ఏపీ శాసనసభ ఎన్నికలకు ముందు ఎవరైనా టీడీపీ వారిని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలిసి ఇచ్చిన హామీలు ఎలా ఆచరణ సాధ్యం? అని ప్రశ్నిస్తే వారు ఠకీమని ఒక సమాధానం ఇచ్చేవారు. మా నాయకుడు అంత తెలివితక్కువవాడు కాదు. అవేమీ అమలు చేసేది ఉండదు. అవసరమైనవి, సాధ్యమైనవి మాత్రమే చేస్తారు అని చెప్పేవారు. మరి అది మోసం కాదా అని ప్రశ్నిస్తే, ఆ సంగతి తర్వాత, ముందు అధికారం రావాలి కదా! అని అనేవారు. సరిగ్గా అదే పంధాలో చంద్రబాబు ప్రభుత్వం ముందుకు వెళుతున్నట్లుగా ఉంది. కాకపోతే ఈసారి ఆయనకు పవన్ కల్యాణ్ కూడా తోడయ్యారు.
ఇంతకాలం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన వ్యవస్థలను మార్పు లేదా ఖతం చేసే దారిలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు ఉన్నారనిపిస్తుంది. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వానికి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, వలంటీర్ల వ్యవస్థలు ఎంతో పేరు తెచ్చి పెట్టాయి. ప్రజల అవసరాలను తీర్చడానికి, గడప వద్దకే పాలనను తీసుకువెళ్లడానికి అవి ఉపయోగపడ్డాయి. ఇప్పుడు ఆ వ్యవస్థలను యధాతధంగా కొనసాగించడం టీడీపీ, జనసేన, బీజేపీల కూటమికి అంత ఇష్టం ఉండదు. అందుకే కీలకమైన ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్లు కనిపిస్తుంది.
ప్రతి నెల మొదటి తేదీన వృద్దాప్య పెన్షన్ లు వలంటీర్ల ద్వారా కాకుండా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా లబ్దిదారుల ఇళ్లవద్ద పంపిణీ చేయాలని మంత్రివర్గం తీర్మానించింది. ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు వలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తామని, వారికి ఇచ్చే గౌరవ వేతనం ఐదువేల నుంచి పదివేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. చంద్రబాబు అయితే మరో అడుగు ముందుకు వేసి వలంటీర్లకు గౌరవవేతనంతో పాటు ఇళ్లవద్దే ఉండి నెలకు ఏభైవేల రూపాయల వరకు సంపాదించుకునేలా తాను చేస్తానని చెప్పేవారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన పది రోజులలోనే వలంటీర్లను వారి విధుల నుంచి పక్కనబెట్టడం విశేషం. దీంతో వీరి మనుగడ కొనసాగుతుందా? లేదా? అన్న చర్చ జరుగుతోంది.
ఏపీలో తొలుత రెండున్నర లక్షల మంది వలంటీర్లు ఉండేవారు. ఎన్నికల సమయంలో నిమ్మగడ్డ రమేష్ రూపేణ వలంటీర్ల వ్యవస్థను కొంత డిస్టర్బ్ చేయడంలో టీడీపీ సఫలం అయింది. వారి ద్వారా పెన్షన్ లు పంపిణీ కాకుండా ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు తెప్పించగలిగారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏర్పడడంతో ఎన్నికల కమిషన్ కూటమికి పూర్తిగా సహకరించిందన్న సంగతి తెలిసిందే. ఎన్నికల సంఘం నిర్ణయం తర్వాత సుమారు ఎనభై వేల మంది వలంటీర్లు రాజీనామాలు చేశారు. అయినా ఇప్పటికీ సుమారు లక్షన్నర మందివరకు వలంటీర్లు కొనసాగుతున్నారు. ఆ వలంటీర్లను వాడుకుంటూ, వలంటీర్లు లేనిచోట సచివాలయ సిబ్బందితో పెన్షన్ లు పంపిణీ చేస్తామని చెప్పి ఉంటే ఎవరికి సందేహం వచ్చేది కాదు.
వలంటీర్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి పార్ధసారథి చెప్పడం విశేషం. అంటే ఇందులో కొత్తగా తీసుకోవలసిన నిర్ణయం ఏమి ఉంటుంది? వలంటీర్ల వ్యవస్థను ఉంచాలా? వద్దా? అన్నదానిపైనే ప్రభుత్వం ఆలోచిస్తుండాలి. ఒకప్పుడు ఈ వలంటీర్లను ఉద్దేశించి చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ లు అనుచిత వ్యాఖ్యలు చేశారు. వారిని ఒక రకంగా అవమానించేలా మాట్లాడారు. సంఘ వ్యతిరేక శక్తులతో పోల్చారు. కానీ ఎన్నికల టైమ్ కు వలంటీర్లను వ్యతిరేకించడం వల్ల తమకు నష్టం వస్తుందని అనుమానించి, వెంటనే ప్లేట్ మార్చి వారికి పదివేల రూపాయల చొప్పున గౌరవ వేతనం ఇస్తామని, వ్యవస్థను కొనసాగిస్తామని ప్రకటించారు. ఎన్నికల మానిఫెస్టోలో కూడా ఇదే వాగ్దానం చేశారు. కానీ ఇప్పుడు వలంటీర్లను సస్పెన్స్ లో పెట్టారు.
వలంటీర్ల వ్యవస్థ వల్ల ప్రజలకు ఉపయోగం లేదని అనుకుంటే, అదే విషయాన్ని ఎన్నికల ప్రచారంలో చెప్పి ఉండవచ్చు. అలా చేయలేదు. పైగా వారిపట్ల సానుకూలంగా మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఉన్న వలంటీర్లను మార్చుతారేమోనన్న ప్రచారం జరిగేది. ప్రస్తుతం ఉన్నవారు వైఎస్సార్‌సీపీకి అనుకూలమైన వారన్నది టీడీపీ భావన. వీరికి బదులు టీడీపీకి సంబంధించినవారిని నియమించుకోవాలన్న ఆలోచన చేయవచ్చని అనుకున్నారు. కానీ అందుకువిరుద్ధంగా ఆ వ్యవస్థపైనే అనుమానాలు సృష్టించారు. వైఎస్సార్‌సీపీకి ఎన్నికలలో వలంటీర్ల వ్యవస్థ వల్ల రాజకీయంగా ఉపయోగం జరగలేదన్న అభిప్రాయం ఏర్పడింది.
ఈ నేపథ్యంలో టీడీపీలో కూడా పునరాలోచన ఏర్పడి ఉండవచ్చని అంటున్నారు. ఇదే సమయంలో సచివాలయాల సిబ్బందితో ఇళ్ల వద్ద పెన్షన్ లు పంపిణీ చేయించడం కూడా కొంత వివాదాస్పదం కావచ్చు. తమకు కొత్త బాధ్యత పెడుతున్నారన్న అసంతృప్తి ఏర్పడవచ్చు. అయినా ప్రభుత్వం వారిపైనే ఒత్తిడి పెడుతున్నదంటే ఈ వ్యవస్థలో ఇంకా పలుమార్పులు తీసుకురావాలని ఆలోచిస్తుండవచ్చనిపిస్తుంది. ఎందుకంటే వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మార్కు పాలన కనిపించకూడదని కూటమి నేతలు భావిస్తుండవచ్చు. సచివాలయాల సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి వారికి అవసరమైన పౌరసేవలు అందిస్తుంటారు. వలంటీర్లు ప్రజల నుంచి ఆయా దరఖాస్తులు తీసుకుని స్కీములలో చేర్చడం, వారికి కావల్సిన సర్టిఫికెట్లను సమకూర్చడం తదితర సేవలు అందించేవారు. ఇప్పుడు వీటన్నిటిని నిలుపుదల చేస్తే ఈ వలంటీర్లకు, సచివాలయాల సిబ్బందికి పని ఉండదు.
ప్రస్తుతానికి సచివాలయాల సిబ్బందికి డిప్రమోషన్ ఇచ్చిన రీతిలో వారినే లబ్దిదారుల ఇళ్లచుట్టూ తిప్పాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తుంది. ఇష్టం లేనివారు ఉద్యోగాలు మానుకుంటారు. లేదా, భవిష్యత్తులో వేరే రకంగా వాడుకునే ఉద్దేశంతో ఈ బాధ్యత అప్పగించి ఉండవచ్చు. చంద్రబాబు ప్రభుత్వం ఈ నిర్ణయం చేయడంతో మానిఫెస్టోలో చెప్పినవాటికి భిన్నంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వస్తాయి. అందుకే ఇప్పటికిప్పుడు ఒక నిర్ణయం తీసుకోకుండా, అంతా పరిశీలనలో ఉందని చెప్పవచ్చు. ప్రజాభిప్రాయం తీసుకుంటున్నామని తెలపవచ్చు. అలాగే అభిప్రాయాలు సేకరించామని, ప్రజలకు వలంటీర్లవల్ల ఉపయోగం లేదని, పేర్కొనవచ్చు. వలంటీర్ల వ్యవస్థను ఒకవేళ తొలగిస్తే రెండున్నర లక్షల మంది ప్రస్తుతం ఏదో రూపంలో పొందుతున్న ఉపాధిని కోల్పోయినట్లు అవుతుంది. దానిని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఏదైనా కొత్త నిర్ణయం చేస్తుందా? అనేది చూడాలి.
అలాగే.. ఇన్నివేల సచివాలయాల అవసరం లేదని, సిబ్బందిని వేరే రూపంలో వినియోగించుకోవచ్చని ఏమైనా ఆలోచన జరుగుతుందా అన్న సందేహం కూడా ఉంది.చంద్రబాబు నాయుడుకు ప్రజలలో ఉన్న అభిప్రాయానికి తగినట్లుగానే మాట మార్చుతారా అనే ప్రశ్న వస్తోంది. విశేషం ఏమిటంటే వలంటీర్లకు పదివేల రూపాయల వేతనం ఇస్తారని ఎన్నికల ప్రచారంలో హోరెత్తించిన ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి టీడీపీ మీడియా ఇప్పుడు క్యాబినెట్ నిర్ణయానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా జాగ్రత్తపడడం కూడా గమనించదగ్గ అంశమే. అదే ఇలాంటి నిర్ణయం ఏదైనా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేస్తే.. ఈ మీడియా పెద్ద ఎత్తున వ్యతిరేక ప్రచారం చేసేవి. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఏమి చేసినా సమర్థించే మీడియా కనుక వలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు మాట తప్పారని ఎక్కడా ఒక్క మాట రాయలేదు. పైగా క్యాబినెట్ కీలక హామీలను నెరవేర్చిందని హెడింగ్ లు పెట్టి మరీ జనాన్ని మోసం చేసే ప్రయత్నం చేశాయి.
చంద్రబాబు చేసిన తొలి ఐదు సంతకాలనే క్యాబినెట్ లో తీర్మానం చేశారు. మెగా డీఎస్సీ, వృద్దుల పెన్షన్ నాలుగువేల రూపాయలు చేయడం తప్ప మిగిలినవాటికి పెద్ద ప్రాధాన్యత లేదు. లేని టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తున్నట్లు తీర్మానం చేయడం మరో ప్రత్యేకత. టీడీపీ మీడియాకు ఇప్పుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు ప్రకటించిన సూపర్ సిక్స్ వాగ్దానాలు కీలకమైనవిగా కనిపించడం లేదు. స్కూళ్లు తెరిచిన ఈ టైమ్ లో తల్లికి వందనం పేరుతో బడికి వెళ్లే పిల్లలందరికి పదిహేనువేల రూపాయల చొప్పున ఇస్తామని చేసిన వాగ్దానం ప్రస్తావనే లేదు.
ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, ప్రతి రైతుకు ఏటా ఇరవైవేల రూపాయల ఆర్దిక సాయం, నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు, ప్రతి ఇంటికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు వంటి పలు హామీలు ఎప్పుడు అమలు చేసేది క్యాబినెట్ లో చర్చించలేదు. అదే వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ ఏడాది కాలానికి అమలు చేయవలసిన స్కీముల గురించి మంత్రివర్గంలో చర్చించి షెడ్యూల్ ఖరారు చేసేవారు. ఇప్పుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల ప్రభుత్వం ఆ పని చేయకపోగా, ఒక్కో హామీని ఏ రకంగా ఎగవేయాలా అనేదానిపై దృష్టి పెట్టినట్లుగా కనిపిస్తుంది. దానిని పక్కదారి పట్టించడానికి వీలుగా గత ప్రభుత్వంపై శ్వేతపత్రాలు విడుదల చేసే కథను నడపడానికి ప్రభుత్వం సిద్దమైందని అనుకోవచ్చు.
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment