ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రివర్గ సభ్యులు చేస్తున్న ప్రకటనలపై శాస్త్రీయంగా ఒక అధ్యయనం జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే... ఎన్నికల ముందు చేసిన ప్రకటనలు.. ఆ తరువాత ఇస్తున్న సందేశాలు అంత ఆసక్తికరంగా ఉన్నాయి మరి! మాటలు మార్చడం ఇంత తేలికా అన్నట్టుగా ఉన్నాయి ఇటీవలి కాలంలో వీరు చేస్తున్న ప్రకటనలు. ఏమాత్రం జంకు గొంకూ లేకుండా అసత్యాలెలా చెప్పగలుగుతున్నారు? అసలు వీరి మాటలను ప్రజలు పట్టించుకుంటున్నారా? అన్న అనుమానాలూ వస్తున్నాయి.
చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఏమన్నారు..? తన రాజకీయ అనుభవంతో ప్రజలపై భారం పడకుండా సంపద సృష్టించి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాననే కదా? ఈ మాటలన్నింటికీ పవన్ కళ్యాణ్ ఊకొట్టడమే కాకుండా నిజం నిజం అంటూ బాబును ఆకాశానికి ఎత్తేశారా లేదా? వందిమాగధుల చందంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థలు పొడగ్తలతో బాబుకు ఎలివేషన్ కూడా ఇచ్చాయే..!! జగన్ సంక్షేమ కార్యక్రమాలను వృథా ఖర్చులంటూ, బటన్ నొక్కడం తప్ప ఆయన చేసిందేమీ లేదంటూ విమర్శించిన ఈ మీడియా సంస్థలు చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రెండు, మూడు రెట్ల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తారని సూపర్ సిక్స్ అంటూ హోరెత్తించాయి కూడా. జగన్ చేస్తే తప్పట. అదే చంద్రబాబు ఇంకా అధికంగా చేస్తానని చెబితే సూపర్ అట. ఇలా సాగిపోయింది వారి ప్రచారం.
కానీ... టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక మొత్తం ఒక్కసారిగా అందరి గొంతు మారిపోయింది. వారి అసలు స్వరూపాన్ని బయటబెట్టుకుంటున్నారు. ఇచ్చిన హామీలు అన్నింటిలోనూ యూటర్న్ తీసేసుకున్నారు. ఇందుకు ఏమాత్రం సిగ్గుపడటమూ లేదు సరికదా.. దబాయింపులు, బుకాయింపులతో పాలన సాగిస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యుత్ ట్రూ అప్ ఛార్జీలు పిసరంత పెంచినా బాదుడే, బాదుడు.. విద్యుత్ ఛార్జీలు ఘోరంగా పెరిగాయి అంటూ టీడీపీ, ఎల్లో మీడియా గొంతు చించుకునేవి. ఈ ప్రభావం ప్రజలపై కూడా కొంత పడింది. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, తగ్గిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.
అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక అదే ట్రూ అప్ ఛార్జీలను మరింత అధికంగా బాదుతున్నారు. ఏకంగా రూ.17 వేల కోట్ల భారం మోపడానికి ఆమోదం పొంది, రూ.ఆరు వేల కోట్లకు పైగా మొత్తాన్ని తక్షణం వసూలు చేయడం ఆరంభించారు. అదేమిటంటే జగన్ ప్రభుత్వం నిర్వాకం వల్ల పెంచాల్సి వస్తోందని కొత్త రాగం అందుకున్నారు. దీంతో సంపద సృష్టి అంటే జగన్ టైమ్‌లో కంటే ఎక్కువ ఛార్జీలు వసూలు చేయడమా? అని ప్రజలు నివ్వెర పోతున్నారు. ఇంకో ఉదాహరణ... రోడ్లపై గోతులు పూడ్చి, రోడ్ల నిర్వహణకు సంబంధించి చంద్రబాబు చేసిన ప్రకటన చూడండి. జగన్ టైమ్‌లో రహదారులను బాగు చేసినప్పటికీ రాష్ట్రంలో రోడ్లన్ని పాడైపోయినట్లు ఈనాడు మీడియా ప్రచారం చేసింది. వర్షాల వల్ల గోతులు పడినా, అదంతా జగన్ ప్రభుత్వ వైఫల్యంగా చూపించే ప్రయత్నం చేశారు.
ఈ ప్రచారం ఎంత స్థాయికి చేరుకుందంటే.. చంద్రబాబు, పవన్‌లు అధికారంలోకి రాగానే రహదారులపై గోతులు ఆమాంతం మాయమైపోతాయని, అద్దాల్లా మెరిసిపోతాయని ప్రజలు అనుకున్నారు. కానీ వాస్తవం ఏమిటంటే.. వీరు అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కావస్తున్నా మారింతి వీసమెత్తు కూడా లేదు. చంద్రబాబు నాయుడు అట్టహాసంగా హెలీకాప్టర్ వేసుకుని ఓ గ్రామం వద్ద రహదారి గోతిపై మట్టిపోసి రావడం తప్ప! తాజా అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మళ్లీ గొంతు మార్చేశారు. రహదారుల నిర్వహణ ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నామన్నారు. వాహనదారుల నుంచి యూజర్ ఛార్జీలు వసూలు చేసి ప్రైవేట్ సంస్థలే రహదారులను మరమ్మతు చేస్తాయని, ఉభయ గోదావరి జిల్లాల్లోనే తొలి పైలట్ ప్రాజెక్టు మొదలు పెడాతమని ప్రకటించారు.
పైగా ప్రజలను ఈ పద్ధతికి ఒప్పించే బాధ్యతను ఆయన ఎమ్మెల్యేలపై నెట్టడం.. వారు ఒప్పుకోకుండా గుంతల్లోనే తిరుగుతామని అంటే తనకు అభ్యంతరం ఏమీ లేదని చెప్పడం కొసమెరుపు!! ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఏ పన్ను వేసినా, ఏ ఆదాయ వనరు పెంచినా, ప్రభుత్వ దోపిడీ అని అభివర్ణించిన చంద్రబాబు ఇప్పుడు ఏకంగా ప్రజల నుంచి వసూలు చేసే పన్నులు కాకుండా, అన్నిటిపై ముక్కు పిండి యూజర్ ఛార్జీలు వసూలు చేయాలని అనుకుంటున్నారన్నమాట. నిజానికి 1995లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ ఆస్పత్రులలో యూజర్ ఛార్జీలను ప్రవేశపెట్టారు. దానిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడు మండల స్థాయి రోడ్లకు కూడా యూజర్ ఛార్జీలు అంటున్నారు.
ఎన్నికల ప్రణాళికలో ఈ పద్దతి అమలు చేస్తామని చెబితే తప్పు కాదు. అప్పుడేమో అంతా ఫ్రీ అని, ఆ తర్వాత ఏదీ ఉచితం కాదని, డబ్బులు మీరే ఇవ్వాలని జనాన్ని అంటుంటే వారు నిశ్చేష్టులవడం తప్ప చేసేది ఏమి ఉంటుంది? ఇక్కడ మరో సంగతి చెప్పాలి. రోడ్లు,భవనాల శాఖ మంత్రి జనార్ధనరెడ్డి మాత్రం రహదారులపై టోల్ గేట్లు ఉత్తదే అని ప్రకటన చేశారు. కాని మంత్రి గాలి తీస్తూ చంద్రబాబు యూజర్ చార్జీల ప్రకటన చేసేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వ సూచన ప్రకారం స్థానిక సంస్థలు పారిశుద్ద్యం నిర్వహణకు నెలకు ఏభై నుంచి వంద రూపాయలు వసూలు చేస్తే జగన్ ప్రభుత్వం చెత్తపన్ను వేశారని, ఇది చెత్త ప్రభుత్వం అని దుర్మార్గపు ప్రచారం చేశారు. ఇప్పుడేమో వేల రూపాయల చొప్పున యూజర్ ఛార్జీలు వసూలు చేయడానికి సిద్ధమవుతున్నారు.
లేకుంటే గోతులే మీకు గతి అని బెదిరిస్తున్నారు. ఇప్పుడు దీనిని రోడ్లపై గుంతలకు కూడా జనం నుంచి డబ్బు వసూలు చేసే రోత ప్రభుత్వం అని ఎవరైనా విమర్శిస్తే తప్పులేదేమో! ఒకవైపు అమరావతి రాజధాని పేరుతో వేల కోట్ల అప్పులు తెస్తున్నారు. ఆ అప్పులు రాష్ట్రం అంతా కట్టాల్సిందే. అమరావతిలో మాత్రం కొత్త రోడ్లపై టోల్ గేట్లు పెట్టి డబ్బలు వసూలు చేస్తామని చెప్పడం లేదు. అమరావతిలో విలాసవంతమైన కార్లలో తిరిగే ఖరీదైన షరాబులే అధికంగా ఉంటారు. వారు తిరిగే రోడ్లపై అంతా ఫ్రీ. పేదలు, మధ్య తరగతి వారు ఎక్కువగా తిరిగే గ్రామీణ రోడ్లపై మాత్ర టోల్ వసూళ్లు. ఇసుక ,మద్యం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇసుక మొత్తం ఉచితం అనుకున్న ప్రజలకు గతంలో కన్నా అధిక రేట్లు పెట్టి కొనాల్సి రావడం అనుభవం అయింది. మద్యం ధరలు తగ్గిస్తారనుకుంటే ఎమ్.ఆర్.పి కన్నా ఎక్కువ రేట్లే వసూలు చేస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి.
కేంద్రం ప్రతిపాదించిన సంస్కరణలలో భాగంగా గత ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను పెడితే చంద్రబాబు, లోకేష్ , పవన్ కళ్యాణ్‌లు నానా యాగీ చేశారు. స్మార్ట్ మీటర్లు రైతులకు ఉరితాళ్లుగా దుర్మార్గపు ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక వాటినే కూటమి ప్రభుత్వం కొనసాగిస్తోంది. అప్పట్లో స్మార్ట్ మీటర్లపై వ్యతిరేక కథనాలు ఇచ్చిన ఈనాడు మీడియా ఇప్పుడు స్మార్ట్ మీటర్లు వచ్చేశాయి.. అని హెడింగ్ పెట్టి ప్రజలను పండగ చేసుకోమన్నట్లుగా స్టోరీలు ఇస్తోంది. వివిధ కారణాల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు బాగా పెరిగిపోయాయి. వాటిని అదుపు చేసే యంత్రాంగం లేకుండా పోయింది.
అప్పట్లో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయా సరుకుల రేట్లు పెరిగిపోయాయని యాగీ చేసిన టీడీపీ, ఈనాడు, జ్యోతి తదితర ఎల్లో మీడియా ఇప్పుడు అంతకు రెట్టింపు ధరలు పెరిగినా నోరు మెదిపితే ఒట్టు. ప్రజలకు జగన్ టైమ్ లో వచ్చిన స్కీముల డబ్బుతో పేదల జీవితం చాలావరకు సాఫీగా సాగేది. ఆయన ఇచ్చిన డబ్బు కంటే ఇంకా ఎక్కువ ఇస్తామని కూటమి నేతలు అబద్దాలు చెప్పి, ఇప్పుడు దాదాపు అన్నిటిని ఎగవేసే పనిలో ఉన్నారు.దాంతో మండుతున్న ధరలతో జనం అల్లాడుతున్నారు. ప్రస్తుతం పిండుతున్న అదనపు వసూళ్లు చాలవన్నట్లు జీఎస్టీపై ఒక శాతం సర్‌ఛార్జ్ వసూలు చేసుకునేలా అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని చంద్రబాబు నాయుడు కోరారు.
అది కూడా వస్తే ఏపీలో పన్నులు మరింతగా పెరుగుతాయి. నిత్యావసర వస్తువుల ధరలు మండుతాయి. ప్రజల జీవితం మరింత భారంగా మారుతుంది. చేసిన బాసలకు, చేస్తున్న పనులకు సంబంధం లేకుండా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పరిశోధనార్హమే అవుతుందేమో! బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అని టీడీపీ సూపర్ సిక్స్ నినాదం. కాని అది ఇప్పుడు బాబు ష్యూరిటీబాదుడే, బాదుడుకు గ్యారంటీగా మారిందా! ఇప్పుడు జనం రాష్ట్రానికి ఇదేం ఖర్మ అని అనుకోరా!
కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment