ఏసీబీ విచారణకు హాజరుకాకుండానే వెనక్కి.. | ACB Once Again Issued Notices to KTR: Telangana | Sakshi
Sakshi News home page

ఏసీబీ విచారణకు హాజరుకాకుండానే వెనక్కి..

Published Tue, Jan 7 2025 12:50 AM | Last Updated on Tue, Jan 7 2025 1:25 AM

ACB Once Again Issued Notices to KTR: Telangana

న్యాయవాదులతో కలిసి ఏసీబీ కార్యాలయానికి వచ్చిన కేటీఆర్‌

లోపలికి ఒక్కరే వెళ్లాలంటూ అడ్డుకున్న పోలీసులు 

తన వెంట న్యాయవాదులు ఉంటే ఇబ్బందేమిటని నిలదీసిన కేటీఆర్‌ 

తాను విచారణకు సహకరిస్తున్నా పోలీసులు అడ్డుకుంటున్నారని మండిపాటు 

అయినా ససేమిరా అన్న పోలీసులు..దాదాపు 40 నిమిషాలపాటు హైడ్రామా 

చివరికి ఏసీబీ ఏఎస్పీకి లిఖితపూర్వక వివరణ ఇచ్చి వెనుదిరిగిన కేటీఆర్‌ 

ఈనెల 9న విచారణకు రావాలంటూ కేటీఆర్‌కు మరోమారు ఏసీబీ నోటీసులు

ఈ ప్రభుత్వం, పోలీసుల తీరుపై నాకు నమ్మకం లేకనే న్యాయవాదులతో వచ్చా

గతంలో మా పార్టీ నేత నరేందర్‌రెడ్డిని విచారణకని పిలిచి ఆయన చెప్పని విషయాలను స్టేట్‌మెంట్‌లో నమోదు చేశారు

ఇప్పుడు నా విషయంలోనూ అలా చేసే అవకాశముంది 

నా ఇంట్లో సోదాల పేరిట తప్పుడు పత్రాలు పెట్టి, దొరికాయని చెప్పే కుట్ర జరుగుతోంది 

గతంలో దీపావళి పండుగ చేసుకుంటుంటే.. డ్రగ్స్‌ పట్టుబడ్డాయని అబద్ధాలు ప్రచారం చేశారు 

ఇవన్నీ హామీల అమలుపై నిలదీయకుండా దృష్టి మళ్లించే ప్రయత్నాలు 

సాక్షి, హైదరాబాద్‌: ఫార్ములా–ఈ కార్ల రేసు కేసులో సోమవారం ఏసీబీ కేంద్ర కార్యాలయం వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మున్సిపల్‌ శాఖ మాజీ మంత్రి కేటీ రామారావు... ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు బంజారాహిల్స్‌లోని ఏసీబీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నా రు. తన న్యాయవాదులను కూడా వెంటతీసుకుని వచ్చారు. కానీ ఏసీబీ కార్యాలయానికి సమీపంలోనే పోలీసులు అడ్డుకున్నారు. ఏసీబీ నోటీసుల ప్రకారం.. న్యాయవాదులకు అనుమతి లేదని, ఒక్కరే విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. న్యాయవాదులు వెంట ఉంటే ఇబ్బంది ఏమిటని, వారిని అనుమతించాలని కేటీఆర్‌ పట్టుబట్టారు. దాదాపు 40 నిమిషాల పాటు ఏసీబీ కార్యాలయం సమీపంలో తన వాహనంలోనే వేచి ఉన్నారు. చివరికి ఏసీబీ అధికారులకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చి అక్కడి నుంచి వెనుదిరిగారు. 

న్యాయవాదులు ఉంటే ఇబ్బంది ఏమిటి? 
ఫార్ములా–ఈ కారు రేసు కేసులో ఏసీబీ నోటీసుల ప్రకారం విచారణకు హాజరయ్యేందుకు కేటీఆర్‌ సోమవారం ఉదయం 10 గంటలకు నందినగర్‌లోని తన నివాసం నుంచి బయలుదేరారు. పోలీసులు ఏసీబీ కార్యాలయం సమీపంలో బారికేడ్లు పెట్టి కేటీఆర్‌ వాహనాన్ని అడ్డుకున్నారు. కేవలం కేటీఆర్‌ ఒక్కరే ఏసీబీ కార్యాలయంలోకి వెళ్లాలని పేర్కొన్నారు. దీంతో న్యాయవాదులతో కలిసి విచారణకు హాజరైతే తప్పేమిటని.. న్యాయవాదులను తీసుకురావొద్దని ఏసీబీ అధికారులు కాకుండా పోలీసులు ఎందుకు చెబుతున్నారని కేటీఆర్‌ నిలదీశారు. అయినా పోలీసులు అనుమతించలేదు.

కాసేపు ఏసీబీ ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. ఆ తర్వాత కూడా న్యాయవాదులను అనుమతించేందుకు ససేమిరా అన్నారు. మరోవైపు కేటీఆర్‌ కూడా పట్టుబట్టి తన వాహనంలోనే కూర్చుని వేచిచూశారు. పలుమార్లు పోలీసులు, కేటీఆర్‌ మధ్య చర్చలు జరిగినా ఎవరూ వెనక్కి తగ్గలేదు. ఇలా 40 నిమిషాల పాటు హైడ్రామా చోటు చేసుకుంది. చివరికి న్యాయవాదులు లేకుండా విచారణకు హాజరుకాబోనని, లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చి తిరిగి వెళ్లిపోతానని కేటీఆర్‌ తేల్చి చెప్పారు. దీనితో ఏసీబీ కేంద్ర కార్యాలయం నుంచి బయటికి వచ్చిన అడిషనల్‌ ఎస్పీ ఖాన్‌.. కేటీఆర్‌ నుంచి లిఖిత పూర్వక సమాధానం తీసుకున్నారు.

వారిపై నమ్మకం లేదు.. అందుకే లాయర్లతో వచ్చా..: కేటీఆర్‌
ఏసీబీ కార్యాలయం బయట వేచి ఉన్న సమయంలో కేటీఆర్‌ తన వాహనంలోనే ఉండి మీడియాతో మాట్లాడారు. ‘‘చట్టాన్ని గౌరవించే సాధారణ పౌరుడిగా ఏసీబీ కార్యాలయానికి వచ్చాను. కానీ ఈ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా నాకు ఉన్న హక్కులను కాలరాసేలా వ్యవహరిస్తోంది. తెలంగాణలో భారత రాజ్యాంగం నడుస్తోందా.. లేక రేవంత్‌ రాజ్యాంగం నడుస్తోందా? గతంలో మా పార్టీ నాయకుడు నరేందర్‌రెడ్డిని కూడా విచారణ పేరుతో పిలిచి ఆయన చెప్పని విషయాలను స్టేట్‌మెంట్‌లో నమోదు చేశారు. ఆయన నా పేరు చెప్పినట్టుగా అసత్యాలతో కూడిన ఒక స్టేట్‌మెంట్‌ను మీడియాకు వదిలారు. ఇప్పుడు నా విషయంలో కూడా అదే విధంగా చేసే అవకాశం ఉంది. పోలీసులపై నాకు విశ్వాసం లేదు. అందుకే న్యాయవాదులతో వచ్చాను. అయినా నా వెంట న్యాయవాదులు కూడా ఏసీబీ కార్యాలయంలోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వానికి సమస్య ఏమిటో చెప్పాలి. ఒక పౌరుడిగా నాకు న్యాయవాదుల సహకారం తీసుకునే హక్కు లేదా? అయితే ఆ విషయాన్ని రాతపూర్వకంగా రాసి ఇవ్వాలి..’’అని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు

సోదాల పేరిట కుట్రకు పాల్పడే ప్రయత్నం 
‘‘నేను ఏసీబీ విచారణకు హాజరయ్యే సమయంలోనే నా ఇంటిపై ఏసీబీ దాడులు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టుగా నాకు సమాచారం ఉంది. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ దాడుల్లో ఏవైనా చట్టవ్యతిరేకమైన వస్తువులు, పత్రాలు నా ఇంట్లో వాళ్లే పెట్టి.. అవి సోదాల్లో దొరికాయని చెప్పే కుట్ర కూడా జరుగుతోంది. మా ఇంట్లో ఈ రోజు (సోమ వార) మా మామగారి రెండో సంవత్సరీకం కార్యక్రమం ఉంది. అది జరుగుతుండగా సోదాలు చేసేందుకు సిద్ధమైనట్టు సమాచారం ఉంది. గతంలోనూ దీపావళి పండుగ చేసుకుంటే కూడా పోలీసులతో సోదాలు చేయించారు. డ్రగ్స్‌ పట్టుబడ్డా యని సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా అబద్ధాలు చెప్పారు. నేను ఈ రోజు విచారణకు హాజరుకావాల్సిన అవసరం లేదు. అయినా నేను ఏ తప్పూ చేయలేదు కాబట్టే ధైర్యంగా ఏసీబీ విచారణకు వచ్చాను..’’అని కేటీఆర్‌ పేర్కొన్నారు. 

ప్రజల దృష్టి మళ్లించే కుట్ర.. 
రేవంత్‌రెడ్డి రైతు భరోసాలో కోత విధించి రైతులకు చేసిన ద్రోహం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ కుట్రకు పాల్పడు తున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. ‘‘నేను సీఎంకు చెప్పేది ఒక్కటే.. ఎన్ని దాడులు చేసినా, ఎన్ని అటెన్షన్‌ డైవర్షన్లు చేసినా కాంగ్రెస్‌ ఇచ్చిన 420 హామీలను అమలు చేసేదాకా వదిలిపెట్టేది లేదు. ఏసీబీ అధికారులు విచారణ పేరిట నన్ను అడుగుతున్న సమాచారం మొత్తం ప్రభుత్వం వద్దే ఉంది. గతంలో మంత్రిగా నిర్ణయం తీసుకున్నాను. అలాంటప్పుడు ఇంకా నా దగ్గర ఏం సమాచారం ఉంటుంది?..’’అని ప్రశ్నించారు. ఏసీబీ అధికారులు అనుమతిస్తే కార్యాలయం లోపలికి వచ్చి ఇద్దామనుకున్న పత్రాన్ని ఇక్కడే ఇచ్చి వెళతానని.. మళ్లీ ఏసీబీ అధికారులు రమ్మంటే వస్తానని చెప్పారు. లాయర్లు లేకుండానే విచారణకు రావాలని పోలీసులు చెబుతున్నారని.. దర్శకుడు రాజమౌళిని మించిన టాలీవుడ్‌ కథలు అల్లుతున్నారని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

ఏసీబీ అధికారులకు ఇచ్చిన సమాధానంలో ఏముంది? 
ఏసీబీ సెంట్రల్‌ ఇన్వెస్టిగేషన్‌ యూనిట్‌ డీఎస్పీ మాజిద్‌ఖాన్‌కు కేటీఆర్‌ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను హైకోర్టులో సవాల్‌ చేశానని, డిసెంబర్‌ 31న ఈ అంశంలో తుది వాదనలు ముగియడంతో హైకోర్టు తీర్పును రిజర్వు చేసిందని గుర్తు చేశారు. హైకోర్టులో ఏసీబీ ప్రతివాదిగా ఉందని, తన పిటిషన్‌పై సుదీర్ఘ వాదనలు కూడా వినిపించిందని వివరించారు. హైకోర్టు ఏ క్షణమైనా తీర్పు ప్రకటించే అవకాశం ఉన్న ఈ సందర్భంలో ఏసీబీ తనకు నోటీసు ఇచ్చిందని పేర్కొన్నారు. ‘‘సమాచారంతోపాటు డాక్యుమెంట్లు అందివ్వాలని ఏసీబీ నోటీసులలో ప్రస్తావించారు. ఏ అంశాలపై సమాచారం కావాలన్న విషయాన్ని నోటీసులలో స్పష్టంగా ప్రస్తావించలేదు. మీకు ఏ డాక్యుమెంట్లు కావాలో తెలియజేయడంతోపాటు తగిన సమయం ఇవ్వండి. నేను చట్టాన్ని గౌరవించే పౌరుడిని. నాకు న్యాయబద్ధంగా ఉన్న హక్కులు కాపాడబడితేనే ఈ విషయంలో నేను మీకు పూర్తిగా సహకరిస్తాను. హైకోర్టు తుది తీర్పు తర్వాత ముందుకు వెళ్లాలని కోరుతున్నాను’’అని కేటీఆర్‌ లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు.

ఎలక్టోరల్‌ బాండ్లపై చర్చకు సిద్ధం 
‘‘పార్లమెంట్‌ ఆమోదించిన ఎలక్టోరల్‌ బాండ్లు ఇవ్వడం అవినీతి అని ఎలా అంటారు? దేశవ్యాప్తంగా అన్ని పారీ్టలకు వచ్చిన ఎలక్టోరల్‌ బాండ్లపై మేం చర్చకు సిద్ధం. 2022లో గ్రీన్‌కో కంపెనీ ఎలక్టోరల్‌ బాండ్లు ఇచ్చింది. 2023లో ఫార్ములా–ఈ రేసు జరిగింది. కాంగ్రెస్, బీజేపీలకు కూడా గ్రీన్‌కో ఎలక్టోరల్‌ బాండ్లు ఇచ్చింది. ఫార్ములా–ఈ రేస్‌ కారణంగా నష్టపోవడంతో గ్రీన్‌కో ఒప్పందం నుంచి తప్పుకుంది. కాంగ్రెస్‌కు 340 కంపెనీలు రూ.1,351 కోట్ల ఎలక్టోరల్‌ బాండ్లు ఇచ్చాయి. తెలంగాణలో తప్పుడు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్‌ వాళ్లు తమకు అందిన ఎలక్టోరల్‌ బాండ్లపై ఏమంటారు?’’అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement