 4జీ బస్సు మిస్ కానివ్వనని పార్లమెంటులో అప్పటి సమాచార మంత్రి ఇచ్చిన హామీ ఏమైందో అర్థం కాదు. రైల్వే, టెలికం, ఐటీ శాఖలు ఒకే మంత్రికి ఇవ్వడం ఇదే ప్రథమం. గతంలో వీటికి విడివిడిగా మంత్రులు ఉండేవారు. పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంలో జరిగే పనులను విజయవంతంగా గుజరాత్ రాష్ట్రంలో అమలు చేసిన కొత్త టెలికం మంత్రి, బీఎస్ఎన్ఎల్, రైల్వే శాఖల్లో ఏమేమి మార్పులు చెయ్యడానికి పూనుకుంటారో, ఇందులో ఉద్యోగుల భాగస్వామ్యం ఏమిటో రాబోయే రోజుల్లో చూడాలి. మురాల తారానాథ్ వ్యాసకర్త టెలికం రంగ విశ్లేషకులు మొబైల్ : 94405 24222 -
జనాభా నియంత్రణ సంజీవని కాదు
దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఉత్తరాదిన జనాభా రేటు పెరిగిపోతుండటంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జనాభా కట్టడికి చేపట్టిన తీవ్ర చర్యలు ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. యువజనాభా పెరుగుతుండటం లాభదాయకమని ప్రపంచమంతా భావిస్తున్న తరుణంలో, జనాభా కట్టడిపై చర్చ మొదలైంది. పెరుగుతున్న జనాభా భారత్ వంటి దేశాలకు నిజమైన సంపదగా ప్రపంచం భావించేది. కానీ దేశంలోని యువ, ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ప్రజానీకానికి అధికంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలను సృష్టించిన పక్షంలోనే జనాభాపరమైన ఈ సానుకూలతను సరిగా వినియోగించుకోగలం. జన సంఖ్య రేటును తగ్గించాలంటే కేరళ, తమిళనాడు లాగా విద్య... ప్రత్యేకించి స్త్రీ విద్య, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం చాలా ముఖ్యం. ప్రభుత్వ చర్యల ద్వారా జనాభా నియంత్రణ అనేది భారత్‌లో పెద్దగా పనిచేయదు. ప్రపంచ జనాభా దినోత్సవమైన జూలై 11న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి 2021–2030 జనాభా పాలసీ ముసాయిదా ప్రకటించారు. భారతదేశంలోనే అత్యధిక జనాభా కలిగిన యూపీలో ప్రస్తుతం జనాభా పునరుత్పాదక రేటు 2.7 శాతంగా ఉండగా దీన్ని 2026 నాటికి 2.1 శాతానికి, 2030 నాటికి 1.9 శాతానికి తగ్గించడడమే ఈ విధాన లక్ష్యం. 2020లో జాతీయ పునరుత్పాదక రేటు 2.2 శాతంగా ఉండింది. గత దశాబ్ది కాలంగా దేశవ్యాప్తంగా జనాభా పునరుత్పాదక రేటు క్రమంగా పడిపోతూ వస్తోంది. ఉత్తరాదిన హిందీ భాషా ప్రాంతంతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల పునరుత్పాదక రేటు బాగా తగ్గిపోతోంది. అయితే ఉత్తరప్రదేశ్‌లో జనాభా పునరుత్పాదక రేటును తగ్గించే లక్ష్యం ఎలా కొనసాగించాలనేది ఒక అంశం కాగా, ఆర్థికంగా లాభదాయకంగా ఉండే యువజనాభా విస్తరిస్తున్న తరుణంలో జనాభా పరమైన ఈ డివిడెండును తగ్గించడానికి ప్రయత్నించడాన్ని ఏ దృష్టితో చూడాలనేది కీలకం. ఆర్థిక ప్రగతి ఫలితాలను పెరుగుతున్న జనాభా కబళిస్తుందని చెబుతూ మాల్తూస్ ప్రతిపాదించిన జనాభా స్థానభ్రంశ సిద్ధాంతానికి మళ్లీ ప్రాచుర్యం లభిస్తున్న కాలమిది. భారత ప్రజాతంత్ర రిపబ్లిక్ తొలి రోజుల్లో, జనాభా నియంత్రణ జాతీయ విధానంలో ఒక ఆమోదనీయమైన భాగంగా ఉండేది. ’’మనమిద్దరం, మనకిద్దరు’’ అనే నినాదాన్ని మళ్లీ గుర్తు తెచ్చుకుందాం. అత్యవసర పరిస్థితి కాలంలో సంజయ్ గాంధీ సామూహికంగా కుటుంబ నియంత్రణపై కొనసాగించిన తప్పుడు ప్రచారం ఫలితంగా జనాభా నియంత్రణ అనేది రాజకీయంగా స్పృశించరానిదిగా మారిపోయింది. ఇప్పుడు ఈ కొత్త దృక్పథం ఏం చెబుతోందంటే, ఆదాయాల్లో పెరుగుదల, సంపదలో సాధారణ పెరుగుదల జరగాలంటే జనాభా వృద్ధిని కట్టడి చేయాలనే. నిజానికి, విద్యా వ్యాప్తికి ప్రత్యేకించి స్త్రీ విద్యా వ్యాప్తికి జనాభా కట్టడితో మరింత సన్నిహిత సంబంధం ఉంది. లేట్ మ్యారేజీలకు, లేబర్ మార్కెట్లో మహిళలు విస్తృతంగా ప్రవేశించడానికి కూడా జనాభా కట్టడితో సంబంధముంది. ప్రపంచంలోని ఇతర అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల అనుభవాల ద్వారానే కాకుండా, భారత్‌లోని కేరళ, తమిళనాడు రాష్ట్రాల అనుభవాల నుంచి కూడా ఈ విషయాన్ని నిర్ధారించవచ్చు. ఈ రెండు రాష్ట్రాలూ అధిక అక్షరాస్యతను, సాపేక్షికంగా మరింత ఎక్కువ మహిళా సాధికారతను ఆస్వాదిస్తున్నాయనేది తెలిసిందే. తర్వాత మనం 1990ల నుంచి ప్రారంభమైన ఆర్థిక సంస్కరణలు, ఉదారవాద దశకు వద్దాం. జనాభా తనకుతానుగా అతిపెద్ద లాభం అంటూ వర్ణించిన ఈ కాలంలోనే భారత్‌లో జనాభా పెరుగుతూ వచ్చింది, వీరిలో యువజనాభానే ఎక్కువ. వీరినే దేశానికి పెద్ద సంపదగా భావించేవారు. అదే సమయంలో ఉత్తర అమెరికా, యూరప్, జపాన్ వంటి పరిణతి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో వయోవృద్ధులు వేగంగా పెరుగుతున్నారని మరో వాదన ఉండేది. ఈ దేశాల్లోని నిరంతర ఆర్థిక వృద్ధికి చైనా, భారత్ లాంటి దేశాల్లో పెరుగుతున్న యువ జనాభా ఎక్కువగా అవసరమౌతుందని చెప్పేవారు. దేశంలోని యువ, ఉత్పాదకతా సామర్థ్యం కలిగిన జనాభాకు అధికంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలను సృష్టించిన పక్షంలోనే జనాభాపరమైన ఈ డివిడెండ్‌ను వినియోగించుకోగలం. దీనికోసం కార్మికులు ఎక్కువగా అవసరమయ్యే పరిశ్రమల ఏర్పాటుకు తగిన పెట్టుబడి కల్పన అవసరమవుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే యువజనాభాను తప్పకుండా ఉద్యోగాల్లో నియమించాలి. దీనికి అధిక అక్షరాస్యత, తగినన్ని నైపుణ్యాలు, వేగవంతమైన ముందంజకు చర్యలు చేపట్టడం తప్పనిసరి. ఈ మొత్తం ప్రక్రియ సజావుగా సాగాలంటే ప్రజానీకానికి ఆరోగ్యం, విద్య తప్పనిసరి. దేశంలోని పిల్లల్లో అధికశాతం పోషకాహార లేమి బారిన పడితే వీరి ఉత్పాదకతా సామర్థ్యం తగ్గిపోతుంది. మరో వాస్తవాన్ని కూడా విస్మరించరాదు. జనాభాపరంగా లాభదాయికతతో ఉండే దశను భారత్ సమీపించాలంటే ఇంకా చాలా సమయం పడుతుంది. అలాగే 2050 నాటికి కానీ దేశ జనాభా 160 కోట్లకు పెరిగి స్థిరీకరణ చెందదు. భారీ స్థాయిలో ఉపాధి, ఉద్యోగాలను కల్పించి అధిక వృద్ధిరేటు వైపు దేశం పయనించలేకపోతే, మనం స్వల్ప ఆదాయాల ఉచ్చులోపడి కొట్టుకుపోవడం తథ్యం. ఉత్తరప్రదేశ్ జనాభా కట్టడి.. సమస్యల పుట్ట జనాభా నియంత్రణకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన నూతన కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలెన్నో ఉన్నాయి. జనాభా అనే లాభదాయక పార్శా్వన్ని మనం కోల్పోతున్నామని ముసాయిదా నర్మగర్భంగా అంగీకరిస్తోంది. అలాగే జనాభా పెరుగుతున్నప్పటికీ ఉత్పత్తి చేసే వారిపై ఆధారపడే జనాభా నిష్పత్తి మాత్రమే పెరుగుతూ పోతే మొదటికే మోసం వస్తుంది. జనాభా అనే వనరు లాభదాయకంగా ఫలితాలు అందించడానికి దేశానికి మరో దశాబ్ది సమయం పడుతుందని ఇంతవరకు అందుబాటులో ఉన్న డేటా సూచిస్తోంది. దాంతోపాటు కార్మికులు ఎక్కువగా అవసరమయ్యే ఉత్పత్తి కార్యకలాపాలు పెంచడం, భారత్‌ని తక్కువ ఆర్థిక వ్యయంతో సాగే పునాదిమీద నిలబెట్టడం తప్పనిసరి అవసరం. మొదట్లో చైనాలో, ఇప్పుడు వియత్నాంలో సరిగ్గా ఇలాంటి పరిస్థితినే మనం చూశాం. ఇది త్వరలో బంగ్లాదేశ్ తలుపులు కూడా తట్టబోతోంది. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే మనం అమలు చేస్తున్న కొన్ని విధానాలు సరిగ్గా ఈ తర్కానికి భిన్నంగా సాగుతున్నాయి. ఉదాహరణకు ఉత్పత్తితో లింక్ చేసిన ప్రోత్సాహకాల (పీఎల్ఐ) పథకాన్ని అమలు చేయాలంటే, తక్కువ సంఖ్యలో ఉద్యోగులతో పనిచేయించుకుంటూ టెక్నాలజీని ఎక్కువగా వాడే పరిశ్రమల పంథాను మార్చడానికి ప్రజాధనాన్ని భారీగా ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. దీనికి బదులుగా దేశంలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించాలి. అవకాశముంటే అసంఘటిత రంగాన్ని కూడా ఈ పథకంలో భాగం చేయాలి. పెట్టిన ప్రతి మదుపుకూ అధికంగా ఉద్యోగాలను సృష్టించే శక్తి అసంఘటిత రంగంలోనే ఎక్కువ. నిరంకుశ అమలు దెబ్బకొడుతుంది చైనాలో కుటుంబానికి ఒకే బిడ్డ విధానం నిరంకుశంగా అమలు చేశారు. అందుకే జనాభా నియంత్రణను సాధించడంలో చైనా తగుమాత్రంగా విజయం పొందింది. అలాంటి అమానవీయమైన ప్రభుత్వపరమైన చర్య ప్రజాస్వామ్యంలో అమలు చేయడం అసాధ్యం. ఈ సందర్భంగా అత్యవసర పరిస్థితి నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. దేశానికి తక్కువ పునరుత్పాదక రేటు అవసరమనుకుంటే దానికి విద్య... ప్రత్యేకించి స్త్రీ విద్య, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం చాలా ముఖ్యం. అత్యధిక ఆర్థిక వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంటే అదే పునరుత్పాదకత రేటును తగ్గిస్తుంది. జనాభా వృద్ధిని తగ్గించడం ద్వారా లేక పరిమితం చేయడం ద్వారా ఆర్థిక వృద్ధిని పెంచడం కంటే ఇదే ఉత్తమమైనది. పైగా జనాభా నియంత్రణ అన్నిటికీ పరిష్కారం అనే ఆలోచన మరిన్ని ప్రశ్నలను రేకెత్తించకమానదు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన ముసాయిదాలోని కొన్ని ఇతర అంశాలు స్వాగతించదగినవే. తల్లులు, శిశువుల మరణాల రేటును తగ్గించడం, ఆయుర్దాయాన్ని పొడిగించే చర్యలను ప్రోత్సహించడం, మాతా శిశు సమగ్ర ఆరోగ్యాన్ని పెంపొందించడం వీటిలో కొన్ని. అర్థవంతమైన ప్రజారోగ్య విధానానికి ఇవన్నీ అత్యవసరమైనవే. అంతేతప్ప జనాభా నియంత్రణ విధానం లాంటిది మనకు అవసరం లేదు. ఉత్తమమైన ప్రజారోగ్య విధానం, ఉత్తమమైన విద్యా విధానం మనకు అవసరం. సమగ్ర ఆర్థిక వ్యూహం మరీ అవసరం. శ్యామ్ శరణ్ వ్యాసకర్త విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి (ట్రిబ్యూన్ ఇండియా సౌజన్యంతో) -
జనధనానికి జవాబుదారీ లేదా?
కరోనా వల్ల మధ్యతరగతి మరింత నిరుపేదదైంది. నిరుద్యోగం పెరిగిపోయింది. కానీ, కోటీశ్వరుల సంపద మాత్రం 35 శాతం పెరిగింది. కార్పొరేట్ లాభాలు పెరిగినంత మాత్రాన ధనికుల నుంచి అధికంగా పన్ను వసూళ్ళు ఉంటాయని అనలేం. కోటీశ్వరులకు భారీగా పన్ను రాయితీలు లభిస్తుంటే, మిగతా వర్గాలు మరిన్ని పన్నులు చెల్లిస్తున్నాయి. ఇప్పుడు వీధిలోని సామాన్యుడు సైతం పెట్రోలు, డీజిల్‌పై పన్నుల రూపంలో రూ. 5.70 లక్షల కోట్లు అధికంగా చెల్లించాల్సి వచ్చింది. బ్యాంకులు వ్యవసాయ ఋణాలు మాఫీ చేస్తే గగ్గోలు పెడుతుంటాం. కానీ, కోటీశ్వరులకు లాభం కలిగేలా లక్షల కోట్ల మేర మొండి బకాయిలు మాఫీ చేస్తుంటే మాట్లాడం! ప్రజాధనాన్ని ఇలా చట్టబద్ధంగా కొట్టేస్తుంటే, అనుమతించాల్సిందేనా? కరోనా మహమ్మారి దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. సామాన్యులు కష్టపడి పొదుపు చేసుకున్న సొమ్ములు కరిగిపోయాయి. మరోపక్క నిరు ద్యోగం పెరిగిపోయింది. కరోనా విస్ఫోటనం మొదలైన తొలి ఏడాదిలోనే అదనంగా 23 కోట్ల మంది నిశ్శబ్దంగా దారిద్య్ర రేఖ దిగు వకు జారిపోయారు. అజీమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం (ఎ.పి.యు.) లోని సుస్థిర ఉపాధి కేంద్రం (సీఎస్ఈ) ఈ లెక్కలు చెప్పింది. ఇదే కరోనా తొలి ఏడాదిలోనే దేశంలో మధ్యతరగతి వర్గంలో 3.2 కోట్ల మంది తగ్గిపోయారని మరో అధ్యయనంలో ప్యూ రీసెర్చ్ సెంటర్ తేల్చింది. కనీవినీ ఎరుగని ఈ మహమ్మారి మన మధ్యతరగతిపైన, నిరుపేదలపైన ఎంత గట్టి దెబ్బకొట్టిందో ఈ రెండు అధ్యయనాలూ కలతపరిచేలా గుర్తుచేస్తున్నాయి. ఇక, ఈ ఏడాది విరుచుకు పడ్డ కరోనా రెండో వేవ్ ఎంత తీవ్రంగా దెబ్బ తీసిందో ఇంకా తెలియరాలేదు. ఎవరిని ఏ మేరకు దెబ్బ తీసిందన్నది పక్కన పెడితే, సమాజంలోని అన్ని వర్గాల ప్రజాలపైనా ప్రభావమైతే పడిందన్నది నిర్వివాదాంశం. గృహస్థులు దాచుకున్న డబ్బులు అనూహ్యంగా తరిగిపోయాయి. నిరుద్యోగం ఆకాశానికి అంటింది. దాంతో, ప్రభుత్వం చివరకు అవసరార్థులైన 80 కోట్ల మందికి నెలకు 5 కిలోల ఉచిత రేషన్ ఇచ్చే పథకాన్ని వచ్చే నవంబర్ దాకా పొడిగించాల్సి వచ్చింది. కానీ, గత ఆర్థిక సంవత్స రంలోనే లిస్టెడ్ కంపెనీల కార్పొరేట్ నికర లాభాలు మాత్రం 57.6 శాతం పైకి ఎగబాకాయి. ఒక వైపు కరోనా దెబ్బతో ఆర్థిక వ్యవస్థ అస్తుబిస్తు అవుతున్న సమయంలోనే, మిగులు ధనాన్ని అందిపుచ్చు కున్న స్టాక్ మార్కెట్లు కూడా పైకి దూసుకుపోయాయి. భారతదేశం లోని కోటీశ్వరుల సంపద ఏకంగా 35 శాతం పెరిగింది. అంబానీ సంపద 8,400 కోట్ల డాలర్లకూ, అదానీ ఐశ్వర్యం 7,800 కోట్ల డాలర్లకూ ఎగబాకాయని బ్లూమ్‌బర్గ్ తేల్చింది. ఒక్క మాటలో– కరోనా వల్ల ధనికుల వద్ద సంపద మరింత పోగుపడితే, పేదసాదలు మరింత నిరుపేదలయ్యారు. ఇంకా లోతు ల్లోకి వెళితే– కార్పొరేట్ లాభాలు పెరిగినంత మాత్రాన ధనికుల నుంచి అధికంగా పన్ను వసూళ్ళు ఉంటాయని అనలేం. వాస్తవంలో ధనవంతులకు భారీ పన్ను రాయితీలు, సులభంగా డబ్బు లభిస్తే, దేశంలోని మిగతా వర్గాలు మరిన్ని పన్నులు చెల్లించాల్సి వస్తోంది. కార్పొరేట్ పన్ను వసూళ్ళు గణనీయంగా పడిపోయాయి. గత పదేళ్ళలో ఎన్నడూ లేనంత కనిష్ఠానికి చేరాయి. ఇలా పన్ను వసూలు తగ్గిపోవడం ప్రపంచ వ్యాప్త ధోరణికి తగ్గట్లే ఉంది. 2019 సెప్టెం బర్లో దేశ ఆర్థికశాఖ మంత్రి కార్పొరేట్ పన్ను ప్రాతిపదికను 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించారు. అలాగే, నూతన ఉత్పత్తి సంస్థలకేమో 25 శాతం నుంచి 15 శాతానికి తగ్గించారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు ఏటా రూ. 1.45 లక్షల కోట్ల మేర ఆదాయం పోతుంది. ఇదే సమయంలో కార్పొరేట్లతో నుంచి సగటు కుటుంబాలకు పన్ను ప్రాతిపదిక ఎలా మారిందో చూద్దాం. 2020 –21లో కార్పొరేట్ పన్నులు, వ్యక్తిగత ఆదాయపు పన్నులతో కూడిన ప్రత్యక్ష పన్ను వసూళ్ళు రూ. 9.45 లక్షల కోట్లు. కానీ, అదే సమయంలో పరోక్ష పన్ను వసూళ్ళు దాన్ని దాటేశాయి. ఏకంగా రూ. 11.37 లక్షల కోట్లకు గరిష్ఠానికి చేరాయి. ఇది కాక, వీధిలోని సామాన్యుడు పెట్రోలు, డీజిలుపై పన్నుల (ఎక్సైజ్, వ్యాట్) రూపంలో రూ. 5.70 లక్షల కోట్లు అధికంగా చెల్లించాల్సి వచ్చింది. అందులో దాదాపు 60 శాతం మేర ఇంధనపు పన్ను కేవలం ద్విచక్ర వాహనదారుల నుంచే వస్తోంది. ఇది కాక, రియల్ ఎస్టేట్ రిజిస్ట్రీ, మద్యంపై ఎక్సైజ్ సుంకంతో పాటు వినియోగదారులు చెల్లించే ఎలక్ట్రిసిటీ డ్యూటీని కలుపుకొని చూడండి. అవన్నీ చూస్తే, చివరకు సామాన్యుడు చెల్లిస్తున్న పరోక్ష పన్నుల వాటా చాలా ఎక్కువ. అంటే, కనీసం ఇప్పుడిక అభివృద్ధికి కేవలం తమ వల్లనే వనరులు సమకూరుతున్నాయని వ్యక్తిగత పన్ను చెల్లింపు దారులు అనలేరు. పన్ను చెల్లింపుదారులు కానివారిది కూడా ఆదాయ సృష్టిలో గణనీయంగా అధిక వాటాయే. చివరకు ప్లాస్టిక్ చెప్పులు వేసుకొనే సాధారణ కూలీ కూడా జి.ఎస్.టి. చెల్లిస్తున్నాడని మర్చి పోకండి. దీన్నిబట్టి ఒక విషయం స్పష్టమవుతోంది. దేశంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకమైన పన్ను కడుతూనే ఉన్నారన్న మాట. గమనిస్తే – దేశం స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో కార్పొరేట్ లాభం వాటా గత పదేళ్ళలో ఎన్నడూ లేనంత గరిష్ఠమైన 2.63 శాతా నికి చేరింది. కానీ, అదే సమయంలో 2020–21లో ఏకంగా రూ. 1.53 లక్షల కోట్ల మేర కార్పొరేట్ మొండి బకాయిలను భారతీయ బ్యాంకులు మాఫీ చేశాయి. బ్యాంకులకున్న ఈ నిరర్థక ఆస్తులు (ఎన్.పి.ఎలు) ఇంకా పెరుగుతాయని భారతీయ రిజర్వ్ బ్యాంక్ అంచనా. ఇది ఇలా ఉండగా, 2017–18 నుంచి గత నాలుగేళ్ళలో బ్యాంకులు మాఫీ చేసిన మొత్తాలు భారీగా రూ. 6.96 లక్షల కోట్ల మేర ఉన్నాయి. నిజానికి, వ్యవసాయ ఋణాలను మాఫీ చేసినప్పు డల్లా గగ్గోలు పెట్టేస్తుంటారు కానీ, బ్యాంకులు క్రమం తప్పకుండా చేసే ఈ మొండి బకాయిల మాఫీ మాత్రం ఎవరి కంటికీ కనపడదు. ఇది చాలదన్నట్టు, అనేక ఆర్థిక మోసాలలో రూ. 5 లక్షల కోట్ల బ్యాంకు సొమ్ము ఇరుక్కుపోయింది. సమాచార హక్కు చట్టం కింద వచ్చిన జవాబు ఆధారంగా ఇటీవలే ఓ వార్తాపత్రిక తన కథనంలో అదెలా జరిగిందో వెల్లడించింది. ఆ మొత్తంలో 76 శాతం వాటా అగ్రశ్రేణిలో నిలిచిన 50 ఋణ ఖాతాల లావాదేవీలదే! ఇలాంటి దీర్ఘకాలిక ఎగవేతదారులను శిక్షించడం కోసం దివాలా నియమావళి (ఐ.బి.సి)ని తీసుకొచ్చారు. కానీ, దాని వల్ల ఆశించినది జరగడం లేదు. ఇటీవల రెండు దివాలా వ్యవహారాల్లో బ్యాంకులు (లేదా ఋణదాతలు) తామిచ్చిన అప్పులో ఏకంగా 93 నుంచి 96 శాతం మేర మాఫీ చేయాల్సి వచ్చింది. దానిపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది. ఒక కేసులో అప్పులలో కూరుకుపోయిన వీడియోకాన్ గ్రూపులోని 13 సంస్థలపై వేదాంత గ్రూపునకు చెందిన ట్విన్ స్టార్ టెక్నాలజీస్ దాదాపుగా ఏమీ చెల్లించకుండానే నియంత్రణ సాధించింది. ఆ కార్యాచరణకు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్.సి.ఎల్.టి.) ఆమోదం తెలిపింది. 64 వేల కోట్లకు పైగా మొత్తానికి గాను ఏక మొత్తపు చెల్లింపు పరిష్కారం కింద కేవలం 2 వేల కోట్ల పైన మాత్రమే వేదాంత గ్రూపు చెల్లించింది. మొత్తం సొమ్ములో అది కేవలం 4.15 శాతం. మరోమాటలో చెప్పాలంటే, బ్యాంకులతో సహా ఋణదాతలు మిగతా 95.85 శాతం బకాయిని మాఫీ చేయడానికి ఒప్పుకున్నారన్న మాట. ఇదంతా చూసిన ౖఫైనాన్షియల్ జర్నలిస్టు – రచయిత్రి సుచేలా దలాల్ కడుపు మండి, ‘సామాన్యులు ఒక్కసారి సైకిల్ కోసం అప్పు తీసుకొన్నా, బ్యాంకులు ఎలా ప్రవర్తిస్తాయో తెలుసు’ అని వ్యాఖ్యా నించారు. ఇలా అనేక కేసుల్లో బిడ్డర్లు కారుచౌక ఒప్పందాలతో దర్జాగా ముందుకు సాగిపోతున్నారు. బ్యాంకులు, ఇతర ఋణదాత సంస్థలే తరచూ 80– 95 శాతం మేర బకాయిని మాఫీ చేసి, నష్టపోతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే, చట్టబద్ధంగా వాళ్ళు ప్రజాధనాన్ని దోచే స్తున్నారన్న మాట! ఎందుకంటే, బ్యాంకుల్లో ఉండేది ప్రజాధనం. బ్యాంకులు ఇలా ఆర్థిక మోసాలలో ఋణమాఫీ చేశాయంటే ప్రజా ధనం నష్టపోయినట్టే్ట! బహుశా, దీనివల్లే వ్యాపారవేత్త హర్ష్ గోయెం కాకు చీకాకు వచ్చినట్టుంది. ప్రధానమంత్రి కార్యాలయాన్ని ట్యాగ్ చేస్తూ, ‘జనం కష్టపడి సంపాదించిన డబ్బును ఇలా కొందరు చట్ట బద్ధంగా దొంగిలించడం అనుమతించకూడదు’ అంటూ ఆయన ఏకంగా ఓ ట్వీట్ చేశారు. అవును... జరుగుతున్న కథ చూసి, విషయం గ్రహిస్తే– ఎవరైనా ఆ మాటే అంటారు! వ్యాసకర్త ఆహార, వ్యవసాయరంగ నిపుణులు దేవిందర్ శర్మ ఈ–మెయిల్ : hunger55@gmail.com -
హిందీభాషకు దక్షిణ వారధి పీవీ
బహుముఖి అయిన మాజీ ప్రధానమంత్రి పి.వి.నరసింహారావును ఎలా అంచనాకట్టాలో తెలియడానికి జనం ఆయనకు ఇచ్చిన పేర్లో, బిరుదులో పరిశీలిస్తే చాలు. అపర చాణక్యుడు, మౌనముని, సంస్కరణల పితామహుడు, ఇంకా సాహితీవేత్త, బహుభాషావేత్త. అయితే ఆయన్ని పరిశీలించడానికి ఇంకోకోణం ఉంది. ఒక దక్షిణాదివాడు ఉత్తరాది భాష అయిన హిందీలో జెండా ఎగరేయడం. అక్కడి గొప్ప రచయితలు మెచ్చేంత అపర పండితుడిగా వెలగడం. ‘వేయిపడగలు’ లాంటి తెలుగు మహారచనను హిందీలోకి అనువదించడంతోపాటు, సాక్షాత్తూ దేశ రాజ్యాంగాన్నే ఆయన హిందీలోకి తర్జుమా చేశారు. ఆయన శతజయంతి ఉత్సవాలు నేటితో ముగియనున్న సందర్భంగా తెలుగువాడైన పీవీ ఠీవీని మరోసారి గుర్తుచేసుకుందాం.పీవీ నరసింహారావు పేరు తలవగానే వెంటనే స్ఫురించేది ఆయన బహుభాషా అధ్యయనశీలత. భాషాపిపాస, అయనకు బాల్యంతోనే అంకురించింది. హైస్కూలు చదువు పూర్తయ్యేసరికి తెలుగుతో పాటు పర్షియన్, ఉర్దూ, ఇంగ్లిష్ భాషలలో మంచిపట్టు సాధించారు. ఇంటర్ మొదలు ‘లా’ వరకు మహారాష్ట్రలో చదవడం వలన మరాఠీ భాషలో ప్రావీణ్యం సంపాదించారు. నాటి నిజాం రాష్ట్రంలోని దక్కనీ ఉర్దూకు హిందీ భాషతో చాలా సారూప్యత ఉండటం మూలాన, పీవీకి హిందీ పట్ల ఆసక్తి కలిగింది. స్వాతంత్య్రోద్యమ కాలంలో జాతీయ నాయకులైన గాంధీజీ, నేతాజీ, నెహ్రూ లాంటివాళ్లు హిందీలో చేసిన ప్రసంగాలు, సాంస్కృతిక కేంద్రంగా విరాజిల్లిన నాగపూర్‌లో తరచూ జరిగే హిందీకవి సమ్మేళనాలు మరింత ఆకర్షణ కలిగించాయి. అలా 1946 సంవత్సరంలో అలహాబాద్ యూనివర్సిటీ నుండి హిందీ ‘సాహిత్యరత్న’ (ఎంఏ) పరీక్ష ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. హిందీలో పరిశోధన చేయాలని అభిలషించి, సుప్రసిద్ధ కవ యిత్రి మహాదేవి వర్మ రచనలను లోతుగా అధ్యయనం చేశారు. నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొనకుండా వుంటే, హిందీలో డాక్ట రేటు పట్టా సాధించి అలహాబాద్‌లో యూనివర్సిటీ ఆచార్యుడై వుండే వారు. జీవితం ఎంతో విచిత్రమైనది. అనుకొనేవి జరగవు. ఆశించి నవి లభించవు. పీవీ విషయంలోనూ జరిగిందదే! ‘ర్యాంగ్లర్’ కావాలనుకున్నాడు. ఆస్ట్రానమీ అందలేదు. హిందీ ఆచా ర్యుడు కాలేదు. వకీలుగా కూడా స్థిరపడలేదు. ఆయన ఐచ్ఛికాంశం సైన్సు. స్మరించింది సాహిత్యాన్ని. కానీ ఆయనను వరించింది పాలిటిక్స్. స్వామి రామానంద తీర్థ ఆదేశాన్ని శిరసావహించిన పీవీ 1948లో హైదరాబాద్ స్టేటు భారత యూనియన్‌లో విలీనమయ్యాక రాజకీయాలకు దూరంగా, సమాజానికి దగ్గరగా ఉండాలని భావించారు. జర్నలిజంపై మనసు పడి, కాకతీయ వార్తాపత్రికను మూడేళ్ల పాటు నిర్వహించి, తొలి సార్వత్రిక ఎన్నికల కోసం పార్టీ నుంచి పిలుపు రావడంతో, పత్రికను మూసివేసి ప్రజాసేవపై దృష్టి పెట్టారు. 1952 ఎన్నికలలో ఓడిపోయాక, తిరిగి హిందీ భాషా, సాహిత్య సేవపై దృష్టిపెట్టి, తుది శ్వాస వరకు కొనసాగించారు. భారత రాజ్యాంగాన్ని ‘భారతీయ సంవిధాన్’ శీర్షికన ఆంగ్లంలోంచి హిందీలోకి అనువదించి తన హిందీ రచనకు శ్రీకారం చుట్టారు. విశ్వనాథ సత్యనారాయణ అనుమతితో ‘వేయిపడగలు’ నవలను, ‘సహస్రఫణ్’ పేరిట అనువాదానికి పూనుకొన్నది 1955–56 మధ్యకాలంలోనే! పద్నాలుగు సంవత్సరాల కృషి ఫలంగా వెలువ డిన ‘సహస్రఫణ్’ యావత్ భారతంలోని హిందీ సాహిత్య అభిమా నులను అలరించడమే కాదు, పీవీకి ‘కేంద్ర హిందీ నిర్దేశాలయ్’ వారి పురస్కారాన్నీ ప్రసాదించింది. పీవీ తొలుత విశ్వనాథ ‘ఏకవీర’ను కొంతభాగం అనువ దించారు. తదుపరి ‘చెలియలి కట్ట’ను పూర్తిగా తర్జుమా చేశారు. కానీ ప్రేమ, శృంగారంతో కూడిన రచనలుగా భావించి ప్రచురణకు అంగీకరించలేదనీ, సంస్కృతీ సాంప్రదాయాలకు, సామాజిక విలువ లకు అద్దం పట్టిన ‘వేయి పడగలు’ నవలనే ఇష్టపడి హిందీసేత చేశారని హిందీ సాహితీవేత్త ఆచార్య భీమ్సేన్ నిర్మల్ అన్నారు. హిందీ సాహితీ ప్రక్రియలలో పీవీ కవిత్వాన్నే ఎక్కువగా ప్రేమించారు. ఆధునిక తెలుగు కవిత్వంలో భావకవిత్వాన్ని, హిందీలోని ఛాయావాద కవిత్వాన్ని తులనాత్మకంగా పరిశీలించారు. మహాదేవి వర్మ కవిత్వంలోని ఛాయావాదం, దుఃఖవాదం, రహస్యవాదం మొదలైన విభిన్న పార్శా్వలను ఆవిష్కరిస్తూ ఆమె షష్టిపూర్తి అభినందన సంచిక కొరకు రాసిన ఇరవై ఐదు పేజీల సుదీర్ఘ వ్యాసం, పీవీ సిద్ధాంత వ్యాసానికి సంగ్రహపత్రంగా భావించవచ్చు. వివిధ సందర్భాలలో పీవీ చేసిన హిందీ ప్రసంగాలు, వివిధ సంచికలు, పత్రికలకు రాసిన వ్యాసాలు కూడా ఎన్నదగినవి. ఈ ప్రసంగ వ్యాసాలు, ఆయన హిందీ భాషా సాహిత్య దృక్పథాన్ని మాత్రమే కాదు, భారతీయ భాషలలో హిందీ స్థానాన్ని, భారతీయ సంస్కృతీ విలువల పరిరక్షణలో హిందీ సాహితీవేత్తల కవుల కృషిని విస్పష్టం చేశాయి. భారతీయ భాషల ఆదాన ప్రదానాలకు హిందీ వారధి వంటిదనీ, స్వాతంత్య్రోద్యమ కాలంలోనే హిందీ సాంస్కృతిక సమైక్యతకు నాంది పలికిందనీ సోదాహరణంగా వివరించారు. హిందీ కథా రచయిత ప్రేమ్‌చంద్ శతజయంతి సందర్భంగా ‘గగనాంచల్’ పత్రికకు రాసిన వ్యాసంలో ప్రేమ్‌చంద్ సాహిత్యం సమకాలీనతను సార్వకాలీనతను ప్రతిబింబించాయని తెలిపారు. పంజాబీ భాషలో కొత్తగా కవిత్వం రాసే వారెవరైనా సరే, వారు అమృతాప్రీతమ్ కవిత్వాన్ని ప్రేమించకుండా రాస్తే వాళ్లు కవులే కాలేరని వ్యాఖ్యానించారు. 1983లో తృతీయ ప్రపంచ హిందీ మహాసభల సందర్భంగా హిందీని అంతర్జాతీయ భాషగా పరివ్యాప్తి చేయడానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పీవీకి హిందీ భాషా సాహిత్యాల పైనే కాదు, హిందీ సాహిత్య చరిత్ర పట్ల ఎంతో సాధికారత ఉన్నది. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ హిందీ సాహిత్య చరిత్ర గ్రంథానికి రాసిన 35 పేజీల ముందుమాట ఇందుకు నిదర్శనం. చివుకుల పురుషోత్తం ‘ఏది పాపం’? తెలుగు నవలను అలహాబాద్‌కు చెందిన సూర్యనాథ్ ఉపాధ్యాయ ‘క్యాహై పాప్’ శీర్షికను హిందీలోకి అనువదించారు. దీనికి పీవీ రాసిన పీఠిక కూడా విలువైనదే. భారత ప్రధానమంత్రిగా హిందీ భాషలో ప్రమాణస్వీకారం చేసి ఆ భాష పట్ల తన ప్రేమను వెల్లడించారు. ఇందిరాగాంధీ దక్షిణ భారత ప్రచార సభకు అధ్యక్షులుగా ఉన్నప్పటికీ, పీవీని ఉపాధ్యక్షులుగా నియమించి కార్యక్రమాలు సజావుగా సాగేటట్లు చేశారు. ఈ హిందీ ప్రచార సభకు విశ్వవిద్యాలయ స్థాయి ఏర్పడినాక, పీవీయే వైస్ ఛాన్స్‌లర్‌గా వ్యవహారించారు. ఆయన వీసీగా ఉన్నప్పుడే సాహిత్య ప్రధానమైన ఎంఏను పాఠ్యక్రమాన్ని తొలిసారిగా భాషా ప్రధాన పాఠ్యక్రమంగా అమలు చేశారని నాటి రిజిస్ట్రార్ వేమూరి ఆంజనేయ శర్మ ఒక చోట వివరించారు. కేవలం ఎంఏ సాహిత్యం చదివితే వారు టీచర్లుగా పనిచేయడానికే పనికొస్తారు. ఫంక్షనల్ హిందీగా సిలబస్ తయారు చేసి శిక్షణ ఇస్తే వివిధ ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణకు కూడా ఉపకరిస్తారన్నది ఆయన సమున్నత భావన. ఈ ఆలోచనను అనంతరం అన్ని యూనివర్సిటీలు అమలు చేశాయి. హిందీ మాతృభాష కాని హిందీ రచయితలను ఎంతో ప్రోత్స హించారు. అఖిల భారత హిందీ సంస్థాన్ అధ్యక్షుడిగా ఉంటూ ‘సమవేత్ స్వర్’ హిందీ ద్వైమాసిక పత్రిక ప్రచురణను ప్రోత్సహిం చారు. ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో (1991– 96) దక్షిణ హిందీ ప్రచార సభకు గౌరవాధ్యక్షులుగా వ్యవహరించి, హిందీయేతర ప్రాంతాలలో హిందీభాష కోసం జరుగుతున్న కృషిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రధానిగా ఉన్నప్పుడే వాజ్‌పేయి కవితా సంకలనం ‘మేరీ ఇక్యావన్ కవితాయే’ను ఆవిష్కరించి, కూలంకషంగా విశ్లేషించారు. భారతీయ భాషల ద్వారా కంప్యూటర్ నడపటం సాధ్యం కాదని కంప్యూటర్ విశేషజ్ఞులే తేల్చిన తరుణాన పీవీ పూనుకుని హిందీలో సిద్ధార్థ వర్డ్ ప్రాసెసర్‌ను తయారు చేయించారు. అనంతరం లిపి వర్డ్ ప్రాసెసర్‌తో హిందీలో డి.సి.ఎ. ప్రారంభించారు. తరువాత జిస్టు కార్డు మార్కెట్లోకి వచ్చాక, ఎం.సి.ఎ. కూడా ప్రారంభించారు. భారతీయ భాషలలో కంప్యూటర్ నడుస్తుందని నిరూపించిన సాఫ్ట్వేర్ మేధావి పీవీ! డా‘‘ వి.వి.రామారావు వ్యాసకర్త ప్రముఖ రచయిత -
విద్యా విప్లవానికి నాందీవాచకం
పాఠశాలల్లోని పిల్లలందరికీ నాణ్యమైన, సమానమైన మీడియం విద్యను అందించే విషయంలో ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా నమూనా ఒక్కటే ఏకైక మార్గం. సంపన్నులు మాత్రమే చదవగల ప్రైవేట్ రంగ విద్యను రద్దు చేసే అవకాశం లేనందున అన్ని పాఠశాలల్ని ఒకే స్థాయిలో నిర్వహిం చడం ఒక్కటే సరైన పద్ధతి. దేశంలోని రైతులను, ఇతర శ్రామిక ప్రజానీకాన్ని ప్రాంతీయ, జాతీయ మనోభావాల ఉచ్చులోకి దింపి వారిని ఇంగ్లిష్ భాషలో విద్యకు పూర్తిగా దూరం చేసిన మనోభావాల లింకును వైఎస్ జగన్ తుంచేశారు. ప్రాథమిక విద్యపై, కళాశాల విద్యపై ఇంతగా దృష్టి పెట్టిన మరో సీఎంని మనం చూడలేం. ఒక్క మాటలో చెప్పాలంటే ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో అసాధారణమైన ప్రయోగం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగంలో అసాధారణమైన ప్రయోగం చేస్తోంది. 2019 సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టింది. దీనికి చట్టపరమైన చిక్కులు ఎదురయ్యాయి. అయితే ఏపీ ప్రభుత్వం అన్ని అండర్ గ్రాడ్యుయేట్ కాలేజీల్లో ఇంగ్లిష్‌ని విద్యా మాధ్యమంగా చేసింది. వీటిని చేపట్టడానికి రాష్ట్ర యువ, ఆశావహ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలు యుద్ధాలు చేయవలసి వచ్చింది. తమ పిల్లలను మాత్రం అతి ఖరీదైన ప్రైవేట్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో చదివి స్తున్న ఏపీలోని కపట మేధావి–రాజకీయ వర్గం జగన్ ప్రభుత్వ చర్యను వ్యతిరేకిస్తూ దాన్ని మాతృభాషా సమస్యగా మార్చేసింది. తల్లి భాష అంటే తల్లి పాలు అంటూ వీరు గొంతు చించుకున్నారు. తమ గావుకేకలు వైఎస్ జగన్‌ని కదిలించకపోవడంతో తర్వాత వీరు న్యాయస్థానం ముందు సాగిలపడ్డారు. రాష్ట్ర కుహనా మేధావివర్గాల, ప్రతిపక్షాల ఈ కపటత్వాన్ని ఎండగడుతూ, వీరి వీధి పోరాటాలతో, మీడియాలో యుద్ధాలతో తలపడటానికి ఏపీ ముఖ్యమంత్రి తమ యువ కేడర్ని, పార్టీ నాయకులను మోహరించారు. తెలుగుదేశం పార్టీ, బీజేపీతోపాటు వామపక్షాలు కూడా జగన్ చర్యను వ్యతిరేకిస్తూ ఆయన తెలుగు వ్యతిరేకి అని ఆరోపించారు. అయితే ఇంగ్లిష్ మీడియంలో విద్య అనేది తన నవరత్నాలు పథకంలో భాగం కాబట్టి, ఎన్నికల మేనిఫెస్టోలో ఈమేరకు వాగ్దానం చేశారు కాబట్టి వైఎస్ జగన్ తన మాటకు చివరివరకు కట్టుబడ్డారు. అదే సమయంలో ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో తెలుగును ఒక పాఠ్యాంశంగా తప్పనిసరిగా బోధించాలని జగన్ ఆదేశిం చారు. అన్ని పాఠ్యపుస్తకాలను ద్విభాషా పద్ధతిలో ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ముద్రించి ఇవ్వాలని కూడా ఆదేశించారు. అంటే అన్ని సబ్జెక్టుల్లోని పాఠాలు ఒక వైపు పేజీలో ఇంగ్లిష్‌లో, దాని పక్కపేజీలో తెలుగులో ఉండేలా జాగ్రత్త తీసుకున్నారు. దీంతో విమర్శకులకు మౌనం పాటించడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది. ఎందుకంటే ఇప్పుడు వీరి పిల్లలు ప్రైవేట్ స్కూళ్లలో కూడా రెండు భాషల్లో విద్య నేర్చుకోవచ్చు. ఇంతవరకు ఏపీలోని ప్రైవేట్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలు తెలుగులో విద్య నేర్చుకోవడాన్ని అనుమతించలేదు. విద్యలో జగన్ సమూల మార్పులు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యాబోధనకు గ్రామీణ, రైతు, మధ్యతరగతి వర్గాల తల్లిదండ్రుల మద్దతును వైఎస్ జగన్ పొందారు. తాము ఎంచుకున్న మీడియంలో విద్య పొందాలనుకునే పిల్లల హక్కును ఏ కోర్టూ వ్యతిరేకించదు. ఈ విషయాన్ని భారత సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో ఎత్తిపట్టింది. ఇంగ్లిష్ మీడియంలో విద్యా హక్కు ప్రైవేట్ రంగానికి మాత్రమే పరిమితమైంది కాదు. పిల్లలంటే పిల్లలే. ప్రైవేట్ లేదా ప్రభుత్వ.. ఇలా వారు ఏ పాఠశాలలో చదివినా వారి హక్కు వారికే చెందుతుంది. వైఎస్ జగన్ తన ఇంగ్లిష్ మీడియం ఎజెండాను అమ్మ ఒడి పథకంతో మేళవించారు. పిల్లలను బడికి పంపే తల్లికి ఏటా విద్యా ఖర్చుల కోసం రూ. 15,000ల నగదును అందించే పథకమిది. దీంతోపాటు కాలేజీలో చదువుకునేవారి ఫీజు మొత్తం రీయింబర్స్ చేస్తున్నారు. దీనికి తోడుగా నాడు–నేడు పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల మౌలిక వసతులను సమూలంగా మార్చడానికి భారీ మొత్తంలో నిధులు కేటాయిస్తున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అమలు చేస్తున్న పథకం కంటే నాడు–నేడు మరింత నిర్దిష్టమైనది, గుణాత్మకమైనది కావడం విశేషం. పైగా ఆంధ్రప్రదేశ్ అతి పెద్ద రాష్ట్రం కూడా. ఏపీ ముఖ్యమంత్రి ఈ విద్యాసంవత్సరం నుంచి అంగన్ వాడీలను కూడా ప్రాథమిక పాఠశాలలతో మిళితం చేశారు. పైగా స్కూల్ సిబ్బందిని, వసతి సౌకర్యాలను పెంచారు. ప్రతి రోజు స్థిరమైన మెనూతో ప్రభుత్వం నాణ్యమైన మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా అమలు చేస్తోంది. అనేక రాష్ట్రాల్లో కంటే ఏపీలో ఈ పథకం కింద పిల్ల లకు మంచి ఆహారం లభిస్తూండటం గమనార్హం. పిల్లలున్న ప్రతి ఇంటి నుంచి ఒక కిలోమీటర్ పరిధిలో ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేయనున్నట్లు కొద్ది రోజుల క్రితమే వైఎస్ జగన్ ప్రకటించారు. అలాగే మూడు కిలోమీటర్ల పరిధిలో ఒక హైస్కూలును, ఏడు కిలోమీటర్ల పరిధిలో రెండు జూనియర్ కళాశాలలను ఏర్పర్చనున్నారు. ఈ అన్ని విద్యా సంస్థల్లో ఒక సబ్జెక్టులో తెలుగును తప్పనిసరి చేస్తూ ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టారు. పైగా ఇంగ్లిష్, తెలుగు రెండింటిలో టీచర్లు బోధించేలా తీర్చిదిద్దడానికి భారీ స్థాయిలో ఉపాధ్యాయ శిక్షణా పథకాన్ని కూడా ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. విద్య అనేది ప్రతి పాప, బాబుకి చెందిన గౌరవనీయమైన ఆస్తిగా పాలకులు భావించనంతవరకు ఏ పాలకుడైనా విద్యపై ఇంత శ్రద్ధ పెట్టలేరు. వైఎస్ జగన్ 48 ఏళ్ల యువకుడు. సుదీర్ఘ రాజకీయ జీవితం ఉంది. నిజానికి దేశంలో అధికారంలో ఉంటున్న ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రుల్లో జగన్ అత్యంత యువ ముఖ్యమంత్రి కావడం విశేషం. భవిష్యత్తులోనూ ఒక రాజకీయనేతగా తన ఈ విద్యా ఎజెం డాను జగన్ కొనసాగించినట్లయితే దేశంలోని ప్రభుత్వ రంగ విద్యావిధానంలో గణనీయ ముద్రను వేయడం ఖాయం. సమానత్వానికి నమూనా ఎవరి జీవితంలోనైనా విద్య అత్యంత విలువైన సంపద అనేది తెలిసిన విషయమే. ఇది బంగారం కంటే ఉత్తమమైనది. దళితులకు, ఆదివాసీలకు, శూద్రులకు ఇంగ్లిష్ విద్య అనేది తమ ట్రావెల్ బ్యాగ్‌లో పెట్టుకుని మోసే బంగారు గనిలాంటిది. పదే పదే ఇది రుజువవుతోంది కూడా. అయితే స్వాతంత్య్రానంతర భారత పాలకులు ప్రభుత్వ రంగంలో ప్రాంతీయ భాష, ప్రైవేట్ రంగంలో ఇంగ్లిష్ భాష అనే రెండు వేర్వేరు రంగాలను నెలకొల్పడం ద్వారా దేశ ప్రజలకు సమానమైన మీడియం విద్యను తిరస్కరించారు. దేశంలోని ఆహార ఉత్పత్తిదారులను, ఇతర శ్రామిక ప్రజానీకాన్ని ప్రాంతీయ, జాతీయ మనోభావాల ఉచ్చులోకి దింపి వారిని ఇంగ్లిష్ భాషలో విద్యకు పూర్తిగా దూరం చేశారు. భాషా ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రాలు ఈ సెంటిమెంటును తోసిపుచ్చి, ఇంగ్లిష్ కులీన విద్యావంతుల ప్రయోజనాల కోసం పనిచేస్తూ వచ్చాయి. ఇలాంటి సెంటిమెంటల్ లింకును జగన్మోహన్ రెడ్డి తెంచివేసారు. తన నూతన విద్యా ప్రాజెక్టులను క్రమం తప్పకుండా సమీక్షిస్తూ వస్తున్నారు. విద్యపై ఇంతగా దృష్టి పెట్టిన మరో ముఖ్యమంత్రిని మనం చూడలేం. విద్యకోసం తన ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపులు కూడా చాలావరకు మెరుగ్గా ఉన్నాయి. తన విద్యాపథకాల కోసం ఇతర పథకాలను కూడా ఆయన ఉపయోగించుకుంటున్నట్లు కనిపిస్తోంది. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యావిధానం మెరుగైన విద్యా నమూనాపై కృషి చేసినప్పటికీ, కేంద్ర ప్రభుత్వ భాషా విధానం.. ప్రైవేట్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించలేని గ్రామీణ, పేద ప్రజానీకానికి అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే స్థాయి విద్యను అందించడంలో తోడ్పడలేదు. పైగా బీజేపీ హయాంలో విద్యారంగంలో ఒక సరికొత్త వైరుధ్యం ఆవిర్భవించింది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాంతీయ భాషలో పాఠశాల విద్య విషయంలో మొండిగా వ్యవహరిస్తూనే, మరోవైపున ఇంగ్లిష్ మీడియం కొనసాగించడానికి పెద్ద సంఖ్యలో ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలను అనుమతిస్తోంది. పాఠశాలల్లోని పిల్లలందరికీ నాణ్యమైన, సమానమైన మీడియం విద్యను అందించే విషయంలో ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా నమూనా ఒక్కటే ఏకైక మార్గం. సంపన్నులు మాత్రమే చదవగల ప్రైవేట్ రంగ విద్యను రద్దు చేసే అవకాశం లేనందున అన్ని పాఠశాలల్ని ఒకే స్థాయిలో నిర్వహించడం ఒక్కడే సరైన, ఏకైక మార్గం. వ్యాసకర్త ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ -
కనీస వేతనాలు ఇలాగేనా?
వేతన నియమావళిని 2019 ఆగస్టులోనే చట్టరూపంలోకి తీసుకువచ్చినప్పటికీ కేంద్రస్థాయిలో సలహా మండలి ఆమోదం 2021 మార్చిలోకానీ సాధ్యపడలేదు. కోవిడ్–19తో సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు ఆదాయ సంపాదనా మార్గాలను కూడా కోల్పోయి తీవ్రంగా దెబ్బతిన్నారు. కేంద్రం ప్రకటించిన కనీస వేతనం రూ. 178లు. గత ఒకటిన్నర సంవత్సర కాలంగా లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. వాస్తవ సమస్య ఏదంటే సార్వత్రిక కనీస వేతన వ్యవస్థ అమలవుతుందా అన్నదే. కేంద్ర ప్రభుత్వం దీనిపై తక్షణం తన అభిప్రాయాన్ని ప్రకటించాల్సి ఉంది. వేతన నియమావళిని అమలు చేయడానికి బదులుగా కేంద్ర ప్రభుత్వం కాలాపహరణం చేయడానికే మిశ్రా కమిటీని ఏర్పర్చిందా అని సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం జూన్ 3న అధికారిక ప్రకటన చేస్తూ, కనీస వేతనాలు, జాతీయ స్థాయి కనీస వేతనాల స్థిరీకరణపై సాంకేతిక ప్రతిపాదనలు, సిఫార్సులు అందించడానికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనమిక్ గ్రోత్ డైరెక్టర్, ప్రొఫెసర్ అజిత్ మిశ్రా అధ్యక్షతన ఒక నిపుణుల కమిటీని నియమించినట్లు పేర్కొంది. ప్రకటన చేసిన నాటి నుంచి మూడేళ్లపాటు ఈ కమిటీ అమలులో ఉంటుందని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ స్పందన అనేక కారణాల రీత్యా ఆశ్చర్యం కలిగిస్తోంది. కమిటీ కాల వ్యవధిని మూడేళ్లుగా నిర్ణయించడం ఇందులో కీలకమైంది. శ్రామికులపై రెండో నేషనల్ కమిషన్ లేదా అసంఘటిత రంగంలో వ్యాపార సంస్థలపై జాతీయ కమిషన్ వంటి పలు కీలక అంశాలపై విచారణ జరిపే కమిషన్‌కు మాత్రమే ఇన్నేళ్ల కాల వ్యవధిని నిర్ణయిస్తే దాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ కనీస వేతనాలను నిర్ణయించే కమిటీకి ఇంత సుదీర్ఘ కాలవ్యవధిని నిర్ణయించడమే ఆశ్చర్య హేతువుగా ఉంది. కాకపోతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని అర్థవంతం చేస్తూ మిశ్రా కమిటీ తన కార్యాచరణ పరిధికి సంబంధించిన ప్రత్యేక నిబంధలపై వివరణ ఇచ్చేంతవరకు మనం వేచి ఉండాలి. ఈ మధ్య కాలంలో నాలుగు కీలక అంశాలను మాత్రం చర్చించాల్సి ఉంది. వాటికి పరిష్కారాలు సూచించాల్సి ఉంది. 1. మిశ్రా కమిటీ నియామకానికి దారితీసిన సందర్భం ఏమిటి? 2. ప్రస్తుతం ఉన్న కమిటీలకు ఇది స్వాగతించాల్సిన అదనపు చేర్పుగా ఉంటుందా? 3. కఠినమైన న్యాయాదేశం వెలుగులో ఈ కమిటీ కనీస వేతనాల విషయంలో అందించే చేర్పు ఏమిటి? 4. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య ఫలితాలు ఎలా ఉంటాయి? వేతన నియమావళి తొలి ముసాయిదాను 2017 ఆగస్టు 10న సమర్పించారు. తర్వాత సవరించిన నియమావళిని 2019లో ఆమోదించారు. వీవీ గిరి నేషనల్ లేబర్ ఇన్స్టిట్యూట్ ఫెలో డాక్టర్ అనూప్ శతపథి (ఇకపై శతపథి కమిటీ అని పేర్కొందాం) అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని 2018 జనవరి 17న ఏర్పర్చింది. కనీస వేతనాలపై సమగ్ర సమీక్ష జరపడం.. జాతీయ, ప్రాంతీయ కనీస వేతనాలను సిఫార్సు చేయడం దీని లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా కనీస వేతనాల అమలు తీరును దృష్టిలో ఉంచుకుని, భారతీయ నేపథ్యంలో వాటిని స్వీకరించడంపై కమిటీ అధ్యయనం చేస్తుంది. శతపథి కమిటీ 2019లో ఒక సమగ్ర నివేదికను సమర్పించింది. భారత్‌లో కనీస వేతన విధాన చరిత్ర, కనీస వేతనాల వ్యవస్థకు సంబంధించిన ఐఎల్ఓ విధానం, పలు దేశాల్లో కనీస వేతన వ్యవస్థలు వంటి అనేక అంశాలపై ఈ కమిటీ సమగ్రంగా చర్చించింది. పర్యవసానంగా, జాతీయ స్థాయిలో రోజుకు రూ. 375ల కనీస వేతనాన్ని, నెలకు రూ. 9,750ల వేతనాన్ని ఇవ్వవచ్చని ఈ కమిటీ సిఫార్సు చేసింది. దేశంలోని అయిదు రీజియన్లకు గాను ప్రాంతీయ వారీ వేతనాలను స్థిరపర్చాలని పేర్కొంది. అయితే ఈ నివేదికలోని కొన్ని అంశాలకు కార్మిక సంఘాలు మద్దతిచ్చినప్పటికీ మొత్తంగా చూస్తే నివేదికపట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత్‌లోని చాలా కార్మిక సంఘాలు ఏడవ పే కమిషన్ సిఫార్సు చేసిన వేతన రేట్ల ప్రకారం జాతీయ స్థాయిలో రోజుకు 600 రూపాయల కనీస వేతనాన్ని కల్పించాలని డిమాండ్ చేశాయి. యాదృచ్ఛికంగా శతపథి కమిటీ నివేదిక కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన వేతనాలపై ఏదైనా చర్చ చేసిందీ లేనిది పేర్కొనలేదు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం 2019లో రోజువారీ కనీస వేతనాన్ని రూ. 176ల నుంచి 178 రూపాయలకు కనిష్టంగా మాత్రమే పెంచుతున్నట్లు నిర్ణయిం చింది. ఈ నిర్ణయాన్ని శతపథి కమిటీ తిరస్కరించినట్లు కనిపిస్తోంది. కానీ తర్వాత కేంద్రం నియమించిన మిశ్రా కమిటీ ఇదే శతపథి కమిటీ చేసిన సిఫార్సులను తిరస్కరించడం గమనార్హం. మిశ్రా కమిటీలో ప్రభుత్వ ప్రతినిధుల పాత్ర సందేహాస్పదం మిశ్రా కమిటీలో ముగ్గురు ప్రభుత్వ ప్రతినిధుల నియామకం కాస్త అనుమానాలు రేకెత్తిస్తోంది. ఎందుకంటే వీరి వల్ల కనీస వేతనాల రేట్లకు సంబంధించి అంతవరకు చేసిన ప్రతిపాదనలను కుదించే ప్రమాదం ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే శతపథి కమిటీ కానీ, మరో కమిటీ కానీ ద్రవ్యోల్పణానికి అనుగుణంగా చేసిన సిఫార్సులకంటే తక్కువ కనీస వేతనాన్నే తాజాగా ప్రతిపాదించాలని మిశ్రా కమిటీపై ఒత్తిడి చేసి ఉండవచ్చని అనుమానించవచ్చు కూడా. మొత్తం మీద చూస్తే మిశ్రా కమిటీ పేరుకు స్వతంత్ర ప్రతిపత్తిని ఆస్వాదిస్తున్నట్లు కనిపించవచ్చు కానీ ప్రభుత్వ ప్రతినిధులు ప్యానెల్లో చేరడం వల్ల ప్రభుత్వ నిర్ణయమే అమలు జరగవచ్చని స్పష్టమవుతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ సాంకేతిక నిపుణులతో కూడిన ఐఎల్ఓ అధికారులకు కనీస వేతనాలపై నిర్ణయ బాధ్యతను ఇచ్చి ఉండవచ్చు. భారత్‌లోనూ, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ కనీస వేతనాలపై కొంతమంది ఐఎల్వో అధికారులు విశేషమైన కృషి చేశారు. కాబట్టి వీరితో పోలిస్తే మిశ్రా కమిటీని నిపుణుల కమిటీ అని పిలవడం తప్పిదమే అవుతుంది. అయితే కమిటీలోని సాంకేతిక సభ్యుల విద్యార్హతలను నేను ప్రశ్నించను. కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వంలో ఉందన్నదానితో పనిలేకుండా భారతీయ రాజ్యవ్యవస్థ వివిధ కమిటీలను, కమిషన్లను నియమించడం, తర్వాత అవి సమర్పించే నివేదికలను బుట్టదాఖలు చేయడం పరిపాటిగా మారింది. శతపథి కమిటీ నివేదికకు కూడా అదే గతి పట్టింది. 2024 జూ¯Œ లోగా తన నివేదికను సమర్పించాల్సి ఉన్న మిశ్రా కమిటీకి సైతం అదే గతి పట్టబోదనే గ్యారంటీ ఏమిటి? కమిటీల నివేదికలు.. వాస్తవ ప్రతిఫలనాలు వేతన నియమావళిని 2019 ఆగస్టులోనే చట్టరూపంలోకి తీసుకువచ్చినప్పటికీ కేంద్రస్థాయిలో సలహా మండలి ఆమోదం 2021 మార్చిలోకానీ సాధ్యపడలేదు. కోవిడ్–19 భయానక ప్రభావం, ఆర్థిక మందగమనం దీనికి కారణం కావచ్చు. కానీ అదే సమయంలో సంఘటితరంగం, అసంఘటిత రంగంలోని కార్మికులు నిజాదాయాల మాట పక్కనబెడితే, ఆదాయ సంపాదనా మార్గాలను కూడా కోల్పోయి తీవ్రంగా దెబ్బతిన్నారు. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం శాసనేతరపరంగా ప్రకటించిన కనీస వేతనం రూ. 178లు. అదే సమయంలో కోవిడ్ కారణంగా దేశ కార్మికుల ఆదాయాలు గణనీయంగా పడిపోయాయని వివిధ సర్వేలు, అధ్యయనాలు ఆధారపూరితంగా పేర్కొన్నాయి. గత ఒకటిన్నర సంవత్సర కాలంగా లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. నాలుగు కార్మిక నియమావళులు, వాటి పాక్షిక అమలు కారణంగా కార్మికులు తీవ్రంగా నష్టపోయారు. ఈ మధ్యకాలంలో పలు కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు కనీస వేతనాలకు సంబంధించి వివిధ రకాలుగా డియర్నెస్ అలవె¯Œ్సలలో మార్పులను ప్రకటించాయి. వాస్తవ సమస్య ఏదంటే సార్వత్రిక కనీస వేతన వ్యవస్థ అమలవుతుందా అన్నదే. కేంద్ర ప్రభుత్వం దీనిపై తక్షణం తన అభిప్రాయాన్ని ప్రకటించాల్సి ఉంది. దాని తర్వాతే రాష్ట్రాల ప్రభుత్వాలు కనీస వేతన రేటును సవరించి తగు చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. 2021 జూన్ 4న సీఐటీయూ మిశ్రా కమిటీ నియామకం చట్టబద్ధతను ప్రశ్నిం చింది. ఈ కమిటీని వెనక్కు తీసుకోవాలని పిలుపునిచ్చింది. కనీస వేతనాలను నిర్ణయించడం విషయంపై కేంద్రం వర్గీకరణ నిబంధనలు పొందుపర్చినందున మిశ్రా కమిటీ పరిధిలో సామాజిక చర్చా ప్రక్రియకే తావు లేకుండా పోయిందని ఆరోపించింది. పైగా సాంకేతిక నిపుణులను పక్కన బెడితే మిశ్రా కమిటీ ఏర్పాటు ప్రక్రియ దానికదేగా కార్మికుల ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బ కొట్టేటట్టు కనిపిస్తోంది. వేతన నియమావళిని అమలు చేయడానికి బదులుగా కేంద్ర ప్రభుత్వం కాలాపహరణం చేయడానికే మిశ్రా కమిటీని ఏర్పర్చిందా అని సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. మూడేళ్ల తర్వాత ఈ కమిటీ నివేదిక విడుదల అవటం అంటే కనీస వేతనాల అమలుకు ఎదురుచూస్తున్న కార్మికుల ఆకాంక్షలను నిస్పృహపర్చడమే అవుతుంది. కేఆర్ శ్యామ్ సుందర్ వ్యాసకర్త ప్రొఫెసర్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, జంషెడ్పూర్ (ది వైర్ సౌజన్యంతో) -
గోడమీది పిల్లులు... లెక్కల్లో కాకులు
చంద్రబాబునాయుడును చూస్తే అన్ని జంతువులూ ఈర్ష్య పడేట్టున్నాయి. ఈయనే కాకి లెక్కలు వేస్తాడు, ఈయనే నక్క జిత్తులు ప్రదర్శిస్తాడు, ఈయనే గోడమీది పిల్లి అవుతాడు. ఆయనకూ, ఆయన నడుపుతున్న టీడీపీకి ఒక విధానం అంటూ ఉన్నట్టు లేదు. తమకు ఏది అవసరమో అక్కడ ఆ వాదనను తెరపైకి తెస్తారు. అనుకూలం కాకపోతే దానికి పూర్తి విరుద్ధమైనది మాట్లాడుతారు. దాన్ని సమర్థించుకోవడానికి అడ్డగోలు లెక్కలు వేయడానికి కూడా వెనుకాడరు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల ప్రయోజనార్థం అమూల్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం పట్ల వారి వ్యవహారంలో ఎంతమాత్రమూ హేతుబద్ధత కనిపించదు. ఇదంతా చూస్తుంటే ఒకటి మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. వీళ్లకు నిర్మాణం ఇష్టం లేదు. వీరు విధ్వంస ప్రేమికులు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అడ్డుపడుతున్న సైంధవులు.కాకి లెక్కలు చెప్పడంలో కానీ, పరస్పర విరుద్ధ ప్రకటనలు చేయడంలో కానీ ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశాన్ని మించిన పార్టీ బహుశా దేశంలోనే ఉండకపోవచ్చు. ఒక వైపు సొంత పార్టీ వారు ఎంత పెద్ద తప్పు చేసినా సమర్థిస్తారు. మరో వైపు ప్రభుత్వం ప్రజా ఉపయోగార్థం ఏదైనా కొత్త ప్రతిపాదనతో ముందుకు వెళుతుంటే మాత్రం ఏదో రకంగా అడ్డం పడటానికి విశ్వయత్నం చేస్తుంటారు. అదే రాజకీయం అని వారు గట్టిగా నమ్ముతున్నారు. వారికి ఒక ఎంపీ తోడయ్యారు. ఆయన వారికి ఉపయోగపడుతున్నారు. అమూల్‌తో ఒప్పందానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం పడింది. దానిపై హైకోర్టు వారు ఇచ్చిన తాత్కాలిక తీర్పు వారికే కొంతవరకు అనుకూలంగా ఉండవచ్చు. అది వేరే విషయం. ఆంధ్రప్రదేశ్‌లో మూతపడిపోయిన సహకార డెయిరీలను పునరుద్ధరించడానికీ, వాటి ద్వారా రైతులకు మరింత మేలు కలిగేలా చేయడానికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం రైతుల సంస్థ అయిన అమూల్‌తో ప్రభుత్వం అవగాహన కుదుర్చుకుంది. అందులో భాగంగా కొన్ని ప్లాంట్లను, ఇతర సదుపాయాలను అమూల్‌కు లీజ్ ప్రాతిపదికన కేటాయించారు. దీనిని తెలుగుదేశం తప్పుపడుతోంది. గోడమీది పిల్లి వాటం ఇదే తరుణంలో తమ పార్టీ నేత ధూళిపాళ్ల నరేంద్ర సంగం డెయిరీని ప్రొడ్యూసర్ కంపెనీగా మార్చి దానిని తన సొంత కంపెనీ మాదిరిగా నడుపుకుంటున్నారన్న అభియోగాన్ని సమర్థిస్తుంటారు. ఆయన వేరే ప్రైవేటు కంపెనీని నడుపుతూ సహకార డెయిరీని ప్రొడ్యూసర్ కంపెనీగా మార్చుకున్నా, తన తండ్రి పేరుమీద ఒక ట్రస్టు పెట్టి, ఆ ట్రస్టులో తన కుటుంబ సభ్యులనే యాజమాన్య బాధ్యతలలో పెట్టి, సంగం డెయిరీకి చెందిన పదెకరాల భూమిని బదలాయించినా తెలుగుదేశం వారు సమర్థిస్తారు. ఇదే వారి గొప్పదనం. వీరు ఏదో ఒక విధానానికి కట్టుబడి ఉండరు. తమకు ఎక్కడ ఏది అవసరమో ఆ వాదనను తెరపైకి తీసుకువస్తుంటారు. తద్వారా వారు తమ డొల్లతనాన్ని బయట పెట్టుకుంటారు. అయినా ప్రజలు వాటిని గమనించలేరని వారి నమ్మకం. ప్రజల విజ్ఞత పట్ల వారికి అంత గౌరవం. బాగుపడితే ఓర్వరా? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, అంతకుముందు కానీ మూతపడిన సహకార డెయిరీలను ఇప్పుడు అమూల్‌కు అప్పగించడంలో కుంభకోణం ఉందని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపించడం మొదలు పెట్టారు. టీడీపీ మీడియా దానికి ప్రాధాన్యత ఇచ్చి వార్తలు ఇస్తుంటుంది. నిజంగానే స్కామ్ ఉందని అనుకుంటే ఆ మీడియానే పరిశోధించి వార్తలు ఇవ్వవచ్చు కదా? కేవలం టీడీపీ వారి ఆరోపణలనే ప్రముఖంగా ఇచ్చారంటేనే వాటిలో ఎంత నిజం ఉందన్న ప్రశ్న వస్తుంది. మూత పడ్డ సహకార డెయిరీలలోని యంత్రాల విలువ 550 కోట్ల రూపాయలుగా వీరు లెక్కవేశారు. అలాగే భవనాలు, భూముల విలువ 750 కోట్ల రూపాయలుగా గణించారు. రాష్ట్రంలోని 9,800 గ్రామాలలో బల్క్ కూలర్లు ఖర్చు చేయడాన్ని వీరు తప్పు పడుతున్నారు. ప్రభుత్వం కూలర్ల కోసం ఖర్చు పెడితే అది ఆస్తి అవుతుందా, లేదా? మూతపడ్డ డెయిరీ ప్లాంట్లను తెరచి పనిచేయించేందుకు అమూల్‌కు తక్కువ మొత్తానికే లీజుకు ఇచ్చారని తెలుగుదేశం ప్రచారం ఆరంభించింది. అంటే తెలుగుదేశం పార్టీ వారికి ఈ సహకార డెయిరీలు మూతపడి, యంత్ర పరికరాలన్ని తుప్పుపట్టినా, భవనాలు శి«థిలావస్థకు చేరినా ఫర్వాలేదు కానీ, అమూల్ వంటి రైతుల సంస్థలకు అప్పగించి బాగు చేయించడం ఇష్టం లేదన్నమాట. చేయరు... చేయనివ్వరా? నిజానికి పాలపరిశ్రమ రంగంలో అనుభవం ఉన్న చంద్రబాబు పాలనాకాలం లోనే వాటిని పునరుద్ధరించడానికి ప్రయత్నం జరిగి ఉండాల్సింది. కానీ ఆయన వాటిని పట్టించుకోలేదు. మరి దీనికి చంద్రబాబుకు సొంతంగా హెరిటేజ్ పాల సంస్థ ఉండడమే కారణమని ఎవరైనా ఆరోపిస్తే తెలుగుదేశం పార్టీ వారు అంగీకరిస్తారా? ఇప్పుడు ప్రభుత్వం వీటిని పునరుద్ధరించడానికి చర్యలు చేపడితే తప్పు పడతారా? మరి వీరే ఇప్పుడు ధూళిపాళ్ల నిర్వాకాన్ని ఎలా అంగీకరిస్తారు? ఆయన అరెస్టును రాజకీయ కక్షగా ఎలా ప్రచారం చేస్తారు? ఆయన రైతుల శ్రేయస్సే ప్రధానంగా పనిచేసి ఉంటే ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ అలా జరగడం లేదన్నది విమర్శ. సహకార రంగంలోని డెయిరీని ప్రొడ్యూసర్ కంపెనీగా మార్చి సొంత సంస్థలా ధూళిపాళ్ల నడపడం సరైనదా, కాదా? అన్న విషయం వీరు ఎందుకు చెప్పడం లేదు. పైగా ఆయనే మరో ప్రైవేటు డెయిరీని నడుపుకోవచ్చా? అది తప్పా? కాదా? అన్నదానిపై తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడరు. అధినేత లాభాల కోసమేనా? తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే కదా... విశాఖ సహకార డెయిరీ కూడా ఒక వ్యక్తి చేతిలోకి వెళ్లిపోయింది. మరో వైపు అమూల్ ఏడాదికి వంద కోట్ల రూపాయలు అయినా ప్రభుత్వానికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందులో హేతుబద్ధత ఎంత ఉందన్నది వారికి అనవసరం. నిజంగానే ప్రభుత్వానికి అమూల్ ఇంకాస్త చెల్లించాలని అడిగితే అడగవచ్చు. కానీ అసాధారణ డిమాండ్ చేయడమే ఆక్షేపణీయం. అందుకే టీడీపీ వారివి కాకి లెక్కలు అనేది. అమూల్ సంస్థ రైతుల సహకార సంస్థ కాదని తెలుగుదేశం చెప్పగలదా? దేశ వ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా పేరొందిన అమూల్ సేవలను ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెడితే టీడీపీ నేతలకు ఉలికిపాటు దేనికి? తమ అధినేత కంపెనీకి లాభాలు తగ్గుతాయని వీరు ఆందోళన చెందుతున్నారా? అమూల్ కంటే ఎక్కువ మొత్తంలో రైతులకు చెల్లిస్తామని మరికొన్ని ప్రైవేటు కంపెనీలు ముందుకు వచ్చినా ప్రభుత్వం అంగీకరించలేదట. టీడీపీ మాటల్లోని మతలబు గుర్తించడం కష్టం కాదు. మూతపడ్డవి తెరవొద్దా? చంద్రబాబు హయాంలో అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటుపరం అయ్యాయి. వాటిలో నిజాం షుగర్స్ ఒకటి. వందల కోట్ల విలువైన ఆస్తులు ఉన్న ఈ సంస్థను, ప్రత్యేకించి బోధన్‌లో ఉన్న ఆస్తులను ఒక ప్రైవేటు కంపెనీకి అప్పగించారు. అది కొన్నాళ్లు నడిపి చేతులెత్తేసింది. అంతే, ఆ తర్వాత అది మూతపడింది. మళ్లీ ఇంతవరకు తెరుచుకోలేదు. ఇలా చేస్తే తెలుగుదేశం పార్టీ సంతోషిస్తుందా? అమూల్ రంగంలోకి వచ్చిన తర్వాత పాడి రైతులకు మేలు జరిగిందా? లేదా? హెరిటేజ్‌తో సహా ఆయా ప్రైవేటు డెయిరీలు రైతులు సరఫరా చేసే పాలకు ఇస్తున్న ధరను పెంచాయా? లేదా? వీటిని పరిగణనలోకి తీసుకోకుండా తెలుగుదేశం పార్టీ పెద్ద నేతలు చెబితే, చోటా మోటా నేతలు వారి అనుకూల టీవీలలో కూర్చుని ఆరోపణలు చేస్తుంటే ప్రజలు ఎవరూ నమ్మరు. ఎందుకంటే టీడీపీ వారు విధ్వంసం కోరుకుంటున్నారన్న సంగతి అర్థం అయిపోతుంది. ఒక పక్క పరిశ్రమలు రావడం లేదని విమర్శలు చేస్తూ, మరో పక్క వచ్చిన ఒక భారీ పరిశ్రమను అడ్డుకోవడానికి టీడీపీతో సహా కొన్ని శక్తులు కుయుక్తులు పన్నుతున్నాయన్న విమర్శ వస్తోంది. తెలుగుదేశం పార్టీ వారు గుడ్డి ద్వేషంతో ప్రతిదానిని వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే వారు మూల్యం చెల్లించుకున్నారు. ఎన్నికలలో ఎన్నిసార్లు ఓడినా వారి వారి ఆలోచనలలో మార్పు రావడం లేదు. ముందుగా టీడీపీ వారు ఇలాంటి విషయాలలో ఒక విధానం తయారు చేసుకుని మాట్లాడాలి. లేకుంటే పోయేది వారి పరువే. ధైర్యం ఉంటే మూతపడ్డ సహకార డెయిరీ ప్లాంట్లను తెరవవద్దని వీరు చెప్పగలరా? కానీ ఆరోపణలు మాత్రం చేస్తుంటారు. ఇదే దిక్కుమాలిన రాజకీయం. కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ప్రజారోగ్య విధ్వంసం... కారకులెవరు?
మన ప్రధాన ఆర్థిక వేత్తలు పాశ్చాత్య దేశాల్లోని ఉత్తమ విధానాలను కాపీ కొట్టి సత్వరం సొంతం చేసుకునేందుకే అలవాటు పడిపోయారు తప్పితే దేశానికి ఏది నిజంగా అవసరమైంది అనే ప్రాథమిక సమాచారాన్ని కనుగొనడానికి ప్రయత్నించలేదు. దేనికైనా సరే విదేశాలకేసి చూడటమే సులభమని భావిస్తూ వచ్చారు. ఆరోగ్యం, విద్య, ఆహారం, వ్యవసాయం వంటి సామాజిక రంగాలపై పెడుతున్న వ్యయాన్ని కుదించాలని పిలుపునిచ్చే వారిదే పైచేయి కావడంతో దేశంలో ప్రైవేటీకరణ తృష్ణ పెరుగుతూ పోయింది. ప్రజారోగ్య మౌలిక వ్యవస్థలో మన వైఫల్యాలను కరోనా సెకండ్ వేవ్ స్పష్టంగా ఎత్తి చూపింది. భారత్ వంటి దేశాలకు ఎలాంటి ఆర్థిక విధానాలు అవసరం అనే అంశంపై ఇప్పుడే పెద్ద ఎత్తున చర్చ జరగాలి. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ ప్రభుత్వ ఆసుపత్రిలో పలువురు రోగులు తమ మడతమంచాలను తామే తెచ్చుకున్నారని, అనేకమంది నేలపై బెడ్ షీట్లు వేసుకుని పడుకున్నారని ఒక జాతీయ పత్రిక నివేదించింది. ఇక పాట్నాలోని రెండు ప్రభుత్వ ఆసుపత్రులలో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఈ ఆసుపత్రుల్లో చేరాలంటేనే ప్రజలు తిరస్కరిస్తున్నారని, ఇంట్లోనే ఉండి చికిత్స చేయించుకోవడానికే వీరు ప్రాధాన్యమిస్తున్నారని, దేవుడు కరుణించకపోతే ఇంటిలోనే చావాలని కోరుకుంటున్నారని ఒక ప్రముఖ ఆంగ్ల వెబ్ సైట్ పేర్కొంది. ఈ రెండు వార్తా నివేదికలు మన గ్రామీణ ఆరోగ్య సంరక్షణ మౌలిక వసతుల కల్పన ఎంత దిగజారిపోయిందో తేల్చి చెబుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వైరస్ ఎంత తీవ్రంగా చొచ్చుకుపోయింది అనే వాస్తవాన్ని ఈ రెండు వార్తా కథనాలు స్పష్టం చేశాయి. గ్రామీణ ఆరోగ్య సంరక్షణ మౌలిక వసతుల కల్పన ఎంతగా మట్టిగొట్టుకుపోయింది అనే విషయం అర్థమవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణను మెరుగుపర్చి ఉంటే ప్రస్తుతం కరోనా మహమ్మారిని ఎదుర్కోవడం సాపేక్షంగా సులభతరమై ఉండేది. దేశంలో ఎంత దుర్భర పరిస్థితులు నెలకొని ఉన్నాయో చెప్పడానికి పంజాబ్‌లోని అబోహర్ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గంలో 68 గ్రామాలకు కలిపి ఒకే ఒక ఆసుపత్రి ఉన్న వైనాన్ని గుర్తించాలి. ఈ ఆసుపత్రిలోనూ ఒక్కటంటే ఒక్క ఆక్సిజన్ పడక లేదు. దేశంలోని ఇతర గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి, పట్టణ ప్రాంతాల్లో సెకండ్ వేవ్ విరుచుకుపడటానికి ముందుగా, ప్రభుత్వ గ్రామీణ ఆరోగ్య వ్యవస్థ దాదాపుగా కుప్పగూలిపోయిన స్థితిలో ఉంది. కానీ ఈ పరిస్థితి మనపై పెద్దగా ప్రభావితం చూపదు కాబట్టి దాన్ని నిర్లక్ష్యం చేశాం. గ్రామీణ కుటుంబంలో ఒక వ్యక్తి తీవ్ర అనారోగ్యం పాలైతే ఆ కుటుంబం మొత్తంగా దారిద్య్ర రేఖ దిగువకు పడిపోతుందని అనేక అధ్యయనాలు మనకు చూపించాయి. వైద్య బిల్లులు చెల్లించాలంటే వీరు తరచుగా రుణాలు తీసుకోవలసి ఉంటుంది. దీంతో వారు మరింత అప్పుల ఊబిలోకి కూరుకుపోతారు. వైద్య చికిత్స కోసం గ్రామీణ ప్రాంతాల్లోని జనాభాలో 74 శాతం మంది ప్రైవేట్ రంగంపైనే ఆధారపడుతున్నారు. దీంతో ప్రజారోగ్య సంరక్షణ పేదలకు అందుబాటులో లేకుండా పోయింది. కోవిడ్–19 మహమ్మారి విరుచుకుపడటంతో నగరాల్లోని ఆసుపత్రులలో ఆక్సిజన్, ఔషధాలు, పడకలు నిండుకున్నాయి. దీంతో రోగుల బంధువులు, స్నేహితులు సహాయం కోసం సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు. మన నగరాల్లోనూ ప్రజారోగ్య సంరక్షణ కుప్పగూలిపోవడానికి సిద్ధంగా ఉందని కాస్త ఆలస్యంగానైనా సరే ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. ఇప్పటికే చాలా ఆసుపత్రుల్లో పడకలు అందుబాటులో లేవు. రోగులను వారి బంధువులు ఒక ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి ప్రవేశం కోసం తీసుకెళుతున్న దృశ్యాలు కలవరపెడుతున్నాయి. ఇది నగర మధ్యతరగతిని తీవ్రంగా కంపింపజేస్తోంది. విషాదమేమిటంటే నగరాల్లోని చాలా కుటుంబాలు తమ ప్రియతములను ఇప్పటికో కోల్పోయాయి. మీ ఫేస్బుక్ టైమ్‌లైన్‌ని కాస్త తెరిచి చూడండి, ప్రాణాంతక మహమ్మారి బారిన పడి కన్నుమూసిన వారి బంధువులు, స్నేహితులు నివాళి పలుకుతున్న దృశ్యాలు విస్తృతంగా మీకు కనిపిస్తాయి. సకాలంలో ఆసుపత్రిలో ప్రవేశం దొరికి వైద్య సహాయం అంది ఉంటే అనేకమంది ప్రాణాలు నిలిచేవని ఇప్పుడు ప్రజలు గుర్తిస్తున్నారు. కాబట్టే కరోనా సెకండ్ వేవ్‌లో మరణాల సంఖ్య ఇంతగా పెరగడానికి ఆరోగ్య మౌలిక వసతులు తగినంత లేకపోవడమే కారణమని అర్థమవుతోంది. కానీ మనం ఒక విషయంలో స్పష్టతతో ఉండాలి. మనం వ్యవస్థను తప్పుపట్టే ముందు.. ప్రజారోగ్య వ్యవస్థను ప్రైవేటీకరిస్తున్నప్పుడు మనందరం మూగ ప్రేక్షకుల్లా నిలబడి చూస్తుండిపోవడం వాస్తవం కాదా? బడ్జెట్లో ఆరోగ్యం, విద్య, వ్యవసాయంపై ప్రభుత్వ పెట్టుబడులపై తీవ్రంగా కోత విధించేవైపుగా ప్రభుత్వ విధానం కొట్టుకుపోతున్నప్పుడు జాతీయ స్రవంతి ఆర్థికవేత్తలను, మీడియాను ప్రశ్నించడంలో మనం విఫలం కాలేదా? మారిన ప్రభుత్వ విధానం మనల్ని ఎలా ప్రభావితం చేస్తుంది అనే ఆలోచన మన మనస్సుల్లో ఉంది కాబట్టే నిమ్మళంగా ఉండిపోయాం. మన చుట్టూ మృత్యుదేవత తాండవిస్తున్న దృశ్యాలైనా మనలను మేల్కొల్పుతాయా అంటే హామీ ఇవ్వలేను. కానీ ట్విట్టర్లో ఎవరో ప్రభుత్వ ఆసుపత్రులు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయని నివేదించారు కూడా. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ప్రజారోగ్య వ్యవస్థతో ప్రభుత్వం ఎలా చెలగాటమాడుతూ వచ్చిందో ఇది తేల్చి చెప్పింది. ఆ తర్వాత నీతి ఆయోగ్ సైతం జిల్లా ఆసుపత్రులను ప్రైవేటీకరించాలని, పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం నమూనాలోకి వీటిని తీసుకురావాలని సూచించింది. దేశంలోని అగ్రశ్రేణి ఆసుపత్రులు వైద్య పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్నప్పుడు ఎంతమంది విధాన నిర్ణేతలు, మీడియా వ్యక్తులు, కార్పొరేట్ బడా సంస్థలు అభినందనలు తెలియజేశాయో మర్చిపోవద్దు. పైగా ద్రవ్యలోటును పరిమితుల్లో పెట్టడానికి సామాజిక రంగంపై పెడుతున్న పెట్టుబడులపై కోత విధించాలని కొందరు సుప్రసిద్ధ ఆర్థిక వేత్తలు కూడా సెలవిచ్చారని మనం మర్చిపోరాదు. నిజానికి, పార్లమెంటులో జరిగిన ప్రతి బడ్జెట్ సమావేశమూ ద్రవ్యలోటుపైనే కన్నేసి ఉంచిందని మర్చిపోకూడదు. గత సంవత్సరం అంటే 2020లో నీతి ఆయోగ్ మళ్లీ 250 పేజీల విధాన పత్రంతో ముందుకొచ్చింది. కొత్తగా నెలకొల్పనున్న లేదా ఇప్పటికే కొనసాగుతున్న ప్రైవేట్ వైద్య కళాశాలలను పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా జిల్లా ఆసుపత్రులతో అనుసంధానం చేసే పథకాలను తీసుకురావాలని ఈ పత్రం పేర్కొంది. విదేశాల్లోని ఉత్తమ విధానాలకు అనుగుణంగా ప్రభుత్వ ఆరోగ్య మౌలికవసతుల రంగాన్ని ఎలా ప్రైవేటీకరించాలో తెలిపే మార్గదర్శినిని కూడా నీతి ఆయోగ్ పేర్కొంది. పైగా, కొద్దిమంది ఆరోగ్య కార్యకర్తలు మినహా దేశంలోని ప్రతి ఒక్కరూ వీటిపట్ల కూడా మౌనం వహించారు. ఇదే నిజమైన సమస్య. మన ప్రధాన ఆర్థిక వేత్తలు పాశ్చాత్య దేశాల్లోని ఉత్తమ విధానాలను కాపీ కొట్టి సత్వరం సొంతం చేసుకునేందుకో అలవాటు పడిపోయారు తప్పితే దేశానికి ఏది నిజంగా అవసరమైంది అనే ప్రాథమిక సమాచారాన్ని కనుగొనడానికి వీరు ఏమాత్రం ప్రయత్నించలేదు. దేనికైనా సరే విదేశాలకేసి చూడమే సులభమని వీరు భావిస్తూ వచ్చారు. కానీ ప్రపంచంలోని అత్యంత సమర్థవంతమైనదిగా రేటింగ్ ఉంటున్న బ్రిటన్ లోని పబ్లిక్ సెక్టర్ నేషనల్ హెల్త్ సర్వీస్‌పై వీరు ఎందుకు చూపు సారించరు అని నాకు ఆశ్చర్యమేస్తుంది. ఏదేమైనప్పటికీ ఆరోగ్యం, విద్య, ఆహారం, వ్యవసాయం వంటి సామాజిక రంగాలపై పెడుతున్న వ్యయాన్ని కోసిపడేయాలని పిలుపునిచ్చే ఆర్థిక వేత్తలదే పైచేయి కావడంతో దేశంలో ప్రైవేటీకరణ తృష్ణ పెరుగుతూనే పోయింది. ప్రజారోగ్యానికి డబ్బు తక్కువగా ఉన్నట్లయితే, ఆరోగ్య మౌలిక వ్యవస్థను ఎలా ముందుకు తీసుకుపోగలం? అంతర్జాతీయ సంస్థలు చెప్పిందానికల్లా గుడ్డిగా తలూపుకుంటూ పోదామా? క్రెడిట్ రేటింగ్ సంస్థల ఆదేశాలను మనమెందుకు పాటించాలి? విషాదకరమేమంటే ద్రవ్యలోటును తగ్గించడం అనే మందునే మన కేంద్ర ప్రభుత్వాలు అనుసరిస్తూ పోతున్నాయి. మన వైఫల్యాలను కరోనా సెకండ్ వేవ్ స్పష్టంగా ఎత్తి చూపింది. భారత్ వంటి దేశాలకు ఎలాంటి ఆర్థిక విధానాలు అవసరం అనే అంశంపై ఇప్పుడే పెద్ద ఎత్తున చర్చ జరగాలి. ప్రాణాంతక సెకండ్ వేవ్ మనల్ని పునరాలోచనలో పడవేస్తుందని, మన ఆర్థిక విధానాలపై విధాన నిర్ణేతలు పునరాలోచించి ఆత్మనిర్భర్ భారత్ సవాళ్లను ఎదుర్కోగలరని ఆశిద్దాం. దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహారం, వ్యవసాయరంగ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
వైరస్‌పై ఇంత విష ప్రచారం ఏల బాబూ?
ప్రస్తుత విపత్తు అంతర్జాతీయ సమస్య అన్న సంగతిని దాటవేసి.. అదేదో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేదా రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను సృష్టించారన్నట్లుగా చంద్రబాబు ప్రచారం చేయడం దారుణంగా ఉంది. ప్రజల ప్రాణాలు వేరే వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడే విలువ కలిగి ఉంటాయని, తన పాలనలో ఉండవని చంద్రబాబు మాటలు చెప్పకనే చెబుతున్నాయి. వాక్సినేషన్ కన్నా స్థానిక ఎన్నికలే ముఖ్యమన్నట్లుగా ఎన్నికల కమిషనర్‌ను బాబు గతంలో సమర్ధించారు. ఇప్పుడు కరోనా పెరగడానికి కారణం వారు కాదా? అసలు ఏపీ వేరియంట్ అంటూ కొత్త వైరస్‌ని కనిపెట్టిన రీతిలో చంద్రబాబు ఏపీ ప్రభుత్వంపై ఇంత ఉన్మాద స్థాయి విష ప్రచారం ఎందుకు చేస్తున్నట్లు?రాజకీయాలలో కొన్ని విషయాలు తెలిసినా, తెలియనట్లు నటించడం చేస్తుంటారు. అలాంటి విషయాలలో ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీకాని, ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కానీ సిద్ధహస్తులని చెప్పాలి. తాజాగా చంద్రబాబు అండ్ కో ఏపీలో వాక్సిన్ కొరతపై విమర్శలు చేస్తున్నారు. వాక్సిన్ కోసం నలభై ఐదు కోట్లే ఖర్చు చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. అంతేకాదు చంద్రబాబు సైంటిస్టుగా మారి కరోనాకు సంబంధించిన వైరస్ ఒకటి కర్నూలులో పుట్టిందని ప్రచారం చేస్తున్నారు. అలాంటి వేరియంట్ అక్కడ పుట్టలేదని, పైగా ఆ వేరియంట్ అంత శక్తివంతమైనది కాదని సైంటిస్టులు చెబుతున్నా చంద్రబాబు మాత్రం ప్రజలను భయపెట్టే రీతిలో ప్రసంగాలు చేస్తున్నారు. టీడీపీ నేతల సమావేశాల పేరుతో నిత్యం అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. తద్వారా ఏపీలో అసలు ఏమీ జరగడం లేదేమో అన్న అనుమానం కలిగించాలన్నది ఆయన యత్నం. ప్రభుత్వం పని చేయడం ఒక ఎత్తు అయితే చంద్రబాబును, ఆయనకు మద్దతు ఇచ్చే మీడియాను భరించడం మరో ఎత్తుగా మారింది. ప్రతిపక్షం అన్నాక విమర్శలు చేయకుండా ఉంటుందా? అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. నిజమే. కానీ ఆ విమర్శలు అర్థవంతంగా ఉండాలి. ప్రస్తుత విపత్తు అంతర్జాతీయ సమస్య అన్న సంగతి అంతా తెలుసుకోవాలి. అదేదో ఏపీ ముఖ్యమంత్రి జగన్ లేదా రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను సృష్టించారన్నట్లుగా ప్రచారం చేయడం దారుణంగా ఉంటుంది. అందుకే మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ చంద్రబాబు కరోనా వైరస్ కంటే దారుణమైన వైరస్‌గా మారారని విమర్శిస్తున్నారు. గతంలో గోదావరి పుష్కరాల సమయంలో చంద్రబాబు ప్రచార యావతో తొక్కిసలాట జరిగి ఎంతమంది చనిపోయారో అందరికీ తెలుసు. అయినా దాని గురించి ఆయన ఏమన్నది వీడియోలలో కనిపిస్తుంది. ఇప్పుడు మాత్రం ప్రజల ప్రాణాలకన్నా విలువ ఏమి ఉంటుందని ఆయన ప్రశ్నిస్తున్నారు. తప్పు లేదు. ప్రజల ప్రాణాలు వేరే వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడే విలువ కలిగి ఉంటాయని, తన పాలనలో ఉండవని ఆయన మాటలు చెప్పకనే చెబుతున్నాయి. కొద్ది నెలల క్రితం ఏపీలో స్థానిక ఎన్నికలు పెట్టాల్సిందేనని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డకు మద్దతుగా చంద్రబాబు తందానా అన్నారే. అప్పుడు వాక్సినేషన్ పూర్తి చేసుకుందాం, రెండు నెలలు ఎన్నికలు వాయిదా వేద్దాం అని ముఖ్యమంత్రి జగన్ అంటే ఇదే చంద్రబాబు, మరికొందరు అడ్డుపడ్డారే. మరి ఇప్పుడు కరోనా పెరగడానికి కారణం వారు కాదా? కరోనా రెండో వేవ్ ప్రబలడానికి కేంద్ర ప్రభుత్వం కారణమని, ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా లు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం, కుంభమేళాలో 90 లక్షల మంది పాల్గొన్న తీరుపై అంతర్జతీయంగా విమర్శలు వచ్చాయి. మరి జాతీయ పార్టీకి నాయకుడుగా ఉన్న చంద్రబాబు ఒక్క మాట అయినా వాటిపై కామెంట్ చేయలేక పోతున్నారే. అదే కనుక పొరపాటున ఏపీలో అలాంటివి జరిగి ఉంటే చంద్రబాబు, ఆయన వర్గం మీడియా వైఎస్సార్ సీపీపై విరుచుకుపడేవి. మొత్తం కరోనా వ్యాప్తికి కారణం అధికార పార్టీనేనని ప్రచారం చేసేవి. గత ఏడాది వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు పేదలకు పలురూపాలలో సాయం చేస్తే, అందువల్లే కరోనా పెరిగిందని అప్పట్లో చంద్రబాబు ఆరోపించారు. కాని వాక్సినేషన్ కన్నా స్థానిక ఎన్నికలే ముఖ్యమన్నట్లుగా ఎన్నికల కమిషనర్‌ను ఆయన సమర్ధించారు. దేశంలో వాక్సిన్ ఎంత ఉత్పత్తి అవుతున్నది? అందులో కేంద్రం ఎంత తీసుకుంటోంది? రాష్ట్రాలకు ఎంత ఇస్తున్నది వంటి అంశాల గురించి కానీ, ఒకే వాక్సిన్‌కు దేశంలో మూడు రకాలు పెట్టిన తీరుపై పలు వర్గాల నుంచి వస్తున్న విమర్శలను కానీ ప్రస్తావించడానికి భయపడుతున్న చంద్రబాబు ఊ అంటే చాలు సీఎం జగన్‌పై ఏవేవో పిచ్చి ఆరోపణలు చేస్తూ, తామూ రాజకీయంగా ఉనికిలోనే ఉన్నామని చాటుకోవడానికి తీవ్రంగా యత్నిస్తున్నారు. తెలుగుదేశం కార్యకర్తలు, నేతలు సుమారు 200 మందికి కరోనా సోకితే ఎవరో అమెరికా డాక్టర్‌తో మాట్లాడి ట్రీట్మెట్ ఇప్పించానని చెబుతున్న చంద్రబాబు తన సొంత నియోజకవర్గ ప్రజలకు ఆ సదుపాయం ఎందుకు కల్పించలేకపోయారు? వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలంతా వారి నియోజకవర్గాలలో ఉండి, అవకాశం ఉన్నంత మేరకు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. మరి చంద్రబాబు ఎందుకు హైదరాబాద్ లోని తన భవంతిలోనే ఉంటున్నారు? ఆయన ఈ వయసులో కుప్పం వెళ్లి ప్రజలలో తిరిగి రిస్కు తీసుకోవాలని చెప్పడం లేదు. కాని ఆయన ఎప్పుడూ ప్రభుత్వాన్ని తప్పు పడుతూ కాలక్షేపం చేస్తున్న తీరు, ఆంద్ర ప్రజలను కరోనా పేరుతో భయపెట్టాలని చేస్తున్న ప్రయత్నాలు చూసిన తర్వాత ఈ విషయాలను అడగవలసి వస్తోంది. ప్రతిపక్ష నేతగా ప్రభుత్వంలో జరిగే లోపాలను ఎత్తిచూపడం తప్పు కాదు. కాని ద్వేషభావంతో ఉన్నవీ, లేనివి అబద్దాలు ప్రచారం చేయడం మాత్రం దారుణంగా ఉంటుంది. టీడీపీ నేతలు ఎవరి ఇళ్లలో వారు కూర్చుని నిరసన ప్లకార్డులు పట్టుకున్నారట. దానికి ముందు ఒక విషయాన్ని టీడీపీ వారు గుర్తించాలి. చంద్రబాబు పాలనలో ప్రభుత్వ ఆస్పత్రులను చాలావరకు నిర్లక్ష్యం చేశారా? లేదా? వాటిని ప్రైవేటు సంస్థలకు అప్పగించడానికి యత్నించారా? లేదా? ఇప్పుడు కరోనా సంక్షోభ సమయంలో ప్రైవేటు ఆస్పత్రులు చేతులు ఎత్తివేయడమో లేక అధిక చార్జీలు వసూలు చేయడమో చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? చంద్రబాబు ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేసి ఉంటే దైర్యంగా ఆ మాట చెప్పాలి. కాని ఆయన వాటి జోలికే వెళ్లరు. ఏపీ ప్రభుత్వం కొత్తగా మరో 175 పీహెచ్ సీలను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులను నాడు–నేడు కింద బాగు చేయిస్తుంటే దానిని కూడా చంద్రబాబు తప్పు పడుతున్నారు. అవి కాంట్రాక్టర్లకు ఉపయోగపడే పనులట. అంటే చంద్రబాబు తాను చేయరు, ఎదుటివారు చేస్తుంటే ఓర్వలేరన్నమాట. ప్రపంచం అంతా ఏలా ఉన్నా, ఆయన దృష్టి, విమర్శలు, ఆరోపణలు, అసత్య ప్రచారాలు అన్ని ఏపీ మీదే ఉంటాయి. హైకోర్టులో కొన్ని అబ్జర్వేషన్లు వచ్చాయి. ప్రభుత్వ సిబ్బంది పూర్తి స్థాయిలో పని చేయడం లేదని, 104 నెంబర్‌కు పోన్ చేసినా కొన్నిసార్లు రెస్సాండ్ అవడం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. అందులో వాస్తవాలు ఉండవచ్చు. లేదా కొన్నిసార్లు అత్యంత క్లిష్ట పరిస్థితులు ఉండవచ్చు. కేవలం న్యాయమూర్తులు వ్యాఖ్యలు చేసినంతనే పరిస్థితులు మారిపోవు. దానికి ఎంతో వ్యయ ప్రయాసలకు గురి కావల్సి ఉంటుంది. ఆ విషయం గౌరవ న్యాయమూర్తులకు తెలియక కాదు. కాకపోతే వారి పని వారు చేస్తుంటారు. కాగా కేంద్ర ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా వాక్సినేషన్ అన్నది ప్రభుత్వానికి సంబంధించిన అంశమని, న్యాయ వ్యవస్థ ఇందులోకి రాకుండా ఉంటే మంచిదని స్పష్టం చేసింది. కేంద్రం వాక్సినేషన్ తమ పరిధిలోదని, రాష్ట్రాలకు తామే కేటాయిస్తామని చెప్పిన తర్వాత టీడీపీ వారు తప్పుడు విమర్శలు చేస్తున్నారని తేలిపోయింది. రాష్ట్రాలు నేరుగా కొనుగోలు చేసే పరిస్థితి ఇంకా రాలేదు. చంద్రబాబుకు సన్నిహితుడైన ఒక మీడియా అధిపతికి వియ్యంకుడైన భారత్ బయోటెక్ యజమానితో చెప్పి వాక్సిన్ ఇప్పిస్తే రూ. 1600 కోట్లు చెల్లిస్తామని మంత్రులు సవాల్ చేస్తే మాత్రం చంద్రబాబు స్పందించలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏవైనా లోటుపాట్లు నిజంగా ఉంటే వాటిని సరిచేసుకుంటూ ముందుకు సాగాలి. ఏది ఏమైనా ఏపీ ప్రజలలో కాని , ఇతర రాష్ట్రాలలో కాని జగన్‌కు మంచిపేరే వస్తోంది. ఒక మీడియా సంస్థ జరిపిన సర్వేలో దేశంలోనే రెండో ఉత్తమ ముఖ్యమంత్రిగా జగన్ ఎంపికయ్యారు. అందువల్ల ఆయనపై విమర్శలు చేసినంత మాత్రాన ఏమికాదు. కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
వర్ణ వ్యవస్థను విస్మరిస్తే ఎలా?
రిజర్వేషన్ల ముఖ్య ఉద్దేశం అక్షరానికి ఉన్న శక్తిని అందరికీ పంచడమే. మరాఠాలతోపాటు అన్ని శూద్ర వర్గాలు ఈ అంశంలో వెనుకబడి ఉన్నాయి. ఈ కారణం వల్లనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు విద్యలో రిజర్వేషన్లపై ఉన్న యాభై శాతం గరిష్ట పరిమితిపై పునరాలోచన జరగాలి. దేశంలో కుల, వర్ణ వ్యవస్థలు అంతరించిపోయేంత వరకూ ఈ పరిమితిపై చర్చ కొనసాగాలి. న్యాయస్థానం శక్తి కూడా అక్షరంలోనే ఉంది. అన్ని సామాజిక వర్గాల వారికీ ఈ శక్తి పంపిణీ కూడా అనివార్యం. లేదంటే సామాజిక, సహజ న్యాయ సూత్రాలకు విఘాతం అనివార్యమవుతుంది! మరాఠాలు మహారాష్ట్ర జనాభాలో దాదాపు 30 శాతం వరకూ ఉండే వ్యవసాయాధారిత శూద్ర సామాజిక వర్గం. మహారాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో చాలావరకు మరాఠాలు కొన్ని ఇతర వ్యవసాయాధారిత శూద్ర సామాజిక వర్గాల సంక్షేమంపై ఆధారపడి ఉంటుంది. ఇంతటి కీలకమైన సామాజిక వర్గానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 16 శాతం రిజర్వేషన్‌ను సుప్రీంకోర్టు ఇటీవలే కొట్టివేసింది. 1992 నాటి మండల్ కేసు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు అన్నీ 50 శాతం వరకూ ఉండాల్సి ఉండగా.. మరాఠాలకు దీనికంటే ఎక్కువగా కోటా ఇచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అసాధారణ పరిస్థితులేవీ చూపించలేదని ఐదుగురు సభ్యులు సుప్రీంకోర్టు ధర్మాసనం తన తీర్పులో వ్యాఖ్యానించింది. అయితే కోర్టు కుల–వర్ణ వ్యవస్థలను పరిగణనలోకి తీసుకోలేదు. మరాఠాల్లాంటి వ్యవసాయాధారిత సామాజిక వర్గాల విషయంలోనూ ఈ కుల – వర్ణ వ్యవస్థ సమానత్వ సూత్రాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంటుంది. కేంద్రంలో భారతీయ జనతాపార్టీ 2014 నుంచి అధికారంలో ఉన్నప్పటికీ తాము ఇంకా అసమానత బాధితులుగానే మిగిలి ఉన్నామన్న విషయం మరాఠాలకు ఇప్పటికే బోధపడి ఉంటుంది. అఖిల భారత సర్వీసుల్లో కానీ, రాష్ట్ర సర్వీసుల్లో కానీ వీరు శూద్రేతర అగ్రవర్ణాలైన ద్విజులతో వీరు పోటీ పడే పరిస్థితి లేదు. సామాజికంగా ఆర్థికంగా వృద్ధిలోకి వచ్చేందుకు ఉన్న అవకాశాల్లో ఇవి ముఖ్యమైనవి. మరాఠాల మాదిరిగానే భారత్‌లో వ్యవసాయాధారిత శూద్రులైన జాట్లు, గుజ్జర్లు, పటేల్స్, రెడ్లు, కమ్మలు, నాయర్లు 1992లో వెనుకబడిన కులాల జాబితాలో చేరే నిర్ణయం తీసుకోలేదు. కానీ చారిత్రకంగా సంస్కృత, పార్శీ, ఇంగ్లిషు విద్యాభ్యాసాన్ని చాలాకాలంగా కలిగి ఉన్న బ్రాహ్మణులు, కాయస్తులు, ఖాత్రీలు, క్షత్రియులు, బనియాలతో తాము పోటీ పడలేమని ఇప్పుడు వీరిలో చాలామంది గ్రహిస్తున్నారు. మహారాష్ట్రలో హిందూత్వ ఉద్యమం వైపు జన సామాన్యం ఆకర్షితమయ్యేలా చేయగలిగిన మరాఠాలు ఆర్ఎస్ఎస్/బీజేపీ అధికారం చేపడితే ఢిల్లీలో తమకు అధికార ఫలాలు కొన్నైనా దక్కుతాయని ఆశపడినా.. వారి ఆశలు నిరాశలుగానే మిగిలిపోయాయి. ఢిల్లీ, అధికారం, తమకింకా దూరంగానే ఉందని మరాఠాలు అర్థం చేసుకున్నట్లుగా అనిపిస్తోంది. తమ ప్రాభవమంతా మహారాష్ట్రకే పరిమితమని మరాఠాలు మాత్రమే కాదు... మండల్ జాబితాలోకి చేరిన పలు వ్యవసాయాధారిత శూద్ర సామాజిక వర్గాలూ స్పష్టమైన అంచనాకు వచ్చాయి. మహారాష్ట్ర, గుజరాత్‌లుగా విడిపోక ముందు ఉన్న స్టేట్ ఆఫ్ బాంబే నుంచి బ్రాహ్మణులు, బనియాలు జాతీయ నేతలు, ఉన్నత ప్రభుత్వ అధికారులు, శాస్త్రవేత్తలు, మేధావులు చాలామంది జాతీయ స్థాయికి చేరినా మరాఠాలకు మాత్రం ఢిల్లీ అధికారంలో తమ వంతు భాగం దక్కలేదు. శూద్రుల్లో సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ పాటిదార్ సామాజిక వర్గం నుంచి జాతీయ స్థాయి నేతగా ఎదిగినా మరాఠాలు మాత్రం దాదాపుగా లేరనే చెప్పాలి. స్వాతంత్య్ర ఉద్యమ కాలంలోనే కాకుండా ఆ తరువాత కూడా తమ వర్గం నుంచి ఎవరినీ ఎదగకుండా ద్విజులు అడ్డుకున్నారని ఇప్పుడు మరాఠాలు భావిస్తున్నారు. వ్యవసాయం, అనుబంధ వ్యాపారాలకు, స్థానికంగానే అధికారాలకు తమను పరిమితం చేసి హిందూ సమైక్యత పేరుతో తమను మైనార్టీలపై కండబలం చూపించే సాధనాలుగా ఆర్ఎస్ఎస్ వాడుకుంటోందన్నది కూడా వీరి అంతరంగం. ఇంగ్లిషు విద్యాభ్యాసమున్న ఉన్నతస్థాయి జాతీయ నేతలు, మేధావులను తయారు చేసుకోవడంలోనూ మరాఠాలు అంతగా విజయం సాధించలేదు. విద్యాభ్యాసం పరంగా వీరందరూ వెనుకబడి ఉన్నారన్నది దీని ద్వారా తేటతెల్లమవుతుంది. చారిత్రకంగానూ శూద్రులు సంస్కృతం చదివేందుకు రాసేందుకు అడ్డంకులు ఉండేవన్నది తెలిసిందే. ముస్లింల పాలనలో పార్శీ విద్యాభ్యాసం విషయంలోనూ ఇదే తంతు కొనసాగింది. అలాగే ఆధునిక ఇంగ్లిషు విద్యకూ మరాఠాలూ దూరంగానే ఉండిపోయారు. ప్రాంతీయ శూద్రులందరిలోనూ ఈ చట్రం నుంచి తప్పించుకోగలిగిన అదృష్టవంతులు కేరళకు చెందిన నాయర్లు మాత్రమే! సుప్రీం ఆలోచన మారాలి... సమానత్వమన్న భావనను ముందుకు తీసుకెళ్లాలంటే కుల వ్యవస్థ తాలూకూ చరిత్ర మొత్తాన్ని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. శూద్రుల్లోని కొన్ని వర్ణాల వారు ఇప్పటికీ ద్విజుల కంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నా ఆలిండియా సర్వీసుల్లో వారితో సమానంగా ఎందుకు పోటీ పడలేక పోతున్నారన్నది ఇది మాత్రమే వివరించగలదు. చరిత్ర శూద్రులపై మోపిన అతిపెద్ద భారం ఇది. వారందరూ వ్యవసాయం, కులవృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారన్న విషయాన్ని దేశ ఉన్నత న్యాయస్థానం ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదన్నది ఎలా అర్థం చేసుకోవాలి? భారత సుప్రీంకోర్టు కూడా కమ్యూనిస్టు సిద్ధాంతకర్తలు చేసిన తప్పులే చేయరాదు. వారు భూ యజమానులను మాత్రమే గుర్తిం చారు కానీ.. అక్షరానికి ఉన్న శక్తిని గుర్తించలేకపోయారు. భారత్‌లో శూద్రులకు కొంత భూమి, శ్రమశక్తి ఉన్నప్పటికీ అక్షర శక్తి మాత్రం లేకుండా పోయింది. బ్రిటిష్ పాలనలో బ్రాహ్మణ జమీందారులు శూద్రుల జీవితం మొత్తాన్ని నియంత్రించే శక్తి కలిగి ఉండే వారంటే అతిశయోక్తి కాదు. ఈ రకమైన శక్తి దేశంలోని ఏ ఇతర కులానికీ లేదు. భూమి కలిగి ఉన్న మరాఠాలు కూడా ఈ రకమైన శక్తి కోసం ఆలోచన కూడా చేయలేకపోయారు. ఈ చారిత్రక అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని అత్యున్నత న్యాయస్థానమైనా ఆహారోత్పత్తిలో కీలకమైన కులాల భవిష్యత్తు విషయంలో నిర్ణయాలు తీసుకోవాల్సింది. రిజర్వేషన్ల ముఖ్య ఉద్దేశం అక్షరానికి ఉన్న శక్తిని అందరికీ పంచడమే. మరాఠాలతోపాటు అన్ని శూద్ర వర్గాలు ఈ విషయంలో వెనుకబడి ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఇంగ్లిషు, ఇంగ్లిషు మీడియం విద్యాభ్యాసం విషయాల్లో. అన్ని కేంద్ర, న్యాయ, మీడియా సర్వీసుల్లో అక్షరానికి ఉన్న శక్తి ద్విజులను సానుకూల స్థితిలో నిలబెట్టింది. ఈ కారణం వల్లనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు విద్యలో రిజర్వేషన్లపై ఉన్న యాభై శాతం గరిష్ట పరిమితిపై పునరాలోచన జరగాలి. దేశంలో కుల, వర్ణ వ్యవస్థలు అంతరించిపోయేంత వరకూ ఈ పరిమితిపై చర్చ కొనసాగాలి. కుల వర్ణ వ్యవస్థలను రూపుమాపడం ఇప్పుడు ద్విజులకు మాత్రమే కాదు.. హిందువుల్లోని అన్ని కులాలకు ప్రాతినిథ్యం వహిస్తున్నామని చెప్పుకునే ఆర్ఎస్ఎస్/బీజేపీల చేతుల్లోనే ఉంది. శూద్రులు, దళితులకు ఆధ్యాత్మిక, సామాజిక న్యాయం కల్పించాల్సిన బాధ్యత కూడా వీరిదే. కానీ దురదృష్టవశాత్తూ వీరు ఈ దిశగా పనిచేయడం లేదు. సుప్రీంకోర్టు చట్టపరంగా అమలు చేయగల తీర్పులు ఎన్నో ఇచ్చినప్పటికీ కులాధారిత జనగణనకు మాత్రం ఒప్పుకోవడం లేదు ఎందుకు? ఇదే జరిగితే ప్రతి సంస్థలోనూ కులాల ప్రాతినిథ్యం ఎలా ఉండాలన్న స్పష్టమైన అంచనా ఏర్పడుతుంది కాబట్టి! న్యాయస్థానం శక్తి కూడా అక్షరంలోనే ఉంది. అన్ని సామాజిక వర్గాల వారికీ ఈ శక్తి పంపిణీ కూడా అనివార్యం. లేదంటే సామాజిక, సహజ న్యాయ సూత్రాలకు విఘాతం అనివార్యమవుతుంది! ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
కోవిడ్ సంక్షోభం మన స్వయంకృతం
కరోనా సెకండ్ వేవ్ భారీ స్థాయిలో దాడి చేయనుందని కేంద్ర ప్రభుత్వాన్ని గత మార్చిలోనే హెచ్చరించామని ఇప్పుడు కొందరు సాంక్రమిక వ్యాధుల నిపుణులు చెబుతున్నారు. కానీ తూర్పు భారత్‌కి ఆభరణంలా వెలుగుతున్న పశ్చిమబెంగాల్లో అధికారాన్ని కైవసం చేసుకోవడం అనే ఏకైక లక్ష్యంపైనే బీజేపీ సర్వశక్తులూ కేంద్రీకరించింది. అలాగే ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కుంభమేళాను సంవత్సరం ముందుకు జరిపి మరీ నిర్వహించారు. ఈ కుంభమేళాకు మొత్తం కోటిమంది భక్తులు హాజరుకావడంలో తనకు కలిగే రాజకీయ ప్రయోజనాన్ని బీజేపీ ఏమాత్రం వదిలిపెట్టదల్చుకోలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే కరోనా సెకండ్ వేవ్ ముందు ఇలా చేతులెత్తేయడం మన స్వయంకృతమే. మార్చి 12న ఆస్ట్రేలియా, భారత్, జపాన్, అమెరికాతో కూడిన క్వాడ్ దేశాల ప్రారంభ సదస్సును అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిర్వహించారు. భారత్ నేతృత్వంలోని వ్యాక్సిన్ మైత్రి కార్యక్రమానికి ఆర్థిక సహాయం చేసే విషయంలో తక్కిన మూడు దేశాలు ఆమోదం తెలిపాయని మన విదేశాంగ శాఖ కార్యదర్శి హర్‡్ష శృంగ్లా పేర్కొన్నారు. అయితే బీజేపీ అగ్రనాయకత్వం నిర్దేశకత్వంలో సౌత్ బ్లాక్.. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయడానికి బదులుగా ప్రతిపక్షాలపై మూకుమ్మడి దాడి తలపెట్టడంపైనే తన శక్తులన్నింటినీ కేంద్రీకరించింది. పైగా, 2022లో జరగాల్సిన కుంభమేళాను హిందూ మతాధిపతుల చర్చల అనంతరం సంవత్సరం ముందుకు జరిపి 2021 ఏప్రిల్‌లోనే నిర్వహించారు. ఎన్నికల కమిషన్ మరింత అసంబద్ధంగా వ్యవహరించి అసెంబ్లీ ఎన్నికలను నెలరోజులపాటు వేడుకలాగా జరిపింది. ఇలా భారత్‌పై కరోనా సెకండ్ వేవ్ సంపూర్ణంగా దాడి చేయడానికి అన్నివిధాలా రంగం సిద్ధం చేసి పెట్టారు. దాని ఫలితాన్ని మనందరం చూస్తున్నాం. కరోనా సెకండ్ వేవ్ భారీ స్థాయిలో దాడి చేయనుందని ప్రభుత్వాన్ని గత మార్చిలోనే హెచ్చరించామని ఇప్పుడు కొందరు సాంక్రమిక వ్యాధుల నిపుణులు చెబుతున్నారు. కానీ పశ్చిమబెంగాల్లో అధికారాన్ని కైవసం చేసుకోవడం అనే లక్ష్యంపైనే బీజేపీ కేంద్రీకరించింది. అలాగే ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కుంభమేళాను సంవత్సరం ముందుకు జరిపి మరీ నిర్వహించారు. ఈ కుంభమేళాకు మొత్తం కోటిమంది భక్తులు హాజరుకావడంలో తనకు కలిగే రాజకీయ ప్రయోజనాన్ని బీజేపీ ఏమాత్రం వదిలిపెట్టదల్చుకోలేదు. సైంటిస్టుల హెచ్చరికలు, సోషల్ మీడియా పోస్టులు లేదా ప్రముఖ అంతర్జాతీయ పత్రికల్లో కరోనా ప్రమాదం గురించిన వార్తలు తమ చెవినపడని రీతిలో బీజేపీ అగ్రనాయకత్వం బబుల్‌లో దాక్కుండి పోయిందా అనే ప్రశ్న తలెత్తుతోంది. నిజం చెప్పాలంటే ఇప్పుడు గ్లోబల్ కోవిడ్ హబ్‌గా భారత్ ప్రపంచదేశాల ముందు అవమానకరంగా నిలబడింది. భారత్ నుంచి పరోక్ష మార్గాల ద్వారా ఆస్ట్రేలియాలో అడుగుపెట్టాలని ప్రయత్నించే సొంత పౌరులను కూడా జైల్లో పెడతానని క్వాడ్ సభ్యదేశమైన ఆస్ట్రేలియా హెచ్చరించడం కేంద్ర ప్రభుత్వానికి పుండుమీద కారం రాసినట్లయింది. లక్షలాదిమంది కరోనా బారిన పడుతుండటం, వేలాదిమంది మరణించడం, ఆసుపత్రుల్లో ప్రవేశానికి కూడా తావు లేకపోవడం, ఆసుపత్రుల్లో చేరినవారు ఆక్సిజన్ కొరతతో కుప్పగూలిపోవడం వంటి భారత్ గురించిన భీతి కలిగించే వార్తలు ప్రపంచమంతా వ్యాప్తి చెందాయి. వినియోగంలో లేని లక్షలాది ఆస్ట్రాజెనెకా టీకా డోసులు అమెరికన్ వేర్ హౌస్‌లలో వృథాగా పడి ఉంటున్నప్పటికీ భారత్‌కు ఒక్క టీకా కూడా ఇవ్వకుండా మోచేయిని అడ్డుతున్న అమెరికాతో మనకు భాగస్వామ్య ఒప్పందాలు అవసరమా అంటూ దేశీయంగా తీవ్రంగా ప్రశ్నలు మొదలయ్యాయి. మరోవైపున దేశీయంగా ప్రజలను గాలికి వదిలిపెట్టిన భారత జాతీయవాద ప్రభుత్వం.. గొప్పలు చెబుతూ కోట్లాది వ్యాక్సిన్ డోసులను అభివృద్ధి చెందుతున్న దేశాలకు పంపడంపై చాలామంది మండిపడుతున్నారు. పైగా ప్రస్తుత సంక్షోభాన్ని జాతీయ సంక్షోభంగా గుర్తించడానికి, ప్రకటించడానికి కూడా వెనుకాడుతున్న కేంద్రప్రభుత్వం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు అమిత ప్రాధాన్యం ఇవ్వడం దేశప్రజలను మండిస్తోంది. చివరగా, ఏప్రిల్ 25న అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివాన్ ట్వీట్ చేస్తూ, భారత్‌కు మరిన్ని సరఫరాలను, వ్యాక్సిన్ వనరులను పంపుతామని వాగ్దానం చేశారు. కొత్త కరోనా వైరస్ ప్రభంజనాన్ని తట్టుకోవడంలో భారత్ సిద్ధం కాలేకపోయిందని గ్రహించిన ఇతర దేశాలు కూడా ఇప్పుడు మనకు సహాయం చేస్తామని చెబుతున్నాయి. గత సంవత్సరం కరోనా తొలి వేవ్ సందర్భంగా సీరో–సర్వేలను ఆమోదించడంలో భారత రాజకీయ నాయకత్వం కుప్పిగంతులు వేయడంతో భారత్ పాక్షికతతో వ్యవహరిస్తోందని నిపుణులు నిర్ధారించారు. పైగా వ్యాక్సినేషన్ కూడా ప్రారంభం కావడంతో ఇకపై ఎలాంటి వేవ్ వచ్చినా సరే భారత్ దాన్ని అధిగమించి ముందంజలో ఉంటుందని మన విధాన నిర్ణేతలు భావించారు. 2001లో, భుజ్ భూకంపం తర్వాత, అబు దుబాయిలో భారత రాయబారిగా ఉన్న నేను అక్కడి భారతీయ కమ్యూనిటీ నుంచి సహాయ సామగ్రిని సేకరించి అహమ్మదాబాద్‌కు విమానంలో తీసుకుపోయాను. కానీ అలాంటి సహాయాన్ని కూడా తక్షణం బాధితులకు అందించడం చాలా కష్టమైపోయింది. ఇప్పుడు 17 ఏళ్ల తర్వాత 40 దేశాలనుంచి భారత్ అంతర్జాతీయ సహాయాన్ని ఆమోదిస్తోంది. ప్రతి దేశం విభిన్నమైన వైద్య సామగ్రిని, మందులను భారత్‌కు పంపిస్తున్నాయి కానీ, కొన్ని దేశాలు ఇంగ్లీషు భాషలో కాకుండా తమ సొంత బాషల్లో ముద్రించిన ప్యాకింగ్‌లను పంపించడంతో వాటిని భారత్‌లో ప్రజలు వినియోగించడం చాలా కష్టమవుతోంది. ఇక చైనా తనవంతుగా గత రెండువారాలుగా భారత్‌కు 5,000 వెంటిలేటర్లు, 21,569 ఆక్సిజన్ తయారీ యంత్రాలను, 3,800 టన్నుల మందులను 61 విమానాల్లో పంపించినట్లు ప్రకటించుకుంది. లద్దాఖ్‌లో ఇప్పటికీ తన బలగాలను ఉపసంహరించుకోని చైనానుంచి అలాంటి సహాయం వస్తోందని ప్రకటించడానికి కూడా భారత్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా ఉంటోంది. అదే సమయంలో చాలా ఆలస్యంగా భారత్‌కు సహాయం పంపుతానని ప్రకటించిన అమెరికాను.. చైనా ప్రభుత్వం గేలి చేస్తోంది. పైగా అత్యవసరమైన సహాయ సామగ్రిని పంపిణీ చేసే విషయంలో కేంద్రంలోని బీజేపీ నాయకత్వానికి, వివిధ రాష్ట్రాల్లో ప్రతిపక్షాల నాయకత్వంలోని ప్రభుత్వాలకు మధ్య వివాదాలు పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా పశ్చిమబెంగాల్లో బీజేపీ ఆశలు భగ్నమైన నేపథ్యంలో బీజేపీయేతర ప్రతిపక్ష ప్రభుత్వాలు కేందాన్ని వేలెత్తి చూపుతున్నాయి. కరోనా మహమ్మారి బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో ఆక్సిజన్ ఉత్పత్తి విభాగాలను, కాన్సంట్రేటర్లను, వెంటిలేటర్లు, యాంటీ వైరల్ డ్రగ్స్ వంటివాటిని పంపిణీ చేయడాన్ని అత్యంత సమర్థవంతంగా, సమాన ప్రాతిపదికపై నిర్వర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రక్రియ పనిచేయడానికే కొన్ని రోజుల సమయం పడుతోంది. ప్రారంభంలో కరోనా వ్యతిరేక సామగ్రిని దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ఔషధ సంస్థలకు వేగంగా పంపిస్తూ వచ్చారు. అయితే కేంద్రం పంపిణీ చేస్తున్న విధానాలపై రోజువారీగా వివరించడంలో పారదర్శకతను పాటించాల్సి ఉంటుంది. ఈలోగా ప్రత్యేకించి ఢిల్లీ వంటి కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడుతున్న నగరాలకు ఆక్సిజన్ ఉత్పత్తి విభాగాల సరఫరాను ఏ ప్రాతిపదికన చేస్తున్నారో చెప్పాలంటూ వివిధ న్యాయస్థానాలు కేంద్రాన్ని నిలదీయటం ప్రారంభించాయి. కోవిడ్–19 వ్యాక్సినేషన్‌పై మేధో సంపత్తి హక్కుల రక్షణను ఎత్తివేయాలని భారత్ చేస్తూ వస్తున్న డిమాండును శుక్రవారం రాత్రి అమెరికా ప్రభుత్వం బలపర్చింది. భారత్ ఈ చిరకాల డిమాండ్ సాధ్యమైతే వర్థమాన దేశాలకు ఇది అతిపెద్ద విజయం అవుతుంది. కాబట్టి కరోనా సంక్షోభంపై భారత్ మార్గం స్పష్టమైపోయింది. ఒకటి ఆసుపత్రులకు తక్షణం వైద్యసామగ్రిని సరఫరా చేయడం, రోగులందరికీ చికిత్స అందించడం. ఇక రెండోది. సకాలంలో వ్యాక్సిన్‌ని అందించేలా తయారీ సంస్థలను త్వరపెట్టడం. మూడు. కేంద్రం తనకు, రాష్ట్రాలకు, ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా ఒకే ధరతో వ్యాక్సిన్ అందించేలా సేకరణ విధానాన్ని రూపొందించుకోవాలి. నాలుగు. డబ్ల్యూటీవో మేధోసంపత్తి హక్కులపై రక్షణను ఎత్తివేసిన వెంటనే వ్యాక్సిన్‌ను భారీ స్థాయిలో ఉత్పత్తి చేసి సరఫరా చేయడానికి సిద్ధమవడం. దీనికోసం ఇప్పటికే మూతపడిన ప్రభుత్వ రంగ సంస్థల విభాగాలను మళ్లీ ఉపయోగించుకోవాలి. కె.సి. సింగ్ వ్యాసకర్త ఇరాన్లో భారత్ మాజీ రాయబారి -
ఈ విజయం.. విశ్వసనీయతకు చిహ్నం
ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ తిరుపతి ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విస్తృతంగా ప్రచారం చేశారు. వైఎస్సార్ సీపీ మెజార్టీని ఎంత వీలైతే అంతకు తగ్గించగలిగితే, ప్రజలలో అధికారపార్టీపై వ్యతిరేకత ఏర్పడిందని ప్రచారం చేయవచ్చని వారనుకున్నారు. కానీ అది సాధ్యపడలేదు. పైగా మెజార్టీ పెరిగింది. మతపరంగా రాజకీయాలు చేయడానికి, అసందర్భ ఆరోపణలు చేయడానికి టీడీపీ పూనుకున్నా.. ప్రజలు తమ మనోగతం ఏమిటో తెలిపారు. ఒక్కమాటలో చెప్పాలంటే తమ శ్రేయస్సుకోసం పనిచేస్తున్న పార్టీపై, దాని అధినేతపై ఏపీ ప్రజలు పెట్టుకున్న విశ్వాసానికి ఈ విజయం తిరుగులేని సంకేతం. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం ఉపఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిందా? లేదా? ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తాను ఓడిపోయినా, వైసీపీకి ఐదు లక్షల మెజార్టీ రాలేదని సంతోషపడుతున్నట్లుగా ఉంది. సీఎం జగన్ రెండేళ్ల పాలనకు అనుకూలంగా ప్రజలు ఇచ్చిన తీర్పుగా కూడా ఈ ఉపఎన్నిక ఫలితాన్ని తీసుకోవచ్చు. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంలో ఎప్పుడూ ఐదు లక్షల మెజార్టీతో ఎవరూ గెలవలేదు. కానీ ఇప్పుడు వైఎస్సార్ సీపీ అభ్యర్థ్దిగా పోటీచేసిన ఒక సాధారణ వైద్యుడు డాక్టర్ గురుమూర్తి గతంలో తిరుపతిలో ఎన్నడూ లేనంత మెజార్టీతో విజయం సాధించారు. 1952లో ఏర్పడిన ఈ నియోజకవర్గానికి ఈ ఉపఎన్నికతో సహా మొత్తం పదిహేడుసార్లు ఎన్నికలు జరిగితే ఈసారే అత్యధిక మెజార్టీ వచ్చింది. ఇక్కడ మరో విశేషం ఉంది. 2019 లోక్‌సభ సాధారణ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాదరావు 2.28 లక్షలకు పైగా మెజార్టీతో గెలిచారు. అంతకుముందు జరిగిన ఎన్నికల కన్నా అదే అత్యధికం. ప్రస్తుతం జరిగిన ఉప ఎన్నికలో అంతకన్నా ఎక్కువగా 2.70 లక్షల ఓట్ల ఆధిక్యతతో వైఎస్సార్ సీపీ గెలిచింది. అంటే సగటున ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్లో నలభై వేల ఓట్ల ఆధిక్యత వచ్చిందన్నమాట. అంతేకాదు. ఓట్ల శాతాలను పరిగణనలోకి తీసుకున్నా గతంలో వైఎస్సార్ సీపీకి ఏభై శాతం లోపు మెజార్టీ రాగా, ఈసారి ఏభై ఆరు శాతం ఓట్లు వచ్చాయి. అంటే ఆరు శాతం పెరిగాయన్నమాట. మరి అదే సమయంలో ప్రతిపక్ష టీడీపీ గత లోక్‌సభ ఎన్నికలలో 37 శాతం ఓట్లు సాధించగా, ఈ ఉపఎన్నికలో 32 శాతం ఓట్లనే తెచ్చుకుంది. నిజానికి ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే అధికార పార్టీ గెలిచినా మెజార్టీతో పాటు ఓట్లశాతం తగ్గుతుంది. అలాగే ప్రతిపక్షం గట్టి పోటీఇస్తే దాని ఓట్ల శాతం పెరుగుతుంది. కాని ఇక్కడ రివర్స్‌లో జరిగింది. అందువల్ల తెలుగుదేశం పార్టీ ఏదో రకంగా కవర్ చేసుకునేందుకు వైఎస్సార్ సీపీ నేతలు చెప్పినంతగా మెజార్టీ రాలేదని సంతోషపడవచ్చు. కానీ దానివల్ల కలిగే ప్రయోజనం లేదు.కాకపోతే తన వర్గం మీడియాలో టీడీపీ ఓటమి గురించి కాకుండా వైఎస్సార్ సీపీ మెజార్టీ గురించి మాట్లాడుకునేలా చేయాలన్న ఎత్తుగడలు కావచ్చు. 1991లో కర్నూలు లోక్‌సభ ఎన్నికల్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డికి 54 వేల పైచిలుకు ఓట్లు వస్తే, ఆయన ఉమ్మడి ఏపీ సీఎం అయిన తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేశారు. 1993లో ఆ స్థానంలోనే పోటీ చేసిన కోట్ల తనయుడు సూర్యప్రకాశ్ రెడ్డి కేవలం 20 వేల లోపు మెజార్టీతో గెలిచారు. నాటి అధికార పార్టీపై వ్యతిరేకతకు అది గుర్తు. కానీ తిరుపతి లోక్‌సభ స్థానానికి తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో 2019లో కన్నా ఇప్పుడు ఏభైవేలకు పైగా ఓట్ల మెజార్టీ పెరిగింది. కాగా తిరుపతిలో ఆరుసార్లు గెలిచి కేంద్రంలో మంత్రిగా పనిచేసిన చింతా మోహన్‌కు ఈ ఉప ఎన్నికలో పదివేల ఓట్లు కూడా రాలేదు. నోటా కంటే తక్కువగా వచ్చాయి. ఇక బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థ్ధిగా వచ్చిన కర్ణాటక మాజీ ఛీ‹ఫ్ సెక్రటరీ రత్నప్రభ సుమారు అరవై వేల ఓట్లు పొంది డిపాజిట్ కోల్పోయారు. నిజానికి ఈ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సామాజికవర్గానికి చెందినవారు కానీ, ఆయన అభిమానులు కానీ గణనీయంగానే ఉన్నారు. పవన్ కళ్యాణ్ పార్టీ రీత్యా బీజేపీతో పొత్తు పెట్టుకున్నా, ఆయన మనసు మాత్రం చంద్రబాబు వైపే ఉందన్నది ఎక్కువ మంది భావన. దానికి తగ్గట్లుగానే జనసేన అభిమానులు కొంత శాతం మంది టీడీపీకి వేసి ఉండవచ్చు. అందువల్లే టీడీపీకి ఆ మాత్రం ఓట్లు అయినా వచ్చాయని మరో విశ్లేషణ కూడా లేకపోలేదు. చీఫ్ సెక్రటరీ హోదాలో పనిచేసిన రత్నప్రభను బీజేపీ పక్షాన రంగంలో దించి ఆమెను కూడా రాజకీయంగా బలిచేసినట్లయింది. సునీల్ దేవ్‌ధర్ వంటివారు మతపరంగా వైషమ్యాలు పెంచేందుకు ఇక్కడ ప్రయత్నం చేసినా ప్రజలు తగురీతిలో జవాబు ఇచ్చారు. ఏíపీలో వ్యూహాత్మకంగా బీజేపీ ఇంకా పరిణితి చెందలేదని ఈ ఉప ఎన్నిక స్పష్టం చేసింది. ఇక తెలుగుదేశం పార్టీ గురించి పరిశీలిస్తే గతంలో కన్నా తక్కువ శాతం ఓట్లు రావడం ఆ పార్టీ ఇంకా కష్టాల నుంచి బయటపడలేదని అర్థం చేసుకోవచ్చు. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి మొదటి నుంచి అనాసక్తిగానే ఉన్నారు. అయినా టీడీపీ ఒత్తిడితో మళ్లీ రంగంలో దిగారు. ఆమెకు ఈ సీటులో గెలవడం అసాధ్యమన్న సంగతి తెలియకకాదు. కానీ ఎన్నికల వ్యయం అంతా పార్టీ నాయకత్వం పెట్టుకునే కండిషన్‌తో పోటీకి ఒప్పుకున్నారని అంటున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ తిరుపతి ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విస్తృతంగా ప్రచారం చేశారు. వారు కూడా వైఎస్సార్ సీపీ మెజార్టీని ఎంత వీలైతే అంత, ముఖ్యంగా 2019 నాటి మెజార్టీ కన్నా తగ్గించగలిగితే, ప్రజ లలో అధికారపార్టీపై వ్యతిరేకత ఏర్పడిందని ప్రచారం చేయవచ్చని అనుకున్నారు. కానీ అది సాధ్యపడలేదు. పైగా మెజార్టీ పెరిగింది. టీడీపీ కూడా మతపరంగా రాజకీయాలు చేయడానికి, పలురకాల పిచ్చి ఆరోపణలు చేయడానికి ఎక్కడా సిగ్గుపడలేదు. ప్రజలు తమ మనోగతం ఏమిటో తెలిపారు. అయినా టీడీపీ తన వైఖరి మార్చుకుని నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండడానికి సిద్ధపడుతున్నట్లుగా లేదు. కేవలం ఒక విధ్వంసకర పాత్ర పోషిస్తూ, మీడియాపరంగా మాత్రం ప్రచారం చేసుకుంటూ కాలం గడుపుతోంది. టీడీపీ ధోరణి ఇలాగే కొనసాగితే 2024 ఎన్నికలలో వైఎస్సార్ సీపీని ఎదుర్కోవడం కష్టమేనని చెప్పవచ్చు. నాయకత్వ స్థాయిలో టీడీపీ సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. ముందుగా దాని నుంచి అది బయటపడవలసి ఉంది. ఉప ఎన్నికలలో ఓట్ల కొనుగోలు, మద్యం పంపిణీ వంటివి చేయరాదని పార్టీ నేతలకు జగన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దానికి తోడు కరోనా సమస్య ప్రజలను భయపెట్టింది. ఈ కారణాల వల్ల ఉప ఎన్నికలో పోల్ అయిన ఓట్ల శాతం గణనీయంగా తగ్గింది. కానీ గతంలోకంటే ఈసారి అధిక మెజార్టీ సాధించడం ఆ పార్టీకి సంతోషం కలిగించే అంశమే. అంతేకాక జగన్ తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంలో ప్రచార సభ నిర్వహించాలని అనుకున్నా, కరోనా పరిస్థితిలో తాను సభ పెడితే, పెద్ద సంఖ్యలో జనం వస్తే, కరోనా కేసులు పెరగవచ్చని ఆయన భావించి సభను రద్దు చేసుకున్నారు. తద్వారా దేశవ్యాప్తంగా ఆయనకు మంచి పేరు వచ్చింది. ఏతావాతా ఏభై ఆరు శాతం ఓట్ల మెజార్టీతో వైఎస్సార్ సీపీ గెలవడానికి నిర్దిష్ట కారణాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి జగన్ పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుండడం, వలంటీర్ల వ్యవస్థ, గ్రామ,వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల ఇళ్ల వద్దకే పరిపాలనను అందించడం, వృద్ధాప్య పెన్షన్లు ఇంటి వద్దే ఇవ్వడం, అమ్మ ఒడి, చేయూత తదితర స్కీములు పేదలకు బాగా ఉపయోగపడటం, కరోనా సమస్య తీవ్రంగా ఉన్న సమయంలో లాక్డౌన్లతో ప్రజల ఆర్థిక సంక్షోభంలో పడినప్పుడు జగన్ చేసిన ఆర్థ్దిక సాయం పేదలకు కొండంత భరోసా ఇచ్చింది. ఇలాంటి పలు కారణాల వల్ల జగన్ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నిత్యం వైఎస్ జగన్‌పై ఉన్నవి, లేనివి అసత్య ప్రచారం చేసినా ఆయనను జనం నమ్మడం లేదని కూడా రుజువు అయింది. ఏది ఏమైనా తనకు వచ్చిన మెజార్టీతో సంతృప్తి చెందక వైíసీపీ మరింత గట్టిగా పనిచేయవలసి ఉండగా, టీడీపీ ఇంతవరకు కోల్పోయిన విశ్వసనీయతను పునరుద్ధరించుకోడానికి తంటాలు పడాల్సి ఉంటుంది. కానీ చంద్రబాబు విశ్వసనీయత కన్నా, వేరే అంశాలకే ప్రాధాన్యం ఇచ్చినంతకాలం ఆయనను జనం నమ్మరు. అదే సమయంలో జగన్ విశ్వసనీయతకు మారుపేరుగా నిలబడడం ఆయనకు శ్రీరామరక్షగా ఉంటుందని చెప్పాలి. కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
ఈ ఫలితాలు కారుచీకట్లో కాంతిరేఖలు
ఆధునిక కాలంలో ఒక రాజకీయ అశ్వమేధ యజ్ఞం భగ్నమైంది. ఒక ఇంద్రజాల ప్రదర్శన మధ్యలోనే విచ్ఛిన్నమైపోయింది. అధికారం కోసం ఇంత తీవ్రాతితీవ్రమైన ప్రయత్నం ఈ మధ్యకాలంలో ఏ రాష్ట్రంలోనూ జరిగి ఉండదు. బీజేపీ తన ఆధిపత్యాన్ని స్థిరపర్చుకోవాలంటే బెంగాల్ ఆ పార్టీ దాటవలసిన చివరి సరిహద్దుగా ఉండింది. అందుకే డబ్బు, మీడియా, సంస్థాగత యంత్రాంగం, చివరకు నరేంద్ర మోదీ.. ఇలా దేన్నీ, ఎవరినీ బీజేపీ వదిలిపెట్టకుండా రంగంలోకి దింపింది. కానీ బీజేపీని బెంగాల్లో ప్రజలు ఓడించారు. ఘోరావమానాల పాలు చేశారు. ఈసారి తీర్పు భిన్నమైంది. ప్రతిపక్షాలకు ఇది ఒక మార్గాన్ని చూపింది. ఏం చేయకూడదు అని గుర్తించినట్లయితేనే మనం ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోగలం. ఎట్టకేలకు ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. ఈ చీకటి దినాల్లో తప్పనిసరిగా అవసరమైన ప్రారంభం ఇది. ఏం చేయకూడదు అని మనం గుర్తించినట్లయితేనే మనం ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోగలం. సాధారణ ఎన్నికల రాజకీయాల గణాంకాలను దాటి చూస్తే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పు నిజంగానే అద్భుతమని చెప్పాలి. సాధారణ సమయాల్లో ఒక జనరంజక ముఖ్యమంత్రి మూడోసారి కూడా అధికారంలోకి రావడం గొప్ప విశేషమేమీ కాదు. కానీ బీజేపీ ఓటు షేర్ పెరగడం గొప్ప ముందంజ గానే గుర్తించాల్సి ఉంటుంది. ముగ్గురు ఎమ్మెల్యేలను మాత్రమే కలిగివున్న ఒక రాజ కీయ పార్టీ నిజమైన ప్రతిపక్ష పార్టీగా అవతరించడంపై వేడుకలు జరుపుకోవడాన్ని పూర్తిగా సమర్థించవచ్చు. కాని ఇది సాధారణ ఎన్నికలు కావు. అధికారాన్ని కొల్లగట్టడానికి ఇంత తీవ్రాతితీవ్రమైన ప్రయత్నం ఈ మధ్యకాలంలో ఏ రాష్ట్రం లోనూ జరిగి ఉండదు. బీజేపీ తన ఆధిపత్యాన్ని స్థిరపర్చుకోవాలంటే బెంగాల్ ఆ పార్టీ దాటవలసిన చివరి సరిహద్దుగా ఉండింది. అందుకే సర్వతోముఖ దాడి ప్రారంభించడానికి బీజేపీ పశ్చిమ బెంగాల్ ఎన్నికలను ఎంచుకుంది. డబ్బు, మీడియా, సంస్థాగత యంత్రాంగం, చివరకు నరేంద్ర మోదీ.. ఇలా దేన్నీ, ఎవరినీ బీజేపీ వదిలిపెట్టకుండా రంగంలోకి దింపింది. ఎన్నికల కమిషన్‌కు ఉన్న పవిత్రత నుంచి, కేంద్ర భద్రతా బలగాల తటస్థత, కోవిడ్ నిబంధనల వరకు ప్రతి అంశాన్ని బీజేపీ తనకు అనుకూలంగా మల్చుకుంది. బీజేపీ నేతలు తమ విజయాలను ఏకరువు పెట్టడం బెంగాల్ ఎన్నికల్లో జరిగినట్లుగా ఎక్కడా జరగలేదు. అయినప్పటికీ బీజేపీని బెంగాల్లో ప్రజలు ఓడించారు. ఘోరావమానాల పాలు చేశారు. ఆధునిక కాలంలో ఒక రాజకీయ అశ్వమేధ యజ్ఞం భగ్నమైంది. ఒక ఇంద్రజాల ప్రదర్శన మధ్యలోనే విచ్ఛిన్నమైపోయింది. బెంగాల్‌ని బీజేపీ కనుక కైవసం చేసుకుని ఉంటే ఏం జరిగి ఉండేదో కాస్త ఊహించండి మరి. వేడుకలు, విజయధ్వానాలు మరోవైపు ప్రతిపక్షంలో భయాందోళనలు.. కాని మన గణతంత్ర ప్రజాస్వామ్యం ఒక్క రోజులోనే తన స్థానాన్ని, ఔన్నత్యాన్ని గొప్పగా ప్రకటించుకుంది. కేంద్రపాలకులకు ఇంత భంగపాటు కలగడంతో అనూహ్య అవకాశాలకు వీలుకల్పించినట్లయింది. మనం ఇప్పుడు కరోనా మహమ్మారి సుడిగుండంలో ఎంతగా చిక్కుకుపోయామంటే, మోదీ వీర భక్తాగ్రేసరులు కూడా ప్రస్తుత కేంద్ర పాలనపై అనుమానాస్పద దృష్టితో చూడక తప్పని పరిస్థితి ఏర్పడింది. లాక్డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థ ప్రతిష్టంభన నుంచి ఇంకా మనం బయటపడలేదు. పైగా సెకండ్ వేవ్ సందర్భంగా ఆర్థిక వ్యవస్థ మరింత ఘోరమైన పరిస్థితుల్లో కూరుకుపోవచ్చు. పైగా చారిత్రాత్మక రైతాంగ నిరసనకు మనం సాక్షీభూతులుగా ఉన్నాం. ఇలాంటి నేపథ్యంలో, ఇలాంటి తీర్పు రావడం అనేది ప్రస్తుత కేంద్రపాలకులు అఖండులు, అజేయులు కాదనే సత్యాన్ని తిరుగులేనివిధంగా దేశంముందు నిలి పింది. ఇక కేరళ, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాతీర్పు ప్రతిపక్షాల స్థానాన్ని మరింతగా బలోపేతం చేసింది. గత ఏడేళ్లుగా బానిసత్వంలో మగ్గుతున్న దేశానికి ఈ తీర్పు తిరిగి ఊపిరి పోసినట్లయింది. ఇది మోదీ పాలన అంతానికి నాందీ వాచకం కానుంది. కేంద్రపాలకుల పతనం మొదలు కావచ్చు. కానీ ఈ గొప్ప అవకాశానికి మనం ఎలా స్పందిస్తాం అన్నదాని పైనే ఇది ఆధారపడి ఉంటుంది. ముందుగా ఈ తీర్పు దేనికి వ్యతిరేకమో గుర్తించడం చాలా అవసరం. ఈ తీర్పు మతతత్వ రాజకీయాలకు తిరస్కృతి కాదు. పైగా బీజేపీకి వ్యతిరేకంగా తీవ్ర ఆందోళనతో ఉంటున్న ముస్లిం ఓటర్ల సమీకరణను లౌకిక రాజకీయాలకు సంకేతంగా చెప్పలేం. అలాగే కరోనా మహమ్మారి, లాక్డౌన్ కాలంలో మోదీ ప్రభుత్వం చేసిన అనేక తప్పులకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పు కాదిది. కేరళను మినహాయిస్తే స్వాతంత్య్రానంతర భారతదేశ చరిత్రలో అతిపెద్ద ప్రజారోగ్య సంక్షోభం ఏ రాష్ట్రంలోనూ ఎన్నికల అంశంగా కాలేదు. పెద్దనోట్ల రద్దు ఉదంతంలో లాగే ప్రజలు తమ ఆర్థిక బాధల పర్యవసానాలకు కారణాలపై ఇంకా అనుసంధానం కాలేదు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్థిక విధానాల అసమర్థతపై కూడా ప్రజలు పెద్దగా దృష్టి పెట్టలేదు. కేరళలో ఎల్డీఎఫ్ విజయం అనేది వామపక్ష భావజాలం పట్ల విస్తృత ప్రజానీకం ఆమోదం అని చెప్పడానికి వీల్లేదు. అలాగే బీజేపీకి వ్యతిరేక ప్రచారంలో రైతు సంఘాలు తీవ్ర ప్రయత్నం చేసినప్పటికీ, కేంద్ర ప్రభుత్వ నూతన వ్యవసాయ విధానాల పట్ల రైతుల వ్యతిరేకతను కూడా ఈ తీర్పు పెద్దగా ప్రతిబింబించలేదు. అయినా సరే.. ఈ అసాధారణ అవకాశాన్ని మనం వినయపూర్వకంగానే అంగీకరించాల్సి ఉంది. ప్రజాస్వామ్య పునరుద్ధరణకు చెందిన విజయగాధగా చెప్పడానికి వీల్లేని అనేకానేక రోజువారీ సంభవించే కారణాల ప్రతిఫలనంగానే బీజేపీ ప్రస్తుత తిరోగమనం సంభవించింది. బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో ప్రస్తుత ముఖ్యమంత్రులకున్న ప్రజాదరణ ఒక కీలకాంశంగా పనిచేసింది. కానీ ఇది సుపరిపాలనపై ప్రజాతీర్పు కాదు. అదే నిజమైతే తమిళనాడులో ఏఐడీఎంకే చిత్తుగా ఓడిపోవలసి ఉండాలి. అలాగే అస్సోంలో సోనోవాల్ ప్రభుత్వం కూడా మళ్లీ అధికారంలోకి వచ్చి ఉండేది కాదు. అలాగే మమతా బెనర్జీ పాలనా రికార్డుకూడా తగుమాత్రమే ప్రభావం చూపింది. పశ్చిమ బెంగాల్లో, అస్సోంలో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ విజయానికి నిర్దిష్టమైన ఎన్నికల నిర్వహణే కీలకపాత్ర పోషించింది. ఈ అవకాశం ఎవరికి సంబంధించనిది అనే అర్థ సత్యాన్ని మనం బహిరంగంగా అంగీకరించాల్సిన సమయం ఇది. మమతా బెనర్జీ లేక ప్రశాంత్ కిషోర్, పినరయి విజయన్ లేక సీపీఎం, హేమంతా బిశ్వాస్ శర్మ లేదా సోనోవాల్.. ఇలా ఈ ఎన్నికల్లో ఎవరు విజేతలు అనే అంశంపై చాలా మంది తామే కారణమని ప్రకటించుకోవచ్చు. కానీ ఈరోజు పరాజితులెవ్వరు అనే విషయంపై రెండు అభిప్రాయాలు లేవు. అదేమిటంటే భారత జాతీయ కాంగ్రెస్. రాహుల్ గాంధీ కేరళ నుంచి తొలిసారి ఎంపీ అయ్యాక జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాన్ని కాంగ్రెస్ పోగొట్టుకోకూడదు. అలాగే ఏడాది క్రితం పౌరసత్వ సవరణ చట్టంపై భారీ స్థాయి నిరసనలు చెలరేగిన అస్సాంలో బీజేపీని మళ్లీ అధికారంలోకి కాంగ్రెస్ రానివ్వకుండా ఉండాల్సింది. పుదుచ్చేరిలో అధికారం కోల్పోయింది. బెంగాల్లో ఊసులేకుండా పోయింది. ప్రజా తీర్పు సందేశం అత్యంత స్పష్టంగా ఉంది. ప్రజాస్వామ్య పునరుద్ధరణ యుద్ధంలో కాంగ్రెస్ పార్టీ ఇక నాయకత్వం వహించలేదు. మోదీ అజేయత్వానికి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పదే పదే తూట్లు పొడుస్తూ వస్తున్నాయి. కానీ రాష్ట్రాల స్థాయిల్లో వ్యక్తమవుతున్న ఈ అసంతృప్తి జాతీయ వ్యాప్త సెంటిమెంట్‌గా మారడంలో వైఫల్యం చోటు చేసుకుంటోంది. ఈసారి తీర్పు మాత్రం భిన్నమైంది. ప్రతిపక్షాలకు ఇది ఒక మార్గాన్ని చూపింది. 2022 మొదట్లో జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రజాతీర్పు ఇలాగే సాగితే మోదీ పాలన ముగింపునకు అది ప్రారంభం కాగలదు. మోదీ పరాజయం పొందవచ్చు. కానీ అది కాంగ్రెస్ చేత కాదు. మోదీ పట్ల పచ్చి వ్యతిరేకత వల్ల కూడా కాకపోవచ్చు. ఇక్కడ ఇప్పుడు ఒక అవకాశం ఉంది. ఒక సవాలు కూడా ఉంది. యోగేంద్ర యాదవ్ వ్యాసకర్త స్వరాజ్ ఇండియా సంస్థాపకులు -
వ్యాక్సిన్ కూడా సరుకేనా?
ప్రజలందరికీ ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్ అందించడం ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రప్రభుత్వం కనీసంగా చేయవలసిన పని. కానీ కోట్లాదిమంది ప్రజలకు సార్వత్రిక ప్రయోజనం కలిగించే అంశం కూడా మార్కెట్ సరకుగా మారిపోవడాన్ని అర్థం చేసుకోవడం కష్టసాధ్యమే. విస్తృత ప్రజానీకం ప్రాణాలు కాపాడి భారత్‌ను ప్రస్తుత దుర్భర పరిస్థితుల నుంచి కాపాడటం కంటే స్వేచ్ఛా మార్కెట్ భావజాలంపై కేంద్రప్రభుత్వానికి ఉన్న సానుకూల అభిప్రాయమే పైచేయి సాధించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్షణంలో దేశ ఆరోగ్య భద్రతకు అత్యంత కీలకమైన ఒక ఉత్పత్తిపై వేరువేరు ధరల వ్యూహాలను అమలు చేయడాన్ని మరోలా ఆర్థం చేసుకోలేం. టీకాలు వేసే ప్రక్రియ ఉమ్మడిగా ప్రజలకు ప్రయోజనం కలిగించే అంశం. పైగా సాంక్రమిక వ్యాధులు ప్రబలిపోయినప్పుడు మరణాలు, బహుముఖ వ్యాధులను తగ్గించడానికి కారుచౌక మార్గం వ్యాక్సినేషన్ మాత్రమే. అందుకే పాశ్చాత్య దేశాలన్నీ తమ జనాభాకు ఉచితంగానే వ్యాక్సిన్ అందిస్తూ వస్తున్నాయి. ఈ దేశాల్లో సోషలిస్టు ప్రభుత్వాలు లేవు. అమెరికాలో వలే పశ్చిమదేశాలన్నీ పూర్తిగా మార్కెట్ ఆధారితంగా నడుస్తుం టాయి. ఈ దేశాల్లోని మెజారిటీ ప్రజలకు ఒక కరోనా టీకాపై 20 డాలర్లు పెట్టగలగేటంత తలసరి ఆదాయం ఉంటున్నప్పటికీ జనాభా మొత్తానికి ఇవి ఉచిత టీకాను అందిస్తున్నాయి. కానీ భారత రాజకీయ నాయకత్వం దీనికి పూర్తి భిన్నంగా ఎలా ఆలోచిస్తోంది? పూర్తిగా లోపభూయిష్టంగా ఉన్న వ్యాక్సిన్ సేకరణ విధానాన్ని భారత ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చిందో అర్థం చేసుకోవడం అసాధ్యం. అంతకుమించి సామూహిక ప్రజాప్రయోజనానికి సంబంధించిన అంశం మన దేశంలో మార్కెట్ సరకుగా ఎలా మారిపోయింది? కోట్లాదిమంది ప్రజల ప్రాణాలు కాపాడి భారత్‌ను ప్రస్తుత దుర్భర పరిస్థితుల నుంచి కాపాడటం కంటే స్వేచ్ఛా మార్కెట్ భావజాలంపై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న సానుకూల అభిప్రాయమే పైచేయి సాధించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్షణంలో దేశ ఆరోగ్య భద్రతకు అత్యంత కీలకమైన ఒక ఉత్పత్తిపై వేరువేరు ధరల వ్యూహాలను అమలు చేయడాన్ని మరోలా ఆర్థం చేసుకోలేం. అపారమైన లాభాలపై దృష్టి ఉండే మార్కెట్ అనుకూలవాదులకు ప్రజాహితం అనే భావనే రుచించకపోవచ్చు. అలాంటి సందర్భంలో ప్రభుత్వం కనీసం ఆర్థిక సమర్థత, వనరుల హేతుపూర్వక వినియోగం విషయంలో అయినా దాపరికం లేకుండా వ్యవహరిం చాల్సి ఉంటుంది. భారత ఆర్థిక వ్యవస్థ కనీవినీ ఎరుగనంత స్థాయికి పతనమైపోయింది. ఆదాయాలు కుదించుకుపోవడం, కుటుంబాల స్థాయిలో ఆహారం, కనీసం ఆదాయం వంటి ప్రాథమిక అవసరాలు కూడా తీరని పరిస్థితుల్లో కోవిడ్–19 ఆర్థిక వ్యవస్థపై కలిగిస్తున్న ప్రభావం సూక్ష్మస్థాయిలో విధ్వంసకరంగా మారింది. దీనికి తోడుగా కునారిల్లిపోయిన ఆరోగ్య మౌలిక వ్యవస్థను, చిన్నాభిన్నమైపోయిన జీవితాలను పునర్నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకనే మన వ్యాక్సిన్ కంపెనీలు కనీస ఉత్పత్తి ధర వద్ద లేక ఉత్పత్తి ఖర్చుపై 10 శాతం కనీస లాభంతో వ్యాక్సిన్‌ని అందిస్తున్నాయి. కానీ కొన్ని నెలల్లోపే వ్యాక్సిన్ ధర పెరగనుండటం గమనార్హం. టీకాల కొరత అసలు కారణం ముందస్తుగా వ్యాక్సిన్ కొనుగోలు ఒప్పందాలు లేకపోవడం లేక వ్యాక్సిన్ ఉత్పత్తికి సంబంధించిన అన్ని అంశాలను పొందుపర్చి సమగ్రమైన వ్యూహాన్ని అమలు చేసే జాతీయ వ్యాక్సినేషన్ ప్లాన్ లేకపోవడం వల్లే ఇప్పుడు ఉన్నట్లుండి కోవిడ్–19 టీకాల కొరత ముంచుకొచ్చింది. వ్యాక్సిన్ ఉత్పత్తి స్థాయిని పెంచడానికి మనం మొదట్లోనే యుద్ధప్రాతిపదికన డజనుకు పైగా బీఎస్ఎల్–3 స్థాయి అత్యుత్తమ సంస్థలను నెలకొల్పి ఉండాలి. దేశంలో టీకాలకు ఏర్పడుతున్న విస్తృతమైన డిమాండ్‌ని తీర్చేందుకు ఇతర మందుల కంపెనీలను కూడా భాగస్యామ్యం చేయడం ద్వారా మొత్తం టీకాల సరఫరా వ్యవస్థను ముందుకు తీసుకుపోయి ఉండవచ్చు. దీనికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వ వ్యూహం మొత్తం రెండు కంపెనీలపైనే ఆధారపడటమే ప్రస్తుత ప్రతి ష్టంభనకు కారణమైంది. అలాగే జనాభాలోని అధిక శాతానికి టీకాలు వేయగలిగేలా వ్యాక్సినేషన్ కేంద్రాలను మరింతగా ఏర్పర్చేలా రాష్ట్రప్రభుత్వాలను ప్రోత్సహించే ముందు చూపు కూడా కరువైపోయింది. ప్రస్తుతం సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా నెలకు 6 కోట్ల డోసులను మాత్రమే ఉత్పత్తి చేస్తోంది. జూలై నాటికి నెలకు 19 కోట్ల వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసేలా తన సామర్థ్యాన్ని విస్తరింపజేస్తోంది. కేంద్రప్రభుత్వం, జీఏవీఐ అందించిన రూ. 4,200 కోట్ల ఆర్థిక సహాయం కారణంగానే ఇది సాధ్యపడనుంది. మే 1 నుంచి జూలై నాటికి సీరమ్ ఏడాదికి 120 కోట్ల డోసులను ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకోనుంది. ఇకపోతే భారత్ బయోటెక్ ప్రస్తుతం నెలకు కోటి టీకాలు ఉత్పత్తి చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రూ. 1,500 కోట్ల ఆర్థిక సహాయంతో ఈ సంస్థ సామర్థ్యం కూడా గణనీయంగా పెరగనుంది. ఇతర కంపెనీలతో ఒప్పందాల మేరకు జూలై 22 నాటికి 70 కోట్ల డోసులు అందుబాటులో ఉంటాయని భావిస్తున్నారు. బహిరంగ ప్రకటనల మేరకు జూలై 22 నాటికే భారత్ తనకు అవసరమైన డోసులను పొందే అవకాశముందని స్పష్టమవుతోంది. ఇప్పటినుంచి వచ్చే రెండు నెలలలోపు భారత్ విదేశాలకు పంపపలసిన బాధ్యతను నెరవేర్చడానికి, దేశీయ డిమాండును తట్టుకోవడానికి 12 కోట్ల డోసులను ఉత్పత్తి చేసి పంపిణీ చేయగలగాలి. వీటన్నింటితోపాటు ప్రభుత్వం టీకాకు అర్హులైన వారి సంఖ్యను వేగంగా పెంచాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పటికైతే ప్రభుత్వం 96 కోట్ల వయోజనులందరినీ టీకాల పరిధిలోకి తీసుకొస్తోంది. వీరిలో 30 కోట్లమంది ఆరోగ్య సిబ్బందికి, ప్రంట్ లైన్ కార్మికులకు, సాయుధబలగాలు వంటి అత్యవసర సర్వీసులకు, 45 ఏళ్లకు పైబడిన వయసు కలవారికి ప్రాధాన్యమిస్తున్నట్లు కనిపిస్తోంది. మొత్తం 60 కోట్ల డోసులు అవసరం కాగా, ఇప్పటివరకు ప్రభుత్వం 12 కోట్లమందికి టీకాలువేసింది. ఇప్పుడు టీకా నిల్వలు లేవు. దీంతో 50 కోట్ల మంది ప్రజల డిమాండ్ నెరవేరడం కష్టమైపోతోంది. ఏప్రిల్ 20న 18–45 ఏళ్లలోపు వయసు ఉన్న మరో 63 కోట్లమందికి టీకాలు వేయాలని ప్రభుత్వం సంకల్పించింది. వీరిలో 70 శాతం మంది వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే సామూహిక రోగ నిరోధక శక్తి సాధ్యపడుతుంది. ముందుగా 44 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయాలంటే వ్యర్థాలతో సహా వంద కోట్ల డోసులు అవసరం అవుతాయి. వీటిలో 20 శాతం వ్యాక్సిన్‌ను ప్రైవేటుగా మార్కెట్ చేస్తారనుకుంటే, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇంకా 80 కోట్ల డోసులు అవసరం అవుతాయి. అంటే 45 ఏళ్ల పైబడిన వారికి 100 శాతం టీకాలు వేయాలన్నా, 18–45 ఏళ్లలోపు వారికి 70 శాతం టీకాలు వేయాలన్నా దానికి కేంద్రప్రభుత్వానికి 100 కోట్ల పైబడిన డోసులు అవసరం అవుతాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య టీకా ధరవరల్లో తేడాను పాటిం చడం ద్వారా, ప్రభుత్వాలను మార్కెట్లో టీకాలు కొనుగోలు చేసేలా విధానాన్ని మార్చడం ద్వారా తక్షణం జరిగేదేమిటంటే. దేశంలోని పేద రాష్ట్రాలు మరింత మొత్తాన్ని కోవిడ్–19 టీకాలకోసం చెల్లిం చాల్సి ఉంటుంది. అంటే మౌలికంగా చూస్తే రాష్ట్ర ప్రభుత్వాలకు టీకా ధరలు జరిమానా అవుతుండగా మందుల కంపెనీలు లాభాల బాట పట్టనున్నాయి. రాష్ట్రాలమధ్య వ్యత్యాసాలతోపాటు టీకాలకు ఖర్చు పెట్టే స్తోమత ఉన్న, లేని రాష్ట్రాల మధ్య అగాథం పెరిగిపోతుంది. అలాగే వ్యాక్సిన్లను కొనుగోలు చేయడానికి పలు నిరుపేద రాష్ట్రాలు తమ అత్యవసరాలను పణంగా పెట్టి తమ సొంత వనరులను టీకాల కోసం వెచ్చించాల్సి ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే కేంద్రం అనుసరిస్తున్న వ్యాక్సినేషన్ విధానం అసమానత్వంతోనూ, కఠినంగాను ఉంటోందన్నది స్పష్టం. అదే సమయంలో వైరస్‌కు హద్దులు లేవు. నిరుపేదలను ప్రస్తుత కేంద్ర విధానం గాలికి వదిలేస్తున్నందున వైరస్ మళ్లీ కమ్ముకు రావడం ఖాయం. ఇలాంటి లోపభూయిష్టమైన, ప్రమాదకరమైన వ్యాక్సినేషన్ విధానాన్ని సవరించవలసిన అవసరం ఉంది. అత్యవసరమైన వ్యాక్సిన్లను సేకరించడానికి కేంద్ర ప్రభుత్వం తన మార్కెట్ శక్తిని ఉపయోగించి, అందరికీ ఉచితంగా టీకాలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే కరోనా బారిన పడి విధ్వంసానికి గురైన ప్రజారాశులకు జీవితంపై భరోసా కల్పించాలంటే కేంద్ర ప్రభుత్వం కనీసంగా చేయవలసిన పని ఇదే మరి. కె. సుజాతారావు వ్యాసకర్త మాజీ కార్యదర్శి, కేంద్ర ఆరోగ్య శాఖ (ది వైర్ సౌజన్యంతో) -
ఆరోగ్య సంరక్షణ గాల్లో దీపమేనా?
వైద్యం పేరిట ప్రైవేట్ ఆసుపత్రులు ప్రజలను నిలువునా దోచుకుంటున్నాయి. ఇది పోవాలంటే, మెరుగైన వైద్యం ప్రజలకు అందాలంటే దేశంలోని ప్రతి జిల్లాలోనూ పోస్ట్ గ్రాడ్యుయేట్ రెఫరల్ ఆసుపత్రిని తప్పకుండా నెలకొల్పాలి. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలి. దేశంలో ప్రజారోగ్య సంరక్షణ సమర్థంగానూ, ఉచితంగానూ అందుబాటులో ఉంటున్నట్లయితే ప్రైవేట్ ఆసుపత్రుల అవసరం సామాన్యులకు ఉండదు. అలాగే ఆరోగ్య సంరక్షణ ప్రభుత్వాల ప్రథమ బాధ్యతల్లో ఒకటి అనే చైతన్యం ఓటర్లలో పెంపొందాలి. కులం, తెగ, జెండర్, నేపథ్యంతో పనిలేకుండా ఏ భారతీయుడినైనా సరే వారికీ వారి కుటుంబానికి ప్రప్రథమంగా కావలసింది ఏమిటి అని అడిగితే పదిమందిలో కనీసం ఎనిమిదిమంది మంచి ఆరోగ్యం, దాంతోపాటు సంతోషం కావాలని కోరుకుంటారు. అయితే ఒక పోలింగ్ బూత్‌లోని ఏ వ్యక్తినైనా పట్టుకుని అభ్యర్థిని ఎంచుకోవడంలో అతడి లేక ఆమె ప్రధమ ప్రాధాన్యత ఏది అని అడిగారనుకోండి.. ఆరోగ్య సంరక్షణను కల్పించే అభ్యర్థి తమకు కావాలనే సమాధానం వారినుంచి కలికానిక్కూడా వినిపించదు. భారతదేశంలో ప్రజారోగ్య సంరక్షణ వ్యవస్థ కుప్పగూలిపోవడానికి మన ఓటర్లలోని ఈ నిర్లిప్తతే ప్రధాన కారణం. తాము ఎన్నుకుంటున్న ప్రభుత్వ ప్రధాన విధుల్లో ఆరోగ్య సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని, ఉండాలని మన ఓటర్లు అస్సలు ఆలోచించడం లేదు. మరిన్ని ఆసుపత్రులు నిర్మించడం, ఉన్న ఆస్పత్రులను నవీకరించి మెరుగుపర్చడం అనేది జరగకపోతే, అభివృద్ధి కావాలంటే ఓటు వేయండని రాజకీయ పార్టీల, నేతలు చెప్పే దానికి ఏమాత్రం విలువ ఉంటుంది? ఒకసారి అభివృద్ధి లేక వికాస్ అనే భావనను ఎవరికీ అర్థం కాని అమూర్త భావనగా మార్చేశాక, మన రాజకీయ నాయకులు దాన్ని వాడుకోవడంలో మీడియా సైతం బ్రహ్మాండంగా తనవంతు పాత్ర పోషిస్తోంది. పంజాబ్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలకేసి చూద్దాం. ఈ మూడు రాష్ట్రాలకు చండీగడ్ లోని పీజీఐ ఆసుపత్రి మాత్రమే ఏకైక దిక్కుగా ఉంటోంది. దశాబ్దాలుగా ఈ ఆసుపత్రి రోగులతో కిటకిటలాడుతూ ఉంటోంది. చండీగఢ్ లోని పీజీఐ ఆసుపత్రి గేటు వద్దకు చేరుకోవడానికి ముందే అంబులెన్స్‌లోనే ప్రాణాలు కోల్పోతున్న భయానక గాథలు ఎన్నో ఎన్నెన్నో. ఒకవేళ ప్రాణాలు నిలుపుకుని వారు ఆసుపత్రిలోకి అడుగుపెడితే చికిత్సకోసం గంటలపాటు ఆసుపత్రి ప్రాంగణంలో వేచి చూడక తప్పదు. దేశవ్యాప్తంగా కూడా పరిస్థితి దీనికి భిన్నంగా లేదు. దేశంలో ప్రభుత్వ నిర్వహణలో కొనసాగుతున్న ఎయిమ్స్, పీజీఐ వంటి రిఫరల్ ఆసుపత్రులు తమ సామర్థ్యానికి మించి రోగులకు సేవలందిస్తూ అలిసిపోతున్నాయి. నాణ్యమైన ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ దేశంలో కలికానిక్కూడా లేదు కాబట్టే.. ఇలాంటి రిఫరల్ ఆసుపత్రులపై ఇంత అలవిమాలిన భారం పడుతోంది. చాలా ప్రభుత్వాలు ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యతే ఇవ్వడం లేదు. అందువల్లనే స్థానిక ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు కనీస అవసరాలకు కూడా దూరమైపోయాయి. దేశ స్థూల దేశీయోత్పత్తిపై, ఆర్థిక వ్యవస్థపై పేలవమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల ప్రభావం ఏ స్థాయిలో ఉందనే అంశం ఇప్పటికే చాలాసార్లు వెల్లడవుతూవచ్చింది. ఇలాంటి దుష్ప్రభావం బారిన పడకుండా అభివృద్ధి చెందిన దేశాలు చాలావరకు తమ పౌరులకు ఏదో ఒక రూపంలో రక్షణ ఛత్రాన్ని ఏర్పాటు చేయగలిగాయి. అదే భారతదేశం విషయానికి వస్తే కుటుంబంలో ఒక్క సభ్యుడు తీవ్ర వ్యాధికి, అస్వస్థతకు గురైతే సంవత్సరాలుగా పొదుపు చేస్తూ వచ్చిన మొత్తాలు కరిగిపోతాయి. ఈవిధంగా ఆరోగ్య సంబంధిత వ్యయం కారణంగానే ప్రతి సంవత్సరమూ దేశ జనాభాలో 3.5 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువ స్థాయికి పడిపోతున్నారని మీడియా వార్తలు చెబుతున్నాయి. తమ ప్రియతముల, ఆప్తుల వైద్య ఖర్చులు భరించడానికి సమస్తాన్ని అమ్ముకుంటున్న, తాకట్టుపెడుతున్న కుటుంబాల గాధలు ఒకటీ రెండూ కాదు. చాలావరకు ఇలాంటి గాథలు విషాదాంతాలుగానే ముగిసిపోతుంటాయి. ఆస్తుల్ని కరగదీసినా కుటుంబం వ్యాధుల పాలైన తన ప్రియతములను కోల్పోతూనే ఉంటుంది. దేశంలోని పేలవమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల బారినపడి ఘోరంగా నలుగుతున్న బాధితుల్లో దిగువ మధ్యతరగతి కుటుంబాలే ఎక్కువగా ఉంటున్నాయి. వీరికి ప్రైవేట్ ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు అందని ద్రాక్షపండుగానే ఉంటున్నాయి. పైగా అత్యుత్తమమైన టయర్ 1 ఆసుపత్రులు వీరికి అందుబాటులో ఉండటం లేదు. దీంతో అనివార్యంగా వీరు ప్రమాణాలు లేని, నాసిరకం సామగ్రితో కునారిల్లుతున్న ప్రైవేట్ ఆసుపత్రుల బారిన పడుతున్నారు. ఈ ప్రైవేట్ ఆసుపత్రులు రోగి కుటుంబాలనుంచి లక్షలాది రూపాయలను కొల్లగొడుతూ చికిత్సను మధ్యలోనే నిలిపివేస్తున్నాయి. ఇలాంటి ఆసుపత్రుల చుట్టూ ఉంటున్న ల్యాబ్‌లు డాక్టర్ల తరపున సేవలందించే అటెండెంట్లతో నిండి పచ్చి మోసాలకు పాల్పడుతున్నాయి. ఈ ప్రయోగశాలలు అందించే కమిషన్ల కోసం కక్కుర్తిపడుతున్న వైద్యపుంగవులు అయినదానికి కానిదానికి టెస్టుల మీద టెస్టులు రాస్తూ రోగులను ఇలాంటి ల్యాబ్‌ల బారిన పడేస్తున్నారు. కోవిడ్–19 సంక్షోభం వైద్యులు, ల్యాబ్‌లు వంటి ఈ తరహా పరాన్న జీవుల పంట పండిస్తున్నట్లుంది. భారత్ నిజమైన గ్లోబల్ లీడర్‌గా ఆవిర్భవించాలంటే ఈ సమస్యను తప్పకుండా పరిష్కరించాల్సిందే. ఉచిత, ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ అనేది ఏ రకంగానూ ఉచితంగా లభిస్తోందని చెప్పడానికి లేదు. దాన్ని ఇకనుంచి మనం ప్రీ–పెయిడ్ (ముందస్తుగా చెల్లించిన) ఆరోగ్య సంరక్షణ అని పిలవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆరోగ్య సంరక్షణపై పెట్టే ప్రతి పైసానూ మనం ఏదో ఒకరకంగా పన్నుల నుంచే చెల్లిస్తున్నామని గ్రహించి తీరాలి. చివరకు అంగట్లో అగ్గిపెట్టె కొనుక్కునే కూలీ సైతం దానిపై పరోక్షంగా పన్ను చెల్లిస్తూనే ఉంటాడు. ఈ నేపథ్యంలో పన్నుల రూపంలో లక్షల కోట్ల రూపాయలను పిండుకుంటున్న ప్రభుత్వాలు పన్ను చెల్లింపుదార్లకు కనీసమైన ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను అందించాల్సి ఉంటుంది. దేశంలో నెలకొల్పిన ప్రైవేట్ ఆసుపత్రుల్లో చాలావరకు రాజ కీయ కుటుంబాల ప్రత్యక్ష యాజమాన్యంలో ఉంటున్నాయి లేక వారు అనుమతించిన వారి యాజమాన్యంలో ఉంటున్నాయి. ఈ ఆసుపత్రులకు ఉచితంగా భూమిని అప్పగిస్తున్నారు. రాజకీయ నేతల సమ్మతి లేనిదే దేశంలో నిజమైన వాణిజ్య సంస్థలు సైతం ఇలాంటి రాయితీలను ఒక్కదాన్నైనా పొందలేవు. ప్రజారోగ్య సంరక్షణ వ్యవస్థను మెరుగుపర్చడానికి రాజకీయ వర్గానికి ఈ భారీ స్థాయి రాయితీలే అడ్డుపడుతున్నాయి. దేశంలో ప్రజారోగ్య సంరక్షణ సమర్థంగానూ, ఉచితంగానూ అందుబాటులో ఉంటున్నట్లయితే ఈ ప్రైవేట్ ఆసుపత్రులను ఉపయోగించుకునేది ఎవరు? పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య సంస్థలు (పీజీఐ) దేశంలో 1950, 60లలో ఉనికిలోకి రాగా, అప్పటినుంచి దేశ జనాభా ఎన్నో రెట్లు పెరుగుతూ వచ్చింది. ఇప్పటి వైద్య అవసరాలు తీరాలంటే కనీసం జిల్లాకు ఒక పీజీఐ స్థాయి రెఫరల్ ఆసుపత్రిని తప్పక నిర్మించాల్సి ఉంది. రెండు. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలి. ఉచిత, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కల్పన రాజకీయ పార్టీలకు ప్రధమ ప్రాధాన్యతగా ఉండాలి. ఈ ప్రాథమిక అంశాలను మేనిఫెస్టోల్లో పొందుపర్చేవారికే ఓటువేసేలాగా మన ఓటర్లు కుల, తెగ పరమైన రాజకీయాలకు అతీతంగా పరిణితి చూపాల్సిఉంది. ఆరోగ్య సంరక్షణ ప్రభుత్వాల ప్రథమ బాధ్యతల్లో ఒకటి అనే చైతన్యం ఓటర్లకు కలిగినప్పుడు రాజకీయ పార్టీలనుంచీ జవాబుదారీతనాన్ని డిమాండ్ చేయగలుగుతారు. ప్రజారోగ్య వ్యవస్థ కుప్పగూలిపోవడానికి బాధ్యులెవరో కూడా గ్రహించి వారే ఈ సమస్యను పరిష్కరించాలని ఓటర్లు డిమాండ్ చేయాలి. గుల్ పనాగ్ వ్యాసకర్త రచయిత్రి, నటి, వాణిజ్యవేత్త (‘ది ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
కమ్యూనిస్టుల అడ్డాగా కేరళ.. ఎలా?
అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ముందస్తు పోల్ సర్వేలు ఒక విషయాన్ని తేల్చేశాయి. కేరళలో పినరయి విజయన్ రెండోసారి సీపీఎం తరపున ముఖ్యమంత్రిగా కానున్నారని అన్ని సర్వేలు స్పష్టం చేశాయి. కానీ పశ్చిమ బెంగాల్లో అదే సీపీఎం కనీస వార్తల్లో కూడా నిలవలేకపోయింది. కారణం కింది కులాల నేతలను నాయకత్వ స్థానాల్లోకి రాకుండా బెంగాలీ భద్రలోక్ కమ్యూనిస్టు నేతలు దశాబ్దాలుగా అడ్డుకున్నారు. కేరళలో అగ్ర కులాల నేతృత్వాన్ని పక్కకు తోసి పినరయి విజయన్ లాంటి దిగువ కులాలకు చెందిన వారు నాయకత్వ స్థానాల్లోకి రావడంతో ఇక్కడ సీపీఎం పీఠం చెక్కు చెదరలేదు. ఇందువల్లే బీజేపీ ఆటలు బెంగాల్లో చెల్లుతున్నట్లుగా, కేరళలో చెల్లడం లేదు. కేరళలో ఒకే దశ ఎన్నికలు పరిసమాప్తమై, పశ్చిమబెంగాల్లో ఎనిమిది దశల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న తరుణంలో ఈ వ్యాసం రాస్తున్నాను. అనేక ముందస్తు పోల్ సర్వేలు చెబుతున్నట్లుగా కేరళ సీపీఎం నేత, ముఖ్యమంత్రి పినరయి విజయన్ కేరళ ఎన్నికల చరిత్రలో రెండోసారి తిరిగి అధికారంలోకి రానున్నారు. కానీ పశ్చిమ బెంగాల్లో మాత్రం ఎన్నికల అంకగణితంలో సీపీఎం కనీసం వార్తల్లో కూడా లేకుండా పోయింది. బెంగాల్లో ఆ పార్టీ పని దాదాపుగా ముగిసిపోయినట్లుగానే కనిపిస్తోంది. కేరళలో సీపీఎం నాయకత్వం మొదటగా బ్రాహ్మణుడి (ఈఎమ్ఎస్ నంబూద్రిపాద్) పరమై 1957లో తొలి ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత రాష్ట్రంలోని శూద్రకులాల్లో అగ్రగామిగా ఉంటున్న నాయర్ల పరమైంది. ఇప్పుడు ఈళవ కులానికి చెందిన పినరయి విజయన్‌కి రెండోసారి కూడా సీఎం పదవి దక్కనుంది. ఈయన ఒకప్పుడు అంటరానిదిగా భావించిన కల్లుగీత కార్మికుల కమ్యూనిటీకి చెందినవారు. సుప్రసిద్ధ సామాజిక సంస్కర్త నారాయణ గురు ఈ కులానికి చెందినవారే. బెంగాల్ దళితుల్లా కాకుండా, కేరళ దళితులు ఇటీవలి కాలంలో సంస్కర్త అయ్యంకళి ప్రభావంతో బాగా సంఘటితం అయ్యారు. ఇప్పటికీ వీరు కమ్యూనిస్టు మద్దతుదారులుగానే ఉంటున్నారు. అదే పశ్చిమబెంగాల్లో కమ్యూనిస్టు పార్టీ ప్రారంభం నుంచి మూడు భద్రలోక్ కులాలైన బ్రాహ్మణులు, కాయస్థులు, బైద్యాస్ నియంత్రణలో నడిచేది. మిగిలిన శూద్రులు, నామ శూద్ర (దళిత్) కులాలను భద్రలోక్ మేధావులు చోటోలోక్ (నిమ్న కుల ప్రజలు)గా ముద్రవేసి చూసేవారు. పార్టీ శ్రేణులలో వీరు ఎన్నటికీ నాయకులు కావడానికి అనుమతించేవారు కాదు. కమ్యూనిస్టు భద్రలోక్ నేతలు వ్యవసాయ, చేతి వృత్తుల ఉత్పాదక ఆర్థిక వ్యవస్థ మూలాల్లో ఏ పాత్రా పోషించనప్పటికీ, కింది కులాల వారిని శ్రామికుల స్థాయిలోనే ఉంచడానికి మార్క్సిస్ట్ పదజాలాన్ని ఉపయోగిస్తూ పోయేవారు. చివరకు శూద్రులను, దళితులను రిజర్వేషన్ ఉపయోగించుకుని మధ్య తరగతి దిగువ స్థాయి మేధావులుగా రూపాంతరం చెందడానికి కూడా భద్రలోక్ నేతలు అనుమతించేవారు కాదు. ఇప్పుడు ఇదే శూద్ర, నిమ్నకులాల ప్రజలను ఆర్ఎస్ఎస్, బీజేపీలు సంఘటితం చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ సద్గోప్ (ఇతర రాష్ట్రాల్లో యాదవులకు సమానమైన) కులానికి చెందినవారు. ఈ కమ్యూనిస్టు భద్రలోక్ నేతలు పశ్చిమబెంగాల్లో 27 శాతం జనాభాగా ఉన్న ముస్లింలను సైతం గ్రామీణ ప్రాంతాల్లో విద్యావంతులుగా ఎదగడానికి అనుమతించలేదు. కమ్యూనిస్టు పార్టీ భద్రలోక్ ఆలోచనా తత్వంనుంచి బయటపడి ఉంటే, ఒక ముస్లిం నేత ఇప్పటికే కమ్యూనిస్టుల తరపున రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయి ఉండేవారు. అలా కాకూడదనే ఉద్దేశంతోటే భద్రలోక్ నేతలు తమ కమ్యూనిస్టు లౌకికవాద ముసుగులో శూద్రులను, దళితులను, ముస్లింలను అణిచిపారేశారు. మరోవైపున కేరళ ప్రయోగం దీనికి విరుద్ధంగా నడిచింది. అక్కడ కమ్యూనిస్టు ఉద్యమంలోని ఈళవ కుల నేతలు తమ నాయకత్వ స్థానాలను బలోపేతం చేసుకున్నారు. పార్టీలోని బ్రాహ్మణులు, నాయర్లు.. శూద్రులను దళిత కార్యకర్తలను అగ్రశ్రేణి నేతలుగా కాకుండా నిరోధించారు కానీ నారాయణ గురు, అయ్యంకళి సంస్కరణ ఉద్యమాలతో స్ఫూర్తి పొందిన వీరు నాయకత్వ స్థానాల్లోకి ఎగబాకి వచ్చారు. కేఆర్ గౌరి అమ్మ, వీఎస్ అచ్యుతానందన్, పినరయి విజయన్ క్రమంగా కమ్యూనిస్టు పార్టీలోని బ్రాహ్మణ, నాయర్ల ఆధిపత్యాన్ని తొలగించి నాయకత్వ స్థానాలను చేజిక్కించుకున్నారు. కేరళలో సీపీఎం పొలిట్ బ్యూరో ప్రధానంగా బెంగాల్ భద్రలోక్, కేరళ నాయర్ల ఆధిపత్యంలో నిండి ఉండేది. దేశంలో కానీ, అంతకు మించి పార్టీ శ్రేణుల్లో కానీ కుల చైతన్య ధోరణులు ఆవిర్భవించడాన్ని సైతం వీరు అడ్డుకునేవారు. అయితే కేరళ ఓబీసీలు, దళిత్ నేతలు కుల అంధత్వంలో ఉండిపోయిన కేంద్ర భద్రలోక్ నాయకత్వాన్ని అడ్డుకుని హుందాగానే కేంద్ర స్థానంలోకి వచ్చారు. ఇప్పుడు పినరయి విజయన్ పార్టీలో అత్యంత నిర్ణయాత్మకమైన రీతిలో కెప్టెన్‌గా అవతరించారు. కింది కులాల ప్రజలు, దళితులు అలాంటి మార్గంలో పయనించడానికి బెంగాల్లో, త్రిపురలో కూడా అక్కడి పార్టీ నాయకత్వం అనుమతించలేదు. ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా తయారైందంటే శూద్ర, ఓబీసీ, ఆదివాసీ ప్రజలు అక్కడి భద్రలోక్ కమ్యూనిస్టు నేతలను నమ్మలేని దశకు చేరుకున్నారు. కులం అనేది దేశవ్యాప్తంగానే కమ్యూనిస్టు భద్రలోక్ జీవులకు సంపూర్ణంగా ఒక విచిత్రమైన, పరాయి సంస్థగానే ఉండిపోయింది. అసలు కులం అనేది ఉనికిలోనే లేదు అని వారు నటించడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో వర్గ అస్తిత్వ రాజకీయాల కంటే కుల అస్తిత్వమే పరివర్తనా పాత్రను పోషిస్తోంది. ఇవి రెండూ కూడా ఎన్నికల్లో జన సమీకరణ సాధనాలుగా ఉంటున్నాయి. అలాగే సామాజిక, ఆర్థిక స్తబ్ధతను అధిగమించే సాధనాలుగా కూడా ఉంటున్నాయి. ఇది కమ్యూనిస్టు భద్రలోక్ మేధావులకు ఏమాత్రమూ తెలీని విషయం కాదు. కానీ, వారి నాయకత్వ స్థాయిని, స్థితిని దెబ్బతీస్తుంది కాబట్టి ఈ వాస్తవాన్ని దాచిపెట్టాలని వీరు కోరుకున్నారు. పశ్చిమ బెంగాల్లో ఇలా వాస్తవాన్ని మరుగునపర్చి ఆటలాడిన కారణంగానే అక్కడ కమ్యూనిస్టు పార్టీ అంతరించిపోయింది. అదే కేరళలో ఈళవ కుల నేతల ఊర్ధ్వ ప్రస్థానం పార్టీని సైతం కాపాడుకోగలిగింది. తమిళనాడులో ద్రవిడ ఉద్యమం కానీ, ఏపీ తెలంగాణల్లో తెలుగుదేశం, టీఆర్ఎస్ కానీ, వైఎస్సార్సీపీ కానీ దళితులను, రిజర్వుడ్ శూద్ర కులాలను తెలివిగా ముందుకు తీసుకొచ్చారు. ఈ పార్టీలన్నీ కమ్మ, వెలమ, రెడ్డి వంటి అన్ రిజర్వుడ్ శూద్ర కులాల నేతల నేతృత్వంలో ఉంటున్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకోకుండా ఆరెస్సెస్, బీజేపీని సైతం నిలువరిం చాయి. అయితే బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ స్వయంగా భద్రలోక్ పార్టీ కావడంతో ఆరెస్సెస్, బీజేపీలు అక్కడ దళితులను, శూద్రులను గణనీయంగా సమీకరించగలుగుతున్నాయి. కానీ కేరళలో ఇదే ఆరెస్సెస్, బీజేపీలు నాయర్లు లేక దళితుల్లో కొందరిని తప్ప, రిజర్వుడ్ శూద్రుల (ఓబీసీలు) నుంచి నేతలను కొనలేకపోతున్నాయి. కేరళలో నాయర్లు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కమ్మ, రెడ్డి, వెలమ వంటి శూద్ర కులాలు దక్షిణభారత దేశంలో దిగువ శూద్రులకు, దళితులకు అధికారం పంచిపెట్టకపోయి ఉంటే బీజేపీ ఈ దిగువ శూద్ర, దళిత కులాలను చక్కగా ఉపయోగించుకునేది. దీంతో బీజేపీకి ఇక వేరు మార్గం లేక రాష్ట్ర విభాగాలకు గాను అధ్యక్ష పదవిని కాపులకు ఇవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో కాపులను సమీకరించాలని ప్రయత్నిస్తున్నారు. కేరళలో పినరయి విజయన్ ఈళవ కులం నుంచి రాకపోయి ఉంటే (ఆ రాష్ట్రంలో ఈ కులస్తులు మొత్తం జనాభాలో 24 శాతంగా ఉన్నారు), ప్రధాని నరేంద్రమోదీ ఈళవ కులనేతల్లో ఎవరో ఒకరికి సీఎం పదవిని ప్రతిపాదించి అధికారం కైవసం చేసుకుని ఉండేవారు. కానీ ఇప్పుడు ఇది కేరళలో సాధ్యం కాదు. పశ్చిమబెంగాల్లో కూడా మహిస్యాలు, సద్గోపులు, దళితులు వంటి చోటోలోక్ నేతలను సమీకరించడం ద్వారా ఆరెస్సెస్, బీజేపీలు జూదక్రీడను ఆడుతూ వస్తున్నాయి (మహిస్యాలు అంటే బెంగాల్లో రెడ్డి లేక కమ్మ కుల స్థాయికి సంబంధించిన వారని చెప్పుకోవచ్చు. కానీ వీరిని పాలక కులాలుగా అవతరించడానికి ఇంతవరకు బెంగాల్ పార్టీలు అనుమతించలేదు). కమ్యూనిస్టు భద్రలోక్ నేతలు ఇప్పుడు రహస్య స్థావరాలను వెతుక్కుంటున్నారు. అక్కడ ఏం జరుగుతుందో మనం వేచి చూడాలి. కానీ కేరళలో మాత్రం కమ్యూనిస్టు బ్రాహ్మణిజాన్ని తుంచివేసి ముస్లింలను, ఓబీసీలను, దళితులను సమీకరిం చడం ద్వారా పినరయి విజయన్ అటు కేరళను, ఇటు దేశాన్ని కూడా కాపాడబోతున్నారు. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
ప్రైవేటులోనూ రిజర్వేషన్లు ప్రజల హక్కు
దేశంలో ప్రభుత్వ రంగంలో కొత్త ఉద్యోగాలు పుట్టడం లేదు. ఉన్న ఖాళీలను నింపడం లేదు. దీనికితోడు ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడానికి చర్యలు ఊపందుకుంటున్నాయి. మరి దేశంలో ఉన్న ఉద్యోగాలన్నీ ప్రైవేటురంగంలోకే పోయినప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ల మాటేమిటి? సామాజిక న్యాయం బాధ్యత ఎవరు తీసుకోవాలి? స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా ఈ వర్గాలు ఇంకా పైకి రాలేవన్నది చేదునిజం. ప్రైవేటు సంస్థల పైస్థాయి ఉద్యోగాల్లో ఈ వర్గాల ప్రజలు నామమాత్రంగా ఉన్నారన్నది నగ్నసత్యం. కాబట్టి కేంద్రప్రభుత్వం సామాజిక అసమానత లను తొలగించే బాధ్యత నుంచి తప్పుకోకూడదు. ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు అమలుచేయడానికి అవసరమైన చర్యలు తీసుకోకతప్పదు. ‘‘కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలన చేస్తాయి, వ్యాపారాలు చేయడం ప్రభుత్వాల బాధ్యత కాదు’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల బహి రంగంగా పలుమార్లు ప్రకటించారు. పరిశ్రమ, సేవా రంగాలను దశల వారీగా ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసు కుంటున్నదనేది స్పష్టం. అందులో భాగంగా రైల్వే, ఎల్ఐసీ, పోస్టల్, బీఎస్ఎన్ఎల్, బ్యాంకింగ్, రక్షణ, బొగ్గు సంస్థలు, విశాఖ ఉక్కు పరి శ్రమలను ప్రైవేటీకరణ చేయడానికి చర్యలు తీసుకుంటోంది. దీన్ని ప్రజలు, ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ రంగంలో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయన్నది ఒక కారణమైతే, అందులో పనిచేసే ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోతామనే అభద్రత మరో కారణం. అలాగే ప్రైవేటీకరణ వల్ల రాజ్యాంగబద్ధమైన ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల అమలు జరగదనీ, రద్దు చేయకుండానే రిజర్వేషన్లు రద్దవుతాయనీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రైవేట్ యాజమాన్యాలు సామాజిక వర్గాల రిజర్వేషన్ల అమలుకు అంగీకరించడం లేదు. ప్రైవేటు పారిశ్రామిక వర్గాలు ప్రభుత్వం వద్ద అన్ని రకాల సహాయ, సహకారాలు తీసుకుంటున్నాయి. కానీ ప్రభుత్వ నియమాలను పాటించడం లేదు. ఉద్యోగ రంగంలో 90 శాతం ఉద్యోగాలు ప్రైవేటు రంగంలోనే ఉన్నాయి. కేవలం 10 శాతం ఉద్యోగాలు మాత్రమే ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. ప్రస్తుతం ప్రతి పాదనలో ఉన్న సంస్థలను ప్రైవేటీకరిస్తే మరో 26 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు పోతాయి. అప్పుడు అవి 7 శాతానికి తగ్గుతాయి. ఉద్యో గాల్లో ప్రైవేటు రంగం విస్తరిస్తున్న క్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజ ర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్ బలంగా ముందుకు వస్తున్నది. ప్రైవేటురంగం విస్తరిస్తూ పోతే సమాజంలో సాంఘిక, ఆర్థిక అస మానతలు మరింత పెరుగుతాయి. రాజ్యాంగంలో పేర్కొన్న సమ సమాజం, సామాజిక న్యాయం పుస్తకాల్లోని పదాలుగా మిగిలి పోతాయి. ఆర్థిక అసమానతల వల్ల ప్రజల్లో అసంతృప్తి పెరిగి శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది. సంపద కొంతమంది బడా పారి శ్రామికవేత్తల చేతుల్లో కేంద్రీకృతమవుతుంది. రైల్వే స్టేషన్లు, రైల్వే లైన్ల రూపంలో లక్షల కోట్ల విలువైన ఆస్తులున్నాయి. అవి కోట్లాది ప్రజల ఆస్తులు. ఇన్ని ఆస్తులను కారుచౌకగా కార్పొరేట్ దిగ్గజాలకు అప్పగిం చడం ప్రభుత్వం చేయవలసిన పని కాదు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లకు ప్రభుత్వం ఆమోదించాలి. ఇది న్యాయమైన డిమాండ్ అని సమాజాన్ని ఒప్పించాలి. అలాగే దీనికి రాజ్యాంగపరంగా న్యాయపరమైన అవరోధాలు ఏమైనా ఉన్నాయా అన్నది పరిశీలించాలి. ఇవి సాధించుకోవడానికి ఉద్యమాలు, వ్యూహాలు రూపొందించుకోవాలి. పార్లమెంటులో పాలక, ప్రతి పక్షాలు ఈ అంశం మీద విస్తృతంగా చర్చించాలి. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు పెట్టడానికి రాజ్యాంగ సవరణ కూడా అవసరం లేదు. రాజ్యాంగంలోని 15 (4), 16(4) ప్రకారం ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేయవచ్చన్న భావన నిబిడీకృతమై ఉంది. ఒకవేళ రాజ్యాంగ సవరణ అవసరమైనా దీనికి అభ్యంతరం చెప్పే రాజకీయ పార్టీలు ఉన్నాయా? సామాజిక న్యాయ సిద్ధాంతానికి విరుద్ధంగా అగ్రకులాల్లోని పేదలకు రెండు రోజుల్లో పార్లమెంటులో బిల్లు ఆమోదింపజేసి 10 శాతం రిజర్వేషన్లు పెట్టిన కేంద్రం, 90 శాతం జనాభా గల పేద కులాలకు రిజర్వేషన్లు పెడితే అభ్యంతరాలు చెప్పే వారు ఉంటారా? పాలక పక్షం తలుచుకుంటే ఈ రిజర్వేషన్లు అమలు చేయడం ఒక లెక్కలోది కాదు. ఒక్కరోజు పని మాత్రమే. ఇప్పుడు ప్రైవేటు రంగంలో ఏ కేటగిరీ ఉద్యోగాల్లో ఎవరు న్నారు? మేనేజింగ్ డైరెక్టర్, ఎగ్జి్జక్యూటివ్ డైరెక్టర్ లాంటి ఉన్నత స్థాయి ఉద్యోగాలు ఎవరు చేస్తున్నారు? జనరల్ మేనేజర్లు, ఇంజినీర్లు, ఆఫీసర్లు, సూపర్వైజరు వగైరా ఉద్యోగాలు ఎవరు చేస్తున్నారు? అటెండర్లు, స్వీపర్ల ఉద్యోగాలు ఎవరు చేస్తున్నారు? ఇందులో పైస్థాయి ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు నామమాత్రంగా కూడా లేరనేది నగ్నసత్యం. వివిధ స్థాయిల్లో అధికార, అనధికార సంస్థలు జరిపిన సర్వేల్లో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల్లో ఈ వర్గాల వారు ఐదు శాతం కూడా లేరని తేలింది. స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత కూడా ఇలావుంటే సామాజిక న్యాయం ఇంకెప్పుడు సాధ్యమవుతుంది? ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల డిమాండ్ రెండు కోణాల్లో సమర్థ నీయం. ఈ కంపెనీలకు ప్రభుత్వమే రాయితీల మీద భూమి, ముడి సరుకు, ఇతర మౌలిక సదుపాయాలు సమకూరుస్తుంది. అలాగే ఇందులో చెమటోడ్చే కార్మికులు ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉంటారు. అలాంటప్పుడు అధికారం చలాయించే చోట ఈ వర్గాలు ఉండరాదా? ఈ పరిశ్రమల ఉత్పత్తుల్ని సంపన్న వర్గాలే కొనవు. 90 శాతం గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలే సింహభాగం కొంటారు. కొనుగోలులో అన్ని కులాల భాగస్వామ్యం ఉన్నప్పుడు పాలనలోనూ వాటా కల్పించడానికి అభ్యంతరం ఏమిటి? ఇంకొక విషయాన్ని గమనించాలి. ఒకనాడు బీసీ కులాల వారు చేసిన కులవృత్తులు, చేతి వృత్తులు నేడు పారిశ్రామికీకరణ చెందాయి. పద్మశాలీలు, దేవాం గులు నేసిన చేనేత వృత్తి బట్టల మిల్లులుగా మారిపోయింది. కమ్మరి, కంచరి పని ఉక్కు, ఇనుము కంపెనీలుగా మారిపోయింది. మేదరి, ఎరుకల వారి గంపలు, బుట్టలు, చాటలను, కుమ్మరివాళ్ల కుండలను ప్లాస్టిక్, స్టీలు పరిశ్రమలు తన్నుకుపోయాయి. ఒకప్పుడు వృత్తులకు యజమా నులైన ఈ కులాలవారు కనీసం ఇందులో ఉద్యోగులు కాకపోతే సామాజిక న్యాయం ఎలా సాధ్యం? మనది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. సామ్యవాద పునాదులతో పెట్టుబడిదారీ విధానం అవలం బించే దేశం. అలాంటప్పుడు ప్రభుత్వాలు వ్యాపారం చేసే బాధ్యత తీసుకోవని ప్రధాని ప్రకటించడాన్ని ఏ కోణంలో అర్థం చేసుకోవాలి? ప్రపంచంలోని అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో వేగ వంతమైన అభివృద్ధికి ప్రైవేటీకరణే కారణమని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఇందులో కొంత వాస్తవం ఉంది. ప్రైవేటీకరణ వల్ల యాజమాన్య పర్యవేక్షణ కట్టుదిట్టంగా అమలవుతుంది. పని సంస్కృతి మారుతుంది. జవాబుదారీతనం పెరుగుతుంది. వృథా తగ్గుతుంది. ఉత్పత్తి పెరుగుతుంది. అందులో సందేహం లేదు. చైనా లాంటి కమ్యూనిస్టు దేశాలు, జపాన్, జర్మనీ, ఇంగ్లండ్, అమెరికా లాంటి దేశాలు శీఘ్రగతిన అభివృద్ధి చెందడానికి ప్రైవేటీకరణే ప్రధాన కారణం. కానీ మనదేశంలో ఇప్పటికే 95 శాతం పారిశ్రామిక రంగం ప్రైవేట్ రంగంలోనే ఉంది. ఇంకా ముందుకు పోవడం వాంఛనీయం కాదు. కొత్త పరిశ్రమలను ప్రైవేటు రంగంలో చేరిస్తే అభ్యంతరం లేదు. కానీ పాతవాటిని, కోట్ల రూపాయలు లాభాలు ఆర్జించేవాటిని, ప్రజా సేవలో భాగమైన రైల్వేలను, ప్రభుత్వానికి అవసరమైన అప్పులు ఇచ్చే ఎల్ఐసీ లాంటి వాటిని కూడా ప్రైవేటీకరించడాన్ని సమాజం అంగీకరించదు. రోజు రోజుకు ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. రిటైర్ అవుతున్న ఉద్యోగుల స్థానాలను భర్తీ చేయడం లేదు. కొత్త ఉద్యో గాలు సృష్టించడం లేదు. పైగా శాశ్వత ఉద్యోగాలను తగ్గిస్తూ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, గెస్ట్ లెక్చరర్లు, గెస్టు టీచర్లు విద్యా వాలంటీర్లు, ఎన్‌ఎంఆర్‌లు అంటూ రకరకాల పేర్లతో రిజర్వేషన్లు లేకుండా చేశారు. ప్రైవేటీకరణ రహస్య ఎజెండా వెనకనే ఈ వర్గాలకు ఉద్యోగాలు దక్కకుండా చేయాలనే కుట్ర ఉంది. అలాంటప్పుడు అంత సులభంగా రిజర్వేషన్లు పెడుతారా! అందుకే ఈ కులాలు పెద్ద పోరాటం చేయక తప్పదు. వీరి అభివృద్ధి ప్రభుత్వ దయా దాక్షిణ్యాల మీద, సమాజంలోని ఆధిపత్య కులాల సానుభూతి మీద ఆధార పడిలేదు. ఇది భిక్షంగా కాకుండా రాజ్యాంగబద్ధమైన హక్కుగా గుర్తించాలి. ఆర్. కృష్ణయ్య వ్యాసకర్త అధ్యక్షులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం మొబైల్ : 90000 09164 -
నమ్మకానికి నిలువెత్తు నమూనా
ప్రభుత్వాధినేతను జనం మనస్ఫూర్తిగా నమ్మితే ఎలా ఉంటుందో ఏపీలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. సీఎం జగన్‌పై ప్రజల నమ్మకానికి నిలువెత్తు నమూనాగా నిలిచిన ఫలితాలివి. బలహీనవర్గాలకు అన్నిటిలోను ఏభై శాతం అవకాశాలు కల్పించడం ద్వారా వైఎస్ జగన్ సరికొత్త మార్పునకు శ్రీకారం చుట్టారు. జగన్ ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం చెక్కు చెదరలేదనీ, ఉన్న బలాన్ని కూడా ప్రతిపక్ష టీడీపీ కోల్పోయిందనీ స్పష్టమైంది. అన్ని మున్సిపాలిటీలలో, కార్పొరేషన్లలో గెలిచిన వైఎస్ఆర్సీపీపై మరింత బాధ్యత పడింది. గెలిచిన వార్డు, డివిజన్ సభ్యులు ప్రజలకు మరింతగా సేవలందించాలి. ప్రజల కనీస అవసరాలు తీర్చడానికి వారు చేయగలిగిన పనులన్నీ చేయాలి. అప్పుడే ఈ విజయానికి సార్థకత వస్తుంది. అసాధారణ రీతిలో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికలలో గెలిచినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు, ఆ పార్టీకి అభినందనలు. నిజంగానే ఇది అత్యంత ప్రతిష్టాత్మక విజయం. గతంలో ఎన్నడూ ఉమ్మడి ఏపీలో కూడా ఇలాంటి ఫలితాలు చూడలేదు. 73 మున్సిపాలిటీలు,11 మున్సిపల్ కార్పొరేషన్లు వైఎస్సార్సీపీ వశం అవడం కొత్త చరిత్ర. కేవలం రెండు మున్సిపాలిటీలు తాడిపత్రి, మైదుకూరులలో టీడీపీకే ఎక్కువ వార్డులు వచ్చినా, ఆ రెండు మున్సిపల్ చైర్మన్ పదవులు కూడా టీడీపీకి దక్కుతాయన్న నమ్మకం లేదు. ఈ రకంగా వైఎస్సార్సీపీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన విజయం సాధించడం ఎలా సాధ్యమైంది? ఇది ఏ రకమైన సంకేతాలు ఇస్తోంది అన్నవి పరి శీలించాలి. ముందుగా ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ ఇరవై రెండు నెలలపాటు ప్రభుత్వాన్ని నడిపిన తీరు, ఆయన అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాల ప్రభావం ప్రజలపై ముఖ్యంగా పేదవర్గాలపై విపరీతంగా పడిందని స్పష్టమైంది. రాష్ట్రవ్యాప్తంగా గత ఎన్నికలలో మాదిరి సామాజిక సమీకరణలలో ఎలాంటి మార్పు రాకుండా జగన్ కాపాడుకోగలిగారు. బలహీనవర్గాలకు అన్నిటిలోను ఏభై శాతం అవకాశాలు కల్పించడం ద్వారా ఆయన సరికొత్త మార్పునకు శ్రీకారం చుట్టారు. ఆ వర్గాలవారు చెక్కుచెదరకుండా జగన్‌కు అండగా నిలిచారని అర్థం అవుతుంది. అలాగే ఇతరవర్గాలలో కూడా మెజార్టీ ప్రజలు జగన్ ప్రభుత్వానికే మద్దతు ఇచ్చారు. విశేషం ఏమిటంటే పంచాయతీ ఎన్నికలలో కాని, ప్రస్తుత మున్సిపల్ ఎన్నికలలో గాని తన పార్టీకి ఓటు వేయాలని ప్రజలకు ఒక్కసారి కూడా జగన్ విజ్ఞప్తి చేయలేదు. ప్రజలు తనను ఆదరిస్తారని ఆయన నమ్మారు. కచ్చితంగా అలాగే జరిగింది. మరోవైపు ప్రతిపక్షనేత వారం పాటు ఆయా ప్రాంతాలలో పర్యటించి ప్రచారం చేసినా, అనేక విమర్శలు చేసినా, చివరికి ప్రజలనే తిట్టి రెచ్చగొట్టినా ఫలితం దక్కలేదు. ఆయన రాజకీయ జీవితంలో ఇంతటి ఘోర పరాజయం చూడడం ఇదే మొదటిసారి అని చెప్పాలి. తెలుగుదేశం పార్టీ ఇంత దారుణంగా ఎన్నడూ ఓడిపోలేదు. గత అసెంబ్లీ ఎన్నికలలో 23 సీట్లు మాత్రమే వస్తే, ఈసారి రెండు, మూడు మున్సిపాలిటీలలోనే ఓ మోస్తరు పోటీ ఇవ్వగలిగింది. జగన్ ప్రజలను విశ్వసిస్తే, చంద్రబాబు ఎన్నికల కమిషన్ వ్యవస్థను నమ్ముకుని బొక్కబోర్లాపడ్డారు. నిజానికి ప్రస్తుత ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలంలో ఉండగా స్థానిక ఎన్నికలు జరగరాదని వైఎస్సార్సీపీ భావించింది. కానీ కోర్టులు అంగీకరించకపోవడంతో ఎన్నికలకు సిద్ధపడింది. మరోవైపు ఎన్నికలకు సై అంటూ, ఎన్నికలకు వైఎస్సార్సీపీ భయపడిపోతోందంటూ చంద్రబాబు కాలుదువ్వారు. కానీ తీరా ఎన్నికలు అయ్యేసరికి ఆయన చతికిలపడే పరిస్థితి వచ్చింది. ఈ విషయాన్ని ఆయన ముందుగా గమనించకపోలేదు. అందుకే తనకు ఆప్తుడని భావించిన ఎన్నికల కమిషనర్‌ను సైతం చంద్రబాబు విమర్శించారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు. పంచాయతీ ఎన్నికలలో కాని, మున్సిపల్ ఎన్నికలలో ఎక్కడా గొడవలు జరగకుండా, రీపోలింగ్ అవకాశం లేకుండా జరగడం కూడా బహుశా ఒక రికార్డు కావచ్చు. స్వయంగా నిమ్మగడ్డే ఈ విషయం వెల్లడిస్తూ మున్సిపల్ ఎన్నికలు అత్యంత ప్రశాంతంగా జరిగాయని ప్రకటించారు. నిమ్మగడ్డ పదవీకాలంలోనే ఈ ఎన్నికలు పూర్తి కావడం వైఎస్సార్సీపీకి మంచిది అయింది. లేకుంటే తెలుగుదేశం ఏమని ఆరోపించేదో ఊహించండి. కొత్త ఎన్నికల కమిషనర్‌ను అడ్డుపెట్టుకుని ఎన్నికలలో విజయం సాధించిందని చంద్రబాబు ఆరోపించేవారు. ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. తాజాగా ఎంపీటీసీ ,జడ్పిటీసీ ఎన్నికలు కూడా పూర్తి చేయాలని వైఎస్సార్సీపీ కోరుతుంటే ఎన్నికల కమిషనర్ వెనుకాడుతున్నారన్న అభిప్రాయం కలుగుతోంది. ఆయన సెలవుపై టూర్ వెళ్లాలని నిర్ణయించుకోవడం కూడా ఇందుకు ఊతం ఇస్తుంది. ఈ ఏడాదికాలంలో జరిగిన వివిధ పరిణామాలలో ఎన్నికల కమిషనర్‌తో విభేదాలు, తెలుగుదేశంతో సహా ఆయా ప్రతిపక్షాల ఆరోపణలు, విమర్శలు, టీడీపీ మీడియా చేసిన దుష్ప్రచారం వీటన్నిటినీ ఎదుర్కొని వైఎస్సార్సీపీ నిలబడగలిగింది. ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు స్పష్టమైన కొన్ని సంకేతాలు ఇచ్చాయి. జగన్ ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం చెక్కు చెదరలేదన్నది వాటిలో ఒకటి అయితే, ప్రతి పక్ష టీడీపీ ఉన్న బలాన్ని కూడా కోల్పోయిందన్నది మరొకటి. వైఎస్సార్సీపీకి గత అసెంబ్లీ ఎన్నికలలో 49.5 శాతం ఓట్లు వస్తే ఈ మున్సిపల్ ఎన్నికలలో 52.63 శాతం ఓట్లు వచ్చాయి. ఇది అరుదైన విషయమే. మరో వైపు టీడీపీకి గత అసెంబ్లీ ఎన్నికలలో దాదాపు నలభై శాతం ఓట్లు వస్తే, ఈ మున్సిపల్ ఎన్నికలలో దాదాపు 31 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. 22 నెలల్లో మరో పదిశాతం ఓట్లను టీడీపీ కోల్పోయిందన్నమాట. అధికారపార్టీ కన్నా ఈసారి టీడీపీకి పది లక్షల ఓట్లు తగ్గాయి. ఆ పార్టీకి ఇరవైమూడు మంది ఎమ్మెల్యేలు ఉంటే నలుగురు ఇప్పటికే పార్టీకి దూరం అయ్యారు. మిగిలిన 19 మంది ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా టీడీపీ గెలవలేకపోయింది. అంటే టీడీపీ గతంలో కన్నా దారుణమైన పతనాన్ని చవిచూసిందని అర్థం. జగన్ చేపట్టిన వివిధ సంక్షేమ కార్యక్రమాలు, నేరుగా ప్రజల ఖాతాలలోకే డబ్బు చేరడం, అవినీతి, మధ్య దళారీ వ్యవస్థ లేకపోవడం, అన్ని ప్రభుత్వ స్కీములూ నేరుగా ఇళ్ల వద్దకే చేరడం, పాలనను ప్రజలకు గ్రామాలలోనే అందించడం, కరోనా కష్టకాలంలో సైతం ప్రజలను వివిధ స్కీముల ద్వారా ఆదుకోవడం.. ఇలా అన్నీ పనిచేశాయన్నమాట. ఇక చంద్రబాబు కొన్ని సవాళ్లు విసిరారు. గుంటూరు, విజయవాడ, విశాఖపట్నంలలో వైఎస్సార్సీపీని ఓడిస్తే మూడు రాజధానులకు ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పవచ్చని ఆయన ఆశించారు.అందుకోసం ఆయన రెచ్చగొట్టే విధంగా విజయవాడ, గుంటూరు ప్రాంత ప్రజలు అమరావతి ఉద్యమాన్ని పట్టించుకోవడం లేదని, వారు పాచిపనుల కోసం బెంగళూరు, చెన్నై తదితర చోట్లకు వెళుతున్నారని, అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ ప్రజలను అవమానపర్చడమేనని ఆయన అనుకోలేదు. అంతేకాదు. ప్రజలకు సిగ్గు ఉందా? రోషం ఉందా? అంటూ కొత్త తరహా ప్రచారం చేశారు. అయినా ప్రజలు వాటికి రెచ్చిపోలేదు. ప్రభుత్వం పట్ల తమ అభిమతాన్ని చాలా స్పష్టంగా తెలియచేశారు. ఆరకంగా చంద్రబాబు సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. చంద్రబాబు బావమరిది నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహించే హిందూపూర్‌లో మొదటిసారి టీడీపీ అపజ యాన్ని చవిచూడడం కూడా గమనించదగిన అంశమే. చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో 75 పంచాయతీలలో ఓటమి చెందారు. ఆయన జిల్లా అయిన చిత్తూరులో టీడీపీ పరాజయ పరాభవాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. దీనితో ఆయన నైతికంగా ఇతర టీడీపీ నేతలను ప్రశ్నించే అర్హత కోల్పోయినట్లయింది. అందువల్లే విజ యవాడలో టీడీపీ కుల సంఘంగా మారిందని ఆరోపించిన సొంతపార్టీ నేతలను బాబు కనీసం మందలించలేకపోయారు. అన్ని మున్సిపాలిటీలలో, కార్పొరేషన్లలో గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్‌పై మరింత బాధ్యత పడిందని అర్థం చేసుకోవాలి. గెలిచిన వార్డు సభ్యులు, డివిజన్ సభ్యులు ప్రజలకు మరింతగా సేవలందిం చాలి. ప్రజల కనీస అవసరాలు తీర్చడానికి వారు చేయగలిగిన పనులన్నీ చేయాలి. తద్వారా వారు మరింత పేరు తెచ్చుకోవాలి. మరో మూడు సంవత్సరాలలో శాసనసభ ఎన్నికలు వస్తాయి. వీరు సరిగా పనిచేయకపోతే దాని ప్రభావం ఆ ఎన్నికలపై కొంత పడుతుంది. ప్రస్తుతం జగన్ ప్రభావంతో గెలిచిన వీరు ఆయనకు అండగా నిలిచి ప్రభుత్వానికి మంచి పేరుతేవాలి. అప్పుడే ఈ విజయానికి సార్థకత వస్తుంది. వారికి మరోసారి శుభాకాంక్షలు. అభినందనలు. విశ్లేషణ కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
బాబు పంచాయతీ లెక్కల రూటే వేరు
పంచాయతీ ఎన్నికలు ముందుగా పెడితే తమకు కొంతైనా కలిసి వస్తుందని ఆశించిన టీడీపీకి ఫలితాలు మాత్రం ఆశాభంగం కలిగించాయని చెప్పాలి. రెండు విడతలలో కలిసి వెయ్యికి పైగా పంచాయతీలు వచ్చినందుకు సంతృప్తి చెంది ఉండవచ్చు. కాగా వైఎస్సార్సీపీకి రెండు విడతల్లోనూ ఐదువేలకు పైగా పంచాయతీలు వచ్చాయి. అంటే గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రిపీట్ అవడం కాకుండా, అప్పటికన్నా వైఎస్సార్సీపీకి ఓట్ల శాతం పెరిగినట్లు కనబడుతోంది. ప్రస్తుతానికి మాత్రం గ్రామ సీమలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన అనేక కార్యక్రమాలు బాగా పనిచేశాయని అర్థం అవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో గత మార్చిలో ఆగిపోయిన మండల, జడ్పీటీసీ ఎన్నికలు కాకుండా పంచాయతీ ఎన్నికలను ఎన్నికల కమిషన్ నిర్వహించడం ఆరంభించింది. ఇప్పటికే రెండు విడతల ఎన్నికలు కూడా జరిగిపోయాయి. పేరుకు ఇవి పార్టీ రహిత పంచాయతీ ఎన్నికలు అయినా, దాదాపు రాష్ట్రం అంతా ఆయా పార్టీల మద్దతుదారులైన అభ్యర్థులు రంగంలో దిగి తమ సత్తా చాటుకుంటున్నారు. ఈ క్రమంలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సహజంగానే అత్యధిక సర్పంచ్ పదవులను కైవసం చేసుకుంటోంది. తొలి విడత ఎన్నికలలో 2,640 పంచాయతీలు వైఎస్సార్సీపీ కైవసం అయితే టీడీపీకి 518 వరకు వచ్చాయని ఒక లెక్క. అయితే దీనిపై టీడీపీ కాస్త గందరగోళంగా లెక్కలు చెప్పింది. తొలుత 1,050 పంచాయతీలు గెలుచుకున్నామని ఒకసారి, అసలు పంచాయతీ ఎన్నికలు సరిగా జరపడంలో ఎన్నికల కమిషన్ విఫలం అయిందని, చాలా చోట్ల దౌర్జన్యాలు జరిగాయని మరోసారి ఆరోపించింది. ఎన్నికల కమిషన్ మాత్రం ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ప్రకటించడంతో అంతవరకు తాము మద్దతు ప్రకటిస్తూ వచ్చిన ఎన్నికల కమిషనర్‌పై విమర్శలు చేయడం, కోర్టుకు వెళ్లడం వంటి చర్యలకు టీడీపీ వారు పాల్పడ్డారు. రెండో విడత పోలింగ్‌లో కూడా వైఎస్సార్సీపీకి 2,504 పంచాయతీలు, టీడీపీకి 479 పంచాయతీలు వచ్చినట్లు వైఎస్ఆర్సీపీ తెలిపింది. ఈ మేరకు వారు సర్పంచ్ల పేర్లతో సహా ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ మాత్రం తమకు 666 వచ్చాయని సంబరాలు చేసుకున్నట్లు టీడీపీ అనుకూల మీడియా తెలి పింది. ఆ తర్వాత ఈ దశలోనూ వెయ్యికిపైగా వచ్చినట్లు టీడీపీ ప్రచారం చేసింది.అంతేకాక 38 శాతం సర్పంచ్ పదవులను గెలుచుకున్నామని చంద్రబాబు ప్రకటించుకున్నారు. అయితే టీడీపీ ఆ వివరాలను పూర్తిగా ఎక్కడా ఇవ్వకపోవడం గమనించదగిన విషయం. ఇక్కడ అసలు విషయం ఒకటి తెలుసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెచప్పుడు, ఆత్మ తామేనని చెప్పుకునే ఒక పెద్ద పత్రికకు తెలుగు రాష్ట్రాలలో మారుమూల ప్రాంతాలలో కూడా నెట్వర్క్ ఉంది. వారి ప్రతినిధులు ఉంటారు. నిజంగానే టీడీపీకి పెద్ద సంఖ్యలో పంచాయతీలు వచ్చి ఉంటే, ఆ విషయాన్ని వారు స్వయంగా సేకరించి వార్తలుగా ప్రచురించేవారు. వారు అలా చేయకుండా వైఎస్సార్ సీపీ పక్షాన బొత్స చేసిన ప్రకటనను, అలాగే టీడీపీ వారు ఇచ్చిన ప్రకటనను ప్రచురించి ఊరుకున్నారు. అంటే దాని అర్థం ఆ పత్రిక నెట్వర్క్ పనిచేయడం లేదని అనుకోవాలా? లేక వాస్తవ పరిస్థితి వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉంది కనుక తామెందుకు ఆ విషయాలన్నిటిని వెల్లడించాలని అనుకున్నారా? అన్నది తెలియదు. కానీ వారు మాత్రం వాస్తవ పరిస్థితిని తెలియచేయడానికి ఇష్టపడలేదని అనుకోవాలి. ఇక మా అక్షరం మీ ఆయుధం అని ప్రచారం చేసుకున్న మరో పత్రిక వారి అక్షరాలను తెలుగుదేశం పార్టీకి అంకితం చేశారు కాబట్టి దాని గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం అనవసరం. పంచాయతీ ఎన్నికలు ముందుగా పెడితే తమకు కొంతైనా కలిసి వస్తుందని ఆశించిన తెలుగుదేశం పార్టీకి ఇవి ఆశాభంగం కలిగించాయని చెప్పాలి. కానీ వారు రెండు విడతలలో కలిసి సుమారు వెయ్యికి పైగా పంచాయతీలు వచ్చినందుకు సంతృప్తి చెందారని అనుకోవచ్చు. మరోవైపు వైఎస్సార్ సీపీకి ఐదువేలకు పైగా పంచాయతీలు వచ్చాయి. అంటే గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రిపీట్ అవడం కాకుండా, అప్పటికన్నా వైఎస్సార్ సీపీకి ఓట్ల శాతం పెరిగినట్లు కనబడుతోంది. పంచాయతీ ఎన్నికల తర్వాత మున్సిపాల్టీలు, మండల, జెడ్పీ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరుగుతాయి. మున్సిపాల్టీలకు నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. అప్పుడు ఎలాగూ ఏ పార్టీకి ఎలాంటి ఆదరణ ఉందన్నది స్పష్టమైన లెక్కలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం గ్రామ సీమలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన అనేక కార్యక్రమాలు బాగా పనిచేశాయని అర్థం అవుతుంది. ఈ ఫలితాలకు భిన్నంగా వచ్చే మున్సిపల్, మండల, జెడ్పీ ఎన్నికలలో మార్పు ఉండకపోవచ్చు. కాగా, ఎన్నికల కమిషన్ వైఖరిలో కొద్దిపాటి మార్పు కనబడడం కూడా ఆహ్వానించదగిందే. ప్రత్యేకించి పోలీసు, ఇతర పోలింగ్ సిబ్బంది, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ఎన్నికలను విజయవంతం చేశారని, చెదురుమదురు ఘటనలు మినహా, అంతటా ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పడం కూడా గమనించదగినదే. అంతేకాక తొలి విడతలో ఏకగ్రీవాలపై ఆయన కొంత వివాదాస్పదంగా వ్యవహరించారన్న అభిప్రాయం ఉంది. ప్రత్యేకించి చిత్తూరు, గుంటూరు జిల్లాలలో ఎక్కువ ఏకగ్రీ వాలు అయ్యాయని ఆయన కొద్ది రోజులు నిలుపుదల చేశారు. కాని ఆ తర్వాత జిల్లా కలెక్టర్ల నివేదికల ఆధారంగా వాటికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా, ఆ తర్వాత దశల్లో జరిగిన ఏకగ్రీవాలను కూడా ఓకే చేశారు. ఎన్నికల కమిషనర్, అలాగే తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవాలకు వ్యతిరేకంగా ఎంత ప్రచారం చేసినా పెద్ద తేడా కనిపించలేదని అర్థం అవుతుంది. ఈ విషయాలలో తమకు పూర్తి అనుకూలంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తుందని టీడీపీ నేతలు ఆశించి భంగపడ్డారేమో తెలియదు కాని, ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఎన్నికల కమిషన్ కూడా విఫలం చెందిందని ఆరోపించారు. అంతవరకు రాజ్యాంగ వ్యవస్థలపై విమర్శలు చేస్తారా అని సుద్దులు చెప్పిన చంద్రబాబు స్వయంగా తానే విమర్శలు చేశారు. మరో వైపు తన పార్టీ వారితో హైకోర్టులో పలు పిటిషన్లు వేయించి అనేక ఆరోపణలు చేశారు. ఆ పిటిషన్లు చదివితే ఏపీ గ్రామాలలో హింస, నిర్బంధంగా నామినేషన్లు ఉపసంహరించడం, పోలీసులు అసలు పనిచేయడం లేదని, ఎన్నికల వ్యవస్థ గందరగోళంగా ఉందేమోనన్న అనుమానం కలుగుతుంది. ఆ కేసు విచారించిన జడ్జిగారు ఆ పిటిషన్లలోని ఆరోపణలు చూస్తే చాలా సీరియస్‌గా ఉన్నాయని, అవి నిజమే అయితే గట్టి చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించారు. ఎన్నికల కమిషన్‌కు ఇందుకు సంబంధించిన అధికారాలు ఉంటాయని, వాటిని వాడుకోవాలని సూచించారు. నిజంగానే ఎన్నికలలో అక్రమాలు జరిగితే అడ్డుకోవలసిందే. చర్యలు తీసుకోవల్సిందే. కానీ ఉన్నవి, లేనివి కలిపి హైకోర్టులో పిటిషన్ వేసి న్యాయ వ్యవస్థను కూడా తప్పుదారి పట్టించే యత్నం జరి గిందా అనిపిస్తుంది. ప్రత్యేకించి పుంగనూరు, మాచర్ల, తంబళ్లపల్లె నియోజకవర్గాలలోని పంచాయతీలపై ఈ ఫిర్యాదు చేశారు. కానీ వాటికి సంబంధించిన ఏకగ్రీవాలను ఎన్నికల కమిషన్ ఆమోదించిన తర్వాత ఇంక సమస్య ఎక్కడ ఉంటుంది. పైగా ఎవరైనా సంబంధిత గ్రామాలకు చెందినవారు పిటిషన్ వేస్తే దానికి అర్థం ఉంటుంది కానీ, లేదా నిర్దిష్ట ఆధారాలతో ఎవరైనా పిటిషన్ వేయవచ్చు కానీ, ఏదో రకంగా వైఎస్సార్సీపీని ఇబ్బంది పెట్టాలన్న లక్ష్యంతో పిటిషన్లు వేస్తే ఏమి చేయాలి? ప్రభుత్వ న్యాయవాది ఈ పిటిషన్లు విచారణార్హం కాదని వాదించారు. న్యాయమూర్తి ఈ పిటిషన్లలోని అంశాల లోతుల్లోకి వెళ్లడం లేదని కూడా స్పష్టం చేశారు. అయినా తెలుగుదేశం మీడియా జడ్జిగారు చేసిన ఒక వ్యాఖ్యను పతాక శీర్షికలలో పెట్టి వైఎస్సార్సీపీపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని హైకోర్టు అన్నదేమోనన్న భ్రమ కల్పించడానికి ప్రయత్నించింది. ఇవన్నీ చూస్తుంటే అసలు పోటీ వైఎస్సార్సీపీకి, తెలుగుదేశం మీడియాకు మధ్య జరుగుతుందేమోనన్న అనుమానం వస్తుంది. మొత్తం మీద గ్రామ పంచాయతీ ఎన్నికలు వైఎస్సార్ కాంగ్రెస్‌కు పెద్ద బూస్ట్ మాదిరిగా ఉంటే, తెలుగుదేశం పార్టీ తనకు వచ్చిన తక్కువ స్థానాలకే ఆత్మ సంతృప్తి చెందినట్లు కనిపించడం ఒక ప్రత్యేకతగా భావించాలి. బహుశా వచ్చే రెండు దశల ఎన్నికలు, మున్సిపల్, మండల, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీకి ఇది ఒక వ్యూహం కావచ్చు. పంచాయతీ ఎన్నికలు ముగిశాక పార్టీ గుర్తులతో జరిగే మున్సిపల్, మండల, జెడ్పీ ఎన్నికలు మరింత రాజకీయ వేడి పుట్టిస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. - వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు -
సంభ్రమం.. ఈ సమరం
ఢిల్లీలో 1988లో ఉత్తరప్రదేశ్ రైతులు జరిపిన బోట్ క్లబ్ ర్యాలీపై ఇద్దరు బీజేపీ ఎంపీలు స్పందిస్తూ రైతు తిరగబడితే దేశమే తిరగబడినట్లు అని వ్యాఖ్యానించారు. అయితే నాటి ప్రతిపక్షం కాస్తా నేడు ప్రభుత్వం అయింది. ఈరోజు బీజేపీ ఎంపీలు 303 మంది. కానీ వారి స్వరం మారి, వ్యంగ్యం రాజముద్రై ప్రజాస్వామికవాదులని వెక్కిరిస్తోంది. కేంద్రం తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉత్తర భారత రైతులు ఉద్యమరూపం తీసుకున్నారు. ఆందోళనల్లో తోటివారు చనిపోతున్నా సరే ‘నిబ్బరం’గా ఉద్యమాన్ని నడుపుతున్నారు. ముళ్ళకంచెల వద్ద పూలమొక్కలు నాటుతామంటున్న రైతుల స్థితప్రజ్ఞత ప్రశంసనీయమైనది. శిబిరాల్లోని రైతులు తాము అనుకున్నది సాధించేవరకూ కదలమంటున్నారు. 1988 పార్లమెంటు శీతాకాల సమావేశాలకి ముందు ఢిల్లీ అంతకుముందు ఎరుగని కొత్త ఆందోళనతో బెంబేలెత్తింది. చెరకు మద్దతు ధర పెంచాలని, విద్యుత్, నీటి బకాయిలు రద్దు చేయాలని పశ్చిమ యూపీ నుంచి కదం తొక్కుతూ వచ్చిన అయిదు లక్షలమంది రైతులు బోట్ క్లబ్ పచ్చికబయళ్ళ మీదుగా ఇండియా గేట్ వరకూ నిండిపోయారు. భారత కిసాన్ సమితికి చెందిన మహేంద్ర సింగ్ తికాయత్ దీనికి నాయకత్వం వహించాడు. ఊరేగింపులు, నినాదాలు, ఉపన్యాసాల నియమబద్ధ ఆందోళన కాదది. లక్షలమంది రైతులు తమ పల్లెజీవితాన్ని తెచ్చి కాస్మో పాలిటన్ ఢిల్లీకి అతికించారు. వారు కాలినడకన పరుగులు పెడుతూ, ఎడ్లబళ్లని ఉరుకెత్తించి, ట్రాక్టర్లు బారులు తీర్చివచ్చారు. తమతోపాటు గేదెలు, ఆవులు తోలుకొచ్చారు, వాటికి పచ్చిక మేపి రెండుపూటలా పాలు పిండారు, పుట్టగొడుగులు మొలిచినట్లు గుడారాలు వేసుకున్నారు. నున్నటి తారు రోడ్లమీద వంటబట్టీలు పెట్టారు, మంచం బద్దీలను మడిచి తెచ్చి, ఇక్కడ విప్పి ఎండుగడ్డి పడకలు వేసుకున్నారు. పాటలు పాడారు, పంచాయతీలు నడిపారు. అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం రైతుల 35 డిమాండ్ చార్టర్ని లెక్కచేయలేదు. ఒకరోజు అనుకున్న నిరసన కాస్తా వారమయింది. రాజ్యం కుయుక్తితో ఆహార పదార్థాలకి అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి, నీటి సదుపాయాలను బంద్ చేసింది. ఎత్తుకి పైఎత్తు వేసిన రైతులు, ఢిల్లీ సంపన్నవర్గాలు తిరిగే ప్రాంతాలను మలమూత్ర విసర్జనతోనింపేశారు. పారిశుధ్యం పెద్దవిషయం అయింది. ఇతరేతర కారణాలు కూడా తోడై ప్రభుత్వం రైతుల డిమాండ్లకు సూత్రప్రాయంగా తలొగ్గింది. హక్కులను సాధించుకోవడానికి అంతవరకూ ఉన్న నిరసన చట్రాలను బోట్ క్లబ్ రాలీ బద్దలుగొట్టింది. పల్లెలకి ఆగ్రహం వస్తే అది ఎంత స్వాభావికంగా, కరపచ్చిగా ఉంటుందో తెలిసివచ్చింది. అప్పటి బీజేపీకి పార్లమెంటు బలం– ఇద్దరు ఎంపీలు. వారు ఈ ర్యాలీ మీద స్పందిస్తూ ‘‘7 రోజులపాటు జరిగిన బోట్ క్లబ్ ర్యాలీ– రాబోయే మరిన్ని ర్యాలీలకి సూచన. రైతు తిరగబడితే దేశమే తిరగబడినట్లు’’ అన్నారు. భవిష్యత్తుని చక్కగా ఊహించారు. అయితే ప్రతి పక్షం కాస్తా ప్రభుత్వం అయింది. ఈరోజు బీజేపీ ఎంపీ సీట్లు 303. స్వరం మారి, వ్యంగ్యం రాజముద్రై ప్రజాస్వామికవాదులని వెక్కిరిస్తోంది. ముప్పై రెండు శీతాకాలాలను దాటుకుని బోట్ క్లబ్ ర్యాలీ ఉత్తేజం బోర్డర్లకి చేరింది. దాదాపు ఆర్నెల్ల కిందట కేంద్రం తీసుకువచ్చిన మూడు ఆర్డినెన్సులపై నిప్పు రాజుకుంది. ఢిల్లీ, పంజాబ్, హరి యాణా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల రైతులు వాటికి వ్యతిరేకంగా ఉద్యమరూపం తీసుకున్నారు. సరైన చర్చ లేకుండా హడావుడిగా ఆమోదింపజేయడంలో అంతిమంగా పెట్టుబడిదారుల ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు రైతులు భావిస్తున్నారు. వ్యవసాయ చట్టాలవల్ల జరగబోయే లాభనష్టాల మీద విస్తృతంగా జరుగుతున్న చర్చతో పాటు, సింఘు, టిక్రీ, ఘాజీపూర్ సరిహద్దుల్లోని రైతు ఉద్యమ స్వభావాన్ని సరిగా అర్థం చేసుకోవడం అవసరం. ఎక్కడ సమస్య కనపడితే అక్కడ ప్రత్యక్షమయ్యే ‘ఆందోళన్ జీవుల’ మాదిరిగా నేను కూడా ఈ మూడు ప్రాంతాలూ తిరిగాను. ‘ఎముకలు కొరికే చలిలో లక్షలాది రైతులు రోడ్లమీద నిస్సహాయంగా పడి ఉంటే!’ తరహా మూస విశ్లేషణలు, పడికట్టు పదాలు పనికిరావని అర్థమయింది. ఆ రైతులేం మామూలుగా రాలేదు, ‘దమ్ లగా కె హైసా’ అంటూ సరిహద్దుల మీదకి కుప్పించి దూకారు. పాత అనుభవానికి, కొత్త సాంకేతికతని జోడించి వచ్చారు. వారి వెనుక మండీలు, ఖల్సాలు, ఎన్జీవోలు ఉన్నాయేమోనని వెతకడం కాదు ముఖ్యం, వారు దేనికోసం, ఎవరికి ఎదురుగా, ఎంత స్థిరంగా నిలబడి ఉన్నారన్నది ముఖ్యం. రెండునెలలుగా సాగుతున్న ఆందోళనల్లో తోటివారు చనిపోతున్నాసరే ధైర్యం, సాహసం, పౌరుషం, పట్టుదల– ఒక్కమాటలో చెప్పాలంటే ‘నిబ్బరం’గా ఉద్యమాన్ని నడుపుతున్నారు. మూడు సరిహద్దు ప్రాంతాల్లో తిరుగుతున్నపుడు అకస్మాత్తుగా ప్రత్యేక ఆవరణంలోకి వెళ్ళినట్లు ఉంటుంది. రిపబ్లిక్ డే ఘటన తర్వాత నాలుగంచెల నిర్బంధ వలయాలు పెట్టారు. అవి దాటుకుని అడ్డదారుల గుండా లోపలికి వెళితే రైతుసముద్రం అలలై పలకరిస్తుంది. ఉద్యమం స్థానీయముద్రతో నడవడం ఎలా ఉంటుందంటే రచ్చబండ ఉదయాలు పేపర్లు ముందేసుకుని రాజకీయాలను వాడి వేడిగా చర్చిస్తూ ఉంటాయి. చేయి సాచి అడగకుండానే పెద్దపెద్ద లంగర్లు– గాజర్ హల్వా, పనీర్ రోటీ, ఆలూ బోండా, దూద్ కా మీఠాలతో ఆకలిని రుచికరంగా తీరుస్తాయి. నీలంరంగు దుస్తులు, సాంప్రదాయక వేషధారణతో చేతికి, మొలకి కర, కిర్పణులు ధరించిన ఖల్సా భక్తులు మేలుజాతి గుర్రాలు ఎక్కి నిర్బంధ వలయాలకి ఇవతల పహారా కాస్తుంటారు. ప్రతి ట్రాక్టరు గుడారం వేసుకుని వెచ్చనిగూడులా మారి మెత్తలు, కంబళ్ళతో ఎముకలు కొరికే చలిని ఓడిస్తుం టుంది. గుమిగూడి గుండ్రంగా కూచున్న పగిడీపెద్దలు–ఇళ్లనుంచి దుమ్ముదులిపి తెచ్చుకున్న పురాతన హుక్కాగొట్టాలను తన్మయత్వంతో పీలుస్తుంటారు. వేలాదిమంది టెంట్లకింద నిల్చుని, కూచుని, నడుంవాల్చి పెద్దపెద్ద వేదికల మీది ఉపన్యాసాలు వింటుంటారు. అప్పటివరకూ కులాసాగా సెల్‌ఫోన్ చూస్తూ ఉన్న యువకుడిని ఏ వార్త విచలితుడిని చేస్తుందో ఏమో రివ్వున లేచి జెండా చేతబూని తనొక్కడే ఒక సైన్యమై ‘కిసాన్ జిందాబాద్’ అంటూ అశ్శరభశ్శరభలు వేస్తాడు. బల్లేబల్లే గీతాలతో హోరెత్తుతూ కొన్ని ట్రాక్టర్లు బుర్రుమంటూ సాగుతుంటాయి. కళ్ళవెనుక విషాదాలను దాచుకున్న పంజాబీ మహిళా జలపాతాలు ఆకాశానికి పిడికిళ్ళు ఎత్తుతారు. పిల్లలు విస్ఫారిత నేత్రాలతో నవలోకాన్ని చూస్తుంటారు. వీరంతా– ఎవరో చెప్పి కూడగట్టితే రంగంలోకి దిగినవారు కాదు. బలీయమైన తక్షణ ఉద్వేగాలు, అవసరాలు గుండెనుంచి తన్నుకు వస్తుంటే నిలవలేక కాలు మోపినవారు. కమ్యూన్ జీవితాన్ని కలలు కనేవారికి ఈ ఉద్యమ ప్రాంతాలు సజీవ ఉదాహరణలు. పదిమంది కూడి వంటలు వడ్డనలు, మీటిం గులు, పంచాయతీలు, ఊరేగింపులు, కాపలాలు, పారిశుధ్యం, ఒకటేమిటి! సామూహిక చేతన బలం కనబడుతూ ఉంటుంది. ఎన్నెన్ని యంత్రాలంటే! వేలమందికి ఒకేసారి టీ మరిగించేవి, రొట్టెలు తయారు చేసేవి, బట్టలు ఉతికేవి, అంట్లు తోమేవి అనేకం. తాత్కాలి కంగా కట్టిన పాఠశాలలు, గురుద్వారాలు, ఆసుపత్రులు, పుస్తకశాలలు, పార్టీ ఆఫీసులు, ఆఖరికి రైతులకి న్యాయ సహాయం అందించడానికి లాయర్లతో కూడిన బెంచ్– ఇక్కడ జీవితం విస్తరిస్తూనే ఉంది. ఉద్యమం మీద నిర్బంధాన్ని మరింత మొరటుగా చూపడానికి కేంద్రం కాస్త సమయం తీసుకుంటుంది. ఎందుకంటే ప్రజలలో బలమైన వర్గాలు ప్రభుత్వంతో తలపడుతున్నపుడు లెక్కలు చాలా మారతాయి. అలాగే ‘ముజఫర్‌నగర్‌లో జాట్లకి ముస్లిములు ప్రకటించిన సంఘీభావం ఆసక్తికరం. ఎడమొహం పెడమొహంగా ఉన్న భిన్న ప్రజాశ్రేణుల ఏకీకరణకి ఇటువంటివి సాయపడతాయి. ఈ ఐక్యత ఏలినవారికి గుబులు రేపుతుంది. ముళ్ళకంచెల వద్ద పూలమొక్కలు నాటుతామంటున్న రైతుల స్థితప్రజ్ఞతని నీరుకార్చే పథకరచన చాపకింద నీరులా సాగుతోంది. రైతులేమో అనుకున్నది సాధించేవరకూ కదలమంటున్నారు. అక్కడనుంచి వచ్చేసేపుడు గొప్ప ఉత్తేజమూ వల్ల మాలిన బెంగా కలనేత భావంగా మారాయి. మసకచీకట్లూ మంచుతెరలూ పల్చగా కమ్ముకుంటున్న క్షణాల్లో తిరిగి చూసుకుంటూ నడుస్తున్నాను. టిక్రీ మెట్రోవంతెన కిందున్న గుడారం వెలుపల హుక్కా పీల్చుతున్న ఒక సర్దార్జీ ఆలాపన మొదలుపెట్టాడు. పంజాబీ గ్రామీణ యాస ఉన్న మార్మిక స్వరమది. ఆ గేయపు భావం చెవులను తాకి నన్ను వణికించింది. ‘‘ఓ సోదరీ! పున్నమిరోజు నువ్వు కట్టిన రక్షాబంధన్ సాక్షిగా చెపుతున్నాను, రాత్రి గడిచాకే ఇంటికి తిరిగి వచ్చేది. నేను రాకుంటే సూర్యుడు ఎప్పటికీ ఉదయించడని గ్రహించు.’’ కె.ఎన్. మల్లీశ్వరి వ్యాసకర్త ఒక ఆందోళన జీవి, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఈ–మెయిల్: malleswari.kn2008@gmail.com -
ఉక్కు ‘ఆకాంక్ష’ను నిలబెట్టుకుందాం
ఉమ్మడి ఏపీలో 1960లలో ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసిన మహోద్యమ ఫలితం విశాఖ ఉక్కు కర్మాగారం. ప్రభుత్వాల మెడలు వంచిన తెలుగు ప్రజల ఆకాంక్షకు కట్టెదుటి రూపం విశాఖ స్టీల్. ఇప్పుడు నష్టాలలో ఉందన్న కారణంగా దాన్ని ప్రైవేటీకరించాలని నీతి ఆయోగ్ సిఫారసు చేయడం, దానిపై ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ ఆమోద ముద్ర వేయడమే పరమ విషాదం. ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ సుమారు నలభై వేల మందికి ఉపాధి కల్గించే ఏకైక సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో ఇది ఒక్కటే. ఏడాదికి రూ. 1,500 కోట్లు ఆర్థిక సాయం చేసి, కావాల్సిన గనిని కేటాయించి ఈ పరిశ్రమను లాభాలబాటలో పెట్టడం ప్రభుత్వ సమర్థత అవుతుంది కానీ, ఎలాగోలా వదిలించుకోవాలని చూడటం సమర్థత ఎలా అవుతుంది? విశాఖపట్నం ఉక్కు కర్మాగారం మరోసారి వార్తల్లోకి వచ్చింది. తెలుగు ప్రజలకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక భావోద్వేగంతో కూడిన విషయంగా ఈ ఉక్కు కర్మాగారం నిలుస్తుంది. దీనిని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించాలని నిర్ణయించడం ప్రజలలో భయాందోళనలకు దారి తీస్తుంది. ప్రైవేటు వారికి ఇవ్వడం అంటే అది మూతపడినట్లేనేమోనన్న అనుమానాలే కారణం. నిజానికి ఏదైనా మరో పెద్ద గ్రూప్ కంపెనీకి అప్పగించి, దీనిని బాగా రన్ చేస్తే, నష్టాల నుంచి లాభాల బాటలో పడితే ఎవరూ కాదనరు. కానీ మిగిలిన కంపెనీలు వేరు. ఈ కంపెనీ వేరు. ఈ ఉక్కు కర్మాగారం కోసం 1960వ దశకంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా ఉర్రూతలూగే ఉద్యమం జరిగింది. చివరికి ప్రజల ఆకాంక్షను గుర్తించిన ఆనాటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ విశాఖ స్టీల్‌కు శంకుస్థాపన చేయడం ద్వారా ఆ కలను నెరవేర్చారు. కానీ ఇప్పుడు ఆ కంపెనీ నష్టాలలో ఉందన్న కారణంగా ప్రైవేటీకరించాలని నీతి ఆయోగ్ సిఫారసు చేయడం, దానిపై ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ ఆమోద ముంద్ర వేయడం సహజంగానే ఆంధ్రులకు తీరని ఆవేదన మిగుల్చుతుంది. ఇది కేవలం ఆ కంపెనీలో పనిచేసే వేలాది ఉద్యోగులకు మాత్రమే సంబంధించింది కాదు. అది ఆంధ్రప్రదేశ్‌కు ఒక మణిహారం వంటిది. అసలే ఏపీలో పరిశ్రమలు పెద్దగా లేవన్న భావన ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ఒక సంస్థ ప్రైవేటుపరం అయితే ఏ పరిణామాలు జరుగుతాయోనని అంతా భయపడుతున్నారు. ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ సుమారు నలభై వేల మందికి ఉపాధి కల్గించే ఏకైక సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో ఇది ఒక్కటే ఉందని చెప్పాలి. గతంలో కూడా ఈ కంపెనీకి కొన్ని గండాలు ఎదురైనా, వాటిని అధిగమిస్తూ ముందుకు సాగింది. సొంత గని లేకపోవడం, అప్పుల భారం, అధిక వడ్డీ చెల్లింపు మొదలైన కారణాలతో ఈ సంస్థ నష్టాల ఊబిలో కూరుకుపోయింది. సాధారణంగా ప్రైవేటు కంపెనీ అయినా ప్రభుత్వ కంపెనీ అయినా, ముందుగా దానిని ఎలా బాగు చేయాలని ఆలోచిస్తారు. రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితి వస్తే అప్పుడు దానిని అమ్మకానికి పెట్టడమో, మరో చర్య తీసుకోవడమో చేస్తారు. అవేవి చూడకుండానే నేరుగా అమ్మకానికి పెట్టడం అంటే ప్రభుత్వం తన అసమర్థతను తెలియచేయడమే అనుకోవాలి. నిజానికి మన దేశంలో బ్యాంకులకు వేల కోట్లు ఎగవేసిన బడాబాబుల నుంచి అందులో కొంత డబ్బు వసూలు చేయగలిగినా, ఇలాంటి సంస్థలు ఢోకా లేకుండా నడుస్తాయనిపిస్తుంది. ఉదాహరణకు ప్రస్తుతం బీజేపీలో చేరిన టీడీపీ ఎంపీ సుజనా చౌదరి బ్యాంకులకు ఎన్నివేల కోట్లు ఇవ్వాలి? అలాగే మరో పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వంటివారు వేల కోట్లు ఎగవేసి ఇతర దేశాలకు పరారయ్యారు. ఆ సంగతి అలా ఉంచితే కడప జిల్లాలో మరో ఉక్కు కర్మాగారానికి కేంద్రం హామీ ఇచ్చింది. అది నెరవేరలేదు. ఎవరినైనా ప్రైవేటు పెట్టుబడిదారులను తీసుకువచ్చి ఆ ప్లాంట్‌ను నెలకొల్పాలని ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇంతలో పులిమీద పుట్రలా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వివాదం మొదలైంది. నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఈ విషయంలో చాలా మంది ఏపీ బీజేపీ నేతలు కూడా మనస్ఫూర్తిగా సమర్థించ లేకపోతున్నారు. ఈ విషయంలో వారు ఆత్మరక్షణలో పడుతున్నారు. వారి మిత్రపక్షంగా ఉన్న జనసేన కూడా దీనిపై నిరసన తెలిపింది. మరో వైపు అన్ని పార్టీల కార్మిక సంఘాలు దీనిపై ఆందోళనలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాని మోదీకి స్పష్టమైన రీతిలో ఒక లేఖ రాశారు. ముప్పై రెండు మంది ఆత్మార్పణతో ఈ పరిశ్రమ ఏర్పాటైందన్న సంగతి గుర్తుచేసి, ప్రజ లకు, ఈ ప్లాంట్‌కు ఉన్న భావోద్వేగ సంబంధాన్ని ఆయన తెలియచేశారు. ఈ ప్లాంట్‌కు 19,700 ఎకరాల భూమి ఉంది. దాని విలువే లక్ష కోట్ల రూపాయల వరకు ఉంటుందని సీఎం వివరించారు. రెండేళ్లు కష్టపడితే ఈ ఫ్యాక్టరీ దారిలో పడుతుందని ఆయన సూచించారు. గత ఏడాది డిసెంబర్ నుంచి ఏడాదికి 63 లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తి చేసే సంస్థగా ఇది తయారైంది. నెలకు 200 కోట్ల లాభం ఆర్జించే దశకు ఇది చేరుకుందని ఆయన వివరించారు. ఈ ఫ్యాక్టరీకి సొంత ఇనుప ఖనిజ గనిని కేటాయించాలని , అలాగే ఈ సంస్థకు ఉన్న 22 వేల కోట్ల రుణాలను ఈక్విటీగా మార్చి వడ్డీ భారం తగ్గించగలిగితే ప్లాంట్ నడవడం కష్టం కాదని ఆయన అబిప్రాయపడ్డారు. కేంద్ర ఉక్కుశాఖతో కలిసి ఏపీ ప్రభుత్వం దీనిపై పనిచేయడానికి సిద్ధంగా ఉందని, అందువల్ల ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోవాలని ఆయన కోరారు. లక్ష కోట్ల విలువైన భూమి ఉన్నప్పుడు, అందులో ఐదోవంతు అప్పు ఉంటే పెద్ద ప్రమాదం ఉండకపోవచ్చు. ఏడాదికి రూ. 1,500 కోట్లు లేదా, వెయ్యి కోట్ల ఆర్థిక సాయం చేసి, కావాల్సిన గనిని కేటాయించి ఈ పరిశ్రమను లాభాలబాటలో పెట్టడం ప్రభుత్వ సమర్థత అవుతుంది కానీ, ఎలాగోలా వదిలించుకోవాలని చూడడం సమర్థత ఎలా అవుతుంది? ఇప్పటికే మోదీ ప్రభుత్వం పలు ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. కేంద్రం సంగతి ఎలా ఉన్నా, అవసరమైతే విశాఖ స్టీల్‌ను నడపడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధపడడం మంచి పరిణామమే అయినా, అందుకు తగ్గ ఆర్థిక వనరులను సిద్ధం చేసుకోవలసి ఉంటుంది. ఆర్థిక కష్టాలలో ఉన్న ఏపీ ప్రభుత్వానికి ఇది చిన్న విషయం కాదు. ప్రత్యామ్నాయ ఆలోచనలు చేయడం మంచిదే. కానీ మోయలేని భారం పెట్టుకుని తర్వాత ఇబ్బంది పడకుండా ఉండవలసిన అవసరం కూడా ఉంటుంది. ఒక వైపు ముఖ్యమంత్రి జగన్ ఇలా ఆచరణాత్మక రీతిలో ప్రతిపాదనలు చేయడం, ప్రధాన మంత్రికి లేఖ రాయడం, ఇది ఏపీ ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశంగా తెలియచేయడం వంటివి చేస్తుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఎప్పటి మాదిరి దిక్కుమాలిన రాజకీయం చేయడానికి పూనుకున్నారు. ప్రధానమంత్రి మోదీని కానీ, కేంద్ర ప్రభుత్వాన్ని కానీ తప్పు పడుతూ ఒక్కమాట కూడా ట్విట్టర్లో రాయలేని చంద్రబాబు సీఎం జగన్‌పై మాత్రం ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్‌ను అమ్మకానికి పెట్టడం ఏమిటి? చంద్రబాబేమో అది జగన్ ప్రభుత్వానికి సంబంధించిందన్నట్లు మాట్లాడడం ఏమిటి? జగన్‌పై ద్వేషం ఉండవచ్చు. తనను ఆంధ్ర ప్రజలు ఘోరంగా ఓడించారన్న దుగ్ధ ఉండవచ్చు. అదే సమయంలో ప్రధానమంత్రి మోదీ అంటే భయం ఉండవచ్చు. కానీ సంబంధం లేకుండా జగన్‌పై ఆరోపణలు చేస్తే ప్రజలు నవ్వుకుంటారన్న సంగతి ఆయనకు తెలియాలి. ప్రతిదానిలో నీచ రాజకీయం చేయడమే రాజకీయాలకు అర్థం అని చంద్రబాబు భావిస్తే ఎవరం ఏమీ చేయలేం..గతంలో తానే పెద్ద సంస్కరణల వీరుడనని చెబుతూ అనేక సంస్థలను ప్రైవేట్ పరం చేసిన చరిత్ర చంద్రబాబుది. ఉదాహరణకు నిజాం షుగర్స్‌ను ప్రైవేటు కంపెనీకి అప్పగించారు. అలాగే ఆల్విన్, పలు సహకార కర్మాగారాలు అన్ని కలిపి 700 కోట్ల విలువైన వాటిని సుమారు 200 కోట్లకే విక్రయించేశారన్న విమర్శలున్నాయి. అలాంటి చంద్రబాబు ఇప్పుడు విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ గురించి ప్రధాని మోదీని తప్పుపట్టకుండా, సంబంధం లేని జగన్‌ను విమర్శిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం దీనిని ఎప్పటిమాదిరే నడుపుతూ, లాభాల బాటలోకి వెళ్లడానికి అవసరమైన చర్యలు చేపట్టడమో, లేదా ముఖ్యమంత్రి జగన్ కోరినట్లు కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి ఈ ప్లాంట్‌ను నడిపేలా చర్యలు తీసుకోగలిగితే విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు అన్న నినాదం అర్థవంతంగా మారి ప్రజలకు మేలు కలుగుతుంది. మరి ఆ దిశగా కేంద్రం, ప్రధాని మోదీ ఆలోచించాలని ఆశిద్దాం. కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
హలధారులే కానీ.. హంతకులు కారు
ఏనాడూ ఎకరం భూమిని దున్ని ఎరుగని, పొలంలో విత్తనాలు చల్లడం, ఒక టన్ను ధాన్యం పండించడం ఎరుగని కుటుంబంలోంచి వచ్చిన కంగనా రనౌత్ ఆహార ఉత్పత్తిదారులపై తనదైన తీర్పు చెబుతూ ఉండటం గమనార్హం. నిజానికి గుర్రపుస్వారీ చేసే, కత్తి సాము చేసే కుటుంబ వారసత్వం నుండి కంగనా వచ్చింది. హిమాచల్‌ప్రదేశ్‌లో రాజభవనంలో నివసిస్తున్న కంగనా రనౌత్‌కి, దేశంలోని సకల ప్రజానీకానికి జీవనదానం చేస్తున్న విత్తనాలను నాగేటి చాలులో రైతులు ఎలా చల్లుతారో కూడా బహుశా తెలిసి ఉండకపోవచ్చు. ఈ సచిన్ టెండూల్కర్‌లకు, ఈ కంగనా రనౌత్‌లకు వ్యవసాయం గురించి ఏం తెలుసని? ప్రత్యేకించి రైతులకు వ్యతిరేకంగా కంగనా రనౌత్ వాడిన భాష దేశాన్నే కాదు.. ప్రపంచాన్నే నివ్వెరపర్చింది. భారతీయ రైతులు ఉగ్రవాదులంటూ కంగనా రనౌత్ పదే పదే దాడిచేస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాత పాప్ గాయని రిహానా, అంతర్జాతీయ పర్యావరణ ఉద్యమకారిణి గ్రేటా థెన్‌బర్గ్ భారతీయ రైతుల ఉద్యమాన్ని బలపర్చినందుకు స్పందనగా కంగనా మన రైతులను ఉగ్రవాదులను చేసిపడేశారు. సచిన్ టెండూల్కర్, ఇతర బీజేపీ అనుకూల శక్తులుకూడా దీనికి వంతపాడారు. ఈ సెలబ్రిటీల్లో చాలామంది గుత్తపెట్టుబడి దారీ సంస్థలకు అనుకూలంగా ఉంటారు. భారతీయ రైతులు, వ్యాపార, పారిశ్రామిక వర్గాల మధ్య ఘర్షణ నెలకొన్నప్పుడు ఎవరి వైపు నిలబడాలి అని తేల్చుకోవడానికి కులపరమైన సామాజిక స్థానమే కీలకపాత్ర పోషిస్తుంది. అంతర్జాతీయ అభిప్రాయాలు అనేక అంశాలపై వ్యక్తమవుతూ ఉంటాయి. నిజానికి బీజేపీ/ఆరెస్సెస్ శక్తులు అనేక సందర్భాల్లో అంతర్జాతీయ మద్దతును తమకు అనుకూలంగా కూడగడుతూ వచ్చాయి. నిర్భయ ఘటన సమయంలో అలాంటి అంతర్జాతీయ అభిప్రాయాలు చాలా వ్యక్తమయ్యాయి. అవి చాలావరకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండేవి కాబట్టి ఆరెస్సెస్/బీజేపీ కూటమి చాలా సంతోషంగా అలాంటి అంతర్జాతీయ అభిప్రాయాలను స్వాగతించేది. మన రైతులు ఈ స్థాయిలో ఆందోళనను నిర్వహించడం నా జీవితకాలంలోనే చూసి ఎరుగను. ఈ సచిన్ టెండూల్కర్‌లకు, ఈ కంగనా రనౌత్‌లకు వ్యవసాయం గురించి ఏం తెలుసని? ప్రత్యేకించి రైతులకు వ్యతిరేకంగా కంగన వాడిన భాష దేశాన్నే కాదు.. ప్రపంచాన్నే నివ్వెరపర్చింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ద్వారా భారతీయ శూద్ర రైతులపై ఎక్కుపెట్టిన క్షత్రియ బాణమే కంగనా రనౌత్ అనేది అందరికీ తెలిసిందే. నేను ఇంత బలంగా ఎందుకు చెబుతున్నానంటే, ఆందోళన చేస్తున్న రైతులు చాలావరకు శూద్రులే. ఇక క్షత్రియులు ఒక సామాజిక వర్గంగా ఎన్నడూ నాగలి చేత బట్టి ఎరుగరు. వారి చేతుల్లో ఎస్టేట్ల కొద్దీ భూములున్నప్పటికీ తమ చారిత్రక ఉనికిలో క్షత్రియులు నాగలి పట్టలేదు. పొలాలను దున్నడం అనేది వారి సామాజిక హోదాకు భంగకరమని వీరి భావన. ఆసక్తికరమైనదేమిటంటే, ఉత్తరప్రదేశ్‌కి చెందిన జాట్లు రాకేష్ తికాయత్ నాయకత్వంలో ప్రస్తుతం రైతాంగ ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఉండటమే. అయినప్పటికీ ఖలిస్తాన్‌తో ఈ ఆందోళనను ముడిపెట్టి పంజాబ్ రైతుల ఉద్యమాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు కంగనా చెబుతూ వస్తోంది. వ్యవసాయ ఉత్పత్తికి, దానిద్వారా వ్యాపారం చేసి లాభాలు సాధించాలని కోరుకుంటున్న వ్యాపార వర్గాలకు మధ్య స్పష్టమైన విభజన రేఖ ఉంది. రైతులు భారతదేశ చరిత్రలో ఎన్నడూ వ్యాపార సముదాయంగా మారలేదు. దేశంలో ఇప్పుడు కమ్మ, రెడ్డి, వెలమ, కాపు, లింగాయత్, జాట్, గుజ్జర్, యాదవ్, మరాఠా వంటి కులాల ప్రజలు గుత్తాధిపత్య వాణిజ్యంలోకి ఎన్నడూ అడుగు పెట్టలేదు. అదే సమయంలో బడా వ్యాపారం మొత్తంగా బనియాలు, బ్రాహ్మణులు, కాయస్థులు, ఖాత్రిస్ వంటి వారి చేతుల్లో ఉండిపోయింది. ఇటీవలే క్షత్రియులు కూడా వాణిజ్యంలోకి అడుగుపెడుతున్నారు. ఈ కులపరమైన విభజన కారణంగానే రైతుల భయాలు రెట్టింపవుతున్నాయి. ఏనాడూ ఎకరం భూమిని దున్ని ఎరుగని, పొలంలో విత్తనాలు చల్లడం, ఒక టన్ను ధాన్యం పండించడం ఎరుగని కుటుంబంలోంచి వచ్చిన కంగనా రనౌత్ ఆహార ఉత్పత్తిదారులపై తనదైన తీర్పు చెబుతూ ఉండటం గమనార్హం. నిజానికి గుర్రపుస్వారీ చేసే, కత్తి సాము చేసే కుటుంబ వారసత్వం నుండి కంగనా వచ్చింది. హిమాచల్ ప్రదేశ్‌లో రాజభవనంలో నివసిస్తున్న కంగనా రనౌత్‌కి, దేశంలోని సకల ప్రజానీకానికి జీవనదానం చేస్తున్న వనరు అయిన విత్తనాలను నాగేటి చాలులో ఎలా చల్లుతారో కూడా తెలిసి ఉండకపోవచ్చు. తెలుగు కవి అస్తా గంగాధర్ రైతు గురించి రాసిన పాట యూట్యూబ్‌లో ట్రెండ్ సెట్టర్ అయింది. ’’ఓ కర్షకుడా నీవే మా హీరో, ఓ రైతా నీవే మా లెజెండ్, ఓ రైతా బురదలోంచి ఆహారం పండిస్తావు, నీవు ఆహారం పండించకుంటే కంప్యూటర్లు పనిచేయవు, నీవు ఆహారం పండించకుంటే రోబోలు నడవలేవు, నీవు ఆహారం పండించకుంటే సైనికులు తుపాకులు పేల్చలేరు’’ అని సాగుతుందా గీతం. జాతికి నిజమైన కథానాయకుడైన ఈ రైతును, జాతి నిజమైన దిగ్గజమైన ఈ రైతును కంగనా పదేపదే ఉగ్రవాది అని పిలుస్తోంది. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సుదీర్ఘకాలంగా సాగిస్తున్న తర్వాత వారి ఉద్యమంపట్ల ఈ అంతర్జాతీయ స్పందన ఎలా వచ్చింది? ఈశాన్య భారతదేశానికి చెందిన తొమ్మిదేళ్ల గిరిజన బాలిక, పర్యావరణ వాది కంగుజమ్ ప్రపంచానికి సందేశమిస్తూ గడ్డకట్టించే చలిలో కరోనా మహమ్మారి కాలంలో ఢిల్లీ సరిహద్దుల్లో ఆరుబయట నిరసన తెలుపుతున్న రైతుల పట్ల స్పందించాల్సిందిగా కోరారు. ‘‘ప్రియ స్నేహితులారా, లక్షలాది మన పేద రైతులు చలికి గజ గజ వణుకుతూ వీధుల్లో నిద్రిస్తున్నారు. మీ నుంచి వారు ఏమీ ఆశిం చడం లేదు. వారు సాగిస్తున్న పోరాటానికి అనుకూలంగా కేవలం ఒక ప్రేమపూర్వకమైన ట్వీట్ చేయండి, సంఘీభావం ప్రకటించండి.. అదే వారికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మన భారతీయ సెలబ్రిటీల పని ముగిసిపోతుంది’’ అంటూ కంగుజమ్ ట్వీట్ చేసింది. మన సొంత పర్యావరణవాది, యువ ఆదివాసీ బాలిక చేసిన అభ్యర్థన రిహానాతో సహా పలువురు అంతర్జాతీయ సెలబ్రీటీలను కదిలించింది. ఢిల్లీ సరిహద్దులో అతి శీతల వాతావరణంలో బతుకుతున్న భారతీయ రైతు చిత్రాన్ని పోస్ట్ చేసిన రిహానా ‘మనం ఈ రైతుల నిరసన గురించి మాట్లాడలేమా’ అని ట్వీట్ చేశారు. ఈ ఆరుపదాల ట్వీట్ సుడిగాలిని సృష్టించింది. భారత్‌లో నడుస్తున్న రైతుల నిరసనకు మేం సంఘీభావం తెలుపుతున్నాం అంటూ ప్రపంచ ప్రసిద్ధ పర్యావరణ వాది గ్రేటా థన్ బెర్గ్ మద్దతు పలుకుతూ ట్వీట్ చేసింది. ఇక నటి, ఇన్‌స్ట్రాగామ్‌లో చురుకుగా ఉండే అమందా సెర్నీ కూడా తన మద్దతును తెలిపింది. ప్రపంచం గమనిస్తోంది. సమస్యను అర్థం చేసుకోవడానికి మీరు ఇండియన్, పంజాబీ లేక దక్షిణాసియా వాసి కావాల్సిన పనిలేదు. వాక్ స్వాతంత్రం, పత్రికా స్వేచ్ఛ, కనీస మానవ, పౌర హక్కుల సమానత్వం, కార్మికులను గౌరవించడం ఇవే మనం డిమాండ్ చేయవలసినవి అంటూ అమందా ఫార్మర్స్ ప్రొటెస్ట్, ఇంట ర్నెట్ షట్‌డౌన్ హ్యాష్ ట్యాగ్లు జతకలిపి మరీ సందేశం పంపింది. ఈ అంతర్జాతీయ ట్వీట్లకు స్పందిస్తూ కంగనా వారు రైతులు కాదు, భారత్‌ను విడదీయాలను చూస్తున్న ఉగ్రవాదులు అంటూ ట్వీట్ చేసింది. రిహానాను నోర్మూసుకో అంటూ దూషించడమే కాకుండా, గ్రేటా థెన్బర్గ్ను కూడా అనరాని మాటలతో నిందించింది. రైతు ఉద్యమాన్ని ఖలిస్తాన్ ఉగ్రవాద ఉద్యమంగా ముద్రించాలని చూస్తున్న కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతుగా ఆమె తెగ రెచ్చిపోయింది. తన ఆరేళ్ల పాలనలో ప్రధాని మోదీ మొదటి సారిగా అతిపెద్ద రాజకీయ తప్పిదానికి పాల్పడ్డారు. తాను అధికారంలోకి రావడానికి రెండుసార్లు ఓట్లేసిన రైతులపై మోదీ దాడి చేశారు. మరోవైపున రైతులను ఉగ్రవాదులుగా వర్ణించడాన్ని వ్యతిరేకిస్తూ రైతు కుటుంబాలనుంచి వాస్తవ మేధావులు అసంఖ్యాకంగా పుట్టుకొచ్చి తమ తమ ప్రాంతీయ భాషల్లో, తమ సొంతపాటలు, కథలు, నవలలు రాస్తూండటం గమనార్హం. ఈ విధంగా రైతుల ఆందోళన ఒక కొత్తతరం రాతను, పాటను, నృత్యాన్ని గ్రామాల్లో ప్రభావితం చేసింది. సోషల్ మీడియాకు రెండు కోణాలు ఉన్నాయి. ఒక నిర్దిష్ట దశలో అది ఆరెస్సెస్/బీజేపీకి అనుకూలంగా పనిచేసింది. కానీ ఇప్పుడు దాని భాష మారుతోంది. ఎందుకంటే ఉగ్రవాదిగానో, జాతి వ్యతిరేకి గానూ ముద్ర వేసి తొక్కేసేటంత తక్కువ జాతీయవాదిగా మన రైతు నేడు లేడు. ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
రైతుల చుట్టూ కాదు.. గుండెల్లో మేకులు
రైతుల సమస్య పరిష్కారం విషయంలో ప్రభుత్వ అహమే అడ్డొస్తోందని కార్పొరేట్ మీడియాకు, బీజేపీ శ్రేణుల్లో చాలామందికి కూడా తెలుసు. విధానం కాదు, కార్పొరేట్ వర్గాలకు చేసిన వాగ్దానాల అమలు కాదు. సాగుచట్టాల పవిత్రత కాదు.. రాజు అసలు తప్పు చేయడు అనే అహమే దీనికి కారణం. తప్పులు అంగీకరించి వాటినుంచి బయటపడటం ఇక్కడ జరగదు. దేశంలోని ప్రతి ఒక్క రైతూ ప్రభుత్వం నుంచి వ్యవస్థ నుంచి వేరుపడిపోయినా సరే దేశాధినేతది తప్పు కానేకాదు. ఇదే నిజమని తెలుస్తున్నా అతిపెద్ద పత్రికల్లో ఏ ఒక్కటీ కనీసం గుసగుసల రూపంలో కూడా దీన్ని వ్యక్తం చేయడం లేదు. మనమెందుకు దీన్ని గురించి మాట్లాడకూడదు అనే ఒక్క ట్వీట్‌కు వచ్చిన అమిత స్పందన కూడా పాలకుల అహాన్ని కరిగించడం లేదు. లక్షలాదిమంది మానవులకు విద్యుత్, నీరు అందకుండా చేయడం, తద్వారా వారిని తీవ్రమైన ఆరోగ్య సమస్యల బారిన పడేయడం, పోలీసు, పారామిలటరీ బలగాలతో వారి చుట్టూ బ్యారికేడ్లు కట్టడం, ఎటూ పోనివ్వకుండా చేసి వారిని అత్యంత అనారోగ్య పరిస్థితుల్లోకి నెట్టడం, నిరసన తెలుపుతున్న రైతుల వద్దకు జర్నలిస్టులు వెళ్లడం అసాధ్యమయ్యేలా కాంక్రీట్, ఐరన్ బ్యారికేడ్లు నిర్మించడం, చలి వాతావరణంలో శరీర ఉష్ణోగ్రతలు పడిపోయి గత రెండు నెలలుగా 200 మంది రైతులు ప్రాణాలు కోల్పోవడం.. ఢిల్లీ శివార్లలో నెలకొంటున్న ఘోరపరిణామాల్లో ఇవి కొన్ని మాత్రమే.. ప్రపంచంలో మరెక్కడైనా ఇలాంటివి జరిగితే అనాగరికమైవిగానూ, మానవ హక్కులపై పెనుదాడిగా కనిపించేవి. కానీ మన ప్రభుత్వం, కులీన పాలకవర్గం వీటికి మించిన సమస్యల్లో తలమునకలవుతున్నాయి. భూమ్మీద అతి గొప్ప దేశంమైన భారత్‌ను అప్రతిష్ట పాలుచేయడానికి, అవమానించడానికి ప్రయత్నిస్తున్న రిహానా, గ్రేటా థన్‌బెర్గ్ అనే భయంకరమైన అంతర్జాతీయ ఉగ్రవాదుల కుట్రను వమ్ము చేయడం ఎలా అనే విచికిత్సలో మనం కూరుకుపోతున్నాం మరి. ప్రతిరోజూ ఢిల్లీ శివార్లలో ప్రజాస్వామ్యాన్ని చీల్చిపడేస్తున్న ఇలాంటి పరిణామాలును వ్యవస్థానుకూల వర్గాలు కూడా అమోదించలేదని మీరు భావించవచ్చు. తాము తీసుకొచ్చిన సాగు చట్టాలపై రైతులతో ఎలాంటి సంప్రదింపులూ జరపలేదనీ మన మంత్రులకు తెలుసు. వ్యవసాయం రాష్ట్రాల పరిధిలో ఉన్నప్పటికీ ఈ చట్టాల రూపకల్పనలో కేంద్రప్రభుత్వం రాష్ట్రాలతో ఎలాంటి సంప్రదింపులూ జరపలేదు. చివరకు ప్రతిపక్షాలతో కానీ, పార్లమెంటులో కానీ దీనిపై చర్చించడానికి పూనుకోలేదు. కేంద్ర ప్రభుత్వాధినేత ఏ విషయంలోనూ కేబినెట్‌తో చర్చించిన పాపాన పోలేదు. పంజాబ్‌లో దాదాపు ప్రతి కుటుంబంలోనూ కనీసం ఒకరు రైతు నిరసనకారులుగా మారిపోయారు. కొందరు ఇప్పటికే వారిలో కలిసే ప్రక్రియలో ఉంటున్నారు. ఫిబ్రవరి 14న జరుగనున్న పట్టణ స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులను నిలపడానికి కూడా బీజేపీ కొట్టుమిట్టాడుతోంది. ఈలోగా పంజాబ్‌లోని ఒక తరం యువత మొత్తంగా వేరుపడిపోయింది. భవిష్యత్తులో దీని ప్రభావాలు తీవ్రాతితీవ్రంగా ఉండబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం సాధించిన అతి గొప్ప విజయం ఇదేమరి. సాంప్రదాయికంగా ప్రత్యర్థులుగా ఉండే రైతులు, కమిషన్ ఏజెంట్లతో సహా విభిన్న సామాజిక శక్తులను భారీ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఏకం చేసింది. పైగా కేంద్రం సిక్కులను, హిందువులను, ముస్లింలను, జాట్స్‌ని, జాట్లు కానివారిని మాత్రమే కాకుండా కాప్ పంచాయితీలను, ఖాన్ మార్కెట్లలో పనిచేసేవారిని కూడా ఒకటిగా చేసేసింది. నిజంగానే ఇది ముచ్చట గొలిపే విషయం. అయితే ఇది పంజాబ్, హరియాణాకు మాత్రమే పరిమితమని కొన్ని ప్రశాంత స్వరాలు రెండునెలలుగా చెప్పుకుంటూ కాలం గడిపేస్తున్నాయి. తమాషా కలిగించే విషయం ఏమిటంటే, సుప్రీంకోర్టు గతంలో నియమించని ఒక కమిటీ పంజాబ్, హరియాణాలు భారత యూని యన్‌లో భాగమని చెప్పి ఉండటమే. కాబట్టి అక్కడేం జరిగినా అది మనందరినీ ప్రభావితం చేస్తుందని గ్రహించాలి. అయితే సంస్కరణలను ప్రతిఘటిస్తున్నది సంపన్న రైతులేనని కొందరు ఇప్పటికీ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇక దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే, గత ఎన్ఎస్ఎస్ సర్వే ప్రకారం పంజాబ్‌లో ఒక సగటు కుటుంబం ఆదాయం రూ. 18,059లు. ఒక్కో రైతు కుటుంబంలో కనీసం అయిదుగురు సభ్యులుంటారు. అంటే తలసరి నెలవారీ ఆదాయం రూ. 3,450 లు అన్నమాట. అంటే సంఘటిత రంగంలో అత్యంత తక్కువ వేతనం పొందే ఉద్యోగి కన్నా రైతుల తలసరి ఆదాయం తక్కువ అన్నమాట. హరియాణాలో ఒక్కో వ్యవసాయ కుటుంబంలో 5.9 మంది వ్యక్తులకు నెలవారీ ఆదాయం రూ. 14,434లు మాత్రమే. అంటే తలసరి రూ. 2,450లు మాత్రమే రైతు కుటుంబాలకు అందుతున్నాయి. అయితే ఇంత తక్కువ ఆదాయం కూడా చాలామంది భారతీయ రైతులకంటే అధిక స్థానంలో హరియాణా రైతులను ఉంచుతోంది. ఉదాహరణకు గుజరాత్ సగటు రైతుకుటుంబం ఆదాయం రూ. 7,926లు. ఇక్కడ కుటుంబంలో 5.2 మంది వ్యక్తులు ఉండొచ్చు. అంటే గుజరాత్ రైతు కుటుంబ తలసరి ఆదాయం రూ. 1,524లు మాత్రమే. భారతీయ రైతుకుటుంబాల సగటు నెలవారీ ఆదాయం రూ. 6,426లు (తలసరి ఆదాయం రూ. 1,300లు). పైగా ఈ సగటు నెలవారీ లెక్కలు కూడా రైతులకు అన్ని మార్గాల నుంచి వచ్చే ఆదాయ వనరులను కలిపే చెబుతుంటాయి. ఇక సంపన్నరైతులే నిరసన చేస్తున్నారనే వాదన అసంగతం. ఢిల్లీ సరిహద్దుల్లో రెండు సెల్సియస్ డిగ్రీలకంటే తక్కువ ఉష్ణోగ్రతలో ట్రాక్టర్ల ట్రాలీల్లో నిద్రిస్తున్నవారు, అయిదారు డిగ్రీల చలిలో స్నానం చేస్తున్నవారు.. ఈ భారతీయ సంపన్నరైతులు నా ప్రశంసలకు మరిం తగా నోచుకుంటున్నారు. వీరు మనం ఊహించిన దానికంటే కఠిన పరిస్థితులను తట్టుకోగలుగుతున్నారు. ఈలోగా రైతులతో చర్చించడానికి సుప్రీంకోర్టు నియమించిన కమిటీ తనలో తాను చర్చించుకోవడం ఇప్పటికీ సాధ్యం కావడం లేదు. నిరసన తెలుపుతున్న రైతులను బెదిరించడానికి, రెచ్చగొట్టడానికి చేసే ప్రతి ప్రయత్నమూ వారికి మద్దతునిచ్చే వారి సంఖ్యను పెంచుతోంది. రైతుల విశ్వసనీయతను దెబ్బతీయడానికి ఉద్దేశించిన ప్రతి చర్యా వ్యవస్థానుకూల మీడియాలో గొప్పగా ప్రచారం పొందుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం వ్యతిరేక ఫలితాలను పొందుతోంది. భయపెట్టే అంశం ఏమిటంటే రైతులకు అధిక మద్దతు లభించే కొద్దీ ప్రభుత్వం మరింత నిరంకుశంగా, పైశాచికంగా వారిపై దాడులు పెంచడానికి సిద్ధమైపోతోంది. రైతుల సమస్య పరిష్కారం విషయంలో ప్రభుత్వ అహమే అడ్డొస్తోందని కార్పొరేట్ మీడియాకు, బీజేపీ శ్రేణుల్లో చాలామందికి కూడా తెలుసు. విధానం కాదు, కార్పొరేట్ వర్గాలకు చేసిన వాగ్దానాల అమలు కాదు. సాగుచట్టాల పవిత్రత కాదు.. రాజు అసలు తప్పు చేయడు అనే అహమే దీనికి కారణం. తప్పులు అంగీకరించి వాటినుంచి బయపడటం ఇక్కడ జరగదు. దేశంలోని ప్రతి ఒక్క రైతూ ప్రభుత్వం నుంచి వ్యవస్థ నుంచి వేరుపడిపోయినా సరే దేశాధినేతది తప్పు కానేకాదు. ఇదే నిజమని తెలుస్తున్నా అతిపెద్ద పత్రికల్లో ఏ ఒక్కటీ కనీసం గుసగుసల రూపంలో కూడా దీన్ని వ్యక్తం చేయడం లేదు. మనమెందుకు దీన్ని గురించి మాట్లాడకూడదు అనే ఒక్క ట్వీట్‌కు వచ్చిన అమిత స్పందన కూడా పాలకుల అహాన్ని కరిగించడం లేదు. మనమెందుకు దీనిపై మాట్లాడకూడదు అంటూ రిహానా చేసిన ఆ ఏకవాక్య ప్రకటన ఏ ఒక్కపక్షాన్నీ బలపర్చలేదు. ఐఎమ్ఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్, కమ్యూనికేషన్స్ డైరెక్టర్ ఇద్దరూ నేరుగా సాగు చట్టాలను బలపరుస్తూనే రైతులకు సేఫ్టీ యంత్రాంగాలను అందించాలని సన్నాయి నొక్కు నొక్కారు. పొగతాగే వారి సిగరెట్ ప్యాకెట్లపై ఉండే అధికారిక హెచ్చరికకు మించిన విలువ వారి అభిప్రాయాలకు ఉండదనుకోండి. మొత్తం మీద ఆ అమెరికన్ పాప్ సింగర్, ఒక 18 ఏళ్ల స్కూల్ గర్ల్ కమ్ పర్యావరణ కార్యకర్త ఇప్పుడు దేశానికే ప్రమాదకర వ్యక్తులైపోయారు. వారిపై కఠిన చర్యలు తీసుకునే పనిలో మన ఢిల్లీ పోలీసులు మునిగిపోయారు. మన దేశంపై వీరు జరిపిన కుట్రకు అంతర్జాతీయ మూలాలనే కాకుండా గ్రహాంతరాల్లో మూలాలను కూడా వెతికి పట్టుకునే క్రమంలో ఢిల్లీ పోలీసులకు అవహేళనలు ఎదురైతే నేను దాంట్లో భాగమై ఉండను. పి. సాయినాథ్ వ్యాసకర్త పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా సంస్థాపకులు (ది వైర్ సౌజన్యంతో) -
వ్యవసాయాన్ని వెనక్కినెట్టిన బడ్జెట్
నూతన చట్టాల రద్దును డిమాండ్ చేస్తూ ఢిల్లీ శివార్లలో నిరసన తెలుపుతున్న వేలాదిమంది రైతులకు, దేశ రైతాంగానికి ఈ ఏడు బడ్జెట్ మిశ్రమ సంకేతాలను పంపించింది. ఒకవైపు వ్యవసాయం, సహకారం, రైతుల సంక్షేమానికి పెట్టే వ్యయంపై 2021–22 బడ్జెట్ 8.5 శాతం కోత విధించింది. మరోవైపు ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకంపై ఈ బడ్జెట్లో 13 శాతం కోత విధించారు. రైతులకు నగదు బదిలీ చేసే ఈ పథకానికి గత ఏడాదితో పోలిస్తే 10 వేల కోట్ల రూపాయలను తగ్గించివేశారు. కౌలురైతులు, మహిళారైతులు, ఆదివాసీ రైతులు వంటి భూమి పట్టాలేని వారిని కూడా ఈ పథకంలో చేర్చాలని డిమాండ్ చేస్తుండగా ఉన్న పథకంపైనే కోత వేశారని మహిళా కిసాన్ అధికార్ మంచ్ నాయకురాలు కవితా కురుగంటి వాపోయారు. ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న రైతులు కనీస మద్దతు ధర ద్వారా కనీస రాబడి కోసం ప్రశ్నిస్తున్న తరుణంలో వారి మనోభావాలను గౌరవిస్తూ వ్యవసాయ రాబడులను పెంచడానికి కొన్ని ఏర్పాట్లను 2021–22 బడ్జెట్లో చేరుస్తారని అందరూ భావించారు. పైగా గ్రామీణ కొనుగోలు డిమాండ్‌ను పెంపొందించడానికి తగుచర్యలు తీసుకోవాలని పలువురు ఆర్థికవేత్తలు కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో.. ప్రత్యక్ష నగదు మద్దతు ద్వారా, ఆందోళన చేస్తున్న రైతులు చేతిలో మరింత నగదును అందించడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాస్త ఉదారంగా వ్యవహరిస్తారని భావించారు. దీనికి బదులుగా ఈ సంవత్సరం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద కేటాయింపులను రూ. 75 వేల కోట్లనుంచి 65 వేల కోట్లకు తగ్గించేశారు. ఈ పథకం కింద భూ యజమానులకు సంవత్సరానికి మూడు వాయిదాల్లో రూ.6 వేల నగదును రైతుల ఖాతాలకు బదిలీ చేస్తున్నారు. ఈ పథకంలో ఈ సారి భూమిలేని కౌలు రైతులను కూడా చేరుస్తారని నేను ఆశించాను. గత ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికాల్లో వ్యవసాయం మాత్రమే దేశానికి వెలుగు చూపినందున ఒక్కొక్క రైతుకు నగదు బదిలీ కింద చెల్లించే మొత్తాన్ని ఈ యేడు రూ.18 వేలకు పెంచుతారని అందరూ భావించారు. దీనికోసం అదనంగా రూ. 1.5 లక్షల కోట్లను బడ్జెట్లో కేటాయించవలసి ఉంటుంది. అయితే వ్యవసాయ రంగానికి ప్రస్తుతం కేటాయించిన బడ్జెట్ దాదాపు గత యేడు బడ్జెట్‌కు సరిసమానంగానే ఉండటం గమనార్హం. గత సంవత్సరం వ్యవసాయరంగానికి సవరించిన అంచనా ప్రకారం రూ. 1.45 లక్షల కోట్లను కేటాయించగా ఈ ఏడు రూ. 1.48 లక్షల కోట్లను కేటాయించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ పరపతి పరిమితిని రూ. 15 లక్షల కోట్లనుంచి రూ. 16.5 లక్షల కోట్లకు పెంచి నప్పటికీ రైతులను రుణ ఊబి నుంచి బయటపడేసేందుకు మరికొన్ని చర్యలు చేపట్టాలని దేశంలో కొనసాగుతున్న వ్యవసాయ దుస్థితి సూచించింది. దీనికి గాను వ్యవసాయంలో ప్రభుత్వ రంగ మదుపులను పెంచాల్సి ఉంది. ఆర్బీఐ లెక్కల ప్రకారం 2011–12 నుంచి 2017–18 మధ్య కాలంలో వ్యవసాయంలో ప్రభుత్వ రంగ మదుపులు మొత్తం బడ్జెట్లో కేవలం 0.4 శాతం మాత్రమే కావడం గమనార్హం. కాబట్టి పెట్రోల్, డీజిల్‌పై సెస్ విధింపు ద్వారా వ్యవసాయ మదుపు నిధిని సృష్టించాలనే ఆర్థిక మంత్రి ప్రతిపాదనను స్వాగతించాల్సిందే కానీ రైలు, రోడ్డు, మూలధన మదుపు వంటివాటిపై చేసే ప్రకటనలకు మల్లే వ్యవసాయ మదుపుపై కూడా నిర్దిష్టమైన ఏర్పాట్లు చేయడం ఉత్తమమార్గంగా ఉంటుంది. వ్యవసాయరంగానికి ఇప్పుడు అత్యంత ప్రాధాన్యమైన విషయం ఏమిటంటే తగిన మార్కెటింగ్ మౌలిక వసతులను ఏర్పర్చడమే. భారత్‌లో వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్ కమిటీలు (ఏపీఎంసీ) క్రమబద్ధీకరించే 7 వేల మండీలు ఉంటున్నాయి. దేశంలో ప్రతి 5 కిలోమీటర్లకు ఒక మండీ చొప్పున ఏర్పర్చాలంటే ఇప్పటికిప్పుడు 42 వేల మండీలు అవసరం అవుతాయి. అయితే 22 వేల గ్రామ సంతలను మెరుగుపర్చి వాటిని ఎలక్ట్రానిక్ జాతీయ వ్యవసాయ మార్కెట్ (ఈ–నామ్)తో అనుసంధానం చేయాలనే ప్రభుత్వ వాగ్దానానికి ఇప్పటివరకు ప్రోత్సాహం లభించలేదని తెలుసుకున్నప్పుడు, గ్రామీణ మార్కెటింగ్ మౌలిక వసతులను ఏర్పాటు ఇక ఎంతమాత్రం నిర్లక్ష్యం చేయకూడని అంశంగా మనముందుకొస్తోంది. సాగుచట్టాలకు వ్యతిరేకంగా వేలాది మంది రైతులు నిరసన ప్రదర్శనలను నెలల తరబడి కొనసాగిస్తున్న సమయంలో 2021–22 బడ్జెట్ రంగంలోకి వచ్చింది కాబట్టి ఇటీవలి సంవత్సరాల్లో గోధుమ, వరి, కాయధాన్యాలు, పత్తి వంటి పంటలకు కనీస మద్దతు ధర ఎలా అందించాము అనే విషయాన్ని ఆర్థిక మంత్రి బడ్జెట్లో ప్రస్తావిస్తూ లబ్ధిదారుల సంఖ్యను కూడా వెల్లడించారు. అయితే సంపూర్ణంగా సాగు చట్టాలను రద్దు చేయాలని పోరాడుతున్న రైతులు ప్రభుత్వం చెబుతున్న కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేసి తమ హక్కులను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు. అంటే ప్రతి సంవత్సరం 23 పంట లకు గాను ప్రకటిస్తున్న కనీస మద్దతు ధరకంటే తక్కువ ధరను పెట్టి వ్యాపారం చేయడానికి వీలు ఉండదని దీనర్థం. వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులపై కనీసం 50 శాతం లాభాన్ని కనీస మద్దతు ధర అందిస్తోందని ప్రభుత్వం చెబుతున్న వివరాలను ఢిల్లీ శివార్లలో నిరసన తెలుపుతున్న రైతులు సవాలు చేశారు. స్వామినాథన్ కమిషన్ ప్రతిపాదనల ప్రకారం రైతులు పెట్టే విస్తృత ఖర్చులపై 50 శాతం లాభాన్ని కనీసమద్దతు ధర ఇవ్వాల్సి ఉంటుంది. స్వామినాథన్ కమిషన్ ప్రతిపాదించినట్లుగా రైతులకు కనీస మద్దతు ధర అంది ఉంటే 2020–21 బడ్జెట్లో అదనంగా రూ. 14,296 కోట్ల మేరకు పంజాబ్ రైతులు లబ్ధి పొందేవారు. మొత్తంమీద చూస్తే రైతుల చేతికి మరింత నగదు అందేలా చేస్తేనే ప్రధాని నరేంద్ర మోదీ చెప్పే సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అనేది సాధ్యపడుతుంది. ఇది దానికదేగా మరింత గ్రామీణ డిమాండును సృష్టిస్తుంది. ప్రాణాంతక కరోనా మహమ్మారి ఆర్థిక వ్యవస్థను ప్రశ్నార్థకం చేస్తున్న సమయంలో, గ్రామీణ డిమాండును సృష్టించి ఉంటే అది మొత్తం ఆర్థిక వ్యవస్థకు వరంలాగా పనిచేయడమే కాకుండా, ఆర్థికాభివృద్ధిని రాకెట్లాగా ముందుకు తీసుకెళ్లేది. ఉజ్వలంగా ప్రకాశించే వ్యవసాయ రంగం భారీ స్థాయిలో వ్యవసాయ అవకాశాలను సృష్టించడమే కాకుండా అనేక మంది జీవితాలను నిలబెట్టి ఉండేది. కాబట్టి ఒక్క వ్యవసాయ రంగమే ఆర్థిక వృద్ధికి సజీవ కేంద్రంగా మారగలిగి ఉండేది. నూతన వ్యవసాయ చట్టాల రద్దును డిమాండ్ చేస్తూ రెండున్నర నెలలకుపైగా ఢిల్లీ శివార్లలో నిరసన తెలుపుతున్న వేలాదిమంది రైతులకు, దేశ రైతాంగానికి ఈ యేడు బడ్జెట్ మిశ్రమ సంకేతాలను పంపించింది. ఒకవైపు వ్యవసాయం, సహకారం, రైతుల సంక్షేమానికి పెట్టే వ్యయంపై 2021–22 బడ్జెట్ 8.5 శాతం కోత విధించింది. మరోవైపు కేంద్రప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకంపై ఈ బడ్జెట్లో 13 శాతం కోత విధించారు. రైతులకు నగదు బదిలీ చేసే ఈ పథకానికి గత సంవత్సరంతో పోలిస్తే 10 వేల కోట్ల రూపాయలను తగ్గించివేశారు. మరోవైపున ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన బడ్జెట్ ప్రసంగంలో రైతులకు కనీస మద్దతు ధరను చెల్లించడంలో తమ ప్రభుత్వం ఘనమైన రికార్డును కలిగి ఉందని నొక్కి చెప్పారు. అలాగే లక్ష కోట్ల మేరకు వ్యవసాయ మౌలిక వసతుల నిధిని ప్రభుత్వ నిర్వహణలోని వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలకు అందిస్తామని మంత్రి తెలిపారు. అయితే ప్రభుత్వ నూతన సాగు చట్టాలు ఇంతవరకు కొనసాగుతున్న మండీల వ్యవస్థను, కనీస మద్దతు రేట్లను కుప్పగూల్చి సన్నకారు రైతులను కార్పొరేట్ సంస్థల దయాదాక్షిణ్యాలకు వదిలేస్తాయని రైతులు భయాందోళనలకు గురైనందువల్లనే సాగు చట్టాల రద్దుకోసం పోరాడుతున్నారనే విషయం మర్చిపోరాదు. అయితే ఇటీవలి సంవత్సరాల్లో బడ్జెట్ ప్రసంగాల మాదిరి కాకుండా తాజా బడ్జెట్ ప్రసంగంలో వ్యవసాయానికి సంబంధించిన ప్రకటనలకు పెద్దగా ప్రాధాన్యత లభించకపోవడం గమనార్హం. సోమవారం బడ్జెట్ ప్రసంగం ప్రారంభించిన గంట తర్వాతే వ్యవసాయరంగానికి కేటాయింపుల గురించి ఆర్థిక మంత్రి తడిమారు. పైగా వ్యవసాయ రంగ విశ్లేషకులను తాజా బడ్జెట్ పెద్దగా ప్రభావితం చేయలేదు. పీఎమ్ ఆషా, ధరల మద్దతు పథకం వంటి పథకాలకు ఈ ఏడు బడ్జెట్లో 20 నుంచి 25 శాతం దాకా కోత విధించారు. రైతులకు ఏటా తలసరి 6 వేల రూపాయలను అందిస్తున్న పీఎమ్ కిసాన్ పథకాన్ని ఈసారి 9 కోట్లమంది రైతులకే పరిమితం చేస్తూ సవరించారు. ప్రభుత్వం వాస్తవానికి 14.5 కోట్ల రైతు కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించుకుంది ఇది కూడా కోత పడటం రైతులు జీర్ణింప చేసుకోలేకున్నారు. కౌలురైతులు, మహిళారైతులు, ఆదివాసీ రైతులు వంటి భూమి పట్టాలేని వారిని కూడా ఈ పథకంలో చేర్చాలని మేం డిమాండ్ చేస్తుండగా ఉన్న పథకంపైనే కోత వేశారని మహిళా కిసాన్ అధికార్ మంచ్ నాయకురాలు కవితా కురుగంటి వాపోయారు. మౌలిక వసతుల నిధి పేరుతో ప్రకటించిన భారీ మొత్తాలు వాస్తవానికి బడ్జెట్ కేటాయింపుల్లో భాగం కాదని వీటిని రుణాల రూపంలో తీసుకోవలసిన ఫైనాన్స్ ప్రాజెక్టులని రైతులకు వీటితో ఒరిగేదేమీ లేదని రైతునేతలు చెబుతున్నారు. ఈ కోణంలో చూస్తే ఈ ఏటి బడ్జెట్ కూడా రైతాంగాన్ని సంతృప్తిపర్చే బడ్జెట్‌గా కనిపించడం లేదనే చెప్పాలి. దేవీందర్ శర్మ వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
ఈ ప్రశ్నలకు బదులేది?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నడిపినట్లు కనిపించడానికి మీడియా సమావేశాల్లో తాపత్రయపడుతున్నారు. కానీ ప్రశ్నలకు అవకాశం ఇవ్వకుండా వెళ్లిపోతున్న మొదటి కమిషనర్ ఆయనే కావచ్చు. ప్రజాస్వామ్యబద్ధం అని చెబుతూనే ఏకగ్రీవాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. బలవంతపు ఎన్నికలను ఆపడం సరేగానీ ఏకగ్రీవాలే జరగకూడదన్న చందంగా ఎందుకు మాట్లాడుతున్నారు? రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రమైన రాజకీయ పదజాలంతో కేంద్రానికి లేఖ ఎలా రాశారు? చంద్రబాబును, టీడీపీని కాపాడటానికే ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలకు ఆయనిచ్చే జవాబేమిటి? ఆయన వ్యవహార శైలితో వైఎస్సార్సీపీ ఇబ్బంది పడుతున్న మాట నిజం. ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకుంటారన్నది వాస్తవం.ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల వ్యవ హారం రోజుకో మలుపు తిరుగుతున్నట్లుగా కథ నడుస్తోంది. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు, వైఎస్సార్సీపీ నేతలకు మధ్య మాటల యుద్ధం తీవ్రమైందని చెప్పాలి. రెండు వ్యవస్థల మధ్య ఈ ఘర్షణ మంచిది కాదు. అయినా కొన్ని సార్లు ఇది తప్పకపోవచ్చు. ఎందుకంటే ఎవరి ప్రయోజనాలు వారికి ముఖ్యం అవుతాయి. నిమ్మగడ్డ రమేష్ వ్యవహార శైలితో వైఎస్సార్సీపీ కొంత ఇబ్బంది పడుతున్న మాట నిజం. చీటికి మాటికి ప్రభుత్వంపై ఫిర్యాదులు చేయడం, ముఖ్యమైన అధికారులను బదిలీ చేశాననీ, అభిశంసించా ననీ ప్రకటనలు చేయడం, తన సొంత యాప్‌లు తయారు చేయడం, గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం... ఇలాంటివన్నిటిని చేస్తున్న నిమ్మ గడ్డపై ప్రభుత్వంలోని పెద్దలు రాజకీయ విమర్శలు చేయక తప్పని పరిస్థితి. అది మంచి పరిణామం అని ఎవరూ అనరు. కానీ ఆ అవ కాశం ఇవ్వడం నిమ్మగడ్డ తప్పు కాదా? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్ని కలు నడిపినట్లు కనిపించడానికి మీడియా సమావేశాలలో తాపత్రయ పడుతున్నారు. చివరికి తన హృదయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి ఒక ప్రత్యేక స్థానం ఉందంటూనే, ఆ తర్వాత పరిణామాలలో వచ్చిన కేసులలో తాను సాక్షినని కూడా వెల్లడించ డంలో వ్యూహం కనబడుతుంది. నిజానికి ఈ విషయాలు ప్రస్తావించ వలసిన అవసరం లేదు. అయినా ఆయన మాట్లాడారు. మీడియా సమావేశంలో తను చెప్పదలిచింది చెప్పి, ప్రశ్నలకు అవకాశం ఇవ్వకుండా వెళ్లిపోతున్న మొదటి ఎన్నికల కమిషనర్ నిమ్మ గడ్డే కావచ్చు. అందులోనే ఆయన ప్రధాన బలహీనత కనిపిస్తుంది. ఈ మొత్తం ప్రక్రియలో నిష్పక్షపాతంగా లేరేమోనన్న అనుమానం కలగడా నికి ఈ విషయం సరిపోతుంది. నిజం చెప్పడానికి ఆలోచించవలసిన అవసరం లేదట. అదే అబద్ధం ఆడాలంటే చాలా ఆలోచన చేయాలట. ఎందుకంటే ఎప్పుడు ఏ అబద్ధం ఆడారో గుర్తుకు తెచ్చుకుని మరీ మాట్లాడాలి కాబట్టి అని ఒక నానుడి. నిమ్మగడ్డ అబద్ధాలు ఆడుతున్నా రని చెప్పడం లేదు కానీ, కొన్ని నిజాలు చెప్పలేకపోతున్నారన్నది వాస్తవం. తాను ఎంతో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నానని చెబుతూనే ఏకగ్రీవ ఎన్నికలకు వ్యతిరేకంగా ఎందుకు ప్రచారం చేస్తున్నారు? బలవంతపు ఎన్నికలను ఆపడం తప్పు కాదు. కానీ ఆ పేరుతో అసలు ఏకగ్రీవాలు జరగకూడదన్న చందంగా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మాట్లాడుతున్నారు. ప్రభుత్వం ఏకగ్రీ వంగా ఎన్నికలు జరిగే గ్రామాలకు రివార్డులు ప్రకటిస్తే దాన్ని ఆయన తప్పు పట్టడంలో దురుద్దేశం కనిపిస్తోంది. పైగా ఏకగ్రీవంగా జరిగే ఎన్నికలపై షాడో టీమ్‌లను పెడతామని కూడా బెదిరిస్తున్నారు. కొందరు అధికారులను భయపెట్టడానికి ఆయన ప్రయత్నిస్తున్న ట్లుగా ఉంది. అన్నిసార్లు ఆయనదే పైచేయి కాదనడానికి ఉదాహరణ సీనియర్ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్ బదిలీ తంతే. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌తో గొడవ ఎందుకులే అని వారిద్దరిని ముందుగానే బదిలీ చేస్తే, ఆయన దాన్ని తోసిపుచ్చారు. ఆ తర్వాత వారిని అభిశంసించి ఎన్నికల విధులకు అర్హత లేదని ప్రకటిం చారు. కనీసం వివరణ అడగకుండా, కక్షపూరితంగా, ద్వేషంతో వ్యవ హరించారనడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ ఏముంటుంది? నిజం గానే వారు అనర్హులు అయివుంటే ప్రభుత్వం బదిలీ చేసినప్పుడు ఓకే చేస్తే సరిపోయేది కదా. వారిని కావాలని అవమానించి, చివరికి తాను అప్రతిష్ట పాలయ్యారు. ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ ఇచ్చిన ఆదేశా లను తోసిపుచ్చింది. అసలు ఆ అధికారం ఈసీకి లేదని తేల్చింది. దాంతో వారిద్దరూ ఎన్నికల కమిషన్ కార్యాలయంలో వీడియో కాన్ఫ రెన్స్‌లో పాల్గొనడం అంటే ఎన్నికల కమిషనర్ చేసింది తప్పు అని ఒప్పుకున్నట్లే కదా. దీనిపై ఆయన సరైన వివరణ ఇవ్వగలిగారా? ఏకగ్రీవ ఎన్నికలను ప్రోత్సహించడం ద్వారా గ్రామాలలో కక్షలు వద్దని చెప్పవలసిన పెద్ద మనిషి, ఎన్నికల ద్వారా ఏదో నాయకత్వం వచ్చేస్తుందని, సామాజిక న్యాయం జరుగుతుందని కొత్త వాదన తెచ్చారు. ఏకగ్రీవ ఎన్నిక జరిగినా, రిజర్వేషన్ల ప్రకారం ఎవరి పద వులు వారికే ఉంటాయి. ప్రజలకు ఆ విషయం తెలియదని కమిషనర్ ఉద్దేశం అనుకోవాలి. ఆయా జిల్లాలలో పర్యటిస్తూ మీడియా అడిగిన ప్రశ్నలకు ఎందుకు సమాధానం ఇవ్వలేకపోతున్నారో అర్థం చేసుకో వచ్చు. ఆయన ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలిగితే ఆయన నిష్పా క్షికతను అంగీకరించవచ్చు. 2018లో జరపవలసిన పంచాయతీ ఎన్ని కలను ఇప్పటివరకు ఆయన ఎందుకు జరపలేదు? చంద్రబాబు ప్రభు త్వాన్ని ఈ విషయంపై ఎందుకు కనీసం సంప్రదించలేదన్న ప్రశ్నకు సమాధానం వస్తుందా? అప్పుడు గ్రామ స్వరాజ్యం, ప్రజాస్వామ్యం మంట గలిసినా, రాజ్యాంగం అమలు కాకపోయినా ఫర్వాలేదా? వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఎన్నికలు ఆరంభించి ప్రభుత్వంతో ఒక్క మాట చెప్పకుండా వాయిదా వేయడంలో ఎవరికి ప్రయోజనం చేకూర్చడానికి అన్న ప్రశ్నకు జవాబు ఇవ్వగలరా? రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రమైన రాజకీయ పదజాలంతో విమర్శలు చేస్తూ కేంద్రానికి ఒక లేఖ ఎలా రాశారు? ముందు తాను ఆ లేఖ రాయలేదనీ, ఆ తర్వాత తానే రాశాననీ ఎలా చెప్పారు? ఎందుకు చెప్పారు? చంద్రబాబును, టీడీపీని కాపాడటానికే అలా చెప్పారన్న ఆరోపణలకు రమేష్ కుమార్ ఇచ్చే జవాబు ఏమిటి? పార్క్ హయత్ హోటల్లో బీజేపీ నేతలను ఎందుకు కలిశారు? ఎన్నికల కమిషనర్ పదవీకాలం తగ్గించడానికి ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇవ్వడం, ఆ పరిణా మాలపై ఢిల్లీలో సుప్రీంకోర్టు ప్రముఖ లాయర్లకు ఇచ్చిన కోట్ల రూపా యల ఫీజు ఎలా చెల్లించగలిగారు? కరోనా కేసులు లేనప్పుడు ప్రభు త్వంతో సంప్రదించకుండా ఎన్నికలు వాయిదా వేసి, తదుపరి కరోనా కేసులు ఇప్పటికీ వందల సంఖ్యలో వస్తుంటే, వ్యాక్సినేషన్ జరుగు తున్న తరుణంలో ఎన్నికలు పెట్టాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? గత మార్చిలో మండల జెడ్పీటీసీ ఎన్నికలు నిలిచిపోగా, ఇప్పుడు వాటిని కాకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలు ముందుగా జరిపించడంలో ఉన్న కుట్ర ఏమిటి? తన పదవీకాలం మరో రెండు నెలల్లో ముగుస్తున్నందున, ఇప్పుడైతేనే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టవచ్చని, ఎన్నికల కోడ్ పేరుతో ప్రభుత్వాన్ని కదలకుండా చేయ వచ్చన్న ఉద్దేశం ఉందా, లేదా? అలా కాకపోతే ఇళ్ల పట్టాల పంపిణీ ఆపాలనీ, రేషన్ సరుకులు ఇళ్లకు చేరే కార్యక్రమం చేపట్టవద్దనీ లాంటి ఆదేశాలు ఎందుకు ఇస్తారు? అలాగే వాలంటీర్లు ఎన్నికలకు దూరంగా ఉండాలని చెప్పవలసిన అగత్యం ఏమిటి? వారి సేవలు వాడుకుంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు లాభం కలుగుతుందని భావించడం కాదా? పార్టీ రహితంగా ఎన్నికలు జరుగుతుంటే ఒక రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రణాళికను ప్రకటిస్తే దానిపై ఎందుకు కామెంట్ చేయలేదు? ఒక యాప్ పేరుతో ఎందుకు కొత్త హడావుడి చేయాలని అనుకుంటున్నారు? ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ కృష్ణారెడ్డిని పదవి నుంచి తొలగించాలనీ; మంత్రులు బొత్స ,పెద్దిరెడ్డి విమర్శలు చేయకుండా నిలువరించాలనీ చెబుతున్న రమేష్, తాను ఏ పార్టీకి కొమ్ము కాయడం లేదనీ, ఏ పార్టీ తప్పు చేసినా చర్య తీసు కుంటాననీ ఎందుకు అనడం లేదు? పైగా గవర్నర్‌ను ప్రతిపక్షాలు కలి శాయనీ, వారు చేసిన ఫిర్యాదులను ప్రామాణికంగా తీసుకుంటాననీ పరోక్షంగా చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అధికార పార్టీ తప్పులు చేయవచ్చు. అలాగే ప్రతిపక్షాలూ చేస్తాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేయడం సాధారణంగా జరిగేదే. కానీ ప్రతిపక్ష ఆరోప ణలకు వెంటనే స్పందిస్తున్న తీరు అనుమానాలకు తావివ్వదా? వైసీపీ నేతలు చేసిన విమర్శలకు నేరుగా సమాధానాలు ఎందుకు ఇవ్వలేక పోతున్నారు? కడపలో వ్యూహాత్మకంగా వైఎస్సార్‌ని పొగిడిన రమేష్ కుమార్ సీఎం వైఎస్ జగన్‌ను ఉద్దేశించి కేంద్రానికి రాసిన లేఖలో చేసిన ఆరోపణలు ఒక కమిషనర్ హోదాకు తగినట్లుగా ఉన్నాయా? సీబీఐ కేసుల గురించి ప్రస్తావించడం అంటే రాజకీయాలు మాట్లాడి నట్లు కాదా? తాను ఎలాంటి పనిచేసినా, అది రాజ్యాంగబద్ధం; ఎదు టివారు విమర్శలు చేస్తే అది హద్దులు దాటడమా? గవర్నర్ వైసీపీ ప్రముఖులపై చర్య తీసుకోకపోతే కోర్టుకు వెళతానని హెచ్చరించ వచ్చా? కమిషనర్‌లో ఇన్ని బలహీనతలు ఉన్నా తనకు రాజ్యాంగ పరి రక్షణ ఉందని, న్యాయ వ్యవస్థలో తనకు పట్టు ఉందని భావించి ఇష్టా రాజ్యంగా నడిస్తే ఎదుటివారు చూస్తూ ఊరుకుంటారా? రమేష్ కుమార్ నిజంగానే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరపడానికి సిద్ధ మైతే అది ఆచరణలో చూపించాలి. నీతులు ఎదుటివారికే కానీ తమకు కాదన్నట్లు ఎవరు వ్యవహరించినా ప్రజలు వాస్తవాలు అర్థం చేసుకుం టారన్నది వాస్తవం. కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
చేయి దాటకముందే మేలుకోవాలి
పరిష్కరించలేని సమస్య అంటూ ఏదీ లేదు. నివారించలేని యుద్ధం అంటూ ఏదీ ఉండదు. మనిషి వివేకం కోల్పోయినప్పుడే సమస్యలు తలెత్తుతాయి. క్షమాగుణం కరువైనప్పుడే ద్వేషాలు ప్రబలుతాయి. ఐదు నెలలుగా శాంతియుతంగా సాగుతున్న రైతు ఉద్యమం ఒక్కసారిగా హింసారూపం దాల్చింది. ఉద్యమాన్ని అప్రతిష్టపాలు చేయడానికే కుట్రపూరితంగా కొందరు హింసకు పాల్పడ్డారని రైతు సంఘాలు చెబుతున్నాయి. ఏమైనా పరిస్థితి ఇలా చేయిదాటడం అటు నిర్మాణాత్మకంగా సాగే ఉద్యమాలకూ మంచిది కాదు; ఇటు నవభారతాన్ని నిర్మించాల్సిన ప్రజాస్వామ్యానికీ పనికొచ్చేది కాదు. నేను గతవారం రాసిన ‘వ్యవసాయ చట్టాల వివాదాన్ని లోక్ అదాలత్‌కు రిఫర్ చేయ వచ్చా?’ అనే వ్యాసంలో ‘‘ఇంతవరకు రైతులు శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో రైతులను అభినందించింది. అందుకే వీలైనంత తొందరగా సమస్యను శాంతియుతంగా పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు, రైతు సంఘాలు, మేధావులు కృషి చేస్తారని ఆశిద్దాం’’ అని రాశాను. కానీ తరువాత జరిగిన పరిణామాలను చూస్తే సమస్యను పరిష్కరించే దిశగా కాకుండా వైరుధ్యాన్ని పెంచే విధానాన్ని అనుసరించారని స్పష్టమవుతుంది. అనివార్యమైన యుద్ధమంటూ ఏదీవుండదు, మనిషిలో విజ్ఞత లోపించినప్పుడే యుద్ధం వస్తుంది అన్నాడు బ్రిటన్ మాజీ ప్రధాని ఆండ్రూ బోనార్ లా. ‘ఎ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ నైన్’. సరియైన సమయంలో కుట్టు వేస్తే తొమ్మిది చినుగులను అరికట్టవచ్చు. అది వ్యక్తి ఆరోగ్యం కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, ప్రజల, రైతుల సమస్యలు కావచ్చు లేదా ప్రజా ఆందోళనల విషయంలో ప్రభుత్వ వైఖరి కావచ్చు. ఎవరు ఏ సమయంలో ఏం చేయాలో అది చేయగలిగితే తొంభై శాతం సమస్యలను పరిష్కరించవచ్చు. అరాచక శక్తుల కుట్ర గణతంత్ర దినోత్సవం రోజు జరిగిన రైతుల ట్రాక్టర్ ర్యాలీలో ఒక రైతు మరణించడం, అనేక మంది రైతులు, పోలీసులు గాయపడటం వంటి విషాదకర సంఘటనలు జరిగాయి. ఎర్రకోటపై రైతులు జెండాలు ఎగురవేశారు. అయితే ఈ ఉద్యమంలోకి విద్రోహకర శక్తులు ప్రవే శించాయా? గతంలో బీజేపీతో సన్నిహితంగా ఉన్నవారే కొందరు రైతులను ఎర్రకోట వైపు మరల్చారనీ, వారే ఎర్రకోటపై జెండా ఎగుర వేశారనీ కొందరు రైతు సంఘ నాయకులు ఆరోపించారు. పంజాబీ గాయకుడు, నటుడు దీప్ సిద్ధూ ఒకప్పుడు ప్రధాని మోదీతో, నటుడు సన్నీ దేవళ్తో ఫొటోలు దిగిన వ్యక్తి. ఆయనే స్వయంగా ఎర్రకోటపై జెండా ఎగుర వేశానని బహిరంగంగా ఫేస్ బుక్‌లో ప్రకటించాడు. అయితే ప్రభుత్వం ఇది ఖలిస్తాన్ వాదుల పని అనీ, ఎగరేసింది ఖలిస్తాన్ జెండా అనీ అసత్యాలను ప్రచారం చేస్తు న్నది. శాంతియుత రైతు ఉద్యమాలను అప్రతిష్టపాలు చేయడానికి కుట్రపూరితంగా కొందరు హింసకు పాల్పడ్డారని, ఎర్రకోట వైపు వెళ్లేలా కొంతమందిని రెచ్చగొట్టారని రైతు సంఘాలు చెబుతున్నాయి. ఏదిఏమైనా పరిస్థితి చేజారిపోయింది. ఇప్పటికైనా ఇటు ప్రభుత్వం, అటు రైతు సంఘాలు కళ్ళు తెరిచి శాంతియుతంగా సమస్యలు పరిష్క రిస్తారని ఆశిద్దాం. పదవుల నుంచి విరమణ చేసినవారు సలహాలు చెబుతుంటారు, వినాలా వద్దా? అంటే ఎవరి ఇష్టం వారిది. చెప్పడమే మా ధర్మం, వినకపోతే నీ ఖర్మం అని శ్రీకృష్ణుడే అన్నాడు. మహాభారత యుద్ధంలో దాదాపు కౌరవుల్లోని వీరాధివీరులు, కర్ణుని వంటి దాన శీలి, యావత్ కౌరవ వంశము, లక్షలాది మంది సైనికులు చనిపోయారు. అయితే కౌరవ వంశం నాశనం కాకూడదని విదురుడు, భీష్ముడు, ద్రోణా చార్యుడు మొదలైనవారు ధృతరాష్ట్రునికి, దుర్యోధనునికి ఎన్నోతీర్లుగా సలహాలు ఇచ్చారు. కానీ దుర్యోధనాదులు వినలేదు. ఫలితం అనుభ వించారు. ఒక పేరు మోసిన ఫ్యాక్షనిస్టు కుటుంబ సభ్యులను హత్య చేయడం, దానితో ఆ ఫ్యాక్షనిస్టు ప్రతీకార హత్యలకు పూనుకోవడం జరిగింది. ఈ పరిస్థితులు అన్నింటినీ గమనించి నేను హైకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు అతనికి బెయిల్ మంజూరు చేశాను. ఆ ఆర్డర్లో ఇక నుంచైనా నేర ప్రవృత్తిని మానుకుని శాంతియుత జీవితం కొనసాగిం చాలని చెప్పాను. అతడు ఒక రెండు మూడు నెలలు శాంతియుతంగా గడిపినా, మళ్లీ నేర ప్రవృత్తిని మానుకోలేకపోయాడు. ఫలితం ఏమైంది? కొద్దిరోజుల్లోనే అతను కూడా హత్యకు గురయ్యాడు. హింసతో హింసను, పగతో పగను, కక్షలతో కక్షలను ఎన్నడూ దూరం చేయలేము. ఒక కంటిలో పొడిచినవాడి కంటిలో మనమూ పొడుచు కుంటూ వెళితే ఈ ప్రపంచంలో ఎవరికీ కళ్లు ఉండవు. హింసకు ప్రతిహింస సమాధానం కాదు ఏ సమస్య అయినా ప్రశాంతంగా ఆలోచించి సరైన పరిష్కార మార్గం దిశగా అందరితో గౌరవంగా, ప్రేమగా మాట్లాడి అందరికీ న్యాయం జరిగే సూచనలు చేసినట్లయితే ఆ ప్రతిపాదనలను వారు అంగీకరించే అవకాశం ఉంది. నేను నెల్లూరు, ప్రకాశం జిల్లా జడ్జిగా పనిచేస్తున్న రోజుల్లో ఎన్నో గ్రామాల్లో ప్రజలందరితో మాట్లాడి వారందరూ మళ్లీ కలిసి మెలిసి ఉండేటట్లు వారి మధ్య ఉన్న సివిల్ క్రిమినల్ కేసులను పరిష్కరించాను. ఎన్నో గ్రామాలను ఎలాంటి తగాదాలు లేని గ్రామా లుగా మార్చాము. అలా పరిష్కరించామన్న తృప్తి కలిగింది. ఏ సమస్య అయినా ఆ సమస్య తీవ్ర దశకు చేరుకోక ముందే పరిష్క రించాలి. నీటిని వేడి చేస్తున్నాం అనుకుందాం. 98, 99 డిగ్రీల వరకు వేడి చేశాక కూడా ఇంకా వేడి చేస్తూ నీరు ఆవిరి కాకూడదు అంటే కాకుండా ఉంటుందా? నీటి కాలువకో, చెరువు గట్టుకో, ప్రాజెక్టుకో నెర్రెలు వచ్చినప్పుడు సకాలంలో రిపేరు చేస్తే ఆ కాలువ, చెరువు, లేదా ప్రాజెక్టు తెగిపోదు. అదే రోజుల తరబడి నిర్లక్ష్యం చేస్తే ఏదో ఒక రోజు తెగిపోతుంది. ఊళ్లకు ఊళ్లు మునిగి పోతాయి. సర్వనాశనం జరుగు తుంది. అది క్షయ కావచ్చు, మరో వ్యాధి కావచ్చు. మొదటి దశలోనే పూర్తి చికిత్స తీసుకుంటే 99 శాతం కేసుల్లో ఆ వ్యాధి నుంచి నివారణ పొందవచ్చు. మొదటి, రెండవ దశలను నిర్లక్ష్యం చేస్తే జరగబోయే పరిణామాలు చెడుగా ఉండవచ్చు. నెలల తరబడి రైతులు ఆందోళన చేస్తున్నారు. ఇంతవరకు ఏ రోజూ హింసకు పాల్పడలేదు. ఎప్పుడైతే ఆందోళన రోజుల తరబడి కొనసాగుతుందో ప్రజల ఓపిక నశించవచ్చు. లేదా అసంతృప్తి చెందిన కొందరు తమ అసంతృప్తిని చాటడానికి బల ప్రయోగానికి దిగవచ్చు. సుశిక్షితులైన పార్టీ కార్యకర్తలు ఉండి ఎక్కడ ఎలాంటి శక్తులు ఉద్యమం లోకి వస్తున్నాయో గమనించి వాళ్లను నివారించగలిగితే మేలు. అలాంటి నిర్మాణయుత సంస్థ ఉద్యమాలు చేపట్టడం వేరు. ఎంతో ఉన్నత లక్ష్యంతో ప్రారంభించబడిన ఉద్యమాలను కూడా చీల్చడానికి, బలహీనపరచడానికి వ్యతిరేక శక్తులు అరాచకవాదులను అందులోకి పంపుతాయి. అందుకే ఉద్యమనేతలు జాగ్రత్తగా ఉండాలి. మహాత్మా గాంధీ జరిపిన ఉద్యమంలో ఎక్కడ హింస చెలరేగినా వెంటనే ఉద్య మాన్ని ఆపివేసేవారు. అనేక ఉద్యమాలు శాంతియుతంగా మొదలైనా చివరకు హింసాత్మకంగా మారిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అందుకే చరిత్ర నుండి గుణపాఠాలు నేర్చుకోవాలి. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో జలియన్‌వాలాబాగ్ ఉదంతం తరు వాతనే బ్రిటిష్ అధికారుల మీద దాడులు జరిగాయి. భగత్‌సింగ్ ఉరితీత తరువాతనే సైనిక తిరుగుబాటుకు ఆలోచనలు బలపడ్డాయి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ నాయకత్వాన అజాద్ హింద్ ఫౌజ్ ఏర్పడింది. సిక్కుల స్వర్ణ దేవాలయంలో రక్తం పారిన తరువాతనే ఇందిరా గాంధీని హత్య చేయాలనే కుట్ర జరిగింది. శ్రీలంకలో తమిళ ఈలం దళాలపై దాడులు జరిగిన తర్వాతనే రాజీవ్ గాంధీ హత్యకు రూపకల్పన జరిగింది. ఢిల్లీలో సిక్కుల ఊచకోత తర్వాతనే ఖలిస్తాన్ వాదం బలపడింది. చేతులు కాలకముందే ఆకులు పట్టుకోవాలి నేను హింసను సమర్థించడం లేదు. హింస వల్ల ఏ సమస్యా పరి ష్కారం కాదు. కానీ ఒకరు హింసకు పాల్పడితే ఆ హింస వల్ల ఏర్పడిన పరిస్థితి ప్రతిహింసకు దారితీస్తుంది. అనేక మత కలహాల్లో, కుల విద్వేషాల్లో ఎందరో అమాయకులు బలయ్యారు. హింస వల్ల విలు వైన ప్రాణాలు పోతాయి. ఏదైనా తిరిగి వస్తుంది. కానీ ప్రాణం రాదు కదా! ప్రాణానికి విలువ ఇవ్వాలంటే హింసను మానుకోవాలి. ఇటు ప్రభుత్వం, అటు సంఘాలు, మరోవైపు కోర్టులు కక్షపూరిత ధోరణితో కాకుండా ప్రశాంతంగా ఆలోచనకు పూనుకోవాలి. క్షమాగుణం అలం కరించుకుని సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. ఈరోజు కుల విద్వేషాలు, మత విద్వేషాలు పెరుగుతున్నాయి. ఈ విద్వేషాలను తగ్గించకపోతే భవిష్యత్తు చీకటిమయం కాక తప్పదు. ఇప్పటికే పేదరికం, నిరుద్యోగం, రైతుల ఆత్మహత్యలు, మహిళలపై అత్యాచారాలు, కల్తీ, అవినీతి... ఇలా ఎన్నో సమస్యలతో దేశం సత మతమవుతోంది. వీటికి తోడు శాంతిభద్రతల సమస్య కూడా ఉత్పన్న మైతే అభివృద్ధి మొత్తంగా కుంటుపడుతుంది. అందుకే సత్వరం మేలు కోవాలి. వివేకంతో మసులుకోవాలి. చేతులు కాలక ముందే ఆకులు పట్టుకుంటారని ఆశిద్దాం. జస్టిస్ బి. చంద్రకుమార్ వ్యాసకర్త హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి మొబైల్ : 79974 84866 -
ఉద్యోగుల ప్రాణాలు గాలిలో దీపాలేనా?
దేశంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంకన్నా.. ప్రభుత్వాలు లేదా ఆయా వ్యవస్థల ద్వారా నియమితులైన వారే పవర్‌ఫుల్‌గా ఉంటారా? గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అలాగే అనిపించింది. ఎన్నికల ప్రక్రియ ఆరంభం అయిందన్న ఒకే ఒక కారణంతో న్యాయవ్యవస్థ ప్రభుత్వ వాదనను తోసిపుచ్చడం ఎంతవరకు మంచిదని ఆలోచించాలి. ఏపీలో పంచాయతీ ఎన్నికల విషయంలో న్యాయ వ్యవస్థ అన్ని కోణాలలో విచారణ జరపలేదనిపిస్తుంది. పైగా ఉద్యోగ సంఘాల వాదనను సుప్రీంకోర్టు అసలు పరిగణనలోకి తీసుకోకపోవడం ధర్మమేనా? తమ ప్రాణాలకు గండం తేవద్దని కోరితే న్యాయవ్యవస్థ పట్టించుకోకపోతే వారు ఎవరికి చెప్పుకోవాలి? ఏపీలో కరోనా కేసులు పెరిగితే ఎవరు బాధ్యత వహించాలి? ఏపీలో పంచాయతీ ఎన్నికల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనేక ప్రశ్నలకు తావిస్తోంది. ఈ తీర్పును ముఖతా చూస్తే ప్రభుత్వానికి కాస్త ఇబ్బంది కలిగించేదే కావచ్చు. కానీ ఆ ఇబ్బంది ఎవరి కోసం ఎదురైందన్నది చర్చనీయాంశం అవుతుంది. దాదాపు ఏడాది కాలంగా ప్రభుత్వానికి ఎన్నికల కమిషనర్‌కు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న మాట నిజమే కావచ్చు. రెండు వైపులా పట్టుదలలు ఉండవచ్చు. కాని రాజ్యాంగ వ్యవస్థగా భావించే ఎన్నికల కమిషనర్ నిష్పక్షపాతంగా ఉండాలని ఆశించడం తప్పు అవుతుందా? ఆయన ఏకపక్షంగా నిర్ణయాలు చేయడం సరైనది అవుతుందా అన్నది ఆలోచించాలి. ఎన్నికల విధులలో పాల్గొనే అధికారుల ఆరోగ్యం, ఓటు వేయడానికి వచ్చే ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉండదా? ఆ మాటకు వస్తే న్యాయ వ్యవస్థకు, ఎన్నికల కమిషన్‌కు కానీ ఆ బాధ్యత ఉండదా? కచ్చితంగా ఉంటుంది. కానీ పంతాలు, పట్టింపుల ముందు అవన్నీ వీగిపోతున్నాయి. దేశంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికన్నా ప్రభుత్వాలు లేదా ఆయా వ్యవస్థల ద్వారా నియమితులైన వారే పవర్ ఫుల్‌గా ఉంటారా? గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అలాగే అనిపిం చింది. కేవలం ఎన్నికల ప్రక్రియ ఆరంభం అయిందన్న ఒకే ఒక కారణంతో న్యాయవ్యవస్థ ప్రభుత్వ వాదనను తోసిపుచ్చడం ఎంతవరకు మంచిదని ఆలోచించాలి. అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో ఎలా చేయాలి అన్నది న్యాయ వ్యవస్థ ఆలోచిస్తున్నట్లుగా లేదు. కేవలం సాంకేతిక కారణాలతోనే నిర్ణయాలు చేయడం ప్రజలకు మేలు చేస్తుందా? లేదా అన్నది చూడాల్సిన అవసరం కూడా ఉంది. మొత్తం సమస్య అంతటినీ సమగ్రంగా పరిశీలించి నిర్ణయాలు ఇస్తున్నట్లుగా కనిపించడం లేదు. న్యాయవ్యవస్థ నిష్పాక్షికమేనా? అయినా కోర్టు వారిదే పూర్తి అధికారం కనుక వారిని మనం తప్పుపట్టజాలం. గౌరవించాల్సిందే. కాకపోతే ప్రజాభిప్రాయం ఒక రకంగా, న్యాయ లేదా ఎన్నికల వ్యవస్థల అభిప్రాయాలు మరో రకంగా ఉంటున్నాయనిపిస్తుంది. ఉదాహరణకు ఏపీ ఎన్నికల కమిషనర్ విషయాన్నే తీసుకుందాం. 2018లో జరపవలసిన ఎన్నికలను ఆయన అప్పుడు ఎందుకు పెట్టలేదని న్యాయవ్యవస్థ ఎందుకు ప్రశ్నించలేదో అర్థం కాదు. మూడు నెలల్లో ఎన్నికలు జరపాలని గౌరవ హైకోర్టువారు అప్పట్లో చెప్పినా ఎందుకు వాటి జోలికి వెళ్లలేదు. మరి అది హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరించినట్లు కాదా? కొత్త ప్రభుత్వ హయాంలో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో అతి తక్కువ కేసులు ఉన్న సమయంలో కరోనా పేరుతో రాష్ట్ర ప్రభుత్వాన్ని కనీసం సంప్రదించకుండా వాయిదా వేయడాన్ని న్యాయ వ్యవస్థ ఎందుకు పట్టించుకోలేదు. పైగా అప్పుడు ఎన్నికల వ్యవస్థ నిర్ణయంలో జోక్యం చేసుకోబోమని, ఎన్నికల వాయిదాకు ఓకే చేసింది. ఆ తర్వాత అనేక పరిణామాలు జరి గాయి. ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేస్తూ ఎన్నికల కమిషనర్ పేరుతో కేంద్రానికి ఒక లేఖ వెళ్ళడం వివాదాస్పదం అయింది. అలాగే ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ పార్క్ హయత్ హోటల్లో రాజకీయ నేతలతో సమావేశం అయిన విషయం జోలికి ఎవరూ వెళ్లకూడదా? ఒకవైపు కరోనా కేసులను తగ్గించడం, మరో వైపు వ్యాక్సిన్ పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలతో ప్రభుత్వం ఎన్నికలను రెండు నెలలు వాయిదా వేయాలని కోరితే న్యాయ వ్యవస్థ ఎందుకు అంగీకరించలేదంటే ఎన్నికల కమిషన్ రాజ్యాంగ వ్యవస్థ కాబట్టి అని అంటున్నారు. రాజ్యాంగ వ్యవస్థలోని వ్యక్తులు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా, నియంతృత్వ ధోరణిలో, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అవమానించే విధంగా వ్యవహరిస్తున్నా, ప్రభుత్వపరంగా ఎన్నికల నిర్వహణలో ఉన్న ఇబ్బందులు చెప్పినా పట్టించుకోని కమిషనర్‌ను ఎవరూ ప్రశ్నించరాదని న్యాయ వ్యవస్థ భావిస్తే ప్రజలు ఏమి చేయగలరు? కేరళలో ఎన్నికలు జరగలేదా అని గౌరవ సుప్రీంకోర్టు వారు అన్నారు. నిజమే. కానీ ఎన్నికల తర్వాత అక్కడ కరోనా కేసులు చాలా అధికంగా రోజుకు ఆరువేలకు పైగా వస్తున్నాయని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శైలజ స్వయంగా ప్రకటించారు కదా. వారి అనుభవాలను పరిగణనలోకి తీసుకోనవసరం లేదా? బిహార్‌లో శాసనసభ ఎన్నికల తర్వాత లక్షమంది ఉద్యోగులకు కరోనా సోకిందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. రెండు నెలలు ఆగితే రాజ్యాంగ సంక్షోభం వచ్చేస్తుందా? ఇదే తరుణంలో కరోనా వ్యాక్సిన్ వేయడం కోసం గోవాలో స్థానిక ఎన్నికలు వాయిదా పడ్డాయని వార్తలు వచ్చాయి. అక్కడ ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ మధ్య సమన్వయం, అవగాహన ఉన్నాయి కనుక ఇబ్బంది లేదా? హైదరాబాద్‌లో స్థానిక ఎన్నికల తర్వాత కరోనా కేసులు పెరిగాయి. ఇలాంటి పరిస్థితిలో ఏపీలో రెండేళ్లుగా జరగని పంచాయతీ ఎన్నికలు మరో రెండు నెలలు ఆగితే అంత పెద్ద రాజ్యాంగ సంక్షోభం వస్తుందా? న్యాయ వ్యవస్థ కొన్ని సందర్భాలలో న్యాయం, ధర్మంతో పనిలేకుండా సాంకేతిక కారణాలతోనే నిర్ణయాలు చేస్తే అది సమాజానికి మేలు చేసినట్లు అవుతుందా? ప్రభుత్వ సంప్రదింపులతో ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు వారు గతంలో ఆదేశాలు ఇచ్చారు. మరి ఎన్నడైనా ప్రభుత్వ వాదనను కమిషనర్ పరిగణనలోకి తీసుకున్నారా? ప్రభుత్వ ఛీప్ సెక్రటరీ ఏ లేఖ రాసినా దానిని తోసిపుచ్చి, తన ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికలకు సంబంధించి సరైన ఏర్పాట్లు చేసుకోకుండా హడావుడిగా నిర్వహిస్తే అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దానిని కూడా కోర్టువారు పరిగణనలోకి తీసుకున్నట్లు లేదు. ఇదే సమయంలో ఎన్నికల కమిషన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లకు అధికారులు వెళ్లలేదు. అది కూడా వివాదం అయింది. ఎన్నికల కమిషనర్ గత ఏడాది మార్చిలో ముందుగా జెడ్పీ, మండల ఎన్నికలు నిర్వహిస్తూ, మధ్యలోనే నిలుపుదల చేశారు. ఇప్పుడు వాటిని పెట్టకుండా, పంచాయతీ ఎన్నికలను ఎలా నిర్వహిస్తున్నారు? సాధారణంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరగాలని ప్రభుత్వాలు రివార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తుంటాయి. కానీ ఈ కమిషనర్ ఏకగ్రీవ ఎన్నికలను నిరుత్సాహపరిచే రీతిలో ఆదేశాలు ఇవ్వడం సరైనదేనా?ఎక్కడైనా ఒత్తిడి చేసి ఏకగ్రీవ ఎన్నిక జరుపుకుంటే చర్య తీసుకోవచ్చు. అలాకాకుండా అసలు ఏకగ్రీవాలే వద్దన్న చందంగా నిర్ణయాలు చేయడం సమంజసమేనా? ఉద్యోగుల ప్రాణాలు పోతే.. కరోనా కేసులు పెరిగితే..? ఉద్యోగ సంఘాల వాదనను సుప్రీంకోర్టు అసలు పరిగణనలోకి తీసుకోకపోవడం ధర్మమేనా? తమ ప్రాణాలకు గండం తేవద్దని కోరితే న్యాయవ్యవస్థ పట్టించుకోకపోతే వారు ఎవరికి చెప్పుకోవాలి? రేపు ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు పెరిగితే దానికి ఎవరు బాధ్యత వహించాలి. ఏది ఏమైనా గౌరవ సుప్రీంకోర్టువారు ఆదేశాలు ఇచ్చారు కనుక ప్రభుత్వం కూడా పాటించక తప్పకపోవచ్చు. ఎన్జీఓ సంఘాలు ఏమైనా అభ్యంతరం చెబితే చెప్పలేం. గతంలో తమిళనాడులో జల్లికట్టుపై నిషేధం పెట్టారు. ఆ జల్లికట్టు వల్ల పలువురు ప్రాణాలు కోల్పోతుంటారు. అందుకే ఆ నిషేధాన్ని న్యాయ వ్యవస్థ విధించింది. కానీ తమిళనాడులో దానిపై పెద్ద అలజడి వచ్చింది. దాంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి ఒక ఆర్డినెన్స్‌ను తెచ్చి జల్లికట్టును అనుమతించింది. దానికి కోర్టు కూడా అంగీకరించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. పలుచోట్ల జల్లికట్టు క్రీడతో ప్రతి ఏటా కొందరు మరణిస్తున్నారు. అనేకమంది గాయపడుతున్నారు. అయినా వీటిని అనుమతిస్తున్నారే! శబరిమలైలో మహిళల ప్రవేశానికి సంబంధించి న్యాయ వ్యవస్థ ఏమి చెప్పింది? దానికి వ్యతిరేకంగా కొన్ని రాజకీయ పార్టీలు ఎలా వ్యవహరించాయి అన్నది కూడా అందరికీ తెలుసు. ఇవి ఎందుకు చెప్పవలసి వస్తోందంటే ఎంత గొప్ప న్యాయవ్యవస్థ అయినా కొన్నిసార్లు చట్టంతో సంబంధం లేకుండా ప్రజాభీష్టాన్ని పరిగణనలోకి తీసుకోక తప్పదన్న అభిప్రాయం కలుగుతుంది. కానీ ఏపీలో పంచాయతీ ఎన్నికల విషయంలో న్యాయ వ్యవస్థ అన్ని కోణాలలో విచారణ జరపలేదనిపిస్తుంది. అందువల్లే ఈ తీర్పు ఇచ్చి ఉండవచ్చు. ఏది ఏమైనా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది మంచి పరిణామమా? కాదా అన్నది అంతా ఆలోచించాలని మాత్రం చెప్పక తప్పదు. కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
రుణాల ఎగవేతదారులపై ఎందుకంత ప్రేమ?
బ్యాంకులకు రుణాలు పెద్ద ఎత్తున ఎగవేసిన వారి సంఖ్యలో గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అగ్రభాగాన ఉన్నాయి. డబ్బు ఎగవేసిన వారిని గొప్పగా కీర్తించే పరిస్థితి కూడా వస్తున్నదంటే సమాజం ఎటువైపు పోతోందో ఆలోచించాలి. చిన్నవాడికి ఒక న్యాయం, పెద్దవాడికి మరో న్యాయం అన్న చందంగా వ్యవస్థలు పనిచేస్తున్నాయి. ఒకప్పుడు చిన్న స్కాములకే మీడియాలో గగ్గోలు పుట్టేది. కానీ ఎగవేతదారుల వార్తలను అధికారికంగా ప్రకటించినా ప్రచారం చేయని మీడియాను ఇప్పుడు చూస్తున్నాం. వారు తాము మద్దతు ఇచ్చే పార్టీ కనుక, తమ సామాజికవర్గం కనుక మోసాలను కప్పిపుచ్చుతాం అన్న చందంగా వ్యవహరించడం వికృత పరిణామం. మన దేశంలో వ్యవస్థల తీరు భలే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎవరైనా ఉద్యోగి ఐదువేల రూపాయల లంచం తీసుకుంటే అవినీతి నిరోధక శాఖ వల పన్ను తుంది. కానీ వేల కోట్ల రూపాయలు ఎగవేసినవారిని మాత్రం ఏ సంస్థ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటుంది. అన్నిటికీ, అందరికీ ఇది వర్తిస్తుందని కాదు. చిన్న చేపలు వలకు చిక్కినప్పుడు, పెద్ద చేపలు ఎందుకు పడవన్న ప్రశ్న సామాన్యుడిలో తలెత్తుతుంది. గతంలో కాంగ్రెస్ ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ చుట్టూరా వందలు, వేల కోట్లు ఎగవేసినవారు దర్జాగా తిరుగుతుండేవారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ పరిస్థితి మారుతుందని అనుకున్నవారికి ఆశాభంగమే ఎదురవుతోంది. వేల కోట్లు ఎగవేసినవారు వేరే పార్టీ నుంచి బీజేపీలో చేరి పునీతులు అవుతున్నారు. ఇదంతా ఎందుకు చెప్పవలసి వస్తున్న దంటే బ్యాంకులను మోసం చేసో, లేక బ్యాంకులకు రుణాలు పెద్ద ఎత్తున ఎగవేసిన వారో దేశవ్యాప్తంగా చూసుకుంటే గుజరాత్, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కువమంది ఉన్నారు. తాజాగా కోస్టల్ ప్రాజెక్ట్స్ అనే సంస్థ 4736 కోట్ల రూపాయల మేర బ్యాంకులను మోసం చేసిందన్న సంచలన కథనం కొన్ని ఆంగ్ల పత్రికల్లో ప్రము ఖంగా వచ్చింది. తెలుగు పత్రికలలో గానీ, మరికొన్ని ఆంగ్ల పత్రి కలలో గానీ సంబంధిత వార్త పెద్దగా కనిపించలేదు. అవినీతికి వ్యతి రేకంగా సంపాదకీయాలు రాసే పెద్ద పత్రిక కూడా ఇందుకు అతీతంగా లేకపోవడం విశేషం. రుణాలు ఎగవేసేవారు ప్రధానంగా ప్రభుత్వరంగ బ్యాంకులనే ఎక్కువగా మోసం చేస్తున్నారట. ప్రైవేటు రంగ బ్యాంకులకు రుణబకాయిలు తక్కువగానే పెడుతున్నారట. కోస్టల్ ప్రాజెక్ట్స్ వారిపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీబీఐకి ఫిర్యాదు చేసింది. తప్పుడు రికార్డులు తయారు చేయడం, అకౌంట్స్‌లో మోసానికి పాల్పడటం, ఇతర రూపాలలో వీరు బ్యాంకును మోసం చేశారన్నది అభియోగం. సత్యం కంపెనీ అధినేత రామలింగరాజు బ్యాంకుల్లో తమకు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నట్లుగా నకీలీ సర్టిఫికెట్లు సృష్టించిన వైనం ఒక దశాబ్దం క్రితం పెను సంచలనం అయింది. ఇప్పుడు ఆయనను మించిన ఘనా పాఠీలు చాలామంది వెలుగులోకి వస్తున్నారు. అందులో మన తెలుగువారిని చూస్తే మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కు చెందిన సంస్థలు 46 వేల కోట్లకు పైగా బకాయి పడ్డాయి. మరి వాటి గురించి బ్యాంకులు ఏమి చేస్తున్నాయో తెలి యదు. రాజగోపాల్ మాత్రం ఎన్నికల జోస్యాలు చెప్పుకుంటూ దర్జాగా తిరిగేస్తున్నారు. ఈ మధ్యనే జీవీకే కంపెనీ అధినేత జీవీకే రెడ్డి కుటుంబంపై కూడా కేసు నమోదు అయింది. ముంబై విమానాశ్రయా నికి సంబంధించిన కేసు అది. మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఏడువేల కోట్లకు పైగా బ్యాంకులకు ఎగనామం పెట్టినట్లు సీబీఐ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్న సుజనా చౌదరి కూడా ఆరువేల కోట్లకు పైగా వివిధ బ్యాంకులకు టోపీ పెట్టా రన్న అభియోగాలు వచ్చాయి. తాజాగా ఒక టీడీపీ ఎంపీకి వియ్యంకుడు, అలాగే ఒక టీవీ సంస్థకు యజమాని అయిన వారికి వియ్యంకుడు అయిన కోస్టల్ ప్రాజెక్ట్స్ అధినేత సురేంద్ర 4,736 కోట్లు ఎగ వేసిన తీరు చూస్తున్నాం. ఇంకా ఐవీఆర్సీఎల్, భరణి, భారత్ పవర్, పల్లవి, బృందావన్ మొదలైన సంస్థలు కూడా ఈ జాబితాలో ఉన్నా యని సమాచారం. ఎంపీ పదవి కోల్పోయిన కర్ణాటక వ్యాపారవేత్త విజయ్ మాల్యా సుమారు పదివేల కోట్లు, గుజరాత్‌కు చెందిన నీరవ్ మోదీ, చోక్సి వంటివారు వేల కోట్ల ఎగవేతలకు పాల్పడ్డారు. వీరిలో కొందరు విదేశాలకు పారిపోయి క్షేమంగా జీవితాన్ని కొనసాగిస్తు న్నారు. విజయ్ మాల్యా దర్జాగా విమానమెక్కి వెళ్లిపోతుంటే కేంద్ర ప్రభుత్వం, సీబీఐ చోద్యం చూస్తూ కూర్చున్నాయన్న విమర్శలు వచ్చాయి. వీరిలో అనేక మంది బోగస్ కంపెనీలు పెట్టి బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను విదేశాలకు మళ్లించారని ఆరోపణలొ చ్చాయి. విజయ్ మాల్యాకు బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల్లో ఆస్తులు ఉన్నాయి. గత ఎన్నికలకు ముందు టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్ నివాసాలపైన, ఆఫీసులపైన సీబీఐ దాడులు చేసింది. ఆ తర్వాత వారు బీజేపీలో చేరారు. మరో ఇద్దరు టీడీపీ ఎంపీలతో కలిసి వారు మోదీ చాంబర్లో కనిపించడం చూసి అంతా విస్తుపోయారు. మరో వైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పీఏ ఇంటిపై ఆదాయపన్ను శాఖ, సీబీఐ, ఈడీ వంటి సంస్థలు దాడి చేసి, రెండువేల కోట్ల మేర అక్రమాలు జరిగాయని ప్రకటించాయి. అది జరిగి నెలలు గడిచిపోతున్నా, ఆ వ్యవహారం ఏమైందో తెలియదు. స్వయంగా ప్రధాని మోదీ ఏపీ పర్యటనకు వచ్చి పోలవరం ప్రాజెక్టు చంద్ర బాబుకు ఏటీఎం అయిందని ఆరోపించారు. అలాగే బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆనాటి టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతిలో ఖర్చు చేసిన 7,200 కోట్ల రూపాయల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనీ, చెట్టు–నీరు స్కీములో పదమూడువేల కోట్ల అవి నీతి జరిగిందనీ తరచూ ఆరోపించేవారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ వీటిపై విచారణ జరగడం లేదు. అమరావతి భూమి స్కాముపై సీబీఐ దర్యాప్తు కావాలని ఏపీ ప్రభుత్వం కోరినా ఇంతవరకు కేంద్రం స్పందించలేదు. బ్యాంకులకు ఆయా వ్యక్తులు ఎగవేసిన రుణాలను కనుక వసూలు చేయగలిగితే ఈ దేశంలోని ప్రతి పేదవాడికి లక్ష రూపాయల చొప్పున ఇవ్వవచ్చనిపిస్తుంది. మోదీ స్విస్ నుంచి భారత బ్లాక్ మనీని తెచ్చి 15 లక్షల చొప్పున పంచుతానని ఎన్నికలలో చెప్పేవారు. అంత కాకపోయినా, ఈ రకమైన మోసాలను అరికట్టి ఆ డబ్బును పేదలకు పంచినా మేలు జరుగుతుంది. ఇండస్ట్రీస్ సిక్ బట్ నాట్ ఇండస్ట్రియ లిస్ట్స్ అని ఒక నానుడి. పరిశ్రమలు ఖాయిలా పడతాయి కానీ పారి శ్రామికవేత్తలు కాదు. వీరిలో ఎవరైనా నిజంగానే చిత్తశుద్ధితో పనిచేసి, పరిశ్రమల ద్వారా వందలు, వేల మందికి ఉపాధి కల్పించి, పరి స్థితులు అనుకూలించక దెబ్బతిని రుణాలు చెల్లించలేకపోతే దానికి ప్రత్యామ్నాయాలు ఆలోచించవచ్చు. ఒకప్పుడు కృషి బ్యాంక్, ప్రుడెన్షి యల్ బ్యాంక్ వంటి చిన్న సంస్థలు మూత పడి వేలాది మంది డిపాజిటర్లకు డబ్బు ఎగవేస్తే పెద్ద సంచలనం అయింది. వాటిపై పుంఖానుపుంఖాలుగా వార్తలు వచ్చేవి. వీటికి సంబంధించినవారిని పోలీసులు అరెస్టు కూడా చేశారు. కానీ ఇప్పుడు ఎవరు ఎన్నివేల కోట్లు ఎగవేస్తే అంత గొప్పవారన్న భావన ప్రబలుతున్నట్లుగా ఉంది. అలాంటివారి వార్తలను, సీబీఐ అధికారికంగా ప్రకటించినా ప్రచారం చేయని మీడియాను ఇప్పుడు చూస్తున్నాం. వారు తాము మద్దతు ఇచ్చే పార్టీ కనుక, లేదా తమ సామాజికవర్గం కనుక ఎన్నివేల కోట్లు బ్యాంకులకు ఎగవేసినా, మోసాలు చేసినా వాటిని కప్పిపుచ్చుతాం అన్న చందంగా వ్యవహరించడం వికృత పరిణామం. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కొన్నేళ్ల క్రితం, కాంగ్రెస్‌తో రాజకీయంగా విభేదించారన్న ఏకైక కారణంపై తప్పుడు కేసులు పెట్టిన విషయం తెలిసిందే. కొందరు పెట్టుబడిదారులతో కలిసి ఆయన నెలకొల్పిన పరిశ్రమలను అడ్డుకోవడానికి కూడా ప్రయత్నించారు. మూడు రోజులలో బెయిల్ రావాల్సిన కేసుల్లో న్యాయస్థానాలు పదహారు నెలలు జైలులో ఉంచాయి. అదంతా కాంగ్రెస్, టీడీపీ కలిసి చేసిన కుట్ర అని ప్రజలు భావించారు. అందుకే ఆ తర్వాతి కాలంలో ప్రజలు ఆయనకు పట్టం కట్టారు. ఇది ఎందుకు చెప్పవలసి వస్తున్నదంటే మన దేశంలో రాజకీయాల ఆధా రంగా మోసం కేసులు, అవినీతి కేసుల్లో దర్యాప్తు జరుగుతోందనీ, కోర్టులు కూడా అదే మాదిరి వ్యవహరిస్తు న్నాయనీ విమర్శలు ఎదు ర్కొంటున్నాయి. ఎక్కడైనా పరిశ్రమలు పెట్టినవారికి ప్రోత్సాహకాలు ఇస్తారు. కానీ మన దేశంలో మాత్రం అలా పరిశ్రమలు పెట్టినవారు కేంద్రంలో అధికారంలో ఉన్నవారికి వ్యతిరేకంగా మారితే ఇంతే సంగతి అన్నమాట! అదే కేంద్రంలోని నేతలతో సత్సంబంధాలు, న్యాయ వ్యవస్థలో పలుకుబడి ఉంటే వీడియో సాక్ష్యంగా అవినీతి బయటపడినా వారి జోలికి వెళ్లరు. బ్యాంకులకు డబ్బు ఎగవేసినవారిని గొప్పగా కీర్తించే పరిస్థితి కూడా వస్తున్నదంటే మన సమాజం ఎటువైపు పోతోందో ఆలోచించు కోవచ్చు. పరిశ్రమలు పెట్టేవారిని కాకుండా పరిశ్రమల పేరుతో, కాంట్రాక్టుల పేరుతో మోసం చేస్తున్నవారిని పట్టుకోవాలి. ఈ పరిస్థితి మారకపోతే ఇలాంటి మోసగాళ్లదే పైచేయి అవుతుంది. రాజకీయా లకు, ప్రభుత్వాలకు సంబంధం లేకుండా రుణ వ్యవస్థ, పరిశ్రమల వ్యవస్థ నడిస్తేనే దేశం ముందుకు వెళుతుంది. ఆ పరిస్థితి మార్చడానికి కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా చిత్తశుద్ధితో కృషి చేయాలి. కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
న్యాయమూర్తులు పరిధులు దాటొచ్చా?
న్యాయమూర్తులు కూడా సమాజం నుంచి వచ్చిన వ్యక్తులే. వాళ్ళ మీద కూడా ప్రభావాలు ఉంటాయి. అన్ని ప్రభావాలు చెడ్డవి అని అనడానికి వీల్లేదు. వాళ్ళు తమమీద ఉన్న ఒత్తిడి వల్ల ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. న్యాయవ్యవస్థ నుంచి కొన్ని ఒత్తిడులు ఉత్పన్నమవుతాయి. న్యాయమూర్తి సాంఘిక, సాంస్కృతిక, మతపరమైన నేపథ్యం నుంచి మరికొన్ని ఒత్తిడులు ఉత్పన్నమవుతాయి. ఇవే కాకుండా వర్గపరమైన పక్షపాత ధోరణులు కూడా ఉంటాయి. ఇంటి యజమాని వల్ల బాధితుడైన న్యాయమూర్తి కిరాయిదారుల పక్షం ఉండి యజమానులకి వ్యతిరేకంగా ఉంటాడు. వరకట్నం కేసు వల్ల బాధను అనుభవించిన వ్యక్తి, ఆ కేసుల్లో పక్షపాత ధోరణి కలిగి ఉంటాడు. ఇది ఒక ఉదాహరణ. వీటికి మంచి ఉదాహరణ భన్వారీ దేవి ఉదంతం. భన్వారీ దేవి ఓ ప్రభుత్వ ఉద్యోగి. ఆమె క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉంటుంది. బాల్య వివాహాలు జరిగితే ఆ విషయాలు ప్రభుత్వానికి తెలియజేయడం ఆమె ఉద్యోగంలోని ఒక విధి. అలాంటి సంఘటన ఒకటి జరిగే అవకాశం ఉందని ఆమె ప్రభుత్వానికి సమాచారం అందిం చింది. ఆ వివాహాన్ని పోలీసులు నిరోధించటానికి ప్రయత్నించి విఫల మయ్యారు. ఆ వివాహం రహస్యంగా జరిగింది. ఆ వివాహం జరిగే విషయంలో ఆమె జోక్యం చేసుకున్న కారణంగా వివాహం అయిన కొద్ది నెలలకి ఆమె మీద దాడి జరిగింది. ఆమె భర్త సమక్షంలో ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ కేసులో ముద్దాయిలను ఆ కేసుని విచారించిన సెషన్స్ జడ్జి విడుదల చేశాడు. ఆ న్యాయమూర్తి ఇచ్చిన వివరణ చాలా విచిత్రంగా ఉంది. అత్యాచారాన్ని టీనేజీలో ఉన్న యువకులు చేస్తారు. ఈ కేసులో ఉన్న ముద్దాయిలు మధ్య వయ స్కులు. గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు. వాళ్లు ఈ నేరం చేయడానికి అవకాశం లేదు. అందులోనూ ఆధిపత్యæ కులానికి చెందిన వ్యక్తులు నిమ్న కులానికి చెందిన వ్యక్తితో అపవిత్రం కారు. ఈ తీర్పు చెప్పిన న్యాయమూర్తి ఆధిపత్య కులానికి చెందిన వ్యక్తి. కాబట్టే ఇలాంటి తీర్పు వెలువడింది. ఈ తీర్పుమీద అప్పట్లో దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది. అదేవిధంగా కొంతమంది న్యాయ మూర్తులు ‘ఆమోద యోగ్యం కాని వక్రబుద్ధితో కూడిన (పర్వర్స్) తీర్పులని ప్రకటిస్తూ ఉంటారు. అలాంటి ఒక తీర్పుని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోని డివిజన్ బెంచ్ క్రిమినల్ అప్పీలు నెం. 1025 ఆఫ్ 2008 కేసులో 17.08.2012 నాడు ప్రకటించింది. ఈ తీర్పు పర్వర్స్ తీర్పు అని సుప్రీంకోర్టు డివిజన్ బెంచి 2017 ఫిబ్రవరి 9న ప్రకటించింది. కానీ ఈవిధంగా హైకోర్టు తీర్పుని పర్వర్స్ తీర్పు అని ప్రకటించడం సంతోషకరమైన వ్యక్తీకరణ కాదని కూడా సుప్రీంకోర్టు సి. ఏక్నాథ్ వర్సెస్ వై. అమరనాథ రెడ్డి కేసులో అభిప్రాయపడింది. ప్రభుత్వ భూముల వేలం కేసు నుంచి వైదొలగాలని ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన కేసుని పరిష్కరించాల్సిన జస్టిస్ రాకేశ్ కుమార్ తన పరిధిలో లేని అంశాలపై వ్యాఖ్యానించారు. ఇది ఆందోళనకరం. దేశానికి జస్టిస్ మురళీధర్, జస్టిస్ చంద్రూ వంటి న్యాయమూర్తులు అవసరం. దేశం ఇలాంటి న్యాయమూర్తులనే కోరుకుంటోంది. ఏపీ హైకోర్టులో జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ రమేష్ నేతృత్వం లోని డివిజన్ బెంచ్ 2020 డిసెంబర్ 30న ఇచ్చిన తీర్పుని గమనిం చినప్పుడు ఈ విషయాలన్నీ గుర్తుకు వచ్చాయి. ఇది ఊహించని ఉత్తర్వు. ఎందుకంటే తన విచారణ పరిధిలో లేని చాలా అంశాలని కోర్టు స్పృశించి తన అసంతృప్తిని వ్యక్తపరిచింది. ఈ అసంతృప్తికి కారణం ఏమంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను బదిలీ చేయడం. అంతేకాదు. వై.యస్. జగన్ మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం హైకోర్టుని తక్కువ చేస్తోందని కూడా ఈ తీర్పు అక్కసుని వెళ్లగక్కింది. కోర్టు కేసు నుంచి ఓ న్యాయమూర్తి తప్పుకోవాలన్న దరఖాస్తుని పరిష్కరిస్తూ డివిజన్ బెంచ్ ఈ కటువైన పరిశీలనలని చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏపీ హైకోర్టు నిర్వహణ మీద భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఏ బాబ్డేకి రాసిన లేఖల పర్యవసానంవల్లే ఇద్దరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల బదిలీలు కూడా జరిగాయని డివిజన్ బెంచి అభిప్రాయపడింది. ముఖ్యమంత్రికి కావాల్సింది సుప్రీంకోర్టు కొలీజియం చేసిందన్న భావన కలిగేవిధంగా కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనమీద ఉన్న కేసుల విచారణలో జాప్యం జరగడానికి అలా ఆరోపణలు చేశారని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక్కడ అర్థం కాని విషయం ఏమంటే ఆ కేసు విచారణని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు చేయడం లేదు. సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి ఆ కేసులని విచారిస్తు న్నారు. ఈ బదిలీల వల్ల ఆ కేసుల విచారణ ఏ విధంగా కుంటు పడుతుందో అర్థం కాని విషయం. కోర్టు ఎన్ని రోజుల్లో పరిష్కరిం చాలో హైకోర్టులు చెబుతాయి తప్ప ఏ విధంగా పరిష్కరించాలో చెప్పజాలవు. అలా చెబితే అది న్యాయవ్యవస్థ స్వతంత్రతకే భంగం వాటిల్లుతుంది. ప్రభుత్వ భూముల వేలం కేసునుంచి న్యాయమూర్తి రాకేశ్ కుమార్ వైదొలగాలని ప్రభుత్వం దాఖలు చేసిన కేసుని పరిష్కరించా ల్సిన కోర్టు తన పరిధిలో లేని అంశాల గురించి వ్యాఖ్యానించడం ఆశ్చర్యాన్ని కాదు ఆందోళనని కల్గిస్తుంది. పైగా లెజిస్లేటివ్ కౌన్సిల్ మీద ప్రభుత్వం దాడి చేసింది. ఆ తరువాత ఎలక్షన్ కమిషన్ మీద దాడి చేసింది. ఇప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టుల మీద అధికారంలో ఉన్న వ్యక్తులు దాడి చేస్తున్నారని కోర్టు తన ఆందోళనని వ్యక్తం చేసింది. అక్కడితో ఊరుకోలేదు. 2011 నుంచి విచారణలో ఉన్న కేసుల్లో ఇంతవరకు విచారణాంశాలను నిర్ధారించకపోవడం అపహాస్యం కాదా అని డివిజన్ బెంచ్ ప్రశ్నించింది. కోర్టుల్లో జాప్యానికి కారణాలు అనేకం. దానికి సమాధానాన్ని సంబం ధిత కోర్టు వివరిస్తుంది. మరొకరు వివరించలేరు. సీబీఐ ఏర్పాటు న్యాయబద్ధం కాదని అస్సాం హైకోర్టు ఇచ్చిన తీర్పు దాదాపు ఎని మిదేళ్లుగా సుప్రీంకోర్టు పరిశీలనలో ఉంది. ఈ జాప్యానికి కారణం ఏమిటి? సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ ఇటీవల ఇదే విషయాన్ని ప్రస్తావించారు కూడా. న్యాయమూర్తి రాకేశ్ కుమార్ విచారణ అంశం కానీ చాలా విష యాలను తన ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. అందులో ముఖ్యమైంది గూగుల్‌లో ముఖ్యమంత్రి గురించిన ప్రస్తావన. కోర్టు విచారణలో ఉన్న అంశం ఏమిటి? న్యాయమూర్తి ప్రస్తావించిన అంశాలు ఏమిటి? విచిత్రమైన అంశం ఏమంటే మనదేశ జ్యురిస్ప్రుడెన్స్ ప్రకారం నేర నిరూపణ జరిగేవరకు ముద్దాయిలను అమాయకులుగా పరిగణిం చాలి. ఇది ప్రాథమిక సూత్రం. ఈ విషయాన్ని ఎవరూ విస్మరించ కూడదు. తప్పుచేసిన వ్యక్తికి శిక్ష పడటం ఎంత అవసరమో, అమాయ కులకి శిక్ష పడకుండా చూడాల్సిన బాధ్యత కూడా కోర్టుల మీద ఉంటుంది. అంతేకాని కోర్టు విచారణలో లేని అంశాల మీద మాట్లా డటం పరిశీలనలు చేయడంలోని ఔచిత్యం బోధపడటం లేదు. కోర్టుల మీద విశ్వసనీయత పెరగాలంటే కోర్టులు జారీచేసే ఉత్త ర్వులు, తీర్పులు తగు కోణాలతో ఉండాలి. అంతేకాదు అవి వెంటనే పార్టీలకు అందుబాటులో ఉండాలి. తీర్పులు నిష్పక్షపాతంగా ఉండా లంటే అవి తగు కారణాలతో ఉండాలి. కోర్టు పరిధిలో ఉన్న అంశాల మీదే చర్చ జరగాలి. వాటి గురించి విశ్లేషణ ఉండాలి. అదేవిధంగా కోర్టు ఒక నిర్ణయానికి రావడానికి కారణాలనేవి ఎలాంటి పూర్వ భావ నలు, పక్షపాతం లేకుండా ఉండాలి. విచారించాల్సిన దరఖాస్తులో కానీ కేసులో గానీ లేని విషయాలని ప్రస్తావిస్తే అది తగు కారణాలతో చెప్పిన ఉత్తర్వుగా గానీ తీర్పుగా కానీ పరిగణించ బడదు. పార్టీలు లేవనెత్తిన అంశాలన్నింటిపైనా సమాధానాలు కోర్టు ఉత్తర్వుల్లో ఉండాలి. అలా లేనప్పుడు ఆ కోర్టు మీద విశ్వసనీయత ఏర్పడదు. అనవసర కామెంట్స్, తగు కారణాలు లేనప్పుడు ఆ వ్యాఖ్యానాలని తొలగించుకోవడానికి, సరైన కోణాలలో తీర్పు కోసం పార్టీలు పై కోర్టులకి వెళ్లాల్సి వస్తుంది. దానివల్ల కోర్టులమీద అనవసర భారం పడుతుంది. తగు కారణాలతో తీర్పులు ప్రకటించడంవల్ల కోర్టుల మీద భారం తగ్గుతుంది. న్యాయమూర్తి ఏ స్థాయిలో ఉన్నప్పటికీ అతను స్వేచ్ఛగా, స్వతంత్రంగా తీర్పులను ప్రకటించాలి. తన మనఃసాక్షిగా, చట్టానికి అనుగుణంగా తీర్పులను ఇవ్వాలి తప్ప, కోర్టు విచారణలో లేని అంశాలను ప్రస్తావించకూడదు. నిష్పక్షపాతం గురించి సుప్రీంకోర్టు ఎస్.పి గుప్తా కేసులో వివరించింది. అది ఇప్పటికీ ఓ గీటురాయి. కేసు విచారణ గురించి సుప్రీంకోర్టు ఆ తీర్పుని ప్రకటించినప్పటికీ అది అన్ని ఉత్తర్వులకి, తీర్పులకి వర్తిస్తుంది. ఓ న్యాయమూర్తి నిష్పక్ష పాతాన్ని, అతని ఉత్తర్వులు ఎలాంటి పక్షపాతంలో లేవని అనుకోవ డానికి రెండు పరీక్షలు ఉన్నాయి. అవి– వ్యక్తిగత పరీక్ష: న్యాయమూర్తికి కేసులో ఎలాంటి వ్యక్తిగత ఆసక్తి ఉండకూడదు. తన విశ్వాసాల వల్ల ఎదుటి వ్యక్తికి హాని జరుగకూడదు. తటస్థ పరీక్ష (ఆబ్జెక్టివ్ టెస్ట్): తన నిష్పక్షపాతం మీద ఎలాంటి సంశయం రాకుండా ఉండే విధంగా విచారణ జరపాలి. చాలాసార్లు సుప్రీంకోర్టు ఈ విషయాన్ని స్పష్టం చేసింది. పార్టీలకు విశ్వాసం లేనప్పుడు న్యాయమూర్తి ఆ కేసుని నిష్పక్ష పాతంగా పరిష్కరించినా అలాంటి భావన పార్టీలకు కలగదు. అలాం టప్పుడు ఆ కేసులని పరిష్కరించడం ఎందుకు? అనవసర విషయాల ప్రస్తావన మరెందుకు? ఇలాంటి వాటివల్ల కోర్టులపై గౌరవం తగ్గే అవకాశం లేదా? చివరగా ఇద్దరు న్యాయమూర్తులు గుర్తుకొస్తున్నారు. ఒకరు జస్టిస్ మురళీధర్. రెండవవారు జస్టిస్ చంద్రూ. మొదటి న్యాయమూర్తి ఢిల్లీ హైకోర్టు నుంచి పంజాబ్/హరియాణాకి బదిలీ అయినప్పుడు చండీగఢ్‌లో న్యాయమూర్తులు దారి పొడవునా నిల్చొని ఆహ్వానం పలికారు. అదే విధంగా జస్టిస్ చంద్రూ నిరాడంబరంగా తన పదవీ విరమణ చేశారు. ప్రజల న్యాయమూర్తిగా ఆయనను కొని యాడారు. దేశం ఇలాంటి న్యాయ మూర్తులనే కోరుకుంటుంది. మంగారి రాజేందర్ (వ్యాసకర్త గతంలో జిల్లా జడ్జిగా, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులుగా పనిచేశారు) ఈ–మెయిల్ : rajenderzimbo@gmail.com -
అమరావతి అందరిదీ కాకుంటే ఎలా?
అమరావతి ప్రాంతంలో కొత్తగా 54 వేలమందికి ఇళ్ల స్థలాలు ఇస్తే కులాల సమతుల్యత దెబ్బతింటుందని కొందరు టీడీపీ నేతలూ, ఇతరులూ హైకోర్టులో పిటిషన్ వేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీన్నే ప్రస్తావిస్తూ అమరావతి అందరి రాజధానిగా ఉండకుండా టీడీపీ వారు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. బలహీనవర్గాలకు చెందిన పేదలు రాజధానిలో ఉండడానికి వీలు లేదా అని ప్రశ్నించారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి టీడీపీ కానీ, అమరావతి జేఏసీకి నాయకత్వం వహిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ వ్యతిరేకించిన తీరు ఇప్పుడు సీఎం జగన్‌కు ఆయుధంగా మారింది. అమరావతిలో కులాల అసమతుల్యత ఏర్పడుతుందన్న వారి వాదన ప్రభావం ప్రజలపై పడితే, టీడీపీ ఎన్నటికీ కోలుకోలేదన్నది వాస్తవం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాజధాని అందరి రాజధానిగా ఉండాలి కానీ కొందరికే పరిమితం అయితే అది ఎలా రాజధాని అవుతుందని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా 30.75 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తున్న నేపథ్యంలో కొన్ని చోట్ల టీడీపీకి చెందినవారు ఇళ్ల స్థలాల పంపిణీని వ్యతిరేకిస్తూ కోర్టులకు వెళ్ళి స్టేలు తెస్తున్నారని, అమరావతి రాజధానిలో 54 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తుంటే, అలా చేస్తే అది డెమోగ్రఫీపై ప్రభావం చూపుతుందని టీడీపీకి చెందిన కొందరు కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చారని ఆయన చెప్పారు. డెమోగ్రఫీలో సమతుల్యత దెబ్బతింటుందని చెప్పడం అంటే కొన్ని కులాల వారి ప్రభావం తగ్గి, మరికొన్ని కులాల వారి ప్రభావం పెరుగుతుందని చెప్పడమే. రాజధాని అమరావతిపై ఉన్న ప్రధాన ఆరోపణే ఇది. మొత్తం 13 జిల్లాలు ఉంటే కేవలం రాజధానిలోనే చంద్రబాబు ఖర్చు చేస్తున్నాడని, అది కూడా ఇన్ సైడ్ ట్రేడింగ్ చేసిన టీడీపీ వారికి లబ్ధి చేకూర్చడానికి, ఒక సామాజికవర్గానికి మేలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని మిగిలిన జిల్లాలలో భావిస్తే, అమరావతి రాజధాని ఒక కులం ప్రాభవం కోసం ఏర్పాటు చేశారని గుంటూరు, కృష్ణా జిల్లాల ప్రజలు కూడా నమ్మారు. అందువల్ల రాజధాని పరిధి ఉన్న రెండు నియోజకవర్గాలలో కూడా టీడీపీ ఓడిపోయింది. ఈ ఓటమిని జీర్ణించుకోలేని చంద్రబాబు అమరావతి రైతులను రెచ్చగొట్టడం మొదలు పెట్టారు. మూడు రాజధానుల ప్రతిపాదనకుముందే, అమరావతిలో ఆ నిర్మాణం చేయడం లేదు.. ఈ నిర్మాణం చేయడం లేదంటూ తనకు మద్దతు ఇచ్చే మీడియాతో కలిసి ప్రచారం చేపట్టారు. రాజధాని అమరావతి పేరుతో అన్నీ తాత్కాలిక భవనాలనే బాబు నిర్మించారని, ఇప్పుడు వాటన్నిటికీ పర్మనెంట్ భవనాల నిర్మాణానికి, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడానికి వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని ప్రభుత్వ డబ్బు ఎక్కడ ఖర్చు పెట్టాలని వైసీపీ వాదన. అదే సమయంలో మంత్రివర్గ ఉప సంఘం 4,070 ఎకరాల మేర ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని అంచనావేసి, దానిపై దర్యాప్తునకు సీబీఐకి అప్పగించాలని సిఫారసు చేయడమే కాకుండా, అవినీతి నిరోధక శాఖకు కూడా ఈ స్కామ్ విచారణను అప్పగించారు. ఏసీబీ విచారణలో పలు విస్తుగొలిపే విషయాలు బయటకు వచ్చాయి. అందులో రాజకీయ ప్రముఖులు కానీ, న్యాయ వ్యవస్థలోని కొందరు ప్రముఖులు కానీ, రాజధాని ప్రకటనకు ముందే అక్కడి గ్రామాలలో భూములు కొన్నారని తేలింది. జాతీయ రహదారికి ఇరవై, ముప్పై కిలోమీటర్ల దూరంలో మారుమూల గ్రామాలలో ఆయా జిల్లాలకు చెందిన టీడీపీ నేతలు తక్కువ ధరకు భూములు కొనుగోలు చేశారన్నది అభియోగం. అంతేకాక ఇన్సైడ్ ట్రేడింగ్ చేసిన వారిలో మెజార్టీ ఒకే సామాజికవర్గం వారు అని వెల్లడైంది. దాంతో ఇన్సైడ్ ట్రేడింగ్ కేసు విచారణను పక్కన పెట్టాలని టీడీపీ నేతలు న్యాయవ్యవస్థ ద్వారా స్టేలు పొందగలిగారు. కానీ హైదరాబాద్‌లో ఉమ్మడి రాష్ట్ర రాజ ధానిగా ఉన్నప్పుడు సచివాలయంతో సహా మొత్తం అన్ని కార్యాలయాలు కలిపి 500 ఎకరాల విస్తీర్ణం కూడా లేదని తేలింది. మరి అలాంటిది అమరావతి రాజధానికి ఏభైవేల ఎకరాలు ఎందుకు సమీకరించారు? అందులో రైతుల నుంచి బతిమి లాడో, బలవంతంగానో, లేక ఇష్టపూర్వకంగానో 33 వేల ఎకరాలు ఎందుకు తీసుకున్నట్లు? మొత్తం రియల్ ఎస్టేట్ వెంచర్‌గా మార్చి అక్కడే లక్ష కోట్ల నుంచి లక్షన్నర కోట్ల వరకు వ్యయం చేయాలని చంద్రబాబు ప్రతిపాదిం చారు. మరి అంత సొమ్ము ఒకే చోట పెడితే మరి మిగిలిన జిల్లాల పరిస్థితి ఏమిటన్న ప్రశ్న వచ్చింది. అందుకే టీడీపీని ప్రజలు ఘోరంగా ఓడించారు. హైదరాబాద్‌లో సచివాలయం చుట్టుపక్కల ఎవరికైనా నలభై ఎకరాల భూమి ఉందా? హైదరాబాద్ రాజధాని అవుతుందని ముందే తెలిసినా, ఇలా ఇన్సైడ్ ట్రేడింగ్ లేదా భూముల కొనుగోలుకు ప్రయత్నించినట్లు ఎవరూ చెప్పలేదు. అంతకుముందు కర్నూలులో రాజధాని ఏర్పాటు చేసినప్పుడు కూడా ఇలా ఎవరూ పెద్ద ఎత్తున భూములు కొనలేదన్నది వాస్తవం. కానీ అమరావతి గ్రామాలలో ముందస్తుగా ఎకరాలకు ఎకరాలు బాబు హయాంలో కొనుగోలు చేశారు. న్యాయ వ్యవస్థకు చెందిన కొందరు ప్రముఖులు తమ కుటుంబాల పేరుతో భూములు కొన్నారన్న అభియోగాలు వచ్చాయి. రాజ ధాని పరిధిని ఆనాటి ప్రభుత్వం తన ఇష్టం వచ్చినట్లు మారుస్తూ వచ్చింది. అవసరం అనుకుంటే పరిధిని తగ్గించడం లేదా పెంచుతూ వచ్చారు. నాటి సీఎం బాబుకు చెందిన హెరిటేజ్ కంపెనీ 14 ఎకరాలు కొన్నది. ఆ భూమి పూలింగ్‌లో పోకుండా రాజధాని హద్దులు గీశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అలాగే కోర్ క్యాపిటల్‌లో ఆనాటి అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కుటుంబీకులు నలభై ఎకరాలు కొనుగోలు చేశారట. దమ్మాలపాటిపై ఏసీబీ కేసు పెడితే ఆయనపై చర్య తీసుకోకుండా, ఆ కేసుకు సంబంధించిన విషయాలేవీ ప్రచారం చేయవద్దని ఏపీ హైకోర్టు వారు చిత్రమైన తీర్పు ఇచ్చారు. ఆ క్రమంలోనే ఒక సుప్రీంకోర్టు సీనియర్ జడ్జి కుమార్తెలు కూడా అక్కడ భూములు ఇన్సైడ్ ట్రేడింగ్‌లో కొన్నారని ఆరోపణలు వస్తే, వారు పిటిషన్ పెట్టకపోయినా, వారికి కూడా స్టే ఇచ్చేసి గౌరవ హైకోర్టు వారు కొత్త ట్రెండ్ సృష్టించారన్న వ్యాఖ్యలు వచ్చాయి. కానీ కొత్తగా అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకు వచ్చింది. అమరావతి రాజధాని ప్రాంతంలో 54 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించడాన్ని కొందరు టీటీపీ నేతలూ, ఇతరులూ వ్యతిరేకిస్తూ రాజధాని ప్రాంతంలో కొత్తగా 54 వేలమందికి ఇళ్ల స్థలాలు ఇస్తే కులాల సమతుల్యత దెబ్బతింటుందని హైకోర్టులో పిటిషన్ వేశారు. దీన్నే సీఎం జగన్ ప్రస్తావించి అమరావతి అందరి రాజధానిగా ఉండకుండా టీడీపీ వారు అడ్డుపడుతున్నారని, బలహీనవర్గాలకు చెందిన పేదలు రాజధానిలో ఉండడానికి వీలు లేదా అని ఆయన ప్రశ్నించారు. కాగా, రైతుల పేరుతో కొంతమంది ఆయా గ్రామాలు కొన్నిటిలో శిబిరాలు వేసుకుని నిరసనలు తెలుపుతున్నారు. ఈ మధ్యే ఆ ఉద్యమానికి సంవత్సరం అయిందంటూ ఒక కార్యక్రమం కూడా నిర్వహించినప్పుడు అత్యధికులు ఖరీదైన కార్లలో రావడాన్ని కూడా అంతా గమనించారు. రాజధాని ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతులు ఎక్కువమంది వ్యవసాయం చేయడం లేదు. వారు ఏటా ప్రభుత్వం నుంచి నిర్దిష్ట కౌలు పొందుతున్నారు. వ్యవసాయ కూలీలు పెన్షన్‌ను పొందుతున్నారు. జగన్ ప్రభుత్వం వచ్చాక ఆ కౌలును పదిహేను ఏళ్ల పాటు ఇస్తామని ప్రకటించింది. అలాగే కూలీల పెన్షన్‌ను రూ. 2,500 నుంచి 5 వేలు చేశారు. అయినా రైతులు త్యాగం చేశారని ప్రచారం చేస్తున్నారు. 10 లక్షలు లేదా 15 లక్షల విలువైన భూములను 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు అమ్ముకోవడం త్యాగం అవుతుందా? పైగా ఆ రైతులు ఇక్కడే పూర్తిగా రాజధాని ఉండాలని, లక్షకోట్లు ఇక్కడే వ్యయం చేయాలని చెబుతారు. అంటే తమ భూములకు కోట్ల రూపాయల విలువ ఉండాలని వారి భావన. కానీ రాష్ట్రంలోని ప్రజల ప్రయోజనాలను పక్కనబెట్టి, అన్ని చోట్ల వసూలు అయ్యే పన్నుల డబ్బును ఇక్కడే ఖర్చు చేయాలని ఆశించడమే తప్పు. చంద్రబాబు అప్పట్లో చాలామంది చెప్పిన మాట విని నాగార్జున యూనివర్సిటీ పక్కన రెండువేల ఎకరాల ప్రభుత్వ భూమిలో రాజధానికి అవసరమైన భవనాలు కట్టేసి ఉంటే, ఇప్పుడు మార్చే అవకాశం వచ్చేది కాదు. దాని చుట్టూ ప్రైవేటు భూముల విలువలు ఆటోమేటిక్‌గా పెరిగేవి. కానీ ప్రభుత్వమే ఇన్ని వేల ఎకరాలు తీసుకోవడం పెద్ద బ్లండర్ అని చెప్పాలి. తప్పు చేసింది బాబు అయితే, అక్కడ శిబిరాలలో కూర్చున్నవారు జగన్‌ను విమర్శిస్తుంటారు. వీరంతా బాబు ట్రాప్‌లోనే ఉంటున్నారు. న్యాయ వ్యవస్థను మేనేజ్ చేస్తానని కూడా ఆయన నమ్మించారని కొందరంటున్నారు. సీఎం జగన్ మాత్రం అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే రాజధానిని నిర్మించుకుందామని అంటున్నారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి టీడీపీకానీ, అమరావతి జేఏసీకి నాయకత్వం వహిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ వ్యతిరేకించిన తీరు ఇప్పుడు సీఎం జగన్‌కు ఆయుధంగా మారింది. అమరావతిలో కులాల అసమతుల్యత ఏర్పడుతుందన్న వారి వాదనను జగన్ ప్రజలలోకి తీసుకు వెళుతున్నారు. దీని ప్రభావం ప్రజలపై పడితే, టీడీపీ ఎన్నటికీ కోలుకోలేదన్నది వాస్తవం. బాబుకు కానీ, టీడీపీకి కానీ, రాష్ట్ర ప్రయోజనాలకన్నా, తమ రియల్ ఎస్టేట్ ప్రయోజ నాలే ముఖ్యంగా కనిపిస్తుండడం కూడా వైఎస్సార్సీపీకి రాజకీయంగా లాభించే విషయంగా మారిందనడంలో సందేహం లేదు. వ్యాసకర్త కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు -
భారత్‌తో చెలిమికే బైడెన్ మొగ్గు!
బిల్ క్లింటన్ హయాంలో తప్ప ఎన్నికైన ప్రతి అమెరికా అధ్యక్షుడూ భారత్‌తో సామరస్య పూర్వకమైన సంబంధాలను నెలకొల్పుకోవడానికే ప్రాధాన్యతనిచ్చారు. జార్జి బుష్ జూనియర్, బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్ హయాంలో అమెరికా భారత్ సంబంధాలు కొత్త పుంతలు తొక్కాయి. అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్, ఆయన జట్టులోని కీలక సభ్యులు భారత్‌ను ఏ దృక్పథంతో చూస్తారనే ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి. ఒబామా హయాంలో ఉపాధ్యక్షుడిగా భారత్ సందర్శించిన బైడెన్‌కు భారత్ పట్ల సానుకూల అభిప్రాయమే ఉంది. భారత్‌పై అణు ఆంక్షలకు ముగింపు పలకాలంటూ మద్దతు పలికారు. బైడెన్ టీమ్‌లో ఉండబోతున్న కీలక అధికారులు సైతం తాలిబన్ల కట్టడి, పాకిస్తాన్ ప్రేరేపిత సీమాంతర ఉగ్రవాద చర్యల నిరోధం వంటి అంశాలపై భారత్ అనుకూల వైఖరినే ప్రదర్శించగలరని సంకేతాలు వెలువడుతున్నాయి. కొత్తగా ఎన్నికయ్యే ప్రతి అమెరికా అధ్యక్షుడూ విదేశీ విధాన నిర్వహణపై తన వ్యక్తిగత ముద్ర వేయాలని చూడటం కద్దు. బిల్ క్లింటన్ అధ్యక్షుడుగా ఉన్నకాలంలో భారత్–అమెరికా సంబంధాలు దిగజారి పోయాయి. భారత్ అణ్వాయుధ కార్యక్రమాన్ని నిలిపి వేయడానికి క్లింటన్ శతథా ప్రయత్నించారు. కశ్మీర్ సమస్యకు సంబంధించి భారత్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలని ప్రయత్నించిన క్లింటన్, చైనాతో సత్సంబంధాలు కుదుర్చుకోవడానికి నడుం కట్టారు. క్లింటన్ అనంతరం గద్దెనెక్కిన జార్జి బుష్ (జూనియర్) భారత్‌తో అత్యంత మిత్రపూరితంగా వ్యవహరించిన అమెరికా అధ్యక్షుడిగా చరి త్రలో మిగిలిపోయారు. భారతదేశంపై అంతర్జాతీయ అణు సంపన్న దేశాలు ఆంక్షలను ఎత్తివేయడంలో సహకారమందించారు. బుష్ నిర్దే శించిన పంథానే ఒబామా అనుసరించారు. భారత్‌తో సంబంధాలను ఇండో–పసిఫిక్ భద్రతా దృక్పథం నుంచి ఒబామా అంచనా వేశారు. వ్యవసాయ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు విధించినప్పటికీ, భద్రతాపరమైన అంశాలపై భారత్‌కు ప్రస్తుత ప్రెసిడెంట్ ట్రంప్ మద్దతుగా నిలిచారు. ఇకపై బైడెన్ హయాంలో జమ్మూ కశ్మీర్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ, పౌరసత్వ చట్టాలు వంటి అంశాలపై అమెరికాకు భారత్ తగు హామీని ఇవ్వాల్సి ఉంటుంది. అమెరికా తదుపరి అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికను ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు, ప్రభుత్వాలు స్వాగతించాయి. బైడెన్, అయన జట్టులోని కీలక సభ్యులు భారత్‌ను ఏ దృక్పథంతో చూస్తారనే ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి. ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడి హోదాలో బైడెన్ భారత్ సందర్శించారు. భారత్‌తో బైడెన్ నెరిపిన కీలకమైన సంబంధాలు ఏవంటే... సెనేట్ విదేశీ సంబంధాల కమిటీ చైర్మన్ హోదాలో నాటి అధ్యక్షుడు బుష్‌కి ఉత్తరం రాస్తూ, భారత దేశంపై అణు ఆంక్షలకు ముగింపు పలకాలని బైడెన్ మద్దతు పలికారు. ఉపాధ్యక్షుడి హోదాలో బైడెన్ 2013 జూలైలో భారత్‌ను సందర్శించారు. వాతావరణ మార్పుపై ఒప్పందం కోసం అంత ర్జాతీయ మద్దతును కూడగట్టడంలో అమెరికాకు సహకరించాల్సిందని భారత్‌ను ఒప్పించే ప్రచారం మొదలెట్టిన బైడెన్ తన పనిలో విజయం సాధించారు కూడా. పారిస్‌లో నిర్వహించిన 2015 వాతావరణ మార్పు సదస్సు సందర్భంగా అమెరికాకు భారత్ మద్దతిచ్చింది. ఈ సదస్సులోనే పర్యావరణ సమస్యలపట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రదర్శించిన చిత్తశుద్ధిని అమెరికా నిజంగానే మెచ్చుకుంది కూడా. విదేశీ విధానం, భద్రతా విధానాలకు సంబంధించిన సమస్యలపై బైడెన్ పాలనా యంత్రాంగంలో ముగ్గురు వ్యక్తులు కీలక స్థానాల్లో ఉండబోతున్నారు. సెనేట్ విదేశీ సంబంధాల కమిటీలో బైడెన్‌కు దీర్ఘకాలం పాటు సహకరించిన ఆంథోనీ బ్లింకెన్ (ప్రస్తుతం అమెరికా విదేశీ వ్యవహారాల మంత్రి కానున్నారు)తో భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జయశంకర్ వ్యవహరించవలసి ఉంటుంది. ఒబామా ప్రభుత్వంలో బ్లింకెన్ డిప్యూటీ విదేశీ మంత్రిగా వ్యవహరించారని గుర్తుంచుకోవాలి. భారత్‌తో సంబంధాల తీరుతెన్నుల గురించి ఈ ఏడాది జూలైలో వాషింగ్టన్లో ప్రసంగించిన బ్లింకెన్, భారత్‌తో దృఢమైన సంబం ధాలను నెలకొల్పుకోవడానికి అత్యధిక ప్రాధాన్యమిస్తామని చెప్పారు. ‘ఇండో–పసిఫిక్ భవిష్యత్తుకు ఇది ఎంతో ముఖ్యమైనది, మేం కోరు కుంటున్న వ్యవస్థ తీరుకు భారత్‌తో సంబంధాలు చాలా ముఖ్యమై నవి. నూతన వ్యవస్థ అనేది మరింత న్యాయబద్ధంగా, సుస్థిరంగా, మరింత ప్రజాస్వామ్యయుతంగా ఉండాలని కోరుకుంటున్నాం’ అని బ్లింకెన్ పేర్కొన్నారు. భారత్‌తో రక్షణరంగ పారిశ్రామిక సహకారం అభివృద్ధిని కూడా బ్లింకెన్ ఆకాంక్షించారు. దీనివల్ల భారతదేశంలో రక్షణ రంగ ఉత్పత్తి గణనీయంగా మారిపోతుంది. జాతీయ భద్రతా విధానాలతో వ్యవహరించనున్న బైడెన్ టీమ్‌లో అత్యంత వృత్తిపర నైపుణ్యం, అనుభవం కలిగిన అధికారులు ఉన్నారు. 43 ఏళ్ల వయసున్న జాక్ సుల్లివాన్ ఇప్పుడు బైడెన్ జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్నారు. బైడెన్ ఉపాధ్యక్షుడిగా, హిల్లరీ క్లింటన్ విదేశీ వ్యవహారాల మంత్రిగా ఉన్నప్పుడు సుల్లివాన్ అత్యంత కీలక పదవుల్లో బాధ్యతలు నిర్వహించారు. మరొక ఆసక్తికరమైన నియామకం జనరల్ లాయిడ్ ఆస్టిన్. అమెరికా చరిత్రలో రక్షణ రంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న మొట్టమొదటి ఆఫ్రికన్ అమెరికన్ కావడం విశేషం. ఆస్టిన్ గతంలో యుఎన్ జనరల్ కమాండ్ అధిపతిగా వ్యవహరించేవారు. ఇది అఫ్గానిస్తాన్‌లో అమెరికా సైనిక చర్యలను ప్రత్యక్షంగా పర్యవేక్షించేది. కాబట్టి అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లకు మద్దతునివ్వడంలో పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ పాత్ర గురించి, అబోత్తాబాద్‌లో అల్ కాయిదా అధినేత బిన్ లాడెన్‌కు పాకిస్తాన్ ఆశ్రయమివ్వడం గురించి అస్టిన్ కాబోయే అధ్యక్షుడికి చక్కని సమాచారం ఇవ్వగలరు. పాకిస్తాన్ అణ్వాయుధ నిర్మాణంలో చైనా సహకారం గురించి భారత్‌కు చక్కటి సూచనలు అందించగలరు. మరోవైపు జమ్మూ కశ్మీర్లో తాజా పరిస్థితి, పౌరసత్వ సవరణ చట్టం గురించి బ్లింకెన్ మాట్లాడుతూ, కశ్మీరులో స్వేచ్ఛగా సంచరిం చడం, వాక్ స్వేచ్ఛలను దెబ్బతీస్తూ భారత్ ఇటీవలి కాలంలో తీసు కున్న కొన్ని చర్యల గురించి కూడా ప్రస్తావించారు. భారతదేశంలో పౌరసత్వ చట్టాలపై కూడా ఆయన మాట్లాడారు. కొన్ని రంగాల్లో విభేదాలు ఉన్నప్పటికీ మరింత గొప్ప సహకారాన్ని నిర్మించు కోవడంపై మరింత మెరుగైన రీతిలో వ్యవహరించగలమని బ్లింకెన్ నొక్కి చెప్పారు. అదే సమయంలో జమ్మూ కశ్మీరుపై భారత్ పారదర్శక విధానాన్ని కలిగి ఉన్నదని మనం బైడెన్ పాలనా యంత్రాంగానికి స్పష్టం చేయ వలసిన అవసరం ఉంది. జమ్మూకశ్మీరులో ప్రజలు ఎన్నుకునే ప్రజా స్వామ్య ప్రభుత్వాన్ని పునరుద్ధరించే విషయంలో కేంద్ర ప్రభుత్వం ధృఢ నిర్ణయంతో ఉందని కూడా చెప్పవలసి ఉంది. జమ్మూకశ్మీర్‌లో ఉనికిలో ఉన్న ప్రజాతంత్ర సంస్థలను అణచిపెట్టడానికి, ఎన్నికలను విచ్ఛిన్నం చేయడానికి పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ఏమేరకు ప్రోత్సహిస్తుందన్న దానికి అనుగుణంగానే ఆ ప్రాంతంపై భారత్ విధానం ఉంటుందని అమెరికాకు అర్థం చేయించాల్సి ఉంది. అదే సమయంలో భారతదేశంలోనూ, అఫ్గానిస్తాన్‌లోనూ ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు నివ్వకుండా చేయడంలో అమెరికా తన పలుకు బడిని ఉపయోగించాలని భారత్ ఆశిస్తున్నదనే విషయాన్ని కూడా మనం అమెరికాకు స్పష్టం చేయవలసిన అవసరం ఉంది. ఇకపోతే చైనా, రష్యాతో అమెరికా సంబంధాల్లో కూడా గణనీయమైన స్థాయిలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. చైనాపై డొనాల్డ్ ట్రంప్ హయాంలో మాదిరి తీవ్రమైన కఠిన పదజాలాన్ని ప్రయోగించడం తగ్గిపోవచ్చు. ఎందుకంటే పసిíఫిక్, హిందూ మహా సముద్రంలో తన సైనికపరమైన ఉనికిని అమెరికా కొనసాగించ నుంది. అయితే ట్రంప్ పాలనాయంత్రాంగం నుంచి రష్యా అందు కున్న ప్రాధాన్యత బైడెన్ హయాంలో లభించక పోవచ్చనిపిస్తుంది. అలాగే ట్రంప్ ప్రభుత్వం ఇరాన్‌పై విధించిన ఆంక్షలకు బైడెన్ యంత్రాంగం ముగింపు పలకవచ్చు. ఇది ఎంతైనా స్వాగతించవలసిన విషయం. ఎందుకంటే అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ ప్రాయోజిత ఉగ్రవా దాన్ని ఎదుర్కోవడంలో ఇరాన్ సానుకూల పాత్ర పోషించగలదు. అమెరికా, ఇరాన్ మధ్య సంబంధాలు సాధారణ స్థాయికి చేరుకుంటే అది అఫ్గానిస్తాన్‌లోనే కాకుండా గల్ఫ్ ప్రాంతంలో కూడా శాంతి సుస్థిరతలను పెంపొందించగలదు. అన్నిటికంటే మించి సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే విధానాన్ని కొనసాగించడంలో పాకిస్తాన్‌ను ప్రోత్సహించే విధంగా బైడెన్ యంత్రాంగం ఏరకంగానూ వ్యవహరించదని మనం భావించవచ్చు. అలాగే, చైనా ప్రాదేశిక స్వార్థ ప్రేరేపిత ఆకాంక్షలు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై అమెరికా తనదైన స్పష్టమైన వైఖరిని వ్యక్తపర్చగలదని కూడా మనం భావించవచ్చు. ఇండో–పసిఫిక్ ప్రాంతం పొడవునా ప్రాంతీయ భద్రతను ప్రోత్సహించడంలో క్వాడ్ ఇప్పుడు ఒక కీలక సంస్థగా ఉంటోంది. పైగా 2021లో జి–7 పారిశ్రామిక దేశాల (బ్రిటన్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, ఇటలీ, కెనడా) సదస్సుకు ఆతిథ్యం ఇస్తున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.. క్వాడ్ సభ్య దేశాలను ఆహ్వానించనున్నట్లు వార్తలు వస్తున్నాయి కూడా. ఇది భారత్‌కు ఎంతో అనుకూలమైన అంశమని చెప్పక తప్పదు. జి.పార్థసారథి వ్యాసకర్త చాన్స్‌లర్, జమ్మూ సెంట్రల్ యూనివర్సిటీ; మాజీ హైకమిషనర్, పాకిస్తాన్ -
ఆపత్కాలంలో ఏపీ నగదు వ్యూహం
జగన్ ప్రభుత్వం తక్షణమే నగదు బదిలీ చేయాలన్న ఒక సార్వత్రిక సహజ న్యాయ సూత్రాన్ని అమలు చేసింది. నగదు బదిలీ ద్వారా మాత్రమే రోజువారి కూలీలు, చిన్న సన్నకారు మెట్ట ప్రాంత రైతులు, అట్టడుగు సామాజిక వర్గాల వారి చేతిలో నాలుగు రూపాయల డబ్బులు పెరిగి మార్కెట్లో సరుకులకు డిమాండ్ పెరుగుతుంది. తద్వారా అది ఉత్పత్తులు పెరగడానికి, ఉద్యోగ ఆదాయ కల్పనకు దారితీస్తుంది. అందువల్లనే ప్రత్యక్ష నగదు చెల్లింపులు చేయాలని ప్రపంచంలో పేరుగాంచిన ఆర్థిక వేత్తలు, పరిశోధన సంస్థలు ఉమ్మడిగా తేల్చి చెప్పాయి. కరోనా వైరస్ మూలంగా లాక్డౌన్ మొదలై ఐదు నెలలు దాటింది. ఈ ఐదు నెలల కాలంలో ప్రపంచవ్యాప్తంగా రెండు కీలక అంశాలమీద చర్చ జరుగుతున్నది. మొద టిది, వీలైనంత తొందరగా టీకా కనుగొనే విషయమై వైద్యరంగానికి సంబంధించినది. రెండవది, లాక్డౌన్ మూలంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను కాపాడటానికి నగదు బదిలీ ఆవశ్యకతపై చర్చ. వైరస్ సోకితే ప్రాణాపాయ సమస్య రెండు శాతానికే పరిమితం కాగా, ఆర్థిక సంక్షోభ సమస్య 90 శాతం పైగా ప్రజలను చుట్టుముట్టి వైరస్‌కు వ్యతిరేకంగా పోరాడలేని నిస్సహాయ స్థితిలోకి సమాజాన్ని నెట్టివేస్తుంది. కరోనా టీకా వచ్చే వరకు ఆర్థిక వ్యవస్థకు కూడా ఆక్సిజన్ అందించడం అనివార్యం. ఆ ఆక్సిజన్ పేరే తక్షణ నగదు బదిలీ. ఈ విషయంలో అర్థశాస్త్ర నోబెల్ గ్రహీతలు అమర్త్యసేన్, అభిజీత్ బెనర్జీ మొదలు రఘురామ్ రాజన్, మన్మోహన్ సింగ్ వరకు ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేయడమే కాక, భారీమొత్తంలో అంతర్జాతీయ సంస్థల నుండి అప్పులు చేసైనా, చిట్ట చివరి అస్త్రంగా కరెన్సీని అదనంగా ముద్రించైనా నేరుగా నగదు బదిలీ చేయాలని భారత ప్రభుత్వాన్ని డిమాండ్ కూడా చేస్తున్నారు. అంతర్జా తీయ ద్రవ్య నిధి సంస్థ, ప్రపంచ బ్యాంక్ మొదలు ప్రపంచవ్యాప్తంగా వున్న అన్ని ఆర్థిక సంస్థలు కూడా ఇదే విషయమై అన్ని దేశాలకూ పిలుపునిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వాల పాలనా సామర్థ్యాలకు సవాల్ విసరడమే గాక, మన సమాజ అనుభవంలోకి మునుపెన్నడూ రాని ఇంతటి గడ్డు పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా ఎదుర్కున్నదో పరిశీలించడమే ఈ వ్యాసం ఉద్దేశం. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టేనాటికి, అంటే కరోనా వ్యాప్తి జరగకముందే భారత ఆర్థిక వ్యవస్థ మాంద్యంలో కూరుకుపోయి కదలలేని స్థితిలో ఉంది. 2014 నుండి వృద్ధిరేటు క్షీణిస్తూ మూడు దశాబ్దాల కనిష్ఠ స్థాయికి చేరింది. 2015– 16 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 8.2 శాతం ఉండగా, 2019– 20లో 4.2 శాతానికి పడిపోయింది. దీనికితోడు అంతకుముందే చంద్రబాబు ప్రభుత్వ అరాచక ఆర్థిక నిర్వహణ ఫలితంగా ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు వేల కోట్లు పేరుకుపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడకుండా ఉండటానికి ముందుచూపుతో ప్రభుత్వం ఆర్థిక సహకారం అవసరం ఉన్న అన్ని వర్గాలవారికి నేరుగా నగదు బదిలీ ద్వారా మొదటి సంవత్సరంలో దాదాపు 40139.58 కోట్ల రూపాయలను అందించింది. ఈలోగా కరోనా రూపంలో జగన్ ప్రభుత్వానికి మరో పరీక్ష ఎదురైంది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2017 –18 గణాంకాలను ప్రస్తుత పరిస్థితులకు అన్వయించి తేల్చిన అంచనాల ప్రకారం, దేశంలో ఇదివరకే పేదరికంలో వున్న 56 కోట్లమంది కాక, లాక్డౌన్ వల్ల మరో 40 కోట్లమంది కొత్తగా పేదరికపు రేఖకు దిగువకు పడిపోయారు. వీరిలో దాదాపు 62 కోట్లమంది అంటే దాదాపు 47 శాతం కటిక దారిద్య్రపు కోరల్లో చిక్కుకున్నారు. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అంచనా ప్రకారం, లాక్డౌన్ వల్ల ఒక నెలకు దేశ సంపద 12 శాతం హరించుకుపోయింది. పర్యవసానంగా నిరుద్యోగ రేటు అంచనాలకు అందనంతగా పెరిగింది. ఇంతటి విషాద పరిస్థితుల్లో ఖజానా నుండి పైసా తీయకుండా చేసే వట్టి ప్రచారాల వల్ల ఏమాత్రం ఉపయోగం ఉండదని భావించిన జగన్ ప్రభుత్వం తక్షణమే నగదు బదిలీ చేయాలన్న ఒక సార్వత్రిక సహజ న్యాయ సూత్రాన్ని అమలు చేసింది. కేంద్ర ప్రభుత్వం కంటితుడుపు చర్యగా స్వల్ప నగదు సహాయం మాత్రమే ప్రకటించి చేతులు దులుపుకుంది. అంతకంటే ఎక్కువగా పారిశ్రామిక వర్గాలకు పలు ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించింది. డిమాండ్ పడిపోయిన ఆర్థిక రంగంపై కేవలం ప్యాకేజీలు ఏమాత్రం ప్రభావం చూపవన్నది కఠిన వాస్తవం. ప్రజలకు ఆదాయాలు పెరిగితే మార్కెట్లో వస్తువులను కొంటారు, వస్తువులు అమ్ముడుపోతే పరిశ్రమలు సరుకులు ఉత్పత్తి చేస్తాయి. అందువలన ప్రజల కొనుగోలు శక్తిని పెంచడానికి ఏ ప్రభుత్వమైనా ప్రాధాన్యత ఇవ్వాలి. డిమాండ్ పడిపోయివున్న పరిస్థితుల్లో ఉత్పత్తిదారులకు ద్రవ్య సరఫరా పెంచినా ఆర్థిక వ్యవస్థ గాడిలో పడదనేది 1930 నుండి ప్రపంచ వ్యాప్తంగా అనుభవంలో ఉన్న విషయమే. నగదు బదిలీ ద్వారా మాత్రమే రోజువారి కూలీలు, చిన్న సన్నకారు మెట్ట ప్రాంత రైతులు, అట్టడుగు సామాజిక వర్గాల వారి చేతిలో నాలుగు రూపాయలు డబ్బులు పెరిగి మార్కెట్లో సరుకులకు డిమాండ్ పెరుగుతుంది. తద్వారా అది ఉత్పత్తులు పెరగడానికి, ఉద్యోగ ఆదాయ కల్పనకు దారితీస్తుంది. అందువల్లనే ప్రత్యక్ష నగదు చెల్లింపులు చేయాలని ప్రపంచంలో పేరుగాంచిన ఆర్థిక వేత్తలు, పరిశోధన సంస్థలు ఉమ్మడిగా తేల్చి చెప్పాయి. నగదు బదిలీద్వారా కొనుగోలు శక్తిని వీలున్నంతవరకు అందించడం అనేది ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి కీలకాంశం అవుతుంది కాబట్టి. నగదు బదిలీ పథకం లబ్ధిదారులు మహిళలు అయితే దాని ప్రభావం మరింత శక్తిమంతంగా ఉంటుందనీ, అది మొత్తం కుటుంబ జీవన ప్రమాణాలను, ప్రత్యేకించి పిల్లల భవిష్యత్‌ను ప్రభావితం చేస్తుందనీ ఇప్పటికే అంతర్జాతీయ సర్వేలు తేల్చాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన చాలా నగదు బదిలీ పథకాల్లో లబ్ధిదారులు నేరుగా మహిళలే ఉండటం ఒక అద్భుతమైన విషయం. నగదు బదిలీ ద్వారా పొందిన మొత్తం దేనిపై పెట్టుబడి పెట్టాలి, ఏ వినియోగంపైన ఏ అవసరాలకు ఖర్చు చేయాలి అనే ఎంపిక స్వేచ్ఛ కూడా ఆ కుటుంబాలకు ఉంటుంది. లాక్డౌన్ వల్ల ఒకవైపు కుటుంబాలకు పని లేక ఆదాయం తగ్గడమే గాక మరోవైపు ప్రభుత్వానికి కూడా ఆర్థిక కార్యకలాపాలు ఆగిపోవడం మూలంగా వనరుల కొరత ఏర్పడింది. అయినప్పటికీ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వెనకడుగు వేయకుండా సంక్షేమ పథకాలను మరింతగా విస్తరించింది. ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చడం కరోనా పూర్వపు పరిస్థితి కంటే అత్యవసరమని గుర్తించింది. ఏప్రిల్ 1 నుండి ఇప్పటివరకు 21,183.36 కోట్ల రూపాయలను నేరుగా నగదు బదిలీ ద్వారా 1,64,72,245 మందికి సహాయం చేసింది. వైఎస్సార్ విద్యా దీవెన ద్వారా 4200 కోట్లను విడుదల చేసి నగదు చెలామణిని పెంచింది. ప్రత్యేకించి అట్టడుగు వర్గాలకు దన్నుగా నిలిచింది. నేతన్న హస్తం ద్వారా చేనేతలకు ఒక్కో కుటుంబానికి 24 వేల చొప్పున 81,703 మందికి నేరుగా సహాయం చేసింది. జగనన్న చేదోడు పథకం ద్వారా రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీ కుటుంబాలకు 10 వేల చొప్పున 480 కోట్లను వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. రైతు భరోసా కింద మొదటి విడతగా 3,675 కోట్ల రూపాయలు మే నెలలోనే అందించింది. అంతేగాక 57 లక్షల మంది రైతులకు 1,150 కోట్ల వడ్డీ రహిత రుణాన్ని అందించింది. రైతుల దగ్గర వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి 5,744 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించింది. కందులు, శనగలు, జొన్నలు, పసుపు తదితర పంటలను మద్దతు ధరతో కొనుగోలు చేసి మరో 2,624 కోట్లు రైతులకు చెల్లించింది. ఇప్పటివరకు ఐదు విడతలుగా 1 కోటి 50 లక్షల రేషన్‌కార్డుదారులకు ఉచితంగా బియ్యం, కందులు, శనగలు పంపిణీ చేసింది. రేషన్‌కార్డుదారులకు 1000 చొప్పున నగదు సహాయం చేసింది. స్వయం సహాయక సంఘాల్లోని 91 లక్షల మంది మహిళలకు వడ్డీరహిత రుణ పథకం ద్వారా 1,400 కోట్లు అందించింది. అర్చకులకు, ఇమామ్‌లకు, పాస్టర్లకు 5 వేల చొప్పున 77,290 మందికి సహాయం చేసింది. వైఎస్సార్ చేయూత ద్వారా ఒక్కో కుటుంబానికి 18,750 చొప్పున 22,28,909 మంది మహిళలకు నేరుగా నగదు సహాయం చేసింది. దానితోపాటు అమూల్, అల్లానా, రిలయన్స్ లాంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని తద్వారా మహిళలను మైక్రో ఎంటర్ప్రైనర్స్గా మార్చే బాధ్యతను కూడా ప్రభుత్వమే చేపట్టడం మరో సంచలనం. విభిన్న పథకాలకు అర్హత పొందడం ద్వారా దాదాపు 25 వేల చొప్పున నగదు సహాయం పొందిన కుటుంబాలు లక్షల్లో ఉండటం చెప్పుకోదగ్గ విషయం. దేశవ్యాప్తంగా ప్రజల కొనుగోలు శక్తి పడిపోయి దాని ప్రభావం వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లపై కూడా పడింది. గత ఆర్థిక సంవత్సరం జూలై నెలతో పోల్చితే ఈ సంవత్సరం జూలైలో దాదాపు 14.36 తక్కువగా జీఎస్టీ వసూలైంది. ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జీఎస్టీ వసూళ్లలో దేశవ్యాప్తంగా నమోదైన 14.36 శాతం ప్రతికూలతలను అధిగమించి 2.65 శాతం వృద్ధిని సాధించింది. పెట్రోలియం ఉత్పత్తుల అమ్మకంలో 1.90 శాతం అధికంగా వృద్ధి నమోదైంది. కరోనా ఆర్థిక సంక్షోభ కాలంలో కేంద్రప్రభుత్వం సహా మరే ఇతర ధనిక రాష్ట్రాలు సైతం చేయని విధంగా తక్కువ వనరులు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేరుగా నగదు సహాయం చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంలో సామాజిక భద్రత, ఆర్థిక భరోసా కలిగించిందని చెప్పడానికి ఇదే నిదర్శనం. మాములుగా ఎన్నికలు అయిపోగానే ఎన్నికల మేనిఫెస్టోను అధికారంలోకి వచ్చిన పార్టీనే కాక ‘ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయండి’ అని నిలదీయాల్సిన ప్రజలు కూడా మర్చిపోతున్న సంప్రదాయాన్ని ఇప్పటివరకు మనం చూశాం. కానీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుసటి రోజునుండే తన ఎన్నికల మేనిఫెస్టోను తు.చ. తప్పకుండా అమలు చేయడమేగాక, దాన్ని ప్రజాక్షేత్రంలో బహిరంగంగా వుంచి ప్రజలకు మేనిఫెస్టోను నిరంతరం గుర్తుచేస్తూ జవాబుదారీగా ఉండటం ఒక సాహసం, సంచలనం. ఇది దేశ రాజకీయాల్లోనే ఒక న్యూ ట్రెండ్! ప్రొ. కె.వి.రమణారెడ్డి వ్యాసకర్త రిటైర్డ్ ప్రొఫెసర్, ఎస్కే యూనివర్సిటీ, అనంతపురం. ఫోన్: 9177335604 -
స్కామ్‌లపై కేసులు వద్దంటే ఏంటర్థం?
దేశంలోనే ఇలాంటి వ్యాజ్యాలు అరుదుగా పడుతుంటాయేమో! తమ ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యవహారాలపై ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం విచారణ జరపరాదనీ, ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించరాదనీ, సీబీఐ విచారణకు అప్పగించరాదనీ ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ హైకోర్టును ఆశ్రయించిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇంతకాలం దమ్ముంటే విచారణ చేసుకోండి, మేం ఏ తప్పూ చేయలేదు, నిప్పులా బతికాం అంటూ భీషణ ప్రకటనలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన మద్దతుదారులు ఎందుకు స్వరం మార్చారు? కేసులు పెట్టుకోండని సవాళ్లు చేసిన టీడీపీ, తమపై వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కక్షతో కేసులు పెడుతోందని, అవినీతి జరిగిందని ఆరోపిస్తూ తమ వాళ్లను అరెస్టు చేస్తోందని ప్రచారం చేస్తోంది. ఇప్పుడు ఏకంగా అసలు కేసులే పెట్టవద్దని హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు ఏమి చేస్తుందన్నది వేరే విషయం. ఏ న్యాయస్థానం కూడా అక్రమాలను వెలికి తీయవద్దని, అన్యాయాలను నిరోధించవద్దని చెబుతుందని అనుకోజాలం. గతంలో ఎన్నో సందర్భాలలో హైకోర్టులే ప్రస్తుత ప్రభుత్వాలలో జరిగే తప్పులను, గత ప్రభుత్వాలలో జరిగే తప్పులను విచారించాలని దర్యాప్తు సంస్థలకు ఆదేశాలు ఇచ్చాయి. ఏపీ హైకోర్టు కూడా అలా ఎన్నో తీర్పులు వెలువరించింది. చిన్న, చిన్న కేసులలో కూడా సీబీఐ విచారణ చేయాలని ఆదేశాలు ఇస్తూ సీరియస్ అయిన విషయాన్ని చూశాం. అలాంటిది వేల కోట్ల కుంభకోణం ఆరోపణలను విస్మరించకపోవచ్చు. అయినా తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా తమపై కేసుల విచారణ సాగరాదని హైకోర్టుకు వెళ్లడం ఒకరకంగా సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లు అవుతుంది. కోర్టు విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా టీడీపీకి అప్రతిష్టే. ఏ సాంకేతిక కారణం ఆధారంగానో విచారణకు అనుమతి ఇవ్వకపోయినా టీడీపీకి పరువు తక్కువే. అసలే వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్ట అని పేరుపొందిన చంద్రబాబుపై అనేక విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది. ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు ఇచ్చిన రిపోర్టులో అనేక విషయాలు వెల్లడించింది. ఏకంగా అప్పటి అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌పైనే ఇన్సైడ్ ట్రేడింగ్ ఆరోపణ చేశారు. చంద్రబాబు, లోకేశ్‌లకు సంబంధించిన హెరిటేజ్ సంస్థ భూముల కొనుగోలు మొదలు అప్పటి మంత్రులు నారాయణ, పుల్లారావు, కొందరు ఎమ్మెల్యేలు అంతా కలిసి నాలుగు వేలకు పైగా ఎకరాల మేర ఇన్సైడ్ ట్రేడింగ్ చేశారని ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఈ క్రమంలోనే టీడీపీ తరఫు న్యాయవాది గత ప్రభుత్వాలలో జరిగిన వాటిపై ప్రస్తుత ప్రభుత్వం విచారణ చేయరాదని వాదించడం విచిత్రమే. ఆయన చాలా సీనియర్ న్యాయవాది. అనేక విషయాలు తెలిసినవారు. మన రాష్ట్రంలోనే జరిగిన ఒక సంగతిని గుర్తు చేయాల్సి ఉంటుంది. 2007, 2008 ప్రాంతంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు అయిన ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో సాక్షి మీడియాతో పాటు, కొన్ని పరిశ్రమలను స్థాపించారు. అందులో ఆయా పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టారు. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు కొన్ని ఆరోపణలు చేశారు. కేంద్రానికి ఫిర్యాదులు కూడా చేశారు. కేంద్రం కానీ, ఆయా దర్యాప్తు సంస్థలు, పెట్టుబడులకు సంబంధించిన ప్రభుత్వ శాఖలు కానీ జగన్ కంపెనీలలో పెట్టుబడులను తప్పుపట్టలేదు. కానీ 2009లో ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అనూహ్య మరణం తర్వాత జరిగిన పరిణామాలలో టీడీపీ, కాంగ్రెస్ హైకోర్టుకు వెళ్లడం, ఆనాటి చీఫ్ జస్టిస్ ఆ పెట్టుబడులపై విచారణకు ఆదేశించడం, క్విడ్ ప్రో కో అనే కొత్త పదాన్ని కనిపెట్టి సీబీఐ విచారణ చేపట్టడం, వైఎస్ ప్రభుత్వం ఆ పారిశ్రామికవేత్తలకు ఉదారంగా రాయితీలు ఇచ్చిందని ఆరోపించడం, తద్వారా జగన్‌ను ఏకంగా పదహారు నెలల పాటు జైలులో నిర్బంధించిన సంగతి ఇంకా జనం స్మృతిపథంలోనే ఉంది. అప్పుడు అక్రమంగా కాంగ్రెస్, టీడీపీ కలిసి కేసులు పెట్టాయని నమ్మారు కనుకే జగన్‌కు ఇప్పుడు జనం బ్రహ్మరథం పట్టారు. మరి టీడీపీ లాయర్ వెంకటరమణ వాదన కరెక్టు అయితే వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన నిర్ణయాలపై ఆయన చనిపోయిన తర్వాత కేసులే పెట్టకూడదు కదా! అది కూడా మూడు, నాలుగేళ్ల తర్వాత కేసులు పెట్టారే. అప్పుడు పరిశ్రమలలో పెట్టుబడులు నేరంగా సీబీఐ చూపించడం దారుణమని మాబోటివాళ్లం వాదించేవారం. భూములు తీసుకుని పరిశ్రమలు పెట్టకపోతే జైలులో పెట్టాలి కాని, పరిశ్రమలు పెట్టడానికి సిద్ధం అయినవారిపై కేసులు ఏమిటని ప్రశ్నించేవారం. కానీ ఆ రోజున ఇదే చంద్రబాబు, జగన్ అక్రమాలకు పాల్పడ్డారు కనుకే కేసులు వచ్చాయని చెప్పారు. తన రాజకీయ శత్రువు అయిన కాంగ్రెస్‌తో కలిసి మరీ కేసులు పెట్టించే యత్నం చేశారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు టీడీపీ వాదన బలహీనంగా ఉందని చెప్పడానికి. అంతేకాదు, ఇప్పుడు నేరుగా అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ హైకోర్టుకు సమర్పించిన నివేదికలో ఆనాటి అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ సైతం ఇన్సైడ్ ట్రేడింగ్‌కు పాల్పడినట్లు నేరుగానే అభియోగం మోపారు కదా. మరి అది ఇన్సైడ్ ట్రేడింగ్ కాదని రుజువు చేసుకోవలసిన చంద్రబాబు కానీ, ఇతర టీడీపీ నేతలు కానీ అసలు కేసే వద్దని హైకోర్టుకు వెళ్లారంటేనే వారు ముందుగానే తప్పు చేసినట్లు ఒప్పుకున్నట్లే అవుతుంది. పోని గతంలో ఇలాంటివి జరగలేదా అంటే అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ హయాంలో జరిగిన బియ్యం మిల్లుల కుంభకోణంపై ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరుపుతోంది. 1977లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వం ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలంలో, ప్రత్యేకించి ఎమర్జెన్సీ అత్యాచారాలపై ఏకంగా జస్టిస్ షా కమిషన్‌ను నియమించి విచారణ చేయించింది. ఇందిరాగాంధీపై పార్లమెంటులో అనర్హత వేటు కూడా వేశారే! తమిళనాడులో కరుణానిధి ప్రభుత్వంపై ఏకంగా కేంద్రం ఒకసారి కమిషన్‌ను నియమించింది. అలాగే జయలలితపై కరుణానిధి ప్రభుత్వం విచారణ జరిపించడం, జైలుకు పంపించడం వంటి ఘట్టాలు చూశాం. అలాగే కరుణానిధిని కూడా అవినీతి ఆరోపణలపై జయలలిత జైలుకు పంపారు. బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ గానీ, హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా గానీ వేర్వేరు కుంభకోణాలలో దోషులుగా రుజువు అవడంతో ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నారు. గత ప్రభుత్వాల అక్రమాలపై విచారణ జరగకూడదనుకుంటే ఇవేవీ జరగకూడదు కదా. అంతేకాదు, ఉమ్మడి ఏపీలో జలగం వెంగళరావు ప్రభుత్వ కాలంలో నక్సల్స్‌పై జరిగిన దాడులపై కేంద్ర ప్రభుత్వం విమద్ లాల్ కమిçషన్ను నియమించింది. ఆయనకు ఆ కమిషన్‌తో పెద్దగా ఇబ్బంది రాలేదు, అది వేరే విషయం. మరి ఇప్పుడు చంద్రబాబు కానీ, ఆయన పార్టీ నేతలు కానీ అమరావతి రాజధానిలో అక్రమాలు జరగలేదని గట్టి విశ్వాసంతో ఉంటే వారు కూడా సిట్ లేదా సీబీఐ... ఏ విచారణకైనా సిద్ధమే అని చెప్పాలి తప్ప ఇలా జారిపోవడానికి ప్రయత్నించవచ్చా? తెలుగుదేశం పార్టీ ఐదేళ్ల అధికారం అనుభవించిన తర్వాత దారుణమైన ఆత్మరక్షణలో పడిందనడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏముంటుంది? మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఈఎస్ఐ కుంభకోణంలో భాగస్వామి అయితే బీసీ కనుక అభియోగాలు మోపి అరెస్టు చేశారని ఆరోపించారు. మరి ఈఎస్ఐ స్కామ్‌లో 151 కోట్ల గోల్మాల్ జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? కృష్ణా పుష్కరాలలో ఘాట్ల నిర్మాణంలో అక్రమాలు జరిగాయని విజిలెన్స్ విచారణ వేసి నలుగురు అధికారులపై దర్యాప్తు చేస్తుంటే అది మాజీ మంత్రి దేవినేని ఉమాను ఇబ్బంది పెట్టడానికే అని అంటారు. ఇప్పుడు ఏకంగా చంద్రబాబును ఇబ్బంది పెట్టడానికే రాజధాని భూ కుంభకోణం తెరపైకి తెచ్చారని అంటున్నారు. ఆ మాట అనడం ద్వారా వారు పరోక్షంగానో, ప్రత్యక్షంగానో స్కాములు జరిగాయని ఒప్పుకున్నట్లే అవుతుంది. ఇక్కడ ఇంకో మాట చెప్పాలి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆదాయపన్ను శాఖ చంద్రబాబు పీఎస్ ఇంటిపై దాడి చేసి 2 వేల కోట్ల మేర అక్రమాలకు సంబంధించిన ఆధారాలు లభ్యమయ్యాయని ప్రకటన ఇచ్చింది. నిజానికి అది చాలా సీరియస్ కేసు. అయినా చంద్రబాబు కానీ, ఆయన పార్టీ నేతలు కానీ దానిపై ఎందుకు హైకోర్టుకు వెళ్లలేదు? పైగా బీజేపీ నేతల ప్రాపకం కోసం ఎందుకు ప్రయత్నిస్తున్నారు? అంటే కేంద్రంలో ఎలాగోలా మేనేజ్ చేసుకుని బయటపడవచ్చన్న నమ్మకమా? లేక ఇంకేమైనా కారణం ఉందా? మరి ఏపీ ప్రభుత్వం ఇన్సైడ్ ట్రేడింగ్ దర్యాప్తు అంటే ఎందుకు భయపడి హైకోర్టును ఆశ్రయించారు? జగన్‌ను మేనేజ్ చేయలేమని అనుకున్నారా? ఏది ఏమైనా ఏపీ రాజకీయాలలో ఇది కొత్త ఒరవడి. నిజంగానే చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన అవినీతిని జగన్ ప్రభుత్వం వెలికి తీయగలిగితే పెద్ద విషయమే అవుతుంది. అప్పుడు ప్రభుత్వం అంటే స్కాములు చేయడం కాదు, అలా జరిగితే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎప్పుడో అప్పుడు శిక్ష పడుతుందన్న నమ్మకం ప్రజలకు కలుగుతుంది. ప్రజలకు రాజకీయ వ్యవస్థపై ఒక నమ్మకం వస్తుంది. కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాసకర్త, సీనియర్ పాత్రికేయులు -
మార్పును ప్రతిబింబిస్తున్న పుస్తకాలు
భాషాభివృద్ధిలో ప్రధాన సమస్య ఏదంటే, ఆధునిక శాస్త్రవిజ్ఞానాన్ని సులువుగా వ్యక్తీకరించే కొత్త పదజాలాన్ని స్వీకరించడమే. భాషలోని అక్షరాలను సరళతరం చేయకపోతే, ఉత్పాదక క్షేత్రాల్లో విరివిగా ఉపయోగించే పదాలను స్వీకరించకపోతే, పుస్తక భాషలో ఆదివాసీ ప్రాంతాలకు చెందిన పదాలను చొప్పించకపోతే, తెలుగు సుసంపన్నం కాలేదు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం రూపొందిస్తున్న మిర్రర్ ఇమేజ్ తరహా పుస్తకాల ద్వారా ఎదిగే తరాలు తెలుగుని విస్తృత స్థాయిలో అభివృద్ధి చేయగలవు. రెండు భాషల్లో ఒకే చోట పాఠాన్ని ప్రచురించడం ద్వారా ఒక భాషగా తెలుగు కంటే ఇంగ్లిష్ ఎంత సులభమో అటు విద్యార్థులు,ఇటు ఉపాధ్యాయులూ అర్థం చేసుకోగలరు. ఆంధ్రప్రదేశ్ బోధనకు సంబంధించి భవిష్యత్తులో అత్యంత సృజనాత్మక మదుపుదారుగా మారనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకటవ తరగతి నుంచి 6వ తరగతి వరకు కొత్త విప్లవాత్మకమైన విద్యా పథకంతో ముందుకొచ్చింది. రెండుభాషల్లోనూ మిర్రర్ ఇమేజ్ అని చెబుతున్న స్కూల్ పుస్తకాలను ప్రచురించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో విద్యార్థి, ఉపాధ్యాయుల సమస్యను పరిష్కరించడానికి రాష్ట్రంలో స్కూలు పుస్తకాలని ఇంగ్లిష్, తెలుగు పాఠాలు పక్కపక్కనే ఉండేలా ప్రచురించనున్నారు. రెండు భాషల్లో ఒకే చోట పాఠాన్ని ప్రచురించడం ద్వారా ఒక భాషగా తెలుగు కంటే ఇంగ్లిష్ ఎంత సులభమో అటు విద్యార్థులు, ఇటు ఉపాధ్యాయులూ అర్థం చేసుకోగలరు. భారతీయ భాషల్లో కంటే అక్షరాలు, వాక్య నిర్మాణం రీత్యా ఇంగ్లిష్‌ను నేర్చుకోవడం చాలా సులభమని వీరు గ్రహిస్తారు. దేశభాషలందు తెలుగు లెస్స అంటూ వీరాలాపన చేసే ఘనాపాఠీలు వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు సులువుగా పలికడానికి తగినట్లుగా తెలుగు రాత లిపిని మెరుగుపర్చడంపై ఎన్నడూ దృష్టిపెట్టలేదు. తెలుగు పుస్తకాల్లో రాతరూపంలోని పాఠం ఉత్పత్తి క్షేత్రాల్లో పరస్పరం మాట్లాడుకునే తెలుగు భాషకు సంబంధించినదిగా ఉండదు. పొలం దున్నేటప్పుడు, పంట కోసేటప్పుడు, ఇంట్లోనూ, బయట ఆహార ధాన్యాలను నిల్వచేసేటప్పుడు, ప్రజలు తమకు తెలి సిన ప్రజాభాషలోనే మాట్లాడతారు. కానీ పుస్తకాల్లో రాత పండిత భాషలో ఉంటుంది. చివరకు బ్రాహ్మణ (పురుషులు మాత్రమే పండితులుగా పేరొందుతారు) ఇళ్లలో కూడా సంస్కృతాన్ని మహిళల గృహ, వంటింటి భాషగా అనుమతించలేదు. ఒక్కసారి ఇలాంటి కృతక భాషను తెలుగు అక్షరాల్లోకి దూర్చి ఉత్పాదక వర్గాలపై బలవంతంగా రుద్దినప్పుడు అసలు తప్పు వాస్తవ రూపం దాలుస్తుంది. ఉత్పత్తి క్షేత్రాల్లోనే వికసించిన ఇంగ్లిష్ సరిగ్గా ఇంగ్లిష్ దీనికి వ్యతిరేక దిశలో పరిణమించింది. 14వ శతాబ్ది చివరివరకు ఇంగ్లిష్ అనేది ఇంగ్లండ్‌లోని రైతుల భాషగా ఉండి చర్చీల్లో ఉపయోగించడానికి అనుమతించేవారు కాదు. చివరకు ఆంగ్లికన్ చర్చీలలో కూడా గ్రీకు, లాటిన్ భాషలనే దైవ భాషలుగా ఆమోదించారు. ఇంగ్లిష్ ఉత్పత్తి క్షేత్రాల్లో పరిణమించి, అభివృద్ధి చెంది తర్వాత పుస్తక భాషగా మారింది. రైతులు మాట్లాడే భాష దేవుని ప్రార్థించే భాషగా మారినప్పుడే, ఇంగ్లిష్ అటు ప్రింట్, ఇటు మాట్లాడే రూపాల్లో సుసంపన్నంగా మారిపోయింది. ఇంగ్లిష్, జర్మన్, ఫ్రెంచ్ వంటి యూరోపియన్ భాషలను ప్రార్థనా భాషలుగా ఆమోదించినప్పుడు మాత్రమే యూరప్ రైతులు, శ్రామికులు ఈ భాషలను చదవడం, రాయడం నేర్చుకున్నారు. ఇది యూరప్ రైతాంగ జీవితంలోనే అతిపెద్ద విప్లవాత్మక పరిణామం అయి కూర్చుంది. ఒక భాషను పవిత్రమైనదిగా ఆమోదించిన తర్వాత మాత్రమే ఆ భాష అభివృద్ధి చెందే క్రమం పూర్తిగా మారిపోతుంది. అదే హిందూ మతంకేసి చూస్తే తెలుగు కానీ మరే ఇతర భాషలు కానీ నేటికీ అతిపెద్ద ఆలయాల్లో కూడా దైవాన్ని ప్రార్థించే భాషగా ఉండవనేది స్పష్టాతిస్పష్టం. ఇది తెలుగును మొదటినుంచీ అభివృద్ధి చెందకుండా నిరోధించిన మరొక ప్రతికూల అంశంగా ఉండిపోయింది. భాషాభివృద్ధిలో మరొక ప్రధాన సమస్య ఏదంటే, వికసిస్తున్న ఆధునిక శాస్త్రవిజ్ఞానాన్ని సులువుగా వ్యక్తీకరించగల కొత్త పదజాలాన్ని స్వీకరించడమే. భాషలోని అక్షరాలను సరళతరం చేయకపోతే, ఉత్పాదక క్షేత్రాల్లో విరివిగా ఉపయోగించే పదాలను స్వీకరించకపోతే, పుస్తక భాషలో ఆదివాసీ ప్రాంతాలకు చెందిన పదాలను చొప్పించకపోతే, తెలుగు çసుసంపన్నం కాదు, కాలేదు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం రూపొందిస్తున్న మిర్రర్ ఇమేజ్ తరహా పుస్తకాల ద్వారా ఎదిగే తరాలు తెలుగుని విస్తృత స్థాయిలో అభివృద్ధి చేయగలవు. సెమిస్టర్ ఒక కొత్త అనుభవం ఆలస్యంగా మొదలవుతున్న ఈ విద్యాసంవత్సరం నుంచి పాఠశాల విద్యలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెమినార్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టనుంది. పాఠశాల విద్యా స్థాయిలోనే సెమిస్టర్ మోడల్‌ను ప్రవేశపెట్టడం అనేది భారతీయ పాఠశాల విద్యా చరిత్రలోనే మొట్టమొదటిది. ఒక సంవత్సరంలో పిల్లల పురోగతిని రెండు అసెస్మెంట్ల ద్వారా లెక్కించడం వల్ల పిల్లలు తమపై అంచనా ప్రక్రియను చాలా సులభంగా నిర్వహించగలరు. అందుకే ఇది దీర్ఘకాలంలో చాలా సానుకూల ఫలితాలను అందిస్తుంది. నిజానికి దీన్ని పాఠశాల విద్యలో యూరో– అమెరికనేతర మోడల్‌గా చెప్పవచ్చు. పైగా ఇదొక విలువైన ప్రయత్నం కూడా. యూరో అమెరికన్ నమూనా తరహాలో భారత్‌లో ఏ స్థాయిలో కూడా పిల్లలు ఐపాడ్ వంటి రూపంలో సాఫ్ట్ బుక్స్ (ప్రింట్ పుస్తకాలు కాకుండా డిజిటల్ రూపంలో చదవగలగడం) చదివే అలవాటును మన పాఠశాల విద్య ఇంతవరకు అభివృద్ది చెందించలేదు. పుస్తకాల బరువును తగ్గించడం నేటి విద్యావిధాన లక్ష్యం. ఏపీ ప్రభుత్వం తీసుకొస్తున్న మిర్రర్ ఇమేజ్ పుస్తకాల బరువు ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఒక సెమిస్టర్ పూర్తి చేసే కాలంలో పిల్లలు కేవలం నాలుగు నెలలకు సంబంధించిన పుస్తకాలను మాత్రమే క్లాసుకు తీసుకురావచ్చు. తద్వారా వారు బరువు మోసే పని తగ్గుతుంది. పిల్లల్లో సృజనాత్మక ఆలోచనా సామర్థ్యాలను, నేర్చుకునే సమర్థతలను మెరుగుపర్చడంలో భారతీయ పాఠశాలల ఉపాధ్యాయులు చాలా కష్టపడాల్సిన అవసరం ఉంటోంది. ఇంతవరకు భారతీయ విద్యా వ్యవస్థ పాఠాలు గుర్తు పెట్టుకునే లేక వల్లెవేయించే ప్రక్రియలోనే నడుస్తోంది తప్ప పిల్లల్లో సృజనాత్మక ఆలోచనకు అనుమతిం చడం లేదు. కాబట్టి ఇకనైనా పిల్లల్లో సృజనాత్మక చింతన ప్రారంభం కావాలి. 6వ తరగతిని పూర్తి చేసే లోపే వారు కాలంతోపాటు తప్పక ఎదగాలి. స్వయంగా ఇంగ్లిష్‌లో మాట్లాడే అభ్యాసాన్ని ఇస్తున్న మిర్రర్ ఇమేజ్ పుస్తకాలు టీచర్ వయసు ఏదైనా సరే వారి ఇంగ్లిష్ కమ్యూనికేషన్‌ను కూడా మెరుగుపరుస్తాయి. ఇది పిల్లలు మాట్లాడే ప్రక్రియకు సాయపడుతుంది. పైగా టీచర్ కంటే ఎక్కువగా నేర్చుకోవడంపై పిల్ల లకు ఆసక్తి ఉంటుంది కనుక ప్రతి విద్యార్థి కూడా ఒక టీచరేనని ఉపాధ్యాయులందరూ గుర్తించాల్సి ఉంటుంది. శ్రమను గౌరవించడం నేర్పే బోధన యూరో–అమెరికన్ వ్యవస్థల్లో పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత పిల్లలు తమ కుటుంబం నుంచి బయటపడి కుటుంబ ఆర్థిక ప్రతిపత్తితో ప్రమేయం లేకుండా తమ సొంత జీవితం గడపాల్సి ఉంటుంది. భారత దేశంలో ఇది సాధ్యం కాదు. ఇక్కడ మనం చైనానుంచి నేర్చుకోవాల్సి ఉంటుంది. చైనాలోనూ మనకు లాగే భారీస్థాయిలో పిల్లలు పాఠశాలలకు వెళుతుంటారు. పైగా ఒకేరకమైన ఆర్థిక వ్యవస్థ మన రెండు దేశాల్లోనూ ఉంది. కానీ ఆ దేశంలో శ్రమను గౌరవించే బోధన విస్తృత స్థాయిలో కనిపిస్తుంది. భారతదేశంలోనూ శ్రమను గౌరవించడాన్ని బోధించడం అనేది పిల్లలు వంటపని చేయడంతో మొదలు కావాలి. దీన్నే కిచెన్ ఫ్రెండ్లీ అంటున్నారు. 6వ తరగతినుంచి పాఠాలు వంటకు సంబంధించిన పాఠ్యాంశాలతో, శ్రమ ప్రాధాన్యతను గుర్తింప జేసే అంశాలతో ఉండాలి. పిల్లల జెండర్‌తో నిమిత్తం లేకుండా కుటుంబంలోని పిల్ల లందరికీ తల్లి వంటపనిని, ఇంటి పనిని నిత్యం బోధిస్తూ రావాలి. ఏపీ ప్రభుత్వం అమ్మఒడి పథకంలో భాగంగా తల్లికి నగదు ఇస్తోంది. ఇది తల్లి సానుకూల విద్యను పిల్లలకు బోధించడానికి అవసరమైన సహాయాన్ని అందిస్తుంది. అయితే తల్లిదండ్రులు స్కూల్లో భేటీ అయే సమయంలో వారు తమ పిల్లలకు ఇంటిపనిలో ఉన్న శ్రమను గౌరవించడం ఒక పెద్ద సాంస్కృతిక సంపద అనే విషయాన్ని అర్థం చేయించాలని పాఠశాలలు తప్పకుండా కోరాలి. పిల్లలకు తల్లిదండ్రులు వంటపని, ఇంటిపని నేర్పిస్తున్నారా లేదా అని ఉపాధ్యాయులు నిర్ధారించాలి కూడా. నేర్చుకునే ప్రక్రియలో టీచర్లు తమలోని పురుషాధిక్య ధోరణులను వదిలిపెట్టేయాల్సి ఉంది. ఆ తర్వాత ప్రతి క్లాసులోనూ మట్టి పిసకడం, వ్యవసాయ పనులు చేయడంపై కొన్ని పాఠాలు తప్పక పొందుపర్చాలి. చైనా ఈ పనిని 4వ తరగతినుంచే మొదలుపెడుతోంది. భారతదేశంలో శ్రమను గౌరవించే బోధనను సూత్ర రీత్యా, ఆచరణ రీత్యా ప్రవేశపెట్టడంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమతమ సొంత పద్ధతులను చేపట్టవచ్చు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ బోధనకు సంబంధించి భవిష్యత్తులో అత్యంత సృజనాత్మక మదుపుదారుగా మారనుంది. రేపు తన పౌరులకు దేశం గర్వించగిన స్థాయిలో శాస్త్రీయ విద్యను కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అందించనుంది. ప్రొ‘‘ కంచ ఐలయ్య òషెపర్డ్ వ్యాసకర్త డైరెక్టర్, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ -
వడ్డీపై వడ్డీతో చిన్నవ్యాపారి నడ్డి విరుస్తారా?
ఫేస్బుక్ నిండా దేశభక్తులే ఉంటారు. పత్రికా ప్రకటనలు, ప్రసంగాలు చేసేప్పుడు ప్రభువులంతా రాముళ్లే. ఇన్ని కోట్ల మంచివాళ్లుంటే ఇన్ని ఘోరనేరాలు ఎందుకో? మంచి ప్రభువులుంటే సంక్షేమం ఎందుకు అందడం లేదో? మనం దేశ భక్తులమేనా మన రాజులు మంచి రాజులేనా? కరోనా కాలంలో అప్పులు వాయిదా వేశాం అని గంభీరంగా రాజసింహాలు సింహనాదాలు చేశాయి. టీవీలు కొన్ని డజన్ల గంటలు చర్చలు జరి పాయి. పత్రికలు ఎకరాలకొద్దీ వ్యాసాలు రాశాయి. కోవిడ్ కాలంలో రామరాజ్యం అని ఆనందభాష్పాలు రాల్చారు. చిన్నవ్యాపారుల అప్పులపై వడ్డీపై వడ్డీ వేసి వారి నడ్డి విరుస్తారా? అని సుప్రీంకోర్టు నిలదీసింది. ప్రభువులు కరోనాలో అప్పులపై వడ్డీ వసూలు వాయిదా వేశామన్నారు కదా. మొదట మూడునెలలు వాయిదా వేశారు. అంటే మార్చి 2020 వరకు వడ్డీ పైన మారటోరియం. తరువాత మరో మూడు నెలలు మొత్తం ఆర్నెల్ల పాటు మారటోరియం అన్నారు కదా. తరువాత సంగతేమిటి? ఆ వడ్డీ ఉంటుందా ఉండదా? ఈ బకాయిలను బ్యాంకులవారు తరువాత చార్జీల్లో బాదుతారా, బాదరా? వడ్డీ వదిలేస్తారా? ఈ ప్రశ్న నాది కాదు. ప్రతిపక్షాలది కాదు. లోక్‌సభ ఎంపీల సవాల్ కాదు. రాష్ట్ర ప్రభుత్వాలది కాదు. సామాన్యుడి ప్రశ్నే కానీ ఎవడు వింటాడు? సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం ద్వారా ఈ ప్రశ్న లేవనెత్తారు. భారతీయ రిజర్వ్ బాంక్, ఎట్టి పరిస్థితిలో వడ్డీ రద్దు కాదు– అని చెప్పింది. దీని అర్థం ఏమిటి, తరువాత వసూలు చేస్తారని. దీనిపైన కేంద్ర ప్రభుత్వం విధానం ఏమిటి? ఈ ప్రకటనలు చేసేముందు, పెద్ద సంస్కరణ చేసినట్టు ఆర్భాటం చేసే ముందు ఈ వడ్డీపై ఆర్నెల్ల మారటోరియం అంటే ఏమిటో వివరించాల్సిన బాధ్యత లేదా? సామాన్యుడి ప్రశ్నలకు జవాబు చెప్పరు. ఆర్టీఐ కింద అడిగినా చెప్పరు. కోవిడ్ కాలంలో కోర్టులు పూర్తిస్థాయిలో పనిచేయడం సాధ్యం కాదు. వీడియో సమావేశాల ద్వారా కేసులు వినాలంటే అన్నీ వినలేము. కేవలం అత్యంత కీలకమైన సంవిధాన, విధాన సమస్య ఉంటేనే కేసును వినడానికి ఎంచుకుంటారు. మామూలుగా మారటోరియం ప్రకటించినపుడు ఆ స్కీంలోనే పొందుపరచవలసిన సామాన్యమైన సమాచారం కోసం పిల్ వేయాలి. ఆగ్రా నివాసి గజేంద్ర శర్మ పిల్ వేశారు. లాక్డౌన్లో బతకడమే కష్టంగా ఉంది. మారటోరియం కాలంలో కూడా వడ్డీ పడుతుందనీ, అప్పుతీసుకున్నవారు చెల్లించాల్సి వస్తుందని బ్యాంకులు వాదిస్తున్నాయని, లాక్డౌన్ కారణంగా వ్యాపారం దెబ్బతిన్నపుడు అప్పుతీసుకున్నవాడు చెల్లింపులు చేయడం సాధ్యం కాదని, అపుడు బతికే హక్కు భంగపడుతుం దని, అందుకని తాను కోర్టుకు వచ్చానని ఆయన కోర్టుకు నివేదించారు. సుప్రీంకోర్టు 2020 జూన్ 13న పిల్ విచారించింది, తరువాత జూన్, జూలైలలో కూడా విచారణ సాగించింది. ఆర్బీఐ జవాబు ఏమంటే.. ‘‘ఇప్పుడు వడ్డీ రద్దు కాలేదు. వసూలు చేయవలసిందే. కోవిడ్ కాలంలో ఇది వసూళ్ల ఒత్తిడి తగ్గించడానికి వాయిదా వేయడం మాత్రమే. వడ్డీ మాఫీ చేయడం లేదు, చేస్తే బ్యాంకింగ్ రంగం స్థిరత్వం దెబ్బతింటుంది. ఈ వడ్డీవాయిదా అంటే సామాన్యమైనది కాదు రెండు లక్షల కోట్ల రూపాయల సొమ్ము. అంటే ఇది మన జీడీపీలో ఒక్కశాతం. రుణం తీసుకున్నవాళ్లు రకరకాలుగా ఉంటారు కనుక ఈ డబ్బు ఎలా వసూలు చేయాలో ఆయా అప్పులిచ్చిన బ్యాంకులకు వదిలేస్తున్నాము’’ అని ఆర్బీఐ కోర్టుకు విన్నవించింది. మారటోరియంపై మీ విధానమేమిటో తెలపండి అని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని అడిగింది. జూన్ 4న మొదటి విచారణలో ఈ చర్చ జరిగింది. కేంద్రం విధానమేమిటో చెప్పడం కోసం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అశోక్ భూషణ్, ఆర్ సుభాష్ రెడ్డి, ఎం ఆర్ షాలతో కూడిన బెంచ్ విచారణను రెండు సార్లు వాయిదావేసింది. తన విధానమేమిటో చెప్పకుండా ప్రభుత్వం వాయిదాలు అడిగింది. మేము ఆర్బీఐ, ఇతర బ్యాంకులతో మాట్లాడుతున్నాం అని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. ఆగస్టు 26 నాడు కూడా విధానం చెప్పలేకపోయింది. మారటోరియం కూడా 31 ఆగస్టున ముగుస్తుంది. అప్పు తీసుకున్నవాళ్లకు ఇంకా తెలియదు వడ్డీ కట్టాలా లేదా, వాయిదా పడితే వడ్డీమీద వడ్డీ వేస్తారా వేయరా అని. బ్యాంకుల వ్యాపారం విషయంపైనే దృష్టి కాని సామాన్యుల బతుకుల గురించి కరోనాలో వారి గతి గురించి పట్టించుకోరా? విధానం చెప్పకుండా ఎన్నాళ్లు దాటవేస్తారు. మీరు లాక్డౌన్ పెట్టడం వల్ల వచ్చిన సమస్య ఇది. రిజర్వ్ బ్యాంక్ వెనక దాక్కుం టారా, మీ వ్యాపారమే ముఖ్యం కాదు, ప్రజలకు ఊరట కలిగించడం ప్రధానం అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. ఇది తీర్పుకాదు. ఒక ప్రశ్న. మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
బడుగు జీవుల ఆశాదీపం ఆరోగ్యశ్రీ
సమాజంలోని ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన ప్రజలు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్న నేపథ్యంలోనే నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక ప్రతిష్టాత్మక పథకానికి రూపురేఖలు దిద్దారు. ఆ పథకం పేరే ఆరోగ్యశ్రీ. ఆంధ్రప్రదేశ్‌లోని లక్షలాది మంది ప్రజలకు లబ్ధి కలిగించిన పథకమిది. వైఎస్సార్ 2007లో ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకం బీపీఎల్ కుటుంబాలకు పెద్ద ఉపశమనాన్ని కలిగించింది. ప్రస్తుతం మరింత మెరుగుపరిచిన ఈ పథకంలో కోవిడ్–19 చికిత్సను కూడా భాగం చేయాలని నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రజలకు వరంలాంటిదనే చెప్పాలి. దేశంలోనే కోవిడ్–19 చికిత్సను రాష్ట్ర ఆరోగ్య సంరక్షణ పథకంలో భాగం చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆరోగ్యమే మహాభాగ్యం అని ఎవరైనా అన్నప్పుడు అది పడికట్టుపదంలాగా ధ్వనించవచ్చు కానీ ఈ మూడు పదాలకున్న ప్రాధాన్యత మానవజాతి ఉనికి పొడవునా ఎన్నడూ అంతరించిపోలేదు. ఆరోగ్య సమస్యలు ఏ కాలంలోనైనా ఎవరినైనా పీడిస్తాయి. ఆరోగ్య సమస్యలు ఏర్పడినప్పుడు కొన్నిసార్లు అవి అసాధారణ రీతిలో ఖర్చులను తీసుకొస్తాయి కూడా. తీవ్రమైన ఆరోగ్య సమస్య ఏర్పడినప్పుడు వ్యక్తులకూ, కుటుంబాలకూ ఆర్థిక భారానికి దారితీస్తుంది. ప్రత్యేకించి దారిద్య్రరేఖకు దిగువన ఉన్న (బీపీఎల్), ఆర్థికంగా బలహీనవర్గాలకు చెందినవారికి ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. వీరికి స్వల్ప స్థాయి జబ్బులకు కూడా నాణ్యమైన ఆరోగ్య సేవలు పెద్దగా ఖర్చులేకుండా అందడం అనేది పీడకలలాగే అవుతుంది. సమాజంలో ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన ప్రజలు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్న నేపథ్యంలోనే విభజన పూర్వ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, గొప్ప దార్శనికుడు, దివంగత డాక్టర్ వైఎస్ రాజ శేఖరరెడ్డి ఒక ప్రతిష్టాత్మక పథకానికి రూపురేఖలు దిద్దారు. ఆ పథకం పేరే ఆరోగ్యశ్రీ. ఆంధ్రప్రదేశ్‌లోని లక్షలాది మంది ప్రజలకు లబ్ధి కలిగించిన పథకమిది. ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలూ వైఎస్ రాజశేఖరరెడ్డి వారసత్వాన్ని కొనసాగిస్తున్నాయని, దాని ఆధారంగానే తమవైన కీలకమైన ఆరోగ్య పథకాలు అమలవుతున్నాయని నేను గర్వంగా చెప్పగలను. తిరుగులేని దార్శనికత ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఆ పథకాన్నే డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంగా రూపుదిద్ది దానిని మరిం తగా మెరుగుపర్చింది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గొప్ప దార్శనికత ప్రాధాన్యతకు ఇంతకు మించిన ఉదాహరణ ఉండదు. ఆరోగ్యశ్రీ పథకాన్ని వైఎస్సార్ 2007లో ప్రారంభించినప్పుడు, అది బీపీఎల్ కుటుంబాలకు పెద్ద ఉపశమనాన్ని కలిగించింది. రాజ కీయ ప్రత్యర్థులు ఎన్ని వివాదాలు రేపినప్పటికీ, ఆరోగ్యశ్రీ పథకం ఎంత గొప్పగా విజయవంతమై ప్రజాదరణ పొందిందంటే, విభజనానంతరం ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడి ప్రభుత్వం ఈ పథకాన్ని ఎన్టీఆర్ వైద్య సేవగా పేరు మార్చినప్పటికీ కొనసాగించాల్సి వచ్చింది. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం వార్షికాదాయం 5 లక్షల రూపాయలకంటే తక్కువ ఉన్న కుటుంబాలకు 5 లక్షల రూపాయలవరకు ఆరోగ్య సంరక్షణ బీమాను అందించింది. ఈ పథకం కింద లబ్ధిదారులు ఆరోగ్య కార్డు పొందుతారు. ఈ కార్డుతో హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోని 150 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులతో పాటు ప్రభుత్వం గుర్తించిన ఆసుపత్రులలో మెరుగైన ఆరోగ్య సేవలను వీరు పొందుతారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబంలో సంపాదనపరుడైన వ్యక్తి అనారోగ్యంలో చిక్కుకుంటే అది కుటుంబం మొత్తానికి ఆదాయ నష్టమే కాకుండా తీవ్రమైన ఆర్థిక భారం కూడా పడుతుంది. ఇక ఆరోగ్య సంరక్షణ ఖర్చులను కలిపినట్లయితే ఇది సంబంధిత కుటుం బానికి భారీ సమస్యను సృష్టిస్తుంది. అందుకే వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ఈ విషయంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఆపరేషన్ పూర్తయ్యాక రోజుకు రూ. 225లు లేక నెలకు రూ. 5,000లను పూర్తి స్వస్థత చేకూరేవరకు రోగికి ఇవ్వడం అనేది ఈ పథకంలోని మరొక కీలకమైన అంశం. ఆసుపత్రుల్లోనే కాదు.. ఆరోగ్య శిబిరాలలోనూ ఈ పథకం కింద ప్రయోజనాలు పొందవచ్చు. ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్ యూనిట్లు రెండింటిలోనూ లబ్ధిదారులు నగదు రహిత సేవలను పొందవచ్చు. ఇప్పటికే ఉన్న వ్యాధులకు మాత్రమే కాకుండా, వాటికయ్యే చికిత్సకు కూడా ఈ పథకం హామీనిస్తుంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన కుటుంబాలకు ఇది పెద్ద ఉపశమనం అవుతుంది. ఇక ఆరోగ్య బీమాకు అందిస్తున్న మొత్తానికి సంబంధించి చూస్తే దాదాపు 13 లక్షల వరకు బీమా సౌకర్యాన్ని ఆరోగ్యశ్రీ కల్పిస్తోంది. ఇది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ యోజనలో అందిస్తున్న మొత్తం (రూ. 5 లక్షలు) కంటే చాలా చాలా ఎక్కువ. కుటుంబం మొత్తానికి ఆరోగ్య బీమా రక్షణ కుటుంబం మొత్తానికి ఆరోగ్య బీమా రక్షణ కల్పించడంతో కుటుంబం మొత్తంగా తమకు కేటాయించిన బీమా మొత్తం నుంచి ప్రయోజనం పొందుతుంది. ఈ పథకం ద్వారా లభించే ప్రయోజనాలను ఒక్క యాప్ ద్వారానే పొందవచ్చు. బీపీఎల్ పరిధిలోని వర్గంతోపాటు సమాజంలోని అన్ని వర్గాలు ఇటీవలి కాలంలో స్మార్ట్ ఫోన్ విని యోగించేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. అందుచేత, యాప్‌ను ప్రవేశపెట్టడం అనేది ఈ పథకానికి మరింత విలువను జోడించింది. పైగా ఇది సులభంగా అందుబాటులోకి వచ్చింది. ఇటీవలికాలంలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చిన విశిష్టమైన తోడ్పాటు ఏమిటంటే కోవిడ్–19 వైరస్ ప్రభావానికి గురైన రోగులను కూడా దీంట్లో భాగం చేశారు. కోవిడ్–19 ప్రాణాంతక మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా బీభత్సం సృష్టించింది. వైద్య చికిత్స లేక ఆరోగ్య అత్యవసరాల విషయంలో కరోనా వైరస్ యావత్ ప్రపంచానికే సవాళ్లు విసిరింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఇది భారీ ఎత్తుక ఆర్థిక నష్టానికి కారణమైంది. ఈ ఆర్థిక సంక్షోభం విషయంలో భారతదేశానికి కూడా ఏమాత్రం మినహాయింపు లేదు. నెలలపాటు నిరవధిక లాక్డౌన్ లేక పాక్షిక లాక్డౌన్ విధించడం వల్ల వాణిజ్య కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ఆర్థిక మందగమనం తీవ్రస్థాయికి చేరుకుని అన్ని రంగాల ప్రజానీకంపై తీవ్రమైన ఒత్తిడి కలిగించింది. కాగా ఈ ఒత్తిడి ఆర్థికంగా బలహీన వర్గాలపై గరిష్ట ప్రభావం కలిగించింది. ప్రత్యేకించి రోజుకూలీలపై, కాంట్రాక్టు కార్మికులపై దీని ప్రభావం చెప్పనలవి కాదు. ఇలాంటి ఆర్థిక పరిస్థితుల్లో పొరపాటున వైరస్ ప్రభావానికి గురైతే ఈ వర్గానికి చెందిన వారి జీవితాలు మరింత ధ్వంసం కాక తప్పదు. వెనుకబడిన వర్గాల ప్రజలకు వరం ఏదేమైనప్పటికీ, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలో కోవిడ్–19 చికిత్సను కూడా భాగం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆర్ధికంగా వెనుకబడిన వర్గాల ప్రజలకు వరంలాంటిదనే చెప్పాలి. దేశంలోనే కోవిడ్–19 చికిత్సను రాష్ట్ర ఆరోగ్య సంరక్షణ పథకంలో భాగం చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. కోవిడ్–19 పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిన ప్రజలు, వారితో కాంటాక్టులోకి వచ్చినట్లు అనుమానిస్తున్నవారికి కూడా ఈ పథకంలో భాగంగా ఆర్థిక సహాయాన్ని ఏపీలోనే అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని 1.42 కోట్లమంది ప్రజలు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పధకంలో లబ్ధిదారులుగా ఉన్నారు. పదేళ్లకుపైగా ఆంధ్రప్రదేశ్‌లోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రజలకు ఆరోగ్య సంరక్షణను అందించడంలో ఆరోగ్యశ్రీ నిరుపమాన సేవలు అందించింది. దురదృష్టవశాత్తూ చంద్రబాబు నాయుడి పాలనలో ఈ పథకం పేరు మార్చేయడమే కాకుండా దీంట్లో భాగంగా గతంలో అందించిన అనేక ప్రయోజనాలను కూడా తీసివేశారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ పథకాన్ని మొదట ప్రారంభించగా ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన తండ్రి వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకుపోతున్నారు. దేశంలోని పలు ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలు కూడా ఆరోగ్యశ్రీ నమూనాను తమ తమ ప్రాంతాల్లో అమలు చేయడంపై ఆసక్తి చూపాయి. ప్రారంభించినప్పటి నుంచి అద్భుత విజయం సాధించిన ఆరోగ్య శ్రీ పథకాన్ని విదేశాలు సైతం అధ్యయనం చేస్తూ వచ్చాయి. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం విశిష్టతకు ఇవి తిరుగులేని ఉదాహరణలు. రాబోయే రోజుల్లో సైతం సమాజంలోని ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన ప్రజల వ్యథలను తీర్చడంలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ తనదైన గొప్పపాత్రను పోషిస్తుందని, దాని సేవలు మరింతగా విస్తరి స్తాయని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. విజయసాయిరెడ్డి వ్యాసకర్త వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత జాతీయ ప్రధాన కార్యదర్శి ఈమెయిల్ : venumbaka.vr@sansad.nic.in -
తెలుగుదేశం ‘రివర్స్’ రాజకీయం
ఒకప్పుడు ప్రభుత్వంలో జరిగే అవకతవకలపై, అన్యాయాలపై ప్రతిపక్షాలు ఉద్యమాలు చేసేవి. ఆందోళనలు జరిపేవి. కొన్నిటిలో సఫలం అయ్యేవి. కొన్నిటిలో విఫలం అయ్యేవి. అది ప్రతిపక్షం బాధ్యత. సమాజానికి ఏది మంచి అయితే అది చెప్పడం, దాని గురించి ప్రచారం చేయడం రాజకీయ పార్టీల బాధ్యత. కాని దురదృష్టవశాత్తు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో రివర్స్ ట్రెండ్ నడుస్తోంది. ప్రభుత్వంలో ఏదైనా మంచి జరిగితే దానిపై బురదచల్లడం , లేదా ఏదైనా అవినీతి కేసులో ఎవరిపైన అయినా చర్య తీసుకుంటే ఎదురుదాడి చేసి, చివరికి అవినీతిపరులను సమర్థించే దశకు ప్రతిపక్ష తెలుగుదేశం వెళ్లడం ఒక చారిత్రక విషాదం. గతంలో ఏ పార్టీలో వారు తప్పు చేసినా, అందులో వాస్తవం ఉందా, లేదా అన్నది గమనించి సంబంధిత పార్టీవారు చర్య తీసుకోవడం జరిగేది. కానీ ఇప్పుడు చర్య తీసుకోవడం సంగతి దేవుడెరుగు, ప్రభుత్వంపై ఉన్నవి, లేనివి కలిపి ఏవో ఆరోపణలు చేయడం జరుగుతోంది. ఏపీలో వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇదే తంతు. దానికి శ్రీకారం చుట్టింది అక్రమ కట్టడం కూల్చినప్పటి నుంచే కావడం మరో ట్రాజెడీ. కృష్ణానది కరకట్ట మీద అక్రమ నిర్మాణాలు చేయకూడదన్నది పర్యావరణ నిబంధన. కానీ చిత్రంగా ఆనాటి ముఖ్యమంత్రి ఈనాటి ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్న ఐదేళ్లపాటు అక్రమ కట్టడంలో ఉండడమే కాకుండా, ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా కొనసాగు తున్నారు. పైగా దానిని నిస్సిగ్గుగా సమర్థించుకుంటున్నారు. ఆ పక్కనే ప్రధానంగా తన పార్టీ అవసరాలకోసం ప్రజావేదిక పేరుతో ప్రభుత్వ ఖర్చుతో నిర్మించిన అక్రమ కట్టడాన్ని ఈ ప్రభుత్వం తొలగిస్తే దానిని విధ్వంసం అంటూ తప్పుడు ప్రచారం సాగించడం చంద్రబాబుకే చెల్లింది. కేరళలో కొచ్చి వద్ద ఒక నది పక్కనే ఉన్న భారీ అపార్టుమెంట్ల సముదాయాన్ని సుప్రీకోర్టు కూల్చాల్సిందేనని ఆదేశించి ఆ పని అయ్యేదాకా ఊరుకోలేదు. అక్కడ వాటిలో ఉన్నది మధ్యతరగతి ప్రజలు. వారు దానివల్ల ఎంతో నష్టపోయారు. కానీ ఏపీలో కృష్ణానది పక్కన అక్రమంగా నిర్మించిన ఇళ్లజోలికి ఎవరూ వెళ్లలేకపోతున్నారు. అందుకే చట్టాలు కొందరికి చుట్టాలు అన్న నానుడి వచ్చింది. చంద్రబాబు ఎంత సమర్థుడు కాకపోతే తనకు సంబంధించిన కేసులు ఏళ్ల తరబడి విచారణకు రాకుండా చేసుకోగలుగుతున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. చివరికి సుప్రీంకోర్టులో సైతం తన కేసులు రాకుండా చేసుకోగలుగుతున్నారని చాలా మంది అంటుంటారు. అది వేరే విషయం. విశాఖపట్నంలో ఒక డాక్టర్ మద్యం తాగి నడి రోడ్డు మీద చిందులు వేస్తే, అదేమిటయ్యా.. నువ్వు చదువుకున్నవాడివి కదా అని బుద్ధి చెప్పవలసిన చంద్రబాబు కానీ, మరికొందరు ఆ పార్టీ నేతలు కాని ఆ డాక్టర్‌ను వెనకేసుకు వచ్చి సమాజానికి తప్పుడు సంకేతం పంపించారు. దీనినే రివర్స్ ట్రెండ్ అని అనాలి. ఈ సందర్భంలో బీజేపీ వారు మాత్రం పద్ధతిగా చేశారని ఒప్పుకోవాలి. వారి పార్టీ నాయకుడు ఒకరు అక్రమంగా ఆరు లక్షల రూపాయల మద్యం తరలిస్తూ పోలీసులకు పట్టుబడితే వెంటనే అతనిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అదే అతను టీడీపీ వాడు అయి ఉంటే, కక్ష కట్టి పోలీసులు పట్టుకున్నారని టీడీపీ వారు ప్రచారం చేసేవారేమో! ఇక్కడే ఇంకో ఉదాహరణ చెప్పాలి. విశాఖలో చిందులేసిన డాక్టర్ దళితుడని, ఆయనపై చర్య తీసుకుంటారా అని ప్రశ్నించిన టీడీపీ నేతలు, అనంతపురం జిల్లా తాడిపత్రి వద్ద టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి ఒక దళిత పోలీస్ ఇన్స్పెక్టర్పై దురుసుగా వ్యవహరిస్తే మాత్రం భిన్నంగా వ్యవహరించి, ప్రభాకరరెడ్డిని కక్షపూరితంగా అరెస్టు చేశారని ఆరోపించారు. మరి ఇక్కడ దళిత పోలీసు అధికారిపై దౌర్జన్యం చేయడం కరెక్టని చంద్రబాబు భావిస్తున్నారా? ఇదే రివర్స్ ట్రెండ్ అంటే. వైఎస్ జగన్ ప్రభుత్వం టెండర్లలో రివర్స్ విధానం తెచ్చి సుమారు మూడు వేల కోట్లు ఆదా చేస్తే దానిని ప్రశంసించకపోగా రివర్స్ పాలన అని చంద్రబాబు విమర్శించారు. వేల కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేస్తే రివర్స్ పాలన అని అనడం ద్వారా తెలుగుదేశం పార్టీ రివర్స్ గేర్‌లో ప్రజలకు దూరం అవుతోందని అర్థం చేసుకోవచ్చు. విశాఖపట్నం ఎల్జీపాలిమర్స్‌లో జరిగిన స్టెరైన్ గ్యాస్ ప్రమాదంలో పదిమంది మరణించినప్పుడు చంద్రబాబు, టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో స్పందించారు. తక్షణమే దక్షిణ కొరియాకు చెందిన కంపెనీ యాజమాన్యాన్ని అరెస్టు చేయకుండా ముఖ్యమంత్రి జగన్ వారితో ఎయిర్‌పోర్టులో మాట్లాడతారా అని రంకెలు వేశారు. ప్రజా ప్రయోజనాల రీత్యా, జరిగిన ఘటన తీవ్రత రీత్యా చంద్రబాబు అంతగా స్పందించారేమోలే అని ఆయన అభిమానులు కొందరు అనుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ అధికారిక కమిటీలు వేసి వారి విచారణ నివేదికలు వచ్చాక, వారు, వీరు అని చూడకుండా పాలిమర్స్ యాజమాన్యాన్ని అరెస్టు చేసిన తర్వాత టీడీపీ కానీ, మిగిలిన రాజకీయ పక్షాలు కానీ కనీసం హర్షం ప్రకటించినట్లు కనిపించలేదు. అది వేరే విషయం. విజయవాడలో స్వర్ణప్యాలెస్ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో పదిమంది మరణించిన ఘటన జరిగింది. దురదృష్టం. ఎవరూ ఇలాంటివి జరగాలని కోరుకోరు. ఇక్కడ కూడా ప్రభుత్వం విశాఖలో మాదిరి అధికారిక కమిటీని నియమించి ఆ తర్వాత చర్యలు తీసుకోవడం ఆరంభిస్తే, చిత్రంగా ఆ హోటల్‌ను లీజుకు తీసుకుని కరోనా కేంద్రంగా నడుపుతున్న రమేష్ ఆస్పత్రి యజమాని డాక్టర్ రమేష్ బాబును మాత్రం అరెస్టు చేయడానికి వీలులేదని చంద్రబాబు కానీ, ఆయన పార్టీ నేతలు కానీ ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రకటనలు చేస్తున్నారు. ఇది దారుణమైన విషయం. విశాఖలో అంత హడావుడి చేసిన చంద్రబాబు విజయవాడ ఘటనలో కనీసం పరామర్శకు కూడా ప్రయత్నించలేదు. పైగా తన పార్టీ నేతలతో దీనికి కుల ముద్రవేసి రమేష్ కమ్మ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కనుక ఆయనపై ప్రభుత్వం కక్షతో అరెస్టుకు ప్రయత్నిస్తోందని ఆరోపణలు చేయించారు. ఇంతకన్నా నీచం ఉంటుందా? ఒక రాజకీయ పార్టీ ఇలా నిందితులను వెనకేసుకు వచ్చి ఎలాంటి సందేశాన్ని ప్రజలకు ఇస్తోంది. దీనినే రివర్స్ ట్రెండ్ అంటారు. రమేష్‌కు ఈ ఘటనతో సంబంధం లేదనే అనుకుందాం. ఆయన పోలీసుల విచారణకు హాజరై తన అభిప్రాయాలు చెప్పి ఉండవచ్చు కదా.. ఎందుకు పరారీలో ఉన్నారు? చివరికి ఆయనను పట్టుకుంటే లక్ష రూపాయల పరిహారం ఇస్తామని పోలీసులు ప్రకటించే పరిస్థితి వచ్చిందంటే ఏమనుకోవాలి? అలాంటి వారికి టీడీపీ మద్దతు ఇస్తుందా? మరి చనిపోయిన పది మంది కుటుంబాల సంగతి టీడీపీకి పట్టదా? అదే రమేష్ కాకుండా మరొకరు ఎవరికైనా ఈ ఘటనలో బాధ్యత అయి ఉంటే కూడా టీడీపీ వారు ఇలాగే వ్యవహరించేవారా? అన్న చర్చకు ఆస్కారం ఇస్తున్నారు. అందుకే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ కమ్మ సామాజికవర్గాన్ని చంద్రబాబు భ్రష్టు పట్టిస్తున్నారని, చంద్రబాబు వల్ల ఆ వర్గం నష్టపోతోందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు తన మద్దతుదారు అయిన రమేష్ బాబుకు సాయం చేయడమేమో కానీ, మిగిలినవర్గాలకు కమ్మ సామాజికవర్గంవారిపై వ్యతిరేకత పెరిగేలా చేస్తున్నారు. అమరావతి రాజధాని రైతుల పేరుతో అదే డ్రామా కొనసాగిస్తున్నారు. అమరావతిని అడ్డం పెట్టుకుని మళ్లీ ఎన్నికలలో గెలవవచ్చని చంద్రబాబు అనుకున్నారు. కానీ అదే ఆయన పాలిట శాపం అయింది. అక్కడ తన సామాజికవర్గం వారికోసమో, తన పార్టీవారికోసమో, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమో మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారన్న అభిప్రాయం ఏపీ వ్యాప్తంగా ప్రబలేలా వ్యవహరిస్తున్నారు. రైతుల పేరుతో దీక్షలు చేస్తున్నవారిలో అత్యధికంగా ఒకేవర్గం వారు ఉన్నా, దానిని చంద్రబాబు వెనకేసుకు రావల్సి రావడం పార్టీకి ఎంత నష్టమో ఆయనకు అర్థం కావడం లేదు. అర్థం అయినా అదే ముఖ్యమని అనుకుంటుండాలి. అంతేకాదు. 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రక్రియలో ఎక్కడైనా లోపాలు ఉంటే చెప్పడం తప్పుకాదు. కానీ అసలు ఆ కార్యక్రమమే జరగరాదన్నట్లుగా కోర్టులకు వెళ్లి అడ్డుపడుతున్నతీరు కూడా ప్రతిపక్షం రివర్స్ ట్రెండ్‌లో ఉందనడానికి పెద్ద ఉదాహరణ అవుతుంది. అచ్చెన్నాయుడు స్కామ్‌లో కానీ, హత్య కేసులో కొల్లు రవీంద్ర విషయంలో కాని వారితో వ్యక్తిగతంగా మాట్లాడడం వేరు. కానీ ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తూ ఫలానా కులం కనుక అవినీతి ఆరోపణలు చేశారని ఎదురుదాడి చేయడం వేరు. ప్రస్తుతం టీడీపీ ఇలా అన్ని విషయాలలో రివర్స్ ట్రెండ్‌లో ఉంది. గతంలో వైఎస్సార్సీపీ కూడా కొన్ని అంశాలలో తమ వ్యతిరేకతను వ్యక్తంచేసి ఉండవచ్చు. రాజధాని భూముల విషయంలో ఆరోపణలు చేసి ఉండవచ్చు. కానీ ప్రతి అంశంలోను వ్యతిరేకించాలని, ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేసిన సందర్భాలు బాగా తక్కువే అని చెప్పాలి. జగన్ తన మ్యానిఫెస్టో పాజిటివ్ పాయింట్లపైనే ఎక్కువగా ఆధారపడి ప్రజలలో తిరిగారు. కానీ ఇప్పుడు చంద్రబాబు ఇంత అనుభవం పెట్టుకుని ప్రజాభిమతానికి విరుద్ధంగా, ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా, ఒకటికాదు పలు విషయాలలో రివర్స్ ట్రెండ్‌లో రాజ కీయం చేస్తున్నారు. అందువల్లే చంద్రబాబు నెగటివ్ ఆలోచనలవల్ల తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు గందరగోళంలో పడిందని నిస్సందేహంగా చెప్పగలిగిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు -
సోషల్ మీడియా చట్టానికి అతీతమా?
ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా వేదికలు.. దేశీయ శాసనాలకే అతీతంగా ఉంటున్నాయా? రాజకీయ పక్షపాత వైఖరితో ఆయా దేశాల్లో పాలకపక్షంవైపు మొగ్గు చూపుతూ పాక్షికతకు ప్రాధాన్యత ఇస్తున్నాయా? దేశంలో జరిగిన కొన్ని ఘటనలు ఈ సందేహాలకు ఆస్కారమిస్తున్నాయి. కర్ణాటకలో తాజాగా జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో సోషల్ మీడియా ప్రభుత్వాలకే కాకుండా, కొన్ని కమ్యూనిటీలకు కూడా అనుకూలంగా ఉంటోందా అనేది చర్చనీయాంశమైంది. భారత చట్టాలను అతిక్రమించి సోషల్ మీడియా వేదికలు సొంత నిబంధనలను అమలు చేస్తున్నాయా అనే సందేహాలు కూడా పుట్టుకొస్తున్నాయి. దేశీయ చట్టాలకు అతీతంగా కాకుండా, ఇవి ఇకనుంచైనా జవాబుదారీతనంతో, నిష్పాక్షికతతో వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైందనే చెప్పాలి. అమెరికా ఎన్నికలు తీవ్రమైన చర్చలకు, వివాదాలకు, పెడబొబ్బలకు, దూకుడుతనానికి సాక్షీభూతంగా నిలుస్తున్నాయి. మీడియా పూర్తిగా పక్షపాత వైఖ రిని చేపట్టడమే దీనికి కారణం. అలాంటి మీడియా రిపోర్టులలో ఒకటి ప్రస్తుతం ట్రంప్ వర్సెస్ బైడెన్ ప్రచార యుద్ధ పర్వంలోకి భారతదేశాన్ని, భారతీయులను కూడా లాగాలని ప్రయత్నించింది. మొదటిది. ట్విట్టర్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లతోపాటు కొత్తగా రూపొందుతున్న రద్దు సంస్కృతి (క్యాన్సిల్ కల్చర్) ప్రతిపాదకులు అతి సులభంగా బలం పుంజుకుంటున్నారన్నది వాస్తవం. విషయాన్ని పర్యవేక్షించడంలో సోషల్ మీడియా వేదికలకు తమవైన నియమనిబంధనలు ఉండవచ్చు. అది వారి హక్కు కూడా కావచ్చు. అయితే వీరి హక్కు, వీరి నియమనిబంధనలు ప్రత్యేకించి ప్రజాస్వామిక వ్యవస్థలు ఉన్న సార్వభౌమాధికార దేశాలు రూపొందించుకున్న శాసనాలనే అధిగమించేలా ఉండకూడదు. ఉదాహరణకు, భారత్‌లో ప్రస్తుతం అమలులో ఉన్న శాసనవ్యవస్థ రాజ్యాంగపరమైన, న్యాయ స్మృతులపై ఆధారపడింది. తన భూభాగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సోషల్ మీడియా కంపెనీల నియమ నిబంధనలన్నింటినీ ఇది తోసిపుచ్చుతుంది. తమ వ్యాపార కార్యకలాపాలను ఇక్కడ నిర్వహించాలంటే ఈ వేదికలన్నీ భారతీయ చట్టానికి అనుగుణంగా వ్యవహరించడమే కాకుండా విషయ పర్యవేక్షణ, నిర్వహణ విషయంలో కూడా భారత చట్టాలకు లోబడి ఉండాలి. వాల్ స్ట్రీట్ జర్నల్ ఇటీవల ప్రచురించిన ఒక కథనం. ఫేస్బుక్ లోని కొందరు ఉద్యోగులు రాజకీయ పక్షపాత బుద్దితో బీజేపీకి అసాధారణ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించింది. నిర్దిష్టంగా తాము ఎంపిక చేసుకున్న అభిప్రాయాలను మాత్రమే తమ వేదికపై ప్రాధాన్యత ఇస్తూపోవడాన్నే కేన్సిల్ కల్చర్ అంటున్నారు. అంటే తమ వేదికలో దేన్ని అనుమతించాలి. దేన్ని అనుమతించకూడదు అనే విషయంలో ప్లాట్‌ఫామ్ స్వయం ప్రకటిత పరిపూర్ణ హక్కును కలిగి ఉంటుంది. తమకు అవసరం లేని అంశాలను వెలుగులోకి తీసుకురాకుండా తోసిపుచ్చుతుంది లేదా రద్దు చేస్తుందన్నమాట. రాబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో్ల అక్కడి ప్రభుత్వానికి అనుకూలంగా లేక వ్యతిరేకంగా సోషల్ మీడియా వేదికలు పరస్పరం తలపడటానికి పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత్‌లోనూ ఫేస్ బుక్ రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తోందన్న ఆరోపణ తీవ్రస్థాయిలో చర్చలు రేపింది. అయితే ఇది భారత్‌తో ఫేస్బుక్ ఇతర వేదికలను ఉపయోగిస్తున్న భారతీయులతో ముడిపడి ఉన్నందున భారతీయ నేపథ్యంలోనే ఈ అంశంపై చర్చిద్దాం. అదే సమయంలో సోషల్ మీడియా జవాబుదారీతనం, సమ్మతిపై చుట్టుముడుతున్న మూడు కీలక ప్రశ్నలపై దృష్టి పెడదాం. మొదటిది, ఆన్లైన్లో భావవ్యక్తీకరణ స్వేచ్ఛ గురించి భారత్‌లో ఉన్న ఏకాభిప్రాయం ఏమిటి? అది ఖచ్చితంగా ఫేస్బుక్, ట్విట్టర్ కోరుకుంటున్న ఏకాభిప్రాయానికి అనుగుణంగా ఉండదు. భారత రాజ్యాంగం తన పౌరులందరికీ ప్రాథమిక హక్కులను కల్పించింది. బాహ్య సంస్థ కాకుండా ప్రభుత్వం లేదా రాజ్య వ్యవస్థ మాత్రమే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈ ప్రాథమిక హక్కులకు భంగం కలిగించవచ్చు. భారత సౌర్వభౌమాధికారం, ప్రభుత్వ భద్రత, విదేశాలతో స్నేహపూర్వక సంబంధాలు, సామాజిక శాంతి, న్యాయస్థానాల ఉల్లంఘన, పరువునష్టం, హింసకు పురికొల్పడం వంటి సందర్భాల్లో మాత్రమే వాక్ స్వేచ్ఛపై హేతుబద్ధమైన ఆంక్షలు ఉంటాయని ఆర్టికల్ 19(2) నిర్వచిస్తోంది. ఈ ఆంక్షలను వాటి అన్వయంపై ఆధారపడి తొలగించడంలో లేక విధించే విషయంలో భారత న్యాయవ్యవస్థ జోక్యం చేసుకుంటుంది. మరో మాటలో చెప్పాలంటే ఆర్టికల్ 19(2)కు మార్గదర్సకత్వం వహించే నిర్దిష్ట నిర్వచనాలు ఏవీ లేవనే. భారత న్యాయ స్మృతిని ఉల్లంఘించకుంటే తప్ప, అన్ని రకాల ప్రసంగాలు చేయడంలో ఇక్కడ స్వేచ్ఛ ఉంటుంది. దృక్పథాలు, శాసన పరిధులూ కాలాన్ని బట్టి మారుతుంటాయి. ఉదాహరణకు, డీహెచ్ లారెన్స్ రచన లేడీ చాటర్లీస్ లవర్ నవలను ఒకప్పుడు న్యాయస్థానాలు అశ్లీలంగా భావించాయి. కానీ ఇదే నవలను ఇప్పుడు యూనివర్సిటీ పాఠ్యపుస్తకాల్లో భాగం చేశాయి. భారత రిపబ్లిక్ తొలి సంవత్సరాల్లో తప్పితే, ఇతర దేశాలతో సంబంధాలను దెబ్బతీసే ప్రసంగాలపై మన దేశంలో ఎన్నడూ ఆంక్షలు విధించలేదు. సుప్రీంకోర్టు హిందుత్వపై ఇచ్చిన తీర్పు రాజకీయ ప్రసంగాలను మరింత విస్తరించింది. విద్వేష ప్రసంగం అంటే వివిధ సామాజిక బృందాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించే ప్రసంగం అనీ, హింసాత్మక ప్రసంగం అంటే ప్రజల మధ్య తక్షణం హింసను పురికొల్పేలా చేసే ప్రసంగం అని సుప్రీంకోర్టు నిర్వచించింది. ఈ రెండు రకాల హింసలతో వ్యవహరించడంలో వేర్వేరు చట్టాలను కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు వాక్ స్వేచ్చకు సంబంధించిన కొన్ని తాజా ఉదాహరణలపై సోషల్ మీడియా స్పందనలు, దాని పర్యవసనాలను కూడా చూశాం. గతవారం కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాస మూర్తి బంధువు పి. నవీన్ ఒక పోస్టకు ప్రతిగా స్పందించి పెట్టిన మరో పోస్టు బీభత్సం సృష్టించింది. దాన్ని ఇస్లాం వ్యతిరేకంగా భావించిన గుంపు ఒక్కసారిగా గుమికూడి ఆ శాసనసభ్యుడి ఇంటిని, మరో రెండు పోలీసు స్టేషన్లను ధ్వంసం చేసింది. పోలీసు కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఫేస్బుక్ తన కంటెంటును పర్యవేక్షించడంలో పక్షపాతాన్ని ప్రదర్శించిందని వాదిస్తున్నారు. అంతా ముగిసిపోయిన తర్వాత తీరిగ్గా ఇప్పుడు నవీన్ రెచ్చగొట్టే స్పందనను తొలగించింది. ఇక్కడ కూడా ఫేస్ బుక్ వంచనతోనే వ్యవహరించింది. నవీన్ పోస్టుకు కారణమైన తొలి పోస్టును మాత్రం అలాగే ఉంచేసింది. అంటే భారత్‌లో కూడా ఫేస్ బుక్ ఒక ప్రత్యేక కమ్యూనిటీపట్ల పక్షపాత దృష్టితో ఉంటోందని భావించవచ్చా? ఇక్కడే జవాబుదారీతనం సమస్య ఎదురవుతుంది. అలాగే గతవారం జేఎన్‌యూ ప్రొఫెసర్, సుపరిచితుడైన ఆనంద్ రంగనాథన్ ఖురాన్ నుంచి ఒక సూక్తిని పోస్ట్ చేయగా దాన్ని ట్విట్టర్ తొలగించేసింది. కారణం. అల్లాను, ఆయన దూతను దూషించిన వారిని శిక్షించాలని ఆ సూక్తిలో ఉంది. బెంగళూరు అలజడుల నేపథ్యంలో ఈ చర్య తీసుకుంది. జాతి, మతం, లింగపరంగా, జెండర్ గుర్తింపుపరంగా, వయస్సుపరంగా, వైకల్యంపరంగా లేదా తీవ్ర వ్యాధుల పరంగా ఇతర ప్రజలను బెదిరిస్తూ, వేధిస్తూ హింసకు పాల్ప డకూడదు, రెచ్చగొట్టకూడదు అనే తమ ప్లాట్ ఫామ్ నియమాలను ఉల్లంఘించినందునే ఆయన ట్వీట్‌ను తొలగించామని ట్విట్టర్ పేర్కొంది. భారత మీడియాలో రాతపరంగా గానీ, మాట పూర్వకంగా గానీ స్వేచ్ఛగా చేసే వ్యక్తీకరణల పట్ల న్యాయపరమైన నిబంధన అంటూ ఏదీ లేనందున ఆ ప్రాతిపదికన ట్విట్టర్ ఎలా చర్య తీసుకుంటుందనేది ప్రశ్న. ఈ విషయంలో భారత చట్టాలను ట్విట్టర్ అతిక్రమించినట్లే లెక్క. ఇక రెండో ప్రశ్న ఏమిటంటే, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు వర్తించే చట్టం ఏమిటన్నదే. మాతృసంస్థ భారత చట్టాలపై ఆధారపడి ఉందా, లేక మాతృసంస్థ లేక ఇతరప్రాంతాల్లో పనిచేస్తున్న కంపెనీ రూపొందించుకున్న సొంత శాసనంపై ఆధారపడి వ్యవహరిస్తుందా అన్నది కీలకమవుతుంది. భారత శాసనాలను పక్కన బెట్టి ఫేస్ బుక్ వ్యవహరిస్తోందా లేక ప్రపంచవ్యాప్తంగా తాను రూపొందించుకున్న సొంత శాసనం ఆధారంగా వ్యవహారాలు నడుపుతోందా అనేది ముందుగా తేల్చాలి. ఈ అస్పష్టత పునాదిపైనే సోషల్ మీడియా వేదికలు పనిచేస్తున్నాయి. దీనివల్లే ఈ వేదికలు రాజకీయ నాయకులకు లోబడిపోతూ వారి క్రీడల్లో భాగమైపోతూ వస్తున్నాయి. ఇక మూడవ ప్రశ్న.. విద్వేష ప్రసంగం వైపు మొగ్గు చూపినప్పుడు వ్యక్తి, సంస్థ లేదా ప్రభుత్వంపై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు. విద్వేష ప్రసంగానికి పాల్పడిన వ్యక్తిపైనా లేదా అతడు/ఆమె పనిచేస్తున్న సంస్థపైనా ఎవరిపై చర్య తీసుకోవాలి. ఈ విషయంలో ఎవరిని సంప్రదించాలో స్పష్టత లేదు. ఇలాంటి ఘటనల పరిష్కారానికి ఒక నిర్దిష్ట చట్రం లేనంతవరకు భారతీయ సోషల్ మీడియా వినియోగదారులు కంటెంట్ ప్లాట్‌ఫామ్‌ల ఆంక్షలకు గురువుతూనే ఉంటారు. ఇది ఒక్కోసారి దేశ శాసనాలకు వ్యతిరేకంగా కూడా వెళుతుంది. ఉదాహరణకు ప్రతిపక్ష నేత ఖాతాను ట్విట్టర్ నిషేధిస్తే దానిపై సెన్సార్షిప్ విధించాలని గగ్గోలు మొదలవుతుంది. మరోవైపు, ఒక పాలకపక్ష నేత ఖాతాను నిషేధించినట్లయితే తీవ్ర ఒత్తిడితో చేసిన చర్యగా భావించవచ్చు. సమీర్ శరణ్ వ్యాసకర్త ప్రెసిడెంట్, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ -
మీరు బౌన్సర్ల వైపా లేక రోగుల వైపా?
గతవారం సాక్షి సంపాదక పేజీలో ప్రచురితమైన ‘కొత్త బందిపోట్లు–వైద్యవ్యాపారులు, వారి బౌన్సర్లు’ అనే నా వ్యాసం కొందరు డాక్టర్లకు కోపం తెప్పించింది. వాట్సాప్‌లో తిట్లను నాకు ఫార్వర్డ్ చేస్తున్నారు. అసభ్య, అసత్యప్రచారం చేయిస్తున్నారు. సాక్షిలో నా కాలమ్ ఆపేయిస్తామని బెదిరించేవారు కొందరైతే సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయమని ఆదేశాలిచ్చేవారు ఇంకొందరు. కానీ ఎవరూ నా వ్యాసం కాపీ పెట్టడం లేదు, దాంట్లో ఫలానా మాట తప్పు అని చెప్పలేకపోతున్నారు. వ్యాసం చదివిన తరువాత ‘నిజమే డాక్టర్లపై ఒక్క నింద కూడా లేద’ని తెలుసుకుని చెప్పిన డాక్టర్లు చాలామంది ఉన్నారు. అన్ని ప్రయివేటు హాస్పిటళ్లూ చెడ్డవి కాకపోవచ్చు. కానీ అవినీతి వ్యాపారం చేసే కొన్ని చెడ్డ కార్పొరేట్ల క్రూరత్వం కనబ డటం లేదా? వారిక్రౌర్యానికి బలైన బాధిత రోగులు వందలాది మంది సాక్షిలో నా వ్యాసం ముమ్మాటికి నిజం అన్నారు. దుర్మార్గాన్ని నిలదీసే బదులు నిలదీసిన సాక్షిని, రచయితను నిందించే ముందు డాక్టర్లు, వారి సంఘం ఆలోచించుకోవాలి– మీరు రోగుల వైపా.. బౌన్సర్ల వైపా? డాక్టర్లను నిజాం కాలపు జీతగాళ్లుగా మారుస్తున్నారు కొన్ని కార్పొరేట్ వైద్య పెత్తందార్లు. వ్యాపారుల చేతుల్లో బలయ్యేవారు కొందరు, బానిసలయ్యేవారు కొందరు. అప్పులు చేసి చదువుకున్న డాక్టర్లు, వడ్డీకట్టడానికి జీతాలకోసం వారిచేతుల్లో పావులైపోతున్నారు. ఒకవైపు వృత్తిధర్మానికి కట్టుబడి కొందరు డాక్టర్లు ప్రాణాలు పోస్తుంటే బౌన్సర్లతో విపరీత బిల్లులతో రోగులను దోచుకునే కార్పొరేట్ హాస్పిటల్స్‌కు అండగా నిలబడేవారు మరికొందరు. ఈ విషయాలు వైద్యసంఘాలకు తెలియవా? తమ అనారోగ్యాన్ని లెక్కచేయకుండా వందలాది కరోనా రోగులకు చికిత్స చేసి తమ కుటుంబాల్ని ప్రాణాపాయంలో పడేసే డాక్టర్లూ ఉన్నారు, ప్రభుత్వ ఆస్పత్రులలో హక్కుల ఉల్లం ఘనలు, మరొకవైపు ప్రయివేటు వైద్యదుకాణాల్లో రోగులపై బౌన్సర్లు. వైద్యవ్యాపారంలో వస్తున్న దారుణ ధోరణులను ఎత్తిచూపడం అందరి బాధ్యత. రోగులు ఈ వ్యాపారుల చేతుల్లో నానాకష్టాలూ పడుతుంటే.. వైద్యవృత్తిలో ఉన్నవారు, వారిసంఘాలు ఈ దుర్మార్గపు వైద్య వ్యాపారాన్ని ఖండించకుండా భరించడం న్యాయమా? రోగుల బంధువులు గొడవలకు దిగకుండా ఆపడానికే కండలు పెంచిన యువకులను బౌన్సర్ల పేరుతో హైదరాబాద్‌లోని కొన్ని ప్రయివేటు ఆస్పత్రులు నియమించుకున్నామని, చెప్పుకుంటున్న వార్తలను చదవలేదా? రోగిని హాస్పిటల్లో చేర్చేప్పుడు తప్ప ఇంకెప్పుడూ రోగుల గతి, ప్రగతి తెలుసుకునే అవకాశం లేకుండా పోతున్నదనీ, బిల్లులు కట్టడానికి తప్ప వాటి విషయంలో వివరాలు అడగడానికి డైరెక్టర్ల దగ్గరికి వెళ్లనివ్వడం లేదని, పూర్తి డబ్బు చెల్లించేదాకా శవాలు కూడా ఇవ్వకుండా బౌన్సర్లు అడ్డుకుంటున్నారనే సంఘటనలు ఈ వైద్యనేతల కంటికి కనబడలేదా? రోగులను భయపెట్టే బౌన్సర్ సమస్య గురించి రాస్తే డాక్టర్లకు, సంఘంనేతకు కోపం రావడమేమిటి? దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి. బౌన్సర్ల నియామకాన్ని, రోగులపై వారి నియంత్రణను సమర్థిస్తున్నారా? చేసిన చికిత్స ఏమిటో చెప్పరు. మెడికల్ రికార్డులు ఇవ్వరు. వేసిన ధరల సమంజసత్వం ఏమిటో చెప్పరు. ఎందుకంత విపరీతమైన రేట్లు వేస్తున్నారో వివరించరు. రోగి చనిపోతే శవం ఇవ్వరు. లక్షల రూపాయల బాకీలు తీర్చేదాకా శవం వారి అధీనంలో ఉంటుందని రాస్తే వైద్యవ్యాపారులు తేలుకుట్టిన దొంగల్లా మాట్లాడడం లేదు. కానీ పురమాయించి నామీద తిట్లు, వాట్సాప్‌ల ప్రచారాలు సాగిస్తున్నారు. పంపుతున్నారు. ఎంఆర్పీ ధరలకు అమ్మకపోతే చర్యలు తీసుకుంటామని వైద్యశాఖ మంత్రి హెచ్చరించారు. దీనికి వైద్యులు బాధ్యులని అనలేదే. హాస్పిటల్స్ నడుపుతూ లాభనష్టాలు భరించే కార్పొరేట్ హాస్పిటల్ యజమానులను ఈ ప్రశ్నలు అడగాలా వద్దా? డాక్టర్లు, ఉద్యోగులు కనుక రోగుల తరఫున అడగలేరు. కానీ కరోనాతో, ఇతర రోగాలతో, తప్పుడు చికిత్సలకు నిర్లక్ష్యాలకు బలైనవారితో, రోగుల శవాలతో వ్యాపారం చేస్తున్నవారు బౌన్సర్లను పెట్టుకుని వారి భద్రతలో అన్యాయాలు చేస్తుంటే డాక్టర్ల సంఘాలు ఏం చేస్తున్నాయి? అని ఇంకా అడగలేదు. ఇప్పుడడుగుతున్నాను. ఈ సంఘాలను ఎవరూ నిలదీయవద్దా? నాకు చికిత్స చేయబోమంటూ అసభ్య పదజాలంతో దూషిస్తారా? బౌన్సర్లతో డాక్టర్లకు, సంఘాలకు సంబంధం ఉందని భావించడం లేదు, వారి నెందుకు ఖండించలేదన్నది మొదటి ప్రశ్న. వారినెందుకు సమర్థిస్తున్నారనేది రెండో ప్రశ్న. ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యవ్యాపారంలో వస్తున్న అమానవీయ ధోరణులను కూడా అరికట్టడానికి కౌన్సిల్ చర్యలు తీసుకోవాలి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, స్వచ్ఛంద సంఘం. డాక్టర్లకు, ఐఎంఏ నాయకులకు, కార్పొరేట్ వైద్య వ్యాపారులపై అదుపు ఉండకపోయినా కనీసం దారుణాలను ఆపాలి. ఖండించాలి. వైద్యవ్యాపార దుర్మార్గాలను ప్రశ్నించలేని వైద్యసంఘాలను నిలదీయాలి. మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
‘మద్యే మద్యే’ న్యాయం సమర్పయామి
కోవిడ్ 19 అంటురోగపు రోజుల్లో నిత్యావసరాలంటే తిండి, వైద్యం. మరి మందు (ఔషధం కాదండోయ్) సంగతేమిటి? ఉద్యోగం లేకపోయినా ఉపద్రవకాలంలో మద్యం అత్యవసర ద్రవమని అర్థం కాలేదా? జనం తాగకుండా 45 రోజులు బతికి ఉండగలరని నిరూపించుకుంటే ప్రభుత్వాలు 45 రోజు లకన్నా అమ్మకుండా ఉండలేమని చాటుకున్నాయి. పాఠాలు లేని పంతుళ్లకు బ్రాందీ షాపుల కాపలా డ్యూటీ. మగా, ఆడా, చిన్నా పెద్ద తేడా లేకుండా జనం బారులు తీరి ఎంతో ఓపికగా భౌతిక దూరాలలో నిలబడి ఉవ్విళ్లూరుతూ కొనడం మహోన్నత భారతీయ జనతా నాగరికత. దేశాన్ని ఆర్థికమాంద్యం నుంచి కాపాడే దేశభక్తులు ఒక్కరోజులోనే ఒక్కో చోట వందల కోట్ల రూపాయల మద్యం తాగేశారు. లాక్ డవున్ కాలంలో వేరే రోగాలు రాకపోవడానికి కారణాలు అమ్మచేతి వంట తినడం, మందు కొట్టకుండా ఉండడం అని కొందరు అమాయకులు సూత్రీకరించారు. కానీ వెంటనే మద్యప్రవాహం మొదలైంది. సరిగ్గా సాగని చదువులను వానాకాలపు చదువులు అనేవారు. ఇప్పుడు కరోనా కాలపు చదువులనాలి. విమానాలు, రైళ్లు, బస్సులు, హోటళ్లు, సినిమాలు తెరిచే రోజులు వచ్చిన తరువాత చివరకు, విద్యాలయాలు తెరవడం గురించి ఆలోచిస్తారు. ముందు తెరిచింది మద్యం సీసామూతలు. సంక్షేమ పథకాలు అమలు చేస్తే డబ్బు దక్కదు. వలస కూలీలను సొంతూర్లకు పంపడానికి రైళ్లు నడపాలనే చరిత్రాత్మకమైన నిర్ణయాన్ని కేవలం 45 రోజుల ఆలస్యంగా తీసుకున్నారు. వందలాది మైళ్లు వేలాది జతల కాళ్లు నడిచిన తరువాత, కొన్ని ప్రాణాలు పోయిన తరువాత, అది అత్యవసర సేవ అని, ప్రజల చావుబతుకులకు సంబంధించిన సమస్య అనీ తెలుసుకున్నారు. మద్యం కన్నా అత్యవసర వస్తువు న్యాయం అని గుర్తురాకపోవడం ఒక విషాదం. మద్యం బార్ తెరిచినా న్యాయం బార్ మూసే ఉంది. తాలూకా, మండలం, జిల్లా స్థాయిల్లో న్యాయ వితరణ, న్యాయ విచారణ, వివాద పరిష్కారాలు లాక్ డవునైనాయి. హైకోర్టులు, సుప్రీంకోర్టు చాలా సీరియస్ అంశాలను పరిశీలించడానికి వీడియో సమావేశాల ద్వారా న్యాయాన్యాయ విచారణ సాగిస్తున్నాయి. హైకోర్టు మనసు గెలుచుకున్నవారికీ, సుప్రీంకోర్టు కంటికి కనపడిన వారికి న్యాయం అందుబాటులో ఉంటుంది. మిగతావారికి న్యాయం అరుదైన సరుకు, అందని ద్రాక్ష. మద్యం ముందు న్యాయం చివరకు. ఎంత సామాజిక న్యాయం ఇది? లాయర్లు ఈ విషయం ఆలోచించరు. వేసవికి వచ్చే సెలవులు కరోనా పుణ్యాన రావడంతో సంతోషించేవారు కొందరైతే, రెక్కాడితే తప్ప డొక్కాడదన్న రీతిలో బెయిల్ కోసం ఎవడైనా వస్తే తప్ప రెయిల్ నడవని లాయర్‌కే చాలా కష్టం. 40 కోట్ల మంది కూలీలు వలసవచ్చిన చోట పనిలేక, మరో రాష్ట్రంలో ఉన్న సొంతూరికి పోలేక, బతక లేక చావలేక ఉంటే వారికి న్యాయం అడిగే అవకాశం లేదు. సుప్రీంకోర్టులో పిల్ వేస్తే, ధర్మాత్ములు ఆశావిశ్వాస సిద్ధాంతమనే ఒక వినూత్న విధానాన్ని కనిపెట్టారు. ఇదేమిటని అడిగాడో మిత్రుడు. హోప్ అండ్ ట్రస్ట్ ఫిలాసఫీ అని ఇంగ్లిష్ మీడియంలో చెప్పాను. వెంటనే ఆ మిత్రుడు అర్థం అయిందన్నాడు. దాని అర్థం ఏమంటే ప్రభుత్వం వారు చేస్తానన్న పని చేస్తారని ఆశించడం, చేశారని విశ్వసించడం అని సుప్రీంకోర్టు న్యాయవాది వివరించారు. వలస కార్మికులకు ప్రభుత్వం ఆహారం ఇస్తున్నామని చెప్పితే నమ్మాలి. ఉన్నచోట ఉండక నడవడమెందుకు అని న్యాయం చెప్పారు. పిల్ కొట్టేశారు. పోలీసులు తన్నినా, లాకప్‌లో వేసినా, రాజద్రోహం కేసులతో విమర్శల గొంతు నులిమినా, తప్పుడు కేసులుపెట్టినా అడుక్కోవడానికి మన ఊళ్లో న్యాయస్థానం గేట్లు తెరవరు. అక్కడ సర్వోన్నత న్యాయస్థానాధీశులు కరోనా సంక్షోభ కాలంలో పాలక, శాసన, న్యాయవ్యవస్థలు సమన్వయంతో దేశసేవ చేయాలని సెలవిచ్చారు. పాలకుల ఘోర నిర్ణయాలు తీసుకున్నా న్యాయవ్యవస్థ సమన్వయంతో సర్దుకు పోవాలని రాజ్యాంగంలో అంతర్లీనంగా వారికి కనిపించింది. కరోనా అత్యయిక పరిస్థితుల కాలంలో ప్రాథమిక హక్కుల గురించి తపన పడడం ముఖ్యం కాదనీ సర్వోన్నతులు ప్రవచించారు. పాపం జస్టిస్ హెచ్ ఆర్ ఖన్నాకు ఈ టెక్నిక్ తెలియక, ఎమర్జెన్సీలో ప్రాథమిక హక్కులు ముఖ్యమని, వాటిని సస్పెండ్ చేయడానికి వీల్లేదనీ తీర్పుచెప్పి తను ప్రధాన న్యాయమూర్తి కాకుండా పోయారు. మొదట్లో ఈ న్యాయాన్ని అన్యాయంగా భావించినా ఇప్పుడు ఖన్నాదే న్యాయమని చాలామంది ఆమోదించారు. హోప్ అండ్ ట్రస్ట్ సిద్ధాంతం ఏమిటని బుర్ర బద్దలు కొట్టుకోకుండా వీధిలో ప్రభుత్వమే బ్లాక్ రేట్లో దగ్గరుండి మద్యాన్ని అమ్మిస్తుంటే మందుకొట్టి మత్తుగా పడిపో, లేకపోతే ఇప్పటికిదే న్యాయం అనే ప్రవచనాలు మాత్రమే మననం చేసుకో. మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
కరోనా తెచ్చిన సమానత్వం
కనిపించని వైరస్ నుంచి ఎలా తప్పించుకుని ఉండాలా అన్న ప్రశ్న ఇప్పుడు ప్రపంచంలోని పేదలు, ధనికుల మనస్సులను సమానంగా కలచివేస్తూ ఉంది.ఇప్పటివరకూ అణుశక్తి, పరమాణుశక్తి, అంతరిక్షయానం అని గొప్పలు చెప్పుకున్న దేశాల ప్రకటనలు దీని ముందు ఉత్తి ప్రగల్భాలుగానే మిగిలిపోయాయి. ధనిక, పేద– అందర్ని కరోనా వైరస్ మానసికంగా అట్టడుగు స్థాయికి దించేసింది. దీనికంతటికీ తాను కారణం కాదని, మనిషి తనకు తాను చేసుకున్న తప్పిదాలే అసలు కారణమని కరోనా చాటి చెబుతోందా? మనిషికి మైక్రోస్కోపు, టెలీ స్కోపు లాంటి దృష్టితో పాటు అంతకుమించిన అంతర్దృష్టి కావాలి. అది ఉంటే దూరదృష్టి ఉంటుంది. అదే ఉంటే వైరస్ గురించి ప్రపంచ దేశాలు మొదట్లో ఇంత తేలిగ్గా తీసివేసిన పరిస్థితి సంభవించేది కాదు. కోవిడ్–19 కర్కశత్వానికి ఒక్కపెట్టున ప్రపంచం మారిపోయింది. ఇంతకు ముందు ఇలాంటి పరిస్థితి రాలేదని కాదు, వచ్చింది. సరిగ్గా వంద సంవ త్సరాల క్రితం అంటే 1918–20లలో స్పానిష్ ఫ్లూ అనే అంటు వ్యాధి నేటి కరోనా కంటే ఎంతో బీభత్సంగా అప్పటి ప్రపంచాన్ని కుదిపి వేసింది. చైనా నుండి అమెరికా వరకు ప్రజలు గజగజలాడిపోయారు. అదే సమయంలో మొదటి ప్రపంచ యుద్ధం కూడా జరిగింది. ప్రపం చవ్యాప్తంగా కోట్లలో చనిపోయారు. పేరుకు తగ్గట్టుగా స్పానిష్ ఫ్లూ స్పెయిన్ దేశంలో అవతరించలేదు. పరిశోధనల ప్రకారం అది అమె రికాలో కానీ, ఫ్రాన్స్లోగానీ మొదలై, ఆ తర్వాత దాదాపు అన్ని దేశాల్ని కబళించిందని చెబుతారు. మొదటి ప్రపంచ యుద్ధంలో స్పెయిన్ దేశం తటస్థంగా ఉండటంవల్ల, కేవలం స్పెయిన్ వార్తలే బహిర్గతమవుతూ ఉండేవి. అందుకే భయవశాత్తు ఆ రోగానికి స్పెయిన్ పేరు ఆపాదించడం జరిగింది. అదృశ్యమైన గొప్పవారి అధికారాలు నావెల్ కరోనా వైరస్ ముట్టడికి నేటి అమెరికా ఎలా అతలా కుతలం అవుతోందో అలాగే ఆనాటి అమెరికా కూడా స్పానిష్ ఫ్లూ సంక్ర మణానికి తల్లడిల్లిపోయింది. వేలల్లో, లక్షల్లో చూస్తూ చూస్తూ జీవి తాలు కనుమరుగయ్యాయి. ఆ రోజుల్లో లెబనాన్ నుండి వచ్చి అమె రికాలో స్థిరపడిన ఖలీల్ జిబ్రాన్ అనే తత్వవేత్త న్యూయార్క్ నగరంలో రోగగ్రస్తులై అత్యంత దయనీయమైన స్థితిలో పేదరికంతో విలవిల లాడుతున్న ప్రజల్ని కళ్లారా చూసి, ‘వచ్చే తరాలు పేదరికంలో సమా నతను, దుఃఖంలో ప్రేమను గ్రహిస్తాయి’ అని వక్కాణించాడు. అవును, నేడు మనం అదే చూస్తున్నాం. కరోనా ప్రకోపానికి, ప్రభావానికి అన్ని దేశాలు అన్ని సమూహాలు ఒకే అరుగుపైకి తేబడ్డాయి. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా, ప్రపంచ వాసులందరూ ఒకే రకమైన ఉనికిలోకి వచ్చి చేరారు. ఇదేమైనా ప్రకృతి సిద్ధంగా జరిగిన కాకతాళీయమా? జీవన శైలుల రీత్యా ధనికులు, పేదలు అనే వ్యత్యాసం కానరాకుండా పోయింది. గొప్పవారి సామా జిక విశేషాధికారాలు అదృశ్యమయ్యాయి. బీదవాడితో సమానంగా హోదాలు తరిగాయి. ఎందుకంటే ఎవరికీ నాలుగు గోడల్ని దాటి బయటికి అడుగేసే అర్హత లేదు. అది అందరి మేలు గురించి విధించిన ప్రభుత్వాజ్ఞ. కరోనా నియంత్రణకు కనీసం ఆరడుగుల భౌతిక దూరం అవసరమైంది. దీన్ని పాటించకపోతే భూమిలో ఆరడుగుల కిందికి పోవాల్సి వస్తుందని అంటున్నారు. లేనివాడికి కారు ఎలాగూ లేదు. ఉన్నవాడికీ లేనట్లే. ఎందుకంటే కారు వాడలేడు కాబట్టి. బలహీనుడు, బలవంతుడు– ఇద్దరూ వాళ్ల బలం చూపించుకోవాల్సిన పనిలేదు. కనిపించని వైరస్ నుంచి ఎలా తప్పించుకుని ఉండాలా అన్న ప్రశ్న ఇద్దరి మనసుల్ని కలచివేస్తూ ఉంది. గుడిసెలో ఉండేవాడు ఎప్పటిలాగే గంజన్నం, పచ్చడి మెతుకు లతో జీవన వ్యాపన చేస్తున్నాడు. కోటీశ్వరుడు కూడా అంతే. ఇంట్లో ఉన్న పప్పన్నమే పరమామృతం. కోరుకున్న వంటకాలకు సామగ్రి తెచ్చుకోవడానికి ఇంటినుంచి బయటికి వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. తప్పిదం జరిగితే అనుమానం పెనుభూతం అయినట్లే. అందరి స్వేచ్ఛలు అలాగే ఉన్నాయి. ఏ మాత్రం తారతమ్యం లేదు. జైలులో మగ్గుతున్న ఖైదీకి స్వాతంత్య్రం ఎంతవరకు ఉందో మిగతా వాళ్లకు వాళ్ల ఇళ్లల్లో అంతే వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది. కాకపోతే ఖైదీలు కొంతవరకు మెరుగు. జైలు వంటవాడు చేసిన భోజనాలు చక్కగా వాళ్లకివ్వబడతాయి. మిగతావాళ్లు సొంతంగా వండుకోవాలి. కారణం, పనిమనుషుల్ని మానేశారు గదా. ఎందుకంటే, పనిమను షులు కూడా వాళ్లిళ్లలోనే ఉండాలి గనుక. వాళ్లు పనికి రాకపోయినా కొద్దికాలం నెలవారీ జీతం ముట్టజెప్పాల్సిందే. మంచిదే కదా. ఏ ఇజమూ ఊహించని ఉపద్రవం బ్రతుకు భయం మిన్నంటింది. బాలీవుడ్ నటీమణి అయినా, పొలాల్లో నాట్లు వేసే కూలీ అమ్మాయి అయినా కరోనా పెనుభూతానికి భయ పడక తప్పట్లేదు. సమాజంలో ఆర్థిక స్తంభన వల్ల నెలకొని ఉన్న సంక్షోభాన్ని పెట్టుబడిదారీ విధానం నిస్సహాయంగా చూస్తోంది. అదేవిధంగా కమ్యూనిజం కూడా. ఏ ప్రణాళికను చేసినా, కరోనాను దృష్టిలో పెట్టుకోవాల్సిందే. ఏ ఇజమూ ఇలాంటి దుర్భర పరిస్థితిని ముందుగా ఊహించలేకపోయింది. మనుషుల జ్ఞాపకశక్తి కూడా అంతంత మాత్రమే. అందుకే స్పానిష్ ఫ్లూ తాండవాన్ని నెమరువేసుకోలేక పోయారు. రాజరికాలు, ప్రజాస్వామ్యాలు పేరుకు మాత్రమే అన్నట్లుగా నిలిచాయి. ఓ ప్రక్క బ్రిటిష్ మహారాణి ఏకాంతవాసానికి పరిమితమయితే థాయ్‌లాండ్ రాజు తన దేశాన్ని వదలి విదేశాల్లో తలదాచుకుంటున్నాడు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యాలయిన ఇండియా, అమెరి కాలు విపరీత అవస్థల్లో ఇరుక్కుని ఉన్నాయి. ప్రజలకు తమతమ బ్రతుకులపై ప్రశ్న చిహ్నమైన అభద్రత, అనిశ్చితం లాంటి మనోభావనల్ని రూపుమాపేందుకు సామ్యవాదం పనికిరాకుండా పోయింది. ఇక మిశ్రమ ఆర్థిక విధాన సూత్రాలు అయితే నామ మాత్రమే. ఇప్పటివరకూ అణుశక్తి, పరమాణుశక్తి, అంతరిక్షయానం అని గొప్పలు చెప్పుకున్న దేశాల ప్రకటనలు కరోనా ముందు ఉత్తి ప్రగ ల్భాలుగానే మిగిలిపోయాయి. అధునాతన సమాజాలని చెప్పుకున్న ప్రజలు మనుగడ నృత్యాలకు విస్మయం చెందారు. డిజిటల్ విప్లవం పేరుగానే ఉండిపోయింది. అత్యంత ఆనంద దేశాలుగా పేరుగాంచిన ఐస్లాండ్, హాలెండ్ లాంటి దేశాలకు కూడా కరోనా ఒత్తిడితో ఆనందం దూరమైంది. రెండు రెండు దేశాల పౌరసత్వాలు కలిగిన వాళ్లు, ఏ దేశ పౌరసత్వమూ లేని స్టేట్లెస్ నిర్భాగ్యులు ఒకే దుస్థితిలోకి నెట్టబడ్డారు. పరువు ప్రతిష్టలు గల సమాజ పెద్దలు, బయటినుండి వచ్చి తలదాచుకున్న కాందిశీకులు సమాన పరిస్థితుల్లో అలమటిం చడం మామూలు అయింది. మతం, కులం, ప్రాంతం, వర్గం, భాష, సంస్కృతి అనే భేదాలు అగుపడటం ఆగిపోయాయి. మనిషి మళ్లీ వెనక్కి వచ్చేసినట్టేనా! భౌతిక శాస్త్రజ్ఞుడు స్టీఫెన్ హాకింగ్ కలలుగన్న విలాసవంతపు విశ్రాంతి నేడు కానరాక, దాని స్థానంలో విధ్వంసకరమైన మానసిక వ్యథ చోటు చేసుకుంది. నోబెల్ బహుమతి గ్రహీత బెర్ట్రండ్ రస్సెల్ ‘పని ఎంత తగ్గితే మనిషికి అంత ఆనందం దొరుకుతుందని’ అన్నాడు. కానీ, అది ఒట్టి మాటే అని కరోనా రుజువు చేసింది. పనీపాటా లేక ఇంట్లో అట్టే కూర్చున్నా ఏదో ఆలోచన! ఏదో చింతన! ఏదో బాధ! మనిషి మళ్లీ మొదటికే వచ్చేశాడు. ఆదిమ మానవుడు ప్రకృతి వైపరీత్యానికి భయపడేవాడు. పర్యావరణంలోని ఉరుములు, మెరు పులకు వణికేవాడు. వన్య క్రూర మృగాల ధాటికి తట్టుకోలేక పోయేవాడు. ఇప్పుడు ఆ భయం మళ్లీ మనిషిని పీడిస్తోంది. ఇప్పుడు కలుషిత వాతావరణం ఆరోగ్యానికి ముప్పు అయితే, క్రూర మృగాలకు బదులుగా జీవికాని జీవి అయిన ఓ సూక్ష్మ వైరస్ పెనుముప్పులా తయారైంది. ఎప్పుడో ఓ అరవై ఏళ్ల క్రితం కర్ట్ వోనెగట్ అనే అమెరికన్ రచయిత రాసిన ‘హారిసన్ బెర్జెరోన్’ అనే కథను కరోనా నిజం చేసింది. ఆ కథలో భవిష్యత్ సమాజంలో ఓ ప్రభుత్వం చేసిన కొన్ని వింత చట్టాలవల్ల ప్రజలు ప్రతికూల సమానత అంటే నెగెటివ్ ఈక్వాలిటీ లోకి తోయబడుతారు. అదే మాదిరిగా కరోనా ధనిక, పేద– అందర్ని మానసికంగా అట్టడుగు స్థాయికి దించేసింది. దీని కంతటికీ తాను కారణం కాదని, మనిషి తనకు తాను చేసుకున్న తప్పిదాలే అసలు కారణమని కరోనా చాటి చెబుతోందా? ఏది ఏమైనా మనిషికి మైక్రోస్కోపు, టెలీ స్కోపు లాంటి దృష్టితో పాటు అంతకుమించిన అంతర్దృష్టి అంటే ఇన్సైట్ కావాలి. అది ఉంటే దూరదృష్టి ఉంటుంది. అప్పుడు వైరస్ గురించి ప్రపంచ దేశాలు ఇంత తేలిగ్గా తీసివేసిన పరిస్థితి సంభవించేది కాదు. ఇప్పుడైనా ముందు జాగ్రత్తలతో వ్యవహరిస్తే జరుగుతున్న సంక్షోభాన్నుంచి, రాబోయే సంక్షోభాల్నుంచి కూడా మనల్ని మనం సంరక్షించుకోవచ్చు. అతికొద్ది కాలంలో వైరస్ వ్యాక్సిన్ వస్తుంది. అంతవరకు డాక్టర్లు, శాస్త్రవేత్తలు చెప్పినట్లు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నడుచుకుంటే ప్రశాంత జీవనం తిరిగి రావడానికి ఎంతో సమయం పట్టదు. బండి మరియ కుమార్ వ్యాసకర్త రిటైర్డ్ డీజీపీ, మధ్యప్రదేశ్ మొబైల్ : 94258 24258 -
కోవిడ్ కాలంలో కొత్త విద్యా వ్యవస్థ
భారతదేశం గురుశిష్యులు ముఖాముఖిగా ఉండి బోధించే పద్ధతికి అలవాటుపడిన దేశం. సమాచారం తెలుసుకోవడానికి టెలివిజన్, సామాజిక మాధ్యమ వేదికలైన వాట్సాప్, ఫేస్బుక్ ఉన్నా చదువు అనేసరికి తరగతి గది, ఎదురుగా టీచర్ ఉండాల్సిన సాంప్రదాయ స్థితిలోనే మన విద్యారంగం ఉంది. ఆప్యాయంగానైనా టీచర్లు విద్యార్థులను తాకకుండా ఉండలేని సంస్కృతి మనది. అదేవిధంగా కరోనా నేపథ్యంలో విద్యార్థులు ఒకరినొకరు తాకకుండా, కలిసి మెలిసి ఉండకుండా ఉండగలరా? ఉండవచ్చునా? కరోనా కాలంలో గడిపిన కఠోరమైన జీవితం తరువాత ప్రజలెవరూ ప్రమాణాల విషయంలో రాజీపడే అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి ప్రభుత్వాలు, పాఠశాలల నిర్వాహకులు, విద్యార్థులు దీనికి సిద్ధం కావాల్సి ఉంటుంది. కరోనా వైరస్ మొత్తం ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రస్తుతానికి వేరే మార్గమేదీ కనిపించక దేశాలు మూతపడ్డాయి. చరిత్రలో ఎన్నడూ చూడని ఈ ఉపద్రవం నుంచి బయటపడటం ఎలాగో తెలియని అయోమయం రాజ్యమేలుతోంది. మళ్ళీ ఈ వ్యవస్థలను పునర్నిర్మించుకోవడం, ఈ సంక్షోభం నుంచి గట్టెక్కి మనుగడ సాగించడం ఇప్పుడొక సవాలు. ప్రజలను కట్టడి చేసి ఆర్థిక వ్యవస్థలను నిలబెట్టుకోవడం సాధ్యంకాదు కాబట్టి క్రమంగా లాక్డౌన్లు ఎత్తివేస్తున్నారు. అయినా ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలను కొన్ని సంవత్సరాలు తు.చ. తప్పక ఆచరించాల్సిందే. వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకుంటూనే, ఒకరికి ఒకరు భౌతిక దూరం పాటించక తప్పదని చెపుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యారంగం మీద కోవిడ్ ప్రభావం ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు ప్రధానమైన అంశం. కిక్కిరిసిపోయి ఉండే భారతీయ తరగతి ఎలా మారబోతుంది? పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేది చర్చకు వస్తోంది. ఇప్పటికిప్పుడు ప్రభుత్వాలు దీనిమీద పూర్తిగా దృష్టిపెట్టనప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు యునెస్కో, ప్రపంచబ్యాంకు వంటివి కొన్ని ప్రతిపాదనలను చర్చకు పెట్టాయి. కరోనా వైరస్ బయటపడిన వెనువెంటనే విద్యా సంస్థలన్నీ మూతపడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 150 కోట్లమంది పాఠశాల విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. అమెరికా, ఐరోపా దేశాల్లో కొత్త విద్యాసంవత్సరం అడ్మిషన్లు నిలిచిపోయాయి. మనదేశంలో వార్షిక పరీక్షలను మధ్యలోనే ఆపేసి లాక్డౌన్ చేయాల్సివచ్చింది. కీలకమైన 10, 12 తరగతుల విద్యార్థులు ఇంకా పరీక్షలు పూర్తికాక అయోమయంలో ఉన్నారు. వచ్చే విద్యాసంవత్సరానికి కావాల్సిన ఎంట్రన్స్, అడ్మిషన్ టెస్టులు కూడా వీళ్ళు పూర్తి చేసుకోవాల్సి ఉంది. విద్యాసంవత్సరాన్ని జూన్ నుంచి కాకుండా సెప్టెంబర్ నుంచి ప్రారంభించాలనే ప్రతిపాదనలు కూడా వస్తున్నాయి. భారతీయ విద్యారంగం ప్రపంచంలో అన్నిటికన్నా పెద్దది. దేశ జనాభాలో దాదాపు 50 కోట్లమంది చదువుకునే వయసులో అంటే ఐదేళ్లనుంచి 24 సంవత్సరాల లోపు ఉన్నవాళ్లే. దేశంలో దాదాపు 15 లక్షల స్కూళ్ళు, 40 వేలదాకా కాలేజీలు, దాదాపు వెయ్యి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వీటిల్లో చదువుకునేవారి సంఖ్య దాదాపు 30 కోట్లు. ఇప్పుడు ఈ 30 కోట్లమంది ఇళ్లకే పరిమితమై ఉన్నారు. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు కోటిన్నర మంది విద్యార్థులున్నారు. వెంటనే విద్యాసంస్థలు తెరిచే పరిస్థితులు లేకపోయినా, మరో రెండు మూడు నెలల్లో విద్యాసంవత్సరం ప్రారంభించకపోయినా అది మొత్తం ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థల మీద, విద్యార్థుల భవితవ్యం మీద తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంటుంది. విద్యాసంస్థలు ఎప్పుడు తెరిచినా కోవిడ్ 19 నిబంధనలు కొత్త సవాలుగా మారబోతున్నాయి. వైరస్ వ్యాప్తి చెందుతున్న దశలోనే పాఠశాల పరిసరాలు ఎలా ఉండాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్‌తో కలిసి ఒక ప్రోటోకాల్ రూపొందించింది. ఒక చెక్‌లిస్టు కూడా ఇచ్చింది. దాని ప్రకారం మొత్తం విద్యారంగ మౌలిక సదుపాయాలు మార్చవలసి ఉంటుంది. ఇది విద్యావ్యవస్థ స్వరూప, స్వభావాలను పూర్తిగా మార్చేసే విధంగా ఉంది. ప్రతి టీచర్ , ప్రతి విద్యార్థి మాస్కులు ధరించాలి. ప్రతి తరగతి గదిని రోజుకు కనీసం ఒక్కసారైనా (వీలైతే తరచుగా) నీటితో కడగడం, తుడవడం చేయాలి. ఆ గదిలోని ప్రతి వస్తువునూ శానిటైజ్ చేయాలి. విధిగా తరగతి గదికి అందుబాటులో శానిటైజర్లు లేదా సబ్బులు ఉంచాలి. విద్యార్థులు తరచుగా చేతులు కడుక్కునే సౌకర్యం, నిరంతరాయ నీటి వసతి కల్పించాలి. పాఠశాలల్లో తరచూ జరిగే అసెంబ్లీలు, ఆటలు, ఇతర సామూహిక కార్యక్రమాలు ఉండకూడదు. ఇవన్నీ ఒక ఎత్తయితే ఒక్కో విద్యార్థికి మధ్య కనీసం ఒక మీటరు దూరం ఉండాలన్నది కోవిడ్ 19 నియమం. దీనిని పాఠశాలల్లో కూడా పాటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెపుతోంది. అంటే ఒక విద్యార్థికీ మరో విద్యార్థికీ మధ్య అన్ని వైపులా కనీస దూరం ఒక మీటర్ ఉండాలి. ఈ లెక్కన ఇప్పుడున్న తరగతి గదుల సంఖ్యను ప్రభుత్వ పాఠశాలల్లో అయితే రెండు మూడు రెట్లు, ప్రైవేటులో అయితే ఐదారు రెట్లు పెంచాలి. ఇప్పుడున్న తరగతి గది, మౌలిక వసతులు సమకూరడానికి కొన్ని వందల సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు వీటిని అవసరానికి అనుగుణంగా విస్తరించడానికి కొన్ని వేలకోట్ల రూపాయలు అవసరం. ఈ సంక్షోభంలో ఒక్క మనకే కాదు, అభివృద్ధి చెందుతున్న ఏ దేశానికి కూడా ఇది సాధ్యం కాదు. ఈ పరిస్థితులను అధిగమించడానికి మనం అనుసరిస్తోన్న విద్యాప్రణాళికలు, బోధనా పద్ధతులు పూర్తిగా మార్చడం ఒక్కటే పరి ష్కారం. సమస్యేమిటంటే గురుకులాలు మొదలు భారతదేశం గురుశిష్యులు ముఖాముఖిగా ఉండి బోధించే పద్ధతికి అలవాటు పడిన దేశం. సమాచారం తెలుసుకోవడానికి టెలివిజన్, సామాజిక మాధ్యమ వేదికలైన వాట్సాప్, ఫేస్బుక్ ఉన్నా చదువు అనే సరికి తరగతి గది, ఎదురుగా టీచర్ ఉండాల్సిన సాంప్రదాయ స్థితిలోనే మన విద్యారంగం ఉంది. ఆప్యాయంగానైనా టీచర్లు విద్యార్థులను తాకకుండా ఉండలేని సంస్కృతి మనది. అదేవిధంగా విద్యార్థులు ఒకరినొకరు తాకకుండా, కలిసి మెలిసి ఉండకుండా ఉండగలరా? ఉండవచ్చునా? ఇలాంటి పరిస్థితుల్లో మన బోధన, అభ్యాసన సంస్కృతికి సంబంధమే లేని దూరవిద్య మనకు పనికొస్తుందా? మన విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎంతవరకు సిద్ధంగా ఉన్నారు? దూరవిద్య అంటే ఓపెన్ యూనివర్సిటీ లేదా ఓపెన్ స్కూల్ అనేది పాత భావన. ఇప్పుడు మనం థియేటరుకు వెళ్లకుండానే ఒక కొత్త సినిమా అమెజాన్, నెట్‌ఫ్లిక్స్‌లో ఎలా చూస్తున్నామో అలాగే పాఠశాలలకు వెళ్లకుండానే చదువుకోవచ్చు. అటువంటి సౌలభ్యత ఇప్పుడు అందుబాటులో ఉంది. అందులో మొదటిది టీవీ. మనదేశంలో దాదాపుగా విద్యార్థులున్న ప్రతి ఇంట్లో టెలివిజన్ ఉన్నది. దేశవ్యాప్తంగా కనీసం 70 శాతం ఇళ్లల్లో, దక్షిణాదిలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 90 శాతం కంటే ఎక్కువ ఇళ్లల్లో టీవీలు ఉన్నాయి. కాబట్టి ఇదొక అవకాశంగా తీసుకుని కనీసం 40 శాతం పాఠాలు ఇంట్లోనే బోధించేలా చర్యలు తీసుకోవాలన్నది ఒక ప్రతిపాదన. మొబైల్ లెర్నింగ్ రెండో ప్రత్యామ్నాయం. దేశ జనాభాలో 93 శాతానికి పైగా మొబైల్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. 2019 మెకెన్సీ నివేదిక ప్రకారం దాదాపు 40 శాతం మంది ఇంటర్నెట్ వాడుతున్నారు. విద్యార్థుల్లో ఇది కనీసం 95 శాతంగా ఉంటుంది. దాదాపు 40 కోట్ల మందికి వాట్సాప్ అకౌంట్లు ఉన్నాయి. పాఠశాల విద్యార్థులకు టెలివిజన్ పాఠాలు ప్రత్యామ్నాయం అనుకుంటే, కళాశాలలకు మొబైల్ సేవలను ఎక్కువగా వాడుకోవచ్చు. ఈ –లెర్నింగ్, డిజిటల్ లెర్నింగ్ లాంటివీ ఉన్నాయి. ప్రపంచంలోని అత్యుత్తమ సంస్థలన్నీ తమ పాఠాలను మూక్స్, మూడుల్ లాంటి కొత్త వేదికల ద్వారా ఉచితంగా అందుబాటులోకి తెస్తున్నాయి. గూగుల్ కూడా విద్యాబోధనకు సంబంధించిన కొత్త టూల్స్ అందుబాటులోకి తెస్తోంది. ఎలక్ట్రానిక్ మాధ్యమాల వినియోగంతో తరగతి గదిలో బోధించే విషయాలను కుదించడంతో పాటు, పాఠానికి సంబంధించిన అదనపు సమాచారాన్ని కూడా ప్రింట్ రూపంలో అందించవలసి రావొచ్చు. ఇప్పుడున్న సిలబస్‌ను కూడా సమీక్షించవలసి రావొచ్చు. అలాగే హాస్టల్స్, రెసిడెన్సియల్ విద్యాసంస్థలు భారీ మార్పులు చేయాల్సి రావొచ్చు. కోవిడ్ స్టాండర్డ్స్ ప్రకారం ఒక్కో విద్యార్థికి కనీసం వంద మీటర్ల స్థలం అవసరం. అంటే ఒక్కో గదిలో ఒక్కరు, లేక ఇద్దరి కంటే ఎక్కువ మందిని ఉంచడానికి వీలులేదు. భోజనశాలలు, స్టడీ రూములు, లైబ్రరీలు, ఇతర సామూహిక స్థలాల్లో కూడా చాలా మార్పులు రావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో విద్యావ్యవస్థలో అన్ని దశల్లో కూడా సమూలమైన మార్పుల దిశగా ప్రయత్నాలు జరగాలి. ఇప్పుడున్న మౌలిక వసతులను షిఫ్టుల వారీగా వాడుకోవడం, దూర విద్యా వ్యవస్థలు, ఓపెన్ యూనివర్సిటీలను, అవి రూపొందించే పాఠ్యాంశాలను అందరికీ అందుబాటులోకి తేవడం అవసరం. ఇవన్నీ కావాలనుకుంటే కష్టమే. కానీ కరోనా అటువంటి కొత్త ప్రమాణాలను మన ముందుకు తెచ్చింది. కనీసం వ్యాక్సిన్ కనిపెట్టి, అది అందరికీ అందుబాటులోకి వచ్చే వరకైనా ఈ ఏర్పాట్లు అవసరం. కరోనా కాలంలో గడిపిన కఠోరమైన జీవితం తరువాత ప్రజలెవరూ ప్రమాణాల విషయంలో రాజీపడే అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి ప్రభుత్వాలు, పాఠశాలల నిర్వాహకులు, విద్యార్థులు దీనికి సిద్ధం కావాల్సి ఉంటుంది. ప్రొ. ఘంటా చక్రపాణి వ్యాసకర్త చైర్మన్, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ -
వలస కూలీలు ఓటర్లు కారనుకున్నారా?
నెత్తిన మూటలు, పక్కన పదేళ్ల కూతురు, ఆ అమ్మాయి చేతిలో చంటిపాప, భార్య చేతిలో పెద్ద మూట, ముసలాయన, మొత్తం కుటుంబం కాలినడకన మైళ్ల ప్రయాణానికి సిద్ధం. వారికెంత ఆత్మస్థైర్యం, ఎంత సహనం? కొందరు నడవలేకపోయారు చని పోయారు. దేశంలో పదినుంచి నలభై కోట్లదాకా వలస కూలీలు ఉన్నారు. లెక్కలు లేవు. వారి పట్ల రాజ్యపాలనా వ్యవస్థ దారుణంగా విఫలమైంది. మాకు కరోనా అంటే భయం లేదు. కానీ పేదకూలీలను మనుషులు అని కూడా గుర్తించని ప్రభుత్వం అంటే చాలా భయం, ఆకలికీ, నిరుద్యోగానికీ, వందల మైళ్ల నడకకూ భయపడడం లేదు. మేం కూడా ఓట్లు వేస్తాం. మాకు విలువే లేదా? అని ఒక కూలీ అడిగాడు. వలసకూలీలకు ఓట్లు లేవనుకున్నారా లేక వారు ఓట్లే వేయరనుకున్నారా? అవినీతి, అసమర్థత, ఆలోచనలేని నిర్ణయాలు వైరస్ కన్నా అల్పంగా ఎవరికీ కనిపించవు. వైరస్‌కన్నా ప్రమాదకరంగా సూక్ష్మంగా ఉండే అసమర్థతను ఎవరు చూస్తారు? కరోనా వైరస్ కోవిడ్ 19 వ్యాప్తిని అరికట్టడానికి లాక్డౌన్ ఒక్కటే మందు అని అందరూ ప్రచారం చేస్తున్నారు. కానీ దీని వెనుక కోట్లాది వలస కూలీలను అసలు పట్టించుకోకపోవడమనే భయానకమైన బాధ్యతా రాహిత్యానికి రోడ్లపాలైన కూలీల బతుకులు సజీవ సాక్ష్యాలు, కాదు కాదు, జీవన్మృత సాక్ష్యాలు. 8 గంటలకు టీవీలో ప్రసంగించి అర్ధరాత్రి 12 నుంచి లాక్డౌన్ అన్నీ బంద్ అన్నారు. ఆహా భేషైన నిర్ణయం. ఎక్కడెక్కడో చిక్కుకున్న కోట్లాది మంది కూలీల పని హఠాత్తుగా ఆగింది. రైళ్లు, బస్సులు, వాహనాలేవీ కదలవు. పొట్ట చేతబట్టుకుని నగరాలకు వచ్చిన కూలీలు ఎక్కడికి ఎలా వెళ్లగలరు? వీరి బతుకులను ఏం చేయాలనే ప్రణాళిక లేకుండా, వారు బతికి ఉన్నారని, బతికి ఉండేట్టు చూడాలనే ధ్యాస లేకుండా లాక్డౌన్ చేసారు. కరోనా ఖాళీని ఏలినవారిని కీర్తించడానికి సద్వినియోగం చేస్తున్నారు. కూలిపోయిన కూలీల గురించి పట్టించుకోవడం ఎందుకనే నిర్లక్ష్యం ఇది. నగరాలనుంచి గ్రామాలకు వందలాదిమంది నడిచిపోతున్న కఠిన జీవన దృశ్యాలు ఇప్పటికీ హృదయ విదారకంగా పత్రికల్లో టీవీల్లో వస్తూనే ఉన్నాయి. కోట్లాదిమందికి హఠాత్తుగా కూలీ ఉద్యోగం కూడా కూలిపోయింది. బతకాలంటే ఊరికి పోవడం ఒక్కటే మార్గం. నడవడం తప్ప మరో దారి లేదు. వీధిమూల చిన్న చాయ్ దుకాణాలు పెట్టుకునే వాళ్లు, తోపుడు బండ్లమీద తినుబండారాలు అమ్ముకునే వాళ్లు. ఇవ్వాళ్ల సంపాదించిన డబ్బు, తిండికి.. రేపటి వంటలకు పెట్టుబడికి మాత్రమే సరిపోతాయి. రేపు చిన్నవ్యాపారం నడవక వేరే పని లేక రేపు తినగలిగినా మరునాటికి తిండి లేక ఎన్నాళ్లిలా? రాష్ట్ర సరిహద్దులలో పొరుగు ప్రభుత్వం సొంతూరు వెళ్లడానికి వాహనాలు ఏర్పాటు చేస్తే అదృష్టం. కొన్ని రాష్ట్రాలు చేసాయి. కొన్ని చోట్ల వదాన్యులు డబ్బు పోగు చేసి వేరే రాష్ట్రాలనుంచి, జిల్లాలనుంచి వచ్చిన కూలీలకు తిండి పెడుతున్నారు. రోజుకు వందలాది మందికి ఆహారాన్ని అందిస్తున్నారు. తిరుపతిలో తితిదే దేవస్థానం వారు కొన్ని రోజులు ఆహారం వండి పెట్టారు. చాలా గొప్పపని. మార్చి 22న ఉండాల్సిన బుద్ధి ఏప్రిల్ 20 దాకా రాలేదు. దాదాపు నెలరోజుల ఆకలి.. కూలీల వలసల తరువాత రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయ కేంద్రాలు పెట్టాలనిపించింది. కేంద్రానికి సాయం చేయాలనిపించింది. సహాయ నిధులు ప్రకటించారు. భోజన సరఫరా ఏర్పాట్లు చేసారు. అదీ కొందరికి మాత్రమే. ఇవన్నీ అరకొర వ్యవహారాలు. అందరికీ అందించే సమగ్ర ప్రణాళికలేవీ లేవు. చేతగానితనానికి ఒకే నెపం కరోనా లాక్ డవున్. రాష్ట్రాల మధ్య వలస కార్మికుల ప్రయాణాలను అనుమతించబోమని, ఉన్న రాష్ట్రంలోనే వారికి ఉపాధి గ్యారంటీ పనులు ఇవ్వడానికి కొన్ని మార్గదర్శకాలను ఏప్రిల్ 20న కేంద్రం విడుదల చేసింది. కార్మికులు దగ్గరలో ఉన్న కేంద్రాలలో రిజిస్టర్ చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. కానీ వారున్న చోటికి వెళ్లి రిజిస్టర్ చేయాలనే బాధ్యతను యంత్రాంగం పైన మోపలేదు. సరైన ప్రణాళిక ప్రకారం కూలీలను గుర్తించి వారు తిరిగి వారి ఊళ్లకు వెళ్లేదాకా లేదా వారికి పని దొరికి వారంతట వారే సంపాదించుకునే దాకా వారిని పోషిం చడం. లేదా వారిని సొంతరాష్ట్రాలకు తరలించడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల, మతాదాయ సంస్థల బాధ్యత. కేరళలో వచ్చి పడిన లక్షలాది వలసకూలీల బాంక్ అకౌంట్ల వివరాలతో డేటా సేకరిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ డేటా సేకరిస్తే తగిన ప్రణాళికలు సాధ్యం. బ్యాంక్‌లో డబ్బు వేసినా తీసుకోవడానికి వీరు వెళ్లగలరా? ప్రసంగాలు, మార్గదర్శకాలు, సలహాలు, ప్రకటనలు జారీచేయడం అనే సులువైన పబ్లిసిటీ వ్యూహాలు దాటి కేంద్రం నిర్మాణాత్మకంగా పనులు చేసి రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంటే బాగుండేది. పాలకులు ముందుచూపు లేని బదిరాంధులు కాకపోతే బాధ్యతలు తెలుస్తాయి. మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
భారత్ కేంద్రంగా నూతన ప్రపంచం
ఒకవైపు అమెరికా, ఐరోపా దేశాలు కరోనా వైరస్ ప్రభావాన్ని కట్టడి చేయడానికి కష్టపడుతోంటే, ఈ మహమ్మారిని ఆసియాలోని ప్రజాస్వామ్య దేశాలు సమర్థవంతంగా ఎదుర్కోగలగటం గమనార్హం. కోవిడ్–19ను ఎదుర్కోవడంలో ప్రజాస్వామ్య క్రియాశీలత కనపరచి భారతదేశం మిగతా వారికి ఓ ఉదాహరణగా నిలిచింది. దూరదృష్టి కల నేతల నేతృత్వంలోని ప్రజాస్వామ్య దేశాలు ఇటువంటి సవాళ్ళను ఉదారవాద విలువల విషయంలో రాజీ పడకుండా ఎదుర్కోగలవని మోదీ నిరూపించారు. ఇప్పుడిప్పుడే ఆవిష్కృతమవుతున్న నూతన ప్రపంచ క్రమంలో, మోదీ సూచించిన ‘మానవ కేంద్రక అభివృద్ధి సహకారం’ ఆధారంగా నూతన ప్రపంచ వ్యవస్థను నిర్మించటంలో అమెరికా, జర్మనీ దేశాలతో కలిసి భారత్ నిర్ణయాత్మక పాత్ర పోషించగలదు. శతాబ్ద కాలం క్రితం అమెరికా, ఐరోపా దేశాలు, ఆ దేశాల కాలనీలలో పర్యటించా లంటే ప్రజలెవరికీ వీసాలు, పాస్ పోర్టుల అవసరం ఉండేది కాదు. మొదటి ప్రపంచ యుద్ధం వచ్చిన తరువాత పరిస్థితులు మారిపోయాయి. దేశాల సరిహద్దులు కఠినతరంగా మారాయి. ఆర్థిక వ్యవస్థ స్తంభించటం, ఆర్థికమాంద్యం పెరిగి పోవటం జరిగింది. జాతీయవాదం హద్దు మీరిన జాతీయవాదంగా పరిణమించటంతో రెండో ప్రపంచ యుద్ధం సంభవించింది. రెండవ ప్రపంచయుద్ధం తర్వాత దేశాలన్నీ కలిసి ఒకరితో ఒకరికి సంబంధం ఉండేలా ఓ వ్యవస్థీకృత ప్రపంచ వ్యవస్థని రూపొందించుకొన్నాయి. అనేక ఆటంకాలు ఎదురైనప్పటికీ గత 65 సంవత్సరాలలో ప్రపంచ క్రమం అదే రీతిలో కొనసాగింది. ఆ ప్రపంచ క్రమాన్ని కరోనా విశ్వ మహమ్మారి ఆస్థిరపరచేలా ఉంది. దేశాలు అంతర్ముఖంగా, కొన్నైతే నిరంకుశంగా మారుతు న్నాయి. కొద్ది మంది రాజకీయ శాస్త్రజ్ఞులు తలుపులు మూసుకొని ఉండే సంకుచిత జాతీయవాదం ప్రపంచవ్యాప్తంగా ప్రబలుతుందని చెబుతున్నారు. ప్రపంచీకరణ, స్వేచ్ఛా వాణిజ్యాలకు కాలం చెల్లిందని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ఈ నిరాశావాదం ఎక్కడ నుండి పుడు తోంది? దీనికంతటికీ కేవలం కరోనా వైరస్ కారణం కాకపోవచ్చు. అత్యంత శక్తివంతమైన దేశాలుగా భావించబడే రెండు దేశాలు యావత్ ప్రపంచ విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేశాయి. హూవర్ సంస్థకు చెందిన అమెరికా చరిత్రకారుడు నియాల్ ఫెర్గుసన్ వాటిని ‘చిమేరా’గా వర్ణించాడు. చిమేరా అంటే గ్రీకు పురాణాల్లో సింహం తలతో, మేక శరీరంతో, పాము తోకతో, నోటి నుండి మంటలను ఊదుతూ ఉండే ఓ భయం కర సంకర జీవి. గత దశాబ్దం పైగా అమెరికా, చైనాలు సృష్టించిన ఆర్థిక సంబంధ నమూనాను ఫెర్గుసన్ 20వ శతాబ్దం చివర వరకు అమెరికా, జపాన్ దేశాల మధ్య ఉన్న ‘నిచిబెయి’ ఆర్థిక బంధాన్ని పోలి ఉన్నదని పేర్కొన్నాడు. కరోనా వైరస్ చిమెరికా (చైనా, అమెరికా) అంటే కేవలం చిమేరా మాత్రమేనని తెలియజేస్తుంది. నిజాలను ప్రపంచం నుండి దాచిపెట్టి, వైరస్ చైనా సరిహద్దులను దాటి విశ్వ మహమ్మారిలా పరిణమించేలా చేసిందనే ఆరోపణలను చైనా ఎదు ర్కొంటున్నది. వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న అమెరికన్ ఎంటర్ ప్రైజ్ ఇన్స్టిట్యూట్ అనే మేధో సంస్థకు చెందిన డెరెక్ సిసోర్స్ చైనాలో వైరస్ సంక్రమణ కేసులు అది అధికారికంగా చెపుతున్న దానికంటే అనేక రేట్లు అధికంగా ఉన్నాయని వాదిస్తున్నాడు. ఆచారబద్ధమైన పద్ధతులను అనుసరించని దేశాలలో చైనా ఒకటి. ‘చారిత్రక అనుభవం’ అనే మార్గాన్ని అనుసరిస్తున్నామని చైనా భావి స్తూంటుంది. దీర్ఘకాల పోరాటం లేదా విప్లవం తరువాత 1949లో మావో అధికారం హస్తగతం చేసుకోవటం కారణంగానే తాము నేడు ఈ స్థాయిలో ఉన్నామని చైనా భావిస్తుంది. చైనా వాళ్ళ ప్రపంచ వీక్షణ మూడు ముఖ్య సూత్రాల ఆధారంగా ఉంటుంది. అవి జీడీపీ వాదం– స్థూల జాతీయ ఉత్పత్తి వాదం, చైనా మధ్యస్థ వాదం–అన్నిటికీ చైనానే కేంద్రం అనే వాదం, చైనీయులు అసాధారణులనే వాదం– చైనీయులు మిగతా వారందరి కంటే భిన్నమైన, ఉన్నతమైన వారు అనే వాదం. అన్నిటికంటే ముఖ్యమైన తర్కం ఆర్థికాభివృద్ధి అని డెంగ్ జియా వోపింగ్ 1980లో పేర్కొన్నాడు. చైనా ఆర్థిక వేత్తలు దీనిని జీడీపీ వాదంగా వర్ణిస్తుంటారు. స్వతంత్రం, స్వయంప్రతిపత్తి, స్వయం సమృద్ధి ఉండాలని మావో నొక్కి చెప్పేవాడు. మాతృభూమిపై వాంగ్ షేన్ రచించిన భావగీతం చైనాలో ప్రఖ్యాత దేశభక్తి గీతం. పర్వతాలు, మైదానాలు, యాంగ్సీ, హుయాంగ్ నదులతో కూడిన ప్రియమైన మన మాతృభూమి అందమైనది, వైభవోపేత మైనది అని ఆ పాటలో ఉన్న వర్ణన చైనీయుల మనస్సులలో గాఢంగా నాటుకుపోయింది. చైనా కేంద్రక వాదం చైనాలో ప్రబలంగా ఉంటుంది. మూడవది, చైనీయులు అసాధారణమనే వాదం. ఇతరుల నుంచి నేర్చుకోవటాన్ని చైనా విశ్వసించదు. సమస్యల పరిష్కారం కోసం సొంత జ్ఞానాన్నే వాడాలని చైనా నాయకులు పదేపదే చెపుతుం టారు. చైనీయుల జాతీయవాద ప్రపంచ దృక్కోణం రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు కాలంలో జర్మనీ దృక్పథాన్ని పోలిఉంది. 1930 లలో జర్మన్ జాతి పరమైన ఆధిపత్యం, చరిత్రాత్మక హక్కులను ప్రస్తా వించటం, జాతిపరంగా తాము సర్వోత్తమమనే భావం తెలిసిందే. అంతకుముందు చెకోస్లోవేకియాకి చెందిన సుదేటెన్లాండ్ అనే జర్మన్ భాష మాట్లాడే ప్రాంతాన్ని హిట్లర్ ఆక్రమించినపుడు ఐరోపా అతడిని ఎదుర్కోవటానికి బదులుగా సంతృప్తిపర్చడానికి ప్రయ త్నించింది. బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ వంటి ఐరోపా దేశాలు హిట్లర్‌తో మ్యూనిచ్ ఒప్పందం కుదరటంతో సంబరపడుతుండగా, నాటి అమె రికా అధ్యక్షుడు రూజ్వెల్ట్, మీ ఈ చర్య యావత్ మానవాళికి మీరు చేసిన అసాధారణ చారిత్రాత్మక సేవగా కోటానుకోట్ల ప్రజలు గుర్తిస్తా రని హిట్లర్‌ను పొగిడాడు. ఇక మీదట ఆక్రమణలకు పాల్పడనని చేసిన వాగ్దానాన్ని దురదృష్టవశాత్తు ఒప్పందం కుదిరిన సంవత్సరం లోపే హిట్లర్ ఉల్లంఘించటంతో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభం అయ్యింది. 1939–40 కాలంలో బ్రిటన్ ఏ పరిస్థితిలో ఉందో ప్రస్తుతం అమెరికా అదే పరిస్థితిలో ఉంది. అమెరికాలోని రాష్ట్రాలను కరోనా వైరస్ బీభత్సానికి గురిచేసిన తరువాతగానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మేల్కొనలేదు. కరోనా వైరస్ అమెరికాలో విజృంభిం చనున్నదనే హెచ్చరికలు చేసే వారిని పట్టించుకోవద్దంటూ ఫిబ్రవరి 28నాడు దక్షిణ కరోలినాలోని తన మద్దతుదారులను ట్రంప్ కోరారు. మీడియా హిస్టీరియాతో ప్రవర్తిస్తున్నదని చెబుతూ, కరోనా వైరస్ ప్రబ లబోతున్నదంటూ మీడియా పేర్కొనటాన్ని గాలివార్తలుగా ట్రంప్ కొట్టిపారేశాడు. చైనా ప్రతిపాదించిన బెల్ట్ అండ్ రోడ్ ప్రణా ళికలోని లాభాల కోసం చైనాను కౌగలించుకొన్న ఐరోపా దేశాలు కరోనా వైరస్ ప్రభావాన్ని కట్టడి చేయటానికి కష్టపడుతున్నాయి. ఈ మహమ్మారిని ఆసియాలోని ప్రజాస్వామ్య దేశాలు సమర్థ వంతంగా ఎదుర్కోగలగటం గమనార్హం. సగటున ఒక రోజులో అమె రికా కంటే ఎక్కువ కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపిన దక్షిణ కొరియా అందరికంటే ముందు నిలబడింది. సింగపూర్ విస్తృతంగా పరీక్షలు జరుపుతూ వైరస్ లక్షణాలను కనుగొనే భారీ ప్రయత్నం చేసింది. గతంలో సార్స్ వైరస్ కారణంగా మరణాలను చవిచూసిన అను భవంతో హాంకాంగ్æ, తైవాన్లు కరోనా వైరస్‌ని సమర్థవంతంగా కట్టడి చేయటానికి సమయోచిత చర్యలు తీసుకున్నాయి. కోవిడ్– 19ను ఎదుర్కోవడంలో ప్రజాస్వామ్య క్రియాశీలత కనపరచి భారత దేశం మిగతా వారికి ఓ ఉదాహరణగా నిలిచింది. పూర్తి స్థాయి ప్రజా మద్దతుతో లాక్ డౌన్ అమలు పరచటం, భౌతిక దూరం పాటించే నిరోధక చర్యలు తీసుకోవటం ద్వారా ప్రధాన మంత్రి సహచరులతో పాటుగా ముందుండి దేశాన్ని నడిపిస్తున్నారు. నూట ముప్పై కోట్ల ప్రజలున్న దేశంలో మే ఒకటి నాటికి 35,365 యాక్టివ్ కేసులు నమోదై ఉన్నాయి. ఉద్దేశపూర్వక కవ్వింపు చర్యలు, ఇస్లామోఫోబియా అనే తప్పుడు ప్రచారాలను ఎదుర్కొన్నప్పటికీ మోదీ ఎటువంటి ఏకపక్ష, నిరంకుశ చర్యలకు ఉపక్రమించలేదు. కవ్వింపు చర్యలు ఎదురుగా కనపడుతున్నప్పటికీ మోదీ నిబ్బరంగా, శాంతంగా, ఆశావాద దృక్పథం కనపరచారు. దూరదృష్టి కల నేతల నేతృత్వంలోని ప్రజాస్వామ్య దేశాలు ఇటువంటి సవాళ్ళను ఉదార వాద విలువల విషయంలో రాజీ పడకుండా ఎదుర్కోగలవని నిరూపించారు. ఇప్పుడిప్పుడే ఆవిష్కృతమవుతున్న నూతన ప్రపంచ క్రమంలో, మోదీ సూచించిన ‘మానవ కేంద్రక అభివృద్ధి సహకారం’ ఆధారంగా నూతన ప్రపంచ వ్యవస్థను నిర్మించటంలో అమెరికా, జర్మనీ దేశాలతో కలిసి భారత్ నిర్ణయాత్మక పాత్ర పోషించగలదు. పర్యావరణం, ఆరోగ్య సంరక్షణ, సాంకేతిక విజ్ఞానం, ప్రజా స్వామ్య ఉదారవాదం ఆధార స్తంభాలుగా కొత్త ప్రపంచ వ్యవస్థ సంస్థాగత నియమావళి ప్రకటించే సమయం ఆసన్నమౌతోంది. అంతర్గతంగా అశాంతిని, అంతర్జాతీయంగా నిందలు ఎదుర్కొంటు న్నప్పటికీ చైనాకు ఒక అవకాశం ఉన్నది. చైనా కమ్యూనిస్ట్ పార్టీ వాడు కలో ‘లూక్సియాన్ డౌజ్హేంగ్’ అనే పదబంధం ఉంది. దాని అర్థం ఆకృతి, విధానం నిర్ధారించే పోరాటం. అధికారం కోసం పోరాటం అని కొందరు అర్థం చేసుకున్నప్పటికీ, పార్టీ కొత్త విధానాన్ని నిర్ణయించే పోరాటం అనే అర్థం సైతం ఉన్నది. అటువంటి పోరాటాలు గతంలో ఎన్నో జరిగాయి. నేటి ప్రపంచం అటువంటి మెరుగైన పోరాటం కోసం ఆశించవచ్చా? రాం మాధవ్ వ్యాసకర్త భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఇండియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సభ్యులు -
రైతుల్ని ఆదుకొనేదెవరు?
కరోనా, అకాలవర్షాలనుంచి రైతుల్ని ఆదుకొంటారా? తెలంగాణలో కొత్త ప్రాజెక్టుల ద్వారా 70 శాతం అధికంగా ధాన్యం పండిందంటున్నారు. యాసంగిలో 31.58 లక్షల ఎకరాలలో వ్యవసాయం సాగించేవారు. ఈసారి నీటిలభ్యత పెరిగి 53 లక్షల 68 ఎకరాల సాగు సాధ్యమయింది. 16.89 లక్షల ఎకరాలలో వరి సాగుచేసే వారు ఈసారి 39.24 లక్షల ఎకరాలలో వరి పండిం చారు. రైతులకు రెండు గండాలు. ఒకటి కరోనా వైరస్ వల్ల రాకపోకల దిగ్బంధనం. రెండు అకాల వర్షాలు. ఈ గండాలను గడిచే శక్తి రైతులకు లేదు. ప్రభుత్వాలు ఆదుకొంటాయా? తెలంగాణ రాష్ట్ర పోరాటానికి తొట్టతొలి కారణం నదుల వాటాల్లో అన్యాయం, నీటి వనరులను భారీ ఎత్తున మళ్లించడం. విడిపోయిన తరువాత తెలంగాణలో ఆరేళ్లలో అదనంగా పంటపొలాలు తడిపేందుకు నదీ జలాలను కదిలించారు. జలాశయాలు నిర్మించారు, ఎత్తిపోశారు. నీరు పారిన పొలాలు ధాన్యాన్ని పండించాయి. దేశంలో గొప్ప ధాన్యాగారంగా తెలంగాణ ఎదిగేదశ. యాసంగిలో ప్రతిధాన్యం గింజను ప్రభుత్వం గ్రామాలకొచ్చి కొంటుందని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. సహజంగానే ఇది రైతులకు సంతోషకరమైన వార్త. గ్రామగ్రామాన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం కూడా విశేషమే. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యంలో తేమ 17 శాతం ఉన్నా, తాలు నాలుగు శాతం దాకా ఉన్నా కూడా రైతులనుంచి కొనవచ్చు. కానీ తీరా ధాన్యం అమ్మకానికి వచ్చినపుడు అధికారులు ఈ రెండు నిబంధనలను పాటించడం లేదని, తాలు అసలే లేకుండా నూటికి నూరుపాళ్లు పరిశుభ్రంగా ఉండాలని పట్టుబడుతున్నారని, తేమ కేవలం 13 లేదా 14 శాతం, అంతకన్న తక్కువ ఉన్నా కూడా రైతుల పంటను కొనేవారు కనబడటం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. కొనుగోలు కేంద్రాల దగ్గర ధాన్యం కుప్పలు కుప్పలుగా పేరుకుపోతున్నాయి. అధికారులు కొనే దాకా ధాన్యం అక్కడే కొనుగోలు కేంద్రాలలో పెట్టుకుని రైతులు ఎదురుచూస్తున్నారు. రైతులు అక్కడే ధాన్యం ఎండ బెట్టుకుంటున్నారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకువెళ్లని ధాన్యం కుప్పలు కల్లాల దగ్గరే పడి ఉన్నాయి. ఈ మధ్యలో అకాల వర్షాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పంటల కోతలు దాదాపు 70 శాతం పూర్తయిన గ్రామాల్లో ధాన్యాన్ని ఏంచేయాలో రైతులకు పాలుపోవడం లేదు. ధాన్యం ఆరబెట్టినకొద్దీ తూకం నానాటికీ తగ్గిపోతున్నదని రైతులు బాధపడుతున్నారు. తాలు పట్టడానికి రైతులు వేలకు వేల రూపాయలు ఖర్చుచేయవలసి వస్తున్నది. 40 బస్తాలు శుభ్రం చేయడానికి దాదాపు రూ. 8 వేల దాకా ఖర్చవుతుంది. ప్రభుత్వం రైతులకు అనుకూలంగా వాగ్దానాలు, అనేక నియమాలు చేసినా అధికారుల ఆలస్యం, అవినీతి, బాధ్యతారాహిత్యం వల్ల ధాన్యం అమ్ముకోలేకపోతున్నారు. రైతులు వేధింపులకు గురవుతున్నారు. తేమ, తాలు ఉందని ధాన్యాన్ని మిల్లుల్లోకి కూడా రానీయడం లేదు. ప్రతిబస్తాకు కిలోనుంచి రెండు కిలోల దాకా తరుగు అంటూ దోచుకుంటున్నారని, ధాన్యం కొనకుండా ఏదోఒక నెపంతో ఆలస్యం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఒక్కొక్క రోజు ఆలస్యం అవుతుంటే రైతులకు నష్టం పెరిగిపోతూ ఉంటుంది. మిల్లర్లకు తక్కువ రేటుకు ధాన్యం అమ్ముకోక తప్పని పరిస్థితి ఏర్పడుతున్నది. దీంతో మిల్లర్లకు లాభాలు రావడం, రైతులు పూర్తిగా దెబ్బతినడం ఖాయం. బియ్యం మిల్లులు తప్పు చేస్తే కఠినచర్యలు తీసుకోవడానికి వెనుకాడమని రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ హెచ్చరించారు. తరుగు పేరుతో రైతులను ఇబ్బందులు పెడితే ఊరుకునేది లేదని గట్టిగా హెచ్చరించారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు పలు ఐకేపీ కేంద్రాలను పరిశీలించామని, ఇందులో తాలు పేరిట క్వింటాల్‌కు 3 నుంచి 6 కిలోల తరుగు తీయడం సరి కాదన్నారు. ఈ విధంగా రైతులను బ్లాక్మెయిల్ చేయొద్దని కూడా ఆయన రైస్మిల్ల ర్లకు చెప్పారు. బియ్యం మిల్లుల యజమానులతో విస్తారంగా సమావేశం జరిపారు. తమిళనాడు మూడు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కావాలని తెలంగాణను అడిగిందని, మంచి నాణ్యత కలిగిన ధాన్యాన్ని సేకరించి వారికి ఎగుమతి ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు. ఈ విధమైన డిమాండ్ ఏర్పడుతున్న దృష్ట్యా తమకు ధాన్యం విక్రయిస్తున్న రైతులకు వీలైనంత ఎక్కువ ధర ఇవ్వడానికి మిల్లర్లు ప్రయత్నించాలని కూడా మంత్రి హితవు చెప్పారు. అయితే చేసిన హామీలు, ప్రకటించిన నిబంధనలు అమలు చేయకపోతే రైతులు సంక్షోభంలో పడిపోతారని ప్రభువులు తెలుసుకోవాలి. మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
జన విశ్వాసమే మోదీ ఆయుధం
కరోనాపై యుద్ధంలో 130 కోట్ల భారతీయుల విశ్వాసమే మోదీ ఆయుధం. మోదీ ప్రజల్లో సహజసిద్ధంగా అంతర్గతంగా ఉండే మంచితనాన్ని ప్రేరేపించే ప్రయత్నం కొనసాగిస్తున్నారు. తన సందేశంలో మోదీ ప్రజలను భగవత్ స్వరూపులుగా వర్ణించి వారి మహాశక్తిని, విరాట్ స్వరూపాన్ని ప్రదర్శించమని కోరారు. కరోనా పోరాట యోధుల్ని అభినందిస్తూ కరతాళధ్వనులను చేయమన్నప్పుడు, వారికొరకు దీపాలు వెలిగించమని పిలుపు ఇచ్చిన సందర్భంలోనూ లభించిన అపూర్వ ప్రజాస్పందన మోదీ వెనుక ప్రజలు స్థిరంగా నిలబడ్డారని సూచించింది. మోదీ ప్రజలను కేవలం ఓటర్లుగానో లేక ప్రేక్షకులుగానో చూడలేదు. పాలనలో ప్రజలను పాత్రధారులుగా చేశారు. ఇది మోదీ ప్రభుత్వం ముఖ్యమైన లక్షణం. హంగేరి దేశ ప్రధాని విక్టర్ ఒర్బాన్ కరోనా వైరస్ వ్యాధి (కోవిడ్–19)పై తన పోరాటానికి పార్లమెంట్ ఆటంకపరుస్తున్నదని భావించారు. పార్లమెంటులో తనకున్న ఆధిక్యతను ఆసరాగా తీసుకుని అత్యవసర అధికారాలను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఆయన న్యాయవ్యవస్థ సమీక్షకు అవకాశం లేని ఉత్తర్వుల ద్వారా హంగేరిని పాలిం చవచ్చు. ఆయన ఉత్తర్వులను విమర్శిస్తే ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అసాధారణ సమయాల్లో అసాధారణ నిర్ణయాలు అవసరం. అందులో కొన్ని సమర్థనీయమే. కానీ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని అనువుగా తీసుకుని కొందరు నాయకులు సర్వాధికారాలు చేజిక్కిం చుకుని నియంతలుగా మారుతున్నారని విమర్శకులు పేర్కొంటున్నారు. అయితే మనం రష్యా లేక చైనా గురించి మాట్లాడటం లేదు. సాంప్రదాయిక ప్రజాస్వామ్య దేశాలైన బ్రిటన్, ఇజ్రాయెల్‌లకు కూడా విశ్వ మహమ్మారిపై పోరులో అత్యవసర అధికారాలు వాడుకోవడం తప్పలేదు. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు న్యాయస్థానాలను మూసివేయవలసిందిగా ఆదేశించారు. అవినీతి కేసులో నేర విచారణ నుండి స్వయంగా తప్పించుకోవడానికే ఈ చర్య తీసుకున్నారంటూ కొందరు విమర్శిస్తున్నారు. నెతన్యాహు దేశ అంతర్గత భద్రతా సంస్థలను పౌరులపై విస్తృత నిఘా విధించేందుకు అనుమతించారు. ఇజ్రాయెల్‌లో లాక్డౌన్ ఉల్లం ఘించిన వారికి ఆరునెలల కారాగార శిక్ష విధిస్తున్నారు. స్థిరమైన ప్రజాస్వామ్య సంస్థలు, పద్ధతులు కలిగి ఉన్న యునైటెడ్ కింగ్డమ్లో సైతం మహమ్మారి సంబంధిత బిల్లును వేగిరంగా ఆమోదింప చేసుకోవడం ద్వారా వివిధ మంత్రిత్వ శాఖలకు విశేషాధికారాలు కల్పించారు. ఈ చట్టం వ్యక్తులను కాలపరిమితి లేకుండా నిర్బంధించే అధికారాన్ని కల్పిస్తుంది. బ్రిటన్ ఆరోగ్య శాఖ కార్యదర్శి మాట్ హాంకాక్ సాధారణంగా బ్రిటన్ వ్యవహరించే తీరుకు ఇది భిన్నమైనదేనని అంగీకరించారు. ఫిలిప్పైన్స్ దేశాధ్యక్షుడు రోడ్రిగో డ్యూటీర్ట్, థాయ్ లాండ్ ప్రధానమంత్రి ప్రయూత్ చాన్ ఓచ్‌లు విశేష అధికారాలు కల్పించుకున్నారు. ఇటలీ, స్పెయిన్ దేశాలు వేలాది ప్రజ లను వేరువేరుగా ఉంచడానికి, క్వారంటైన్ చేయడానికి సైన్యంపై ఆధారపడవలసి వచ్చింది. హంగేరి, లెబనాన్, మలేసియా, పెరూ మొదలైన దేశాలు ఆంక్షలను అమలు చేయడం కోసం సైన్యాన్ని వీధుల్లోకి తీసుకురావలసి వచ్చింది. జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్లు కూడా సాయం కోసం సైన్యం వైపు చూడవలసి వచ్చింది. యునైటెడ్ కింగ్డమ్ ఇరవై వేలమంది సైనికులతో ‘కరోనా స్పందన సమూహాన్ని’ ఏర్పర్చింది. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మొదటి దశలో వ్యక్తులను విచారణ లేకుండా నిరవధికంగా నిర్బంధించే విశేషాధికారం కల్పించుకోవడానికి, దేశంలో ఆశ్రయం కోరే విదేశీయులకు చట్టబద్ధంగా ఉన్న హక్కులను రద్దు చేయడానికి ప్రయత్నం చేసినా, అమెరికన్ కాంగ్రెస్ జోక్యంతో న్యాయ మంత్రిత్వ శాఖ కోరికల చిట్టా నీరుగారింది. అమెరికా రాజ్యాంగం ప్రకారం అక్కడి రాష్ట్రాల గవర్నర్లకు లాక్డౌన్ విషయంలో సర్వాధికారాలు ఉండ టంవల్ల దేశాధ్యక్షుడు ట్రంప్ అధికారాలు కాస్తంత పరిమితమైనవిగానే ఉన్నాయి. అలా వివిధ దేశాల్లో జరుగుతున్న పరిణామాలను భారతదేశంలో జరుగుతున్న దానితో పోల్చి చూస్తే, ప్రధాని నరేంద్ర మోదీ ఎటువంటి అత్యవసర అధికారాలకోసమో, విశేషాధికారాల కోసమో అడుగలేదు. సెన్సార్షిప్ విధించడమో లేక విచారణ లేకుండా నిర్బంధించే చర్యలకో దిగలేదు. ప్రచార మాధ్యమాల గొంతు నొక్కుతున్నారంటూ వినపడుతున్న అపస్వరాలన్నీ అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నవే. సుప్రీంకోర్టు కేవలం తప్పుడు వార్తల పట్ల జాగ్రత్త వహించమని, అధికార గణాంకాలకు చోటివ్వమని మాత్రమే మీడియాను కోరింది. మోదీ సైన్యం సాయం తీసుకోవాలని అనుకోలేదు. ప్రజల ప్రాథమిక మానవ హక్కులను కొట్టిపారేయలేదు. చాలావరకు లాక్డౌన్ సూచనలన్నీ ప్రజాహితం కోరి చేస్తున్నవే. ప్రజలు స్వచ్ఛందంగా జాగ్రత్తలు పాటిస్తున్నారు. కఠిన చర్యలకు ఉపక్రమించాలని మోదీకి ఎవరో సలహా ఇవ్వకపోలేదు. మోదీ నిరంకుశ అధికారాల మీద కాకుండా, ప్రజాస్వామ్య మాధ్యమాల మీదే ఆధారపడ్డారు. తాను స్వయంగా ప్రపంచ యుద్ధం తరహా పరిస్థితిగా వర్ణించిన పరిస్థితుల్లో కూడా మోదీ మౌలిక మానవ హక్కులను ఆదరిస్తూ ప్రజాస్వామ్యవాదిగా నిలబడగలిగారు. కరోనాపై యుద్ధంలో 130 కోట్ల భారతీయుల విశ్వాసమే మోదీ ఆయుధం. ఇటీవల మోదీ జాతికి ఇచ్చిన సందేశంలో శాసనం (రాజకీయ నాయకత్వం) ప్రశాసనం (ప్రభుత్వోద్యోగులు) జనతా జనార్దన్ (దైవాంశ సంభూతులైన ప్రజలు) కరోనాపై తన పోరాట సమూహమని పేర్కొన్నారు. దేశంలో సగం రాష్ట్రాల్లో బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్నా మోదీ ఎలాంటి వ్యతిరేకతనూ ఎదుర్కోలేదు. ఇది మోదీ విశ్వసనీయత స్థాయి ఉన్నతంగా ఉందని తెలియజేస్తుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ సుయేమోల మధ్య ఇటీవల కాలంలో వాగ్వివాదం చోటు చేసుకోవడం గమనార్హం. ‘ప్రజల ద్వారా, ప్రజల కొరకు, ప్రజలచే’ ప్రభుత్వం ఉండటమే ప్రజాస్వామ్యమని గంభీర ప్రకటనలు వింటుం టాం కానీ చాలా దేశాల్లో ప్రజలచేత విషయాలు నిర్వహించడం అనేది అరుదు. కానీ మోదీ దాన్ని మార్చివేశారు. మోదీ ప్రజలను కేవలం ఓటర్లుగానో లేక ప్రేక్షకులుగానో చూడలేదు. పాలనలో ప్రజలను పాత్రధారులుగా చేశాడు. ఇది మోదీ ప్రభుత్వం ముఖ్యమైన లక్షణం. స్వచ్ఛ భారత్ పేరున పారిశుధ్యం కోసం చేసిన మొట్టమొదటి భారీ ప్రచారోద్యమం నుంచి నేటి మహమ్మారితో పోరాటం వరకు ప్రజలను ఎక్కువగా క్రియాశీల పాత్రధారులను చేసే ప్రత్యేకమైన నేర్పును మోదీ కనబరిచారు. ఫ్రాన్సిన్ ఫుకుయామా అనే రాజకీయ శాస్త్రవేత్త చట్టబద్ధమైన పాలన, చట్టంచేత పాలనల మధ్య ఆసక్తికరమైన వ్యత్యాసాన్ని పేర్కొన్నారు. రాజ్యాంగం ఏర్పర్చిన నియమాలు శిరోధార్యంగా ప్రజాస్వామ్య దేశాల్లో చట్టబద్ధపాలన సాగుతుంది. నియంతలు మాత్రం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా చట్టం అదనుగా పాలన చేయాలని చూస్తారు. మోదీ చట్టబద్ధమైన పాలన పట్ల నిబద్ధతను స్పష్టంగా కనబరిచారు. తబ్లిగీ జమాత్ మర్కజ్ అనే మతవర్గం లాక్డౌన్ నిబంధనలు ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడం, భారీ సంఖ్యలో వలస కార్మికులు తమతమ ప్రాంతాలకు తరలిపోవడం వంటి రెచ్చగొట్టడానికి ఆస్కారం ఉన్న సంఘటనలు జరిగాయి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు స్వయంగా లాక్డౌన్ నియమాలను ఉల్లం ఘించిన సంఘటనలు సైతం ఉన్నాయి. అయినప్పటికీ మోదీ తన కార్యపద్ధతి నమూనాను మార్చుకోలేదు. మోదీ ప్రజల్లో సహజ సిద్ధంగా అంతర్గతంగా ఉండే మంచితనాన్ని ప్రేరేపించే ప్రయత్నం కొనసాగిస్తున్నారు. తన సందేశంలో మోదీ ప్రజలను భగవత్ స్వరూపులుగా వర్ణించి వారి మహాశక్తిని, విరాట్ స్వరూపాన్ని ప్రదర్శించమని కోరారు. కరోనా పోరాట యోధుల్ని అభినందిస్తూ కరతాళధ్వనులను చేయమన్నప్పుడు, వారికొరకు దీపాలు వెలిగించమని పిలుపు ఇచ్చిన సందర్భంలోనూ లభించిన అపూర్వ ప్రజాస్పందన మోదీ వెనుక ప్రజలు స్థిరంగా నిలబడ్డారని సూచించింది. మోదీ విశ్వ మహమ్మారి కరోనాపై పోరును మరో స్థాయికి తీసుకుని వెళ్లారు. శాస్త్రీయ పద్ధతులను అవలంబిస్తూ, సాంకేతికతను పెద్ద ఎత్తున వినియోగిస్తూ, కరోనా వ్యతిరేక పోరులో 130 కోట్లమంది ప్రజలను పాత్రధారులను చేశారు. దూరదృష్టితో, తనదైన విలక్షణ పద్ధతిని అవలంబిస్తూ ‘మానవ కేంద్రిత అభివృద్ధి సహకారం’ అనే నమూనాను మోదీ ప్రపంచం ముందు ఆవిష్కరించారు. (వ్యాసంలో అభిప్రాయాలు వ్యక్తిగతం) రాం మాధవ్ వ్యాసకర్త బీజేపీ ప్రధాన కార్యదర్శి, ఇండియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సభ్యులు -
వలస పాలనకు ప్రతిరూపమీ చట్టం
ఒక విదేశీ శక్తి.. పాలనకు సంబంధించి విభజించి పాలించు సూత్రాన్ని కోరుకుందంటే దానికి కారణాల్ని ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. కానీ ఒక జాతీయవాద పార్టీ ఆ పని ఎందుకు చేయాలి? దేశంలోని నిజమైన సమస్యలను పరిష్కరించడంలో అసమర్థంగా వ్యవహరిస్తున్నప్పటికీ అధికారాన్ని ఎలాగోలా బలోపేతం చేసుకోవడానికేనా? ‘‘జాతీయతా స్ఫూర్తిని చైతన్యవంతంగా కలిగి ఉన్నవారు మరొకరి మత వ్యవహారాల్లో జోక్యం చేసుకోరు. అలా జోక్యం చేసుకుంటే వారు ఒక జాతిగా గుర్తించబడరు. భారత్‌లో తాము మాత్రమే ఉండాలని హిందువులు భావించినట్లయితే వారు ఒక కలల లోకంలో జీవిస్తున్నట్లే లెక్క’’ అని ఏనాడో గాంధీజీ ‘హిందూ స్వరాజ్’లో రాసిన అంశాన్ని జాతి ఎన్నటికీ మర్చిపోకూడదు. పౌరసత్వ సవరణ బిల్లు (సీఏబీ) ఇప్పుడు చట్టమైంది. న్యాయస్థానాలు ఈ చట్టాన్ని తోసిపుచ్చినా లేక దాని అమలుపై స్టే విధించినా జాతీయ రాజ్యమైన భారతదేశం స్వభావం గురించి ఇది కొన్ని కీలక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఇతర దేశాల భూభాగాల్లో అణచివేతను ఎదుర్కొంటున్న వారికి భారత్‌లో ఆశ్రయమిచ్చి, ఉపశమనం కలిగించి, పౌరసత్వాన్ని మంజూరు చేయడం అనే భావనను ఏ ఒక్కరూ వ్యతిరేకించరు. సమస్యల్లా ఏమిటంటే, భారత్ వంటి ఉదార ప్రజాస్వామిక దేశంలో ఎవరికి పౌరసత్వం ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనే అంశాన్ని మతం నిర్ణయించవచ్చా? ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ అంశంపై మూడు భావధారలు వ్యాప్తి చెందుతున్నాయి. మొదటగా, సవరణ బిల్లుకు అనుకూలంగా ఓటు వేసినవారు.. ఇరుగుపొరుగు ఇస్లామిక్ దేశాల్లో మతపర మైనారిటీలను తొక్కిపెడుతున్నారని, వీరికి రక్షణ కల్పించాలనే ప్రాతిపదికను ఎంచుకున్నారు. ఇస్లామిక్ దేశాల్లో ముస్లింలను అణిచివేయరు కాబట్టి వీరిని పౌరసత్వ సవరణ బిల్లునుంచి మినహాయించవచ్చని వీరి వాదన. శ్రీలంక హిందువులకు మినహాయింపు ఎందుకు? పైగా, ఇతరదేశాల్లో ప్రత్యేకించి శ్రీలంకలోని హిందూ, ముస్లింలకు భారత పౌరసత్వం ఇవ్వకుండా ఈ బిల్లులో ఎందుకు మినహాయించారు అంటే 1964లో నాటి శ్రీలంక ప్రధాని సిరిమావో బండారనాయకే, నాటి భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మధ్య కుదిరిన ఒప్పందం మేరకు కొన్ని లక్షల మంది శ్రీలంక తమిళులకు భారతీయ పౌరసత్వం ఇవ్వడానికి అంగీకరించారు కాబట్టి, ఇప్పుడు వారికోసం మరొక నిబంధన చేర్చాల్సిన అవసరం లేదని వీరి వాదన. పైగా, నాటి భారత, పాక్ ప్రధానులు నెహ్రూ, లియాఖత్ మధ్య 1950లో కుదిరిన ఒప్పందానికి భారత్ కట్టుబడగా, పాకిస్తాన్ దాన్ని గౌరవించలేదని వీరు వాదిస్తున్నారు. భారత్‌లోని మైనారిటీలను ఇండియా పరిరక్షిస్తూ రాగా, పాకిస్తాన్ నుంచి భారీ సంఖ్యలో హిందువులు భారత్‌కి వలస వచ్చారని వీరి వాదన. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలోని హిందువుల జనాభా శాతం బాగా తగ్గిపోతూండగా, భారత్ లోని ముస్లింల జనాభా పెరుగుతూ వచ్చిందన్న వాస్తవమే తమవాదనకు నిదర్శనం అని చెబుతున్నారు. అంటే ముస్లింలు కోరుకుంటే ఇస్లామిక్ దేశాల్లో ఆశ్రయం తీసుకోవచ్చు కానీ ఇతర దేశాల్లో అణచివేతకు గురైన హిందువులు మాత్రం ఆశ్రయం కోరి భారత్‌కి మాత్రమే రాగలరు కాబట్టి వారి పట్ల జాతి సానుభూతితో ఉండాలని వీరు చెబుతున్నారు. ఇక రెండోవాదన ఈశాన్య భారత రాష్ట్రాల్లో పౌరసత్వ సవరణ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వారి నుంచి వస్తోంది. భారతదేశంలోకి ఏ మతానికి సంబంధించినవారైనా సరే.. వలస రావడాన్ని వీరు వ్యతిరేకిస్తున్నారు. వలసలు వెల్లువెత్తితే తమ ప్రాంతం వనరులను ఊడ్చేస్తారని, తమ భాష, సంస్కృతి కూడా క్షీణించిపోతుందని వీరి భయం. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన బెంగాలీలు ఈ రాష్ట్రాల్లో ఇప్పటికే జనాభా స్వరూపాన్ని ప్రభావితం చేశారు. ఇప్పుడు పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేస్తే వలసలు మరింతగా పెరిగి స్థానిక ప్రజలు అస్తిత్వాన్నే కోల్పోయే ప్రమాదముందని వీరి భావన. అందుకే వలస వచ్చే విదేశీయులను దేశంలోని ఇతర ప్రాంతాల్లో సర్దుబాటు చేస్తే ఈశాన్య రాష్ట్రాల ప్రజల భయాలు చాలావరకు సద్దుమణుగుతాయి. దేశంలో పేలవమైన పాలన, జాతీయ పౌర పట్టిక అమలు సమయంలో తలెత్తిన కల్లోల పరిస్థితుల వల్ల ఈశాన్య రాష్ట్రాల ప్రజలు తమకు కేంద్రప్రభుత్వం ఇచ్చిన హామీలపై విశ్వాసం చూపడం లేదు. ఇక్కడి స్థానిక ప్రజలు కానీ, హిందువులు, ముస్లింలు కానీ రానున్న సంవత్సరాల్లో తమకు న్యాయం జరుగుతుందని విశ్వసించడం లేదు. పైగా, ఈశాన్య రాష్ట్రాల్లోని ఆర్థిక దుస్థితి రీత్యా, ఇప్పటికే తక్కువగా ఉన్న ఉద్యోగాలను వలస ప్రజలు కొల్లగొడతారని, స్థానికుల ఆర్థిక అవకాశాలను తగ్గించివేస్తారని ప్రజలు భయపడుతున్నారు. దేశ లౌకిక, సామాజిక నిర్మాణంపైనే దాడి ఇక మూడో వాదన మతపరమైన వివక్ష ప్రాతిపదికన పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్న వారినుంచి వస్తోంది. ఈ బిల్లు నుంచి ముస్లింలను మినహాయించాలని వీరు కోరుకోవడం లేదు. పైగా ఈ చట్టం దేశ లౌకిక సామాజిక నిర్మాణంపైనే దాడిగా వీరు భావిస్తున్నారు. పొరుగుదేశాలనుంచి అణచివేత కారణంగా భారత్‌కు వస్తున్నవారు మతపర కారణాలతోటే కాకుండా జాతి, భాషా పరమైన కారణాల వల్ల కూడా వలస వస్తున్నారని వీరి వాదన. దారిద్య్రం వంటి ఆర్థిక కారణాలే వలసలను ప్రభావితం చేస్తుం టాయి. పైగా బలహీనపడుతున్న ఆర్థిక వ్యవస్థ నుంచి దృష్టి మరల్చడానికి పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకువచ్చారని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. పైగా ఈ చట్టం దేశంలో మతపరమైన విభజనను మరిం తగా పెంచి ముస్లిం కమ్యూనిటీని ఏకాకులను చేస్తుంది. దేశంలో మతతత్వపరమైన వాతావరణం పెరుగుతున్న తరుణంలో మైనారిటీలు అణచివేతకు పాలబడి రెండో తరగతి పౌరులుగా వ్యవహరించబడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో దేశంలో ఏ ముస్లిం పైన అయినా విదేశీయుడిగా ముద్రవేయడమే కాకుండా తాము విదేశీయులం కామని వారే నిరూపించుకోవలసి ఉంటుంది. జాతీయ పౌర పట్టీ ప్రక్రియ సమయంలో ఈశాన్య రాష్ట్రాల్లో చాలామంది తగిన డాక్యుమెంటేషన్ కలిగిలేరు. ఇలాంటి వ్యక్తులను పొరుగుదేశాలు అంగీకరించవు కాబట్టి వీరిని శాశ్వతంగా నిర్బంధ శిబిరాల్లోనే ఉంచాల్సి వస్తుందేమో అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పైగా ఇలాంటి వారి జనాభా కూడా అధికంగా ఉంటోంది. పైగా నిర్బంధ శిబిరాలను ఏర్పర్చి అసంఖ్యాక ప్రజలను వాటిలో పెట్టి నిర్వహించడం భారీ ఆర్థిక భారాన్ని మోపుతుంది. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ స్థితి కారణంగా ఇంత అదనపు భారాన్ని మోయడం సాధ్యమేనా? ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల వల్ల మదుపు, ప్రత్యేకించి విదేశీ మదుపులు వెనక్కి పోతాయి. దీనివల్ల ఇప్పటికే మాంద్యంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారిపోయే ప్రమాదముంది. మరోవైపున ఎన్నికల మేనిఫెస్టోలో తాము చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తున్నామని బీజేపీ వాదిస్తోంది. ఒక పార్టీ ఎన్నికల ప్రణాళికలో హామీ ఇస్తే అధికారంలోకి వచ్చాక దాని పూర్వాపరాలను పట్టించుకోకుండా దాన్ని అమలు చేయవలసిందేనా? పైగా కేంద్రం లోని మోదీ ప్రభుత్వం చాలా వాగ్దానాలు చేసింది. కానీ అవి అమలుకు నోచుకోలేదు. పైగా ఎన్నికల సమయంలో చేసిన వందలాది హామీలలో ఒక ప్రత్యేక హామీ కోసం ప్రజలు పార్టీలకు ఓటు వేయరు కూడా. పైగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయానికి పౌరసత్వ సవరణ చట్టం కారణం కాదు. అనేక ఇతర అంశాలు, ప్రత్యేకంగా ఆర్థిక దుస్థితిని నేర్పుగా పక్కన బెట్టేశారు. అందుకే పాలకపార్టీ హిందూ అనుకూల, ముస్లిం అనుకూల వైఖరిలలో ఏదో ఒకదానిని ప్రజలు స్వీకరించే ఎజెండాతో పనిచేస్తోందా? ఏకజాతిగా మనుగడ సాగించలేం! గాంధీజీ 150వ జయంతి ఉత్సవాలను భారత్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆనాడు హిందూ స్వరాజ్‌లో ‘‘ది హిందూస్ అండ్ మహమ్మదియన్స్’ పదవ అధ్యాయంలో గాంధీ ఇలా చెప్పారు. ‘భారత్ ఏక జాతిగా మనుగడ సాగించలేదు. ఎందుకంటే అనేక మతాలకు సంబంధించిన ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. విదేశీయులు ప్రవేశించడం అనే ఒక్క కారణం జాతిని ధ్వంసం చేయలేదు. వారు దేశంలో భాగం అవుతారు... జాతీయతా స్ఫూర్తిని చైతన్యవంతంగా కలిగి ఉన్నవారు మరొకరి మత వ్యవహారాల్లో జోక్యం చేసుకోరు. అలా జోక్యం చేసుకుంటే వారు ఒక జాతిగా గుర్తించబడరు. భారత్‌లో తాము మాత్రమే ఉండాలని హిందువులు భావించినట్లయితే వారు ఒక కలల లోకంలో జీవిస్తున్నట్లే లెక్క’’ అందుచేత, దేశాన్ని మతపరంగా విభజించి పాలించాలనే బ్రిటిష్ వలస పాలకుల అసంపూర్ణ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి ఇప్పుడు మనం మతపరంగా విభజించే ఎజెండాను అమలు చేసుకుంటూ పోతున్నామా? ఒక విదేశీ శక్తి విభజించి పాలించు సూత్రాన్ని కోరుకుందంటే దానికి కారణాల్ని ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. కానీ ఒక జాతీయవాద పార్టీ ఆ పని ఎందుకు చేయాలి? దేశంలోని నిజమైన సమస్యలను పరిష్కరించడంలో అసమర్థంగా వ్యవహరిస్తున్నప్పటికీ అధికారాన్ని ఎలాగోలా బలోపేతం చేసుకోవడానికేనా? అరుణ్ కుమార్ (ది వైర్ తోడ్పాటుతో) వ్యాసకర్త మాల్కొమ్ ఎస్ ఆదిశేషయ్య చైర్ ప్రొఫెసర్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, రచయిత -
మీకిది తగునా?
‘బోలెడంత మంది బ్లాక్ మెయిల్ చేస్తున్నారు... వసూళ్లు నడుస్తున్నాయి’ అని ఆర్టీఐ గురించి మన దేశంలో సర్వోన్నత న్యాయమూర్తి బోబ్డేగారు సెలవిచ్చారు. జస్టిస్ బి ఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ తో కలిసి ప్రధాన న్యాయమూర్తి ఎస్ ఎ బోబ్డే ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారిస్తున్నారు. ఇదివరకు సుప్రీంకోర్టు అంజలీ భరద్వాజ్ కేసులో సమాచార కమిషనర్ల నియామకంలో ఆలస్యం చేయరాదని ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు ఆ తీర్పులో ఇచ్చిన సూచనలు అమలు చేయడం లేదని కేంద్రంగానీ రాష్ట్రాలు గానీ సమాచార కమిషనర్లను నియమించడం లేదని న్యాయార్థులై నిలబడ్డారు. కోర్టుకు వెళ్లి ఆదేశాలు తెచ్చుకుంటే తప్ప ప్రభువులు నిశ్చర్య నుంచి నిద్రనుంచి మేలుకోవడం లేదు. ఆర్టీఐని బ్లాక్ మెయిల్ కోసం వాడుకుంటున్నారనేది ఆరోపణ. అందులో కొంత నిజం ఉందా లేదా అనడానికి సర్వే లేదు సాక్ష్యం లేదు. బ్లాక్ మెయిల్ అంటే ఏమిటి? లంచం తీసుకోవడం వంటి ఒక తప్పు చేసి దాచిపెట్టిన అధికారి అక్రమాల సమాచారం సేకరించి బయట పెట్టడానికి ఆర్టీఐ కార్యకర్త ప్రయత్నించి ఆ పని ఆపడానికి డబ్బు అడిగినా, అతను అడగకపోయినా ఆ అధి కారి డబ్బు ఇచ్చి కప్పిపుచ్చడానికి ప్రయత్నించినా అది నేరమే. ఆ నేరానికి వారిద్దరికీ శిక్షలు విధించాల్సిందే. కానీ ఆ విధంగా బ్లాక్ మెయిల్ చేయకుండా ఉండేందుకు ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించే శక్తి పైన కోతలు విధిస్తానంటే ఎంత వరకు సమంజసం. ఒక సందర్భంలో అవినీతి పరుడైన ఒక ఇంజనీరు ఢిల్లీ ఫ్రభుత్వంలో లంచాలు తీసుకుని అందుకు అనుగుణంగా కాంట్రాక్టు ఫైళ్లను మార్చాడని తెలుసుకున్న ఒక ఆర్టీఐ కార్యకర్త ఆ ఫైల్ కాగితాల ప్రతులను సేకరించారు. దాంతో ఆ అధికారి పదివేలు లంచం ఇవ్వడానికి సంసిద్ధుడై నాడు. లంచం ఇవ్వజూపిన సంభాషణలను రికార్డు చేసి ఆ ఆర్టీఐ కార్యకర్త రెండో అప్పీలులో ఆ విషయమై ఫిర్యాదు చేశాడు. లంచం ఇవ్వబోయిన ఆ ప్రభుత్వ అధికారిపైన చర్య తీసుకోవాలని కోరాడు. సంభాషణ రికార్డు ఉన్న సీడీని కూడా కమిషన్‌కు సమర్పించాడు. లంచం ఇచ్చినా నేరమే తీసుకున్నా నేరమే. కానీ అది ప్రభుత్వ అధికారి విషయంలో, ప్రభుత్వ కార్యక్రమం విషయంలో నేరమవుతుంది. ఆర్టీఐ కింద సమాచారం అడగకుండా ఉండడానికి మామూలు పౌరుడికి లంచం ఇవ్వడానికి ప్రభు త్వం అధికారి ప్రయత్నిస్తే, లేదా ఇచ్చినట్టు తేలిన తరువాత కూడా అతని పైన ఏ చట్టం కింద చర్య తీసుకోవాలి? అవినీతి నిరోధక చట్టాలలో ఇటువంటి లంచ గొండితనాన్ని శిక్షించేందుకు ఏ నియమాలు చట్టాలూ లేవు. పౌరుడికి ప్రభుత్వేతర పనికోసం ప్రభుత్వ అధికారి లంచం ఇవ్వడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ మరో చట్టం తెస్తే అందుకు వీలవుతుంది. లేకపోతే ఏం చేయాలి? ఎప్పుడూ జనం నుంచి లంచాలు వసూలు చేసే ప్రభుత్వ అధికారి పౌరుడికి లంచం ఇచ్చే పరిస్థితి రావడం ఒక వింత, విచిత్రం, రాజ్యాంగపాలన అమలైన 70 సంవత్సరాల కాలంలో ఇటువంటి సంఘటన ఎప్పుడూ జరగలేదు. ఇందుకు సంతోషించాలో గర్వించాలో ఆలోచించుకోవచ్చు. లంచం ఇవ్వకుండా లంచగొండి అధికారిని రక్షించాలన్నది మన లక్ష్యం కాదు. ఆర్టీఐ దుర్వినియోగం పేరుతో కొందరు బ్లాక్ మెయిల్ చేస్తున్నారనే ప్రచారంతో మనం ఆర్టీఐ కార్యకర్తలను నిరోధించడానికి ఈ చట్టాన్ని సవరించి, పరిమితులు విధించి, ఈ హక్కు ను నీరసించేట్టు చేస్తే అది ధర్మమని అంటారా? అది న్యాయమా? 130 కోట్ల మంది ప్రజలలో కేవలం 3 కోట్ల యాభై లక్షల మంది దాకా ఆర్టీఐ వాడుకున్నారని, వారిలో చాలామంది సమాచారం పొందారని, పది పదిహేను శాతం వరకు సమాచారం కోసం కోర్టులకెక్కి పోరాడవలసి వస్తున్నదని ఒక అంచనా. అంటే మన జనాభాలో కేవలం రెండు లేదా మూడు శాతం మంది సమాచార హక్కును విని యోగించుకుంటేనే ఇంతమంది ఇంతగా భయపడుతున్నారంటే ఆశ్చర్యం వేస్తుంది. మన స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను రక్షించే ఒకే ఒక ఉత్తమ ఉన్నత సంస్థ న్యాయస్థానం. అంటే సుప్రీంకోర్టు. కానీ ఆ సర్వోన్నత న్యాయపీఠం కూడా సమాచార హక్కు గురించి ఇంతగా చర్చించడం, ధర్మాసనం నుంచి ఇటువంటి తీవ్ర వ్యాఖ్యలు చేయడం ఏ పరిణామాలకు సంకేతం? మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్,కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
వ్యవసాయానికి ఉద్దీపన వద్దా?
గ్రామీణ కుటుంబాల ఆర్థిక పరిస్థితి క్షీణిస్తోందని అన్ని జాతీయ స్థాయి నివేదికలూ సూచిస్తున్నాయి. కానీ ఆర్థికవేత్తలు మాత్రం నిరుపేదలను ఆదుకోకుండా ఉండటం ఎలా అనే అంశంపై రెండుగా చీలిపోయి ఉన్నారు. ఆర్థిక మందగమనం అనే వ్యాధికి చికిత్స మాత్రం నిచ్చెనమెట్ల మీద ఉన్నవారికే అందించాలని వీరు సూచిస్తున్నారు. దేశ జనాభాలో 50 శాతానికి పైగా ప్రజలకు ఆలంబనగా ఉంటున్న వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోతున్నప్పుడు ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం కూడా తీవ్రంగానే ఉంటుంది. అందుచేత వ్యవసాయాన్ని పునరుద్ధరించడమే కీలక విషయం. ప్రస్తుతం భారతీయ ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక ఉద్దీపన అవసరం ఏ రంగానికైనా ఉంది అంటే అది వ్యవసాయ రంగం మాత్రమే. పేదల చేతికి ఎంత ఎక్కువగా డబ్బు అందిస్తే అంత ఎక్కువగా దేశంలో డిమాండ్ సృష్టించవచ్చు. ఇదే ఇప్పుడు అత్యంత అవసరమైన చర్య. దశాబ్దాలుగా భారతీయ వ్యవసాయం దుస్థితి బాటలో సాగుతోందని సంకేతాలు స్పష్టంగా కనబడుతున్నాయి. దేశ ప్రజలు వినియోగంపై వెచ్చిస్తున్న వ్యయంపై, లీక్ అయిన ‘నేషనల్ సాంపిల్ సర్వే ఆఫీసు (ఎన్ఎస్ఎస్ఓ) 2017–18’ నివేదిక ప్రకారం గ్రామీణ కుటుంబాలు ఆహా రంపై అతితక్కువగా ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వం బుట్ట దాఖలు చేయాలని నిర్ణయించిందనుకోండి. పోతే ‘2016 ఎకనమిక్ సర్వే’ మరింత చేదు వార్తను తెలిపింది. దేశంలోని 17 రాష్ట్రాల సగటు వ్యవసాయ కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ. 20,000కు మించి లేదట. అంటే వ్యవసాయ కుటుం బాలు రోజువారీ వినియోగంపై ఎంత తక్కువగా ఖర్చుపెడుతున్నాయో దీన్నిబట్టే తెలుస్తుంది. ‘వినియోగ వ్యయంపై సర్వే’ ప్రకారం, గ్రామీణ ప్రాంతాల్లో ఆహారంపై నెలకు సగటున ఒక కుటుంబం రూ. 580 లు (రోజుకు 19 రూపాయలు) మాత్రమే ఖర్చుపెడుతోందని వెల్లడించగా, ఎకనమిక్ సర్వే మరింత ఆసక్తికరమైన డేటాను బయటపెట్టింది. వ్యవసాయ కుటుంబాలు అమ్మగలుగుతున్న ఉత్పత్తులపైనే కాకుండా గృహ వినియోగం కోసం వారు భద్రపర్చుకున్న ఆదాయాన్ని కూడా కలుపుకుని రైతు కుటుంబాల ఆదాయాన్ని అది వెల్లడించింది. దేశం లోని వ్యవసాయ కుటుంబాలు నెలకు రూ. 1,700 కంటే తక్కువ ఆదాయ స్థాయిలతో ఎలా జీవిస్తున్నాయా అని ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. వ్యవసాయ ధరలు కనిష్టస్థాయిలో ఉంటూండగా, వ్యవసాయ ఆదాయాలు 14 ఏళ్ల కనిష్టస్థాయికి పడిపోయాయి. ఇక వ్యవసాయ వేతనాలు కూడా గత కొన్నేళ్లుగా పతనమవుతూ వస్తున్నాయి. లీకైన మరొక డాక్యుమెంట్ ‘పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2017–18’ నివేదిక ఇంకా దారుణమైన విషయం బయటపెట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో 3.4 కోట్ల మంది దినసరి కూలీలు 2011–18 మధ్య కాలంలో తమ ఉపాధిని కోల్పోయారు. వీరిలో 3 కోట్లమంది వ్యవసాయ కూలీలే. గత 45 ఏళ్లలో నిరుద్యోగం పరాకాష్టకు చేరుకోవడంతో సంక్షోభం వ్యవసాయ పరిధిని దాటిపోయింది. ఈ అన్ని నివేదికలూ గ్రామీణ కుటుంబాల ఆర్థిక పరిస్థితి క్షీణిస్తోందని సూచిస్తున్నాయి. రైతు కుటుంబాల ఆర్థిక సంపన్నతా లేమి అనేది భవిష్యత్తులో గ్రామీణ వ్యయంపై కూడా తన ప్రభావం చూపనుంది. అయితే ఆర్థికవేత్తలు మాత్రం అధోజగత్ సహోదరులను ఆదుకోకుండా ఉండటం ఎలా అనే అంశంపై రెండుగా చీలిపోయి ఉన్నారు. బలహీనమైన వినియోగదారీ డిమాండ్, ప్రైవేట్ పెట్టుబడులు మందగించిపోవడం అనే రెండు ప్రధాన అంశాలే ఆర్థిక వ్యవస్థను మందగింప జేస్తున్నాయని ప్రధాన స్రవంతి ఆర్థిక వేత్తలు ఒప్పుకుంటున్నారు. వీటివల్లే ఈ జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో దేశీయ ఆర్థిక వృద్ధి రేటు 4.5 శాతానికి పడిపోయింది. అంటే ఆరేళ్లలో ఇది అత్యంత తక్కువ వృద్ధి రేటు అన్నమాట. కానీ ఆర్థిక మందగమనం అనే వ్యాధికి చికిత్స మాత్రం నిచ్చెనమెట్ల మీద ఉన్నవారికే అందించాలని వీరు సూచిస్తున్నారు. అయితే పారిశ్రామిక సంస్థలు మాత్రం ఆర్థిక మందగమనాన్ని అవకాశంగా మల్చుకోవాలని చూస్తున్నాయి. చౌక శ్రమ, సరళతరమైన భూ సేకరణ, కార్పొరేట్ పన్ను తగ్గింపు, పన్నుల ఉగ్రవాదాన్ని తొలగించడం, దివాలా సమస్యలను సత్వరం తీర్చడం వంటి వాటి రూపంలో మరిన్ని సంస్కరణలను అమలు చేసేలా వ్యవస్థను ప్రభావితం చేయాలని ఇవి చూస్తున్నాయి. దీనికోసం సెక్టర్ ఆధారిత ఉద్దీపన కోసం పట్టుబడుతున్నాయి.పిరమిడ్ పునాదిపైనే మరింత దృష్టి పెట్టాలనే అంశాన్ని ప్రధాన స్రవంతి ఆర్థికవేత్తలు అంగీకరిస్తుండగా, మరింత సంస్కరించడం ద్వారానే ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలని కొంతమంది ఆర్థిక వేత్తలు సూచిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థను ముందుకు నెట్టాలంటే కార్పొరేట్ పన్ను ఉద్దీపన, రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్ సెక్టార్, బ్యాంక్ కన్సాలిడేషన్, మూలధన సేకరణ, ఎగుమతి ప్రోత్సాహకాలు, మైక్రో, చిన్నతరహా, మధ్య తరహా పరిశ్రమలకు కొన్నిరాయితీలు కల్పించడం అవసరమని వీరు చెబుతున్నారు. కొందరు ఆర్థికవేత్తలయితే ఇప్పటికే సంపదల మేట మీద సౌకర్యవంతంగా కూర్చున్న కొన్ని పరిశ్రమలకు పన్ను విధింపును ఎందుకు ఎత్తివేయాలని ప్రశ్నించారు. కుంగిపోతున్న ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకుపోవడానికి ఇది మార్గం కానే కాదని వీరు చెబుతున్నారు. ఇప్పటికే జీడీపీ 5 శాతం లోపు పడిపోయిన నేపథ్యంలో కార్పొరేట్ పన్ను రేటును భారీగా తగ్గించడం, ప్రతి సంవత్సరం 1.45 లక్షల కోట్ల ఉద్దీపనను అందించడం అనేది పన్ను రూపేణా వచ్చే ప్రభుత్వ రాబడిని మరింత బలహీన పరుస్తుంది. పన్ను రాయితీలు గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టులలో మరిన్ని పెట్టుబడులను కల్పించి వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తాయని, ఇది మరిన్ని ఉద్యోగాల కల్పనకు దారితీస్తుందని చేస్తున్న వాదనను అంతర్జాతీయ అనుభవం తోసిపుచ్చుతోంది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక తగ్గించిన కార్పొరేట్ పన్నులు అటు పెట్టుబడులనూ తీసుకురాలేదని, ఇటు ఉద్యోగాలనూ కల్పించలేదని పైగా పన్నుల తగ్గింపు ద్వారా మిగిలిన మొత్తాన్ని కార్పొరేట్ రంగం స్టాక్ మార్కెట్లో మదుపు చేసిందని నోబెల్ గ్రహీత పాల్ క్రూగ్మన్ స్పష్టం చేశారు. కార్పొరేట్ పన్నులు భారీగా తగ్గిస్తున్నట్లు కేంద్రం ప్రకటించగానే ఆ మరుసటి దినం భారతీయ స్టాక్ మార్కెట్లు పండుగ చేసుకున్నాయంటే ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. ఆ సంబరాలు ఇంకా కొనసాగుతుండగా, పన్ను రేటు తగ్గింపు తర్వాత విదేశీ నిధుల ప్రవాహం పెరుగుతూ వచ్చింది. కానీ, కేవలం 5 రూపాయల బిస్కెట్ కూడా కొనలేకపోతున్న చాలామంది పేదవారి గురించీ, అష్టకష్టాలు పడి పండిం చిన పంటను మార్కెట్లో తగిన ధరకు అమ్ముకోలేకపోతున్న రైతుగురించీ, దినసరి వేతనాలను కూడా పొందడం కష్టమైపోతున్న వ్యవసాయ, వ్యవసాయేతర కూలీల గురించే నేను ఆందోళన చెందుతున్నాను. ఇక వ్యవసాయరంగంలో నిరుపేదలకు ఎలాంటి ప్రోత్సాహకాలనూ కేంద్రం ప్రకటించడం లేదు. గిట్టుబాటు ధర లేమితో 2000–2017 మధ్య 16 ఏళ్ల కాలంలో రూ. 45 లక్షల కోట్లను రైతులు నష్టపోయారు. కాగా గత రెండేళ్లలో వ్యవసాయ రంగ నిజ ఆదాయాల పెరుగుదల దాదాపుగా జీరోగా ఉంటోందని నీతి ఆయోగ్ సొంత అంచనాలే చూపుతున్నాయి. మరోమాటలో చెప్పాలంటే, గత రెండు దశాబ్దాలుగా రైతుల ఆదాయాలు పతనబాటలోనే నడుస్తున్నాయి. వ్యవసాయ వేతనాల్లో వృద్ధి రేటు కూడా పడిపోతోంది. దేశ జనాభాలో 50 శాతానికి పైగా ప్రజలకు ఆలంబనగా ఉంటున్న వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోతున్నప్పుడు ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం కూడా తీవ్రంగానే ఉంటుంది. అందుచేత వ్యవసాయాన్ని పునరుద్ధరించడమే కీలక విషయం. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక ఉద్దీపన అవసరం ఏ రంగానికైనా ఉంది అంటే అది వ్యవసాయ రంగం మాత్రమే. రైతులకు పరిహారం చెల్లించాల్సిన సమయం కూడా నేడు ఆసన్నమైంది. పారిశ్రామిక రంగానికి రూ.1.45 లక్షల కోట్ల రూపాయల పన్ను రాయితీని కేటాయించినప్పుడు, అదే మొత్తాన్ని వ్యవసాయ రంగానికి కూడా అందిస్తే ప్రధానమంత్రి కిసాన్ స్కీమ్ కింద ఇప్పుడు ఇస్తున్న మొత్తాన్ని ప్రతి రైతు కుటుంబానికి మూడు రెట్లు పెంచి ఇవ్వవచ్చు. అంటే సంవత్సరానికి ఒక్కో రైతుకు రూ. 18,000లు, లేక నెలకు రూ. 1,500లు ఇవ్వవచ్చు. ఈ పథకాన్ని భూమి లేని రైతుకూలీలకు కూడా పొడిగించవచ్చు. ఇప్పటికే పీఎం–కిసాన్ పథకం కింద రూ. 75,000ల కోట్లు కేటాయించారు. దీనికి మరొక రూ. 1.45 లక్షల కోట్లను అదనంగా చేర్చి ఇవ్వాల్సి ఉంది. పేదల చేతికి ఎంత ఎక్కువగా డబ్బు అందిస్తే అంత ఎక్కువగా డిమాండ్ సృష్టించవచ్చు. ఈ చర్యలతోపాటు ప్రభుత్వ ధాన్యసేకరణను మరింత సమర్థవంతంగా చేయడానికి వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ అజమాయిషీలో నడిచే మండీల నెట్వర్క్ని విస్తరించాలి. అన్ని రకాల పంటలకు కనీస మద్దతు ధరకు ప్రకటించిన మేరకు హామీ ఇవ్వాలి. లోటును చెల్లించడం ద్వారా కనీస మద్దతు ధర, మార్కెట్ ధరలకు మధ్య వ్యత్యాసాన్ని తగ్గించాలి. వీటికి అదనంగా కేరళ అనుభవం నుంచి పాఠాలు తీసుకుని ప్రతి రాష్ట్రంలోనూ రుణ ఉపశమన కమిషన్‌ను ఏర్పర్చాలి. గ్రామీణ రహదారులు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు వంటి ప్రజా రంగ సేవలపై అధిక మదుపును చేయాలి. దేవీందర్ శర్మ వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
ఉపాధినివ్వని చదువులు
ఇంట్లో కరెంటు పోతే ఫ్యూజు సైతం వేయలేరు. కానీ వాడు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిగ్రీ పుచ్చేసుకుంటాడు. దానికి కారణం ఏమిటీ అంటే మన విద్యాప్రమాణాలు. అవే మన పిల్లల సామర్థ్యాన్ని ఏబీసీడీలకు కుదించేసాయి. ఈ రోజు చాలా మంది ఆడపిల్లలు కుటుంబ పరిస్థితులను మెరుగుపర్చుకునేందుకో, ఉన్న దారిద్య్రాన్ని తరిమికొట్టేందుకో లేక తమ పరిస్థితుల్లో ఇసుమంతైనా మార్పు వస్తుందనో ఉన్నత విద్యను ఆధారం చేసుకొని జీవితగమనాన్ని ఉన్నతదిశలో కొనసాగేందుకు సర్వవిధాలా ప్రయత్నిస్తున్నారు. అలాగే మగ పిల్లలు ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువుతున్నారు. వీరు కూడా గ్రూప్–2 లేక ఉన్నతోద్యాగాలు ఆశిస్తున్నవారే కావడం మనం గమనించాలి. ఆయా ఉద్యోగాల వల్ల వచ్చే ఆదాయంతో కుటుంబాలు ఓ మేరకైనా బాగుపడతాయనీ, ఆ ఉద్యోగాలు తమకు వ్యక్తిగత గౌరవాన్ని కూడా తెచ్చిపెడతాయనీ గుండెలనిండా ఆశతో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకుంటున్నారు వాళ్ళు. అలా ఆశపడటం తప్పేమీకాదు. కానీ ఆయా ఉద్యోగాలకు సెలక్ట్ అవుతున్న వాళ్ళెందరు? అతి కొద్ది మందేనన్నది మనందరికీ తెలుసు. మిగిలిన వాళ్లందరూ కూడా టీచర్ పోస్టులకోసమో, లేక కండక్టర్ ఉద్యోగాలకోసమో, అదీకాదంటే కానిస్టేబుల్ ఉద్యోగాల కోసమో పోటీపడుతున్నారు. అయితే ఎంఏ, ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు కూడా ఈ చిన్న చిన్న ఉద్యోగాలకు సెలక్ట్ అవడం లేదు. దానికి కారణం మన విద్యాప్రమాణాలే.యేళ్ళకేళ్ళు చదివేస్తున్నారు. డిగ్రీలు సంపాదించేస్తున్నారు. కానీ ఆ డిగ్రీల ఫలితాలను మాత్రం యువతరం అందుకోలేక పోతోంది. పిల్లలు ఒక మంచి వ్యాసం రాయలేకపోతున్నారు. ఇంట్లో కరెంటు పోతే ఫ్యూజు సైతం వేయలేరు. కానీ వాడు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిగ్రీపుచ్చేసుకుంటాడు. దానికి కారణం ఏమిటీ అంటే మన విద్యాప్రమాణాలు. అవే మన పిల్లల సామరథ్యన్ని ఏబీసీడీలకు కుదించే సాయి. స్వల్ప సమాధానాల పరిధిలో మన పిల్లల మస్తిష్కాలు కుంచించుకుపోతున్నాయి. పోటీ పరీక్షలను సమర్థవంతంగా ఎదుర్కొనే తార్కిక జ్ఞానాన్ని అందించాల్సిన విద్యాలయాలు, విశ్వవిద్యాలయాలు సైతం అరకొరా జ్ఞానాన్ని అందిస్తున్నాయి. లేదా విద్యార్థులే పరిశోధనాత్మకంగా విషయాన్ని అవగాహన చేసుకునే ఆవశ్యకతను బోధించక పోవడం ఈ పర్యవసానాలకు దారితీస్తోంది. కాబట్టే ఏ పోటీ పరీక్షలనూ ఎదుర్కోలేక, ఉన్నత చదువులు చదివి కూడా ప్రత్యేక శిక్షణ కోసం వెంపర్లాడాల్సిన పరిస్థితి ఎదురౌతోంది. నిజానికి ఓ పిల్లవాడు ఏం ఆశించి ఆ కోర్సు చదువుతున్నాడో, ఆ సబ్జెక్టుని ఏదో వాసన చూపించడం కాకుండా, పరిపూర్ణంగా సబ్జెక్టు వాడి బుర్రలోకెక్కేలా మన యూనివర్సిటీల విద్యాప్రమాణాలు ఉండాలి. అప్పుడే ఆ విద్యార్థి ఆశించిందీ, యూనివర్సిటీ అందించేదీ, బయట సమాజానికి అవసరమైనదీ మూడింటి మధ్యనా సారూప్యత సాధ్యం అవుతుంది. విశ్వవిద్యాలయాలే ఉపాధి కారకాలు కాగలిగినప్పుడు తామరతంపరగా పుట్టుకొచ్చి, పేద విద్యార్థులను పీల్చి పిప్పి చేసే కోచింగ్ ఇనిస్టిట్యూట్ల అవసరం ఉండదుగాక ఉండదు. యూనివర్సిటీ చదువు పిల్లలకు ఉపాధిరంగంలో అడుగిడే సామర్థ్యాన్ని అందివ్వగలగాలి. ఇతర దేశాల్లో విశ్వవిద్యాలయ చదువే ఉద్యోగావసరాలకు కూడా పనికొస్తుంది. అక్కడెక్కడా ఉద్యోగాల కోసం ప్రత్యేకమైన శిక్షణ లేదు. కానీ మన దేశానికొచ్చేసరికి యూనివర్సిటీ చదువులు వేరు. ఉద్యోగావకాశాలు వేరు. కాబట్టి పిల్లల్లో ఎంఎ చదువుకున్నా, ఇంజనీరింగ్ చేసినా సంతృప్తి దొరకడం లేదు. మొత్తంగా విద్య సమాజాభివృద్ధికి దోహదపడే మానవ మేధస్సును తయారుచేయాలి. ఓ పనిముట్టు మాదిరిగానో, రోబో మాదిరిగానో ఏది ఫీడ్ చేస్తే అది మాత్రమే వల్లెవేసే యంత్రంగా తయారు చేయకూడదు. సొంత పరిజ్ఞానాన్నీ, ఆ పరిజ్ఞానాన్ని మెరుగుపరుచుకుంటూ మరింత మెరుగైన ఫలితాలను పొందే సరికొత్త ఆవిష్కరణలకూ ఆ చదువు ఊపిరిపోయాలి. డిగ్రీలు కుప్పలు తెప్పలుగా కుమ్మరించడం వల్ల ఫలితం ఉండదు. ఉద్యోగాలు రావు, ఏ ఉపయోగాలూ ఉండవు. అలాగే ఎంఎ చదువుకుని కండక్టర్ ఉద్యోగానికో, లేదా కానిస్టేబుల్ ఉద్యోగానికో ఎదురుచూసే పరిస్థితి అక్కర్లేదు. అవకాశాల్లేని వారూ, ఏ పదితోనో సరిపెట్టుకుని టెంత్ సర్టిఫికెట్తో సాధించే ఉద్యోగాలకోసం వేటలో పడుతున్న వారు ఒకవైపు ఉంటే, ఉన్నత విద్యనభ్యసించి టెంత్ క్వాలిఫికేషన్‌తో వచ్చే ఉద్యోగాలకోసం ఎదురుచూడటమంటే అది మన వైఫల్యం కాదా అన్నది నా ప్రశ్న. కానిస్టేబుల్ కావాలనుకోవడంలో కానీ, నర్స్ వృత్తి లాంటి సేవాభావం గల వృత్తిని ఎంపిక చేసుకోవడంలో కానీ తప్పేం లేదు. వాటిక్కూడా అంటే, చిన్నా చితకా ఉద్యోగాలకు సైతం గ్రాడ్యుయేట్స్ పోటీ పడే పరిస్థితి ఉంటే ఏం ఉపయోగం? ఉన్నత విద్యనభ్యసించిన వ్యక్తితో పదో తరగతి విద్యార్థి పోటీపడగలడా? ఇటీవలి కాలంలో పత్రికారంగంలో మంచి అవకాశాలొస్తున్నాయి. అలాగే నూతనంగా అనేక రకాల అవకాశాలు యువతలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కానీ ఆ నైపుణ్యం చదువుకునే కాలంలోనే రావాలి. అవసరమైతే ప్రత్యేక శిక్షణలు వాటికి మెరుగులు అద్దాలి. వేరే శిక్షణల కోసం వెంపర్లాడేపని లేకుండానే పిల్లలకు ఆ ఉద్యోగాలు సాధించవచ్చుననే విశ్వాసం కలిగించగలిగితే చాలు. అది సమాజ పరివర్తనకు ఉపయోగపడుతుంది. పిల్లల ఆశయాలు నెరవేరుతాయి.చిన్న ఉద్యోగాలు కానిస్టేబుల్ ఉద్యోగాలు, నర్స్ ఉద్యోగాల్లో ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్న వారిని భర్తీ చేస్తే ఆ ఉద్యోగాలను ఆశిస్తున్న అభ్యర్థుల్లో నిరాశ గూడుకట్టుకుంటుంది. కాబట్టి అటు ఓవర్ క్వాలిఫికేషన్ అయినా, అండర్ క్వాలిఫికేషన్ అయినా విద్యారంగానికి సరికాదు. అది సమాజ పరివర్తనకు ఉపయోగపడదు. చుక్కా రామయ్య –వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త -
జన పుష్కరం
విశ్లేషణ గోదావరి పుష్కరాలు వచ్చాయి. పద కొండు రోజులు గడిచాయి. ఇవాళ పన్నెం డవ రోజు, చివరి రోజు. కోట్ల మంది జనం పుష్కర స్నానాలు చేశారు. పండిత పామర భేదం, చిన్నా పెద్ద భేదం, ధనిక పేద భేదం, నాయకులు, సామాన్య ప్రజ లు అన్న భేదం లేకుండా అన్ని తరగతుల, అన్ని వర్గాల ప్రజలూ పుష్కర స్నానాలు చేశారు. ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడల్లా ఎన్నో వాదాలూ, వివాదాలూ తలెత్తుతుంటాయి. వీటిలో ఒకవైపు నాయకులు, మరో వైపు ఆధ్యాత్మిక వేత్తలు, పీఠాధిపతులు, ప్రవచనకారులు, హేతువా దులు భాగస్వాములవుతుంటారు. రాజకీయ నాయకులు ఇది మంచిది, చెడ్డది అన్న వివాదంలోకి గాని, వీటి ముహూర్తాల వివా దంలోకి గాని, అక్కడ ఆచరించాల్సిన, ఆచరించకూడని ఆచారాల వివాదాల్లోకి గాని వెళ్లరు. వాళ్లకు వ్యక్తిగతంగా వీటిపై విశ్వాసం ఉందా, లేదా అన్నది కూడా సందేహాస్పదమే. జనం విశ్వసిస్తు న్నారు, ఆచరిస్తున్నారు కాబట్టి ఆ విశ్వాసం తమకూ ఉన్నట్లే, తామూ ఆచరిస్తూ ఉన్నట్లు అందరికీ కనిపించడమే వారి లక్ష్యమూ, ప్రయోజనమూ కూడా. లౌకికవాద సమాజంలో ప్రభుత్వాలు ఈ విశ్వాసాలను ప్రోత్స హించవచ్చునా అని హేతువాదులు ప్రశ్నిస్తూ ఉంటారు. ఆ విశ్వా సాలున్న జనం మరెవరికీ హాని కలగనంతవరకూ తమ విశ్వాసాన్ని నెరవేర్చుకోవడంలో అభ్యంతరాలు పెట్టవలసిందేమీ లేదు. ప్రభు త్వాలు ఆ ప్రజలకు సదుపాయాలు కల్పించవలసే ఉంటుంది. అయితే పుష్కరాల వంటి వాటి ప్రాశస్త్యాన్ని ప్రచారం చేసి అందర్నీ నది దాకా తీసుకువెళ్లే ప్రయత్నం ప్రభుత్వాలు చేయవలసిన పనేనా అన్నది విచారణీయమే. పుష్కరాల వంటి సందర్భాలన్నీ సంప్రదాయంపై నమ్మకం కలిగినవాళ్లు, ప్రాచీన మత గ్రంథాల పట్ల విశ్వాసం కలిగిన వాళ్లు, పరంపరగా ఆచారాలను అనుసరిస్తూ వస్తున్న వాళ్లు అనుసరించేవే అనీ, ముఖ్యంగా పామరజనం వీటిని వేలంవెర్రిగా పాటిస్తోందనీ చదువుకున్న వాళ్లు కొందరికున్న అభిప్రాయం. కాని ప్రస్తుత పరిస్థి తులను చూస్తూ ఉంటే చదువుకున్న వాళ్లు, చదువుకోని వాళ్ల మధ్య భేదమేమీ కనిపించదు. ప్రపంచ వ్యాప్తంగా చదువుకున్న యువత ఆలోచనా విధా నంలో, ప్రవర్తనా సరళిలో ఏదో శూన్యం ఆవరించి ఉన్నట్లు తోస్తుం ది. చదువుకుంటున్నారు, డబ్బు సంపాదిస్తున్నారు. జీవితానికి వీటి తోనే తృప్తిగానీ, సమగ్రత గానీ వస్తున్నదా అంటే సందేహమే. దేవా లయాల వంటి మతసంస్థలకూ, పుష్కరాలకూ, జాతర్లకూ, పండు గల నిర్వహణకూ పెరుగుతున్న ఆదరణ చూస్తుంటే సంస్కృతీ పరం గా వాళ్లేదో వెతుక్కుంటున్నట్లు కనిపిస్తుంది. వారి జీవితాలలోని శూన్యాన్ని వీటిలో పూరించుకుంటున్నట్లనిపిస్తుంది. వీటిలో మరో అంశం కూడా ముందుకు వస్తోంది. ప్రాంతీయ, జాతీయ, మత సాంస్కృతికపరమైన అస్తిత్వాన్ని ప్రకటించడంతో పాటు, వినోదం కూడా ఒక భాగమవుతున్నది. ఆధునికులు గాని, హేతువాదులు గాని ఎన్నో ప్రశ్నలు కురిపిం చవచ్చు. వాస్తవానికి మతపరంగా మనం అనుసరించే ప్రతి ఆచా రాన్నీ ప్రశ్నించవచ్చు. పిండాలు పెట్టడమేమిటి? తర్పణాలు విడవ డమేమిటి? స్నానాలు చేయడమేమిటి? వంటి ప్రశ్నలకు పరంప రంగా వస్తున్న ఆచార విధులు, వాటిని చెప్పిన మత గ్రంథాలు, వాటిని వ్యాఖ్యానించిన వ్యాఖ్యాతలే సమాధానాలు. ఆధునిక విజ్ఞానశాస్త్ర దృక్పథంతో పరిశీలించి వీటిని సమర్థించేవారూ, మూఢ నమ్మకాలని కొట్టివేసే వారూ కూడా ఉంటారు. ఆధ్యాత్మికవేత్తలూ, ప్రవచనకారులూ ప్రాచుర్యం పొందిన తర్వాత ఆ ప్రాచీన మత గ్రంథాలకూ, ఆచారాలకూ వారు చెప్పిన భాష్యాలే జనానికి ఆధారం. ఒకప్పుడు ఈ పని పౌరాణికులు చేసేవారు. ఇప్పుడు ప్రసార మాధ్యమాలు విస్తరించి, ప్రజలకు సమాచారం విరివిగా లభిస్తూ ఉంది. పుష్కరాలు పన్నెండేళ్లకొకసారి ఎందుకు రావాలి? పన్నెండు రోజులే ఎందుకు జరగాలి? పన్నెండేసి పుష్కరాలకు ఒక మహా పుష్కరం వస్తుందా? పుష్కర స్నానం ఎలా చేయాలి? నీళ్లలో మట్టి తీసి బయటపడవేయాలా? ఒడ్డునున్న మట్టి తీసి నీళ్లలో వేయాలా? అని ప్రశ్నిస్తే ఈ విషయాలన్నీ ఏదో పురాణంలోనో, మత గ్రంథం లోనో ఉంటాయి. వాటిని ప్రమాణాలుగా అంగీకరించే వారికి సమస్య ఏమీ లేదు. మరి ఈ ఆధ్యాత్మిక విషయాలు మనకు తెలియనివి కదా. చెప్పే వాళ్లు ఒక పద్ధతిగా చెప్పకపోతే వినేవాళ్లు గందరగోళంలో పడిపో తారు. అసలే దిక్కుతోచని జనాన్ని అగమ్యగోచర స్థితిలోకి నెట్టడం వాంఛనీయం కాదు. మత విషయాలు జనంలో ఉద్వేగాలు, ఉద్రే కాలు కలిగిస్తాయి. ఆందోళన రేకెత్తిస్తాయి. ఇవ్వాళ పుష్కరాల విష యమే కాదు. మతానికి సంబంధించి ఏ అంశం జనంలోకి వచ్చినా అదే పరిస్థితి. ఇటువంటి విషయాలలో ప్రమాణమేమిటి? ఆ ప్రమా ణాన్ని నిర్ణయించే వారెవరు? వివిధ పీఠాధిపతులు సమష్టిగా ఈ నిర్ణయాలు చేయవచ్చు. ప్రజల సందేహాలు తీర్చవచ్చు. ప్రవచన కారులు కూడా ఎవరి ప్రాధాన్యం వారు చాటుకోవడానికి ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు చేయడం మంచిది కాదు. జనంలో మౌఢ్యమూ పెంచకూడదు. ఇటువంటి వాద సంప్రదాయం మన దేశంలో ప్రాచీన కాలం నుండి ఉంది. భిన్నమతాల ఆచార్యులు పరస్పరం వాదించుకొని ఓడిన వారు గెలిచిన వారి మతంలో చేరిన సందర్భాలు మన చరి త్రలో అసంఖ్యాకాలు. మాన్య ప్రజల వివేకం చాలా గొప్పది. వాళ్లకేది మంచిదో వాళ్లు ఏదో విధంగా నిర్ణయించుకోగలరు. వాళ్ల దారిన వాళ్లని వది లేస్తే వాళ్లని నడిపే అంతర్గత రక్షణలేవో వాళ్లకుంటాయి, వాటిని విని యోగించుకోగలరు. ఇక ఇదంతా మౌఢ్యమేనంటే, కావచ్చు. నెహ్రూ గారిని కుంభ మేళాను మీరు కూడా విశ్వసిస్తారా అని అడిగితే కుంభమేళాను విశ్వ సించే కోట్లాది ప్రజల విశ్వాసాన్ని నేను విశ్వసిస్తానన్నాడాయన. అచ్చమైన ప్రజాస్వామ్యవాది లక్షణం ఇది. చంద్రశేఖర్ రెడ్డి (వ్యాసకర్త ఎమెస్కో బుక్స్ సంపాదకులు) మొబైల్: 9866195673.