![BRS KTR ACB Investigation Concluded In ACB Office: Telangana](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/01/10/KTR-2.jpg.webp?itok=LcoqKHFc)
ఏసీబీ విచారణకు హాజరై తిరిగి ఇంటికి చేరుకున్న కేటీఆర్‌కు స్వాగతం పలుకుతున్న ఆయన సతీమణి శైలిమ, సోదరి కవిత
తెలంగాణ భవన్‌కు పెద్దసంఖ్యలో తరలివచ్చిన బీఆర్‌ఎస్ శ్రేణులు
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా–ఈ రేస్ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఏసీబీ విచారణకు హాజరు కావడం తీవ్ర ఉత్కంఠను రేపింది. ఆయన్ను అరెస్టు చేస్తారనే వార్తల నేపథ్యంలో..విచారణ అనంతరం ఆయన తిరిగి వచ్చేవరకు ఉత్కంఠ కొనసాగింది. ముఖ్య నేతలంతా పార్టీ కార్యాలయంలోనే ఉండి చర్చల్లో మునిగి తేలారు. గురువారం ఉదయం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నందినగర్ నివాసానికి చేరుకున్నారు. ఉదయాన్నే కొద్దిసేపు గృహ నిర్బంధంలో ఉన్న మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు ఎమ్మెల్సీ కవిత, పలువురు మాజీ మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు కేటీఆర్‌ను కలిసి సంఘీభావం ప్రకటించారు. కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి వెళ్లిన తర్వాత నందినగర్ నుంచి హరీశ్‌రావు తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు.
సాయంత్రం కేటీఆర్ తిరిగి వచ్చేవరకు అక్కడే ఉన్న ఆయన.. పలువురు మాజీ మంత్రులు, సీనియర్ నేతలతో భేటీ అయ్యారు. పార్టీ నేతలు విడతల వారీగా మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పార్టీ కార్యకర్తలు, నాయకుల రాకతో తెలంగాణ భవన్‌లో హడావుడి నెలకొంది. సాయంత్రం తెలంగాణ భవన్‌కు వచ్చిన కేటీఆర్‌కు భారీ సంఖ్యలో నాయకులు స్వాగతం పలికారు. గుమ్మడికాయతో దిష్టితీసి, మంగళ హారతులు ఇచ్చారు.
తర్వాత నందినగర్ నివాసానికి చేరుకున్న కేటీఆర్‌కు సతీమణి శైలిమ, సోదరి కవిత తిలకం దిద్ది స్వాగతం పలికారు. ఇలావుండగా ఏసీబీ కార్యాలయానికి దారితీసే రహదారుల్లో 8 చోట్ల పోలీస్ పికెట్‌లు ఏర్పాటు చేశారు. సుమారుగా 400 మంది సిబ్బంది బందోబస్తులో పాల్గొన్నారు. మరోవైపు రెండురోజులుగా నందినగర్ నివాసంలోనే బస చేసిన కేటీఆర్.. న్యాయవాదులతో సంప్రదింపులు జరిపారు. హైకోర్టు, సుప్రీంకోర్టులో తన తరఫున వాదిస్తున్న వారితో ఏసీబీ, ఈడీ విచారణను ఎదుర్కోవాల్సిన తీరుపై చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment