పంచాయతీ ఎన్నికలు ముందుగా పెడితే తమకు కొంతైనా కలిసి వస్తుందని ఆశించిన టీడీపీకి ఫలితాలు మాత్రం ఆశాభంగం కలిగించాయని చెప్పాలి. రెండు విడతలలో కలిసి వెయ్యికి పైగా పంచాయతీలు వచ్చినందుకు సంతృప్తి చెంది ఉండవచ్చు. కాగా వైఎస్సార్‌సీపీకి రెండు విడతల్లోనూ ఐదువేలకు పైగా పంచాయతీలు వచ్చాయి. అంటే గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రిపీట్ అవడం కాకుండా, అప్పటికన్నా వైఎస్సార్‌సీపీకి ఓట్ల శాతం పెరిగినట్లు కనబడుతోంది. ప్రస్తుతానికి మాత్రం గ్రామ సీమలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన అనేక కార్యక్రమాలు బాగా పనిచేశాయని అర్థం అవుతుంది.
ఆంధ్రప్రదేశ్‌లో గత మార్చిలో ఆగిపోయిన మండల, జడ్పీటీసీ ఎన్నికలు కాకుండా పంచాయతీ ఎన్నికలను ఎన్నికల కమిషన్ నిర్వహించడం ఆరంభించింది. ఇప్పటికే రెండు విడతల ఎన్నికలు కూడా జరిగిపోయాయి. పేరుకు ఇవి పార్టీ రహిత పంచాయతీ ఎన్నికలు అయినా, దాదాపు రాష్ట్రం అంతా ఆయా పార్టీల మద్దతుదారులైన అభ్యర్థులు రంగంలో దిగి తమ సత్తా చాటుకుంటున్నారు. ఈ క్రమంలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సహజంగానే అత్యధిక సర్పంచ్ పదవులను కైవసం చేసుకుంటోంది. తొలి విడత ఎన్నికలలో 2,640 పంచాయతీలు వైఎస్సార్‌సీపీ కైవసం అయితే టీడీపీకి 518 వరకు వచ్చాయని ఒక లెక్క. అయితే దీనిపై టీడీపీ కాస్త గందరగోళంగా లెక్కలు చెప్పింది. తొలుత 1,050 పంచాయతీలు గెలుచుకున్నామని ఒకసారి, అసలు పంచాయతీ ఎన్నికలు సరిగా జరపడంలో ఎన్నికల కమిషన్ విఫలం అయిందని, చాలా చోట్ల దౌర్జన్యాలు జరిగాయని మరోసారి ఆరోపించింది. ఎన్నికల కమిషన్ మాత్రం ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ప్రకటించడంతో అంతవరకు తాము మద్దతు ప్రకటిస్తూ వచ్చిన ఎన్నికల కమిషనర్‌పై విమర్శలు చేయడం, కోర్టుకు వెళ్లడం వంటి చర్యలకు టీడీపీ వారు పాల్పడ్డారు. రెండో విడత పోలింగ్‌లో కూడా వైఎస్సార్‌సీపీకి 2,504 పంచాయతీలు, టీడీపీకి 479 పంచాయతీలు వచ్చినట్లు వైఎస్‌ఆర్‌సీపీ తెలిపింది. ఈ మేరకు వారు సర్పంచ్‌ల పేర్లతో సహా ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ మాత్రం తమకు 666 వచ్చాయని సంబరాలు చేసుకున్నట్లు టీడీపీ అనుకూల మీడియా తెలి పింది. ఆ తర్వాత ఈ దశలోనూ వెయ్యికిపైగా వచ్చినట్లు టీడీపీ ప్రచారం చేసింది.అంతేకాక 38 శాతం సర్పంచ్ పదవులను గెలుచుకున్నామని చంద్రబాబు ప్రకటించుకున్నారు. అయితే టీడీపీ ఆ వివరాలను పూర్తిగా ఎక్కడా ఇవ్వకపోవడం గమనించదగిన విషయం.
ఇక్కడ అసలు విషయం ఒకటి తెలుసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెచప్పుడు, ఆత్మ తామేనని చెప్పుకునే ఒక పెద్ద పత్రికకు తెలుగు రాష్ట్రాలలో మారుమూల ప్రాంతాలలో కూడా నెట్‌వర్క్ ఉంది. వారి ప్రతినిధులు ఉంటారు. నిజంగానే టీడీపీకి పెద్ద సంఖ్యలో పంచాయతీలు వచ్చి ఉంటే, ఆ విషయాన్ని వారు స్వయంగా సేకరించి వార్తలుగా ప్రచురించేవారు. వారు అలా చేయకుండా వైఎస్సార్ సీపీ పక్షాన బొత్స చేసిన ప్రకటనను, అలాగే టీడీపీ వారు ఇచ్చిన ప్రకటనను ప్రచురించి ఊరుకున్నారు. అంటే దాని అర్థం ఆ పత్రిక నెట్‌వర్క్ పనిచేయడం లేదని అనుకోవాలా? లేక వాస్తవ పరిస్థితి వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉంది కనుక తామెందుకు ఆ విషయాలన్నిటిని వెల్లడించాలని అనుకున్నారా? అన్నది తెలియదు. కానీ వారు మాత్రం వాస్తవ పరిస్థితిని తెలియచేయడానికి ఇష్టపడలేదని అనుకోవాలి. ఇక మా అక్షరం మీ ఆయుధం అని ప్రచారం చేసుకున్న మరో పత్రిక వారి అక్షరాలను తెలుగుదేశం పార్టీకి అంకితం చేశారు కాబట్టి దాని గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం అనవసరం. పంచాయతీ ఎన్నికలు ముందుగా పెడితే తమకు కొంతైనా కలిసి వస్తుందని ఆశించిన తెలుగుదేశం పార్టీకి ఇవి ఆశాభంగం కలిగించాయని చెప్పాలి. కానీ వారు రెండు విడతలలో కలిసి సుమారు వెయ్యికి పైగా పంచాయతీలు వచ్చినందుకు సంతృప్తి చెందారని అనుకోవచ్చు. మరోవైపు వైఎస్సార్ సీపీకి ఐదువేలకు పైగా పంచాయతీలు వచ్చాయి. అంటే గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రిపీట్ అవడం కాకుండా, అప్పటికన్నా వైఎస్సార్ సీపీకి ఓట్ల శాతం పెరిగినట్లు కనబడుతోంది. పంచాయతీ ఎన్నికల తర్వాత మున్సిపాల్టీలు, మండల, జెడ్పీ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరుగుతాయి. మున్సిపాల్టీలకు నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. అప్పుడు ఎలాగూ ఏ పార్టీకి ఎలాంటి ఆదరణ ఉందన్నది స్పష్టమైన లెక్కలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం గ్రామ సీమలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన అనేక కార్యక్రమాలు బాగా పనిచేశాయని అర్థం అవుతుంది. ఈ ఫలితాలకు భిన్నంగా వచ్చే మున్సిపల్, మండల, జెడ్పీ ఎన్నికలలో మార్పు ఉండకపోవచ్చు.
కాగా, ఎన్నికల కమిషన్ వైఖరిలో కొద్దిపాటి మార్పు కనబడడం కూడా ఆహ్వానించదగిందే. ప్రత్యేకించి పోలీసు, ఇతర పోలింగ్ సిబ్బంది, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ఎన్నికలను విజయవంతం చేశారని, చెదురుమదురు ఘటనలు మినహా, అంతటా ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పడం కూడా గమనించదగినదే. అంతేకాక తొలి విడతలో ఏకగ్రీవాలపై ఆయన కొంత వివాదాస్పదంగా వ్యవహరించారన్న అభిప్రాయం ఉంది. ప్రత్యేకించి చిత్తూరు, గుంటూరు జిల్లాలలో ఎక్కువ ఏకగ్రీ వాలు అయ్యాయని ఆయన కొద్ది రోజులు నిలుపుదల చేశారు. కాని ఆ తర్వాత జిల్లా కలెక్టర్‌ల నివేదికల ఆధారంగా వాటికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా, ఆ తర్వాత దశల్లో జరిగిన ఏకగ్రీవాలను కూడా ఓకే చేశారు. ఎన్నికల కమిషనర్, అలాగే తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవాలకు వ్యతిరేకంగా ఎంత ప్రచారం చేసినా పెద్ద తేడా కనిపించలేదని అర్థం అవుతుంది. ఈ విషయాలలో తమకు పూర్తి అనుకూలంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తుందని టీడీపీ నేతలు ఆశించి భంగపడ్డారేమో తెలియదు కాని, ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఎన్నికల కమిషన్ కూడా విఫలం చెందిందని ఆరోపించారు. అంతవరకు రాజ్యాంగ వ్యవస్థలపై విమర్శలు చేస్తారా అని సుద్దులు చెప్పిన చంద్రబాబు స్వయంగా తానే విమర్శలు చేశారు. మరో వైపు తన పార్టీ వారితో హైకోర్టులో పలు పిటిషన్‌లు వేయించి అనేక ఆరోపణలు చేశారు. ఆ పిటిషన్లు చదివితే ఏపీ గ్రామాలలో హింస, నిర్బంధంగా నామినేషన్లు ఉపసంహరించడం, పోలీసులు అసలు పనిచేయడం లేదని, ఎన్నికల వ్యవస్థ గందరగోళంగా ఉందేమోనన్న అనుమానం కలుగుతుంది. ఆ కేసు విచారించిన జడ్జిగారు ఆ పిటిషన్‌లలోని ఆరోపణలు చూస్తే చాలా సీరియస్‌గా ఉన్నాయని, అవి నిజమే అయితే గట్టి చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించారు. ఎన్నికల కమిషన్‌కు ఇందుకు సంబంధించిన అధికారాలు ఉంటాయని, వాటిని వాడుకోవాలని సూచించారు.
నిజంగానే ఎన్నికలలో అక్రమాలు జరిగితే అడ్డుకోవలసిందే. చర్యలు తీసుకోవల్సిందే. కానీ ఉన్నవి, లేనివి కలిపి హైకోర్టులో పిటిషన్ వేసి న్యాయ వ్యవస్థను కూడా తప్పుదారి పట్టించే యత్నం జరి గిందా అనిపిస్తుంది. ప్రత్యేకించి పుంగనూరు, మాచర్ల, తంబళ్లపల్లె నియోజకవర్గాలలోని పంచాయతీలపై ఈ ఫిర్యాదు చేశారు. కానీ వాటికి సంబంధించిన ఏకగ్రీవాలను ఎన్నికల కమిషన్ ఆమోదించిన తర్వాత ఇంక సమస్య ఎక్కడ ఉంటుంది. పైగా ఎవరైనా సంబంధిత గ్రామాలకు చెందినవారు పిటిషన్ వేస్తే దానికి అర్థం ఉంటుంది కానీ, లేదా నిర్దిష్ట ఆధారాలతో ఎవరైనా పిటిషన్ వేయవచ్చు కానీ, ఏదో రకంగా వైఎస్సార్‌సీపీని ఇబ్బంది పెట్టాలన్న లక్ష్యంతో పిటిషన్‌లు వేస్తే ఏమి చేయాలి? ప్రభుత్వ న్యాయవాది ఈ పిటిషన్‌లు విచారణార్హం కాదని వాదించారు. న్యాయమూర్తి ఈ పిటిషన్‌లలోని అంశాల లోతుల్లోకి వెళ్లడం లేదని కూడా స్పష్టం చేశారు. అయినా తెలుగుదేశం మీడియా జడ్జిగారు చేసిన ఒక వ్యాఖ్యను పతాక శీర్షికలలో పెట్టి వైఎస్సార్‌సీపీపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని హైకోర్టు అన్నదేమోనన్న భ్రమ కల్పించడానికి ప్రయత్నించింది. ఇవన్నీ చూస్తుంటే అసలు పోటీ వైఎస్సార్‌సీపీకి, తెలుగుదేశం మీడియాకు మధ్య జరుగుతుందేమోనన్న అనుమానం వస్తుంది. మొత్తం మీద గ్రామ పంచాయతీ ఎన్నికలు వైఎస్సార్ కాంగ్రెస్‌కు పెద్ద బూస్ట్ మాదిరిగా ఉంటే, తెలుగుదేశం పార్టీ తనకు వచ్చిన తక్కువ స్థానాలకే ఆత్మ సంతృప్తి చెందినట్లు కనిపించడం ఒక ప్రత్యేకతగా భావించాలి. బహుశా వచ్చే రెండు దశల ఎన్నికలు, మున్సిపల్, మండల, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీకి ఇది ఒక వ్యూహం కావచ్చు. పంచాయతీ ఎన్నికలు ముగిశాక పార్టీ గుర్తులతో జరిగే మున్సిపల్, మండల, జెడ్పీ ఎన్నికలు మరింత రాజకీయ వేడి పుట్టిస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. - వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
కొమ్మినేని శ్రీనివాసరావు
Comments
Please login to add a commentAdd a comment