ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఒక ట్వీట్ చేస్తూ తన విజయాన్ని ధృవీకరించుకున్నారు. సునామీలా తరలివచ్చిన నా అవ్వతాతలకు, అక్కచెల్లెమ్మలకు అంటూ వివిధ వర్గాలను ప్రస్తావిస్తూ ‘ఎక్స్’ లో ట్వీట్ చేశారు. ఆ కామెంట్ చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ మళ్లీ ఏపీ శాసనసభ ఎన్నికలలో గెలవబోతున్నదన్న స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఇప్పటివరకు సాగిన సుపరిపాలన మరింత మెరుగ్గా సాగుతుందని ఆయన పేర్కొన్నారు.
ఓట్ల పోలింగ్ పెరగడాన్ని ఆయన పాజిటివ్ ఓటింగ్‌గా భావిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లు కూడా తమ కూటమి ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీరి దృష్టిలో పెరిగిన ఓట్ల శాతం ప్రభుత్వంపై ఉండే వ్యతిరేకత. ఓట్ల శాతం పెరిగినంతమాత్రాన అది పాజిటివ్ అనో, నెగిటివ్ అనో నిర్ధారించవచ్చా? గతంలో జరిగిన ఎన్నికలలో పోలైన ఓట్ల శాతాలను పరిశీలిస్తే పలు ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. వాటిని కూడా పరిశీలిద్దాం.
ఏపీలో సుమారు ఎనభై ఒక్క శాతం వరకు ఓట్ల పోలింగ్ నమోదు అయింది. ఇంత పెద్ద ఎత్తున ఓట్లు పోలైతే ఎవరికి అడ్వాంటేజ్ అన్నదానిపైనే అందరి ఆలోచన. ప్రతిపక్ష తెలుగుదేశం కూటమివారు ఇందుకు ఒక భాష్యాన్ని చెబుతూ, ప్రజలలో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత వల్లే ఇంత పెద్ద ఎత్తున ప్రజలు ఓట్లు వేయడానికి తరలివచ్చారని ప్రచారం చేసుకుంటున్నారు.మహిళలు, వృద్దులు ఉదయానే వచ్చి ఓట్లు వేయడంపై స్పందిస్తూ, మద్య నిషేధం చేయలేదన్న అసంతృప్తితో వారు అలా వచ్చారని చెప్పేవరకు వెళ్లారు. మిగిలిన 99 శాతం హామీలు అమలు చేయడన్ని విస్మరించి ఈ ఒక్క కారణంకోసం వ్యతిరేకత వచ్చిందంటే అది హాస్యాస్పదం.
నిజంగానే ప్రభుత్వ వ్యతిరేక ఎక్కువగా ఉంటేనే పోలింగ్ అదికంగా జరుగుతుందా అన్నది ప్రశ్న! కొన్నిసార్లు అది వాస్తవం కావచ్చు. మరికొన్నిసార్లు అది నిజంకాదు అని చెసప్పడానికి అనేక దృష్టాంతాలు ఉన్నాయి. 1967లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత పార్టీలో సిండికేట్ నాయకుల నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కున్నారు. ఆమె చేయదలచుకున్న బ్యాంకుల నేషనలైజేషన్ , రాజభరణాల రద్దు వంటి వివిధ సంస్కరణలను సిండికేట్ నేతలు వ్యతిరేకించారు. ఆ నేపధ్యంలో రాష్ట్రపతి ఎన్నికలలో అధికారిక కాంగ్రెస్ అభ్యర్ధి నీలం సంజీవరెడ్డిని వ్యతిరేకించి, తిరుగుబాటు అభ్యర్ధి వి.వి.గిరిని బలపరిచారు. దాంతో పార్టీ కూడా కొత్త కాంగ్రెస్, పాత కాంగ్రెస్ గా చీలిపోయింది.
1971లో ఆమె పార్లమెంటు ఎన్నికలకు వెళ్లినప్పుడు గరీబీ హటావో నినాదం ఇచ్చారు. అప్పుడు విపరీతమైన స్పందన ఆమెకు లభించింది. అప్పుడు ప్రజలలో సానుకూల ఓటింగ్ పడింది. 1967లో 61 శాతం ఓట్లు పోలైనా కాంగ్రెస్ పార్టీకి 283 సీట్లు మాత్రమే వచ్చాయి. పార్టీ చీలికతో ఇందిరాగాంధీ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. అయినా ఆమె డి.ఎమ్.కె.,వామపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నారు. 1971లో ఎన్నికలకు వెళ్లినప్పుడు 55 శాతం ఓట్లే పోలైనప్పటికీ, ఇందిరాగాంధీ ఆద్వర్యంలోని కొత్త కాంగ్రెస్‌కు 352 సీట్లు రావడం విశేషం. అలాగే 1967 కాంగ్రెస్‌కు 40 శాతం ఓట్లు వస్తే, 1972లో ఇందిరాగాంధికి 43 శాతం ఓట్లు లబించాయి. అంటే ఓట్ల శాతం తగ్గినా, పెరిగినా, ఆనాటి రాజకీయ పరిస్థితులు, పరిణామాలు, నాయకత్వం వీటన్నిటి ఆదారంగా గెలుపు, ఓటములు ఉంటాయని తేలుతుంది.
ఇక ఆంధ్ర ప్రదేశ్ విషయం చూద్దాం. 1982 లో టీడీపీ ఆవిర్బావం తర్వాత రెండు పార్టీల వ్యవస్థ వేళ్ళూనుకుంది. 1983 లో జరిగిన ఎన్నికలలో 67.70 శాతం ఓట్లు పోల్ కాగా, కొత్తగా ఆవిర్భవించిన టిడిపి అధికారంలోకి వచ్చింది. అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.ఆర్. 1985లో శాసనసభను రద్దు చేసి మద్యంతర ఎన్నికలకు వెళ్లారు. అప్పుడు కూడా దాదాపు ఇదే శాతం ఓట్లు పోలయ్యాయి.ఆ ఎన్నికలలో 67.60 శాతం ఓట్లు పోల్ కాగా టిడిపి మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఎన్.టి.ఆర్.ప్రభుత్వాన్ని పడగొట్టడానికి 1984లో జరిగిన ప్రయత్నాల కారణంగా ఆయనకు సానుభూతి వచ్చి మళ్లీ గెలిచారు. 1989 లో జరిగిన ఎన్నికలలో టీడీపీ ఓటమిపాలైంది. ఆ ఎన్నికలలో 70.40 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ కొంత ప్రభుత్వ వ్యతిరేకత ప్రస్పుటించిందనిపిస్తుంది.
కాంగ్రెస్ పార్టీ కి 181 సీట్లు, టీడీపీకి 74 సీట్లు వచ్చాయి. 1994లో జరిగిన ఎన్నికలలో పోలైన ఓట్ల శాతం పెద్దగా పెరగలేదు. ఆ ఎన్నికలలో కేవలం 0.60 శాతం పోలింగ్ పెరిగింది. అయినా టిడిపికి 216 సీట్లు, మిత్రపక్షాలకు మరో 34 సీట్లు వచ్చాయి. దీనిని ఏ విధంగా అర్దం చేసుకోవచ్చు. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, టీడీపీ వామపక్షాల కూటమిని ప్రజలు ఆదరించారు. ఆనాడు ఎన్.టి.ఆర్.ఇచ్చిన రెండు రూపాయలకే కిలో బియ్యం, మద్య నిషేధం వంటి హామీలు బాగా పనిచేశాయి. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ కు కేవలం 26 సీట్లే వచ్చాయి. తదుపరి 1995లో ఎన్.టి.ఆర్.ప్రభుత్వాన్ని కూలదోసి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు . ఆ తర్వాత 1999 ఎన్నికలలో సుమారు రెండు శాతం పోలింగ్ తగ్గినా టిడిపి 180 సీట్లతో అధికారంలోకి రాగా, కాంగ్రెస్ కు 91 సీట్లు వచ్చాయి. చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు.
ఇక్కడ టీడీపీ వ్యూహాత్మకంగా బిజెపితో పొత్తు పెట్టుకోవడం కలిసి వచ్చింది. అంతే తప్ప అది ప్రభుత్వానికి పూర్తి సానుకూల ఓటు కాదని చెప్పవచ్చు. కాంగ్రెస్ అంతకుముందున్న 26 సీట్లనుంచి 91 సీట్లకు పెరగడమే నిదర్శనం. 2004 శాసనసభ ఎన్నికలలో గతంలో కన్నా పోలింగ్ పెద్దగా పెరగలేదు. 69.8 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. అంటే కేవలం 0.7 శాతం పోలింగ్ పెరిగిందన్నమాట. కాని ఈసారి కాంగ్రెస్ 185 సీట్లతో అధికారంలోకి రాగా, మిత్ర పక్షమైన టిఆర్ఎస్ కు 26 సీట్లు, వామపక్షాలకు 15 సీట్లు లబించాయి. టీడీపీకి కేవలం 47 సీట్లే వచ్చాయి. పోలింగ్ శాతం పెద్దగా పెరగకపోయినా టిడిపి ఎందుకు అంత తక్కువ సీట్లకు పడిపోయిందన్నది పరిశీలిస్తే, దానికి కారణం ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు కాంగ్రెస్,టిఆర్ఎస్,వామపక్షాలు పొత్తు పెట్టుకోవడమే అని చెప్పవచ్చు.వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర,రైతులకు ఉచిత విద్యుత్ వంటివి ఉపకరించాయి.
2009 నాటి అనుభవం మరింత ఆసక్తికరమైంది.ఆ ఎన్నికలలో కొత్తగా వచ్చిన ప్రజారాజ్యం, లోక్ సత్తా వంటి పార్టీలు స్వతంత్రంగా పోటటీచేశాయి. టీడీపీ, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం లు మహాకూటమిగా ఏర్పడి అధికారంలో ఉన్న కాంగ్రెస్ తో తలపడ్డాయి. ఈ ఎన్నికలలో ఓట్ల శాతం 72,70 శాతంగా ఉంది. అంటే అంతకు ముందు ఉన్న పోలింగ్ శాతం కన్నా మూడు శాతం పెరిగిందన్నమమాట. అయినా వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 156 సీట్లను సాధించింది. తెలుగుదేశంకు 92, టీఆర్ఎస్‌కు పది, వామపక్షాలకు ఆరు సీట్లు వచ్చాయి. ప్రజారాజ్యం కు 18 సీట్లు రాగా, లోక్ సత్తా ఒక సీటుకే పరిమితం అయింది. ఓట్ల శాతం పెరిగితే అది ప్రభుత్వ వ్యతిరేకత అని వాదించేవారికి ఇది సమాధానం అవుతుంది.
ఓట్ల శాతం పెరిగినా అది పాజిటివ్ ఓటు కావచ్చనడానికి ఈ ఫలితం ఒక ఉదాహరణ అవుతుంది. అయితే ఇది పూర్తి పాజిటివ్ ఓటా అంటే ఔనని చెప్పలేం. ఎందుకంటే ఇక్కడ టీడీపీ 47 నుంచి 92 కి పెరిగింది. కాని ప్రజారాజ్యం, లోక్ సత్తా వంటి పార్టీల వల్ల కాంగ్రెస్, టీడీపీలు కొంత నష్టపోయాయి. నాలుగు పార్టీలు కూటమి కట్టాయి. అయినా దానిని తట్టుకుని కాంగ్రెస్ కొంత పాజిటివ్ ఓటు సాదించడం వల్ల బయటపడిందని చెప్పాలి. 2014 లో విభజిత ఏపీలో 76.80 శాతం ఓట్ల పోలింగ్ జరిగింది. అప్పటికి కాంగ్రెస్ పూర్తిగా ప్రజా మద్దతు కోల్పోవడం టీడీపీకి కలిసి వచ్చింది. గతంతో పోల్చితే నాలుగు శాతం ఓట్లు పెరిగినా, టీడీపీ, బిజెపి కూటమికి 106 సీట్లే వచ్చాయి.
ప్రతిపక్షంగా వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు 67 సీట్లు దక్కాయి. టీడీపీకి పాజిటివ్ ఓటు అయి ఉంటే ప్రతిపక్షానికి ఈ స్థాయిలో సీట్లు రావడానికి తక్కువ ఆస్కారం ఉంటుంది. నరేంద్ర మోదీ ప్రదాని అభ్యర్ధిగా రావడం, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని పెట్టి కాపు వర్గాన్ని ఆకర్షించడం, చంద్రబాబు రైతుల రుణమాఫీ వంటి ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వడం వంటి వాటివల్ల అధికారంలోకి రాగలిగారు. వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ అప్పట్లో రుణమాఫీ హామీ ఇచ్చినా, కొందరు కీలక నేతలుపార్టీలో చేరడానికి వచ్చినప్పుడు అంగీకరించినా, ఆయనకే ప్రజలు పట్టం కట్టేవారన్న అభిప్రాయం కూడా ఉంది. 2019 ఎన్నికలలో 79.80 శాతంం ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికలలో చంద్రబాబు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత చాలా స్పష్టంగా కనిపించింది.
అదే టైమ్‌లో జగన్ ఇచ్చిన హామీలు కూడా పనిచేశాయని చెప్పవచ్చు. అందువల్లే వైఎస్సార్‌సీపీకి 151 సీట్లు, టీడీపీకి కేవలం 23 సీట్లు వచ్చాయి. 2024 శాసనసభ ఎన్నికలలో గతంలో కన్నా సుమారు రెండు శాతం పెరిగినట్లు లెక్కలు గడుతున్నారు. దీనివల్ల వైఎస్సార్‌సీపీకి నష్టం అని టీడీపీ కూటమి మద్దతుదారులు వాదిస్తున్నా, ఓట్ల పోలింగ్ శాతం పెరిగినంతమాత్రాన అన్నిసార్లు అది ప్రభుత్వ వ్యతిరేకత అని అనుకోనవసరం లేదనడానికి పైన ఇచ్చిన గణాంకాలు తెలుపుతాయి. పైగా ప్రభుత్వంపై సానుకూలత ఉన్నప్పుడు కూడా ఓట్ల శాతం పెరగవచ్చు. ప్రస్తుత ప్రభుత్వం కనుక గెలవకపోతే పేదవర్గాలకు నష్టం కలుగుతుందన్న భావన బాగా ప్రబలితే కూడా ఓట్ల శాతం పెరుగుతుంది. అయితే ప్రభుత్వం మీద అసలు వ్యతిరేకత ఉండదని ఎవరూ చెప్పరు. కాని దానికన్నా ప్రభుత్వంపై సానుకూలత ఎక్కువగా ఉందనడానికి పలు ఆధారాలు కనిపిస్తాయి.
ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని పేదవర్గాలు అధికంగా ఓటింగ్‌లో పాల్గొన్నట్లు కనిపిస్తుంది. అలాగే మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. టీడీపీకి పట్టణ ప్రాంతాలలో కొంత అనుకూలత ఉన్నా, అక్కడ కూడా ఉండే పేద వర్గాలు సీఎం జగన్ వైపే మొగ్గుచూపుతాయి. దానికితోడు ఎస్సి, బిసి, ఎస్టి, మైనార్టీ, రెడ్డి వర్గాలు బలంగా ఉంటే వైఎస్సార్‌సీపీ ఓడించడం కూటమికి సాధ్యం కాదనిపిస్తుంది. 2019లో ఏ సామాజిక సమీకరణలు ఉన్నాయో,దాదాపు అవే ఇప్పటికే కొనసాగుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన ద్వారా కాపు వర్గాన్ని కొంత ఆకర్షించినా, అధికారంలోకి రావడానికి అది సరిపోదనిపిస్తుంది.
జగన్ పేదలు vs పెత్తందార్ల స్లోగన్ బాగా పనిచేసినట్లు కనిపిస్తుంది. అది కరెక్టు అయితే సీఎం జగన్‌కు వేవ్ వచ్చినా ఆశ్చర్యపడనవసరం లేదు. ఒకవేళ వేవ్ రాకపోయినా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి జగన్‌కు డోకా ఉండదన్న అభిప్రాయం ఏర్పడుతోంది. స్థూలంగా చెప్పాలంటే ఆయా ఎన్నికలలో అప్పటి పరిస్థితులు, రాజకీయ పరిణామాలు, వాగ్దానాలు, సామాజిక సమీకరణలు, నాయకత్వంపై విశ్వాసం మొదలైన అంశాలు కూడా ప్రభావితం చేస్తాయి. ఇవి ఈ ఎన్నికలలో సీఎం జగన్‌కు ఎక్కువగా అనుకూలంగా ఉండడం వల్లే ఆయన మళ్లీ ముఖ్యమంత్రి అవుతారన్న భావన బలీయంగా ప్రజలలో నెలకొంది.
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment