ఫార్ములా– ఈ కార్ రేసు వ్యవహారంపై ఏసీబీ కేసు
రేసు నిర్వహణకు అనుమతుల్లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా రూ.54.88 కోట్లు చెల్లించినట్లు ఆరోపణలు
ఏ–2గా అప్పటి ఎంఏయూడీ స్పెషల్ సీఎస్ అర్వింద్‌కుమార్, ఏ–3గా హెచ్‌ఎండీఏ మాజీ సీఈ బీఎల్‌ఎన్ నర్సింహారెడ్డి
పీసీ యాక్ట్, ఐపీసీ 409, 120–బీ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్
నేరపూరిత కుట్ర, అధికార దుర్వినియోగం ఆరోపణలతో కేసులు
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా–ఈ కార్ రేసు వ్యవహారంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసు నమోదు చేసింది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మాజీ మంత్రి కేటీ రామారావును ఏ–1 (మొదటి నిందితుడు)గా, పురపాలక శాఖ (ఎంఏయూడీ) మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను ఏ–2గా, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డిని ఏ–3గా చేర్చింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కొందరు అధికారులు నిబంధనలకు విరుద్ధంగా, ప్రభుత్వ అనుమతి లేకుండానే.. పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ఫార్ములా–ఈ కార్ రేసు నిర్వహణకు సంబంధించి పలు దఫాల్లో రూ.54,88,87,043 బదిలీ చేశారన్నది ప్రధాన ఆరోపణ.
దీనిపై పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిశోర్ ఫిర్యాదుతో.. ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ (సీఐయూ) డీఎస్పీ మాజిద్ అలీఖాన్ అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్)లోని సెక్షన్ 13(1) (ఏ), 13(2), ఐపీసీ సెక్షన్ 409, 120–బీ కింద గురువారం కేసు (ఎఫ్‌ఐఆర్) నమోదు చేశారు. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌ను విచారించేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతివ్వడంతో ఏసీబీ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న అంశాల ప్రకారం కేసు వివరాలు ఇలా ఉన్నాయి.
సాధారణ నిధుల నుంచే రూ.54,88,87,043 చెల్లింపులు
హైదరాబాద్‌లో ఫార్ములా⇒ ఈ కార్ రేసు సీజన్ 9, 10, 11, 12 నిర్వహించేందుకు 2022 అక్టోబర్ 25న యూకేకు చెందిన ఫార్ములా–ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ (ఎఫ్‌ఈఓ), తెలంగాణ ప్రభుత్వ పురపాలక శాఖ, ఏస్ నెక్ట్స్ జెన్ ప్రైవేటు లిమిటెడ్ (స్పాన్సర్)కు మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. 2023 ఫిబ్రవరి 11న నిర్వహించిన ఫార్ములా–ఈ రేస్ మొదటి సీజన్ (9) కోసం హెచ్‌ఎండీఏ రూ.12 కోట్లు ఖర్చు పెట్టింది.
ఆ తర్వాత ఎఫ్‌ఈఓకు స్పాన్సర్‌కు మధ్య వచ్చిన విభేదాలతో ఫార్ములా⇒ ఈ కార్ రేసు సీజన్ 10 నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రైవేటు స్పాన్సర్ స్థానంలో తామే అన్ని ఖర్చులు భరించేలా హెచ్‌ఎండీఏ అధికారులు, ఎఫ్‌ఈఓ మధ్య చర్చలు జరిగాయి. సీజన్ 10 కార్ రేసు నిర్వహణకు సంబంధించిన ఫీజుల నిమిత్తం, ఇతర సదుపాయాల ఏర్పాటుకు అయ్యే మొత్తం రూ.160 కోట్లు ఖర్చు పెట్టేందుకు పురపాలక అధికారులు పరిపాలన అనుమతులిచ్చారు. ఇందులో మొదటి దఫా కింద 2023 అక్టోబర్ 3న రూ.22,69,63,125 చెల్లించేందుకు హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ మంజూరు ఇచ్చారు.
రెండో దఫా కింద 2023 అక్టోబర్ 11న మరో రూ.23,01,97,500 ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్, హిమాయత్‌నగర్ బ్రాంచ్ నుంచి యూకేలోని ఎఫ్‌ఈఓ కంపెనీ ఖాతాల్లోకి బదిలీ చేశారు. ఇంత పెద్ద మొత్తంలో విదేశాలకు నిధులు బదిలీ చేయడంలో నిబంధనలు పాటించకపోవడంతో హెచ్‌ఎండీఏ ఆదాయ పన్ను శాఖకు మరో రూ.8,06,75,404 పన్నుల రూపంలో చెల్లించాల్సి వచ్చింది. అదేవిధంగా ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్స్ ఆఫ్ ఇండియాకు ఇంటర్ స్టేట్ చాంపియన్‌షిప్ క్యాలెండర్ ఫీజు, పర్మిట్ ఫీజు కోసం మరో రూ.1,10,51,014 హెచ్‌ఎండీఏ చెల్లించింది. ఇలా మొత్తం రూ.54,88,87,043 హెచ్‌ఎండీఏ చెల్లించింది. ఇవన్నీ సాధారణ నిధుల నుంచే సంస్థ చెల్లించిందని ఏసీబీ పేర్కొంది.
అనుమతుల్లేకుండానే చెల్లింపులు
⇒ హెచ్‌ఎండీఏ నిబంధనల ప్రకారం రూ.10 కోట్లకు మించి ఖర్చు అయ్యే పనులు చేసేందుకు పరిపాలన అనుమతులు ఇవ్వాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. కానీ అనుమతి తీసుకోలేదు.
⇒ హెచ్‌ఎండీఏ చెల్లించిన రూ.54,88,87,043కు సంబంధించి ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరి. కానీ ఆర్థికశాఖ దృష్టికే తీసుకెళ్లలేదు.
⇒ హెచ్‌ఎండీఏ అగ్రిమెంట్‌లో పార్టీ కాకపోయినా నగదు చెల్లింపులు చేసింది.
⇒ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నా ఎన్నికల కమిషన్ నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోకుండానే 2023 అక్టోబర్ 30న అగ్రిమెంట్లు కుదుర్చుకున్నారు.
⇒ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా..ఎన్నికల కమిషన్ నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోకుండానే ఎఫ్‌ఈఓకు హెచ్‌ఎండీఏ నుంచి చెల్లింపులు జరిగాయి.
⇒ ఫారిన్ ఎక్సేంజ్ రెమిటెన్స్ నిబంధనలను ఉల్లంఘించి విదేశీ మారకద్రవ్యం రూపంలో చెల్లింపులు జరిగాయి.
⇒ ప్రభుత్వం తరఫున ఏవైనా అగ్రిమెంట్లు చేసుకోవాలంటే ఆర్థిక, న్యాయశాఖల సమ్మతితో పాటు కేబినెట్ అనుమతి తీసుకోవాలి. తీసుకోలేదు.
⇒ ఈ ఒప్పందాలన్నీ మోసపూరితమైనవని ప్రభుత్వం దృష్టికి వచ్చింది.
⇒ అధికారులు, మాజీ మంత్రి కేటీఆర్ కలిసి నేర పూరిత కుట్రకు, ఉల్లంఘనలకు పాల్పడ్డారు. అధికార దుర్వినియోగం చేశారు. ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చేలా వ్యవహరించారని ఏసీబీ తన ఎఫ్‌ఐఆర్‌లో ఆరోపించింది.
ఏమిటీ సెక్షన్లు.. శిక్ష ఏమిటి?
⇒ నిజాయితీ లేకుండా, మోసపూరితంగా సొంత ప్రయోజనం కోసం ప్రభుత్వ ఆస్తిపై ఇతరులకు హక్కు కట్టబెట్టడం అవినీతి నిరోధక చట్టం–1988 సెక్షన్ 13(1) (ఏ), సెక్షన్ 13(2) కిందకు వస్తాయి. నేరపూరిత దు్రష్పవర్తన, అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టుగా రుజువైతే ఏడాదికి తక్కువ కాకుండా అత్యధికంగా ఏడేళ్ల వరకు ఈ సెక్షన్ల కింద జైలు శిక్ష వేయవచ్చు. అదనంగా జరిమానా కూడా విధించవచ్చు.
⇒ ఐపీసీ సెక్షన్ 409, 120–బీ నేరపూరిత కుట్రకు సంబంధించినది. ప్రభుత్వోద్యోగి, బ్యాంకర్, వ్యాపారి నేరపూరితంగా విశ్వాస ఉల్లంఘనకు పాల్పడటం పబ్లిక్ సర్వెంట్ హోదాలో ఉండి అతని అదీనంలోని ఆస్తి విషయంలో నేర ఉల్లంఘటనకు పాల్పడటం, నిధులను పక్కదారి పట్టించడం వంటివి దీని కిందకు వస్తాయి. నేరం రుజువైతే ఏడాది నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష, అదనంగా జరిమానా కూడా విధించవచ్చు.
హైకోర్టులో నేడు కేటీఆర్ క్వాష్ పిటిషన్!
తనపై నమోదైన కేసు కొట్టివేయాలని, అరెస్టు సహా ఎలాంటి కఠిన చర్యలు చేపట్టకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కేటీఆర్, ఇతర నిందితులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కేటీఆర్ ప్రజా ప్రతినిధి కావడంతో పోర్ట్‌ఫోలియో ప్రకారం జస్టిస్ కె.లక్ష్మణ్ వద్ద ఇది విచారణకు వస్తుంది.
అయితే శుక్రవారం ఆయన సెలవులో ఉండటంతో జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ వద్ద లంచ్‌మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేసే చాన్స్ ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment