నేడు ఏసీబీ ముందుకు కేటీఆర్‌! | Former Minister KTR to appear in Formula E race case hearing | Sakshi
Sakshi News home page

నేడు ఏసీబీ ముందుకు కేటీఆర్‌!

Published Mon, Jan 6 2025 4:39 AM | Last Updated on Mon, Jan 6 2025 5:30 AM

Former Minister KTR to appear in Formula E race case hearing

‘ఫార్ములా–ఈ రేసు’కేసు విచారణకు హాజరుకానున్న మాజీ మంత్రి 

కేటీఆర్‌ ఆదేశంతో నిబంధనలకు విరుద్ధంగా ఓ విదేశీ సంస్థకు రూ.54.88 కోట్లు చెల్లించినట్లు ఆరోపణలు 

దీనిపై సీనియర్‌ ఐఏఎస్‌ దాన కిశోర్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఏసీబీ

సాక్షి, హైదరాబాద్‌: ఫార్ములా–ఈ రేసుకు సంబంధించిన కేసు దర్యాప్తులో భాగంగా ఏసీబీ అధికారులు మున్సిపల్‌ శాఖ మాజీ మంత్రి కె. తారక రామారావును విచారించేందుకు సిద్ధమయ్యారు. సోమవారం ఉదయం 10:30 గంటలకు తమ ముందు విచారణకు హాజరుకావాలని కేటీఆర్‌కు ఈ నెల 3న ఏసీబీ అధికారులు సమన్లు జారీ చేయడం తెలిసిందే. ఈ మేరకు కేటీఆర్‌ ఏసీబీ ఎదుట విచారణకు హాజరుకానున్నారు. 

హైదరాబాద్‌లో ఫార్ములా–ఈ రేసు నిర్వహించిన యూకే సంస్థ ఫార్ములా–ఈ ఆపరేషన్స్‌ లిమిటెడ్‌ (ఎఫ్‌ఈఓ)కు నిబంధనలకు విరుద్ధంగా, కేబినెట్‌ ఆమోదం లేకుండానే కేటీఆర్‌ ఆదేశాలతో అధికారులు పలు దఫాల్లో రూ. 54.88 కోట్లు చెల్లించారనేది ప్రధాన ఆరోపణ. దీనిపై పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిశోర్‌ ఫిర్యాదుతో ఏసీబీ గతేడాది డిసెంబర్‌ 19న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. 

ఈ కేసులో కేటీఆర్‌ను ఏ–1గా, ఐఏఎస్‌ అధికారి అర్వింద్‌కుమార్‌ను ఏ–2గా, హెచ్‌ఎండీఏ మాజీ సీఈ బీఎల్‌ఎన్‌ రెడ్డిని ఏ–3గా చేర్చింది. ఇప్పటికే సేకరించిన పత్రాల ఆధారంగా కేటీఆర్‌ను ప్రశ్నించనుంది. మరోవైపు ఏసీబీ కేసు ఆధారంగా ఇప్పటికే ఈసీఐఆర్‌ నమోదు చేసిన ఈడీ.. ఈ నెల 7న విచారణకు రావాలంటూ కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. అయితే ఈడీ కేసులో ఏ–1గా ఉన్న బీఎల్‌ఎన్‌ రెడ్డి, అర్వింద్‌కుమార్‌ విచారణకు హాజరయ్యేందుకు మరికొంత సమయం కావాలని కోరగా అంగీకరించిన ఈడీ వారిద్దరికీ మళ్లీ సమన్లు జారీ చేసింది. 

ఈ నెల 8న బీఎల్‌ఎన్‌ రెడ్డిని, 9న అరి్వంద్‌కుమార్‌ను హాజరుకావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఈడీ ఎదుట విచారణకు హాజరుకావాల్సిన కేటీఆర్‌ సైతం వారి బాటలోనే మరికొంత సమయం అడుగుతారా లేదా అనేది వేచిచూడాల్సి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement