అమరావతి ప్రాంతంలో కొత్తగా 54 వేలమందికి ఇళ్ల స్థలాలు ఇస్తే కులాల సమతుల్యత దెబ్బతింటుందని కొందరు టీడీపీ నేతలూ, ఇతరులూ హైకోర్టులో పిటిషన్ వేశారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దీన్నే ప్రస్తావిస్తూ అమరావతి అందరి రాజధానిగా ఉండకుండా టీడీపీ వారు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. బలహీనవర్గాలకు చెందిన పేదలు రాజధానిలో ఉండడానికి వీలు లేదా అని ప్రశ్నించారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి టీడీపీ కానీ, అమరావతి జేఏసీకి నాయకత్వం వహిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ వ్యతిరేకించిన తీరు ఇప్పుడు సీఎం జగన్‌కు ఆయుధంగా మారింది. అమరావతిలో కులాల అసమతుల్యత ఏర్పడుతుందన్న వారి వాదన ప్రభావం ప్రజలపై పడితే, టీడీపీ ఎన్నటికీ కోలుకోలేదన్నది వాస్తవం.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాజధాని అందరి రాజధానిగా ఉండాలి కానీ కొందరికే పరిమితం అయితే అది ఎలా రాజధాని అవుతుందని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా 30.75 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తున్న నేపథ్యంలో కొన్ని చోట్ల టీడీపీకి చెందినవారు ఇళ్ల స్థలాల పంపిణీని వ్యతిరేకిస్తూ కోర్టులకు వెళ్ళి స్టేలు తెస్తున్నారని, అమరావతి రాజధానిలో 54 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తుంటే, అలా చేస్తే అది డెమోగ్రఫీపై ప్రభావం చూపుతుందని టీడీపీకి చెందిన కొందరు కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చారని ఆయన చెప్పారు. డెమోగ్రఫీలో సమతుల్యత దెబ్బతింటుందని చెప్పడం అంటే కొన్ని కులాల వారి ప్రభావం తగ్గి, మరికొన్ని కులాల వారి ప్రభావం పెరుగుతుందని చెప్పడమే.
రాజధాని అమరావతిపై ఉన్న ప్రధాన ఆరోపణే ఇది. మొత్తం 13 జిల్లాలు ఉంటే కేవలం రాజధానిలోనే చంద్రబాబు ఖర్చు చేస్తున్నాడని, అది కూడా ఇన్ సైడ్ ట్రేడింగ్ చేసిన టీడీపీ వారికి లబ్ధి చేకూర్చడానికి, ఒక సామాజికవర్గానికి మేలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని మిగిలిన జిల్లాలలో భావిస్తే, అమరావతి రాజధాని ఒక కులం ప్రాభవం కోసం ఏర్పాటు చేశారని గుంటూరు, కృష్ణా జిల్లాల ప్రజలు కూడా నమ్మారు. అందువల్ల రాజధాని పరిధి ఉన్న రెండు నియోజకవర్గాలలో కూడా టీడీపీ ఓడిపోయింది. ఈ ఓటమిని జీర్ణించుకోలేని చంద్రబాబు అమరావతి రైతులను రెచ్చగొట్టడం మొదలు పెట్టారు. మూడు రాజధానుల ప్రతిపాదనకుముందే, అమరావతిలో ఆ నిర్మాణం చేయడం లేదు.. ఈ నిర్మాణం చేయడం లేదంటూ తనకు మద్దతు ఇచ్చే మీడియాతో కలిసి ప్రచారం చేపట్టారు. రాజధాని అమరావతి పేరుతో అన్నీ తాత్కాలిక భవనాలనే బాబు నిర్మించారని, ఇప్పుడు వాటన్నిటికీ పర్మనెంట్ భవనాల నిర్మాణానికి, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడానికి వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని ప్రభుత్వ డబ్బు ఎక్కడ ఖర్చు పెట్టాలని వైసీపీ వాదన.
అదే సమయంలో మంత్రివర్గ ఉప సంఘం 4,070 ఎకరాల మేర ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని అంచనావేసి, దానిపై దర్యాప్తునకు సీబీఐకి అప్పగించాలని సిఫారసు చేయడమే కాకుండా, అవినీతి నిరోధక శాఖకు కూడా ఈ స్కామ్ విచారణను అప్పగించారు. ఏసీబీ విచారణలో పలు విస్తుగొలిపే విషయాలు బయటకు వచ్చాయి. అందులో రాజకీయ ప్రముఖులు కానీ, న్యాయ వ్యవస్థలోని కొందరు ప్రముఖులు కానీ, రాజధాని ప్రకటనకు ముందే అక్కడి గ్రామాలలో భూములు కొన్నారని తేలింది. జాతీయ రహదారికి ఇరవై, ముప్పై కిలోమీటర్ల దూరంలో మారుమూల గ్రామాలలో ఆయా జిల్లాలకు చెందిన టీడీపీ నేతలు తక్కువ ధరకు భూములు కొనుగోలు చేశారన్నది అభియోగం.
అంతేకాక ఇన్‌సైడ్ ట్రేడింగ్ చేసిన వారిలో మెజార్టీ ఒకే సామాజికవర్గం వారు అని వెల్లడైంది. దాంతో ఇన్‌సైడ్ ట్రేడింగ్ కేసు విచారణను పక్కన పెట్టాలని టీడీపీ నేతలు న్యాయవ్యవస్థ ద్వారా స్టేలు పొందగలిగారు. కానీ హైదరాబాద్‌లో ఉమ్మడి రాష్ట్ర రాజ ధానిగా ఉన్నప్పుడు సచివాలయంతో సహా మొత్తం అన్ని కార్యాలయాలు కలిపి 500 ఎకరాల విస్తీర్ణం కూడా లేదని తేలింది. మరి అలాంటిది అమరావతి రాజధానికి ఏభైవేల ఎకరాలు ఎందుకు సమీకరించారు? అందులో రైతుల నుంచి బతిమి లాడో, బలవంతంగానో, లేక ఇష్టపూర్వకంగానో 33 వేల ఎకరాలు ఎందుకు తీసుకున్నట్లు?
మొత్తం రియల్ ఎస్టేట్ వెంచర్‌గా మార్చి అక్కడే లక్ష కోట్ల నుంచి లక్షన్నర కోట్ల వరకు వ్యయం చేయాలని చంద్రబాబు ప్రతిపాదిం చారు. మరి అంత సొమ్ము ఒకే చోట పెడితే మరి మిగిలిన జిల్లాల పరిస్థితి ఏమిటన్న ప్రశ్న వచ్చింది. అందుకే టీడీపీని ప్రజలు ఘోరంగా ఓడించారు. హైదరాబాద్‌లో సచివాలయం చుట్టుపక్కల ఎవరికైనా నలభై ఎకరాల భూమి ఉందా? హైదరాబాద్ రాజధాని అవుతుందని ముందే తెలిసినా, ఇలా ఇన్‌సైడ్ ట్రేడింగ్ లేదా భూముల కొనుగోలుకు ప్రయత్నించినట్లు ఎవరూ చెప్పలేదు. అంతకుముందు కర్నూలులో రాజధాని ఏర్పాటు చేసినప్పుడు కూడా ఇలా ఎవరూ పెద్ద ఎత్తున భూములు కొనలేదన్నది వాస్తవం. కానీ అమరావతి గ్రామాలలో ముందస్తుగా ఎకరాలకు ఎకరాలు బాబు హయాంలో కొనుగోలు చేశారు.
న్యాయ వ్యవస్థకు చెందిన కొందరు ప్రముఖులు తమ కుటుంబాల పేరుతో భూములు కొన్నారన్న అభియోగాలు వచ్చాయి. రాజ ధాని పరిధిని ఆనాటి ప్రభుత్వం తన ఇష్టం వచ్చినట్లు మారుస్తూ వచ్చింది. అవసరం అనుకుంటే పరిధిని తగ్గించడం లేదా పెంచుతూ వచ్చారు. నాటి సీఎం బాబుకు చెందిన హెరిటేజ్ కంపెనీ 14 ఎకరాలు కొన్నది. ఆ భూమి పూలింగ్‌లో పోకుండా రాజధాని హద్దులు గీశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అలాగే కోర్ క్యాపిటల్‌లో ఆనాటి అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కుటుంబీకులు నలభై ఎకరాలు కొనుగోలు చేశారట. దమ్మాలపాటిపై ఏసీబీ కేసు పెడితే ఆయనపై చర్య తీసుకోకుండా, ఆ కేసుకు సంబంధించిన విషయాలేవీ ప్రచారం చేయవద్దని ఏపీ హైకోర్టు వారు చిత్రమైన తీర్పు ఇచ్చారు.
ఆ క్రమంలోనే ఒక సుప్రీంకోర్టు సీనియర్ జడ్జి కుమార్తెలు కూడా అక్కడ భూములు ఇన్‌సైడ్ ట్రేడింగ్‌లో కొన్నారని ఆరోపణలు వస్తే, వారు పిటిషన్ పెట్టకపోయినా, వారికి కూడా స్టే ఇచ్చేసి గౌరవ హైకోర్టు వారు కొత్త ట్రెండ్ సృష్టించారన్న వ్యాఖ్యలు వచ్చాయి. కానీ కొత్తగా అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకు వచ్చింది. అమరావతి రాజధాని ప్రాంతంలో 54 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించడాన్ని కొందరు టీటీపీ నేతలూ, ఇతరులూ వ్యతిరేకిస్తూ రాజధాని ప్రాంతంలో కొత్తగా 54 వేలమందికి ఇళ్ల స్థలాలు ఇస్తే కులాల సమతుల్యత దెబ్బతింటుందని హైకోర్టులో పిటిషన్ వేశారు. దీన్నే సీఎం జగన్ ప్రస్తావించి అమరావతి అందరి రాజధానిగా ఉండకుండా టీడీపీ వారు అడ్డుపడుతున్నారని, బలహీనవర్గాలకు చెందిన పేదలు రాజధానిలో ఉండడానికి వీలు లేదా అని ఆయన ప్రశ్నించారు. కాగా, రైతుల పేరుతో కొంతమంది ఆయా గ్రామాలు కొన్నిటిలో శిబిరాలు వేసుకుని నిరసనలు తెలుపుతున్నారు. ఈ మధ్యే ఆ ఉద్యమానికి సంవత్సరం అయిందంటూ ఒక కార్యక్రమం కూడా నిర్వహించినప్పుడు అత్యధికులు ఖరీదైన కార్లలో రావడాన్ని కూడా అంతా గమనించారు.
రాజధాని ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతులు ఎక్కువమంది వ్యవసాయం చేయడం లేదు. వారు ఏటా ప్రభుత్వం నుంచి నిర్దిష్ట కౌలు పొందుతున్నారు. వ్యవసాయ కూలీలు పెన్షన్‌ను పొందుతున్నారు. జగన్ ప్రభుత్వం వచ్చాక ఆ కౌలును పదిహేను ఏళ్ల పాటు ఇస్తామని ప్రకటించింది. అలాగే కూలీల పెన్షన్‌ను రూ. 2,500 నుంచి 5 వేలు చేశారు. అయినా రైతులు త్యాగం చేశారని ప్రచారం చేస్తున్నారు. 10 లక్షలు లేదా 15 లక్షల విలువైన భూములను 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు అమ్ముకోవడం త్యాగం అవుతుందా?
పైగా ఆ రైతులు ఇక్కడే పూర్తిగా రాజధాని ఉండాలని, లక్షకోట్లు ఇక్కడే వ్యయం చేయాలని చెబుతారు. అంటే తమ భూములకు కోట్ల రూపాయల విలువ ఉండాలని వారి భావన. కానీ రాష్ట్రంలోని ప్రజల ప్రయోజనాలను పక్కనబెట్టి, అన్ని చోట్ల వసూలు అయ్యే పన్నుల డబ్బును ఇక్కడే ఖర్చు చేయాలని ఆశించడమే తప్పు. చంద్రబాబు అప్పట్లో చాలామంది చెప్పిన మాట విని నాగార్జున యూనివర్సిటీ పక్కన రెండువేల ఎకరాల ప్రభుత్వ భూమిలో రాజధానికి అవసరమైన భవనాలు కట్టేసి ఉంటే, ఇప్పుడు మార్చే అవకాశం వచ్చేది కాదు. దాని చుట్టూ ప్రైవేటు భూముల విలువలు ఆటోమేటిక్‌గా పెరిగేవి. కానీ ప్రభుత్వమే ఇన్ని వేల ఎకరాలు తీసుకోవడం పెద్ద బ్లండర్ అని చెప్పాలి. తప్పు చేసింది బాబు అయితే, అక్కడ శిబిరాలలో కూర్చున్నవారు జగన్‌ను విమర్శిస్తుంటారు. వీరంతా బాబు ట్రాప్‌లోనే ఉంటున్నారు.
న్యాయ వ్యవస్థను మేనేజ్ చేస్తానని కూడా ఆయన నమ్మించారని కొందరంటున్నారు. సీఎం జగన్ మాత్రం అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే రాజధానిని నిర్మించుకుందామని అంటున్నారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి టీడీపీకానీ, అమరావతి జేఏసీకి నాయకత్వం వహిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ వ్యతిరేకించిన తీరు ఇప్పుడు సీఎం జగన్‌కు ఆయుధంగా మారింది. అమరావతిలో కులాల అసమతుల్యత ఏర్పడుతుందన్న వారి వాదనను జగన్ ప్రజలలోకి తీసుకు వెళుతున్నారు. దీని ప్రభావం ప్రజలపై పడితే, టీడీపీ ఎన్నటికీ కోలుకోలేదన్నది వాస్తవం. బాబుకు కానీ, టీడీపీకి కానీ, రాష్ట్ర ప్రయోజనాలకన్నా, తమ రియల్ ఎస్టేట్ ప్రయోజ నాలే ముఖ్యంగా కనిపిస్తుండడం కూడా వైఎస్సార్‌సీపీకి రాజకీయంగా లాభించే విషయంగా మారిందనడంలో సందేహం లేదు.
వ్యాసకర్త
కొమ్మినేని శ్రీనివాసరావు
సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment