
వైఎస్సార్ జిల్లా తాతిరెడ్డి పల్లెలో నేలవాలిన అరటి తోటను పరిశీలిస్తున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్
రైతులకు ప్రభుత్వమే పూర్తిస్థాయిలో పరిహారం అందించాలి
వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ డిమాండ్
వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో 4 వేల ఎకరాల్లో అరటి తోటలు నేలమట్టం
మళ్లీ మన ప్రభుత్వం రాగానే నెల రోజుల్లోనే రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమా
చంద్రబాబు సర్కారు వచ్చాక ఉచిత పంటల బీమాకు మంగళం
ఇప్పటికే ఒక ఏడాది రూ.26 వేల పెట్టుబడి సాయానికి ఎగనామం
ధాన్యం, మిర్చి, పెసలు, శనగలు, మినుములు, కందులు.. ఏ పంటకూ ఇవాళ గిట్టుబాటు ధర లేదు
వైఎస్సార్ జిల్లా లింగాల మండలంలో దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పిన వైఎస్ జగన్
చంద్రబాబు ఇక్కడి రైతులకు కచ్చితంగా ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలి. ఇన్సూరెన్స్ సొమ్ము కచ్చితంగా రావాలి. ఒకవేళ రైతన్నలకు అది రాని పరిస్థితి ఉంటే.. తదుపరి వచ్చేది మన ప్రభుత్వమే. ఓపిక పట్టండి. మన ప్రభుత్వం వచ్చాక నెల రోజుల్లోనే రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తాం. అలాగే ఇవాళ రైతులకు రాని ఇన్సూరెన్స్ కూడా ఇప్పిస్తాం. ప్రతి రైతన్న ముఖంలో సంతోషం కనిపించేలా చేస్తాం.
సాక్షి కడప: ‘అకాల వర్షం.. పెనుగాలులు.. వడగళ్ల ధాటికి అరటి తోటలు నేల కూలాయి. లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టిన రైతన్నలు ఇవాళో రేపో అరటి గెలలు కోసే సమయంలో తీవ్ర నష్టం సంభవించింది. ఇలాంటి క్లిష్ట సమయంలో నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలి. ఇన్‌పుట్ సబ్సిడీ అందించి ఎంతో కొంత ఆసరాగా నిలబడాలి.. కానీ ఈ సర్కారు ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టకపోవడంతో రైతులకు ఇన్సూరెన్స్ వచ్చే పరిస్థితి లేదు.. ఇలాంటప్పుడు ప్రభుత్వమే పూర్తిస్థాయిలో పరిహారం అందించి రైతులను ఆదుకోవాలి’ అని వైఎస్సార్‌సీపీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) డిమాండ్ చేశారు.
పడిపోయిన గెలలను కూడా కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. వైఎస్సార్ జిల్లా లింగాల మండలంలో భారీ ఈదురు గాలులు, అకాల వర్షాలకు నేలవాలిన అరటి తోటలను వైఎస్ జగన్ సోమవారం పరిశీలించారు. తాతిరెడ్డిపల్లె, కోమన్నూతలలో అరటి తోటల్లోకి వెళ్లి రైతులను ఓదార్చి నష్టాన్ని ఆరా తీశారు. కోమన్నూతల వద్ద తోటలో మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ జిల్లాలోని లింగాల మండలంతోపాటు అనంతపురం జిల్లాలోని నేర్జాంపల్లె, దాడితోట తదితర గ్రామాల్లో దాదాపు 4 వేల ఎకరాల్లో అరటి తోటలకు నష్టం జరిగినట్లు తెలుస్తోందని చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
బాబు ప్రీమియం ఎగ్గొట్టడంతో...
అరటి రైతు ఎకరానికి రూ.1.50 లక్షల వరకు ఖర్చు పెట్టి సాగు చేస్తే తీరా పంట చేతికొచ్చే సమయంలో పెను గాలులు దెబ్బతీయడంతో దాదాపు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు ఆదాయం రాకపోగా, చివరికి నష్టం మిగలడం బాధేస్తోంది. రైతన్నలకు ఉచిత పంటల బీమా ఒక హక్కుగా వైఎస్సార్‌సీపీ హయాంలో అమలయ్యేది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఉచిత పంటల బీమాను ఎత్తేశారు. దీన్ని ఎత్తివేయడం ఒక నేరమైతే.. 2024 మే, జూన్ నెలల్లో కట్టాల్సిన పంటల ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని చంద్రబాబు కట్టలేదు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున కట్టాల్సిన ప్రీమియం రూ.1,280 కోట్లు కట్టి ఉంటే రైతులకు మేలు జరిగేది. బాబు అధికారంలోకి వచ్చాక ప్రీమియం ఎగ్గొట్టడంతో అన్నదాతలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆ తర్వాత 2024–25కి సంబంధించిన ప్రీమియం కూడా ఆయన కట్టలేదు. అసలు ఈ రోజు ఉచిత పంటల బీమా ఉందా? లేదా? మీరిచ్చిన జీవోను చూస్తే దశల వారీగా ఎత్తేస్తామని చెబుతున్నారు. చంద్రబాబు పుణ్యాన ఇప్పటికే పలు పంటలకు తీవ్ర నష్టం జరిగింది.
ధాన్యం రంగు మారింది. మొక్కజొన్న, జొన్నకు కూడా భారీగా నష్టం వాటిల్లింది. వరుసగా రెండేళ్లు ఖరీఫ్ సీజన్‌లో అదే జరిగింది. ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. పంటలకు ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాలి. ఈ–క్రాప్ పక్కాగా నమోదు చేయాలి. ప్రతి రైతు పండించిన పంటల వివరాలు ఈ–క్రాప్ కింద నమోదు చేసి నష్టం జరిగితే వారికి ఇన్సూరెన్స్ వచ్చేలా చూడాలి. ఎవరూ ఇన్సూరెన్స్ కట్టలేదన్న పరిస్థితి ఉత్పన్నం కాకూడదు.
పెట్టుబడి సాయం... సున్నా
మన ప్రభుత్వంలో వైఎస్సార్ రైతు భరోసా కింద రైతన్నలకు ఏటా రూ.13,500 చొప్పున ఇచ్చాం. చంద్రబాబు తాము అధికారంలోకి రాగానే రూ.26,000 (కేంద్ర సాయంతో కలిపి మొత్తం) ఇస్తానన్నాడు. కానీ రూ.20 కూడా ఇవ్వలేదు. ఇప్పటికే ఒక ఏడాది పెట్టుబడి సాయాన్ని రైతులకు ఎగ్గొట్టారు. ఇవాళ పరిస్థితి చూస్తుంటే రైతులను ఎంతమాత్రం ఆదుకునే ఉద్దేశం కనిపించడం లేదు. సున్నా వడ్డీ పంట రుణాలకు మంగళం పాడారు. రైతులకు సున్నా వడ్డీ మొత్తం చెల్లించలేదు. ఇలా అన్నదాతలకు అడుగడుగునా చంద్రబాబు అన్యాయం చేస్తూనే ఉన్నారు.
నిరుపయోగంగా కోల్డ్ స్టోరేజీ..
రాష్ట్రంలోనే అరటి సాగు పులివెందులలో అత్యధికం. ఆ రైతన్నలకు మేలు చేయడం కోసం ఇక్కడ రూ.25 కోట్లతో ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజీని ఏర్పాటు చేశాం. ఎన్నికలకు ముందే అన్ని వసతులతో ప్రారంభించాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక దారుణంగా వ్యవహరిస్తోంది. టెండర్ పిలిచి యూజర్ ఏజెన్సీకి అప్పగించడం లేదు. దీన్ని బట్టే రైతులపై ఈ సర్కార్ ఎంత కపట ప్రేమ చూపుతోందో అర్థమవుతోంది. ఈ కోల్డ్ స్టోరేజీ సామర్థ్యం 500 మెట్రిక్ టన్నులు కాగా, దాన్ని టెండర్ ద్వారా యూజర్ ఏజెన్సీకి అప్పగిస్తే రైతులకు మేలు జరిగేది.
కానీ ఆ పని చేయకుండా, కోల్డ్ స్టోరేజీని వాడుకోకుండా నిరుపయోగంగా వదిలేశారు. అదే ఇప్పుడు యూజర్ ఏజెన్సీ ఉండి ఉంటే వారు పంట కొనుగోలు చేసేవారు. మరోవైపు రైతులు తమ పంటను ఇక్కడ దాచుకునే వీలుండేది. తద్వారా నష్టపోయే అవకాశం లేకపోగా మంచి జరిగేది. వైఎస్సార్‌సీపీ హయాంలో రెండు కంటైనర్ల ద్వారా ఇతర దేశాలకు ఎగుమతులు కూడా చేసి రైతులకు ప్రోత్సాహం అందించాం.
పంటల ధరలు దారుణంగా పతనం..
రాష్ట్రంలో వర్షాలు, ఈదురు గాలులతో పంటలకు తీవ్ర నష్టం జరగ్గా మరోవైపు ధరలు దారుణంగా పడిపోయాయి. నెల క్రితం టన్ను అరటి ధర రూ.26 వేలు ఉంటే ఇప్పుడు రూ.9 వేలకు పడిపోయింది. అయినా కొనుగోళ్లు లేవు. కొన్నిచోట్ల రూ.6వేలకు పతనమైనా ఈ ప్రభుత్వం ఎక్కడా రైతులను పట్టించుకోవడం లేదు. మిర్చిది కూడా అదే పరిస్థితి. ధాన్యం కొనుగోళ్లలోనూ అదే దుస్థితి. ధాన్యం రైతులు క్వింటాల్‌కు రూ.300 నుంచి రూ.400 వరకు నష్టపోతున్నారు.
మిర్చి రూ.11,800కి కొంటామని చెప్పి ఒక్క కేజీ కూడా కొనుగోలు చేయలేదు. పెసలు, శనగలు, మినుములు, కందులు.. ఇలా ఏ పంటకూ ఇవాళ గిట్టుబాటు ధర లేదు. చీనీ రైతులకు వైఎస్సార్‌సీపీ హయాంలో టన్నుకు లక్ష రూపాయల వరకు ఆదాయం వచ్చింది. స్యూట్ (కమీషన్) లేకుండా రైతులకు మనం మేలు చేయగా, ఈరోజు చీనీ టన్ను కేవలం రూ.23 వేలు, రూ.18 వేలు, రూ.15 వేలు మాత్రమే పలుకుతోంది. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.
నష్టపోయిన రైతన్నకు ఇదే నా భరోసా..
ఈ 4 వేల ఎకరాల్లో పంట నష్టపోయిన రైతన్నలకు భరోసా ఇస్తున్నా. ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే నా పర్యటన! చంద్రబాబు ఇక్కడి రైతులకు కచ్చితంగా ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలి. ఇన్సూరెన్స్ సొమ్ము కూడా కచ్చితంగా రావాలి. ఒకవేళ రైతన్నలకు అది రాని పరిస్థితి ఉంటే.. తదుపరి వచ్చేది మన ప్రభుత్వమే. చూస్తుండగానే ఏడాది గడిచిపోయింది. ఓపిక పట్టండి.
మన ప్రభుత్వం వచ్చాక నెల రోజుల్లోనే రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తాం. అలాగే ఇవాళ రైతులకు రాని ఇన్సూరెన్స్ కూడా ఇప్పిస్తాం. ప్రతి రైతన్న ముఖంలో సంతోషం కనిపించేలా చేస్తాం. అంతేకాకుండా ప్రతి రైతుకు 2023లో మన ప్రభుత్వంలో ఇచ్చినట్లుగా రూ.50 వేలు కూడా ఇస్తాం. ఇది ప్రతి రైతుకూ భరోసా కల్పిస్తూ చెబుతున్నా. పార్టీ తరఫున కూడా రైతులకు సాయం అందించి ఆదుకుంటాం.
నేలమట్టమైన తోటలు.. చలించిన జగన్
ఎక్కడ చూసినా నేలమట్టమైన అరటి చెట్లు.. మట్టి పాలైన గెలలు.. కంటతడి పెడుతున్న రైతన్నలను చూసి వైఎస్ జగన్ చలించిపోయారు. వైఎస్సార్ జిల్లా లింగాల మండలం తాతిరెడ్డిపల్లె, కోమన్నూతల గ్రామాల పరిధిలో అరటి తోటలను ఆయన స్వయంగా పరిశీలించారు. తమ బాధలు చెబుతున్న సమయంలో రైతన్నలు కన్నీటి పర్యంతం కాగా, వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు.
దారి వెంట అరటి తోటలను పరిశీలిస్తూ.. పొలాల్లోకి వెళ్లి ప్రతి రైతుకూ ధైర్యం చెప్పి ఓదార్చుతూ ముందుకు సాగారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి తదితరులు ఆయన వెంట ఉన్నారు. జిల్లాలో జగన్ రెండు రోజుల పర్యటన సోమవారం మధ్యాహ్నంతో ముగిసింది. వేంపల్లెలో జడ్పీటీసీ రవికుమార్‌రెడ్డి నివాసంలో నూతన వధూవరులు సాయి భైరవ ప్రీతంకుమార్‌రెడ్డి, వైష్ణవిలను ఆశీర్వదించిన అనంతరం ఇడుపులపాయ చేరుకుని తిరిగి విజయవాడకు పయనమయ్యారు.
తీవ్రంగా నష్టపోయాం.. ఆత్మహత్యలే శరణ్యం..
ఎనిమిది ఎకరాల్లో అరటి పంట సాగు చేశా. మొక్క రూ.20 చొప్పున 9,500 మొక్కలను కొనుగోలు చేశా. సుమారు రూ.16 లక్షలు పెట్టుబడి చేతికి అందకుండా పోయింది. ఇంటిల్లిపాది అన్నపానీయాలు లేకుండా గడుపుతున్నాం. ఎరువుల దుకాణాల్లో అప్పులు చేశాం. పెట్టుబడికి అప్పులు తెచ్చాం. పది రోజుల్లో చేతికొస్తుందనుకున్న పంట కళ్లెదుటే నేలమట్టమైంది. ప్రభుత్వం ఆదుకోకుంటే మాకు ఆత్మహత్యలే శరణ్యం.
– మందలపల్లి కేశవయ్య, తాతిరెడ్డిపల్లె, లింగాల మండలం
అరటి వ్యాపారులు, కూలీలను వెళ్లగొట్టారు..
గత నెలలో టన్ను అరటి రూ.25–26 వేల వరకు పలికింది. అయితే ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోందని కూలీలను పులివెందుల పోలీసులు చితకబాదారు. లారీలను ఆపి డబ్బులు వసూలు చేశారు. దీంతో పులివెందుల నుంచి వ్యాపారులు, కూలీలు వెళ్లిపోవడంతో ధరలు పడిపోయాయి. ప్రస్తుతం ధర రూ.6–10 వేలుæమాత్రమే ఉంది. లారీలు, కూలీలు లేకపోవడం, పంట ఒక్కసారిగా చేతికి అందడంతో అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడింది. దీనికితోడు అకాల వర్షాలు నిండా ముంచాయి. 3.5ఎకరాల్లో అరటి సాగుచేసి రూ.7లక్షలు నష్టపోయా.
– పీసీ వాసుదేవరెడ్డి, కోమన్నూతుల, లింగాల మండలం
పెట్టుబడి సాయం ఏది?
మూడు ఎకరాల్లో అరటి సాగు చేశా. సుమారు రూ.6 లక్షల మేర పెట్టుబడులు పెట్టా. గాలివానకు పంట మొత్తం నేలకూలింది. నేల కూలిన అరటి పంటను తొలగించాలన్నా ఎకరాకు రూ. 30 వేల వరకు ఖర్చయ్యే పరిస్థితి నెలకొంది. ఈ ప్రభుత్వం ఇంతవరకు రైతు భరోసా సొమ్ములు కూడా అందించలేదు.
– పీసీ ప్రభాకర్‌రెడ్డి, అరటి రైతు, కోమన్నూతల, లింగాల మండలం
ఎప్పుడూ చూడలేదు
పదేళ్లుగా అరటి సాగు చేస్తున్నా. ఏప్రిల్, మే నెలల్లో ఈదురు గాలులు, వర్షాలు కురిసే నాటికి పంట చేతికి వచ్చేది. ప్రస్తుతం పంట కోత దశకు వచ్చే సమయంలో మార్చిలోనే వడగళ్ల వానలు కురిశాయి. ఈదురు గాలులు వీచాయి. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. ఐదు ఎకరాలలో పంట సాగు కోసం రూ.10 లక్షల వరకు ప్రైవేట్ వ్యక్తుల వద్ద అప్పులు చేశా. ఊరు వదిలి వలస వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.
– పురుషోత్తంరెడ్డి, అరటి రైతు, కోమన్నూతల, లింగాల మండలం
రూపాయి కూడా వచ్చే పరిస్థితి లేదు..
అరటి రైతులకు పంటల బీమాను వర్తింపజేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఐదు ఎకరాలలో అరటి సాగు చేశా. 6,000 మొక్కలు అకాల వర్షాల వల్ల నేల కూలాయి. అరటి గెలలపై నల్లటి మచ్చలు ఏర్పడ్డాయి. రూపాయి కూడా వచ్చే పరిస్థితి లేదు.
– దినేష్‌కుమార్‌రెడ్డి, కోమన్నూతుల, లింగాల మండలం