ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఒక ప్రకటన తమాషాగా ఉంది. పాలన ఎలా ఉండాలో చూపిస్తాం అని ఆయన అన్నారని ఈనాడు మీడియా ఒక హెడింగ్ పెట్టింది. ఈ డైలాగు చదివితే ఒక సినిమా సన్నివేశం గుర్తుకు వస్తుంది. తీస్తా..నాలో ప్రతిభ అంతటిని వెలికితీస్తా..అంటూ ఒక టివీ చానల్ ప్రోగ్రాం హెడ్‌గా నటించిన బ్రహ్మానందం చానెల్ యజమానికి చెబుతారు. మహద్బాగ్యం అని ఆ యజమాని సంతోషపడతారు..ఇది వినడానికి సరదాగా, హాస్యంగా ఉన్నప్పటికీ, ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ప్రకటనలు అదే మాదిరిగా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. చంద్రబాబు ఇప్పుడు కొత్తగా పాలన చేస్తున్న వ్యక్తి ఏమీ కాదు.. ఇప్పటికే పద్నాలుగేళ్లు సీఎంగా పనిచేశారు. మరోసారి ఆయనకు అవకాశం వచ్చింది.
ఆకాశమే హద్దుగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఇచ్చిన వాగ్దానాలను ఏ విధంగా అమలు చేసేది చెప్పకుండా పాలన ఎలా ఉండాలో చూపిస్తాం అని ఆయన అంటుంటే అది ఎలా ఉంటుందా? అని టీడీపీ నేతలే ఆశ్యర్చపోతున్నారు. ఇప్పటికే రెండు నెలల పాలన పూర్తి అయింది. దానిని జనం స్వయంగా చూశారు. హింసాకాండ, విధ్వంసకాండకు ఏపీ చిరునామాగా మారింది. ఇదేనా ఆ పాలన? ఎలా ఉండాలో చూపించడం అంటే అని ఎవరికైనా సందేహం రావచ్చు. ఆయన రాష్ట్రంలో ఎక్కడకు పర్యటనకు వెళ్లినా, తాను ఏమి చేసేది చెప్పకుండా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపైన, మాజీ ముఖ్యమంత్రి జగన్ పైన ఉన్నవి,లేనివి కలిపి విమర్శలు గుప్పించడం, గత ఐదేళ్లు రాష్ట్రం ఏదో నాశనమైపోయిందని ప్రచారం చేయడానికే ఆయన టైమ్ అంతా సరిపోతోంది.
చరిత్రలో ఎన్నడూ చూడని నష్టాలను గడచిన ఐదేళ్లలో రాష్ట్రం చూసిందపి ఆయన అంటున్నారు. అదెలాగో చెప్పరు. విధ్వంసం అంటే జగన్ తాను ఇచ్చిన హామీలను నెరవేర్చడమా?. రాష్ట్రంలో నాలుగు కొత్త ఓడరేవులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు, పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు తేవడం, మూడున్నర లక్షల కోట్ల రూపాయల విలువైన పరిశ్రమలకు శ్రీకారం చుట్టడం వంటివి రాష్ట్రానికి నష్టం కలిగించాయా?వీటి గురించి ప్రస్తావించి ఏ రకంగా జగన్ టైమ్ లో రాష్ట్రానికి నష్టం జరిగిందో వివరిస్తే అర్ధం ఉంటుంది. అలాకాకుండా లేనిపోని పిచ్చి ఆరోపణలు చేస్తే జనానికి ఏమి ఉపయోగం. ఒకవైపు చాలా హామీలు ఇచ్చాం కాని, ఖజానా ఖాళీగా ఉందని చంద్రబాబే చెబుతారు. ఇది ప్రజలను మోసం చేయడం కాదా?అని ఎవరైనా అడిగితే ఆయన కస్సుమనవచ్చు.రిషికొండలో ప్రభుత్వ భవనాన్ని నిర్మిస్తే తప్పు పడుతుంటారు.
మరి అమరావతి పేరుతో అవసరం ఉన్నా,లేకపోయినా భారీ టవర్ల నిర్మాణం ఎందుకు చేపడుతున్నారో చెప్పరు. ఆయన చేస్తే అభివృద్ది..ఎదుటివారు చేస్తే విలాసం అన్నమాట. ఒకవేళ జగన్ ఇచ్చిన హామీల అమలు వల్ల రాష్ట్రం నష్టపోయిందని,ధ్వంసం అయిందని చంద్రబాబు చెప్పదలిచారా?అది కరెక్టు అయితే తాను ఏకంగా జగన్ కంటే మూడు రెట్ల అధికంగా హామీలు ఇచ్చారు కదా?అప్పుడు ఇంకెంత విధ్వంసం అవుతుంది?తాను ఇచ్చిన సూపర్ సిక్స్ ఏ రకంగా అమలు చేసేది చెబితే అప్పుడు చంద్రబాబును సెహబాష్ అని అనవచ్చు.
అది చెప్పకుండా మిగిలిన కధలు ఎన్ని చెబితే జనం ఎందుకు నమ్ముతారు? పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచడం మినహ ఆయన నెరవేర్చిన హామీలేమిటో చెప్పే పరిస్థితి లేదు. అప్పులపై ఎన్నికలకు ముందు ఎన్ని రకాల అసత్యాలు ప్రచారం చేశారు?ఇప్పటికీ అవే అబద్దాలను ఎందుకు కొనసాగిస్తున్నారు?ఇదేనా పాలన అంటే ఏమిటో చూపించడం అంటే!ఉచిత ఇసుక అని ప్రకటించినా , ఏదో రూపంలో డబ్బులు వసూలు చేస్తుండడం కూటమి పాలనను రుచి చూపించడం. జగన్ ప్రభుత్వం నిల్వచేసిన ఇసుక సుమారు నలభై లక్షల టన్నుల మేర టీడీపీ, జనసేన క్యాడర్ దోచుకోవడం ద్వారా కూటమి పాలన ఎలా ఉందో చూపించారు కదా! .మహిళలకు నెలకు పదిహేను వందల చొప్పున ఇచ్చి చూపిస్తే , పాలన ఎలా ఉండాలో చూపించడం అవుతుంది.
రైతులకు ఇవ్వవలసిన ఇరవైవేల రూపాయల భరోసా ఇచ్చి ఉంటే ఇది పాలన అంటే జనం ఒప్పుకోవచ్చు. తల్లికి వందనం పేరుతో విద్యార్ధులకు చెల్లించవలసిన పదిహేనువేల రూపాయలను ఈ ఏడాది ఎగవేయకుండా ఉంటే దానిని కదా పాలన ఎలా ఉండాలో చూపించడం అంటే! నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయల సంగతి ఏమైంది?వలంటీర్లకు పదివేల రూపాయల గౌరవ వేతనం ఏమైంది!ఇలా అనేక వాగ్దానాలను తన అనుభవంతో అమలు చేసి చూపించినట్లయితే, పాలన ఇలా ఉండాలి కదా..అని జనం అనుకుంటారు.వీటన్నిటిని పక్కనబెడితే జగన్ పై ,సాక్షి మీడియాపైన దుష్ప్రచారం చేస్తే ప్రజలకు ఏమి ఒరుగుతుంది. సాక్షి మీడియాకు ఇచ్చిన ప్రభుత్వ ప్రచార ప్రకటనలను ఆయన తప్పు పడుతున్నారు. ఏ ప్రభుత్వం అయినా తన కార్యక్రమాలను ప్రచారం చేయడానికి మీడియాలో అడ్వర్టైజ్ మెంట్స్ ఇస్తుంటుంది.
చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజులకే ఈనాడు అధినేత రామోజీరావు సంస్మరణార్ధం పన్నెండు కోట్లు ఖర్చు పెట్టిన వైనం గురించి ఏమి చెబుతారు?. 201419 మధ్య ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియాలకు ఎన్ని వందల కోట్లు ఖర్చు చేసింది?సాక్షి మీడియాకు ఎంత మొత్తం ఇచ్చింది పోల్చి చెప్పి ఉంటే చంద్రబాబు కొంతలో కొంత నిజాయితీగా మాట్లాడినట్లు అయ్యేది.ఆంధ్రజ్యోతి మీడియాకు అర్హత లేకపోయినా వందల కోట్లు చెల్లించినవైనంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చేవి. అయినా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం సాక్షి మీడియాపై బురద చల్లుతున్నారు.చంద్రబాబు ఒక వైపు తాను సంపద సృష్టిస్తానని అంటారు. మరో వైపు ఆర్ధికంగా స్థితిమంతులైన ప్రతి ఒక్కరు పాతిక మందిని వృద్దిలోకి తెచ్చేందుకు సహకరిస్తే సమాజంలో పేదరికం అనేది లేకుండా పోతుందని చంద్రబాబు కొత్త ధీరీ చెబుతున్నారు.
ఆయన కుటుంబం స్థితిమంతమైనదే కదా!ఎంతమందిని స్వయంగా పైకి తీసుకు వచ్చారో చెబితే జనానికి కాస్త అయినా నమ్మకం కుదిరేది కదా!రాయలసీమకు పరిశ్రమలు, నీటి ప్రాజెక్టుల గురించి ఎప్పటి మాదిరే ఉపన్యాసాలు ఇవ్వడం కాకుండా ఆచరణ చేసి చూపించాలి తప్ప జగన్ పై దూషణలకు దిగితే ఉపయోగం ఏమి ఉంటుంది?గతంలో చంద్రబాబు లక్షకోట్ల రూపాయల రైతులు, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తామని చెప్పి తీరా ఆచరణలో చేతులెత్తేశారు. ఇప్పుడు కూడా ఆ దిశలోనే చంద్రబాబు పాలన సాగుతోందని ఆయన మాటలను బట్టే అర్ధం అవుతుంది.పైగా సంక్షేమం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని సుభాషితాలు వల్లె వేస్తున్నారు.
అది నిజమే అయితే సూపర్ సిక్స్ పేరుతో, ఎన్నికల ప్రణాళిక పేరుతో లెక్కకు మిక్కిలిగా వాగ్దానాలు ఎందుకు చేశారో చెప్పాలి కదా?అసలు సమస్య ఏమిటంటే.. చంద్రబాబుకు భవిష్యత్తు అంతా భయానకంగా కనిపిస్తోంది. తన పాలన తీరు ద్వారా ప్రజలలో ఎలాంటి వ్యతిరేకత వస్తుందో ఆయనకు అర్ధం అవుతోంది.అందుకే ఒక వైపు పాలన ఎలా ఉండాలో చూపిస్తాం..అంటూ మరో వైపు తనకు హామీలు అమలు చేసే శక్తి లేదని పరోక్షంగా అంగీకరిస్తూ భయమేస్తోందని చెబుతున్నారు. అదే ఆయన చూపించబోయే పాలన అని జనం అనుకుంటే తప్పు ఏమి ఉంటుంది!
:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment