ఫార్ములా–ఈ రేస్ కేసులో కేటీఆర్‌కు ఏసీబీ సమన్లు
ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్‌ను 11న, హెచ్‌ఎండీఏ మాజీ సీఈ బీఎల్‌ఎన్ రెడ్డిని
12న రావాలని ఆదేశం ఈడీ కన్నా ముందే విచారించే దిశగా ఏసీబీ అడుగులు
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా–ఈ కార్ల రేస్‌లో కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) కంటే ముందే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మాజీ మంత్రి కేటీఆర్‌ను విచారించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఈ నెల 6న ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరుకావాలంటూ కేటీఆర్‌కు ఏసీబీ అధికారులు శుక్రవారం సమన్లు జారీ చేశారు. అలాగే ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను 11న, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డిని 12వ తేదీన విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.
ఈడీ కన్నా ముందే..
ఫార్ములా–ఈ రేసు వ్యవహారంలో విదేశీ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా నిధుల మళ్లించారంటూ ఏసీబీ కేసు నమోదు చేయడం, దాని ఆధారంగా ఈడీ కూడా ఈసీఐఆర్ నమోదు చేయడం తెలిసిందే. ఈ అంశంలో వేగంగా స్పందించిన ఈడీ ఈ నెల 7న విచారణకు రావాలంటూ ఇప్పటికే కేటీఆర్‌కు నోటీసులు జారీ చేయగా.. అంతకంటే ఒకరోజు ముందే కేటీఆర్‌ను విచారించేందుకు ఏసీబీ చర్యలు చేపట్టడం ఆసక్తికరంగా మారింది.
అరెస్టు చేయకుండా హైకోర్టు ఊరటతో..
ఫార్ములా–ఈ రేసు నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ ఏసీబీ అధికారులు పీసీ యాక్ట్ 13(1) (ఏ), 13(2), ఐపీసీ 409, 120–బీ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశా రు. ఇవన్నీ నాన్‌బెయిలబుల్ సెక్షన్లు. అయితే కేటీఆర్ తనపై నమోదైన కేసు కక్షపూరితమని, ఆ ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని (క్వాష్ చేయాలని) హైకోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ పూర్తిచేసిన హైకోర్టు.. తీర్పును రిజర్వు చేసింది.
అయితే తుది తీర్పు వెలువడే వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయవద్దని, కేసు దర్యాప్తు చేసుకోవచ్చని ఏసీబీని ఆదేశించింది. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు కేటీఆర్‌కు సమన్లు జారీ చేశారు. అంతేకాదు ఈ కేసులో నిందితులుగా ఉన్న బీఎల్‌ఎన్ రెడ్డి, అర్వింద్‌కుమార్‌లను కూడా ఈడీ కంటే ముందే ఏసీబీ విచారించనుండటం ఆసక్తికరంగా మారింది.
పలు వివరాలు సేకరించిన ఏసీబీ అధికారులు..
ఫార్ములా–ఈ రేసుకు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థకు రూ.54.88 కోట్లు బదిలీ చేశారన్నది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. దీనిపై పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ ఫిర్యాదుతో ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషŒన్ యూనిట్ (సీఐయూ) డీఎస్పీ మాజిద్ అలీఖాన్‌న్‌డిసెంబర్ 19న కేసు నమోదు చేశారు. ఇప్పటికే దానకిశోర్ స్టేట్‌మెంట్ నమోదు చేయడంతోపాటు పలు కీలక వివరాలను ఏసీబీ అధికారులు సేకరించారు. వాటి ఆధారంగా ఆయా అంశాలపై కేటీఆర్‌ను, అధికారులను విచారించేందుకు సిద్ధమయ్యారు.
న్యాయవాదులతో సమావేశమైన కేటీఆర్
ఏసీబీ సమన్ల నేపథ్యంలో కేటీఆర్ శుక్రవారం తన న్యాయవాదులతో సమావేశమైనట్టు తెలిసింది. వారి సూచనలు, సలహాల మేరకు ఏసీబీ సమన్లపై ఏ విధంగా స్పందించాలనే నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. శని లేదా ఆది వారం ఈ అంశంపై కేటీఆర్ స్పందించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఒకవైపు తాము ఫార్మర్స్ (రైతుల) కోసం పోరాడుతుంటే.. ప్రభుత్వం ఫార్ములా–ఈ అంటూ వేధింపులకు పాల్పడుతోందని బీఆర్‌ఎస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
సీఆర్టీల సమ్మె విరమణ
సాక్షి, హైదరాబాద్: గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్(సీఆర్టీ)లు సమ్మె విరమించారు. ఇరవై రోజులుగా చేస్తున్న సమ్మెను విరమిస్తున్నట్లు శుక్రవారం గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శికి లిఖితపూర్వకంగా తెలిపారు. శుక్రవారం సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క.. సమ్మె చేస్తున్న సీఆర్టీలతో చర్చలు జరిపారు.
సీఆర్టీల డిమాండ్లలో ఉద్యోగాల క్రమబద్దికరణ, మినిమం టైం స్కేల్ కేటగిరీలు మినహా మిగిలిన వాటిపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి వివరించారు. ప్రతినెలా ఐదో తేదీలోపు వేతన చెల్లింపులు, మహిళా టీచర్లకు 180 రోజుల ప్రసూతి సెలవులు, డెత్ బెనిఫిట్స్ మంజూరు చేస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. ఉద్యోగ క్రమబద్దికరణ, మినిమం టైం స్కేల్ డిమాండ్లపై ముఖ్యమంత్రితో చర్చించి మరోసారి సీఆర్టీలతో సమావేశమవుతామని ఆమె హామీ ఇచ్చారు.
ఆదివాసీ, గిరిజన విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ప్రభుత్వానికి సహకరించాలని సీఆర్టీలను కోరారు. సీఆర్టీల సర్వీసును రెన్యువల్ చేస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసినట్లు వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఆర్టీలు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment