తెలుగుదేశం కూటమి డబుల్ గేమ్ అనాలా? లేక దొంగ నాటకాలని అనలా? అమరావతి రాజధాని అంటే ఇతర ప్రాంతాల ప్రజలలో వ్యతిరేకత వస్తుందని భయపడుతున్నారా? బుధవారం నాడు తెలుగుదేశం కూటమి వివిధ పత్రికలలో ప్రచార ప్రకటన విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ విజయవాడ, కలికిరి రాక సందర్భంలో ఈ అడ్వైర్టైజ్ మెంట్ ఇచ్చారు. కేవలం విజయవాడ ప్రాంత ఎడిషన్‌లలో మాత్రం అమరావతి రాజధాని అని ప్రస్తావించి, ఇతర ప్రాంత ఎడిషన్‌లలో మాత్రం రాష్ట్ర వికాసానికి అని పేర్కొన్నారు. అంటే దీని అర్ధం ఏమిటి? అమరావతి రాజధాని అంటే ఉత్తరాంధ్రలో, రాయలసీమలలో ప్రజలలో వ్యతిరేకత బహిర్గతమై, ఓట్ల రూపంలో ప్రభావితం చేస్తుందని భయపడడమే కదా!
విజయవాడ పత్రికలలో ఇచ్చిన ప్రకటన ఇలా ఉంది. 'మన కలల రాజధాని అమరావతిని కాపాడుకోవడానికి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీగారు పాల్గొంటున్న ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు లక్షలాదిగా తరలిరండి' అని ఉంది. అదే విశాఖపట్నం ఏరియాలో ఇచ్చిన ప్రకటనలో మాత్రం అందుకు భిన్నంగా 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వికాసానికి మోదీ గ్యారంటీ...' అని రాశారు. అంటే విజయవాడకు మోదీ వస్తున్నది కేవలం అమరావతి గురించేనని అనుకోవాలా? రాష్ట్ర వికాసం కోసం కాదా? విశాఖకు అమరావతి కలల రాజధాని కాదని చెప్పడమే కదా! ఒకపక్క అమరావతితోనే అభివృద్ది అంటూ సొల్లు పురాణం చెప్పే టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ఎందుకు ఇలా డ్రామా ఆడుతున్నారంటే వారికి తమపై తమకే నమ్మకం లేదనే కదా?
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఎక్కడకు వెళ్లినా స్పష్టంగా మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని, తద్వారా వికేంద్రీకరణ జరిగి అభివృద్దికి బాటలు వేస్తుందని చెబుతున్నారు. అమరావతిలో శాసన రాజధాని, విశాఖలో కార్యనిర్వాహక రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని అని ఆయన మానిఫెస్టోలో కూడా చెప్పారు. విశాఖ ఎక్జిక్యూటివ్ కాపిటల్ అయితే లక్షల కోట్లు ఖర్చు పెట్టనవసరం లేదని, రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్ అవుతుందని ఆయన అభిప్రాయపడుతున్నారు.
విశేషం ఏమిటంటే ప్రముఖ నటుడు, చంద్రబాబు వియ్యంకుడు అయిన బాలకృష్ణ రెండో అల్లుడు శ్రీభరత్ కూడా విశాఖ రాజధాని అయితే బెటర్ అంటూ చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్ అవుతోంది. శ్రీభరత్ విశాఖ నుంచి టీడీపీ పక్షాన పార్లమెంటుకు పోటీచేస్తున్నారు. ఆయన అమరావతి ఇప్పటికిప్పుడు అభివృద్ది కాదని, ఇరవై ఏళ్లయినా పడుతుందని, విశాఖ అయితే ఆ ఇబ్బంది ఉండదని అన్నారు. అంటే తెలుగుదేశం కూటమి అభ్యర్ధులు ఒక్కోచోట ఒక్కోరకంగా ప్రచారం చేస్తున్నారని తేలిపోతోంది. నిజానికి అమరావతి రాజధాని అని గతంలో హడావుడి చేసినా తెలుగుదేశంను ప్రజలు ఓడించారు. చివరికి అమరావతి గ్రామాలు ఉన్న తాడికొండ నియోజకవర్గంలోను, మంగళగిరి నియోజకవర్గంలోను టీడీపీ ఓడిపోయింది.
స్వయంగా చంద్రబాబు కుమారుడు లోకేష్ మంగళగిరిలో ఓటమిపాలయ్యారు. దానికి కారణం అమరావతి రాజధాని పేరుతో టీడీపీ నేతలు జరిపిన భూదందానే. ఈ కుంభకోణాలపై రాష్ట్ర ప్రభుత్వం పలు కేసులు కూడా పెట్టింది. ఇదంతా ఒక కులం వారికోసం, ముందస్తు సమాచారం ఆధారంగా భూములు కొని లాభపడ్డవారి కోసమేనని ఇక్కడి ప్రజలు కూడా అనుమానించారు. దాంతో అమరావతి రాజధాని అన్న కాన్సెప్ట్‌కు ప్రజామోదం లేకుండా పోయింది. అయినా 2019 తర్వాత కూడా రాజధాని రైతుల పేరుతో ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా అండతో కల్పిత ఉద్యమాలను టీడీపీ నడిపింది. అయినా ఇప్పుడు అమరావతి అంటే జనం నమ్మడం లేదని గ్రహించి ఈ రకంగా డబుల్ గేమ్ ఆరంభించారని భావించాలి.
అమరావతికి లక్షల కోట్ల వ్యయం అవుతుందని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ప్రచారం చేసేవారు. బీజేపీతో చెడ్డాక ప్రధాని మోదీ అమరావతికి ఏమీ ఇవ్వలేదని, చెంబుడు నీళ్లు, పిడికెడు మట్టి ఇచ్చి వెళ్లారని కూడా ఆయన విమర్శించేవారు. అలాంటిది ఇప్పుడు కలల రాజధాని అమరావతిని కాపాడుకోవడానికి గాను ప్రజలు మోదీ రోడ్‌షో కు రావాలని కోరారు. గతంలో బీజేపీ నేతలు కూడా అమరావతి భూ స్కామ్ చాలా పెద్దదని విమర్శించేవారు. ఇప్పుడు మోదీ అమరావతికి ఏమైనా లక్ష కోట్ల నిధులు ఇస్తానని కూటమి నేతలకు హామీ ఇచ్చారా? అసలు ఏపీలో ఫలానా అభివృద్ది చేస్తానని మోదీ గ్యారంటీ ఇవ్వడం లేదు. అయినా వీరు మాత్రం ప్రజలను రకరకాలుగా మోసం చేయడానికి యత్నిస్తున్నారు.
రాజమండ్రి, అనకాపల్లిలలో జరిగిన ప్రధాని సభలలో ఎక్కడా ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించలేదు. ఆయనపై నేరుగా అనివీతి ఆరోపణలు చేయలేదు. కాకపోతే జనరల్‌గా ఏవో కొన్ని విమర్శలు చేయాలి కాబట్టి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అవినీతి అంటూ ఇంతకాలం టీడీపీ ఏమి ఆరోపిస్తుందో వాటినే ఆయన కూడా చెప్పి వెళ్లారు. విశేషం ఏమిటంటే మోదీ కానీ, అమిత్ షా కానీ చంద్రబాబు ఉపన్యాసం వినకుండానే నిష్క్రమించడం. బహుశా చంద్రబాబు మాటల మీద వీరికి నమ్మకం పోయిందేమో తెలియదు. మోదీని ఏపీకి తీసుకు రావడం ద్వారా తమకు పలుకుబడి ఉందని, ఎన్నికల సంఘంపై ఒత్తిడి పెంచుతున్నట్లు కనిపిస్తోంది.
కొందరు సీనియర్ ఐపీఎస్ అధికారులను సహేతుక కారణాలు చూపకుండానే బదిలీ చేయడం, నాలుగేళ్లుగా అమలు అవుతున్న స్కీముల ద్వారా లబ్ది దారులకు డబ్బు విడుదల చేయకుండా ఆదేశాలు ఇవ్వడం, వలంటీర్ల వ్యవస్థను నిలుపుదల చేయడం, చంద్రబాబు ఎంత నీచంగా ఉపన్యాసాలు చేస్తున్నా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోకపోవడం ఇందుకు ఉదాహరణలుగా కనిపిస్తాయి. బీజేపీకి ఏపీలో ఒక్క శాతం ఓట్లు కూడా గత ఎన్నికలలో రాలేదు. అయినా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ద్వారా రాయబేరాలు సాగించి కాళ్లా, వేళ్ల పడి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఇదంతా కేంద్ర ప్రభుత్వం ద్వారా తమ పనులు చక్కబెట్టుకోవడానికే అని అర్దం అవుతుంది.
తమపై ఉన్న కేసులు ముందుకు వెళ్లకుండా చంద్రబాబు జాగ్రత్తపడడానికే అని ప్రజలంతా భావిస్తున్నారు. అమరావతి రాజధాని విషయంలోనే కాదు. పలు విషయాలలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు డబుల్ గేమ్ ఆడుతున్నారు. వలంటీర్ల వ్యవస్థ వల్ల అంతా వినాశనమేనని గతంలో ప్రచారం చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ దారుణమైన ఆరోపణలు ఆ చిన్నస్థాయి వలంటీర్లపై గుప్పించారు. తదుపరి ఎన్నికల సమయానికి తాము కూడా వలంటీర్లను కొనసాగిస్తామని, ఇంకా ఎక్కువ వేతనం ఇస్తామని ప్రకటించారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రం శ్రీలంక అవుతోందని చంద్రబాబు, పవన్ లు విమర్శించేవారు. కానీ వారి ఎన్నికల మానిఫెస్టోలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇస్తున్న వాటికన్నా మూడు రెట్ల వ్యయంతో సంక్షేమ స్కీములు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. లాండ్ టైటిలింగ్ యాక్ట్ కు అసెంబ్లీలో మద్దతు ప్రకటించారు. ఎన్నికల వేళ మాత్రం అదేదో ప్రమాదకరమైనదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కేంద్రానికి సంబంధించిన ఈ చట్టం గురించి మోదీ, అమిత్ షా సభలలో మాత్రం నోరు విప్పరు.
ఇన్ని రకాలుగా డ్రామాలు ఆడుతున్న, అబద్దాలు చెబుతున్న టీడీపీ కూటమికి ఎవరైనా ఓటు వేస్తే, వారి అబద్దాలకు ఆమోద ముద్ర వేసినట్లే అవుతుంది. చివరిగా ఒక మాట. పవన్ కల్యాణ్ పెద్ద కవి మాదిరిగా పర్వతం ఎవరికి తలవంచదు. సముద్రం ఎవరి కాళ్ల వద్దకు వెళ్లదు.. అంటూ సినిమా డైలాగులు చెబుతుంటారు. కానీ మోదీ పాల్గొన్న సభలో ఈయన వంగి, వంగి ప్రవర్తించిన తీరు మాత్రం అందరిని విస్తుపరిచింది. ఈయన చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అచ్చం చంద్రబాబు స్టైల్ లోనే పవన్ ఉన్నారని ప్రజలకు క్లారిటీ వచ్చింది.
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment