
నెల్లూరు: కూటమి ప్రభుత్వ పాలనలో స్కీమ్స్ అనేవే లేకుండా పోయాయని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన కాకాణి.. ‘కూటమి ప్రభుత్వంలో స్కీమ్స్ లేకుండా.. స్కామ్ లే కనిపిస్తున్నాయి.. అభివృద్ది పేరిట అవినీతే ఎక్కువగా కనిపిస్తోంది. జ్యుడీషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ విధానానికి ప్రభుత్వం మంగళం పాడుతోంది.
కాంట్రాక్ట్ పనులను తనవారికి కట్టబెట్టేందుకు చంద్రబాబు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారు. గత ప్రభుత్వంలో రివర్స్ టెండరింగ్ ద్వారా పోలవరం ప్రాజెక్ట్ లో 800 కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. 7500 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయాన్ని తీసుకొచ్చాం.
ఈ విధానాన్ని నీతి అయోగ్ కూడా అభినందించింది. పథకం ప్రకారం చంద్రబాబునాయుడు దోపిడికి పాల్పడుతున్నారు. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో తన వారికి చంద్రబాబునాయుడు కాంట్రాక్ట్ పనులు అప్పగించాడు. కాంట్రాక్ట్ విధానం లోపబూయిష్టంగా ఉంది. రివర్స్ టెండరింగ్ విధానాన్ని కొనసాగించండి. అమరావతి నిర్మాణం పేరిట అభివృద్దిలో అవినీతి కనిపిస్తోంది. ప్రజాధనం దోపిడికాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదుంది’ అని పేర్కొన్నారు.
