
సాక్షి, హైదరాబాద్ : రేపటి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నల్గొండ టూర్ రద్దయ్యింది. నల్గొండలో బీఆర్ఎస్ చేపట్టబోయే రైతు మహా ధర్నాకు పోలీసుల అనుమతి నిరాకరించారు. క్లాక్ టవర్ సెంటర్‌లో పార్కింగ్, ట్రాఫిక్ సమస్యల నేపథ్యంలో పోలీసులు అనుమతివ్వలేదు.
అయితే పోలీసుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీఆర్‌ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు.. పోలీసుల అనుమతి విషయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
ఈ నెల 21 నుంచి 24 వరకు గ్రామ సభల నేపథ్యంలో బందోబస్తుపై హైకోర్ట్‌లో వాదనలు నడిచాయి. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు ఈ నెల 26 తర్వాత రద్దీ ప్రాంతంలో కాకుండా అనువైన ప్రాంతంలో బీఆర్‌ఎస్ సభ నిర్వహించుకునేందుకు అభ్యంతరం లేదని తెలిపింది. అనంతరం.. బీఆర్ఎస్ నేతల లంచ్ మోషన్ పిటీషన్‌ను 27కు వాయిదా వేసింది.

కాంగ్రెస్ ప్రభుత్వం.. రైతులకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండలో బీఆర్‌ఎస్ రైతు మహాధర్నా తలపెట్టిన సంగతి తెలిసిందే. పట్టణ కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్ వద్ద జరుగనున్న ఈ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్న నేపథ్యంలో దీనికి సంబంధించి జిల్లా నాయకులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. కానీ పోలీసులు.. ధర్నాకు అనుమతి నిరాకరించడంతో బీఆర్‌ఎస్ నాయకులు అనుమతి కోసం హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు పోలీసులు తీసుకున్న నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. హైకోర్టు నిర్ణయంతో నల్గొండ పర్యటనపై కేటీఆర్ వెనక్కి తగ్గారు.
Comments
Please login to add a commentAdd a comment