విజయవాడ, సాక్షి: జాబ్ కావాలంటే బాబు రావాలి.. ఇది ఒకప్పుడు చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల హామీ. ఆయన మూడుసార్లు సీఎంగా ఉన్న టైంలో అది కలగానే ఉండిపోయింది. కట్ చేస్తే.. ఇప్పుడు మళ్లీ ఆయనే అధికారంలో ఉన్నారు. అలాగే ఆ సమస్యా మొదటికొచ్చింది. ఈసారి మరోలా!. ఏపీలో ఇప్పుడు ఉద్యోగం కావాలంటే.. ఆ ఒక్కటి ఉంటే చాలూ!.
అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే.. ఏపీలో ప్రతీకార రాజకీయాలకు తెర లేపింది కూటమి. తాము ఇచ్చిన హామీలనూ ఇప్పటికే అటకెక్కించేసిన చంద్రబాబు.. గత వైఎస్సార్‌సీపీ హయాంలో ఉన్న వ్యవస్థలను నిర్వీర్యం చేసేశారు. అధికారం ఉందని అరాచకాలకు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. రేషన్ షాపులనూ వదలకుండా.. బలవంతంగా లాక్కుని తమ పార్టీ నేతలకు ఇప్పించేసుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఉద్యోగుల మీద పడ్డారు!.
ఎన్నికల టైంలో అధికారం కోసం చంద్రబాబు అండ్ కో చెప్పింది ఏంటంటే.. ఉద్యోగాలను సృష్టిస్తామని, అది కుదరని పక్షంలో ఉద్యోగభృతి ఇస్తామని. కానీ, ఈ రెండూ చేయడం లేదు. ఖాళీల విషయంలో.. కనీసం సమీక్షలు సైతం జరపడం లేదు. పైగా ఉన్న ఉద్యోగాలను తొలగిస్తూ.. ఆ స్థానంలో తమవారిని తిరిగి నియమించే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ఏపీలో ఇప్పుడు ఉద్యోగం కావాలంటే.. కూటమి నేతల రికమండేషన్ ఉంటే చాలూ!.
తాజాగా.. ఫైబర్ నెట్ నుంచి ఏకంగా 410 మంది ఉద్యోగులను తొలగించారు. ఇంకొంత మందిని కూడా తొలగించడం ఖాయమని చెప్పారు. ఉద్యోగాల తొలగింపునకు కారణం.. వైఎస్సార్‌సీపీ మీద పెద్ద అభాండం వేసేశారు. అయితే ఈ యాక్షన్ కూటమి పార్టీల కార్యకర్తల కోసమేనని ఇప్పుడొక ఓ స్పష్టత వచ్చింది.
ఇప్పటికే మంత్రుల పేషీల్లో టీడీపీ కార్యకర్తల కోసం ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. ప్రతి మంత్రి పేషీల్లో ఇద్దరు సోషల్ మీడియా ఉద్యోగులు, పీఆర్వో నియామకానికి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలోనే.. ఇప్పుడు ఫైబర్ నెట్ ఉద్యోగులను రోడ్డున పడేయ్యాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాళ్ల స్థానంలో తమ వాళ్లను నియమించుకోవాలని కూటమి నేత ఉవ్విళ్లూరుతున్నారు.ఇప్పటికే వాట్సాప్ సందేశాలు.. ఫోన్ల ద్వారా టీడీపీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ ఆదేశాలు వెళ్తున్నాయట!. అదే బాటలో.. మిగిలిన రెండు పార్టీల నుంచి కూడా సిఫారసులు వెళ్తున్నట్లు సమాచారం.
సాధారణంగా.. అధికార యంత్రాగాల్లో ఉన్నత స్థాయిలో తమకు అనుకూలరను నియమించుకోవడం.. ఇతరులను సాగనంపడం ఇలాంటివి కనిపిస్తుంటాయి. కానీ, ఫర్ ఏ ఛేంజ్ కోసం చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఏరకంగా చూసుకున్నా.. ఏపీలో నిరుద్యోగ సమస్య తీరింది.. అదీ నిష్పక్షపాతంగా వైఎస్సార్‌సీపీ హయాంలోనే!.
ఇదీ చదవండి: వైఎస్సార్‌సీపీ హయాంలో 30 లక్షల ఉద్యోగాలు
Comments
Please login to add a commentAdd a comment