ఏసీబీ కేసు నమోదైన 24 గంటల్లోనే రంగంలోకి దిగిన ఈడీ
వేడెక్కిన రాష్ట్ర రాజకీయాలు.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పరస్పర సవాళ్లు
‘ఫార్ములా–ఈ’పై చర్చకు బీఆర్‌ఎస్ ఆఫీసుకైనా వస్తానన్న సీఎం
2023 డిసెంబర్ నుంచి ఇప్పటిదాకా ఏం జరిగిందో త్వరలో బయటపెడతానని రేవంత్‌రెడ్డి ప్రకటన
ఈ అంశంలో అణాపైసా అవినీతి లేదని స్పష్టం చేసిన కేటీఆర్
ఉన్మాదులు తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని ధ్వజం
‘ఫార్ములా–ఈ’ అంశంపై చర్చకు అసెంబ్లీలో బీఆర్‌ఎస్ పట్టు
స్పీకర్ అనుమతించకపోవడంతో తీవ్ర నిరసన.. సభలో గందరగోళం
మరోవైపు కేటీఆర్‌ను ఈ నెల 30 వరకు అరెస్టు చేయవద్దంటూ హైకోర్టు ఆదేశం.. ఈ వ్యవహారంలో కేటీఆర్ ఏం లబ్ధి పొందారని ప్రశ్నించిన న్యాయమూర్తి
అదంతా దర్యాప్తులో తేలుతుందని సమాధానమిచ్చిన ఏజీ
దర్యాప్తు కొనసాగించవచ్చని హైకోర్టు సూచన.. దీనితో దూకుడు పెంచేందుకు ఏసీబీ ఏర్పాట్లు
రాష్ట్రంలో ‘ఫార్ములా–ఈ’ కార్ల రేసు అంశం మంటలు రేపుతోంది. ఏసీబీ కేసు నమోదైన 24 గంటల్లోనే ఈడీ రంగంలోకి దిగడం, మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు కోసం ఈసీఐఆర్ నమోదు చేయడం రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించింది. ఈ వ్యవహారం అసెంబ్లీని కూడా అట్టుడికించింది. బీఆర్‌ఎస్ సభ్యుల నిరసనలు, అధికార కాంగ్రెస్ సభ్యుల విమర్శలతో సభ స్తంభించిపోయింది. ఫార్ములా–ఈ అంశంపై చర్చకు సిద్ధమని, సభలోనైనా సరే లేదా బీఆర్‌ఎస్ కార్యాలయానికి రమ్మన్నా సరే వస్తానంటూ సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ విసరగా.. కార్ల రేసు అంశంలో అణా పైసా అవినీతి జరగలేదని, కొందరు ఉన్మాదులు తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. మరోవైపు ఈ నెల 30 వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయవద్దంటూ హైకోర్టు ఊరటనిచ్చింది. ఈ వ్యవహారంలో కేటీఆర్ ఏం లబ్ధి పొందారని ప్రశ్నించింది. ప్రాథమిక విచారణ లేకుండా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం సరికాదని వ్యాఖ్యానించింది. అదే సమయంలో దర్యాప్తు కొనసాగించవచ్చని సూచించింది. దీనితో దూకుడు పెంచాలని నిర్ణయించిన ఏసీబీ.. అధికారులు, నిందితుల నుంచి వాంగ్మూలాలు తీసుకునేందుకు ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఇక ఈ అంశంలో రంగంలోకి దిగిన ఈడీ ... ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగా ‘ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు’ నమోదు చేసింది.
‘ఫార్ములా–ఈ’పై ఈడీ కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: ‘ఫార్ములా–ఈ’కార్ల రేసు వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. ఏసీబీ పెట్టిన కేసు ఆధారంగా ‘ఎన్‌ఫోర్స్‌మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్)’ను నమోదు చేసింది. హైదరాబాద్ మహా నగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) నుంచి విదేశీ కంపెనీకి నిధుల చెల్లింపు అంశంలో రాష్ట్ర అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) గురువారం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ‘ఫార్ములా–ఈ’కారు రేస్ నిర్వహణకు సంబంధించి హెచ్‌ఎండీఏ నుంచి పలు దఫాల్లో రూ.45,71,60,625 సొమ్మును యూకేకు చెందిన ‘ఫార్ములా–ఈ ఆపరేషన్స్ (ఎఫ్‌ఈఓ)’కు బదిలీ చేశారని పేర్కొంటూ.. మాజీ మంత్రి కేటీఆర్, మరో ఇద్దరు అధికారులను అందులో నిందితులుగా చేర్చారు.
ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా.. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ కోణంలో విచారణ కోసం ఈడీ చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఈడీ హైదరాబాద్ జోనల్ జాయింట్ డైరెక్టర్ శుక్రవారం ఏసీబీ డీజీ విజయ్‌కుమార్‌కు లేఖ రాశారు. విదేశీ కంపెనీతో జరిగిన నగదు లావాదేవీలు, ఇతర వివరాలన్నీ తమకు ఇవ్వాలని కోరారు. ఏసీబీ నుంచి అందిన వివరాల ఆధారంగా.. మాజీ మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్, మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డిలపై మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద ఈసీఐఆర్ నమోదు చేశారు. అన్ని అంశాలను పరిశీలించి ‘ఫారిన్ ఎక్ఛ్సేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా)’కింద కూడా దర్యాప్తు కొనసాగే అవకాశం ఉన్నట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి.
దర్యాప్తు వేగం పెంచిన ఏసీబీ..
‘ఫార్ములా–ఈ’వ్యవహారంలో ఏసీబీ దర్యాప్తు కొనసాగించవచ్చని హైకోర్టు పేర్కొన్న నేపథ్యంలో... ఏసీబీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసిన అభియోగాలకు సంబంధించిన ఆధారాల సేకరణ, నిందితులు, కేసుతో సంబంధం ఉన్న వారి వాంగ్మూలాల నమోదుపై దృష్టిపెట్టారు. తొలుత ఈ అంశంపై ఏసీబీకి ఫిర్యాదు చేసిన పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిశోర్ నుంచి మరోమారు వివరాలు సేకరించనున్నారు. ఈ–కార్ రేసు నిర్వహణకు సంబంధించి కుదుర్చుకున్న ఒప్పందాలు, నిధుల చెల్లింపులు, ఇతర లావాదేవీల వివరాలు తీసుకోనున్నారు.
హెచ్‌ఎండీఏ సాధారణ నిధుల నుంచి ఫార్ములా–ఈ రేసు నిర్వహణ కంపెనీ ‘ఫార్ములా–ఈ ఆపరేషన్స్ (ఎఫ్‌ఈఓ)’కు నిధుల చెల్లింపునకు సంబంధించి.. అధికారుల మధ్య సంప్రదింపుల ఫైళ్లను పరిశీలించనున్నారు. కీలక డాక్యుమెంట్ల సేకరణతోపాటు ఎప్పటికప్పుడు వాటిని విశ్లేషించేలా దర్యాప్తు బృందం సభ్యులకు విధులు అప్పగించారు. ఈ కేసును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, ప్రధాన నిందితుడు కేటీఆర్ ప్రధాన ప్రతిపక్షంలోని కీలక వ్యక్తి కావడంతో ఏసీబీ ఉన్నతాధికారులు నేరుగా కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చర్యలు చేపడుతున్నారు. కీలక ఆధారాల సేకరణ తర్వాత నిందితులకు నోటీసులు జారీ ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఈనెల 30 వరకు అరెస్టు వద్దు
సాక్షి, హైదరాబాద్: ‘ఫార్ములా–ఈ’కార్ రేసు కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.తారక రామారావుకు హైకోర్టు ఊరటనిచ్చింది. ఈ నెల 30వ తేదీ వరకు ఆయనను అరెస్టు చేయవద్దని ఏసీబీని ఆదేశించింది. అయితే కేసు దర్యాప్తును కొనసాగించవచ్చని పేర్కొంది. అధికారులు అడిగిన డాక్యుమెంట్లు, వివరాలు అందజేసి దర్యాప్తునకు సహకరించాలని పిటిషనర్ (కేటీఆర్)కు సూచించింది. ఈ పిటిషన్‌పై పది రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీకి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్‌కు నోటీసులు జారీ చేసింది. విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.
లంచ్‌మోషన్ పిటిషన్ మేరకు..
ఫార్ములా–ఈ వ్యవహారంలో కేటీఆర్, ఇద్దరు అధికారులను నిందితులుగా చేరుస్తూ.. ఏసీబీ రెండు రోజుల క్రితం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆ కేసు ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ శుక్రవారం హైకోర్టులో లంచ్‌మోషన్ రూపంలో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రజాప్రతినిధుల కేసులపై విచారణ చేపట్టాల్సిన రోస్టర్ న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ సెలవులో ఉండటంతో.. జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ వద్ద విచారణ చేపట్టాలని న్యాయవాదులు ప్రభాకర్‌రావు, గండ్ర మోహన్‌రావు కోరారు. దీనిపై సీజే బెంచ్ అనుమతితో మధ్యాహ్నం 3 గంటల సమయంలో జస్టిస్ శ్రవణ్‌కుమార్ విచారణ చేపట్టారు.
అవినీతి ఎక్కడ జరిగిందో చెప్పలేదు..
కేటీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది సి.ఆర్యామ సుందరం వాదనలు వినిపిస్తూ.. ‘‘2023 అక్టోబర్‌లో జరిగిన ఘటనపై 14 నెలలు ఆలస్యంగా ఈ నెల 18న సాయంత్రం 5.30 గంటలకు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. కనీసం ప్రాథమిక విచారణ కూడా చేయకుండానే అవినీతి నిరోధక (పీసీ) చట్టంలోని సెక్షన్ 13(1)( ్చ), 13(2) కింద కేసు పెట్టడం సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధం. ఆ సెక్షన్లు ఈ కేసుకు వర్తించవు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వోద్యోగులపై ప్రాథమిక విచారణ లేకుండా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయవద్దని లలితాకుమారి, చరణ్‌సింగ్ కేసుల్లో సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. వాటిని ఏసీబీ ఉల్లంఘించింది.
ప్రొసీజర్ పాటించలేదు. ఎఫ్‌ఐఆర్ నమోదుకు 14 నెలలు ఎందుకు ఆగారో కారణాలు లేవు. నిందితులు వ్యక్తిగతంగా ఆర్థిక లబ్ధి పొందారనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. అవినీతి ఎక్కడ జరిగిందో చెప్పకుండానే పీసీ యాక్ట్ సెక్షన్లు పెట్టారు..’’అని న్యాయమూర్తికి వివరించారు. రాజకీయ కక్ష సాధింపు కోసమే కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. 2022 అక్టోబర్ 25న ఫార్ములా–ఈ రేస్ నిర్వహణపై తొలి ఒప్పందం జరిగిందని.. 2023 అక్టోబర్‌లో నిధుల చెల్లింపు ఒప్పందం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు రాదని వివరించారు. నగదు చెల్లింపులో ప్రొసీజర్ పాటించలేదని ఏసీబీ పేర్కొనడం సరికాదని.. సీజన్ 9, 10, 11, 12 నిర్వహణ కోసం 2022లోనే ఒప్పందం కుదిరిందని తెలిపారు.
సీజన్ 9 నిర్వహణతో దాదాపు రూ.700 కోట్లు లాభం వచ్చిందని.. గ్లోబల్ సిటీగా హైదరాబాద్‌ను నిలపడంలో ఫార్ములా–ఈ కీలక పాత్ర పోషించిందని, అంతర్జాతీయంగా పేరు వచ్చిందని వివరించారు. సీజన్ 10 నిర్వహణ నుంచి స్పాన్సర్ తప్పుకోవడంతో ప్రభుత్వమే ఆ బాధ్యతలు తీసుకుందని, అందులో భాగంగానే చెల్లింపులు జరిపిందని తెలిపారు. కానీ కొత్త ప్రభుత్వం ఒప్పందాన్ని ఉల్లంఘించి రేసింగ్‌ను రద్దు చేసిందని.. రద్దుపై ఆర్బిట్రేషన్‌కు కూడా వెళ్లాల్సి వచ్చిందని వివరించారు. రేసింగ్ జరిగి ఉంటే పెద్ద ఎత్తున లాభాలు వచ్చేవని పేర్కొన్నారు. ప్రైవేట్ సంస్థకు లబ్ధి చేకూర్చామని ఏసీబీ పేర్కొందని, కానీ ఆ సంస్థపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని గుర్తు చేశారు.
ఫిర్యాదుకు ముందే ప్రాథమిక విచారణ జరిపాం
ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఏ.సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘‘ఎఫ్‌ఐఆర్ అనేది ఎన్‌సైక్లోపీడియా కాదు. ఇది విచారణ ప్రారంభం మాత్రమే. అంతా ఎఫ్‌ఐఆర్‌లో ఉండదు. కొత్తగా నిందితులను చేర్చే అవకాశం ఉంటుంది. చార్జిషీట్‌లో మాత్రమే అన్ని వివరాలుంటాయి. ఫిర్యాదుకు ముందే ప్రాథమిక విచారణ జరిపాం. పిటిషనర్ ఎమ్మెల్యే కావడంతో గవర్నర్ నుంచి అనుమతి కూడా పొందాం. ఆ తర్వాతే ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాం. 2023 అక్టోబర్ 30న రెండో ఒప్పందం జరిగింది. కానీ అక్టోబర్ 3న (రూ.22,69,63,125 ప్లస్ పన్నులు అదనం), 11న (రూ.23,01,97,500 ప్లస్ పన్నులు అదనం).. అంటే ముందుగానే మొత్తం రూ.56 కోట్లు చెల్లింపులు చేశారు. రూ.700 కోట్లు లాభాలు వచ్చి ఉంటే స్పాన్సర్ ఎందుకు వెళ్లిపోతారు?’’అని ప్రశ్నించారు.
ఫార్ములా–ఈ సంస్థకు డబ్బును విదేశీ కరెన్సీలో చెల్లించారని, దానితో హెచ్‌ఎండీఏపై అధిక భారం పడిందని తెలిపారు. విదేశీ కరెన్సీలో చెల్లింపు కోసం రిజర్వుబ్యాంకు అనుమతి తీసుకోలేదని.. ఆర్థికశాఖ అనుమతి కూడా లేదని వివరించారు. క్వాష్ పిటిషన్‌పై ఇంత అత్యవసరంగా విచారణ అవసరం లేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి కల్పించుకుని.. ‘‘పిటిషనర్ ఏం లబ్ధిపొందారు? ఎందుకు ఆ సెక్షన్లు పెట్టారు?’అని ప్రశ్నించారు. అదంతా దర్యాప్తులో తేలుతుందని ఏజీ బదులిచ్చారు. పిటిషనర్‌కు ఎలాంటి ఉపశమన ఆదేశాలు ఇవ్వొద్దని కోరారు.
ఎఫ్‌ఐఆర్ నమోదులో లోటుపాట్లు
కేటీఆర్ తరఫు న్యాయవాది ఆర్యామ సుందరం వాదిస్తూ.. ఫిర్యాదుకు ముందు విచారణ చేయడం కాదని, ఫిర్యాదు చేసిన తర్వాత ఎఫ్‌ఐఆర్‌కు ముందు ప్రాథమిక విచారణ చేయాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని న్యాయమూర్తికి వివరించారు. ఫిర్యాదుకు ముందే విచారణ చేశామని, గవర్నర్ అనుమతి తీసుకున్నామని ఏజీ చెప్పడం సరికాదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. ఎఫ్‌ఐఆర్ నమోదులో లోటుపాట్లు ఉన్నాయని, ప్రాథమిక విచారణ కూడా చేయలేదని పేర్కొన్నారు. సీఆరీ్పసీ సెక్షన్ 482 మేరకు హైకోర్టుకు ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేసేందుకు, అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇచ్చేందుకు విశిష్ట అధికారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ మేరకు పిటిషనర్‌ను ఈ నెల 30 వరకు అరెస్టు చేయవద్దని ఏసీబీని ఆదేశించారు. తదుపరి విచారణను 27వ తేదీకి వాయిదా వేస్తూ, ఆ రోజున రోస్టర్ న్యాయమూర్తి విచారణ చేపడతారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment