ఏపీ రాజధాని అమరావతి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. టీడీపీ, జనసేన,బీజేపీ సభ్యులంతా కలిసి ఆయనను తమ నేతగా ఎన్నుకున్న సందర్భంగా మాట్లాడుతూ.. అమరావతిపై క్లారిటీ ఇచ్చారు. అలాగే విశాఖను ఆర్దిక రాజధానిగా అభివృద్ది చేస్తామని, కర్నూలును కూడా ప్రగతి పధంలోకి తీసుకు వెళతామని అన్నారు. ఆయన తాను ఇచ్చిన సూపర్ సిక్స్ వాగ్దానాల గురించి కాకుండా అమరావతిపైనే ప్రసంగించడం అందరి దృష్టిని ఆకర్షించింది.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రాజధానులు పెట్టడం ద్వారా ఏపీ అభివృద్దికి ప్రయోజనం జరుగుతుందని భావించారు. విశాఖ పట్నం అయితే రాష్ట్రం అంతటికి గ్రోత్ ఇంజన్ అవుతుందని ఆశించారు. అమరావతి మాదిరి లక్షల కోట్లు ఖర్చుపెట్టవలసిన అవసరం ఉండదని అనుకున్నారు. కాని దానిని తెలుగుదేశం,ఇతర విపక్షాలు ముందుకు సాగకుండా అడ్డుపడ్డాయి. దాంతో జగన్ ఇందుకు సంబంధించిన చట్టాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు అప్పట్లోనే ప్రకటించారు. కాకపోతే తమ విధానం మూడు రాజధానులు అని ఆయన అన్నారు. కాని ఆయన తిరిగి అదికారంలోకి రాలేకపోయారు.
విశాఖ, కర్నూలులకు అడ్డుపడిన చంద్రబాబు నాయుడు, ఇప్పుడు జగన్ అక్కడి వారిని మోసం చేశారని అంటున్నారు. చంద్రబాబుతో వచ్చిన చిక్కే ఇది. ఎక్కడ ఏది అవసరమైతే అది మాట్లాడుతుంటారు. ఇందులో జగన్ మోసం చేసింది ఏముంది? ఆయన ఎన్నికల ప్రచారం సమయంలో గెలిచిన తర్వాత విశాఖ నుంచే పాలన చేస్తామని ప్రకటించారు. విశాఖను సుందరంగా తీర్చి దిద్దారు. రిషికొండపై ఆకర్షణీయమైన భవంతిని నిర్మించారు. అలాగే కర్నూలులో పలు న్యాయ రంగానికి సంబంధించిన పలు ఆఫీస్ లు ఏర్పాటు చేశారు. లోకాయుక్త ఆఫీస్ ను కూడా అక్కడే నెలకొల్పారు. హైకోర్టు ఏర్పాటు పూర్తిగా ఆయన చేతిలో లేనిది కనుక దానిపై ముందుకు వెళ్లలేకపోయారు. ఈ విషయాలలో జగన్ చిత్తశుద్దిని శంకించనవసరం లేదు.
జగన్ ఒకటి తలిస్తే, ప్రజా తీర్పు మరో రకంగా రావడంతో చంద్రబాబుకు అది అడ్బాంటేజ్ అయింది. విశాఖ ప్రజలు కూడా తమకు రాజధాని వద్దని అనుకున్నారని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. ఇంతవరకు తప్పు లేదు. ఎందుకంటే జగన్ ఆ ప్రాంతానికి అంత పెద్ద వరం ఇస్తే ,దానిని వారు ఆదరించలేదు.కర్నూలులో హైకోర్టు పెట్టాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది.
శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు కావవల్సి ఉంది. అక్కడ కూడా ఆశ్చర్యంగా వైఎస్సార్‌సీపీకి వ్యతిరేక తీర్పు వచ్చింది. తాజాగా చంద్రబాబు అక్కడ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం లేదు. ఈ నేపధ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తన విధానాన్ని మార్చుకుంటేనే బెటర్ అనిపిస్తుంది. వచ్చే ఐదేళ్లు టీడీపీ కూటమి అధికారంలో ఉంటుంది కనుక వారు చేయదలచుకున్నది అంతా అమరావతిలోనే చేస్తారు. ఆ తర్వాత ఎన్నికలలో వైసిపి గెలిచినా, ఇందులో మార్పులు చేయడం కష్టం అవుతుంది. అప్పుడు మళ్లీ మూడు రాజధానులు అన్నా ఉపయోగం ఉండదు. నా వ్యక్తిగత అభిప్రాయం అయితే అమరావతిపై ఇక వివాదాన్ని ముగించడం మంచిది. వైఎస్సార్‌సీపీ దీనిపై ఎలా ముందుకు వెళుతుందో చూడాలి.
అమరావతికి సంబంధించి కొన్ని చిక్కుముళ్లను చంద్రబాబు విడదీయవలసి ఉంటుంది. 2014 టరమ్ లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు కేవలం ప్రాధామిక సదుపాయాల కోసం లక్షతొమ్మిది వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని , ఈ నిదులను మంజూరు చేయాలని కేంద్రానికి లేఖ రాశారు. ఇప్పుడు ఆ వ్యయం ఇంకా భారీగా పెరిగి ఉంటుంది.అంత మొత్తాన్ని ఎలా వెచ్చిస్తారో చెప్పగలగాలి. కేంద్రం ఇప్పుడు ఏమైనా ఆ ప్రకారం ఇస్తే ఇబ్బంది లేదు. అలా ఇవ్వకపోతే మళ్లీ సమస్య మొదటికి వస్తుంది. అప్పట్లో ప్రధాని మోదీ మట్టి,నీళ్లు ఇచ్చి వెళ్లారని చంద్రబాబు విమర్శించేవారు. ఈ విడత టీడీపీపై కేంద్రంలోని ప్రభుత్వం ఆధారపడే పరిస్థితి ఉంది కనుక లక్ష కోట్లను రాజధాని కోసం సాధించగలిగితే చంద్రబాబుకు మంచి పేరు వస్తుంది. గత ప్లాన్ ప్రకారం నవ నగరాలన్నింటిని ఇక్కడే నిర్మిస్తారా?లేక వాటిని వాయిదా వేస్తారా? అనేది చూడాలి. అంతేకాదు. అమరావతి భూముల విషయంలో పలు వివాదాలు ఉన్నాయి.
కొంతమంది రైతులు తమ భూములను రాజధానికి ఇవ్వడానికి ఇష్టపడలేదు. వారిపై అప్పట్లో కేసులు కూడా పెట్టారు. జగన్ ప్రభుత్వం వచ్చాక వాటిని తొలగించింది. ఆ రోజుల్లో పంటలను దగ్దం చేసి భూములు లాక్కునే యత్నం చేశారన్న విమర్శలు వచ్చాయి. అలాంటి చోట్ల ఏ రకంగా ముందుకు వెళతారో తెలియదు. ప్లాట్ల కేటాయింపుపై కూడా రకరకాల వ్యాఖ్యలు ఉన్నాయి. వాటన్నిటిని పరిష్కరించుకోవల్సి ఉంటుంది. వారికి రోడ్లు,డ్రైనేజ్, రక్షిత నీరు మొదలైనవాటిని సమకూర్చుకోవాలి. అమరావతిలో పది డిగ్రీల ఉష్ణాగ్రత తగ్గించాలని అప్పట్లో చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఇంటింటికి ఏసీ కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇవన్ని చేయగలిగితే తెలుగుదేశంకి ఖ్యాతి వస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల వసతుల కోసం ఏభై అంతస్తుల టవర్ లు నిర్మించాలని తలపెట్టారు. అదే ఆలోచనను మళ్లీ చేస్తారో?లేదో తెలియవలసి ఉంది.
కృష్ణానది పక్కన ఉండడంతో నేల స్వభావం భారీ భవంతులకు అనువైనది కాదని నిపుణులు చెబుతారు. అందువల్లే రాఫ్ట్ టెక్నాలజీకి వెళుతున్నామని అనేవారు. అది బాగా ఖరీదైనది. అయినా ఖర్చు భరించక తప్పదు. మరో కీలక అంశం సింగపూర్ కంపెనీలకు గతంలో మాదిరే మళ్లీ భూములు కేటాయిస్తారా? లేదా ?అన్నదానిపై నిర్ణయం చేయవలసి ఉంటుంది. వారికి రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం ఏపీ ప్రభుత్వం పక్షాన భూమి ఇవ్వడమే కాకుండా,అవసరమైన రోడ్లు తదితర సదుపాయాలను సమకూర్చడానికి 5,500 కోట్లు వ్యయం చేయడానికి సిద్దపడ్డారు. ఇప్పుడు ఖర్చు కూడా పెరుగుతుంది. సింగపూర్ కంపెనీల నుంచి ఏపీ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మాత్రం బాగా తక్కువగా ఉందని అప్పట్లో విమర్శలు వచ్చాయి. పైగా వారితో ఏ వివాదం వచ్చినా లండన్ కోర్టులో తేల్చుకోవాలని రాసుకున్నారు.
2019 లో తమ ప్రాజెక్టు వయబుల్ కాదని భావించి సింగపూర్ సంస్థలు దానిని వదలుకున్నాయి. సింగపూర్ సంస్థలకు స్విస్ చాలెంజ్ పద్దతిన భూములు ఇవ్వడం పై ఆనాడు కోర్టులలో వివాదాలు నడిచాయి. కోర్టు సంబంధిత చట్టంలోని కొన్ని క్లాజులను కొట్టివేయగా,వాటిని మార్చి మళ్లీ చట్టాన్ని ఆమోదించారు. నిజానికి చంద్రబాబు నాయుడు రైతుల నుంచి ముప్పైమూడు వేల ఎకరాల భూమి సమీకరించకుండా ,ప్రభుత్వానికి అవసరమైన వెయ్యి నుంచి ఐదువేల ఎకరాల భూమి తీసుకుని , అందులో భవనాల నిర్మాణం చేపట్టి ఉంటే ఇంత రాద్దాంతం అయ్యేది కాదు. ఆయన ఓవర్ యాంబిషస్ గా దీనిని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ గా మార్చారన్న అభిప్రాయం వ్యక్తం అయ్యేది. ఇతర జిల్లాలప్రజలు మొత్తం డబ్బంతా అమరావతిలోనే పెడితే ఎలా అని ప్రశ్నించేవారు. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి ఎదురవుతోంది. అయితే దాదాపు అన్ని జిల్లాల ప్రజలు అమరావతిని ఆమోదించినట్లుగానే ఎన్నికల ఫలితాలు వచ్చాయి కనుక చంద్రబాబు తన ఇష్టానుసారం ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది.
చంద్రబాబు రాగానే అధికారులు అక్కడ హడావుడి ఆరంభించారు. బహుశా కొన్ని పూర్తి కాని భవనాలకు ప్రాధాన్యత ఇచ్చి, తర్వాత మిగిలిన నిర్మాణ పనులు చేపట్టవచ్చు. అమరావతి రాజధాని పూర్తి కావడానికి చాలాకాలం పట్టవచ్చు. నిధుల సమస్య, సాంకేతిక అంశాలు, భూ సేకరణ వంటి వ్యవహారాలు సజావుగా పూర్తి చేసుకుంటే ఇబ్బంది ఉండకపోవచ్చు.
కొసమెరుపు ఏమిటంటే చంద్రబాబు ప్రమాణ స్వీకారం కృష్ణానదికి ఆవల వైపున ఉన్న అమరావతిలోనే జరుగుతుందని తొలుత ప్రకటించారు. కాని ఏ సెంటిమెంట్ అయినా అడ్డం వచ్చిందేమో తెలియదు కాని, ఈసారి కృష్ణా నదికి ఈవల వైపు అంటే విమానాశ్రయం ఎదుట ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అంటే 2014లో అమరావతి వైపు ప్రమాణ స్వీకారం చేయడం అచ్చి రాలేదని భావించి వాస్తు పండితులు ఈ మార్పు చేశారా?అన్న సందేహం వస్తుంది. అమరావతి వాస్తుపైనే అనుమానాలు ఉన్న నేతలు దానిని ఏ రీతిన ముందుకు తీసుకువెళతారన్నది ఆసక్తికరం.
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment