AP: అలా చేస్తే ప్రాంతీయ విద్వేషాలు రాజుకోవా? | Chandrababu Conspiracy: Govt Offices Moves To Amaravati From Rayalaseema | Sakshi
Sakshi News home page

AP: అలా చేస్తే ప్రాంతీయ విద్వేషాలు రాజుకోవా?

Published Tue, Nov 19 2024 11:18 AM | Last Updated on Tue, Nov 19 2024 11:31 AM

Chandrababu Conspiracy: Govt Offices Moves To Amaravati From Rayalaseema

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి రాయలసీమకు మోసం చేసే పనులు చేస్తున్నారు. ఇటీవలి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి అనూహ్య విజయాలు అందించిన రాయలసీమ ప్రయోజనాలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి తద్విరుద్ధంగా ప్రవర్తిస్తే పరిణామాలు ఎదుర్కోక తప్పదు. కర్నూలు నుంచి న్యాయవ్యవస్థకు చెందిన పలు కార్యాలయాలు, కడప నుంచి కేంద్ర ప్రబుత్వానికి చెందిన చిన్న, మధ్యతరహా పారిశ్రామిక కేంద్రాన్ని అమరావతికి తరలించేందుకు చర్యలు చేపట్టడం ఆ ప్రాంత ప్రజలకు తీవ్రమైన అన్యాయం చేసినట్లే. సీమ ప్రజల మనసులను గాయపరిచినట్లే. కర్నూలులో హైకోర్టుతో పాటు 43 ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాలని  వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తలపెట్టింది. జ్యుడిషియల్‌ సిటీ నిర్మాణానికి సుమారు 273 ఎకరాల స్థలమూ కేటాయించింది. నేషనల్‌ లా యూనివర్శిటీ కోసం వంద ఎకరాలు ఇవ్వడమే కాకుండా రూ.వెయ్యి కోట్లు మంజూరు కూడా చేశారు. 

అయితే ఇప్పుడు వివిధ ఆఫీసులతోపాటు లా యూనివర్శిటీని కూడా తరలించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి అన్న సందేహం వస్తోంది. 201419 మధ్యకాలంలోనే అనంతపురానికి కేటాయించిన ఎయిమ్స్‌ను చంద్రబాబు అండ్‌ కో మంగళగిరి తరలించింది. తాజాగా పులివెందులలోని ప్రభుత్వ వైద్యకళాశాలకు మంజూరైన యాభై ఎంబీబీఎస్‌ సీట్లను చంద్రబాబు ప్రభుత్వం వదులుకుంది. ఇవన్నీ ఆయన రాయలసీమకు తప్పుడు సంకేతాలను అందిస్తున్నట్లుగానే చూడాలి. రాయలసీమ, ప్రత్యేకంగా కర్నూలు అన్నది ఒక సెంటిమెంట్. మద్రాస్ రాష్ట్రంలో సీమాంధ్ర ప్రాంతం అంతా భాగంగా ఉండేది. ఆ రోజులలో తెలుగు వారిని కూడా ఢిల్లీలో మదరాసీలు అనేవారు. 

తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావాలన్న ఆకాంక్షతో కోస్తా ప్రాంత నాయకులు ఇందుకోసం ప్రజలను సమీకరించడం ఆరంభించి పలు చోట్ల సభలను పెట్టేవారు. ఈ క్రమంలో రాయలసీమకు చెందిన రాజకీయ పార్టీల నేతలను కూడా కలుపుకుని వెళ్లాలని తలపెట్టారు. కానీ అప్పటికే కృష్ణా, గోదావరి నదులపై కొన్ని ప్రాజెక్టులు కోస్తాలో ఉండడం, తద్వారా రైతులు ఆర్థికంగా ముందంజలో ఉండటం తదితర కారణాలను చూపుతూ రాయలసీమ నేతలు పలు సందేహాలను లేవనెత్తారు. ఆ దశలో ఆంధ్రపత్రిక వ్యవస్థాపకులు దేశోద్దారక నాగేశ్వరరావు పంతులు తన శ్రీబాగ్ నివాసంలో ఇరు ప్రాంతాల నేతలతో సమావేశం జరిపి ఒక అవగాహన కుదిరేందుకు కృషి చేశారు. అప్పుడు వివిధ అంశాలతో ఇరుప్రాంత నేతలు చేసుకున్న ఒప్పందమే శ్రీ బాగ్‌ ఒప్పందం. దాని ప్రకారం రాజధాని ఒక చోట ఉంటే, హైకోర్టు మరో చోట ఉండాలి. 

తదుపరి రాయలసీమ, కోస్తా ప్రాంతాలలో ఆంధ్ర ఉద్యమం ఉదృతం అయింది. చివరికి పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగంతో జవహర్ లాల్ ప్రభుత్వం దిగివచ్చి ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు అంగీకరించింది. ఆ సమయంలో ఎక్కడ రాజధాని చేయాలన్న చర్చ మళ్లీ ఏర్పడింది. గుంటూరువిజయవాడతో పాటు, విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు వంటి నగరాలపై ఎమ్మెల్యేలు తమ వాదనలు వినిపించారు. అప్పటికే తెలుగు వారంతా ఒక్కటి కావాలన్న భావన ఉండడంతో, భవిష్యత్తులో తెలంగాణతో కూడిన ఉమ్మడి ఏపీ ఏర్పాటైతే హైదరాబాద్ రాజధాని అవుతుందన్న అభిప్రాయం ఏర్పడింది. ఆ దశలో సీమాంధ్రకు కర్నూలును రాజధాని చేయాలని, గుంటూరు వద్ద హైకోర్టు పెట్టాలని నేతలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ ప్రకారం కర్నూలులో శాసనసభను ఏర్పాటు చేసుకున్నారు. గుంటూరులో హైకోర్టు నిర్వహించారు. 

1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటైన తర్వాత రాజధాని, హైకోర్టు రెండూ హైదరాబాద్ లోనే స్థాపితమయ్యాయి. అదృష్టమో, దురదృష్టమో అప్పటి నుంచి హైదరాబాద్ కేంద్రంగానే అభివృద్ధి సాగుతూ వచ్చింది. అయినా ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో తమకు అన్యాయం జరుగుతోందంటూ తెలంగాణ నాయకులు ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను ఆరంభించారు. దానికి రాజకీయ కారణాల కూడా తోడయ్యాయి.1969లో తెలంగాణ ఉద్యమం తీవ్ర స్థాయిలో నడిచింది.తదుపరి 1973 ప్రాంతంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం కూడా పెద్ద ఎత్తున జరిగింది. అప్పుడే రాష్ట్రం విడిపోయి ఉంటే ఎలా ఉండేదో కాని, అప్పట్లో ఆరుసూత్రాల పథకాన్ని కేంద్రం ప్రకటించింది. విశేషం ఏమిటంటే దానివల్ల ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఆరు జోన్ లు ఏర్పాడడం మినహా, మళ్లీ అభివృద్ది అంతా హైదరాబాద్ లోనే కేంద్రీకృతమైంది. 

సెంట్రల్ యూనివర్శిటీతో సహా పలు ప్రభుత్వ రంగ సంస్థలు హైదరాబాద్ చుట్టూరానే ఏర్పాటయ్యాయి. అంతకుముందు వచ్చిన ఉక్కు ఉద్యమం కారణంగా విశాఖపట్నంలో స్టీల్ ప్యాక్టరీ మాత్రం వచ్చింది. ఆంధ్ర ప్రాంత ప్రజలు ఎక్కువ సంఖ్యలో హైదరాబాద్ కు వలస వెళ్లడం ఆరంభం అయింది. 2001నుంచి కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమం రకరకాల రూపాలు దాల్చుతూ 2014 నాటికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనివార్యత వరకు వెళ్లింది. కాంగ్రెస్, బీజేపీలతోపాటు చంద్రబాబు ఆధ్వర్యంలోని తెలుగుదేశం పార్టీ విభజనకు అనుకూలంగా లేఖలు ఇవ్వడంతో రాష్ట్రం విడిపోయింది. రాష్ట్ర విభజన వల్ల అధిక నష్టం జరిగింది సీమాంధ్ర ప్రాంతానికే అని అంతా అంగీకరిస్తుంటారు. అప్పుడు మళ్లీ రాజధాని సమస్య మొదటికి వచ్చింది. 

ఉమ్మడి హైదరాబాద్ పదేళ్లు రాజధానిగా ఉండాల్సి ఉన్నా, ఓటుకు నోటు కేసు కారణంగా చంద్రబాబు ప్రభుత్వం ఆకస్మికంగా ఏపీకి తరలివెళ్లాలని నిర్ణయించుకుంది. శ్రీబాగ్ ఒడంబడిక అంశం తిరిగి తెరపైకి వచ్చింది. విజయవాడగుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేస్తున్నందున కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తో ఆ ప్రాంత ప్రజలు, ప్రత్యేకించి న్యాయవాదులు ఆందోళనలు చేపట్టారు. అయినా అప్పట్లో ప్రభుత్వం అంగీకరించలేదు. చంద్రబాబు ప్రభుత్వం అమరావతి పేరుతో రాజధాని ఏర్పాటు చేయడం, అక్కడే అన్ని ఆఫీస్ లు నెలకొల్పాలని నిర్ణయించుకోవడం జరిగింది. తదుపరి వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం రాయలసీమ,కోస్తా ఆంధ్ర ఉత్తరాంధ్ర ప్రాంతాలకు సమన్యాయం జరగాలన్న లక్ష్యంతో మూడు రాజధానుల విధానానికి శ్రీకారం చుట్టింది. విశాఖను కార్యనిర్వాహక రాజధాని చేస్తే అంతర్జాతీయంగా కూడా రాష్ట్రానికి గుర్తింపు తేవచ్చని అప్పటి ముఖ్యమంత్రి జగన్ భావించారు. శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలును ప్రకటించారు. 

ఆ విషయంలో చట్టం కూడా చేయడానికి సంకల్పించినా తెలుగుదేశం పార్టీ పలు చిక్కులు కల్పించగలిగింది. దాంతో ఆ చట్టాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుని, 2024 ఎన్నికల తర్వాత ఆ ప్రణాళిక అమలు చేయవచ్చని భావించింది. కానీ  వైఎస్సార్‌సీపీ ఓటమిపాలై టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి విశాఖలో కార్యనిర్వవహక రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుకు మంగళం పలికినట్లయింది. అమరావతి రాజధానికి ఏభైవేల ఎకరాలకు పైగా సేకరించాలని తలపెట్టడం, తదితర అంశాలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు కాంగ్రెస్, బీజేపీ వంటి పార్టీలు తొలుత వ్యతిరేకించినా, ఆ తర్వాత కాలంలో అవి తమ వైఖరి మార్చుకున్నాయి. బీజేపీ అయితే రాయలసీమలో హైకోర్టుతోపాటు, సచివాలయం కూడా ఏర్పాటు చేయాలని ప్రత్యేక డిక్లరేషన్ కూడా ప్రకటించి, తదుపరి ప్లేట్ మార్చేసింది. 

జగన్ మాత్రం కర్నూలులో న్యాయ రాజధానిలో భాగంగా లోకాయుక్త, హెచ్ఆర్‌సీ, సీబై కోర్టు, లా యూనివర్శిటీ వంటివి కొన్నింటిని స్థాపించే ప్రయత్నం చేశారు. అమరావతిలో కాకుండా ఇతర ప్రాంతాల్లో కొన్ని ఆఫీసుల ఏర్పాటుపై టీడీపీతోపాటు ఈనాడు, జ్యోతి వంటి మీడియా వ్యతిరేక ప్రచారం చేశాయి. ఇక్కడ ఆసక్తికర అంశం ఏమిటంటే అమరావతితోపాటు విశాఖ, కర్నూలు లకు జగన్ ప్రాధాన్యత ఇస్తే, మూడు ప్రాంతాలలో  వైఎస్సార్‌సీపీ పరాజయం చవిచూసింది. ఈవీఎంల మహిమో, ప్రజల ఓట్లో కారణం తెలియదు కాని టీడీపీ కూటమి అధికారంలోకి రావడం, కర్నూలు నుంచి వివిధ ఆఫీసులకు రంగం సిద్ధమవుతూండటం జరిగిపోయింది. ఇప్పుడు రాయలసీమ ప్రజలు దీనిని వ్యతిరేకిస్తున్నారు. రాయలసీమలోని అధికార టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నేతలు దీనిపై బహిరంగంగా తమ అభిప్రాయాలను చెప్పలేకపోతున్నా, వారికి భయం పట్టుకుంటుంది. 

 వైఎస్సార్‌సీపీ నేతలైతే కర్నూలు నుంచి న్యాయ వ్యవస్థకు సంబంధించిన ఆఫీసుల తరలింపుపై మండి పడుతున్నారు. లాయర్లు కూడా తమకు అన్యాయం జరుగుతోందని ప్రకటించి వారం రోజుల పాటు కోర్టుల బహిష్కరణ పాటించారు కూడా. ఈ ఆందోళనలు కాస్తా ఉద్యమరూపం దాల్చితే, మళ్లీ ప్రాంతాల మధ్య వివాదాలు చెలరేగే అవకాశం ఉంటుంది. విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలపై ఉత్తరాంధ్ర వాసులు ఆగ్రహంగా ఉన్నారు. విశాఖ స్టీల్‌ను రక్షిస్తామని చెప్పిన టీడీపీ, జనసేన నేతలు ఇప్పుడు స్వరం మార్చుతున్నారు. గతంలో టీడీపీ హయాంలోనే ఒకసారి విశాఖ నుంచి ఒక రైల్వే ఆఫీస్ ను విజయవాడకు తరలించాలని ప్రతిపాదనలు వస్తే ఆ ప్రాంత ప్రజలు గట్టిగా వ్యతిరేకించారు. దాంతో అది ఆగింది. మరి ఇప్పుడు కర్నూలు నుంచి ఆఫీస్ లను తరలిస్తుంటే ప్రజలు ఏ స్థాయిలో స్పందిస్తారో అప్పుడే చెప్పలేం.

 కడప సమీపంలోని కొప్పర్తి వద్ద చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్దికి కేంద్రం రూ.250 కోట్లతో మంజూరు చేసిన కార్యాలయాన్ని కూడా తరలించాలని చంద్రబాబు ప్రభుత్వం తలపెట్టింది. ఇది కూడా రాయలసీమ వ్యతిరేక సెంటిమెంట్ కు దారి తీయవచ్చు. జగన్ కొప్పర్తి వద్ద పారిశ్రామికవాడను అభివృద్ది చేయడానికి చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు దానికి విఘాతం కలుగుతుందా అన్నది కొందరి అనుమానం. అమరావతిలో కొత్త సంస్థలను తీసుకు రాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలోని కార్యాలయాలను అక్కడకు తీసుకువెళ్లడం వల్ల ప్రయోజనం ఏమిటన్న ప్రశ్న కూడా ఉంది. హైదరాబాద్ లో మాదిరి అన్నీ అమరావతిలోనే కేంద్రీకరిస్తే నష్టం జరుగుతుందేమోనన్న భయం కూడా లేకపోలేదు. అయినప్పటికి టీడీపీ ప్రభుత్వం కేంద్రీకరణవైపే మొగ్గు చూపుతోంది. పేరుకు విశాఖను ఆర్థిక రాజధానిని చేస్తామని అంటున్నా అదెలాగో ప్రభుత్వం వివరించలేకపోతోంది.

కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెబుతున్నా, ఈలోగా లోకాయుక్త తదితర ఆఫీసులను తీసుకుపోవడం ఏమిటన్నది పలువురి ప్రశ్నగా ఉంది. అసాధారణ మాండేట్ వచ్చినందున తాము ఏమి చేసినా ఎదురు ఉండదని, రాయలసీమ ప్రజలు ఆందోళనలకు సిద్దమయ్యే పరిస్థితి లేదని కూటమి నేతలు భావిస్తుండవచ్చు. అలా ఆ ప్రాంత ప్రజలు ఎదిరించకపోతే కూటమికి ఇబ్బంది ఉండదు. కాని రాజకీయాలలో ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పలేం. కనుక తొందరపడి నిర్ణయాలు తీసుకుని తర్వాత చేతులు కాల్చుకోవడం కన్నా, ముందుగానే చంద్రబాబు నాయుడు ఒకటికి, రెండుసార్లు ఆలోచించుకుని దీనిపై నిర్ణయం చేస్తే మంచిదని చెప్పాలి. లేకుంటే ప్రాంతీయ విద్వేషాలు రాజుకునే ప్రమాదం ఉంది. 

కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement