బాబూ ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ
100 రోజులైనా ఒక్క పథకమూ అమలు కాలేదు
‘ఆరు’ నూరైనా అమలు చేయాలంటున్న జనం
నేను మారిన మనిషిని. ప్రజల మనిషినంటూ నరం లేని నాలుకలా వరాలు గుప్పించడం.. అందలమెక్కాక అబ్బే సాధ్యం కాదంటూ మాట మార్చేయడం చంద్రబాబుకు బాగా అలవాటైన విద్య.ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అంటూ కొండంత రాగం తీసిన చంద్రబాబు, పవన్ .. అధికారంలోకి వచ్చాక సూపర్ సిక్స్ కొట్టలేం.. డకౌట్ అయిపోతామంటూ చేతులెత్తేస్తున్నారు.ఎండమావులు దప్పిక తీర్చవు.. చంద్రబాబు మాటలేవీ వాస్తవాలు కావన్నది రాష్ట్రంలోని ఐదుకోట్ల మందికీ తెలుసు. కానీ.. సూపర్‌సిక్స్ పేరుతో ‘మాయ’ఫెస్టో తీసుకొచ్చి.. ఒక ఎత్తు కాకపోతే.. మరో ఎత్తు.. ఒక వ్యూహం కాకపోతే మరో వ్యూహం అన్నట్లుగా.. హామీల వర్షం కురిపించేసి జనంతో ఓట్లు వేయించుకున్నారు. అధికారంలోకి వచ్చి 100 రోజులు కావస్తున్నా.. హామీలు అమలు చేయకుండా మెల్లగా జారుకుంటున్నారు.
సాక్షి, విశాఖపట్నం: అధికారంలోకి రాకముందు ఒక మాట.. వచ్చిన తర్వాత మరో మాట.. ఇదీ చంద్రబాబు నైజం. నోటికొచ్చిన హామీలిచ్చి.. వాటిని తుంగలో తొక్కడం.. లేదంటే.. నిబంధనల చట్రంలో బందీలుగా మార్చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. సూపర్ సిక్స్‌తో విప్లవాత్మక మార్పులు వస్తాయంటూ ఊదరగొట్టి.. ఇప్పుడు అమ్మో భయమేస్తోంది.. సిక్స్ కొట్టడం సాధ్యం కాదు.. ప్రజలంతా గమనించాలంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతూ కాలక్షేపం చేస్తున్నారు. తల్లులందరికీ వందనమంటూ వంగి వంగి నమస్కారాలు పెట్టిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక ఈ ఏడాది కాదు.. వచ్చే ఏడాదంటూ తెగేసి చెప్పేశారు. ఇంటికో ఉద్యోగమంటూ ప్రతి చోటా ఊకదంపుడు ఉపన్యాసమిచ్చిన బాబు.. ఇప్పుడు ఇంటికో అబద్ధమనే పథకాన్ని ప్రారంభించారు. నిరుద్యోగులకు భృతి అంటూ మరోసారి బూటకపు మాటలతో బురిడీ కొట్టించి.. యువత ఆశలపై నీళ్లు చల్లారు. ప్రతి మహిళకూ ఆర్థిక ఆసరా కల్పిస్తామంటూ ఇచ్చిన హామీ అమలుకు అతివలు ఆశగా ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొంది. ఉచిత గ్యాస్ సిలిండర్లు ఎప్పుడొస్తాయా అంటూ ఏజెన్సీల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. బస్సెక్కిన ప్రతిసారీ ఫ్రీ ఎప్పుడని మహిళలంతా అడుగుతున్నారు.
నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనం
వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో సంక్షేమం ఇంటింటి తలుపు తట్టింది. ఇచ్చిన హామీ ప్రకారం సంక్షేమ క్యాలెండర్ ఏర్పాటు చేసి హామీలు అమలు చేశారు. అమ్మ ఒడి, రైతు భరోసా, చేయూత, ఆసరా.. ఇలా ఒకటా రెండా.. ఇచ్చిన ప్రతి హామీ అమలైంది. ఇంటింటా
సంక్షేమం వెల్లివిరిసింది.
ఉచిత బస్సు వస్తుందా?
ఎన్నికల్లో చంద్రబాబు మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం అని హామీ ఇచ్చారు. కూటమి నాయకులు దీనిపై విస్తృతంగా ప్రచారం చేశారు. పక్క రాష్ట్రాల్లో ఏ విధంగా అమలు చేస్తున్నారో చూస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు కావస్తోంది. ఇప్పటికీ ఉచిత బస్సు ప్రయాణం అమలు కాలేదు. అసలు ఉచిత బస్సు ప్రయాణం ఉన్నట్టా? లేనట్టా?
– మరడాన మంగ, మహారాణిపేట
ఇంకా సిలిండర్ రాలేదు
నిత్యావసర ధరలు పెరగడంతో కుటుంబ పోషణ తలకు మించిన భారం అవుతోంది. ఈ సమయంలో ప్రతీ ఇంటికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇవ్వడంతో చాలా సంతోషించాం. మా వరకు ఏడాదికి 11 వరకు గ్యాస్ సిలిండర్లు అవసరమవుతాయి. గ్యాస్ సిలిండర్లు అందిస్తే ఉపశమనంగా ఉంటుంది. ప్రభుత్వం స్పందించాలి.
– వియ్యపు నాగమణి, త్రినాథపురం
అమ్మ ఒడితో అండగా నిలిచారు
నాకు ఇద్దరు పిల్లలు. కుమారుడు ఇంటర్, కుమార్తె 8వ తరగతి చదువుతోంది. తల్లికి వందనం పథకం ద్వారా ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున ఇస్తామని చెప్పారు. పాఠశాలలు ప్రారంభమై దాదాపు నాలుగు నెలలవుతోంది. తల్లికి వందనం పథకం ద్వారా రూ.30 వేలు వస్తుందని ఆశపడ్డా. ఇంత వరకు ఈ పథకం ఊసే లేదు. గత ప్రభుత్వంలో అమ్మ ఒడి పథకాన్ని నిరీ్ణత సమయానికి అమలు చేసి
అండగా నిలిచారు.
– కూండ్రపు అరుణ, మంగప్పయ్యగారివూరు, పరవాడ మండలం
మే లోనే సాయం అందించారు
జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఐదేళ్లూ క్రమం తప్పకుండా అమలు చేశారు.
ముఖ్యంగా రైతులను అన్ని విధాలా ఆదుకున్నారు. పెట్టుబడి సాయం, ఈ క్రాప్ నమోదు, రైతు భరోసా కేంద్రాలు, పంటల బీమా, పంట గిట్టుబాటు ధర, పంటల కొనుగోలుతో అండగా నిలిచారు. ఖరీఫ్ పంట కాలానికి సంబంధించి మేలోనే మొదటి విడతగా రైతులకు పెట్టుబడి సాయం అందించేవారు. ఏడాదికి రూ.13,500 సాయం రైతులకు అందేది. దీంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాగు చేసుకునేవాళ్లం.
– చిల్ల వెంకటరమణ, చిప్పాడ
‘తల్లికి వందనం’ ఊసేలేదు?
నాకు ఇద్దరు పిల్లలు. పాప నాలుగో తరగతి, బాబు 8వ తరగతి చదువుతున్నాడు. కూటమి అధికారంలోకి వస్తే తల్లికి వందనం ద్వారా ఒక్కొక్కరికి రూ.15వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఇంతవరకు తల్లికి వందనం పథకానికి సంబంధించి ఉలుకూ.. పలుకూ లేదు. ఫీజులు కట్టాలని పాఠశాల యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నా యి. తల్లికి వందనం డబ్బులు ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో అమ్మఒడి ద్వారా ఎంతో ప్రయోజనం పొందాను.
– టి.వరలక్ష్మి, పాతకొవ్వాడ
రూ.1,500 ఎప్పుడిస్తారు?
మాకు ఇద్దరు అబ్బాయిలు. ఇంటర్ చదువుతున్నారు. నా భర్త ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అద్దె ఇంట్లో ఉంటున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 19 నుంచి 59 ఏళ్ల మధ్య గల ప్రతీ మహిళకు నెలకు రూ.1,500 ఇస్తామన్నారు. ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తారనే కూటమికి ఓటు వేశాం. ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిందే.
– మీసాల జయలక్షి్మ, సత్యానగర్
భృతి అందేదెప్పుడో?
నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. గతంలో ప్రైవేట్ జాబ్ చేసేవాడిని. ఎన్నికల్లో గెలిస్తే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు/నెలకు రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు, లోకేష్ హామీ ఇవ్వడంతో.. పోటీ పరీక్షలపై దృష్టి సారించాను. ప్రభుత్వం నిరుద్యోగభృతిపై ఊసే ఎత్తడం లేదు. కోచింగ్ సెంటర్, స్టడీ మెటీరియల్‌కు ఎంతో ఖర్చు అవుతోంది. ఇదంతా కుటుంబానికి ఆర్థికంగా భారం. వెంటనే నిరుద్యోగ భృతి అందజేయాలి.
– కందుల సంతోష్ 62వ వార్డు
రైతుకు సాయం దక్కదా?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాత సుఖీభవ పేరిట రైతులకు రూ.20 వేలు ఇస్తామన్న హామీ ఇంకా అమలుకు నోచుకోలేదు. మేము వరి, కొబ్బరి, మొక్కజొన్న, అరటి సాగుచేస్తున్నాం. ఈ ఏడాది ప్రభుత్వ సాయం అందకపోవడంతో అప్పులు చేయాల్సి వచ్చింది. వెంటనే ప్రభుత్వం పెట్టుబడి సాయం అందజేయాలి.
– నగిరెడ్ల రాంబాబు, వలందపేట
Comments
Please login to add a commentAdd a comment