ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కొద్ది రోజుల క్రితం ఇచ్చిన ఒక ప్రకటన అందరిని ఆశ్చర్యపరచింది. మూడు పార్టీలదీ ఒకటే ఎజెండా అని ఆమె అన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని దించడమేనని ఆమె చెప్పారు. ఇదా ఎజెండా అంటే అని ఒరిజినల్ బీజేపీ నేతలు ముక్కున వేలేసుకుంటున్నారు. టిక్కెట్ల విషయంలో వ్యక్తం అవుతున్న నిరసనలు, పార్టీల మధ్య అవగాహన కుదుర్చుకోవడంలో ఒక ప్రాతిపదిక లేని వైనంపై కొందరు అసహనం చెందుతున్న తీరు కానీ పార్టీ ప్రతిష్టను బజారుకీడ్చాయి. వాటికి సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్న పురందేశ్వరి ఎలాగోలా తాను ఎంపీగా గెలిస్తే చాలు అన్నట్లు వ్యవహరిస్తున్నారు.
ఇప్పటికే మాజీ ఛీప్ సెక్రటరీ, బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు పార్టీ టిక్కెట్ల కేటాయింపుపై తెలిపిన నిరసన సహజంగానే పార్టీలోని అయోమయ పరిస్థితిని బహిర్గతం చేసింది. "ఆదోనిలో బీజేపీకి పట్టుంది. మిగిలిన ఏడు స్థానాలు ఏ ప్రాతిపదిక మీద బీజేపీకి కేటాయించారో అర్థం కావటం లేదు. ముందే అక్కడ ఎవరు బీజేపీ తరఫున పోటీ చేయాలనేది తెలుగుదేశం పార్టీ నిర్ణయించి తర్వాత బీజేపీ కేటాయించారా అనే అనుమానం చాలామంది బీజేపీ వారికి కలుగుతున్నది." అని ఆయన అన్నారు. దీనికి పురందేశ్వరి వద్ద జవాబు ఉన్నదా? గతంలో తీవ్ర వైరం ఉన్నా, రాజకీయ పదవులపై ఉన్న ఆశతో ఇప్పుడు పురందేశ్వరి తన మరిది, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో రాజీపడి రాజకీయం చేస్తున్నారు. దీనివల్ల ఆమె ప్రతిష్ట మసకబారుతున్నా, పట్టించుకునే దశలో లేరు. పైగా మూడు పార్టీల కూటమిని ఆమె త్రివేణి సంగమం అని అంటున్నారు. ఈ కూటమిలో ప్రధాన భాగస్వామి టీడీపీ కానీ, ఆ తర్వాత జనసేన కానీ ఈ కూటమిని పవిత్ర సంగమం అని భావించడం లేదు. తప్పనిసరి తద్దినం అని చంద్రబాబు మాటల్లో ఇప్పటికే వ్యక్తం అయింది.
ఏదో కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి, కేసులకు ఉపయోగపడతారులే అని తప్ప వేరే లక్ష్యం లేదని ఆయన ఓపెన్ గానే చెబుతున్నారు. పవన్ కల్యాణ్‌ను బీజేపీ నేతలు ఈ పొత్తు విషయంలో ఎందుకు చీవాట్లు పెట్టారో ఎవరూ వివరించలేదు. ప్రధాని మోడీ ఏపీ ప్రచార సభకు వచ్చి ఏమైనా కొత్త హామీ ఇచ్చారా అంటే అదీ లేదు. ఇష్టం లేని పెళ్లికి వచ్చినట్లు వచ్చి వెళ్లారు. కానీ పురందేశ్వరి మాత్రం ఒకటే ఎజెండా అని చెబుతున్నారు. ఏదైనా పార్టీల మధ్య పొత్తు పెట్టుకోవడానికి ఒక కామన్ ఎజెండా ఉండాలి. దానిపై ముందుగానే చర్చలు జరిపి ఒక ప్రకటన చేయాలి. అలాంటిది ఏమీ లేకుండా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి కాళ్లా, వేళ్లా పడి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఇప్పటికే టీడీపీ పక్షాన ఆయన సూపర్ సిక్స్ అని కొన్ని వాగ్దానాలను ప్రకటించారు. వాటన్నిటిని బీజేపీ ఆమోదిస్తుందా? అన్నది ఆమె చెప్పాలి.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటటీలను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. అవన్నీ ఆచరణ సాద్యం కానీ హామీలని ప్రచారం చేసింది. అలాంటిది ఏపీలో అంతకు మించి టీడీపీ హామీలు ఇచ్చింది. వాటన్నిటిని కామన్ ఎజెండాలో పెడతారా? 2014లో మోడీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల ఫోటోలతో కొన్ని హామీలు ఇచ్చారు. నిజానికి అవన్నీ టీడీపీ ప్రకటించినవి. కానీ కరపత్రంపై మోడీ పోటో కూడా ఉండడంతో బీజేపీ కూడా బాధ్యత వహించాల్సి వచ్చింది. కానీ బీజేపీ నేతలు రైతు రుణమాఫీ వంటి కొన్ని హామీలు తమకు సంబంధం లేనివని ఆ తర్వాత చెప్పేవారు. ఇప్పుడు కూడా ఎన్నికల వరకు కామన్ ఎజెండా అని ప్రచారం చేసి, ఆ తర్వాత ఎవరికి వారు తమది కాదని చేతులెత్తేస్తే ఎవరు బాద్యత వహిస్తారు. అంటే టీడీపీ, బీజేపీ, జనసేనలు ఎవరికి తోచిన హామీలు అవి ఇచ్చి తర్వాత తమకు సంబంధం లేదని ప్రజలను మోసం చేస్తారా?
ప్రత్యేక హోదాపై చంద్రబాబు పలుమార్లు మాట మార్చారు. గత ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా ఇవ్వలేదని బీజేపీపై మండిపడ్డారు. ఇప్పుడు కూడా ఆయన హోదా విషయంలో తన తాజా వైఖరి ఏమిటో చెప్పలేదు. బహుశా ప్రత్యేక హోదా వంటి అంశాలను డిమాండ్ చేయవద్దని బీజేపీ కండిషన్ పెట్టిందేమో తెలియదు. ఎందుకంటే ఆయన దీనిపై బీజేపీని ప్రశ్నించకుండా, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిను విమర్శిస్తున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదా తేలేదని చెబుతున్నారు. మరి ఈ అంశంలో బీజేపీ స్పందిస్తుంందా? రైతుల రుణాల మాఫీ, డ్వాక్రా రుణాల మాఫీకి చంద్రబాబు హామీ ఇచ్చినప్పుడు కామన్‌గా అంతా కలిపి ప్రచారం చేసుకున్నారు. కానీ అమలు టైమ్ వచ్చేసరికి చంద్రబాబు కేంద్రం సహకరించడం లేదని విమర్శించేవారు. అలాగే బీజేపీ తాము ఇలాంటి హామీలను సమర్ధించబోమని చెప్పేది. బీజేపీ వారు కోరితేనే తాను పొత్తు పెట్టుకున్నానని ముస్లింల సమావేశంలో చంద్రబాబు చెప్పిన విషయంపై పురందేశ్వరి ఇంతవరకు వ్యాఖ్యానించకపోవడం కూడా సహజంగానే విమర్శలకు దారి తీస్తుంది.
వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వచ్చిన ముస్లిం రిజర్వేషన్ లను చంద్రబాబు కూడా కొనసాగించారు. ఇప్పుడు కూడా ముస్లింలను రక్షించింది తానే అని అంటున్నారు. దీనికి సంబందించి ఇద్దరి మద్య వైరుధ్యాలు ఉన్నాయా. ఒక కామన్ ఎజెండా పెట్టుకుంటారా. చంద్రబాబుతో కూడా ముస్లింలకు రిజర్వేషన్‌లు రద్దు చేస్తామని చెప్పిస్తారా? గతంలో అనేక అంశాలలో బీజేపీని చంద్రబాబు తీవ్రంగా దుయ్యబట్టారు. వాటన్నిటిలో ఎవరు రాజీపడ్డారు? టీడీపీనా? లేక బీజేపీనా? త్రిబుల్ తలాఖ్‌ను కేంద్రం రద్దు చేయడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. ముస్లింలను అరెస్టు చేయడానికే బీజేపీ కుట్ర అని ఆయన ప్రచారం చేశారు. ఇప్పుడు ఆయన తన వైఖరి మార్చుకున్నారా?లేక బీజేపీనే ఏపీ వరకు చంద్రబాబు కోసం తన సిద్దాంతాన్ని వదలుకుందా? ఇన్ని వైరుద్యాల మధ్య పవిత్ర పొత్తుగా బీజేపీ అధ్యక్షురాలు భావించి ఏకంగా త్రివేణి సంగమంగా అభివర్ణించడం ప్రజలను మోసం చేసే యత్నమే అని చెప్పాలి.
మన దేశంలో అనేక నదులు కాలుష్యంతో నిండిపోయాయి. త్రివేణి సంగమం పరిస్థితి కూడా అంతే.అలాగే ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీల పొత్తు కూడా అనైతికం, అపవిత్రం. కేవలం అధికార కాంక్షతో, పదవీ లాలసతో ప్రజలను మోసం చేయడానికి ఈ మూడు పార్టీలు ప్రజల ముందుకు వస్తున్నాయి. వారికి చిత్తశుద్ది ఉంటే 2014లో తమ కూటమి ఏమి చెప్పింది? ఏమి చేసింది? ఎందుకు విడిపోయింది? ఎందుకు మళ్లీ ఇప్పుడు కలుస్తున్నది? పార్టీల మద్య ఉన్న వైరుద్యాలను ఏమైనా పరిష్కరించుకున్నారా?... మొదలైనవాటి గురించి స్పష్టత ఇచ్చి, ఆ తర్వాత కొత్త హామీలపై ఒక అవగాహన వచ్చామని ప్రజలకు చెప్పగలగాలి. లేకుంటే వీరికి కామన్ ఎజెండా ఏమీ లేదన్న సంగతి ప్రజలకు బాగానే అర్దం అవుతుంది.
ఒకరిని దించడానికి కూటములు కట్టడం కాదు. తాము ప్రజలకు ఏమి చేస్తామో చెప్పగలిగితేనే ప్రజలు నమ్ముతారు? ఏపీలో ఏర్పడిన కూటమికి ఆ లక్షణం లేదు. పరస్పర అవసరాల కోసం ఏర్పడిన ఈ కూటమి, గతంలో మాదిరే ఎన్నికల తర్వాత ఎవరికి వారే యమునాతీరే అన్న చందంగా ప్రజలను మోసం చేయరన్న గ్యారంటీ ఏముంది?
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment