వారం గడిచింది.. అయినా బాబు నోట మాటెందుకు రావట్లేదు? | Chandrababu Pawan Kalyan Alliance Still No Clarity In AP | Sakshi
Sakshi News home page

వారం గడిచింది.. అయినా బాబు నోట మాటెందుకు రావట్లేదు?

Published Tue, Feb 13 2024 4:12 PM | Last Updated on Tue, Feb 13 2024 6:46 PM

Chandrababu Pawan Kalyan Alliance Still No Clarity In AP - Sakshi

అన్నీ తల కిందులవుతున్నాయి. బీజేపీతో పొత్తు అంటూనే నిర్ణయం పెండింగ్‌లో పెట్టారు. అటు సీఎం జగన్ ఎలక్షన్ డ్రైవ్ స్పీడ్ పెంచారు. YSRCP అభ్యర్దుల పైనా దాదాపుగా క్లారిటీ వచ్చేసింది. ఎప్పటికప్పుడు ఇన్‌ఛార్జ్‌ల లిస్టు ప్రకటిస్తున్నారు. ఇటు బాబు కూటమిలో మాత్రం సీన్‌ రివర్స్‌లో కనిపిస్తోంది. జనసేన, బీజేపీతో పొత్తుతో సీన్ మార్చాలనే చంద్రబాబు వ్యూహాలు తిరగబడుతున్నాయి. సీట్లు, సామాజిక సమీకరణాలను పరిశీలిస్తే కూటమి ఓట్లలో స్పష్టంగా చీలికలు కనిపిస్తున్నాయి.

ఒక్క పొత్తు కోసం చంద్రబాబు అడుగు ముందుకు వేస్తే అనేక నష్టాలు వెంటాడుతున్నాయన్న అనుమానాలు తెలుగు తమ్ముళ్లలో మొదలయ్యాయి. అసలు YSRCP వ్యతిరేక ఓటు చీలకూడదన్న చంద్రబాబు , పవన్ కళ్యాణ్‌ మూల సిద్దాంతానికే బీటలు వారుతున్నాయి. ఈ పరిస్థితికి విశ్లేషకులు చెబుతున్న ఓ 10 కారణాలు ఇప్పుడు చూద్దాం.

  • ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. మరో రెండు వారాల్లో నోటిఫికేషన్‌ వచ్చే అవకాశముంది. అయితే ఇప్పటివరకూ టీడీపీ, జనసేన సీట్లు ఖరారు కాలేదు. టికెట్‌లు ఇస్తామని చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లు ఎవరికి వారు ప్రకటనలిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో మాత్రం ఒకరికి ఇస్తే మరొకరు తిరుగుబాటు చేస్తామన్న బహిరంగ ప్రకటనలొస్తున్నాయి. ఈ రెండు పార్టీలే తగువులాడుకుంటుంటే.. వీరిద్దరికి ఇప్పుడు బీజేపీ తోడైతే మరింత క్లిష్ఠ పరిస్థితి. టీడీపీ కోసం పని చేస్తున్న అన్ని సర్వే సంస్థలు ఈ కూటమికి ఓటమి తప్పదని హెచ్చరిస్తున్నాయి. కానీ, ఓడకుండా ఉండాలంటే బీజేపీ పొత్తు తప్పదని చంద్రబాబు వాదిస్తున్నాడు.
  • టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుగనక ఖరారయితే.. 175లో కచ్చితంగా 75 సీట్లను టీడీపీ వదులుకోవాల్సిందే. వదులుకోవాల్సిన నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు జెండా మోసిన తమ్ముళ్లు... తమకు టికెట్లు దక్కుతాయన్న భ్రమల్లో ఉన్నారు. తమకు టికెట్‌ నిరాకరిస్తే.. వీరంతా ఎలాంటి పరిస్థితుల్లోనూ సహకరించే పరిస్థితి లేదు. చివరి నిమిషం వరకు సీట్లు తేల్చకుండా ఆఖర్లో టికెట్‌ ప్రకటించినా ఏం ప్రయోజనం లేదని వాపోతున్నారు.
  • వైఎస్సార్‌సీపీ అమలు చేస్తున్న సామాజిక సమీకరణాలకు ధీటుగా మూడు పార్టీల కూటమి తమ అభ్యర్దులను నిలబెట్టటం సాధ్యం కాదని తేలిపోతోంది. ఈ సారి ఎన్నికల్లో గెలుపు ఓటములను నిర్దేశించింది సామాజిక సమీకరణాలే అని పార్టీల్లో ప్రచారం జరుగుతోంది. సీఎం జగన్ అనుసరిస్తోన్న సామాజిక వ్యూహాన్ని ఈ కూటమి అనుసరించడం అసాధ్యం. మూడు పార్టీల నుంచి అగ్రవర్ణాలే ముందు వరసలో ఉన్నారు. వీరందరికి టికెట్లిచ్చి పెద్ద సంఖ్యలో పోటీలో నిలబెడితే.. ఏం జరుగుతుందో.. సులభంగా అంచనా వేయవచ్చు
  • మైనార్టీ ఓట్ బ్యాంక్ కూటమికి పూర్తిగా దూరం కానుంది. 2014లో మైనార్టీలకు టీడీపీ ఒక్క సీటు ఇవ్వలేదు. ఇప్పుడు కూడా మైనార్టీలు టిడిపి వైపు నిలబడే అవకాశాలు లేవు.
  • పట్టణ ఓట్లపై చంద్రబాబు ఆశలున్నాయి. అయితే శ్రీకాకుళం నుంచి కుప్పం పట్టణం దాకా.. ఏ పట్టణంలోనూ టిడిపి స్ట్రాంగ్‌గా కనిపించడం లేదు. పైగా అర్బన్ ఓటర్లలో ముఖ్యంగా అగ్రవర్ణాల్లో ప్రధాని మోదీ పైన ఆదరణ ఉందని వీరు చెప్పుకుంటున్నారు కానీ అగ్ర వర్ణాల్లోని ఆ రెండు వర్గాల వారు చంద్రబాబును వ్యతిరేకించే వారే. మోదీని నాడు వ్యక్తిగతంగా దూషించి నేడు అవసరం కోసం తిరిగి మోదీతో జత కట్టడాన్ని వారు సహించలేకపోతున్నారు.
  • ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మిక వర్గాల ఓట్లపై చంద్రబాబు దింపుడు కళ్లెం ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుతో ఉద్యోగ, కార్మిక వర్గాలకు ప్రతినిధులుగా ఉండే వామపక్షాలు కాంగ్రెస్ తో కలవటానికి సిద్దపడుతున్నాయి. దీంతో, ఉద్యోగ, కార్మిక వర్గాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు టీడీపీకి పూర్తి స్థాయిలో బదిలీ అయ్యే అవకాశం కనిపించడం లేదని చెబుతున్నారు.
  • షర్మిలను తీసుకొచ్చి ట్విస్ట్‌ ఇద్దామన్న చంద్రబాబు ప్లాన్‌ బెడిసికొట్టేలా కనిపిస్తోందని తెలుగు తమ్ముళ్లు అనుకుంటున్నారు. ప్రభుత్వ అనుకూల ఓటు వైఎస్సార్సీపీ నుంచి ఏ పార్టీకి వెళ్లే అవకాశం ఉండదు. ఎల్లో మీడియా చెబుతున్నట్టు ఒక వేళ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైనా ఉన్నా.. అది కూడా చీలుతుంది కదా. పైగా తెలంగాణలో విశ్వసనీయత కోల్పోయిన షర్మిలకు ఎన్ని ఓట్లు వస్తాయన్నది అంచనా వేయడం కష్టం.
  • 2019లో టిడిపి ఓడిన వెంటనే చంద్రబాబు కోటరీగా వ్యవహరించిన నేతలు నాడు బీజేపీలో చేరారు. బీజేపీ, టిడిపి పొత్తులో ఇప్పుడు కీలకంగా ఉన్నారు. పొత్తు ఖాయమయితే మళ్లీ వారే బీజేపీ అభ్యర్దులుగా ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్దం అవుతున్నారు. ఇది నిజంగా టిడిపి కోసం పని చేసేన వారిలో ఆగ్రహానికి కారణమవుతోంది. వారి కోసం ప్రస్తుత పరిస్థితుల్లో టిడిపి క్యాడర్‌ పని చేసే అవకాశాలు కనిపించటం లేదు.
  • పొత్తు ఖాయం చేసుకోవాలంటే బీజేపీ ప్రధానంగా ఒక షరతు విధిస్తోంది. అధికారంలోకి రావటానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 88 టీడీపీ సొంతంగా సాధించే పరిస్థితి ఉండకూడదు. ఇందుకోసం బీజేపీ 4-2-1 ఫార్ములా తెచ్చింది. అంటే తెలుగుదేశం ఏకపక్షంగా ముందుకెళ్లే అవకాశం ఎంతమాత్రంగా లేదన్నమాట. ఈ లెక్క ప్రకారం
  • ప్రతీ పార్లమెంట్ పరిధిలో టీడీపీ 4, బీజేపీ -2, జనసేన -1 స్థానాల్లో పోటీ చేసేలా ప్రతిపాదన చేసారు ఫలితంగా 75 సీట్లు తమ రెండు పార్టీలకు దక్కేలా బీజేపీ ప్లాన్ చేస్తోంది. కూటమి అధికారంలోకి రావాలన్నా తమ మద్దతుతోనే ముందుకెళ్లే పరిస్థితులు ఉండాలనేది బీజేపీ నిర్దేశించిన వ్యూహం. ఇది చంద్రబాబు & కో కు మింగుడు పడటం లేదు.
  • కూటమితో అధికారంలో వస్తామని కేడర్‌కు చంద్రబాబు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అసలు కారణాలు గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరికీ తెలిసినవే. ఏ పొత్తులనయితే బాబు నమ్ముకున్నాడో.. అవే పొత్తులు బాబు పునాదులను కంపించేలా చేస్తున్నాయని ఇప్పుడు తెలుగు తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు.

:: బెజవాడ బ్రహ్మయ్య

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement