ఆత్మరక్షణలో చంద్రబాబు.. కారణం ఇదేనా? | Ksr Comments On The Conduct Of YSRCP And TDP Leaders In The Upcoming MLC Elections | Sakshi
Sakshi News home page

ఆత్మరక్షణలో చంద్రబాబు.. కారణం ఇదేనా?

Published Fri, Aug 9 2024 11:19 AM | Last Updated on Fri, Aug 9 2024 2:02 PM

Ksr Comments On The Conduct Of YSRCP And TDP Leaders In The Upcoming MLC Elections

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి విశాఖ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికపై వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ఒకవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీరుతెన్నులను ఎండగడుతూ, మరో వైపు వైఎస్సార్‌సీపీ స్థానిక నేతలలో నైతిక స్థైర్యం నింపే యత్నం చేస్తున్నారు. పార్టీపరంగా చూస్తే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చాలా ముందుగానే మేల్కొన్నారని అనుకోవచ్చు. అదే టైమ్‌లో చంద్రబాబు నాయుడును ఆత్మరక్షణలో పడేసేలా ఆయన ముందుకు సాగుతున్నారని భావించవచ్చు.

ఎందుకంటే ఈ నెలాఖరుకు ఈ ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతోంది. తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిని ప్రకటించడానికి ఆలోచన చేస్తున్న తరుణంలోనే, వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి వైఎస్సార్‌సీపీ పక్షాన సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పేరును తమ అభ్యర్దిగా డిక్లేర్‌ చేశారు. ఇందుకోసం విశాఖ ప్రాంత పార్టీ నేతల అభిప్రాయాలను తీసుకున్నారు. బొత్స అయితే పార్టీలో జోష్ వచ్చే అవకాశం ఉందని అంతా అనుకున్నారు. అన్ని హంగులపరంగా గట్టి వ్యక్తిగా పేరున్నందున, పార్టీలో అందరికి బాగా తెలిసిన వ్యక్తి అయినందున బొత్స ఎంపిక జరిగిందని పలువురు అభిప్రాయపడ్డారు.

ఇటీవలి శాసనసభ ఎన్నికలలో పరాజయం నేపథ్యంలో పార్టీ క్యాడర్‌ను చురుకుగా ఉంచడానికి ఈ ఎన్నికను ప్రాతిపదికగా తీసుకున్నారు. గతంలో వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి పూర్తిగా ప్రాంతీయ సమన్వయకర్తల మీదే ఆధారపడి నిర్ణయాలు చేసేవారన్న అభిప్రాయం ఉంది. ఉదాహరణకు సుమారు ఏడాది క్రితం ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక జరిగితే, ఆయన పూర్తిగా సమన్వయకర్తలు, ఆ ప్రాంత నేతలకు వదలివేశారు. కారణం ఏమైనా ఆ ఎన్నికలో వైఎస్సార్‌సీపీ ఓడిపోయి టీడీపీ అభ్యర్ది గెలిచారు. అది సాధారణ ఓటర్లలో, ప్రత్యేకించి విద్యాధికులలో భిన్నమైన సంకేతాన్ని ఇచ్చింది. ఆ ఓటమిని పార్టీ తేలికగా తీసుకుందన్న అభిప్రాయం ఉంది. దాని కారణంగా సాధారణ ఎన్నికలలో మూల్యం చెల్లించవలసి వచ్చింది.

ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలో స్వయంగా రంగంలో దిగి ఆయా నియోజకవర్గాల నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్లు తదితర ఓటింగ్ హక్కు కలిగినవారితో భేటీ అవుతున్నారు. ఈ సందర్భంగా ఆయన ఉపన్యాసం ఇస్తూ చంద్రబాబు చేసేది అధర్మ యుద్దం అని, దానిని ఎదుర్కొని విజయం సాధించాలని పిలుపు ఇచ్చారు. నిజానికి టీడీపీ ఇంకా అభ్యర్ధిని ప్రకటించలేదు. కాని చంద్రబాబు ఏ ఎన్నికను అంత తేలికగా వదలిపెట్టరు. బలం ఉన్నా, లేకపోయినా ఎలాగోలా అన్ని రకాల ప్రలోభాలను ప్రయోగించి గెలవాలని ఆలోచిస్తారన్న భావన సర్వత్రా ఉంది. అందులోను అధికారంలో ఉన్నప్పుడు అసలు వదలిపెట్టరు.

శాసనమండలిలో ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ పూర్తి ఆధిక్యతతో ఉంది. దానిని తగ్గించడానికి, పార్టీని బలహీనపరచడానికి ఈ ఉప ఎన్నికను వాడుకోవాలని టీడీపీ సహజంగానే యత్నిస్తుంది. కాని బలం రీత్యా టీడీపీ గెలవడం కష్టం. 600 పైగా ఓటర్లు ఉంటే అందులో 400 మంది వైఎస్సార్‌సీపీ ఓటర్లే. టీడీపీకి 200 మంది మాత్రమే ఉన్నారు. అంటే టీడీపీ గెలవాలంటే మరో 200 మందిని ప్రలోభపెట్టవలసి ఉంటుంది. అయినా చంద్రబాబు వదలిపెడతారని ఎవరూ అనుకోవడం లేదు. విశాఖపట్నం కార్పొరేషన్‌లో జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో టీడీపీ కూటమికి బలం లేకపోయినా, వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లను కొందరిని ప్రలోభాలకు గురి చేయడం, అధికారులను అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడడం వంటి చర్యల ద్వారా గెలిచారు.

వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి తన స్పీచ్‌లో ఆయా అంశాలను ప్రస్తావించి చంద్రబాబు అధర్మ యుద్ధంలో ఆరితేరిన వ్యక్తి అని, అందువల్ల వైఎస్సార్‌సీపీ నేతలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక్కడ జగన్ రెండు వ్యూహాలను అమలు చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ తన బలాన్ని నిలబెట్టుకోవడం ద్వారా బొత్సను గెలిపించుకోగలిగితే పార్టీకి అది ఊపు ఇస్తుంది. పార్టీ క్యాడర్ నైతిక స్పూర్తి వెల్లడవుతుంది. ఒకవేళ చంద్రబాబు, పవన్  కల్యాణ్‌, బీజేపీల కూటమి అనైతిక పద్ధతులకు పాల్పడి ఓటర్లను కొనుగోలు చేస్తే, దానిని రాష్ట్రం అంతా ప్రచారం చేసి కూటమిని ఎండగట్టవచ్చు. చంద్రబాబు తన వెనుకటి గుణం మానుకోలేదన్న విషయం ప్రజలకు అర్థం అయ్యేలా చెప్పవచ్చు. ఈ రకంగా రెండు రకాలుగా చంద్రబాబు ఆత్మరక్షణలో పడవచ్చు.

ఇప్పటికే గత శాసనసభ ఎన్నికలలలో కూటమి ఇచ్చిన హామీలు అమలు చేయలేని పరిస్థితిపై ప్రజలలో వ్యతిరేకత ఏర్పడింది. దానికి తోడు ఇలాంటి అక్రమ పద్ధతులు అవలంభిస్తే టీడీపీ మరింత వేగంగా అప్రతిష్ట పాలవుతుంది. ఈ పాయింట్‌ను దృష్టిలో పెట్టుకునే వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలో ఒక్కో ఓటర్‌కు ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలు వరకు ఇస్తామని చంద్రబాబు ప్రలోభపెడుతున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. అదే టైమ్ లో చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ఆయన ప్రస్తావిస్తున్నారు. తాను పలావు పెడుతుంటే, చంద్రబాబు బిర్యానీ పెడతానని అన్నారని, దానికి ప్రజలు ఆశపడ్డారని, చివరికి పలావు, బిర్యానీ రెండూ లేకుండా పోయాయని, ప్రజలకు పస్తులు మిగిలాయని జగన్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య ప్రజలను బాగా ఆకర్షిస్తోంది.

తాను అధికారంలో ఉంటే ఈసరికి అమ్మ ఒడి, రైతు భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన వంటి స్కీములు వచ్చి ఉండేవని, ప్రజలకు మేలు జరిగేదని ఆయన వివరిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వీటిని ఎగవేస్తున్న విషయాన్ని ప్రజలలోకి తీసుకువెళ్లాలని వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి సూచిస్తున్నారు. తాను విశ్వసనీయతకు నిలబడే వ్యక్తిని అయితే, చంద్రబాబు మాట మీద నిలబడే వ్యక్తి కాదని ఆధార సహితంగా చెబుతున్నారు. 2014 టరమ్‌లో చంద్రబాబు ఇరవైమూడు మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన తర్వాత, వారికి ఆశచూపిన మొత్తం పూర్తిగా ఇవ్వలేదని, ఆ తర్వాత వారిలో ముగ్గురికి తప్ప మిగిలినవారికి టిక్కెట్లు ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. వారిలో పలువురు తిరిగి తన వద్దకు రావడానికి యత్నించినా అంగీకరించలేదని, ఫలితంగా రెండు విధాలుగా వారు నష్టపోయారని ఆయన అన్నారు.

ఇప్పుడు కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ వంటి ఓటర్లను కూడా ఆకర్షించే యత్నం చేస్తున్నారని, చంద్రబాబును నమ్మితే, ఆ తర్వాత వారికి దక్కేది ఏమీ ఉండదని ఆయన హెచ్చరిస్తున్నారు. ఈ రకంగా చంద్రబాబు రాజకీయాలలో మోసపూరితంగా ఉండే నేత అని, అలాంటి వ్యక్తిని నమ్మవద్దని, తాను విశ్వసనీయతకే పట్టం కడతానని, ఏదైనా చెబితే చేయాలన్నదే తమ పార్టీ విధానమని వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి చెబుతున్నారు. ఈ ప్రక్రియ అంతా వైఎస్సార్‌సీపీలో కొత్త ధైర్యాన్ని ఇవ్వడానికి ఉపయోగపడవచ్చు. వైఎస్సార్‌సీపీకి అండగా ఉంటే కాడర్‌కు భవిష్యత్తు ఉంటుందని భరోసా ఇవ్వడానికి యత్నిస్తున్నారు.

నిజానికి బలం లేనందున టీడీపీ పోటీ చేయకుండా ఉంటే వారికి గౌరవం మిగులుతుంది. అలాకాకుండా చంద్రబాబు కనుక తన రాజకీయ వ్యూహాలను అమలు చేసి టీడీపీ అభ్యర్ధిని రంగంలో దింపి రాష్ట్ర వ్యాప్తంగా దానికి ప్రచారం కల్పిస్తే ఆయనకే నష్టం కలగవచ్చు. టీడీపీ గెలిచినా అది డబ్బుతో విజయం సాధించినట్లు అవుతుంది. అభివృద్ది కోసమే స్థానిక ప్రతినిధులు టీడీపీలోకి వచ్చారని చెప్పినా, జనం ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. అందులోను చంద్రబాబు ట్రాక్ రికార్డు అటువంటిది అన్న సంగతి బహిరంగ రహస్యమే. ఇంత చేసినా టీడీపీ ఓటమి చెందితే పార్టీకి మరింత అప్రతిష్ట అవుతుంది. ఈ నేపథ్యంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందుగానే వ్యూహరచన చేసి ఎమ్మెల్సీ ఎన్నికపై పావులు కదుపుతున్నారని అనుకోవచ్చు.


– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement