ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తనను రేపో, మాపో అరెస్టు చేస్తారేమోనన్న అనుమానం వ్యక్తం చేస్తూ.. ప్రజలే తనను రక్షించుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఆయన పాలన సాగినప్పుడు జరిగిన కొన్ని స్కాములలో కాని, తాజాగా ఆదాయపన్ను శాఖ జారీ చేసిన నోటీసులోని అంశాల ఆధారంగా వచ్చే అవినీతి కేసులలో కాని, లేదా పుంగనూరు, అంగళ్లు వద్ద టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి విధ్వంసానికి కారణమైన కేసులో కాని అరెస్టు కావచ్చన్న భయం ఆయనకు ఉండవచ్చు. దానినంతటిని డైవర్ట్ చేయడం కోసం ఆయన సహజంగానే యత్నిస్తారు. ఆయనకు మద్దతు ఇచ్చే ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎలాగైతేనేమి ఒక కధనాన్ని వండి చంద్రబాబు కు సర్టిఫికెట్ ఇచ్చేసింది. అందులోనే వారి ఆందోళన అర్ధం అవుతుంది.
2019 ఎన్నికల ముందు కూడా చంద్రబాబు ఇలాగే తనపై కేంద్రంలోని బీజెపీ ప్రభుత్వం సీబీఐ, ఈడీ లాంటి దర్యాప్తు సంస్థల ద్వారా అరెస్టు చేస్తుందేమోనని ఆయా సభలలో వాపోతుండేవారు. అప్పుడు కూడా జనం తనచుట్టూ నిలబడి రక్షించాలని అంటుండేవారు. ఆ వెంటనే సీబీఐ ఏపీకి రావటానికి వీలు లేదని ఒక ఆర్డర్ కూడా ఇచ్చేశారు. చంద్రబాబు నిజంగా అవినీతికి పాల్పడి ఉండకపోతే చర్య తీసుకోవాలని చెప్పజాలం. కానీ, ఆయన కుంభకోణాలు చేయలేదని ఎవరు చెప్పాలి? అయితే దర్యాప్తు సంస్థలు తెలపాలి. లేదంటే కోర్టులు అయినా తీర్పు ఇవ్వాలి. ఇప్పటికే ఆయనపై రాజధాని అమరావతిలో భూముల కేసు, స్కిల్ డెవలప్‌మెంట్ నిధుల కుంభకోణం, ఫైబర్ గ్రిడ్ స్కామ్ మొదలైన ఆరోపణలు ఉన్నాయి. కొన్ని కేసుల్లో ఏపీ సీఐడీ విభాగం దర్యాప్తు చేస్తుంటే చంద్రబాబు స్టేలు తెచ్చుకున్నారు. తాజాగా ఆదాయపన్ను శాఖ సాక్ష్యాలు చూపుతూ చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని అభియోగం మోపింది. చంద్రబాబు మాత్రం ఇది కూడా వైఎస్సార్ కాంగ్రెస్ నేతలే చేయిస్తున్నారని చిత్రమైన వాదన చేస్తున్నారు.
✍️ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఆదాయపన్ను శాఖ నోటీసులు ఇస్తే దానిని జగన్‌కు చుట్టి మాట్లాడుతున్నారు. అంతేగానీ బీజేపీ అగ్రనేతలను ఒక్క మాట అనడానికి సాహసించలేకపోతున్నారు. కేంద్రం నోటీసులు ఇస్తే జగన్ ప్రభుత్వంపై పోరాడుతానని అంటున్నారు. దీనికి కూడా జగన్ పాలననే తప్పు పడుతున్నారు. మరో వైపు ఆదాయపన్ను శాఖ ఇచ్చిన నోటీసుల ఆధారంగా సీబీఐ, ఈడీ.. అలాగే ఏపీ సీఐడీ రంగంలో దిగితే చంద్రబాబుకు చిక్కులు తప్పవన్నవి నిపుణుల అభిప్రాయంగా ఉంది. చంద్రబాబుకు శిక్షలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నది వారి అంచనా. అయినా చంద్రబాబు తనను అరెస్టు చేయడం ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు. ఆయన స్కాములు చేస్తే ప్రజలు రక్షించాలట. అది ప్రజాస్వామ్యామట. చంద్రబాబు మాదిరి ఎవరూ కూడా తమపై వచ్చిన కేసులలో ఇలా రక్షణ పొందలేకపోయారన్నది చాలా మంది భావన. ఆయా వ్యవస్థలను మేనేజ్ చేయడం లో కూడా దిట్ట అని పేరొందారు. అలాంటి చంద్రబాబుకు ఇప్పుడు ఈ సమస్య గడ్డుగా మారినట్లు ఉంది.
గతంలో మాదిరి ఇప్పుడు వ్యవస్థలను మేనేజ్ చేయలేమేమోనని భయపడుతున్నారేమో తెలియదు కాని , ఆయన మాటల తీరు చూస్తే తాను అన్నిటికి అతీతుడను అన్న ఫీలింగ్ లో ఉన్నట్లు అనిపిస్తుంది. ప్రపంచంలోకాని, దేశంలో కాని ప్రభుత్వాలు నడిపినవారు అవినీతి ఆరోపణలకు, ఇతరత్రా అభియోగాలకు గురై అరెస్టు కాలేదా అంటే చాలా ఉదాహరణలే ఉన్నాయి. ఈ మధ్య జరిగిన కొన్ని ఘటనలే తీసుకోండి. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ మధ్యకాలంలో పలు కేసులలో చిక్కుకుని అరెస్టు అయి బెయిల్ పై విడుదల అయ్యారు. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తనకు వచ్చిన బహుమతులను అక్రమంగా అమ్ముకున్నారన్న అభియోగాలపై అరెస్టు అయి జైలులో ఉండవలసి వచ్చింది. ఇలా వీరేమిటి! ప్రపంచ వ్యాప్తంగా పలువురు ఉన్నత స్థానాలలో ఉన్నవారు జైలుకు వెళ్లిన ఘట్టాలు చాలానే ఉన్నాయి. కొందరికి అయితే ఏకంగా ఉరి శిక్షే పడింది.
✍️ మన దేశంలో కూడా బీహారు ముఖ్యమంత్రిగా పనిచేసిన లాలూ ప్రసాద్ యాదవ్ గడ్డిదాణా కుంభకోణంలో జైలు పాలయ్యారు. కేంద్ర మంత్రిగా ఆయన ఉద్యోగాల స్కామ్ లో ఇరుక్కుని విచారణను ఎదుర్కుంటున్నారు. ఆయన పిల్లలు సైతం సీబీఐ, ఈడీల విచారణకు హాజరవుతున్నారు. హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా టీచర్ల నియామకాలలో అక్రమాలపై జైలు శిక్ష అనుభవించవలసి వచ్చింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సి.ఎమ్. హోదాలోనే కేసులు ఎదుర్కుని రెండుసార్లు జైలు కు వెళ్లవలసి వచ్చింది. తమిళనాడులోనే ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఒకరు ఈడీ కేసులో జైలులో ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆప్ కు చెందిన ఇద్దరు మంత్రులు జైలుపాలయ్యారు. ఎవరిపైన అయినా అక్రమంగా కేసులు పెట్టరాదు. అందులో సందేహం లేదు. అదే సమయంలో నిజంగానే స్కాములకు పాల్పడి ఉంటే వారిని వదలివేయాలా? అన్నది కూడా ఆలోచించాలి. తనపై కేసులు వస్తే అవన్ని కక్ష సాధింపు అని, తాను ఎవరిపైన అయినా కేసులు పెడితే అవన్ని కరెక్టు అని ప్రచారం చేసుకోగల సత్తా చంద్రబాబుకు ఉంది.
సోనియాగాంధీతో కలిసి చంద్రబాబు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేవలం ఎంపీగా.. ఉన్నప్పుడు కేసులు వేయించి విపరీతమైన వ్యతిరేక ప్రచారం చేయించారు. ఒక సీబీఐ అధికారిని అడ్డం పెట్టుకుని విచారణ పేరుతో పారిశ్రామికవేత్తలను అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు రాకుండా చేశారు. అప్పట్లో జగన్ పై చేసిన ఆరోపణలు ఏమిటి?ఆయన తన కంపెనీలలో తండ్రి పలుకుబడి ఆధారంగా పెట్టుబడులు పెట్టించారని. అందుకు గాను ఆయా పరిశ్రమలకు నీటి సదుపాయం, భూ వసతి తదితర సదుపాయాలు ఇచ్చారన్నది ఆరోపణ.ఇది వినడానికే ఆశ్చర్యంగా ఉంటుంది. ప్రభుత్వాలు పరిశ్రమలకు నీరివ్వడం అవినీతి ఎలా అవుతుందో ఎప్పటికీ అంతుపట్టదు. ఆమాటకొస్తే.. కియా కార్ల పరిశ్రమ కు చంద్రబాబు టైమ్ లో ఎన్నివేల కోట్ల రాయితీలు ఇచ్చారు?. మరి అది కూడా తప్పే అవుతుంది కదా!.
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు హెరిటేజ్ షేర్ విలువ పెరుగుతుందన్న వాదన ఉంది. ముందస్తు సమాచారంతో ఆయన రిటైల్ విభాగాన్ని అమ్మివేశారు.దీనిపై అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఇందులో క్విడ్ ప్రోకో ఉన్నట్లా?లేనట్లా? ఆ రోజుల్లో చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నా కాంగ్రెస్ తో కుమ్మక్కై జగన్ పై కేసులు పెట్టారు. జగన్ సంస్థలు స్థాపించినప్పుడు ఆయన ఎంపీ కూడా కాదు. ఆయన తండ్రి మరణించిన తర్వాత కొన్నేళ్లకు కేసులు పెట్టారు. కాని చంద్రబాబు విషయంలో అలాకాదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన స్కాములు. వాటిలో మాత్రం ఎవరూ ఏమి చేయకూడదని ఆయన వాదిస్తున్నారు.
✍️ ఆయన తరపున ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటివి చంద్రబాబుపై కేసులు పెడతారా? అంటూ ఆశ్చర్యకరమైన రీతిలో వ్యవహరిస్తున్నాయి. అవినీతిని అంకుశంతో పొడవాలని చెప్పిన రామోజీరావు ఇప్పుడు చంద్రబాబు అవినీతి జోలికి ఎవరూ వెళ్లరాదని అంటున్నారు. చంద్రబాబుకు ఆదాయపన్ను శాఖ నోటీసులు ఇచ్చి 118 కోట్ల ముడుపుల ఆరోపణ చేస్తే కనీసం ఒక్క చిన్న వార్త కూడా రాయలేకపోయారు. ఆంధ్రజ్యోతి ఆదాయపన్ను శాఖ నోటీసులు చెల్లవన్న చంద్రబాబు వాదనను భుజాన వేసుకుని కథలు ఇస్తున్నారు. టీవీ5ది మరీ విడ్డూరం. నెలకు ఏభై రూపాయల వ్యాపారం చేసే వారికి కూడా ఆదాయపన్ను శాఖ నోటీసులు ఇస్తుందని, అందువల్ల చంద్రబాబు కు వచ్చిన ఐటి నోటీసులను పట్టించుకోనవసరం లేదని నిస్సిగ్గుగా ప్రచారం చేసింది.
✍️ ఈ మీడియా సంగతి పక్కనబెడితే.. చంద్రబాబు ఎందుకు ఐటీ నోటీసులలోని వివిధ అంశాలపై నిర్దిష్ట సమాధానం ఇవ్వలేకపోతున్నారు?ఏవో సాంకేతిక కారణాలు చూపుతూ కేసు లేకుండా చేసుకోవాలని చూస్తున్నారు. గతంలో వైఎస్ విజయమ్మ హైకోర్టులో చంద్రబాబు ఆస్తులపై సీబీఐ విచారణకు ఆదేశాలు ఇవ్వాలని కోరగా, కోర్టు అంగీకరించింది. కాని అప్పట్లో సీబీఐ తనవద్ద సిబ్బంది లేదని చర్యలు తీసుకోలేదు. దీనిలోనే మ్యాచ్ ఫిక్సింగ్ అర్ధం చేసుకోవచ్చని చాలా మంది చెబుతారు. ఈలోగా చంద్రబాబు సుప్రింకోర్టుకు వెళ్లడం, మళ్లీ హైకోర్టులో విచారణ జరిగి కేసు లేకుండా చేసుకోగలడం జరిగాయి. నిజంగానే చంద్రబాబు ఆస్తులలో ఎలాంటి తేడా లేకపోతే విచారణకు ఎందుకు అంగీకరించలేదన్న ప్రశ్న వస్తుంది. తాను ఏ విచారణకు అయినా సిద్దం అని ఆయా సందర్భాలలో చెప్పే ఈయన తీరా విచారణ దశకు ఏదైనా కేసు వస్తే దానిని ఎలాగోలా మేనేజ్ చేసుకుని బయటపడుతుంటారని చాలా మంది నమ్ముతారు. చాలా కేసులలో అలాగే జరిగింది. పైగా తనపై ఈ నలభై ఐదేళ్లలో అసలు కేసులే లేవని బుకాయించడం ఆయన స్పెషాలిటీ.
✍️ అంతదాకా ఎందుకు నిజంగానే ఐటీ శాఖ ఇచ్చిన నోటీసులోని అంశాలు అన్నీ తప్పు అయితే ఏకంగా ఆ శాఖ పైన ఎందుకు పరువు నష్టం దావా వేయరు? అని అడిగితే దానికి జవాబు ఇవ్వరు. గతంలో CBIని పంపుతారని ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబు ఇప్పుడు ఐటి నోటీసులు వచ్చినా, మోడీపైకాని,కేంద్రంపై కాని పన్నెత్తు మాట కూడా ఎందుకు అనలేకపోతున్నారు. ఐటి శాఖ ఇచ్చిన నోటీసును మొదటగా ప్రచురించింది హిందుస్తాన్ టైమ్స్ ఆంగ్ల పత్రిక అయితే.. సాక్షి ప్రచారం చేస్తోందని ఆయన అంటారు. ప్రజలకు ఆయన ఈ కేసులపై వివరణ ఇవ్వాలి. కనీసం టీడీపీ కార్యకర్తలకైనా అనుమానాలు నివృత్తి చేయాలి కదా?అలాకాకుండా డబాయించుకుంటూ మాట్లాడితే టీడీపీ కార్యకర్తలు మాత్రం నమ్ముతారా?పైకి మాట్లాడలేకపోయినా, లోపల వారి మనసులకు తెలియదా చంద్రబాబు స్కాములకు పాల్పడింది ,లేనిది?. చంద్రబాబును వారు కొన్ని ప్రశ్నలు అడగాలని అనుకున్నా అడగలేకపోతుండవచ్చు. ఐటీ ఇచ్చిన నోటీసులలోని వ్యక్తులు మనోజ్, కిలారి రాజేష్ తదితరులతో ఆయనకు సంబంధాలు ఉన్నాయా?లేదా?.. మనోజ్ ను పిలిచి మాట్లాడిన విషయం నిజమా?కాదా?.. పీఏ శ్రీనివాస్ కు వసూళ్ల బాధ్యతను అప్పగించింది నిజమా?కాదా?.. ఐటి శాఖ వారు మొత్తం చిట్టా అంతటిని విప్పిన దాని ప్రకారం దుబాయిలో కూడా డబ్బులు తీసుకున్నారా?లేదా?.. వీటన్నిటికి చంద్రబాబు పూర్తిగా వివరణ ఇస్తే అప్పుడు దానిపైన ఆలోచించవచ్చు. అలాకాకుండా ఎలాగూ స్కామ్ బయటపడింది. కనుక.. దాని నుంచి తప్పించుకునే యత్నాలు చేస్తూనే ,మరోవైపు ప్రజలలో సానుభూతి సంపాదించాలన్న ఉద్దేశంతో ఆయన ప్రకటనలు చేస్తున్నారు. కాని అది సాధ్యం కాదు. ఎందుకంటే అధికారిక హోదాలో ఆయన చేసిన అవినీతిపై వస్తున్న ఆరోపణలు కనుక.
కాపురం చేసే కళ కాలు తొక్కినపుడే తెలుస్తుంది ఒక సామెత. అలాగే చంద్రబాబు తాను ముఖ్యమంత్రి అయింది ఎలాగో అందరికి తెలుసు. వైస్రాయి హోటల్ లో ఎమ్మెల్యేలను పెట్టి వారిని మేనేజ్ చేయడానికి ఎంతెంత ఖర్చు చేసింది కథలు, కథలుగా చెబుతుంటారు. తన మామ ఎన్.టి.రామారావును పదవి నుంచి దించివేసి తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ఏ వ్యవస్థలను ఎలా ఆకట్టుకున్నది ఈ తరంవారికి తెలియకపోయినా, ఆనాటి తరానికి తెలుసు. కనుక చంద్రబాబుకు ఇలాంటి స్కామ్ లు అసలు తెలియవని ఎవరైనా అనుకుంటే వారు ఉత్త అమాయకులని అనుకోవాలి. కాకపోతే ఇప్పుడు ఆదాయపన్ను శాఖ గట్టిగా వ్యవహరించింది.
ఇంకో విషయం చెప్పాలి. జగన్ తనను సీబీఐ పిలిస్తే ఎన్నడూ విచారణకు రానని చెప్పలేదు. వాళ్లు అరెస్టు చేస్తారని తెలిసినా, సోనియాగాంధీ కక్ష కడితే ఎలాంటి పరిణామాలు ఉంటాయో తెలిసినా, ఆయన ఎక్కడా వెనక్కి తగ్గలేదు. విచారణకు సిద్దపడ్డారు. పదహారు నెలలు బెయిల్ రాకుండా అడ్డుకున్నా సహనంతో ఎదుర్కున్నారు. ఈ విషయాలలో ప్రజలంతా తన చుట్టూ ఉండాలని ఎన్నడూ కోరలేదు. మరి అదే చంద్రబాబు నాయుడు మాత్రం అందుకు భిన్నంగా ఒకవైపు కేసులకు వణికి పోతూ,మరో వైపు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారు. చంద్రబాబు ఈ కేసులలో అరెస్టు అవుతారో లేదో చెప్పలేం కాని, అరెస్టు కాక తప్పదని భయపడుతున్నట్లుగా ఆయన ముఖ కవళికలను బట్టి తెలిసిపోతోంది.
:::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment