
అర్ధరాత్రులు సైతం చెవులు అదిరేలా సౌండ్
ఫంక్షన్ హాళ్ల సమీపంలో పరిస్థితి మరీ దారుణం
పరీక్షల సీజన్ కావడంతో విద్యార్థులకు నరకం
పట్టనట్లు వ్యవహరిస్తున్న పోలీసు గస్తీ బృందాలు
ఫిర్యాదు చేసినా ఆశించిన స్థాయిలో స్పందన కరువు
చిలకలగూడకు చెందిన వర్షిణి ఇంటర్మీడియట్ పరీక్షలకు సన్నద్ధవుతోంది. చదువుకునే సమయంలో అర్ధరాత్రి దాటేంతవరకు ఆగకుండా మోగుతున్న డప్పుల చప్పుడుకు ఏకాగ్రత కోల్పోయి, అటు చదువుకు ఇటు నిద్రకు దూరమై.. మరుసటి రోజు పరీక్ష సరిగా రాయలేక పోయింది.
రాత్రి 10 గంటల వరకే..
బ్యాండ్ బరాత్‌లు, ర్యాలీలకు రాత్రి 10 గంటల వరకే పోలీసులు అనుమతి ఇస్తున్నా.. అర్ధరాత్రి దాటేవరకు ఇవి సాగుతున్నాయి. చిలకలగూడ ఠాణా పరిధిలో శబ్ద కాలుష్యంపై డయల్ 100కు మూడుసార్లు ఫిర్యాదు చేయగా ఆలస్యంగా స్పందించారు’ అని నామాలగుండుకు చెందిన వెంకట రమణ ఆవేదన వ్యక్తం చేశారు.
సాక్షి, సిటీబ్యూరో/చిలకలగూడ: ప్రస్తుతం విద్యార్థులకు పరీక్షల కంటే ఎక్కువగా పెళ్లి బరాత్‌ల టెన్షన్ పట్టుకుంది. పగలూ రాత్రీ అనే తేడా లేకుండా చదువుకునే అవకాశం ఇవ్వకుండా తీవ్ర శబ్ద కాలుష్యం వెలువడుతుంటమే దీనికి కారణం. దీన్ని అడ్డుకోవాల్సిన పోలీసు విభాగం సైతం పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. డయల్–100కు ఫిర్యాదు చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో స్పందన ఉండట్లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
ఎవరి బాధ వారిది..
పెళ్లిళ్ల సీజన్ వచి్చందంటే చాలు నగర వ్యాప్తంగా బరాత్‌ల హడావుడి కనిపిస్తుంటుంది. పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారి మాత్రమే జరిగే వేడుకని, అందరికీ మధుర జ్ఞాపకంగా మిగలడం కోసం ఇలా చేసుకుంటామని నిర్వాహకులు చెబుతుంటారు. హంగులు, ఆర్భాటాల మాట అటుంచితే.. ఊరేగింపులోని డీజేలు, ఇతర శబ్దాలతో పాటు బాణాసంచా తదితరాల వల్ల ఎదుటి వారు ఎదుర్కొనే ఇబ్బందులు వారు పట్టించుకోరనేది బాధితుల మాట. రహదారులకు పక్కన, ఫంక్షన్ హాళ్ల చుట్టుపక్కల నివసించే వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. సాధారణ సమయల్లో ఈ ఇబ్బందుల్ని భరిస్తున్నా ప్రస్తుతం పరీక్షల సీజన్ కావడంతో పిల్లల ఏకాగ్రత దెబ్బతింటోందని వాపోతున్నారు.
ఆ ప్రాంతాల్లో నిషేధం ఉన్నా..
పెళ్లి బరాత్ అంటేనే నెమ్మదిగా సాగే సమూహం. ఒకప్పుడు బరాత్‌లు కిలోమీటర్ల మేర సాగేవి. అంతర్గత రహదారుల్లోనే కాకుండా ప్రధాన రహదారుల పైనా గంటల పాటు ఈ ఊరేగింపులు నడిచేవి. వీటి కారణంగా తీవ్రమైన ట్రాఫిక్ జామ్స్ ఏర్పడిన సందర్భాలూ అనేకం ఉన్నాయి. ఇలాంటి ఇబ్బందుల్ని పరిగణనలోకి తీసుకున్న నగర పోలీసులు కొన్నేళ్ల క్రితం బరాత్‌లను నిషేధించారు. అయినప్పటికీ.. కాలనీలతో పాటు ఫంక్షన్ హాళ్ల సమీపంలో ఇప్పటికీ నడుస్తున్నాయి. నిర్వాహకులను దృష్టిలో పెట్టుకుంటున్న పోలీసులు వీటిని చూసీచూడనట్లు వదిలేస్తున్నారు.
సమయపాలన లేకుండా శబ్దాలు..
దీంతో ఇటీవల కాలంలో బరాత్‌ల హంగామా ఎక్కువైంది. నగరంలో ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల మధ్య మాత్రమే సౌండ్ సిస్టమ్స్ వాడాలనే నిబంధన ఉంది. రాత్రి 10 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ శబ్ద కాలుష్యానికి కారణమయ్యే ఎలాంటి సౌండ్లు చేయడానికి వీలులేదు. ప్రాంతాల వారీగా ఎన్ని డెసిబుల్స్ శబ్ద తీవ్రత ఉండాలనేది నిర్ధారించారు. వీటికి సంబంధించి గతంలో ప్రభుత్వం ఉత్తర్వులతో పాటు సుప్రీం కోర్టు ఆదేశాలు సైతం ఉన్నాయి. ఈ మేరకు నోటిఫికేషన్లు కూడా జారీ అయ్యాయి. అయినప్పటికీ బరాత్‌ల నిర్వాహకులు వీటిని పట్టించుకోవట్లేదు. పరీక్షల కోసం సిద్ధమవుతున్న విద్యార్థులు వీరివల్ల నరకం చవి చూస్తున్నారు.
పట్టనట్లు వ్యవహరిస్తున్న పోలీసులు..
బరాత్‌ల్లో వెలువడుతున్న శబ్దాల కారణంగా విద్యార్థులు చదువుకోలేకపోవడమే కాదు.. చివరికి కంటి నిండా నిద్రకూ దూరమై తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ ప్రభావం ఫైనల్ పరీక్షలపై ఉంటోందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి 10 గంటల తర్వాత కూడా నడుస్తున్న బరాత్‌లు, డీజేలపై ఫిర్యాదు చేసినా సరైన స్పందన ఉండట్లేదని వాపోతున్నారు. కఠిన చర్యలు లేని కారణంగా గస్తీ బృందాలు వచి్చనప్పుడు ఆపేస్తున్న నిర్వాహకులు వాళ్లు వెళ్లిన తర్వాత మళ్లీ మొదలెడుతున్నారని ఆరోపిస్తున్నారు. స్థానిక పోలీసులు అవసరమైన పట్టించుకోకపోవడమే దీనికి కారణమని చెబుతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి పరీక్షల సీజన్‌లో శబ్ద కాలుష్యం లేకుండా చేయాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.
పెళ్లి ఊరేగింపుల్లో పెరుగుతున్న శబ్ద కాలుష్యం
Comments
Please login to add a commentAdd a comment