సాక్షి, హైదరాబాద్: ఫార్ములా ఈ రేసు కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు విచారణ సందర్భంగా హైడ్రామా నడిచింది. విచారణకు తనతో పాటు తన లాయర్‌ను ఆఫీస్‌లోకి అనుమతించకపోవడంపై కేటీఆర్ నిరసన వ్యక్తం చేశారు. అధికారుల స్పందన కోసం 40 నిమిషాల పాటు ఏసీబీ ఆఫీస్ బయట ఎదురు చూసి చివరకు అనుమతి లభించకపోవడంతో వెనుదిరిగారు. వెళ్లే క్రమంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘‘పోలీసులను నేను నమ్మ. లాయర్లు ఉంటేనే నాకు రక్షణ. అందుకే లాయర్‌తో వచ్చా. నా లాయర్‌తో విచారణకు హాజరవుతానంటే వీళ్లకు ఇబ్బంది ఏంటి?. అడ్వొకేట్ల సమక్షంలో విచారిస్తామంటే చెప్పమనండి.. లోపలికి వెళ్తా. పోలీసులు రాజమౌళి(దర్శకుడు) కంటే అద్భుతంగా కథలు అల్లుతున్నారు. నా స్టేట్‌మెంట్‌ను ఏఎస్పీకి రాతపూర్వకంగా ఇచ్చాను’’ అంటూ అక్కడి నుంచి నేరుగా తెలంగాణ భవన్‌కు వెళ్లిపోయారాయన. ఏసీబీ విచారణలో హైడ్రామా నడవడంతో లిఖితపూర్వక స్టేట్‌మెంట్ ఇచ్చి సరిపెట్టిన ఆయన.. రేపటి ఈడీ విచారణకు హాజరవుతారా? అనే ఉత్కంఠ నెలకొంది.
ఇందులో తప్పేంటి?: కేటీఆర్
అంతకు ముందు నందినగర్ నివాసం నుంచి బంజారాహిల్స్‌లోని ఏసీబీ ఆఫీస్‌కు తన లీగల్ టీంతో చేరుకున్నారాయన. ఆ టైంలో ఆయన లాయర్‌ను పోలీసులు లోపలికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో కేటీఆర్ వాగ్వాదానికి దిగారు. ఆపై మీడియాతో మాట్లాడారు.
ఫార్ములా ఈ రేసుపై మంత్రిగా నిర్ణయం తీసుకున్నా. ఏసీబీ దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి. ప్రభుత్వం కావాలనే కక్షపూర్వకంగా వ్యవహరిస్తోంది. ఈ కేసులో నన్ను అసలు విచారణకు పిలవాల్సిన అవసరం లేదు. పట్నం నరేందర్ రెడ్డి విషయంలో జరిగిందే.. నా విషయంలోనూ జరిగే అవకాశం ఉంది. నరేందర్ రెడ్డి విషయంలో తప్పుడు స్టేట్‌మెంట్ సృష్టించారు. అలాగే నన్ను విచారణకు పిలిచి.. నా ఇంటిపై ఏసీబీతో దాడులు చేయించాలని చూస్తున్నారు. వాళ్లే నా ఇంట్లో ఏదో ఒకటి పెట్టి ఇరికించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదో ఒకరకంగా నాపై తప్పుడు కేసు బనాయించాలని చూస్తున్నారు. నా లాయర్ నాతో పాటే విచారణకు వస్తే తప్పేంటి?. నా లాయర్‌ను అనుమతిస్తారంటే విచారణకు హాజరవుతా’’ అని బయటే అరగంటపైగా ఎదురు చూశారు. అయితే ఏసీబీ అంగీకరించకపోవడంతో ఆయన వెనుదిరిగారు.
ఏసీబీది తప్పే: కేటీఆర్ లాయర్
కేటీఆర్ వెంట తనను లోపలికి అనుమతించకపోవడంపై ఆయన లాయర్ సోమ భరత్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏసీబీ వైఖరిని తప్పుబట్టారాయన. లాయర్‌ను వెంట తీసుకెళ్లడం రాజ్యాంగబద్ధ హక్కు. చట్టాలన్నీ రాజ్యాంగానికి లోబడి ఉంటాయి. అని అన్నారాయన.
నోటీసుల్లో..
కేటీఆర్‌కు ఏసీబీ పంపిన నోటీసుల కాపీ సాక్షి(Sakshi) సంపాదించింది. అందులో ఏసీబీ అధికారులు కీలక అంశాలను పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు విచారణకు హాజరుకావాలని కేటీఆర్‌కు సూచించారు. సెక్షన్ 13 (1),13(2) పీసీ యాక్ట్, ఐపీసీ సెక్షన్ 409,120B సెక్షన్స్ కింద ఆయనకు నోటీసులు జారీ చేశారు. మరోవైపు.. ఎఫ్‌ఐఆర్ కాపీలో ఏ1గా కేటీఆర్ పేరు ఉంది.
బీఆర్‌ఎస్ నేతల సంఘీభావం
ఫార్ములా ఈ రేసు కేసులో విచారణకు హాజరవ్వడానికి ముందు.. కేటీఆర్‌ను పలువురు బీఆర్‌ఎస్ నేతలు కలిసి సంఘీభావం తెలిపారు. మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి. ఇతర బీఆర్‌ఎస్ నేతలు నందినగర్‌లోని నివాసానికి వెళ్లి మాట్లాడారు. మరోవైపు.. ముందస్తు జాగ్రత్త పేరుతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడికౌశిక్‌రెడ్డిని పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు.
మరోవైపు కేటీఆర్‌ను విచారించాలని.. డీజీ విజయ్‌కుమార్, డైరెక్టర్ తరుణ్ ఉదయాన్నే ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. విచారణ నేపథ్యంలో అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment