రైతుల పట్ల ఇదేనా చిత్తశుద్ధి?: వైఎస్‌ జగన్‌ | YS Jagan Fires on CM Chandrababu Over Mirchi Farmers | Sakshi
Sakshi News home page

రైతుల పట్ల ఇదేనా చిత్తశుద్ధి?: వైఎస్‌ జగన్‌

Published Fri, Feb 21 2025 4:17 AM | Last Updated on Fri, Feb 21 2025 7:14 AM

YS Jagan Fires on CM Chandrababu Over Mirchi Farmers

సీఎం చంద్రబాబు తీరుపై వైఎస్‌ జగన్‌ ధ్వజం

ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి వెళ్లి.. రైతుల కోసం అన్నట్లుగా కలరింగ్‌ ఎందుకు? 

మీ లేఖలోనే.. మిర్చి గరిష్ట ధర రూ.27 వేలు పలికిందని చెప్పడం వాస్తవం కాదా? 

నాడు పెట్టుబడి ఖర్చులు రూ.లక్ష అయితే.. నేడు లక్షన్నరకుపైగా అవుతోంది 

ధరలు పడిపోవడంతో ప్రతి రైతు రూ.లక్షకు పైగా నష్టపోతున్నారు 

వారిని ఆదుకునేందుకు కొత్త మద్దతు ధరలు ఎందుకు ప్రకటించడం లేదు? 

రాష్ట్ర ప్రభుత్వమే ఎందుకు కొనుగోలు చేయడం లేదు?  

గతంలో ఎప్పుడైనా, ఏ రాష్ట్రంలోనైనా.. ‘‘నాఫెడ్‌’’ మిర్చిని కొనుగోలు చేసిందా? 

మీ చేతిలో ఉన్న మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనకుండా కేంద్రానికి లేఖలు రాయడం రైతులను నిలువునా మోసం చేయడం కాదా? 

కేంద్రంపై ఆధారపడకుండా మార్క్‌ఫెడ్‌ ద్వారా మిర్చిని కొనుగోలు చేయాలి 

నేను రైతులను కలుసుకుంటే ఎన్నికల కోడ్‌ అడ్డు వచ్చిందా?.. మరి 15న మీ మ్యూజికల్‌ నైట్‌కు కోడ్‌ అడ్డం రాలేదా?  

సాక్షి, అమరావతి: ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు వెళ్తూ.. మిరప రైతుల సమస్యలపై కేంద్రంతో చర్చించేందుకు వెళ్తున్నట్లు ఎందుకీ కలరింగ్‌..? ఎవరి కోసం ఈ కలరింగ్‌..? ఇదేనా రైతుల పట్ల మీ చిత్తశుద్ధి? అని ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) పై వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan mohan Reddy)ధ్వజమెత్తారు.

ఈ ప్రభుత్వం కష్టాల్లో ఉన్న అన్నదాతలను ఆదుకోవాల్సింది పోయి.. వారికి బాసటగా వెళ్లిన తమపై కేసులు బనాయించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. మిరప రైతుల విషయంలో టీడీపీ కూటమి సర్కారు వ్యవహరిస్తున్న తీరును తన ‘ఎక్స్‌’ ఖాతా ద్వారా ఎండగట్టారు. ట్వీట్‌లో వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

తెగుళ్లతో మిర్చి దిగుబడులు ఎకరాకు 10 క్వింటాళ్లకు పడిపోయిన దుస్థితి నెలకొంది. కొనేవారు లేక క్వింటాల్‌ రూ.10 వేలకు రైతులు తెగనమ్ముకోవాల్సిన పరిస్థితి. పెట్టుబడి ఖర్చులు చూస్తే ఎకరాకు రూ.1.50 లక్షల పైమాటే. కోతల అనంతర ఖర్చులు దీనికి అదనం. ఇంతటి సంక్షోభం కళ్లెదుట కనిపిస్తున్నా.. మేం స్పందించేంతవరకూ మీలో కదలిక లేదు. మీరు ఢిల్లీ నూతన సీఎం ప్రమాణ స్వీకారానికి వెళ్తూ.. మిర్చి రైతుల కోసమే వెళ్తున్నట్లు యథావిధిగా కలరింగ్‌ ఇస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్‌ ఎప్పుడూ, ఏ రాష్ట్రంలోనూ, ఎక్కడా మిర్చిని కొనుగోలు చేయలేదని తెలిసి కూడా లేఖ రాయడం ఏమిటి? మీ బాధ్యతను వేరేవాళ్ల మీద నెట్టడం ఏమిటి? మీరు చేయాల్సిన పనులు చేయకుండా సాకులు వెతుక్కోవడం ఏమిటి? 
ఈ రకంగా రైతులను మోసం చేస్తున్నారు. 

2021లో పెట్టుబడి ఖర్చులు ఎకరాకు రూ.లక్ష ఉన్నప్పుడు.. ఎకరాకు 20 క్వింటాళ్ల్లకుపైగా దిగుబడులు వచ్చినప్పుడు కనీస మద్దతు ధర రూ.7 వేలుగా నిర్ణయించాం. గతంలో మీరెప్పుడూ మిర్చికి కనీస మద్దతు ధరలు ప్రకటించలేదు. ఐదేళ్ల క్రితం.. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం మద్దతు ధర ప్రకటించని పంటలతోపాటు మరికొన్ని పంటలను అదనంగా చేర్చి మొత్తంగా 24 పంటలకు మద్దతు ధరలు ప్రకటించి పోటీ వాతావరణంతో ధరలు పడిపోకుండా అడ్డుకోవ­డమే కాకుండా ధరలు పెరిగేటట్టు చూశాం.

ఆ ధరలు ప్రకటించి ఇప్పటికి ఐదేళ్లు అయింది. మరి ఐదేళ్ల తర్వాత పెట్టుబడి ఖర్చులు పెరగవా? అప్పట్లో మిర్చి సాగుకు ఎకరాకు రూ.లక్ష ఖర్చు అయితే ఇప్పుడు రూ.లక్షన్నరకు పైగా వ్యయం అవుతున్న మాట వాస్తవం కాదా? దీనికి కోతల అనంతర ఖర్చులు అదనమన్న విషయం తెలుసుకోవాలి. ఇప్పుడు కొత్త మద్దతు ధరలు ప్రకటించి రైతులను ఆదుకోవడానికి మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? రాష్ట్ర ప్రభుత్వమే ఎందుకు కొనుగోలు చేయడం లేదు? 

మా హయాంలో (వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం) మిర్చి రైతులకు మంచి ధరలు వచ్చాయని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌కు రాసిన లేఖలో మీరే చెప్పారు. మీరు రాసిన లేఖ ప్రకారమే మా హయాంలో మిర్చికి మోడల్‌ ధర రూ.20 వేలు ఉంటే గరిష్ట ధర రూ.27 వేలు పలకడం వాస్తవం కాదా?

మిర్చి రైతుల కడగండ్లపై ఈ జనవరిలో ఉద్యాన శాఖ అధికారులు నివేదించిన తర్వాత అయినా మీరేమైనా కనీసం పట్టించుకున్నారా? మిర్చి రైతుల పరిస్థితి అన్యాయంగా ఉందని, ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని నివేదిక ఇచ్చినా ఎందుకు పట్టించుకోలేదు? పైగా తప్పుడు రాజకీయాలు చేస్తూ, మిర్చి కొనుగోళ్లతో సంబంధం లేని కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసి చేతులు దులుపుకొంటారా? మీ చేతిలో ఉన్న మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోళ్లు చేయకుండా ఎప్పుడూ మిర్చి కొనుగోళ్లు చేయని నాఫెడ్‌ ద్వారా కొనాలంటూ లేఖ రాయడం రైతులను నిలువునా మోసం చేయడం, మభ్యపెట్టడం కాదా? 

మిర్చి రైతులకు బాసటగా వెళ్లినందుకు మాపై కేసులు పెట్టారు. మరి ఫిబ్రవరి 15న మీరు పాల్గొన్న మ్యూజికల్‌ నైట్‌కు ఎన్నికల కోడ్‌ అడ్డం రాలేదా? నేను మిర్చి రైతులను కలుసుకుంటే ఎన్నికల కోడ్‌ అడ్డు వచ్చిందా? పైగా మేం ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. నిన్నటి కార్యక్రమంలో ఫలానా వారికి ఓటు వేయమని కూడా చెప్పలేదు. కనీసం మైక్‌లో కూడా మాట్లాడలేదు. అయినా అన్యాయంగా కేసులు మోపడం అప్రజాస్వామికం కాదా?

మీ హయాంలో పంటలకు కనీస మద్దతు ధరలు లభించడం లేదన్నది వాస్తవం కాదా? పత్తి, పెసర, మినుము, కంది, టమాటా, మిర్చి, మొన్న ధాన్యం సహా అన్ని పంటల రైతులకు కనీస మద్దతు ధరలు లభించక మీరే వారిని సంక్షోభంలో నెట్టిన మాట వాస్తవం కాదా?

మా హయాంలో ధాన్యం కొనుగోళ్లకు రూ.65 వేల కోట్లు ఖర్చు చేయడమే కాకుండా ఇతర పంటల కొనుగోళ్లకు దాదాపు మరో రూ.7,800 కోట్లు ఖర్చుచేసి రైతన్నలకు అండగా నిలిచాం.

రైతుల కోసం మేం సృష్టించిన మొత్తం వ్యవస్థలను మీరు నిర్వీర్యం చేశారు. ఆర్బీకేలు, ఈ క్రాప్, ఉచిత పంటల బీమా, సీజన్‌ ముగిసేలోగా ఇచ్చే ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఆర్బీకేల్లో కనీస మద్దతు ధరల పోస్టర్లు ప్రదర్శించే విధానం, సీఎం యాప్‌ ద్వారా కొనుగోలు చేసే విధానం, నాణ్యతను ధ్రువీకరిస్తూ ఆర్బీకేల ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను రైతులకు అందుబాటులోకి తెచ్చే విధానం, ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఇంటిగ్రేటెడ్‌ ల్యాబ్‌ల వ్యవస్థ, రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు కాల్‌సెంటర్, టోల్‌ ఫ్రీ నంబరును నిర్వహించే వ్యవస్థ, ఆర్బీకేల్లో కియోస్క్‌లతో రైతులకు తోడుగా నిలిచే విధానం, సున్నా వడ్డీ, పెట్టుబడి సహాయం, రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి.. ఇలా మొత్తంగా వ్యవసాయ రంగంలో మేం తెచ్చిన విప్లవాత్మక విధానాలు, వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారు. వ్యవసాయం దండగ అన్న మీ ఆలోచన, మైండ్‌ సెట్‌ ఏమాత్రం మారలేదు చంద్రబాబూ!

మీ తప్పుడు కేసులకు భయపడి ప్రజా పోరాటాలు ఆపేది లేదు. నేను రైతుల పక్షపాతిని, ప్రజల పక్షపాతిని. మీరు ఎన్ని కేసులు బనాయించినా రైతుల కోసం, ప్రజల కోసం కచ్చితంగా నిలబడతా. చంద్రబాబూ..! ఇప్పటికైనా తక్షణమే మిర్చి రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకోండి. ఈ సంక్షోభం నుంచి అన్నదాతలు బయట పడేలా, వారికి ఊరటనిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వెంటనే కొనుగోళ్లు ప్రారంభించండి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement