మొక్కుబడిగా ఇరు రాష్ట్రాల వాదనలు
కేంద్రం ఆదేశాల మేరకు విద్యుత్ బకాయిలు రూ.7 వేల కోట్లు ఇవ్వాలన్న ఏపీ
కాదు మాకే రూ.26 వేల కోట్లు ఇవ్వాలంటున్న తెలంగాణ
లేక్‌వ్యూతో పాటు మరికొన్ని భవనాలు కేటాయించాలంటున్న ఏపీ
సాధ్యం కాదని, అవసరమైతే స్థలం కేటాయిస్తామని తెగేసి చెప్పిన తెలంగాణ
ఇటీవల ఏమీ తేల్చకుండానే ముగిసిన ఉభయ రాష్ట్రాల సీఎస్‌ల సమావేశం
ఇలాగైతే సమస్యల పరిష్కారం ఎప్పటికీ సాధ్యం కాదంటున్న అధికారులు
సాక్షి, అమరావతి : విభజన సమస్యల పరిష్కారానికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల నేతృత్వంలో ఇటీవల జరిగిన అధికారులతో కూడిన సమావేశం తీరు తెన్నూ లేకుండా సాగింది. దీంతో సమస్యల పరిష్కారం ఇప్పట్లో సాధ్యం కాదనే అభిప్రాయాన్ని అధికార వర్గాలు వ్యక్తం చేశాయి. కాలికేస్తే.. వేలికి, వేలి కేస్తే కాలుకన్న చందంగా ఇరు రాష్ట్రాల మధ్య చర్చలు సాగాయని, ప్రధాన సమస్యల పరిష్కారంపై ఇరు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణికి భిన్నంగా సమస్యలను మరింత జఠిలం చేశారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. గ్రూప్–4, నాన్ గెజిడెట్ ఉద్యోగుల విషయంలో తప్ప మిగతా ప్రధాన అంశాలపై ఇరు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రాలేదని, ఎవరి వాదనలకు వారు కట్టుబడి ఉన్నారనే అభిప్రాయాన్ని ఉన్నతాధికారి ఒకరు వ్యక్తం చేశారు.
ఈ ఏడాది మే 7వ తేదీన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, (Chandrababu Naidu) రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో సమావేశమై విభజనకు సంబంధించి ఆస్తులు, నగదు పంపిణీ, బకాయిల చెల్లింపులపై చర్చించారు. ఆ సమావేశంలో సమస్యల పరిష్కారానికి ఇరు రాష్ట్రాల అధికారుల కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ఇటీవల మంగళగిరిలో ఇరు రాష్ట్రాల అధికారుల కమిటీ సమావేశమై చర్చలు జరిపినప్పటికీ ఏ సమస్యకు పరిష్కారం లభించలేదని తెలిసింది. 2014 జూన్ నుంచి 2017 జూన్ వరకు తెలంగాణ డిస్కంలు.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) డిస్కంలకు చెల్లించాల్సిన విద్యుత్ సరఫరా బకాయిలు రూ.7,230 కోట్ల గురించి కూడా గట్టిగా అడగలేదని సమాచారం. వెంటనే ఈ బకాయిలు ఆంధ్రప్రదేశ్‌కు చెల్లించాల్సిందేనని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ద్వారా తెలంగాణకు ఆదేశాలు జారీ చేయించిన విషయం తెలిసిందే.
ఈ విషయంపై తెలంగాణ (Telangana) ప్రభుత్వం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. పైగా ఈ బకాయిల ప్రస్తావన వచ్చినప్పుడు.. తెలంగాణకే రూ.26 వేల కోట్ల విద్యుత్ బకాయిలు ఏపీ చెల్లించాలనే వాదనను తెలంగాణ అధికారులు తెచ్చారని తెలిసింది.
అంగీకారం కుదిరిన వాటిపై ఎందుకు నిర్ణయం తీసుకోరు?
9, 10వ షెడ్యూల్‌లో మొత్తం 95 సంస్థలు ఉంటే.. 53 సంస్థలపై రెండు రాష్ట్రాలకు అంగీకారం ఉంది. మిగిలిన వాటిపై ఇరు రాష్ట్రాలకు అభ్యంతరాలున్నాయి. అయితే అంగీకారం కుదిరిన సంస్థల ఆస్తులు, నగదు పంపిణీపై ఇరు రాష్ట్రాలు నిర్ణయాలు తీసుకోకుండా, అన్ని సంస్థలకు చెందిన సమస్యలు పరిష్కారం అయ్యాకే తుది నిర్ణయాలు తీసుకోవాలనే ధోరణిలో అధికారులున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలోని ఆస్తుల వివాదంపై కేంద్రం నియమించిన షీలా బేడీ కమిటీ పలు సిఫార్సులు చేసింది. వాటిపై అనేక దఫాలుగా పదేళ్లుగా చర్చలు జరిగినా ఇరు రాష్ట్రాలు ఒక అభిప్రాయానికి రాలేకపోయాయి. 2014 విభజన చట్టం ప్రకారం కొన్ని భవనాలు ఎపీ కోసం హైదరాబాద్‌లో కేటాయించారని, అవి పదేళ్లపాటు వారి ఆదీనంలో కొనసాగుతాయని పేర్కొన్నారని, జూన్ 2వ తేదీతో ఆ గడువు ముగిసినందున గతంలో కేటాయించిన భవనాలు పూర్తిగా తెలంగాణకే వర్తిస్తాయని తెలంగాణ అధికారులు స్పష్టం చేశారు.
చదవండి: నేను చెప్తే సీఎం, డిప్యూటీ సీఎం చెప్పినట్లే
అయితే లేక్‌వ్యూ అతిథి గృహం, లక్డీకాపూల్‌లోని పోలీసు భవనాలను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించాల్సిందిగా ఏపీ అధికారులు చేసిన ప్రతిపాదనలను తెలంగాణ అధికారులు తిరస్కరించారు. భవనాలు కేటాయించడం సాధ్యం కాదని తేల్చి చెప్పినట్లు అధికార వర్గాలు తెలిపాయి. తెలంగాణలో భవనాలు నిర్మించుకోవాలంటే ఆంధ్రప్రదేశ్‌కు స్థలం కేటాయిస్తామని, భవనాలు కట్టుకోవాలని తెలంగాణ అధికారులు స్పష్టం చేశారు.
గెజిటెడ్ ఉద్యోగులు ఏపీ నుంచి తెలంగాణకు రావాలని కోరుకుంటున్నప్పటికీ తీసుకోవడం సాధ్యం కాదని తెలంగాణ అధికారులు స్పష్టం చేశారు. ఒకవేళ తీసుకుంటే తెలంగాణలో పని చేస్తున్న ఉద్యోగుల పదోన్నతులపై ప్రభావం పడుతుందని తెలిపారు. నాన్ గెజిటెడ్ ఉద్యోగులు, నాలుగో తరగతి ఉద్యోగులను ఇరు రాష్ట్రాలు మార్చుకోవడానికి గతంలోనే నిర్ణయాలు తీసుకున్నా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు.
చదవండి: కరెంట్ కోత.. చార్జీల మోత
‘దక్కన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్’(దిల్)కు హైదరాబాద్ (Hyderabad) నగరం చుట్టుపక్కల దాదాపు నాలుగు వేల ఎకరాలు భూములున్నాయి. ఆ భూముల్లో తమకు వాటా కావాలని ఆంధ్రప్రదేశ్ అధికారులు ప్రతిపాదించారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చేది లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసిందని అధికార వర్గాలు తెలిపాయి. ఉమ్మడి రాష్ట్రంలో “దిల్’ హెడ్ ఆఫీస్ హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటైనందున అందులో తమకు వాటా రావాల్సిందేనని ఏపీ వాదిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment