
వివాహితకు యువకుడి బెదిరింపులు
ఫిలింనగర్ (హైదరాబాద్): ‘ఫోన్ కాల్ లిఫ్ట్ చేయకపోతే నిన్ను, పిల్లలను కిడ్నాప్ చేస్తా’ అంటూ వివాహితను బెదిరిస్తున్న యువకుడిపై ఫిలింనగర్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. టోలిచౌకి సమతాకాలనీలో నివసించే వివాహిత (32) స్కూల్ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నది. ఆమెకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె కాగా, 2016 నుంచి భర్త దుబాయ్‌లో ఉంటున్నాడు. గత ఏడాది తన స్కూల్‌లో అడ్మిషన్లకు సంబంధించి ఇన్‌స్ట్రాగాంలో ప్రకటన పోస్ట్ చేసింది. షేక్ వసీం అనే యువకుడు ఆమె ఇన్‌స్ట్రాగాం అకౌంట్‌ను ఫాలో అవుతూ ఆమె ఫోన్ నెంబర్‌ను అడ్మిషన్ కావాలంటూ అడిగి తెలుసుకున్నాడు.
తరచూ ఫోన్ చేస్తుండడంతో ఆమె లిఫ్ట్ చేయలేదు. దీంతో స్కూల్‌లో సిబ్బంది నుంచి ఆమె పర్సనల్ నెంబర్‌ను కూడా సేకరించాడు. అప్పటి నుంచి స్కూల్‌కు, ఆమె ఇంటికి తిరుగుతూ 24 గంటలూ ఫోన్లు చేస్తూ, మెసేజ్‌లు పెడుతూ వేధింపులకు గురిచేయసాగాడు. దీంతో ఆమె పర్సనల్ నెంబర్‌ను కూడా లిఫ్ట్ చేయడం ఆపేసింది. ఈ నేపథ్యంలోనే షేక్ వసీం ర్యాపిడో డ్రైవర్‌ను బుక్ చేసుకుని ఆమె ఇంటికి పంపించి పార్శిల్ ఇస్తారు.. తీసుకురా అని చెప్పసాగాడు. ఆమె ఇంటికి వెళ్లిన ర్యాపిడో డ్రైవర్‌ను ఫోన్ ఆమెకు ఇవ్వు మాట్లాడతానంటూ వేధించడం మొదలుపెట్టాడు.
గత ఏడు నెలల నుంచి నిందితుడి వేధింపులు రోజురోజుకు పెరిగాయి. ఇంటి చుట్టూ, స్కూల్ చుట్టూ తిరుగుతూ ఆమెను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. రెండు రోజుల క్రితం మరింత రెచ్చిపోయిన నిందితుడు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నిన్ను, పిల్లలను కిడ్నాప్ చేస్తానంటూ మెసేజ్‌లు పెట్టాడు. భయాందోళనకు గురైన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిలింనగర్ పోలీసులు నిందితుడిపై బీఎన్‌ఎస్ సెక్షన్ 78(2), 351 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment