విజయవాడ ఆస్పత్రి వద్ద జోగి రమేశ్‌ను పట్టుకొని రోదిస్తున్న ఆయన సతీమణి శకుంతల
ప్రభుత్వ వైఫల్యంతోనే కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట.. తొమ్మిది మంది భక్తుల దుర్మరణం
దీన్నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే తాజాగా డైవర్షన్ డ్రామా.. జోగి రమేశ్ అక్రమ అరెస్టు
సాక్షి, అమరావతి: పంచ పాండవులు ఎంత మంది అని అడిగితే... మంచం కోళ్లలా ముగ్గురు ఉంటారని రెండు వేళ్లు చూపించాడట వెనకటికి ఒకరు. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వ తీరు కూడా అంత అధ్వానంగా, అస్తవ్యస్థంగా తయారైంది. ఎన్నికల మేనిఫెస్టో ఎందుకు అమలు చేయడం లేదని ప్రజలు నిలదీస్తుంటే.. ప్రభుత్వ అవినీతి, వైఫల్యాలను ప్రశ్నిస్తుంటే వాటికి సమాధానం దాటవేసేందుకు ఎప్పటికప్పుడు డైవర్షన్ కుతంత్రాలు పన్నుతోంది. ఇందులో భాగంగానే తాజాగా వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్ట్ అని స్పష్టమవుతోంది.
ఏమాత్రం సంబంధం లేని విషయాలను సృష్టించి, ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోందనేందుకు నకిలీ మద్యం రాకెట్‌లో జోగి రమేశ్‌ను ఇరికించడమే నిదర్శనం. 2024లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ కూటమి ప్రభుత్వం శకుని తరహాలో కుయుక్తి పాచికలను మళ్లీ మళ్లీ విసురుతోంది. తాను ఏం చెప్పినా భుజానికెత్తుకునే ఎల్లో మీడియా ఉండటంతో చంద్రబాబు తన కుట్రలకు మరింత పదును పెడుతున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో తొమ్మిది మంది భక్తులు దుర్మరణం చెందడంతో ప్రభుత్వంపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది.
మోంథా తుపానుతో దెబ్బతిన్న రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. 15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటంతో రైతులు తీవ్ర స్థాయిలో ఆందోళనకు ఉద్యుక్తులవుతున్నారు. తమ చేతగానితనం మరోసారి బట్టబయలు కాగానే చంద్రబాబులోని డైవర్షన్ చంద్రముఖి వెంటనే నిద్ర లేచింది. ఫలితంగా కరకట్ట ప్యాలస్ డైరెక్షన్‌లో టీడీపీ వీర విధేయ పోలీసులతో కూడిన సిట్ తక్షణం రంగంలోకి దిగింది. జోగి రమేశ్ అరెస్ట్.. ఎల్లో మీడియాలో భారీగా కవరేజీ.. ప్రజల దృష్టి అటువైపు మళ్లించే పన్నాగం కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది.
ప్రభుత్వ వైఫల్యంతోనే భక్తుల దుర్మరణం
టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలే సూత్రధారులు, టీడీపీ నేతలే పాత్రధారులుగా సాగుతున్న నకిలీ మద్యం దందా కేసును ఉద్దేశ పూర్వకంగా పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం బరితెగించింది. అందుకు ఎంచుకున్న సమయం కూడా ప్రభుత్వ కుట్రను బట్టబయలు చేస్తోంది. ప్రభుత్వ వైఫల్యంతోనే కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొమ్మిది మంది భక్తుల దుర్మరణం రాష్ట్రాన్నే కాదు యావత్ దేశాన్ని తీవ్రంగా కలచి వేసింది. ఎంతో ప్రాశస్య్తమైన కార్తీక ఏకాదశి అదీ శనివారం రోజున వచ్చిందనే కనీస స్పృహ కూడా ప్రభుత్వానికి లేకపోవడం విడ్డూరంగా ఉంది.
ఉత్తరాంధ్రలో చిన్న తిరుపతిగా గుర్తింపు పొందిన కాశీబుగ్గు వేంకటేశ్వర స్వామి ఆలయానికి వేలాదిగా భక్తులు తరలి వస్తారన్నది అందరికీ తెలిసినా సరే ప్రభుత్వం ఏమాత్రం పట్టనట్టు వ్యవహరించింది. ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయక పోవడం వల్లే ఆలయంలో శనివారం తీవ్ర తొక్కిసలాట సంభవించి భక్తులు మృత్యువాత పడ్డారు. హృదయ విదారకంగా ఉన్న ఆ దృశ్యాలు మీడియా, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వ వైఫల్యం బట్టబయలైంది.
తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీలో తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తుల దుర్మరణం.. సింహాచలంలో చందనోత్సవం రోజున గోడ కూలి ఏడుగురు బలి.. తాజాగా కాశీబుగ్గ దుర్ఘటనలు ప్రభుత్వ చేతగానితనాన్ని ఎత్తిచూపాయి. హిందూ పండుగలకు కనీస స్థాయిలో ఏర్పాట్లు చేయలేకపోతున్న చంద్రబాబు ప్రభుత్వ అసమర్థ, నిర్లక్ష్య వైఖరిపై యావత్ భక్తకోటి మండిపడుతోంది. భక్తుల ప్రశ్నలకు ప్రభుత్వం శనివారం రాత్రి వరకు సరైన సమాధానం చెప్పలేకపోయింది. ఫలితంగానే డైవర్షన్ పాలిటిక్స్.
తుపాను బాధిత రైతులను పట్టించుకోని ప్రభుత్వం
మోంథా తుపాను దెబ్బకు రాష్ట్రంలో రైతులు కుదేలయ్యా రు. 15 లక్షల ఎకరాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నా, ప్రభుత్వ పెద్దలకు చీమ కుట్టినట్టు కూడా లేదు. కనీసం పంటల నష్టాన్ని అంచనా వేయకుండా తుపాన్ను జయించామని బాకాలు ఊదుతుండటం విస్మయానికి గురి చేస్తోంది. క్షేత్ర స్థాయిలో రైతులను పట్టించుకున్న నాథుడే లేకుండా పోయారు. దెబ్బతిన్న పంటలను కొనేందుకు ప్రభుత్వమే ఆంక్షలు విధిస్తుండటం విడ్డూరంగా ఉంది. ఇన్‌పుట్ సబ్సిడీ కావాలా.. ధాన్యం కొనాలా.. ఏదో ఒకటే తేల్చుకోవాలని షరతు విధిస్తుండటం ప్రభుత్వ దుర్మార్గానికి తార్కాణం. కనీసం సంచులు కూడా ఇవ్వకుండా వేధిస్తున్నారు. ప్రభుత్వ తీరుపై తుపాను బాధిత ప్రాంతాల్లో రైతులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై ఆందోళనకు సిద్ధపడుతున్నారు.
చంద్రబాబు లండన్ షికారు.. చినబాబు క్రికెట్ జోరు
ఓ వైపు భక్తుల దుర్మరణం.. మరోవైపు తుపానుతో తీవ్రంగా నష్టపోయిన రైతుల ఆవేదన యావత్ రాష్ట్రాన్ని తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నాయి. కానీ ధృతరాష్ట్ర పాలన సాగిస్తున్న చంద్రబాబు, లోకేశ్ మాత్రం ఇవేవీ పట్టించుకుండా ఉడాయించారు. చంద్రబాబు లండన్ పర్యటనకు వెళ్లిపోయారు. ఆయన లండన్ పర్యటన ఎందుకు? అనే విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. వ్యక్తిగత పర్యటనా.. లేక అధికారిక పర్యటనా అన్నది స్పష్టం చేయలేదు.
చంద్రబాబు వ్యక్తిగతంగానే లండన్ పర్యటనను ఆస్వాదిస్తున్నారని ప్రభుత్వ వర్గాలు అనధికారికంగా వెల్లడించాయి. ఇక చినబాబు లోకేశ్ తీరు మరింత విస్మయానికి గురి చేసింది. ఆయన ముంబయిలో క్రికెట్ మ్యాచ్ వీక్షించేందుకు వెళ్లిపోయారు. దుర్మరణం చెందిన భక్తుల కుటుంబాల ఆవేదననుగానీ, తీవ్రంగా నష్టపోయిన రైతుల బాధను గానీ తండ్రీ కొడుకులు ఏమాత్రం పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎక్కడ ఉన్నారన్నది పత్తా లేదు. అదీ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రస్తుత పరిస్థితి.
అందుకే డైవర్షన్ డ్రామా.. జోగి రమేశ్ అక్రమ అరెస్టు
కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తుతుండటంతో చంద్రబాబు బేంబేలెత్తారు. వెంటనే తనదైన శైలిలో డైవర్షన్ డ్రామాకు తెరతీశారు. శనివారం రాత్రి కూటమి ప్రభుత్వ పెద్దలు తమ పన్నాగానికి పదును పెట్టారు. నకిలీ మద్యం కేసులో వైఎస్సార్‌సీపీ నేత జోగి రమేశ్‌ను అక్రమ అరెస్టు చేయాలని సిట్ అధికారులను ఆదేశించారు. దాంతో మీడియా, ప్రజల దృష్టి అంతా ఆ వ్యవహారం వైపు మళ్లించాలన్నది ఎత్తుగడ. ప్రభుత్వ పెద్దల కుట్రకు టీడీపీ వీర విధేయ పోలీసులు వత్తాసు పలికారు.
ఆదివారం తెల్లవారుజామునే విజయవాడ శివారులోని ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్ నివాసానికి పోలీసులు భారీగా చేరుకున్నారు. ఆయన్ని బలవంతంగా అరెస్టు చేశారు. నకిలీ మద్యం వ్యవహారంతో తనకేం సంబంధమని ఆయన అడిగిన ప్రశ్నలకు పోలీసులు కనీస సమాధానం కూడా చెప్పలేకపోవడం గమనార్హం. కేవలం కాశీబుగ్గ ఆలయ దుర్ఘటనలో ప్రభుత్వ వైఫల్యం నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ హైడ్రామా నడిపించారన్నది సుస్పష్టం.
మళ్లీ మళ్లీ అదే డైవర్షన్ కుతంత్రం
2024లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు ప్రభుత్వం ఇదే తరహాలో డైవర్షన్ డ్రామాలతోనే ప్రజల్ని మభ్యపెడుతోంది. ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయాలని ఎవరు డిమాండ్ చేసినా.. పరిపాలనలో ప్రభుత్వ వైఫల్యం ఎప్పుడు బయటపడినా.. రెడ్‌బుక్ అరాచకాలపై ప్రజాగ్రహం వెల్లువెత్తిన ప్రతిసారి.. ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయ, పునరావాస చర్యలు చేపట్టడంలో ప్రభుత్వ చేతగానితనం బటయపడగానే.. ఇలా కూటమి ప్రభుత్వ ప్రతి వైఫల్యంలోనూ వెంటనే ప్రజల దృష్టి మళ్లించేందుకు కూటమి ప్రభుత్వం కొత్త కుట్రలకు తెరతీస్తునే ఉంది.


