
వినేవాడు వెర్రివాడు అయితే చెప్పేవాడు ఏమైనా చెబుతాడంటారు. ఆంధ్రప్రదేశ్ విషయంలో ఇది మరింత బాగా వర్తిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఖాయం చేసిన డైలాగు ‘2029 నాటికి జీరో పావర్టీ’ అంటే మరో నాలుగేళ్లలో ఏపీలో పేదరికం ఉండదన్న మాట. ఇందుకోసం ఆయన పీ-4 అనే విధానాన్ని తెస్తారట. దీని ప్రకారం రాష్ట్రంలోని సుమారు 20 లక్షల మంది ధనికులు పేదలను దత్తత తీసుకుని పైకి తీసుకురావాలట. అది సాధ్యమా? కాదా? ఇందుకు ఎన్ని వేల కోట్లు లేదా లక్షల కోట్లు వ్యయం చేయాలి? అన్నది పక్కనబెడితే, ఇదేదో కొత్త ఆలోచన అనుకున్న వారికి దీంతో బుర్ర తిరిగి పోవాల్సిందే.
ఇలాంటి దత్తత కార్యక్రమాలు దశాబ్దాలుగా జరుగుతూనే ఉన్నాయి. స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. కొందరు తమ ఆర్థిక స్థోమతకు తగ్గట్టు దానధర్మాలు చేస్తుంటారు. మరి కొందరు తమకు తెలిసిన పేదల కుటుంబాలలోని పిల్లల చదువులకు ఆర్థిక సాయం చేస్తుంటారు. మరికొందరు అనాథ శరణాలయాలకు విరాళాలు ఇస్తుంటారు. దీనికి పీ-4 అని పేరు తగిలించి, వీటన్నింటినీ తన ఖాతాలోకి వేసుకోవడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందుకోసం రాత్రిళ్లు నిద్ర కూడా పోకుండా ఆలోచించానని చంద్రబాబు చెబితే ఎవరైనా విశ్వసిస్తారా? ఆయనకు నిద్రలేమి సమస్య ఉందేమో అనుకునే అవకాశం ఉంటుంది.
పీ-4 కార్యక్రమం కింద పెద్ద పారిశ్రామికవేత్తలు, ధనికులు, వ్యాపారవేత్తలు, అంతా ముందుకు వచ్చి తమ ఆస్తిలో పేదలకు వాటా ఇస్తారు. పేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా చేసి మార్గదర్శులు అవుతారు అనుకున్న వారూ లేకపోలేదు. అంతెందుకు చంద్రబాబు నాయుడు ఆస్తి సుమారు రూ.900 కోట్లు అని ఏడీఆర్ ప్రకటించింది. దాంట్లో కొంత ఉంచుకుని మిగిలింది పేద కుటుంబాలకు ఇచ్చి వారిని కోటీశ్వరులను చేస్తారని అనుకుంటే ఆ ఊసే ఎత్తలేదని వైఎస్సార్‌సీపీ నేతలు ఎత్తి పొడుస్తున్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కొంతకాలం క్రితం బహిరంగ సమావేశాలలో మాట్లాడుతూ తమ హెరిటేజ్ సంస్థ వాటాల్లో రెండు శాతం అమ్మితే రూ.400 కోట్లు వస్తాయని చెప్పారు. అందులో ఏమైనా పేదలకు వాటాలిచ్చి స్థితిమంతులుగా చేస్తారేమో అని కొందరు విశ్లేషకులు ఊహించారు. అవేమీ జరగలేదు.
టీడీపీ ఆధ్వర్యంలో నడిచే ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పి సరిపెట్టారు. అది కూడా టీడీపీ పార్టీ కార్యకర్తలకే కదా!. ఎంతమంది పేదలను ఆ ట్రస్టు ద్వారా కోటీశ్వరులను చేశామని చెప్పగలిగి ఉంటే దానికి ఒక అర్థం ఉండేది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ఈ పీ-4 కార్యక్రమం చంద్రబాబు చేస్తున్న మరో మోసం అని వ్యాఖ్యానించారు. ఏపీలో ఆదాయ పన్ను కట్టేవారి సంఖ్య ఎనిమిది లక్షలుగా ఉందని, 90 శాతం మంది వైట్ రేషన్ కార్డులు కలిగి ఉన్నారని, ఇవేవి తెలియకుండా చంద్రబాబు ప్రజలను తన సూపర్ సిక్స్ నుంచి డైవర్ట్ చేయడానికి ఇలాంటివి చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచ కుబేరుల జాబితాలో చోటు సంపాదించుకున్న మెఘా సంస్థ అధినేత పీవీ.కృష్ణారెడ్డి పీ-4 సభా వేదికపై ఉన్నారు. ఆయన తన సంపదలో కొంత భాగాన్ని పేదలకు పంచుతారేమోనని మరికొందరు అనుకున్నారు. కానీ, ఆయన ఒక విద్యార్ధికి వైద్య విద్య అభ్యసించడానికి సాయం చేస్తారట. ఆయన సొంత మండలం గుడ్లవల్లేరును దత్తత తీసుకుంటారట. అక్కడ ఏ కార్యక్రమాలు చేపడతారో తెలియదు.
వైఎస్ జగన్ ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తల నుంచి వాటాలను లాక్కున్నారని ఒక అబద్దం చెబుతూ, తమ ప్రభుత్వంలో ప్రజలకు వాటాలు ఇస్తున్నామని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. నిజంగా స్వచ్చందంగా వేదిక మీద ఉన్న చంద్రబాబు, పవన్‌లతో సహా ప్రముఖ పారిశ్రామిక వేత్తలంతా తమ ఆస్తులలో పేదలకు వాటాలు కల్పిస్తామని ప్రకటించి ఉంటే ఈ కార్యక్రమానికి మంచి గుర్తింపు వచ్చేదేమో!. కానీ, వారెవరూ ఆ పని చేయలేదు. మరి పవన్ కళ్యాణ్ పేదలకు వాటాలు ఇస్తున్నామని సినిమా డైలాగులు చెప్పారు. బిల్ గేట్స్, వారెన్ బఫెట్ వంటి అమెరికా ప్రముఖులు తమ ఆదాయంలో కొంత వాటాను విరాళాలుగా ఇచ్చేస్తుంటారు. మరో ప్రముఖ పారిశ్రామికవేత్త గ్రీన్ కో కంపెనీ డైరెక్టర్ అయిన చలమలశెట్టి సునీల్ కూడా ఇలాగే మరో విద్యార్ధిని దత్తత తీసుకుంటామని తెలిపారు. గత ఎన్నికలలో ఈయన వైఎస్సార్‌సీపీ పక్షాన పోటీచేసి ఓటమి చెందారు.
వైఎస్ జగన్ పాలన సమయంలో గ్రీన్ కో కంపెనీకి భూమి కేటాయించి, విద్యుత్ ప్రాజెక్టుకు అనుమతులు ఇస్తే, తెలుగుదేశంతోపాటు, ఎల్లో మీడియా ప్రత్యేకించి ఈనాడు ఎన్ని వ్యతిరేక వార్తలు రాసిందో తెలిసిందే. వైఎస్సార్‌సీపీ వారికి ఏమీ చేయవద్దని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు సునీల్ సేవలను తీసుకోవడం విశేషం. ఒక విద్యార్ధిని మెడికల్ సీట్ ను ఆశిస్తోంది. ఆమెకు ప్రభుత్వ కాలేజీలో సీటు వస్తే దాతతో పెద్దగా పని ఉండదు. కానీ, చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రానికి మంజూరైన 750 సీట్లను వదలుకుందన్న విమర్శలు ఉన్నాయి. జగన్ ప్రభుత్వ రంగంలో వైద్య కాలేజీలు ఏర్పాటు చేస్తుంటే, కూటమి సర్కార్ వాటన్నింటినీ ప్రైవేటు పరం చేస్తోంది. ఇది కూడా పీ-4లో భాగమేమో తెలియదు. ఒకవేళ ప్రైవేటు కాలేజీలో చదివించాల్సి వస్తే ఆ విద్యార్ధినికి దాత రెండో, మూడో కోట్ల రూపాయల డొనేషన్ కట్టడానికి సిద్దపడతారా? అన్నది ఒక డౌటు.

చంద్రబాబు నాయుడు ఏ రోజుకారోజు ఏదో ఒక కొత్త డైలాగు తెరపైకి తెస్తుంటారు. తద్వారా అంతకుముందు తాను చెప్పిన డైలాగుల్ని జనం మర్చిపోయేలా చేయాలన్నది ఆయన లక్ష్యం. ఎటూ ఆయన భాజ భజంత్రీలు వాయించే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా ఉండనే ఉంది. కొన్నాళ్లపాటు ఈ పీ-4ను వీరంతా కలిసి ఊదరగొడతారు. ఆ తర్వాత సడెన్‌గా ఏపీలో పేదలు ఎవరూ లేరని ప్రకటించేసినా ఆశ్చర్యం లేదు. లేకుంటే 2029 నాటికి జీరో పావర్టీగా ఉండాలని చంద్రబాబు చెబితే అది అయ్యే పనో, కాదో అందరికీ తెలుసు.
నిజానికి చంద్రబాబు ఎప్పుడూ పేదల పక్షపాతి కాదు. ఆయన 1995-2004 మధ్య ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేయడం, వేలాది మంది ఉద్యోగులను ఊడపీకడం చేశారు. రైతులు విద్యుత్ భారంతో అల్లాడుతుంటే విద్యుత్ ఛార్జీలు పెంచారు. దానిపై పెద్ద ఉద్యమమే నడిచింది. ఆ టైమ్ లోనే వైఎస్ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు. దానిని చంద్రబాబు హేళన చేసి మాట్లాడే వారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందేనని అనేవారు. అప్పుడు కూడా విద్యుత్ సంస్కరణల ద్వారా వచ్చే ఆదాయాన్ని పేదలకు ఇస్తానని కబుర్లు చెప్పేవారు. కానీ, ఆ సంస్కరణల వల్ల పేద, మద్య తరగతి వారికి ఒరిగిందీ లేదు. చంద్రబాబు వారికి సాయం చేసింది లేదు.
2004లో వైఎస్సార్ అధికారంలోకి వచ్చిన తరువాత రైతులకు ఉచితంగా విద్యుత్తు అందించి చూపించారు. ఎన్టీ రామారావు పేదలకు పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తే, చంద్రబాబు అధికారంలోకి రాగానే వాటన్నిటిని మార్చేశారు. అధికారం లేనప్పుడు, ఎన్నికల ప్రచారాలలో మాత్రం పేదలకు అవి చేస్తా, ఇవి చేస్తానని చెబుతూంటారు ఈయన. వీటిని నమ్మి ఓట్లు వేసి మోసపోయిన ఘట్టాలు ఎక్కువే. 2014లో రైతులు, డ్వాక్రా మహిళల రుణాల మాఫీతో సహా వందల హామీలు ఇచ్చిన బాబు పవర్ లోకి వచ్చాక అరకొరగా అమలు చేసి రైతులను మోసం చేశారు. డ్వాక్రా రుణాలైతే రద్దే చేయలేదు.
తాజాగా 2024 ఎన్నికలలో సూపర్ సిక్స్ అంటూ ప్రచారం హోరెత్తించారు. ప్రతి మహిళకు నెలకు రూ.1500, ప్రతి విద్యార్ధికి ఏడాదికి రూ.15 వేలు, రైతులకు రూ.20 వేలు ఇలా పలు హామీలు ఇచ్చారు. పదవిలోకి వచ్చిన తరువాత మాత్రం బడ్జెట్ చూస్తుంటే భయమేస్తోందని హామీలకు మంగళం పాడేశారు. అప్పులు చేసి సంక్షేమం చేయలేమని ఒకసారి, తాను ఎన్నికలకు ముందు ఒకరకంగా అనుకున్నానని, ఇప్పుడు పరిస్థితి అలా లేదని ఇంకోసారి చెప్పడం ఆరంభించారు. అంటే చిత్తశుద్ది లేకుండా కేవలం అధికారమే ఏకైక లక్ష్యంగా ఏ అబద్దాన్ని అయినా ఆడవచ్చన్నది ఆయన నమ్ముతున్నారన్నమాట.
ఇప్పుడు ఎవరైనా సూపర్ సిక్స్ అని అడిగితే దానికి ప్రతిగా పీ-4 అమలు చేస్తున్నాం కదా! అని దబాయిస్తారు. ఎవరినైనా ధనికుడిని మీరే వెతుక్కోండి అని పేదలకు చెప్పినా చెప్పవచ్చేమో. పేదల పిల్లలు వెళ్లే ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్ధుల సంఖ్య తగ్గుతోందని ఎవరైనా అన్నారనుకోండి. పీ-4 తెచ్చాం కదా! ప్రైవేటు స్కూళ్లలో చదువుకోండి అని చెబుతారేమో!. గతంలో విద్య అన్నది ప్రభుత్వ బాధ్యత కాదు అని చంద్రబాబు అన్నారు. వలంటీర్లు ఎంత పేదలో అందరికీ తెలుసు. వారి సేవలను కంటిన్యూ చేస్తామని, వేతనం రూ.10వేలు చేస్తామని ఉగాది పర్వదినం రోజున ఊరించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ఇప్పుడు ఆ వ్యవస్థనే తీసి వేశారు. ఈసారి ఉగాది నాడు కొత్తగా పీ-4 అన్న నాటకంలో మొదటి అంకం ప్రారంభించారు. ఇందులో ఎన్ని ప్రహసనాలు ఉంటాయో చెప్పజాలం.
ఉగాది కల్లా మహిళలకు ప్రీ బస్ స్కీమ్ అమలు చేస్తామని రవాణా మంత్రి రామ్ ప్రసాదరెడ్డి గతంలో ప్రకటించారు. ఇప్పుడు ఉగాది వెళ్లిపోయింది. ప్రస్తుతం బస్‌లలో ప్రయాణించే వారిలో అత్యధిక శాతం పేద, మధ్య తరగతి వారేనన్న సంగతి తెలిసిందే. నిజంగానే వీరికి చెప్పిన హామీలు అమలు చేయాలన్న నిజాయితీ ఉంటే, పేదలకు ఉపకరించే ఈ స్కీములను ఈ ఏడాదంతా ఎగవేసి, అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రూ.31 వేల కోట్ల అప్పు తీసుకు వస్తారా?.
మరో సంగతి చెప్పాలి.. చంద్రబాబు 2014 టర్మ్‌లో ఐదేళ్ల పాలన తర్వాత ఏపీలో నిరుపేదల శాతం 11 శాతం నుంచి 12 శాతానికి పెరిగిందని, అదే జగన్ టైమ్‌లో రెండేళ్ల కరోనా సంక్షోభం ఉన్నా నిరుపేదల శాతం 12 శాతం నుంచి ఆరు శాతానికి తగ్గిందని నీతి అయోగ్ నివేదికలు చెబుతున్నాయి. ఇలా ఉంటుంది చంద్రబాబు పాలన తీరు. వైఎస్ జగన్ తన పాలనలో పేదలకు, ప్రత్యేకించి మహిళలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చితే చంద్రబాబు కూటమి మాత్రం పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచడం మినహా మిగిలిన దాదాపు అన్నిటికి తిలోదకాలు ఇచ్చేసింది. అమరావతిలో వ్యాపారుల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్న చంద్రబాబు సర్కార్ యాభై వేల మంది పేదల ఇళ్ల స్థలాలు వెనక్కి లాగేసుకుంటోంది. దీనిని బట్టే పేదలపై ఈ ప్రభుత్వానికి ఉన్న ప్రేమ ఏమిటో అర్థమవుతుంది.
చంద్రబాబు అమరావతికి కూడా ఇలాగే విరాళాలు ఇవ్వండి. ఇటుకలు ఇవ్వండి అంటూ కొంతకాలం తిరిగారు. ఇప్పుడేమో అప్పులు ఇవ్వండని ఆర్థిక సంస్థల చుట్టూ తిరుగుతున్నారు. ఏతావాతా పీ-4 కార్యక్రమాన్ని చూస్తే పవన్ కళ్యాణ్‌ను చంద్రబాబు, చంద్రబాబును పవన్ కళ్యాణ్, సభలో పాల్గొన్న ధనికులను చంద్రబాబు, తిరిగి ఆ బడాబాబులు చంద్రబాబును పొగుడుకోవడానికి మాత్రం బాగానే ఉపయోగపడిందని చెప్పాలి. ఉపన్యాసాల సోది భరించలేక జనం మధ్యలోనే తిరుగు ముఖం పట్టారు. దీన్ని అర్థం చేసుకోలేని సీఎం యథా ప్రకారం ఆ పేద, బడుగు వర్గాలను అవమానిస్తూ వారిని తప్పుపట్టారు. దీన్ని బట్టే ఈ పీ-4 ఎంత విజయవంతం అయ్యేది అర్థం చేసుకోవచ్చు.
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.