ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి పాలన సాగుతోంది? గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు సొంత కారణాలతో ఘర్షణపడినా అందులో ఒకరికి వైఎస్సార్‌సీపీ రంగు పులిమి సైకో పాలన అంటూ విపరీతంగా దుష్ప్రచారం చేసేవారు. ప్రస్తుతం తెలుగుదేశం అధికారంలోకి వచ్చి నెలరోజులు అవుతున్నా రాష్ట్రంలో హింసాకాండ ఆగడం లేదు. వేధింపులు తాళలేక కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చివరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహించే కుప్పంలో సైతం ఒక వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నారంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ఊహించుకోవచ్చు.
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలోనే ఒక వైఎస్సార్‌సీపీ నేత భవనం కూల్చివేత జరిగింది. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులను టీడీపీ వారు వేధిస్తూనే ఉన్నారు. విధ్వంసం, దహనాలు జరిగిపోతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను ఇష్టారాజ్యంగా దగ్ధం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులను గృహ నిర్బంధం చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సైకో ప్రభుత్వం నడుస్తోందని, ఏపీలో ఆటవిక రాజ్యం రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తోందని అనిపించడం లేదా! ఇదేనా సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా అనుభవం కలిగి, మరోసారి సీఎం అయిన చంద్రబాబు నుంచి ప్రజలు ఆశించింది!
ఆయన రాజ్యంలో పోలీసులు బాధితులపై కేసులు పెడుతున్నారు. బాధితులపై దాడులు చేస్తున్నవారికి అండగా నిలుస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ కార్యకర్తల సమావేశాలు పెట్టుకోవడానికి పోలీసులు అనుమతించడం లేదు. ఇదంతా ప్రజాస్వామ్య స్పూర్తిగా తీసుకోవాలన్నమాట. రాజంపేట లోక్ సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తన నియోజకవర్గమైన పుంగనూరులో వైఎస్సార్‌సీపీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకుంటే అక్కడకు వెళ్లకూడదని పోలీసులు ఆయనను గృహ నిర్బంధం చేసిన తీరు పోలీసుల అసమర్ధతకు అద్దం పడుతుందని అనుకోవాలి.
గతంలో చంద్రబాబు నాయుడు తాను చెప్పిన మార్గంలో కాకుండా మరో రూట్‌లో పుంగనూరు వెళ్లి అక్కడ అరాచకానీకి కారకులయ్యారు. టీడీపీ కార్యకర్తలు పోలీస్ వాహనాన్ని దగ్ధం చేశారు. ఒక పోలీస్ కానీస్టేబుల్ కన్ను కూడా పోయింది. ఆ సందర్భంగా కేసులు నమోదు అయ్యాయి. టీడీపీ నేత చల్లా బాబుపై కూడా కేసు పెట్టి అరెస్టు చేశారు. బహుశా అది టీడీపీ వర్గీయులకు కోప కారణం అయింది. టీడీపీ అధికారంలోకి వచ్చాక పుంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆ నియోజకవర్గంలో పర్యటించడానికి వీలు లేదంటూ టీడీపీ వారు అడ్డుపడితే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. ఆ ప్రాంతంలో దౌర్జన్యాలకు గురైన వైఎస్సార్‌సీపీ వారిని, ఇతర బాధితులను పరామర్శించడానికి వెళ్లడానికి వీలులేదని పోలీసులు ఆదేశించారు.
ఇదీ చదవండి: కార్యాలయాల కూల్చివేతలపై సర్కారుకు ముకుతాడు
రామచంద్రారెడ్డి పర్యటన వల్ల ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందనుకుంటే టీడీపీ నాయకులను గృహ నిర్బంధం చేయాలి కానీ, పెద్దిరెడ్డిని పుంగనూరు నుంచి వెనక్కి పంపించడం ఏమిటి? పెద్దిరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఏ టీడీపీ నేత పర్యటనలనైనా ఎవరైనా అడ్డుకున్నారా? కుప్పంలో చంద్రబాబు పర్యటించే క్రమంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నప్పుడు సైతం పోలీసులు ఎంతో సంయమనం పాటించి, అన్నీ జాగ్రత్తలు తీసుకుని ఆయన పర్యటన పూర్తి అయ్యేలా చేశారే! అయినా ఆ రోజుల్లో చంద్రబాబు వైఎస్సార్‌సీపీపై తీవ్ర విమర్శలు చేస్తూ టీడీపీ కార్యకర్తలను రెచ్చగొడుతుండేవారు. ఇప్పుడు చంద్రబాబు సీఎం అయ్యాక, వైఎస్సార్‌సీపీ వారిని ఎవరిని కదలనివ్వడం లేదు. టీడీపీ వారు ప్రత్యర్ధుల పొలాలలోని తోటలను నరికి వేస్తున్నారు. పుంగనూరులో అయితే వైఎస్సార్‌సీపీ అనుకూలురైన పేదల ఇళ్లలోని ఆవులను కూడా తోలుకుపోతున్నారట.
రాష్ట్రంలో అనేక చోట్ల పేదల ఇళ్లను కూల్చుతున్నారు. ఎక్కడో మణిపూర్, ఆస్సోం వంటి రాష్ట్రాలలో నెలల తరబడి హింసాకాండ జరుగుతుంటే ప్రజలు ఎలా భరిస్తున్నారా అని అంతా బాధపడుతుండేవాళ్లం. అలాంటిది గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో అరాచక పాలన సాగుతున్నా అందులో భాగస్వామి అయిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కానీ, బీజేపీ కానీ నోరు విప్పడం లేదు. కొన్ని చోట్ల జనసేన కూడా ఈ విధ్వంసంలో భాగస్వామి అవుతోంది. ఈ సందర్భంగా మిథున్ రెడ్డి గట్టిగానే మాట్లాడారు. కూటమి నేతలు కక్ష రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన చెప్పారు. పుంగనూరుకు ప్రతిష్టాత్మకమైన విద్యుత్ బస్‌ల తయారీ కర్మాగారాన్ని తీసుకు వస్తే, కూటమి నేతలు దానిని చెడగొట్టి పెట్టుబడులు రాకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ యాజమాన్యం ఏమి చేయాలా? అని సందిగ్ధంలో పడిందట.
విశేషం ఏమిటంటే మిథున్ రెడ్డి తిరుపతిలో ఉన్నప్పటికీ, అక్కడకు వచ్చిన పుంగనూరు పార్టీ కార్యకర్తలు, నేతలు ఎవరిని ఆయనను కలవనివ్వలేదట. పోలీసులు నిజంగానే లోకేష్ ఎర్రబుక్ రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నట్లు అనిపిస్తుంది. తాను ప్రాణాలు ఇవ్వడానికి అయినా సిద్దమని, ప్రభుత్వ అరచాకాలను అడ్డుకుంటానని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ నేతలు మిథున్ రెడ్డి మాదిరి స్పందించడం ఆరంభించవలసిన అవసరం ఉంది. టీడీపీ వారు కానీ, పోలీసులు కానీ ఎన్నాళ్లు దాడులు చేస్తారు! ఎన్ని కేసులు పెడతారు?
గతంలో ఒకసారి పల్నాడులోని ఒక గ్రామంలో రెండు వర్గాలు ఘర్షణ పడ్డాయి. వెంటనే దానిని రాజకీయం చేయడానికి చంద్రబాబు పర్యటనకు వెళ్లబోతే పోలీసులు అడ్డుకున్నారు. దానిని చంద్రబాబు ఎంతగా విమర్శించింది అందరికి తెలుసు. అదే చంద్రబాబు ప్రభుత్వం ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ వారిపై అంతకన్నా దారుణంగా అణచివేత చర్యలకు పాల్పడుతోంది. టీడీపీ వారు చేస్తున్న క్రిమినల్ చర్యలకు ప్రోత్సాహం ఇస్తోంది. హోం మంత్రి వంగలపూడి అనిత నియోజకవర్గం పాయకరావు పేటలో సైతం ఇలాంటి దౌర్జన్యాలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల మహిళలని కూడా చూడకుండా టీడీపీ కార్యకర్తలు అరాచకాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఆటవిక చర్యలను ప్రజలు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నేతలు ప్రతిఘటించికపోతే ఏపీలో ప్రజాస్వామ్యం పూర్తిగా నాశనమవుతుంది. ఏపీ ఒక ఆటవిక రాజ్యంగా మిగులుతుంది.
ఈ సందర్భంలో వేమూరు వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జీ వి. అశోక్ బాబు గట్టిగా సమాధానం ఇచ్చిన వైనం ప్రస్తావనార్హం. భట్టిప్రోలు పంచాయతీ అద్దేపల్లి గ్రామంలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని టీడీపీ వారు దగ్ధం చేశారు. దానికి నిరసనగా అశోక్ బాబు అక్కడకు వెళ్లబోతే పోలీసులు అడ్డుకున్నారట. దాంతో ఆయన మౌన దీక్ష చేశారు. ఫలితంగా పోలీసులు వెనక్కి తగ్గకతప్పలేదు. అంతేకాక మరో కొత్త విగ్రహాన్ని తెప్పించి ఆయన అదే స్థానంలో ఆవిష్కరించారు. ఇలా ప్రతిచోట టీడీపీ వారి దుండగాలను ఎదుర్కోకపోతే అప్రతిహతంగా ఇలాంటి వాటినే కొనసాగిస్తారు. కేవలం వైఎస్సార్‌సీపీవారిని భయభ్రాంతులను చేసి టీడీపీ హామీలు ఎగవేసినా ఎవరూ ప్రశ్నించకుండా ఉండడం కోసం కూడా ఈ హింసాకాండ సాగిస్తున్నారన్న అభిప్రాయం ఉంది.
ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ కేంద్ర నాయకత్వం కూడా క్రియాశీలకం అయి నిరసనలకు దిగి కార్యకర్తలలో ఆత్మస్థైర్యాన్ని నింపవలసిన అవసరం ఉందన్న భావన వ్యక్తం అవుతోంది. ఏది ఏమైనా నలభై ఆరేళ్ళ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు ఏలుబడి ఇంత అధ్వాన్నంగా ఉందన్న విమర్శలు ప్రజలలో వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నెల్లూరులో చంద్రబాబుకు గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు టీడీపీ వారి అరాచకాలను ఆపుతారని, పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేసేలా ఆదేశాలు ఇస్తారని ఆశిద్దాం.
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment