బాబు మాటలు నేతి బీర చందమే! | Kommineni Srinivasa Rao Comments On Chandrababu Naidu Super Six Promises, More Details Inside | Sakshi
Sakshi News home page

బాబు మాటలు నేతి బీర చందమే!

Published Tue, Oct 15 2024 12:04 PM | Last Updated on Tue, Oct 15 2024 12:15 PM

Kommineni Comments On Chandrababu Super Six Promises

బీరాలు పలకడం ఎలాగో ఎవరైనా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని చూసి నేర్చుకోవాలి. ప్రతిపక్షంలో ఉంటే బెదిరించడం, అధికారంలో ఉంటే దబాయించడం ఈయనగారికి బాగా ఒంటబట్టిన విద్య. ఓటేస్తే అది చేస్తా ఇది చేస్తామని సూపర్‌ సిక్స్‌ పేరుతో హామీలు గుప్పించిన బాబు గారు అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని సాంతం మరచిపోయారు. పైగా హామీల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పై విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తున్నారు. బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీకి బాబు విషయం బాగానే తెలిసినట్లు ఉంది. అందుకే కొన్నేళ్ల క్రితమే ‘యూ టర్న్‌’ బాబు అని పేరు పెట్టారు. చంద్రబాబు కూడా ఆ పేరును ఎప్పటికప్పుడు సార్థకం చేస్తూనే ఉన్నారు. 

కొన్ని రోజుల క్రితం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు గమనించండి.. ప్రజలు ఆనందంగా ఉంటే వైఎస్సార్‌సీపీ నేతలు భరించలేకపోతున్నారట! కక్ష్యలు కార్పణ్యాలు తనకు అసలే తెలియవట! హద్దుమీరితే ఏం చేయాలో ఆయనకు బాగా తెలుసట! వైఎస్సార్‌సీపీ తన పాలన కాలంలో వందకు 70 మంది అధికారులను భ్రష్టు పట్టించిందట! అవినీతి కేసులో జైల్లో ఉండగా ఆయన్ను చంపే ఆలోచన చేశారట! ఇవీ బాబుగారి వాక్కులు. వీటితోపాటు.. ‘‘రాష్ట్రానికి వీళ్లు అరిష్టం’’ అంటూ బాబు వైఎస్సార్‌సీపీని ఉద్దేశించి మాట్లాడారని అనుకూల మీడియా ఓ భారీ కథనాన్ని వండి వార్చింది. 

ఇచ్చిన హామీలు నెరవేర్చడం అరిష్టమా? లేక అన్నీ ఎగ్గొట్టడమా? ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారో ఈ నాలుగు నెలల కాలంలో ఎప్పుడైనా బాబు చెప్పాడా? కనీసం షెడ్యూలైనా ఇచ్చారా? ఇవ్వలేదే!. వాస్తవాలిలా ఉంటే.. ఆయనేమో.. ప్రభుత్వం చాలా మంచిదని తనకుతాను కితాబిచ్చుకుంటున్నారు. హామీలన్నింటినీ ఉట్టికెక్కించినా తన హయాంలో ప్రజలు ఆనందంగా ఉన్నారట! దబాయించడం అంటే ఇదే మరి!

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ విషయంలోనూ బాబు తీరు ఇంతే. ప్రతిపక్షంలో ఉండగా.. తామైతే ప్రైవేట్‌పరం కాకుండా రక్షిస్తామని గొప్పలు చెప్పారు. తీరా ప్రభుత్వంలోకి వచ్చాక మాత్రం చేతులెత్తేశారు. కుంటిసాకులు చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు పనిచేశానని తరచూ చెప్పుకునే బాబు ప్రతిపక్షంలో ఉండగా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ గురించి అవగాహన లేకపోయిందని చెప్పడంతోనే తెలిసిపోయింది ఆయన మాటల్లో డొల్లతనం ఎంత అన్నది! విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో ప్రస్తుతం బాబు చేస్తున్న వ్యాఖ్యల్ని గమనిస్తే అది ప్రైవేట్‌ పరం కావడం తథ్యమని అనిపించకమానదు. అదే జరిగితే విశాఖకే కాదు.. మొత్తం ఆంధ్రప్రదేశ్‌కే అరిష్టం అవుతుంది!

తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదం విషయం.. లడ్డూ తయారీలో జంతు కొవ్వు కలిసిన నెయ్యి వాడారని ఒకసారి.. ఎక్కడ వాడారో అప్రస్తుతమని ఇంకోసారి!! ఇది కదా అరిష్టం! విజయవాడ కనకదుర్గమ్మ ఉత్సవాల విషయంలోనూ ఇంతే. మునుపెన్నడూ లేనంత విధంగా ఉత్సవాలు జరిగాయని ఆయనకు ఆయన కితాబిచ్చుకున్నారు కానీ.. ప్రత్యేక దర్శనం కోసం రూ.500 లు పెట్టి టికెట్ కొన్నవారు కూడా గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉండాల్సి వచ్చిందని, వీఐపీలు, జత్వానీ వంటి మోసకారి నటీమణులు నేరుగా, దర్జాగా దర్శనానికి వెళ్లారని భక్తులు ఆరోపించారు. ముఖ్యమంత్రి మాత్రం ఆహా, ఓహో అని పొగుడుకుంటున్నారు. 

తాను అధికారంలో ఉండగా జరిగిన అవినీతి కార్యకలాపాలను ఎండగట్టారని, కేసులు పెట్టి, జైలుకు పంపారన్న అక్కసుతో ముగ్గురు ఐపీఎస్ లను సస్పెండ్ చేయడమే కాకుండా దాదాపు పాతికమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను పక్కనపెట్టిన చంద్రబాబు ప్రభుత్వం తనకు కక్షంటే ఏమిటో తెలియదని అమాయకపు మాటలు చెబుతున్నారు. వరద సాయం జరిగేటప్పుడు 5 - 10 శాతం దుబారా కావచ్చని ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తి చెప్పడం రాష్ట్రానికి అరిష్టమో కాదో తేల్చుకోవాలి. రాజమండ్రి జైలులో తనను చంపాలనుకున్నారని ప్రచారం జరిగిందని ఒక సీఎం అంటున్నారంటే అంతకన్నా పచ్చి అబద్ధం మరొకటి ఉంటుందా? నిజంగా అలాంటిదేమైనా జరిగి ఉంటే ప్రస్తుతం ఆయనే సీఎంగా ఉన్నారు కదా,  నిజానిజాలు నిగ్గుదేల్చవచ్చు కదా? జైలులో ఏసీ కూడా పెట్టించుకున్న ఈ నాయకుడు తనకు తగు సదుపాయాలు కల్పించ లేదని చెబుతున్నారంటే ఏమి అనుకోవాలి! 

ఈనాడు, జ్యోతి వంటి టీడీపీ అనుకూల మీడియాలో రాసిన పచ్చి అబద్ధాలను ఇప్పటికీ ఆయన వాడుకుంటూనే ఉన్నారు. అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులకు రూ. 23 కోట్లు ఖర్చుపెట్టినదానికి సమాధానం ఇవ్వకపోగా ఐతే ఏంటట? అన్నట్లుగా మాట్లాడుతున్నారు. దీన్ని కదా అరిష్టపు పాలన అనాల్సింది. ఈవీఎంలు, జమలి ఎన్నికలపై చంద్రబాబు పలు మార్లు మాటమార్చిన సంగతి కొత్తేమీ కాదు. ఈవీఎంలను హ్యాక్‌ చేయవచ్చని చెప్పిందే ఆయన. ఒంగోలులో ఈవీఎంలు, వీవీ ప్యాట్ స్లిప్పులను సరిపోల్చి అక్రమాలు జరగలేదని ఎందుకు ఎన్నికల సంఘం ఎందుకు తేల్చలేదో చంద్రబాబు వివరించి ఉంటే అప్పుడు ఆయన మాటను నమ్మవచ్చు.

ఈవీఎం బ్యాటరీ ఛార్జింగులో ఎందుకు తేడా వచ్చిందో చంద్రబాబైనా తెలిపి ఉంటే బాగుండేది. కానీ అలా చేయకుండా  2019లో వైఎస్సార్ సీపీ ఎలా గెలిచిందని ప్రశ్నిస్తున్నారు. అప్పుడు ఆయన ఈవీంలపై సుప్రీం కోర్టు దాకా ఎందుకు వెళ్లారో చెప్పరు. ఈ సంగతులు పక్కన పెడితే ‘‘నీకు 15 వేలు, నీకు 15 వేలు’’ అంటూ పిల్లలనూ, ‘‘నీకు 18 వేలు’’ అంటూ తల్లుల్ని, ‘‘నీకు 48 వేలు’’ అంటూ యాభై ఏళ్లలోపు ఉన్న బీసీలను ఊరించి వారికి మొండి చేయి చూపడం అరిష్టపాలన అవుతుందా కాదా? నిరద్యోగులకు నెలకు రూ. మూడు వేలు ఇస్తామని ఇప్పుడు ఆ ఊసే ఎత్తకపోవడం, వాలంటీర్లను కొనసాగించడమే కాకుండా రూ.10 వేల గౌరవ వేతనం ఇస్తామని ఆశపెట్టి, అలా చేయకుండా, వారి బతుకులను రోడ్డు పాలు చేస్తే అది మంచి ప్రభుత్వం అవుతుందా? లేక అరిష్టపు ప్రభుత్వమవుతుందా? కానీ వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై మాత్రం చంద్రబాబు ఉన్నవి లేనివి కల్పించి దుష్ప్రచారం చేస్తుంటారు.

జగన్ తాను ఇచ్చిన హామీల్లో 98 శాతం అమలు చేస్తే అది అరిష్టమట. టీడీపీ, జనసేన కూటమి ఇచ్చిన దాదాపు అన్ని హామీల ఊసే ఎత్తకుండా, జనాన్ని మోసం చేయడం  అరిష్టం కాదట?  జగన్ సచివాలయాలు, హెల్త్ క్లినిక్కులు, రైతు భరోసా కేంద్రాలు ఇలా అనేక వ్యవస్థలను తీసుకురావడం అరిష్ట పాలన అవుతుందా? వాటిని అన్నిటినీ ప్రస్తుతం  ధ్వసం చేయడం అరిష్టపాలన అవుతుందా?  ఇలా చెప్పుకుంటూ పోతే  టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం లోటుపాట్లు లెక్కకు మిక్కిలి. చంద్రబాబు  ఇంత అధ్వాన్నంగా ప్రభుత్వాన్ని నడుపుతూ కూడా ఎల్లో మీడియా అండతో జనాన్ని మభ్య పెట్టాలని చూడడం అన్నిటికన్నా పెద్ద అరిష్టం కాదా?


- కొమ్మినేని శ్రీనివాస రావు
సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement