ఫార్ములా-ఈ కార్‌ రేసు కేసులో కీలక పరిణామం | New Twist In Telangana Formula-E Race Case | Sakshi
Sakshi News home page

ఫార్ములా-ఈ కార్‌ రేసు కేసులో కీలక పరిణామం

Published Wed, Dec 25 2024 9:55 AM | Last Updated on Wed, Dec 25 2024 11:44 AM

New Twist In Telangana Formula-E Race Case

హైదరాబాద్‌, సాక్షి: ఫార్ములా-ఈ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏసీబీ(ACB) అధికారులకు హైకోర్టు ​ఉత్తర్వులు అందాయి. దీంతో ఫిర్యాదుదారుడు దాన కిషోర్‌ను ఏడు గంటలపాటు ఏసీబీ ప్రశ్నించి..స్టేట్‌మెంట్‌ నమోదు చేసింది. ఇక.. స్టేట్‌మెంట్‌ ఆధారంగా మాజీ మంత్రి కేటీఆర్‌ను విచారణకు పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

దానకిషోర్‌ స్టేట్‌మెంట్‌ ఆధారంగా ఏసీబీ ఈ కేసులో విచారణ మొదలుపెట్టనుంది. త్వరలో కేటీఆర్‌(KTR), అరవింద్‌ కుమార్‌లకు నోటీసులు జారీ చేయనుంది. దానకిషోర్‌ స్టేట్‌మెంట్‌ ఆధారంగానే ఈ ఇద్దరినీ ప్రశ్నించే అవకాశం ఉంది. అలాగే ఆయన నుంచి తీసుకున్నన్న డాక్యుమెంట్లను వాళ్ల ముందు ఉంచే అవకాశం ఉంది. ఇక ఈ వ్యవహారంలో ఇప్పటికే దానకిషోర్‌ తెలంగాణ ప్రభుత్వానికి వివరణ ఇచ్చారు. అప్పటి మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకే.. హెచ్‌ఎండీఏ నుంచి డబ్బు బదిలీ అయినట్లు ప్రభుత్వానికి తెలిపారాయన. 

ఏ1గా కేటీఆర్‌
ఫార్ములా-ఈ కార్‌ రేసింగ్‌ వ్యవహారంలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై ఇప్పటికే కేసు నమోదైంది. ఏ1గా కేటీఆర్‌, ఏ2గా ఐఏఎస్‌ అర్వింద్‌కుమార్‌, ఏ3గా హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డిపై తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఫార్ములా-ఈ కార్‌ రేసు వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్‌పై విచారణ జరిపేందుకు గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ అనుమతి ఇవ్వడంతో తదుపరి చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. అందులో భాగంగా ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాల్సిందిగా అవినీతి నిరోధక శాఖ(ACB)కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) శాంతికుమారి లేఖ రాశారు.

ఫార్ములా రేసు పూర్వాపరాలు, అనుమతి లేకుండానే హెచ్‌ఎండీఏ(HMDA) ఒప్పందం చేసుకోవడం, ఆర్‌బీఐ అనుమతి లేకుండా రూ.46 కోట్ల మేర విదేశీ కరెన్సీ చెల్లించడం వంటి వ్యవహారాలపై పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి దానకిషోర్‌కు ఫిర్యాదు మేరకు ఏసీబీ ఇప్పటికే కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇందులో కేటీఆర్‌తోపాటు పురపాలకశాఖ అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను, చీఫ్‌ ఇంజినీర్‌ను బాధ్యులుగా పేర్కొన్నారు.

ప్రధాన అభియోగం ఇదే.. 
ఫార్ములా-ఈ ఆపరేషన్స్‌, ఎస్‌ నెక్ట్స్‌ జెన్‌, పురపాలకశాఖల మధ్య 9, 10, 11, 12వ సీజన్ల కార్‌ రేస్‌లు నిర్వహించేలా ఒప్పందం కుదిరింది. 2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో నెక్లెస్‌రోడ్డులో తొమ్మిదో సీజన్‌ రేసింగ్‌ నిర్వహించారు. ‘‘అప్పటి మంత్రి కేటీఆర్‌ ఆమోదంతోనే ఒప్పందం కుదిరింది. శాఖాధిపతిగా ఎంవోయూ చేశా’’ అని ఒప్పందంపై ఐఏఎస్‌ అర్వింద్‌ కుమార్‌ సీఎస్‌కు సమాధానమిచ్చారు. ఈ రేసు నిర్వహించిన విదేశీ సంస్థకు హెచ్‌ఎండీఏ బోర్డు, ఆర్థిక శాఖ, ఆర్బీఐల అనుమతి తీసుకోకుండానే నేరుగా రూ.55 కోట్లు చెల్లించడం వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా రూ.46 కోట్ల వరకు డాలర్ల రూపంలో చెల్లించారనేది ప్రధాన అభియోగం.

నెక్స్ట్‌ ఏంటంటే.. 
ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు భావించిన, అనుమానించిన వారందరికీ ఏసీబీ నోటీసులు ఇవ్వనుంది. వారిని విచారించి, వాంగ్మూలాలను నమోదు చేస్తుంది. అధికార దుర్వినియోగం జరిగినట్లు తేలితే సంబంధిత ఆధారాలను సేకరిస్తుంది. ముఖ్యంగా ఇందులో నిధుల మళ్లింపు కోణం ఏమైనా ఉందా...? అనే అంశంపై ఎక్కువ దృష్టి సారించనుంది. ఫార్ములా సంస్థకు చెల్లించిన రూ.55 కోట్లు ఎక్కడెక్కడి నుంచి చివరికి ఎవరి ఖాతాలోకి వెళ్లాయనే కోణంలోనూ పరిశీలించే అవకాశముంది.  అధికార దుర్వినియోగంపై ప్రాథమిక ఆధారాలు లభిస్తే... అందుకు బాధ్యులైన వారి అరెస్టు తప్పకపోవచ్చు. అదే జరిగితే ఆ వ్యవహారం సంచలనాత్మకంగా మారడం ఖాయం.

ఇదీ చదవండి: విభజన సమస్యల పరిష్కారం మరింత జఠిలం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement