ఆంధ్రప్రదేశ్‌లో సూపర్ సిక్స్ అమలు చేయడానికి సంపద సృష్టిస్తాం.. ఇది టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు పదే,పదే చేసిన ప్రచారం. ఆయనకు మద్దతు ఇస్తూ చంద్రబాబుకు ఎంతో అనుభవం ఉందని జనసేన అధినేత ,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉపన్యాసాలు ఇచ్చేవారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంటే ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని చంద్రబాబు, పవన్‌లు అంటున్నారు.. పైగా సంపద సృష్టిస్తామంటున్నారు. అంటే అప్పులే చేయకుండానే ఇవన్నీ చేస్తారు కాబోలు!. రాష్ట్రానికి అదే మేలు" కదా అని చాలా మంది అనుకున్నారు.
ఎలాగైతేనేం చంద్రబాబు, పవన్‌లు బీజేపీతో కలిసి అధికారంలోకి వచ్చారు. ఇబ్బడి ,ముబ్బడిగా సంపద రెడీ అయిపోతుందని ఆశించినవారు ఇప్పుడు బిత్తరపోతున్నారు. ఇరవైరోజుల్లోనే ఏడువేల కోట్ల రూపాయల అప్పు చేశారు. ఇది ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి తెలుగుదేశం మీడియాకు పెద్ద వార్త కాలేదు. గత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అవసరార్దం వెయ్యి కోట్లు రుణం సేకరించినా, ఇంకాస్త ఎక్కువ తీసుకున్నా,చాలా ఘోరం జరిగిపోతున్నట్లు, ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నట్లు విపరీతమైన ద్వేష ప్రచారం చేశారు. కాని ఇప్పుడు ఇరవై రోజుల్లోనే ఏకంగా ఏడువేల కోట్ల అప్పు చేస్తే అదసలు లెక్కే కాదన్నట్లుగా ఆ మీడియా వ్యవహరిస్తోంది. అంతేకాదు..జూలై నెలలో మరో తొమ్మిది వేల కోట్ల రూపాయల రుణానికి టీడీపీ ప్రభుత్వం సిద్దమవుతోంది. చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లు అయితే ఈ అప్పుల గురించి నోరు తెరిస్తే ఒట్టు.
నిజంగా వారికి ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా అప్పు తెచ్చిన ప్రతిసారి చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లు మీడియా సమావేశం పెట్టి ,తాము ఎందుకు అప్పు చేశామో ప్రజలకు వివరించాలి. దానిని సంపద సృష్టికి వాడారా?లేక సంక్షేమ స్కీములకు వాడారా అన్నది చెప్పాలి. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి టైమ్ లో స్కీములు అమలు చేస్తుంటే, డబ్బును పప్పు ,బెల్లాల మాదిరి పందారం చేస్తున్నారని, బటన్ నొక్కుడు తప్ప ఇంకేమి చేస్తున్నారని దుష్ప్రచారం చేసేవారు. అదే టైమ్ లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేసిన స్కీములకన్నా మూడు రెట్లు అధికంగా వెల్ఫేర్ పధకాలు ప్రజలకు ఇస్తామని, దానికి సూపర్ సిక్స్ అని పేరు పెట్టి ఊదరగొట్టారు. బహిరంగ సభలలో కన్నా, వీటిపై కరపత్రాలు ముద్రించి ఇంటింటికి పంపిణీ చేశారు. ప్రస్తుతం మంత్రి అయిన నిమ్మల రామానాయుడు వంటివారు ప్రతి గృహానికి వెళ్లి అక్కడ ఎంత మంది పిల్లలు ఉంటే, వారందరికి నీకు పదిహేనువేలు, నీకు పదిహేనువేలు అంటూ,పద్దెనిమిదేళ్ల వయసు దాటిని మహిళ కనిపిస్తే నీకు పద్దెనిమిది వేల రూపాయలు అంటూ తెగ ప్రచారం చేశారు. సంబంధిత వీడియో వైరల్ కూడా అయింది.
ఈ సంగతి పక్కనబెడితే.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెంచిన వృద్దాప్య పెన్షన్ నాలుగువేల రూపాయలను కొందరు ఇళ్లకు వెళ్లి పంపిణీ చేశారు. ఇదిపాత స్కీమే అయినా వెయ్యి రూపాయలు పెంచారు. కనుక బాగానే హడావుడి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల సిబ్బంది,ఇతర ఉద్యోగుల ద్వారా ఇంటింటికి పంపించారు. టీడీపీ కార్యకర్తలంతా దీనిని ఒక రాజకీయ కార్యక్రమంగా మార్చేశారు. అది వేరే విషయం.పెన్షన్ తో పాటు మూడు నెలల బకాయి మూడువేల రూపాయలు కూడా ఇచ్చారు.ఈ ఏడువేల రూపాయలను సుమారు అరవైఐదు లక్షల మందికి పంపిణీ చేయడానికి గాను సుమారు 4550 కోట్ల వ్యయం అవుతుంది. ఇదే టైమ్ లో దివ్యాంగులకు, కిడ్నీ బాధితులు,ఇతర అర్హులైన వర్గాల వారికి కూడా పెరిగిన పెన్షన్ ఇచ్చారు. దీనికి అయ్యే వ్యయం మరికొన్ని కోట్లు ఉంటుంది.
ఈసారి బకాయిలు కూడా చెల్లించవలసి వచ్చినందున ఈ స్థాయిలో ఖర్చు అయినా, వచ్చే నెల నుంచి కొంత తగ్గి సుమారు రూ.2,600 కోట్ల వ్యయం అవుతుంది.ఇది కూడా చాలా ఎక్కువే. గతంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రెండువేల రూపాయల పెన్షన్ ను మూడువేల రూపాయలు చేసి ఏడాదికి 250 రూపాయల చొప్పున పెంచుతూ అమలు చేసింది. దానికి సుమారు రూ.1,800 కోట్ల వరకు అయ్యేది. విశేషం ఏమిటంటే చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లు ఇచ్చిన మరో హామీ ప్రకారం బీసీలకు ఏభై ఏళ్లకే పెన్షన్ సదుపాయం కల్పించాలి.చంద్రబాబు వీటిలో కోతలుపెట్టకుండా అది కూడా ఇస్తే బహుశా నెలకు రూ.3,500 కోట్ల వరకు వెళ్లవచ్చు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు,పెన్షన్ లకు సుమారు రూ.4,500 కోట్లు అవవుతుంది. అంటే ఈ రెండు పద్దుల కిందే సుమారు ఏడెనిమిది వేల కోట్ల రూపాయల వ్యయం అవుతుందన్నమాట.
ఇదీ చదవండి: ఒక్క రోజే రూ.5,000 కోట్ల అప్పు
ఇవి కాకుండా అనేక ఇతర స్కీములు, ప్రభుత్వపరంగా ఉండే ఇతర వ్యయాలు ఉంటాయి. ఇవన్నీ లెక్క వేస్తే పదివేల కోట్ల రూపాయల అంచనా దాటిపోతుంది. కేవలం ఒక్క హామీ అమలుకే ఇంత మొత్తం ఖర్చు అయితే, ఇక సూపర్ సిక్స్ లోని ఇతర స్కీముల అమలుకు ఇంకెంత కావాలో గణించుకోవచ్చు. బహుశా నెలకు పదిహేనువేల కోట్ల రూపాయల వరకు అవుతుందేమో తెలియదు.
కాకపోతే చంద్రబాబు తెలివిగా వాటన్నిటిని అలవాటు ప్రకారం ఎగవేస్తే చెప్పలేం. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కాని, కేంద్రం నుంచి వచ్చే వాటా,సాయం కాని అన్ని కలిపినా పది,పన్నెండు వేల రూపాయలు మించి ఉండకపోవచ్చు. అప్పుడు అప్పులు చేయక తప్పని స్థితి ఏర్పడుతుంది.కేవలం ఒక స్కీము అమలు చేసినందునే ఏడువేల కోట్ల అప్పు చేస్తే, మరి మిగిలిన స్కీముల కోసం ఎంత డబ్బు సమీకరించాలి?ఎంత అప్పు చేయాలి?దీని గురించి చంద్రబాబు లేదా ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ వివరణాత్మకంగా చిత్తశుద్దితో చెబితే మెచ్చుకోవచ్చు.
కాని వారు అలా చేసే అవకాశం ఉండదు. పైగా శ్వేతపత్రాల పేరుతో అసత్యాల పత్రాలను ప్రజలకు పంపిణీ చేస్తున్నారు.అది వేరే కధ. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తే అప్పులపాలు అయిందని ప్రచారం చేసిన చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లు ఇరవై రోజులలోనే ఎందుకు ఇంత అప్పు చేశారు?ఈ రకంగా ప్రతి నెల రుణం తీసుకుంటే ఏడాదికి సుమారు తొంభైవేల కోట్ల నుంచి లక్ష కోట్ల అప్పు చేయడానికి సిద్దపడుతున్నారా?లేదా ఆ మేరకు సంపద సృష్టిస్తారా? ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి.
2019 లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నుంచి దిగిపోయే టైమ్ కు ఖజానాలో వంద కోట్లే ఉంది. అదే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మారే నాటికి సుమారు 5500 కోట్ల నిధులు ఉన్నాయట.దీని గురించి వారు మాట్లాడరనుకోండి. ఈ మొత్తం కాకుండా ప్రతిరోజు వచ్చే పన్నులు,పన్నేతర ఆదాయం ఉండనే ఉంటుంది. ఇవేవి చాలక ఏడువేల కోట్ల రూపాయల అప్పు చేశారు.
అన్నింటికి జిందాతిలిస్మాత్ మాదిరి.. అమరావతిని అభివృద్ది చేస్తామని, ఆ తర్వాత భూములు అమ్మి వేలు,లక్షల కోట్లు పంపాదిస్తామని, అదే సంపదని తెలుగుదేశం నేతలు ప్రచారం చేశారు. భూములు అమ్మితే లక్షల కోట్ల ఆదాయం వస్తుందో,రాదోకాని, ముందుగా ఆ ఏభైఐదువేల ఎకరాలు అభివృద్ది చేయడానికి సుమారు లక్షన్నర కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. ఆ మొత్తాన్ని ఎక్కడ నుంచి తెస్తారో వీరు చెప్పడం లేదు. ఇంకా ఏ రకంగా సంపద వస్తుందో వీరు ఇంతవరకు వెల్లడించలేదు. పాతాళభైరవి సినిమాలో మాంత్రికుడి మాదిరి చంద్రబాబు, పవన్ లు డబ్బును ఏమైనా సృష్టించే అవకాశం ఉందా?అన్న సందేహం రావచ్చు.అది సాధ్యం కాదన్న సంగతి తెలిసిందే.
ఈ మొత్తం ప్రక్రియలో అయితే సూపర్ సిక్స్ పేరుతో ప్రకటించిన లక్షల కోట్ల రూపాయల విలువైన స్కీములను ఎగవేయాలి. అంటే ప్రజలను మోసం చేయాలి. లేక మభ్య పెట్టాలి. లేదంటే అప్పులు మరింతగా తెచ్చి వాటిని అర్హులందరికి పంచిపెట్టాలి. అది కూడా బటన్ నొక్కుడు కిందే వస్తుంది కదా?అప్పుడు ఏపీ రెండు శ్రీలంకలు అవుతుంది కదా! అయినా ఫర్వాలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి అంతా బ్రహ్మండంగా ఉన్నట్లు, ఆయన అప్పుల ద్వారా సంపద సృష్టించడంలో చాలా శ్రమపడుతున్నట్లు పిక్చర్ ఇచ్చే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా ఉంది కనుక ఏమి చేసినా వారికి పచ్చగానే కనపడవచ్చు.కాని ప్రజలకు అలా కనిపిస్తుందా? అంటే చెప్పలేం. పాత వృద్దాప్య పెన్షన్ స్కీములో వెయ్యిరూపాయలు పెంచి అమలు చేశాం కనుక సూపర్ సిక్స్ అయిపోయినట్లేనని ప్రచారం చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు సుమా!.
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment