ఫార్ములా–ఈ కారు రేస్ వ్యవహారంలో ఏసీబీ కేసుపై హైకోర్టు తీర్పు
కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసిన జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం
కేసు దర్యాప్తునకు ప్రాథమిక ఆధారాలున్నాయి
నిజానిజాలు నిగ్గుతేలాలంటే దర్యాప్తునకు అవకాశం ఇవ్వాలి
ఇప్పుడు అడ్డుకోవడం తొందరపాటు చర్యే అవుతుందన్న న్యాయస్థానం
అరెస్టు చేయకుండా గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేత
దర్యాప్తు అధికారాలను కోర్టులు తమ చేతుల్లోకి తీసుకోబోవని వ్యాఖ్య
అప్పీల్‌కు వీలుగా 10 రోజుల సమయం ఇచ్చేందుకు నిరాకరణ
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా–ఈ కార్ రేసు వ్యవహారంలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావుకు హైకోర్టులో నిరాశ ఎదురైంది. దర్యాప్తును అడ్డుకునేలా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని ఉన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. అప్పీల్ చేసుకునేందుకు వీలుగా 10 రోజుల వరకు అరెస్టు చేయకుండా ఆదేశాలిచ్చేందుకు నిరాకరించింది.
కేసు దర్యాప్తునకు ప్రాథమిక ఆధారాలున్నాయని అభిప్రాయపడింది. కేటీఆర్‌ను అరెస్టు చేయరాదంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం మంగళవారం తీర్పు ఇచ్చింది. ఫార్ములా ఈ రేసును హైదరాబాద్‌లో నిర్వహించే నిమిత్తం హెచ్‌ఎండీఏ ఒప్పందం చేసుకోవడం వెనుక నాటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పాత్ర ఉందని, ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఖజానాకు ఆర్థిక నష్టం వాటిల్లిందంటూ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిశోర్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు.
దీంతో గత నెల 20న ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఈ ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ గత నెల 20న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపి డిసెంబర్ 31న తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం..మంగళవారం ఉదయం 35 పేజీల తీర్పు వెలువరించింది.
సాక్ష్యాల సేకరణకు అవకాశం ఇవ్వాలి
‘ఆర్థిక శాఖ అనుమతి లేకుండా రూ.54,88,87,043 నగదు రెండు దఫాలుగా విదేశీ కంపెనీకి చెల్లించాల్సిందిగా హెచ్‌ఎండీఏను నాటి మంత్రి కేటీఆర్ ఆదేశించారనేది ఆరోపణ. దురుద్దేశంతో నిధులు బదిలీ చేయమని ఆదేశించారా? తన లబ్ధి కోసం చెల్లించమన్నారా? మూడో పార్టీకి లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారా? అనేది దర్యాప్తులో తేలుతుంది. హెచ్‌ఎండీఏ నిధుల దుర్వినియోగం, అనుమతి లేకుండా బదిలీ జరిగినట్టుగా ప్రాథమిక ఆధారాలు తెలియజేస్తున్నాయి. విచారణ జరిపేందుకు ఇవి సరిపోతాయి.
ఆరోపణలపై నిజానిజాలు నిగ్గుతేలాలంటే దర్యాప్తు చేయడానికి అవకాశం ఇవ్వాలి. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన మరుసటి రోజే దాన్ని కొట్టివేయాలంటూ దాఖలైన ఇలాంటి పిటిషన్‌పై గతంలో సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. దర్యాప్తు చేయడానికి అధికారులకు అవకాశం ఇవ్వకుండా ఎఫ్‌ఐఆర్ రద్దు చేసిన హైకోర్టు తీరును తప్పుబట్టింది. ఈ కేసులో కూడా డిసెంబర్ 18న ఫిర్యాదు, 19న ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయగా, 20న కోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు.
దర్యాప్తు సంస్థలు విచారణ చేయడానికి, సాక్ష్యాలను సేకరించడానికి సహేతుకమైన అవకాశం ఇవ్వాలి. అందుకే ఈ కేసు దర్యాప్తును తొందపడి అడ్డుకోవాలని ఈ కోర్టు అనుకోవడం లేదు. దురుద్దేశం, ఆరోపణలు, నిజాయితీ లేకుండా వ్యవహరించారా? లేదా? అనేది విచారణలో తేలుతుంది. ఇప్పుడు దర్యాప్తును అడ్డుకోవడం తొందరపాటు చర్యే అవుతుంది.
ఈ దశలో కోర్టుల మినీ ట్రయల్ సరికాదు
నేరం జరిగినట్లు ఎఫ్‌ఐఆర్‌లో వెల్లడించాల్సిన అవసరం లేదు. కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉండగా కోర్టులు మినీ ట్రయల్ నిర్వహించడం సరికాదు. పిటిషనర్‌పై ఐపీసీ సెక్షన్ 409, అవినీతి నిరోధక చట్టంలోని 13(1)(ఎ), 13(2) వంటి సెక్షన్ల కింద కేసు నమోదయ్యింది.
బీఎన్‌ఎస్ సెక్షన్ 528 మేరకు ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేసేందుకు కోర్టుకున్న అధికారం పరిమితం. కేసు విచారణ ప్రక్రియ దుర్వినియోగం అవుతున్నప్పుడు, చట్ట దుర్వినియోగానికి దారితీసే సందర్భాల్లోనే చాలా అరుదుగా కోర్టుల జోక్యానికి వీలుంది. దర్యాప్తు అధికారాలను కోర్టులు తమ చేతుల్లోకి తీసుకోబోవు. ఈ కేసులో సెక్షన్ 528 కింద కోర్టు తన స్వాభావిక అధికారాన్ని వినియోగించి ఆరోపణలపై విచారణ చేపట్టబోదు.
ఆలస్యం జరిగిందనే కారణంతో కొట్టివేత కుదరదు
భజన్‌లాల్, నీహారిక ఇ¯న్‌ఫ్రాస్ట్రక్చర్ కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇక్కడి కేసుకు వర్తించవు. 14 నెలలు ఆలస్యంగా కేసు నమోదు అయ్యిందని చెప్పి ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని కోరడానికి వీల్లేదు. మంత్రిగా చేసిన వాళ్లపై కేసు నమోదుకు వీల్లేదన్న పిటిషనర్ వాదన ఆమోదయోగ్యంగా లేదు. ఏసీబీ కేసు నమోదు చేసి ప్రాథమిక దర్యాప్తు పూర్తి కాకుండానే ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని కోరడం చట్ట వ్యతిరేకం.
ఎఫ్‌ఐఆర్ రద్దు చేయడానికి అర్హమైనదా, కాదా అనే అంశంలోకి వెళ్లే ముందు పిటిషనర్‌పై ఉన్న అభియోగాలపై దర్యాప్తు జరగాల్సి ఉంది. హెచ్‌ఎండీఏ అనేది ప్రత్యేక సంస్థ. ఆస్తులు ఉండటమే కాకుండా అభివృద్ధిలో భాగంగా పలు ఒప్పందాలు చేసుకోవడానికి అధికారమున్న సంస్థ. పురపాలక శాఖ పరిధిలోనే ఇది పని చేస్తుంది. ఆ శాఖ అప్పటి మంత్రిగా పిటిషనర్ అదీనంలోనే హెచ్‌ఎండీఏ విధులు నిర్వహించింది.. ఆదేశాలు పాటించింది.
ఈ కేసులో ఫార్ములా ఈ రేసు నిర్వహించిన సంస్థ ఆర్థికంగా లబ్ధి పొందినా, ఆ సంస్థను నిందితుల జాబితాలో చేర్చలేదని పిటిషనర్ వాదించారు. అయితే ఇది ఏసీబీ దర్యాప్తులో తేలే అంశం. మొత్తంగా చూస్తే ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ను ప్రాథమిక దశలోనే కొట్టివేయలేం..’ అని ధర్మాసనం స్పష్టం చేసింది.
కేటీఆర్‌ను అరెస్టు చేయరాదంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పది రోజులపాటు పొడిగించాలన్న కేటీఆర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు అభ్యర్థనను తోసిపుచ్చింది. క్రిమినల్ కేసుల్లో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును నేరుగా సుప్రీంకోర్టులోనే సవాల్ చేయాల్సి ఉంటుంది. విచారణ జరిపే అధికారం హైకోర్టు ద్విసభ్య ధర్మాసనానికి ఉండదు.
Comments
Please login to add a commentAdd a comment