‘ఫార్ములా ఈ’ కేసులో ఏసీబీకి హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా–ఈ కార్ రేసు వ్యవహారంపై నమోదైన కేసులో ఎఫ్‌ఐఆర్‌ను రద్దుచేయాలని కోరుతూ.. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై తుది తీర్పు ప్రకటించేవరకు ఆయనను అరెస్టు చేయవద్దని ఏసీబీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 31 వరకు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. ఫార్ములా–ఈ కార్ రేసింగ్ కోసం విదేశీ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా డబ్బు చెల్లించారని మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేటీఆర్‌పై ఏసీబీ డిసెంబర్ 19న ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే.
ఈ కేసులో ఏ–1గా కేటీఆర్, ఏ–2గా నాటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్‌కుమార్, ఏ–3గా హెచ్‌ఎండీఏ నాటి చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డి పేరును చేర్చారు. ఈ ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ కె.లక్ష్మణ్ మంగళవారం మరోసారి విచారణ చేపట్టారు. ఏసీబీ తరఫున అడ్వొకేట్ జనరల్ ఏ.సుదర్శన్‌రెడ్డి, దానకిశోర్ తరఫున సీవీ మోహన్‌రెడ్డి, కేటీఆర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ దవే వాదనలు వినిపించారు. వాదనలు ముగియడంతో న్యాయమూర్తి తీర్పు రిజర్వు చేశారు. తుది తీర్పు వెల్లడించేవరకు కేటీఆర్‌ను అరెస్టు చేయరాదని ఆదేశించారు.
అవినీతి లేనప్పుడు సెక్షన్లు ఎలా పెడతారు?
అవినీతే లేనప్పుడు కేసు ఎలా నమోదుచేస్తారని కేటీఆర్ తరఫు న్యాయవాది సిద్దార్థ దవే వాదించారు. ‘ఫార్ములా –ఈ రేసు నిర్వహణ ఒప్పందంలో ముందుగా పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సంతకం చేశారు. అనంతరం కేటీఆర్ నోట్ ఫైల్‌పై సంతకం చేశారు. ఆ శాఖ మంత్రిగా ఉన్నంత మాత్రాన కేటీఆర్‌ను నిందితుడిగా చేర్చడం సరికాదు. ఈ చెల్లింపుల్లో అవినీతి జరిగినట్లు గానీ, వ్యక్తిగతంగా కేటీఆర్ లబ్ధి పొందినట్లుగానీ ఏసీబీ పేర్కొనలేదు. అందుకు ఎలాంటి ఆధారాలు లేవు. అలాంటప్పుడు అవినీతి నిరోధక (పీసీ) చట్టంలోని సెక్షన్ 13(1)(్చ), 13(2) కింద కేసు పెట్టడం చెల్లదు.
ఇది సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధం. లబ్ధి చేకూర్చినట్లు చెబుతున్న సంస్థపై కేసు పెట్టలేదు. నగదు చెల్లింపు బ్యాంక్ ద్వారానే జరిగింది. బిజినెస్ రూల్స్ ఉల్లంఘించారని చెబుతున్నా.. చట్టప్రకారం ప్రతి ఉల్లంఘన క్రిమినల్ నేరం కిందకు రాదు. ఎన్నికల కోడ్ సమయంలో పాలసీ నిర్ణయాలు తీసుకోకూడదు. కానీ, ముందే ఉన్న ఒప్పందాన్ని అమలు చేయవచ్చు. డిసెంబర్ 18 ఫిర్యాదు చేస్తే 19న ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలి’అని విజ్ఞప్తి చేశారు.
ప్రజా ప్రతినిధులకూ సెక్షన్ 405 వర్తిస్తుంది..
సిద్దార్థ దవే వాదనను ఏజీ తీవ్రంగా వ్యతిరేకించారు. ‘2023, అక్టోబర్ 30న సీజన్ 10కు సంబంధించి రెండో ఒప్పందం జరిగింది. కానీ, అక్టోబర్ 3న రూ.22,69,63,125 (పన్నులు అదనం), 11న రూ.23,01,97,500 (పన్నులు అదనం) చెల్లించారు. అంటే ఒప్పందానికి ముందే మొత్తం రూ.54,88,87,043 చెల్లింపులు చేశారు. ఫార్ములా ఈ రేసు ఆపరేషన్స్ (ఎఫ్‌ఈవో), మున్సిపల్ శాఖ మధ్య 2023, అక్టోబర్‌లో ఒప్పందం కుదిరింది. విదేశీ మారక ద్రవ్యం (పౌండ్) రూపంలో చెల్లింపులకు ఆర్‌బీఐ నిబంధనలు, బిజినెస్ రూల్స్‌ను తప్పకుండా పాటించాలి. కానీ పాటించలేదు.
హెచ్‌ఎండీఏ నుంచి రూ.10 కోట్లకు మించి ఎలాంటి చెల్లింపులు జరిపినా ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలి. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రిగా కేటీఆర్ నోట్ ఫైల్‌కు ఆమోదం తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే ఫార్ములా –ఈ రేసు ఒప్పందం చేసుకున్నారు. ఎఫ్‌ఈవోకు డబ్బులు చెల్లించాల్సిన బాధ్యత రేసు ప్రమోటర్ ఏస్ నెక్ట్స్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్‌ది. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే కోర్టులను ఆశ్రయించవచ్చు. కానీ, ప్రమోటర్‌ను రక్షించడం కోసమే చెల్లింపులు జరిపినట్లుగా ఉంది.
నిబంధనలు విరుద్ధంగా చెల్లింపులు జరిగినందునే ఈడీ కూడా కేసు నమోదు చేసింది. ఐపీసీ సెక్షన్లు 405, 409 ప్రజా ప్రతినిధులకు కూడా వర్తిస్తాయి. చంద్రబాబునాయుడు వర్సెస్ ఏపీ కేసులో సుప్రీంకోర్టు ఇదే విషయాన్ని చెప్పింది. అందువల్ల ఈ పిటిషన్‌ను కొట్టివేయండి’ అని ధర్మాసనాన్ని కోరారు.
సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘ఈ లావాదేవీల్లో అవినీతి జరిగిందా? డబ్బులు ఎలా వెళ్లాయి? మళ్లీ వచ్చాయా.. లేదా? అనేది విచారణలో తేలుతుంది. నిబంధనలు ఉల్లంఘన జరిగినప్పుడు దర్యాప్తు చేపట్టే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ప్రభుత్వ నగదు చెల్లింపులో ఉల్లంఘన జరిగితే సెక్షన్ 405 వర్తిస్తుంది. మంత్రి ఆదేశాలతోనే చెల్లింపులు జరిగాయి’ అని వాదించారు.
ఏజీకి న్యాయమూర్తి సూటి ప్రశ్నలు..
నిందితుడిపై ఉన్న ఆరోపణలు ఏంటి?
గత ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా నగదు చెల్లింపులకు పాల్పడ్డారు. అవినీతి నిరోధక చట్టం, నేరపూరిత కుట్ర సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాం.
‘ఫార్ములా– ఈ’ ప్రమోటర్ సంస్థను నిందితుల జాబితాలో చేర్చారా?
లేదు. దర్యాప్తులో భాగంగా నిందితులను చేర్చడం, తొలగించడం జరుగుతుంది.
దర్యాప్తు ఏ దశలో ఉంది? ఎంత మంది స్టేట్‌మెంట్ రికార్డు చేశారు?
దర్యాప్తు ప్రాథమిక దశలో ఉంది. వీలైనంత త్వరగా ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. ఫిర్యాదుదారు దానకిశోర్ స్టేట్‌మెంట్ రికార్డు చేశాం. నిందితుల స్టేట్‌మెంట్ రికార్టు చేయాల్సి ఉంది.
ఇతర నిందితులు ఏమైనా పిటిషన్లు దాఖలు చేశారా?
ఇప్పటివరకు ఎలాంటి పిటిషన్లు వేయలేదు. ఎవరినీ అరెస్టు చేయలేదు. గవర్నర్ అనుమతి తర్వాతే ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాం.
ప్రమోటర్ గ్యారంటీ సమర్పించారా? దాన్ని క్యాష్ చేసుకున్నారా?
దర్యాప్తులో ఆ వివరాలు సేకరించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment