సాక్షి, అమరావతి: నకిలీ మద్యం కేసులో సిట్ రిమాండ్ రిపోర్ట్‌లో విస్తుపోయే విషయం ఒకటి వెలుగు చూసింది. ప్రతీకార రాజకీయాల్లో భాగంగానే వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌ను అరెస్ట్ చేసినట్లు తేటతెల్లమైంది. ఈ కేసులో ఆయనకు వ్యతిరేకంగా ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోయారు ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) అధికారులు.
నకిలీ మద్యం కేసులో దర్యాప్తు కంటే.. అక్రమ అరెస్టులపైనే సిట్ శ్రద్ధ పెట్టినట్లు జోగి రమేష్ వ్యవహారంతో స్పష్టమవుతోంది. నాటకీయ పరిణామాల నడుమ ఆయన్ని కోర్టులో ప్రవేశపెట్టారు అధికారులు. ఆ సమయంలోనూ ఈ కేసు ప్రధాన నిందితుడు(ఏ1) అద్దేపల్లి జనార్దన్ రావు చెప్పిన కట్టుకథనే సిట్ వల్లేవేయడం గమనార్హం. అలాగే రిమాండ్ రిపోర్టులో జనార్దన్‌తో నమోదు చేయించిన వాంగ్మూలాన్నే వినిపించిన అధికారులు.. రమేష్‌కు వ్యతిరేకంగా ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు. జనార్దన్‌రావు-జోగి రమేష్‌కు మధ్య జరిగిన లావాదేవీలను సైతం నిరూపించలేక చతికిపలడ్డారు. జనార్దన్ పోయిందని చెబుతున్న ఫోన్ తాలుకా స్క్రీన్ షాట్లనే మళ్లీ ప్రస్తావనకు తెచ్చినట్లు తెలుస్తోంది. అదే సమయంలో..
ఈ కేసులో ప్రధాన పాత్ర పోషించిన టీడీపీ నేత జయచంద్రారెడ్డిపై ఇంతదాకా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. అలాగే నకిలీ మద్యం అమ్మకాలు జరిపిన శ్రీనివాస వైన్స్ ఓనర్ మహంకాళి పూర్ణ చంద్ర రావుపై ఇప్పటిదాకా కేసు నమోదు చేయలేదు కూడా. అంతేకాదు ఫేక్ లిక్కర్ డైరీలో పలువురు బడా నేతలు పేర్లున్నాయని దర్యాప్తు తొలినాళ్లలో ప్రకటించిన సిట్.. ఇప్పుడు గమ్మున ఉండిపోవడమూ పలు అనుమానాలను తావిస్తోంది. దీంతో.. సీఎం చంద్రబాబు డైరెక్షన్‌తోనే టీడీపీ నాయకులని తప్పించేందుకు అధికారులు నకిలీ మద్యం కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారనే విషయం స్పష్టంగా తెలుస్తోందని వైఎస్సార్సీపీ అంటోంది.

పదిరోజుల రిమాండ్
నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ పేరును ఏ-18 గా, ఆయన సోదరుడు జోగి రామును ఏ-19 గా ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు. ఆరవ ఏజెఎంఎఫ్‌సీ న్యాయస్థానం ఈ ఇద్దరికీ 10రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది . దీంతో ఇరువురిని విజయవాడ సబ్‌జైలుకు తరలించారు. ఇదిలా ఉంటే.. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు కోరుతూ జోగి రమేష్ వేసిన పిటిషన్ మంగళవారం(రేపు, నవంబర్ 12) విచారణ జరగాల్సి ఉంది. ఈలోపే ఆయన్ని అరెస్ట్ చేయడం గమనార్హం.
ఇదీ చదవండి: దుర్గమ్మ చెంత సత్యప్రమాణం.. బాబు, లోకేష్‌కు ఆ దమ్ముందా?


