'జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఊహించినట్లే ఆయన అభిమానులను, ఆయనకు అండగా ఉంటారనుకునే కాపు సామాజికవర్గాన్ని తీవ్ర ఆశాభంగానికి గురి చేశారు. గతంలో ఆయన ఒక సందర్భంలో తెలుగుదేశం వారు పదో, పరకో సీట్లు ఇస్తే సరిపోతుందని అనుకుంటున్నారని, కుక్క బిస్కట్లు వేస్తే ఒప్పుకుంటామా? మనకు ఆత్మగౌరవం లేదా అంటూ ఏదేదో.. ఆవేశపూరిత ప్రసంగం చేస్తే ఆయన మద్దతుదారులంతా చాలా సంతోషించారు. పవన్‌కల్యాణ్ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నా, గౌరవప్రదమైన సంఖ్యలో సీట్లు తీసుకుంటారులే అని వారు భావించారు.'
కానీ ఆయన చివరికి కేవలం 24 సీట్లకే టీడీపీతో పొత్తు ఓకే చేయడం ఆశ్చర్యం కలిగించింది. ఈ ఇరవై నాలుగు సీట్లను ఆయన కుక్క బిస్కట్లతో పోల్చుతారో, లేక బంగారు బిస్కట్లు అని సంతృప్తి చెందుతారో తెలియదు కానీ తీవ్ర విమర్శలకు గురి అవుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే పవన్‌కల్యాణ్‌కల్యాణ్ మరోసారి అప్రతిష్టపాలయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇంతగా సరెండర్ ఏమిటా అని ఆయన మద్దతుదారులు రోధిస్తున్నారు. జగ్గంపేట నియోజకవర్గానికి చెందిన ఒక ఆశావహుడు అయితే తాము ఇంతకాలం చేసిన కృషి అంతా వృధా అయిపోయిందని అంటూ తన భార్యతో కలిసి దీక్షకు కూడా దిగారు.
ఇలా ఆయా చోట్ల జరిగిన పరిణామాలు చూసిన తర్వాత పవన్‌కల్యాణ్ మారి స్వతంత్రంగా వ్యవహరిస్తారేమో అని కొందరు ఆశపడుతున్నారు. అది జరిగినా డ్రామాగానే ఉంటుంది తప్ప నిజాయితీగా ఉండకపోవచ్చు. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం పవన్‌కల్యాణ్ సొంతంగా రెండు సీట్లు ప్రకటించారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు పొత్తు ధర్మాన్ని పాటించకుండా రెండు సీట్లను ప్రకటించారని, అందుకే తాను కూడా రెండు సీట్లకు జనసేన అభ్యర్ధులను ప్రకటిస్తున్నానని చెప్పి జనసైనికులను మభ్య పెట్టే యత్నం చేశారు. ఎందుకంటే ఆ రెండు సీట్లు జనసేనకే వస్తాయని తెలుసు కనుక, చంద్రబాబుతో మాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు కనుక.. అలా చేశారని అర్ధమైంది.
తణుకులో ఆయన రామచంద్రరావు అనే అభ్యర్దికి టిక్కెట్ వచ్చేసినట్లే ప్రసంగం చేసి, తాను మాట ఇస్తే ప్రాణం పోయినా తప్పనని బీరాలు పలికారు. అనేకసార్లు మాటలు మార్చిన పవన్‌కల్యాణ్ ఈసారైనా మాట మీద ఉంటారనుకుంటే మళ్లీ యధాప్రకారం మాట తప్పారు. రామచంద్రరావుకు ఆయన సీటు ఇప్పించుకోలేకపోయారు. చంద్రబాబు తన పార్టీ అభ్యర్ధి రాధాకృష్ణకు టిక్కెట్ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇలా ఆయా చోట్ల జనసేన శ్రేణులు పూర్తిగా నీరుకారిపోయేలా పవన్‌కల్యాణ్ రాజకీయాలు చేశారు. దీనికి కారణం ఏమిటంటే.. కేవలం చంద్రబాబునాయుడుకు పూర్తి స్థాయిలో లొంగిపోవడం తప్ప మరొకటి కాదన్నది అర్దం అవుతుంది.
పవన్‌కల్యాణ్‌కు ఉన్న వీక్ నెస్ ఏమిటో తెలియదు కానీ, టీడీపీని, చంద్రబాబును భుజనా వేసుకుని మోయడానికి నానా కష్టాలు పడుతున్నారు. జనసేనకు వెన్నుపోటు పొడిచి మరీ ఆయన టీడీపీ కోసం పని చేస్తున్నారు. ఇది కేవలం ముఖ్యమంత్రి జగన్‌పై ఉన్న ద్వేషంతోనే అని అనుకోలేం. ఎదుటివారిపై కోపం ఉంటే మాత్రం తన పరువును తానే తీసుకుని మరొకరి విజయానికి పనిచేస్తారా! గతంలో పవన్‌కల్యాణ్ చెప్పిన మాటలు ఏమిటి? ఇప్పుడు జరుగుతున్నదేమిటి? తాను సీఎం అభ్యర్ధినని అభిమానులకు పలుమార్లు చెప్పారు. ఆయన సభలలో సీఎం అంటూ నినాదాలు చేసేవారిని సంతృప్తిపరచడానికే అలా చెప్పి ఇప్పుడు వారిని మోసం చేశారని తేలిపోయింది.
చంద్రబాబు కుమారుడు లోకేష్ ఎప్పుడైతే పవన్ కల్యాణ్ సీఎం పదవికి అర్హుడు కాదన్నట్లు మాట్లాడారో, అప్పుడే ఈయన సరుకేమిటో తేలిపోయింది. చివరికి ఉప ముఖ్యమంత్రి పదవిని పవన్ కల్యాణ్‌కు ఇచ్చేది, లేనిది టీడీపీ పాలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయిస్తారని చెప్పినా, పవన్‌కల్యాణ్ నిస్సిగ్గుగా విశాఖలో జరిగిన టీడీపీ సభకు వెళ్లి వారికి సలాం చేసి వచ్చారు. చంద్రబాబు వద్ద ఏమి పరశువేది ఉందో తెలియదు కానీ, పవన్ కల్యాణ్ మాత్రం లొంగిపోయిన తీరు రాజకీయాలలో సరికొత్త రికార్డు అని చెప్పాలి. ఏ నాయకుడైనా పార్టీ పెడితే తనకంటూ ఒక సిద్ధాంతం పెట్టుకుంటారు. తనకంటూ ఒక లక్ష్యం పెట్టుకుంటారు. కానీ పవన్‌కల్యాణ్ మాత్రం వేరే పార్టీ కోసం, వేరే పార్టీ నాయకుడికోసం తన పార్టీని బలి చేయడానికి సిద్ధం అయ్యారు.
చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగానే పనిచేస్తూ తన పార్టీని తాకట్టుపెట్టడమో, అమ్మడమో చేస్తున్నారంటే ఇందులో ఎవరిది తప్పు అవుతుంది. చంద్రబాబుది కాదు. కచ్చితంగా పవన్‌కల్యాణ్‌దే. అందువల్లే ఈ మొత్తం ప్రహసనంలో జనసైనికులు చంద్రబాబు కన్నా, పవన్‌కల్యాణ్‌నే ఎక్కువగా నిందిస్తున్నారు. మనం బంగారం మంచిదైతే ఈ పరిస్థితి ఎందుకు వస్తుందని వారు నైరాశ్యానికి గురవుతున్నారు. తెలుగుదేశం పార్టీ తొలి నుంచి ఒక మాట చెబుతోంది. పదో, పరకో ఇస్తే జనసేన తమ వెంట తిరుగుతుంది అని టీడీపీ నేతలు అంటుండేవారు. నిజంగానే పది, లేదా పదిహేను సీట్ల కంటే ఎక్కువ జనసేనకు ఇవ్వనవసరం లేదని టీడీపీ నేతలు బహిరంగంగానే చెప్పేవారు.
మామూలుగా అయితే అందుకు కూడా పవన్‌కల్యాణ్ ఒప్పుకునేవారేమో! కాపు సంక్షేమసేన నేత చేగొండి హరిరామజోగయ్య వంటివారు కాపులకు బాగా బలం ఉన్న నియోజకవర్గాలను, గతసారి జనసేనకు వచ్చిన ఓట్లను పరిగణనలోకి తీసుకుని అరవై సీట్ల వరకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంటే మొత్తం సీట్లలో కనీసం మూడో వంతు అయినా సీట్లు జనసేనకు ఇస్తేనే రెండు పార్టీల మధ్య ఓట్ల బదిలీ జరుగుతుందని స్పష్టం చేసేవారు. ఆ తర్వాత కాలంలో నలభై నుంచి ఏభై సీట్లవరకు ఇచ్చినా సరిపెట్టుకోవచ్చని అనుకున్నారు. కానీ పవన్‌కల్యాణ్ చాలా కష్టపడి, అది కూడా బీజేపీ వద్ద చివాట్లు తింటున్నానని బతిమలాడి మరో పది సీట్లు సంపాదించినట్లుగా కనిపిస్తుంది. దీనికి ఆయన చెప్పిన కారణం కూడా విడ్డూరంగా ఉంది.
గత ఎన్నికలలో పది సీట్లు కూడా గెలవలేకపోయినందున ఈసారి ఎక్కువ సీట్లు అడగలేకపోతున్నానని అన్నారు. అలాగైతే టీడీపీ 2019లో 23 సీట్లే గెలిచింది కదా! అయినా 151 సీట్లను ఎందుకు తీసుకుంటోంది? టీడీపీకి సొంతంగా గెలిచే బలం ఉంటే జనసేన వెంట ఎందుకు పడుతుంది? పవన్‌కల్యాణ్‌ను ఎందుకు ట్రాప్‌లో వేసుకుంటుంది. అది చాలదన్నట్లు బీజేపీ కోసం ఎందుకు పాకులాడుతోంది. ఈ కామన్ సెన్స్ పవన్‌కల్యాణ్‌కు లేకపోయింది. రాజకీయాలపై పట్టు లేని కారణంగానే పవన్‌కల్యాణ్ ఇలా వ్యవహరిస్తున్నారనిపిస్తుంది. మూడోవంతు కాకపోయినా, కనీసం నాలుగోవంతు అంటే.. నలభై ఐదు సీట్ల వరకు తీసుకుంటారని అనుకున్నవారిని కూడా ఆయన నిరాశపరిచారు.
పవన్‌కల్యాణ్ ప్రత్యర్ధులు, వైఎస్సార్‌సీపీ నేతలు ఆయనను పావలా అని ఎద్దేవ చేస్తుంటారు. వారికి ఇప్పుడు ఆయన అవకాశం ఇచ్చారు. పవన్‌కల్యాణ్ కనీసం పావలా వంతు స్థానాలు కూడా పొందలేకపోయారని దెప్పిపొడుస్తేన్నారు. పార్ట్‌టైమ్ పాలిటిషియన్‌గా వచ్చి పెత్తనం చెలాయించాలని, రాజకీయం అంటే ఒక సినిమా వ్యాపారం మాదిరి మూడు నెలలో, ఆరు నెలల బిజినెస్‌గా పవన్‌కల్యాణ్ భావిస్తున్నారని ఈ ఉదంతంతో తేలిపోయింది. పవన్‌కల్యాణ్ 2014లోనే మంచి అవకాశాన్ని జారవిడుచుకున్నారు. అప్పుడు ఎందువల్లోకానీ జనంలో ప్రత్యేకించి కాపు సామాజికవర్గంలో ఒక క్రేజీ ఏర్పడింది. దానిని చంద్రబాబుకు అమ్ముకోవడానికే ఆయన ప్రాధాన్యత ఇచ్చారు తప్ప, తనకు తనను అభిమానించేవారికి ఉపయోగించలేకపోయారనిపిస్తుంది.
అప్పట్లో ఒక్క సీటుకు కూడా పోటీచేయకుండా చంద్రబాబు కోసం పనిచేశారు. తదుపరి ప్రశ్నిస్తానని అంటూ గొప్పలు చెప్పుకుని, కేవలం తన సొంత లాభానికే పరిమితం అయ్యారన్న విమర్శలు అప్పట్లో వచ్చాయి. చంద్రబాబు పంపించే ప్రత్యేక విమానాలలో పర్యటించి, ఆయన చేసే మర్యాదలకు ఉబ్బితబ్బిబ్బు అయిపోయి, అంతకు ముందు ఎప్పుడైనా ఒకటి, అర విమర్శలు చేసినా, వాటికి తూచ్ చెప్పేవారు. 2019లో చంద్రబాబును, లోకేష్‌ను తీవ్రంగా విమర్శించి, వారిపై అవినీతి ఆరోపణలు చేసిన పవన్‌కల్యాణ్ సీపీఐ, సీపీఎం, బహుజన సమాజ్ పార్టీతో జట్టు కట్టారు. అది ఎందుకంటే అప్పటి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడానికే అని అర్ధం అయింది.
ప్రజలు ఈయన పోకడలను గమనించి కర్రుకాల్చి వాతపెట్టి రెండుచోట్ల ఓడించారు. దాంతో ఆయన మళ్లీ కొత్త డ్రామాకు తెరదీసి, రాష్ట్రం కోసం అంటూ చంద్రబాబు వాయిస్‌గా మారి మళ్లీ టీడీపీతో పొత్తుకు వెళ్లారు. చంద్రబాబును అవినీతి కుంభకోణంలో అరెస్టు చేసినప్పుడు సొంత కొడుకు లోకేష్ రోడ్డుమీద పడుకోలేదుకానీ, పవన్‌కల్యాణ్ మాత్రం రోడ్డుపై పడి దొర్లి దత్తపుత్రుడు అన్న వ్యంగ్య వ్యాఖ్యను సార్ధకం చేసుకున్నారు. వారాహి యాత్ర అంటూ కొంతకాలం, ఇలా రకరకాల విన్యాసాలు చేసి, ఇప్పుడు తన అసలు స్వరూపాన్ని బహిర్గతం చేశారు. చంద్రబాబుకు పూర్తిగా సరెండర్ అయి ఆయన విసిరేసిన 24 సీట్లను తీసుకుని మొత్తం జనసేనను బ్రష్టు పట్టించారన్న విమర్శను ఎదుర్కుంటున్నారు.
ఈ సీట్లను తీసుకునే ముందు తనపార్టీలో చర్చించారా అంటే అదేమి లేదు. ఇదంతా చూస్తే తను ఎలాగోలా ఎమ్మెల్యే కావాలని, తన సోదరుడు నాగబాబు ఎంపీ కావాలన్న ఏకైక లక్ష్యంతో మిగిలిన జనసేన నేతలందరిని బలిచేశారనిపిస్తుంది. వారికి కనీస గౌరవం మిగిల్చినట్లు అనిపించదు. బీజేపీతో పొత్తులో ఉండి టీడీపీతో కాపురం చేయడం, ఇప్పుడు ఏకంగా వారితో సంబంధం లేకుండా టీడీపీనుంచి సీట్లు తీసుకోవడం, అయినా బీజేపీ ఆశిస్సులు ఉన్నాయని చెప్పడం రాజకీయాలలో ఒక వింత అని చెప్పాలి. అదేటైమ్‌లో బీజేపీ గురించి చంద్రబాబు అంత గట్టిగా చెప్పినట్లు అనిపించలేదు.
బీజేపీకి ఏ సీట్లు ఇవ్వాలో కూడా వీరే డిసైడ్ చేసినట్లు అనిపిస్తుంది. ఓ నాలుగు సీట్లు బీజేపీకి ఇస్తే సరిపోతుందని వీరు అనుకుంటున్నారట. దానికి బీజేపీ కూడా సిద్దపడితే ఒక జాతీయ పార్టీ అంత దుస్థితిలో ఉందా అన్న అభిప్రాయం కలుగుతుంది. ఏది ఏమైనా పవన్‌కల్యాణ్ పార్టీని చంద్రబాబు కోసమే పెట్టారని మరోసారి రుజువైంది. ఈ పొత్తు, సీట్ల కేటాయింపు.. ఇవన్నీ చూసిన తర్వాత వైఎస్సార్‌సీపీ విజయం మరింత సులువు అయినట్లుగా విశ్లేషణలు వస్తున్నాయి. అది నిజమే కావచ్చు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ కిచిడీ పార్టీలను ఓడించి, నిర్మాణాత్మకంగా ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికు మద్దతు ఇవ్వవలసిన అవసరం ప్రజలపై ఉందన్న అభిప్రాయం బలపడుతోంది.
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment