
తాడేపల్లి,సాక్షి: సీఎం చంద్రబాబు పర్యటనలు సినిమా షూటింగులను తలపిస్తున్నాయని మాజీ ఎంపీ నందిగం సురేష్ మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
సెక్యూరిటీ లేకుండా చంద్రబాబు జనాల్లో తిరిగే పరిస్థితి లేదు. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దళితుల మేలు కోరి అనేక పథకాలను అమలు చేశారు. కానీ చంద్రబాబు రౌడీరాజ్యం కొనసాగిస్తున్నారు. పథకాలు అడిగితే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు.
రాజధానిలో వరద వస్తే మునిగే ఐనవోలు ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలని చంద్రబాబు చూశారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రాజధాని వరద ప్రాంతం నుండి విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
దళితులు,అంబేద్కర్ మీద వైఎస్ జగన్‌కు ఉన్న ప్రేమ అది. చంద్రబాబుకు అధికారం రాగానే మా కుటుంబంపై దాడి చేశారు. టీడీపి కార్యకర్తలు నా భార్యని కాలితో తన్నారు. త్వరలోనే ఆ వీడియోలు బయటపెడతా. ఇదేనా చంద్రబాబూ దళితుల మీద మీకు ఉన్న ప్రేమ? దళితుల మీద కక్షసాధిస్తూ పైకి కపట ప్రేమను చూపించొద్దు. చంద్రబాబు పర్యటనలు సినిమా షూటింగులను తలపిస్తున్నాయి. దళితుల గురించి చంద్రబాబు, పవన్, లోకేష్ బహిరంగంగా విమర్శలు చేశారు. ఇలాంటి వారికి దళితులే సరైన గుణపాఠం చెప్తారు’అని స్పష్టం చేశారు.
