ఏసీబీ విచారణ ప్రారంభించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం
‘ఫార్ములా–ఈ’ కార్ రేసులో భారీగా డబ్బు చేతులు మారినట్టు అభిప్రాయపడ్డ కేబినెట్
అర్వింద్‌కుమార్, ఇతర అధికారులపైనా ఏసీబీ విచారణకు నిర్ణయం
ఈ అంశంలో తక్షణమే ఏసీబీకి లేఖ రాయాలని సీఎస్‌కు ఆదేశం
దీంతో కేటీఆర్‌ను అరెస్టు చేయవచ్చంటూ తీవ్రస్థాయిలో ఊహాగానాలు
చట్టం తన పని తాను చేసుకుపోతుందని మంత్రివర్గ భేటీ తర్వాత మంత్రుల వ్యాఖ్యలు
‘విద్యుత్’ కమిషన్ నివేదికకూ ఆమోదం.. నేడో రేపో అసెంబ్లీ ముందుకు..
భూమిలేని రైతు కూలీలకు ఈ నెల 28 నుంచి రూ. 12 వేల సాయానికి ఓకే
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావుపై ‘ఫార్ములా–ఈ’ అస్త్రం ప్రయోగించేందుకు కాంగ్రెస్ సర్కారు సిద్ధమైంది. ఈ వ్యవహారంపై ఏసీబీ విచారణ ప్రారంభించాలని సోమవారం సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకుంది. దీనిపై తక్షణమే ఏసీబీకి లేఖరాయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించినట్టు సమాచారం.
ఈ పరిణామాల నేపథ్యంలో కేటీఆర్‌ను తక్షణమే అరెస్టు చేస్తారా? అన్న అంశంపై తీవ్రస్థాయిలో ఊహాగానాలు జరుగుతున్నాయి. చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ మంత్రివర్గ భేటీ తర్వాత కొందరు మంత్రులు వ్యాఖ్యలు చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది. నిజానికి రాష్ట్రంలో రాజకీయ బాంబులు పేలుతాయని గతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించిన సమయంలోనే.. ‘ఫార్ములా–ఈ’ రేసు వ్యవహారంలో కేటీఆర్‌ను అరెస్టు చేయవచ్చంటూ ప్రచారం జరిగింది.
గవర్నర్ అనుమతితో ముందుకు..
సోమవారం సాయంత్రం అసెంబ్లీ కమిటీ హాల్‌లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిసింది. ‘ఫార్ములా–ఈ’ కార్ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్‌పై విచారణ చేపట్టేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై రాష్ట్ర మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే ఏసీబీ విచారణ ప్రారంభించాలని నిర్ణయించినట్టు విశ్వసనీయ సమాచారం. అయితే ఈ అంశంపై సూటిగా స్పందించేందుకు ప్రభుత్వ వర్గాలు నిరాకరించాయి.
విదేశీ సంస్థలకు నేరుగా నిధులు ఎలా చెల్లిస్తారు?
‘విదేశీ కంపెనీలైన ఫార్ములా–ఈ ఆపరేషన్స్ (ఎఫ్‌ఈఓ), ఏస్ నెక్ట్స్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు నేరుగా ప్రభుత్వ నిధులను చెల్లించే విషయంలో నిర్ణయాధికారం నాటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్‌కు ఉందా? రిజర్వు బ్యాంకు అనుమతి లేకుండా విదేశీ కంపెనీలకు నేరుగా ప్రభుత్వ నిధులను చెల్లించవచ్చా? ఈ విషయంలో నిబంధనల ఉల్లంఘన ఏమైనా జరిగిందా? అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఈ ఒప్పందం ఎలా చేసుకుంటారు?’ అనే అంశాలపై ఏసీబీ విచారణ జరపాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది.
భారీగా డబ్బులు చేతులు మారాయని..
ఫార్ములా–ఈ కార్ల రేసులో అవకతవకలు జరిగాయని.. భారీగా డబ్బులు చేతులు మారాయని మంత్రివర్గం అనుమానాలు వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఆ క్రీడల నిర్వహణతో రాష్ట్రానికి రూ.7 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఇటీవల కేటీఆర్ పేర్కొన్న నేపథ్యంలో... ఈ విషయాలను ఆయన ఏసీబీకి చెప్పుకోవాలని కీలక మంత్రి ఒకరు పేర్కొన్నారు. కేటీఆర్ అరెస్టు భయంతోనే ఇంటి దగ్గర కాపలా పెట్టుకున్నారని, కేంద్రంలోని పెద్దలను కలిసేందుకు ఢిల్లీకి వెళ్లారని ఆరోపించారు. ఎవరినో అరెస్టు చేస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందా?, బీఆర్‌ఎస్ నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు.
అధికారులు కూడా విచారణ ఎదుర్కోవాల్సిందే!
‘ఫార్ములా–ఈ’ కారు రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్‌తోపాటు ఐఏఎస్ అధికారి అరవింద్‌కుమార్, ఇతర అధికారులు విచారణ ఎదుర్కోవాల్సిందేనని కీలక మంత్రి ఒకరు పేర్కొన్నారు. అరవింద్‌కుమార్ విచారణకు కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ (డీఓపీటీ) అనుమతి అవసరం లేదని.. సీఎస్ అనుమతిస్తే సరిపోతుందని తెలిపారు. అధికారిపై నేరారోపణలు నమోదు చేసే సమయంలోనే డీఓపీటీ అనుమతి అవసరమని వెల్లడించారు. ఫార్ములా–ఈ ఆపరేషన్స్ (ఎఫ్‌ఈఓ), ఏస్ నెక్ట్స్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలపై సైతం ఏసీబీ విచారణ చేపడుతుందని, వాటికి కూడా నోటీసులు ఇస్తుందని పేర్కొన్నారు. కేటీఆర్ మౌఖిక ఆదేశాలతోనే ఆ రెండు కంపెనీలకు నిధులు చెల్లించినట్టు అరవింద్‌కుమార్ ఇప్పటికే తెలిపారని గుర్తు చేశారు.
కీలక నిర్ణయాలు.. అసెంబ్లీలోనే ప్రకటన
సీఎం రేవంత్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నా అధికారికంగా వెల్లడించలేదు. వీటిపై అసెంబ్లీలోనే ప్రకటన చేయనున్నట్టు తెలిసింది. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంలో అవకతవకలపై వేసిన జస్టిస్ మదన్ బి.లోకూర్ కమిషన్ సమర్పించిన నివేదికపై మంత్రివర్గం చర్చించి ఆమోదించినట్టు సమాచారం. ఈ నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టి విస్తృతంగా చర్చించాలని నిర్ణయించినట్టు తెలిసింది.
రెవెన్యూ శాఖ ప్రక్షాళన కోసం కొత్తగా తెచ్చిన రికార్డ్ ఆఫ్ రైట్స్(ఆర్‌ఓఆర్) బిల్లుతోపాటు పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, విశ్వవిద్యాలయాల బిల్లులు, జీఎస్టీ చట్ట సవరణ బిల్లులను కూడా కేబినెట్ ఆమోదించినట్టు సమాచారం. ఇక ఎన్నిక సమయంలో ఇచ్చిన హామీల మేరకు రైతు భరోసా కింద భూమి లేని రైతుకూలీలకు డిసెంబర్ 28 నుంచి రూ.12 వేల ఆర్థిక సాయం చెల్లింపు, కొత్త రేషన్ కార్డుల జారీపైనా చర్చించి నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిసింది. నేడో, రేపో వీటిపై అసెంబ్లీ ప్రకటన చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment