చంద్రబాబు మరో మాయ.. ముందే లీకులు కూడా! | KSR Comments Over CM Chandrababu P-4 Policy In AP | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ‘పీ-4’ మాయ.. ముందే లీకులు కూడా!

Published Mon, Sep 9 2024 3:45 PM | Last Updated on Mon, Sep 9 2024 4:05 PM

KSR Comments Over CM Chandrababu P-4 Policy In AP

ఆంధ్రప్రదేశ్ ప్రగతికి రోడ్ మ్యాప్ తయారు చేస్తోన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇది కొద్ది రోజుల క్రితం ఆంగ్ల పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఒక వార్త. ఇది నిజమే అయితే సంతోషించాల్సిన విషయమే. ఆ మొత్తం కథనం చదివితే ఎక్కడా సూపర్ సిక్స్ కానీ.. ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలు కనిపించలేదు. వాటికి రోడ్ మ్యాప్ ఎందుకు తయారు చేయడం లేదో చెప్పలేదు.

కొత్త రోడ్ మ్యాప్‌లో ప్రధానంగా జనాభా మేనేజ్‌మెంట్(డెమోగ్రాఫ్‌ మేనేజ్‌మెంట్) గురించి ప్రస్తావించడం ఒక విశేషమైతే.. పీ-4(పీపుల్, పబ్లిక్, ప్రైవేట్, పార్టనర్‌ షిప్‌) పాలసీ మీద కేంద్రీకరించారు. చంద్రబాబు గత కొంతకాలంగా చేస్తున్న ప్రచారాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు. రాష్ట్ర అభివృద్దికి ఇంతకు మించి మార్గం లేదని చంద్రబాబు నాయుడు అన్నారని ఈ ప్రతిక వెల్లడించింది. ఈ ప్రైవేటు రంగం భాగస్వామ్యంతో ప్రయోజనాలు సాధించి తద్వారా సంపాదించే డబ్బును సంక్షేమానికి  ఖర్చు పెట్టవచ్చని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారట. అంటే ఏమిటి దీని అర్ధం. తాను ఇచ్చిన సూపర్ సిక్స్ హమీలు ఇప్పట్లో అయ్యేవికావని చెప్పడమేనా?.

ప్రతీ మహిళకు నెలకు 15 వందలు, స్కూల్‌కు వెళ్లే ప్రతీ విద్యార్ధికి ఏడాదికి 15వేలు, ప్రతీ ఇంటికి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు,  యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు లేదా మూడు వేల నిరుద్యోగ భృతి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. వీటికి బాబు సూపర్ సిక్స్ అని పేరు పెట్టారు. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ఫోటో ప్రచురించారు. దీనికి బాబు ష్యూరిటీ.. భవిష్యత్ గ్యారంటీ అని టైటిల్ పెట్టారు. ఇందులో ఎక్కడా పీ-4 విధానాన్ని అమలు చేసి.. అంటే ప్రైవేటు రంగంతో కలిసి వ్యాపారాలు చేసి లేదా అభివృద్ది సాధించి అటు పిమ్మట వచ్చే డబ్బుతో ఈ సూపర్ సిక్స్ అమలు చేస్తామని ఎక్కడా రాయలేదు.

ఇవి కాకుండా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన అనేక హమీలు ఉన్నాయి. ఉదాహరణకు వాలంటీర్లను కొనసాగిస్తానని, వారికి గౌరవ వేతనం ఐదు వేల నుంచి 10వేలకు పెంచుతామని అప్పట్లో ప్రకటించారు. బీసీలకు ఏభై ఏళ్లకే పెన్షన్ ఇస్తామని మేనిఫెస్టోలో తెలిపారు. ఈ ష్యూరిటీలు.. భవిష్యత్ గ్యారంటీలు ఏమై పోయాయో కానీ ఇప్పుడు తాజాగా పీ-4 విజయవంతం అయితేనే సంక్షేమం మీద అధిక డబ్బులు ఖర్చు పెట్టగలుగుతామని సెలవిస్తున్నారు. సో.. మీడియా మేనేజ్‌మెంట్‌లో దిట్ట అయిన చంద్రబాబు నాయుడు ఇదే ఏపీ గ్రోత్ అని.. దీనికి ఒక రోడ్ మ్యాప్ అని కథనాలు ఇప్పిస్తున్నారు.

పరిశ్రమల అభివృద్ది, ఉపాధి, అమరావతి, పోలవరం, ఇంధన రంగం మొదలైన వాటి మీద ఫోకస్ చేస్తారట. అందులోనూ నైపుణ్య గణన వచ్చే రోజుల్లో గేమ్ చేంజర్ అవుతుందట. అన్న క్యాంటీన్లు, మౌళిక వసతులు అభివృద్ది, పోలవరం ప్రభుత్వ ప్రధాన ఎజెండా అట. వాటిపై డాక్యుమెంట్ తయారు చేయడానికి సీనియర్ అధికారులతో చర్చ జరిపారట. ఈ ఫలితాలు సాధించడానికి చంద్రబాబు.. అధికారులకు సలహాలు ఇచ్చారట. ఈ మొత్తం వార్త చూస్తే ఏమనిపిస్తుంది. సూపర్ సిక్స్‌లోని అంశాలు ఏవీ ప్రధాన ఎజెండాలో లేవని కొంత ప్రత్యక్షంగా.. కొంత పరోక్షంగా చెప్పేస్తున్నట్టే కదా?. ఆ సూపర్ సిక్స్‌ రాష్ట్ర భవిష్యత్‌కు గ్యారంటీ అని కదా ఎన్నికలకు ముందు  చెప్పింది. చంద్రబాబు ష్యూరిటీ ఇచ్చింది. మరి ఇప్పుడు ఎందుకు మాట మార్చి ఏదేదో మాట్లాడుతున్నారు.

పరిశ్రమల అభివృద్ది, పోలవరం నిర్మాణాన్ని ఎవరు వద్దు అంటారు?. అది నిరంతర ప్రక్రియ. పోలవరానికి  సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా చేసేది  ఏమి లేదు. ఈయన టైంలో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ ముందుగా పునరుద్దరణ జరగాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం మొత్తం వ్యయ అంచనాలను ఆమోదించాలి. ఆ తర్వాత డబ్బు కూడా కేంద్రమే ఇస్తుంది. కేంద్రం నిర్మించాల్సిన ప్రాజెక్టును తాను చేపట్టి దానిని గందరగోళంలోకి నెట్టిన ఘనత చంద్రబాబుదే. అయినా ఇప్పుడు ఆ నెపాన్ని వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై నెట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఇరవై లక్షల ఉద్యోగాలు ఏలా ఇచ్చేది ఈ రోడ్ మ్యాప్‌లో చెప్పలేదు. తన స్పీచ్‌లలో కూడా చంద్రబాబు ఎక్కడా ఇది చెప్పడం లేదు. వైఎస్‌ జగన్‌ హయాంలో వచ్చిన పరిశ్రమలను మరోసారి ప్రారంభించి అది తన ఘనత అని ప్రచారం చేసుకుంటున్నారు.

ఇక అమరావతి చూస్తే ప్రభుత్వం ఒక్క పైసా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని, సెల్ఫ్ ఫైనాన్స్‌గా తనే సమకూర్చుకుంటుందని ఇంత కాలం  చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఏకంగా 15వేల కోట్ల రూపాయల అప్పును తీసుకువచ్చి అది ఏదో ఒక గొప్ప విషయంగా ఊదరగొడుతున్నారు. ఇక అక్కడే నాలుగేళ్లలో రూ. 60వేల కోట్లు ఖర్చు చేస్తామని మంత్రి నారాయణ చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహరంలో ‘అన్న క్యాంటీన్లు’ పెట్టడం పెద్ద సంక్షేమ కార్యక్రమంగా చెప్పుకుంటున్నారు. సామాజిక పెన్షన్లు వెయ్యి రూపాయలు పెంచారు. ఇవి తప్ప మిగతా వాటిన్నింటికీ ఆయన పీ-4 విధానం కింద సంపాదించడం ద్వారానే అధిక ఖర్చు చేయగలుగుతామని జనానికి చెబుతున్నట్టుగా ఉంది. 2014-2019 మధ్య ఇలాంటి డాక్యుమెంట్లు తయారు  చేయలేకపోలేదు. ప్రతీ జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు బ్రోచర్ వేసి ప్రచారం చేసుకున్నట్టుగా ప్రభుత్వం అది చేస్తుంది.. ఇది చేస్తుంది అంటూ విమానాశ్రయాలు మొదలు అనేక హమీలు గుప్పించారు. కానీ, ఆచరణలో ఒక్కటి కూడా చేయలేకపోయారు.

రుణ మాఫీ తదితర హామీలు సైతం అరకొరగా అమలు చేసి హుష్ కాకి అన్నారు. ఇప్పుడు ఏపాటి చేస్తారో కానీ.. పీ-4 విజన్ డాక్యుమెంట్, రోడ్ మ్యాప్ అంటూ జనాన్ని మాయ చేయడానికి వీలుగా మీడియాకు లీక్‌లు ఇస్తున్నారు. వీటికి తోడుగా ఇప్పుడు ఏపీలో జనాభాను పెంచుతారట. ఇప్పటికే జనాభా అధికమై దేశం అనేక సమస్యలు ఎదుర్కుంటుంటే ఆంధ్రప్రదేశ్‌లో పిల్లలను అధికంగా కనమని చంద్రబాబు సలహా ఇస్తున్నారు. తన కుటుంబంలో అమలు చేయని విధానాన్ని ఇతరులు అంతా చేయాలని చెప్పడమే హైలెట్‌. పిల్లలను ఎంత మందిని కంటే అందరికి తల్లికి వందనం ఇస్తామని ప్రచారం చేసిన ఈయన ఇంతవరకు ఆ స్కీమ్ అమలు గురించే మాట్లాడడం లేదు. ఈ ఏడాది దానిని అమలుచేయడం లేదని ఆయన కుమారుడు, మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. అంటే చంద్రబాబును నమ్మి పిల్లలను  కనేపనిలో ఉంటే ఏమవుతుందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ కాదా!.

పంచాయతీ, మున్సిపాలిటీ పదవుల కోసం ఆశపడి ప్రజలు ఎక్కువ మంది పిల్లలను కంటారని చంద్రబాబు ప్రభుత్వం కనిపెట్టడం మరో విడ్డూరం. గతంలో ఇద్దరు పిల్లలను మించి పిల్లలను కంటే స్థానిక ఎన్నికల్లో అనర్హులు అవుతారని తెచ్చిన చట్టాన్ని ఈయన తీసేశారు. ఒక పక్క జనాభా పెంచాలని అంటారు. ఇంకో పక్క భవిష్యత్ గ్యారంటీ అన్నారు. మరి వీటికి డబ్బులు ఎక్కడివీ అంటే పీ-4 అంటారు. ధనికులు పేదలను దత్తత తీసుకోవాలంట. ప్రభుత్వం, ప్రైవేట్ కలిసి వ్యాపారాలు చేయాలట. తద్వారా లాభాలు సంపాదించాలట. తదుపరి ఆ డబ్బును సంక్షేమంపై ఖర్చు  చేయాలట. ఇది అంతా ఆయన విజన్ అంట. ఏం చేస్తాం అధికారంలో ఉన్న వాళ్లు ఏం చెప్పిన గొప్ప విషయంగా జనం తీసుకోవాలి. లేదంటే ఏలిన వారికి కోపం రావచ్చు. ఇదే క్రమంలో ఇప్పటికే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి తెలుగు మీడియా చంద్రబాబుకు భజన చేసే పనిలో  ఉంటే.. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియా కూడా తన పాత్రను పోషిస్తున్నట్టుగా ఉంది. ఏం చేసినా, చేయకపోయినా ఇలా బిల్డప్ ఇచ్చుకోవడంలో చంద్రబాబును మించిన మొనగాడు లేడేమో!.

- కొమ్మినేని శ్రీనివాస రావు.
సీనియర్‌ పాత్రికేయులు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement