
సాక్షి, పల్నాడు జిల్లా: తనపై ఏసీబీకి ఫిర్యాదు చేసిన వారిని తాను ఎప్పుడూ చూడలేదని.. కూటమి నేతల డైరెక్షన్‌లోనే తనపై ఏసీబీ కేసు నమోదు చేసిందని మాజీ మంత్రి విడదల రజిని అన్నారు. ఆదివారం ఆమె చిలకలూరిపేటలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆదేశాలతోనే ఏసీబీ కేసు పెట్టారని మండిపడ్డారు. ‘‘నన్ను, నా కుటుంబాన్ని ఎంపీ కృష్ణదేవరాయులు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నా కాల్ డేటాను తీశారు. ఆయన ఒత్తిడితోనే కాల్‌డేటా తీసినట్లు పోలీసులు ఒప్పుకున్నారు. ఫిర్యాదు చేసిన వారితో నాకెలాంటి సంబంధం లేదు’’ అని విడదల రజిని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో రెడ్‌బుక్ అరాచకాలు తారాస్థాయికి చేరాయి. నాపై ఏసీబీ అక్రమంగా కేసు నమోదు చేసింది. కూటమి నేతల బెదిరింపులకు నేను భయపడను. ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాను. రెడ్ బుక్ పాలనలో నన్ను టార్గెట్ చేశారు. అక్రమ కేసులు పెడుతున్నారు. అదిగో రజిని.. ఇదిగో రజిని అంటూ ఆవు కథలు చెబుతున్నారు. ఏసీబీ కేసులో ఫిర్యాదుదారులను ఇంతవరకూ నేను కలవ లేదు. రెడ్ బుక్ పాలనకు పరాకాష్టే ఈ ఏసీబీ కేసు’’ అని రజిని మండిపడ్డారు.
‘‘ఏసీబీ కేసులో ఫిర్యాదుదారుడు టీడీపీ వ్యక్తి. మార్కెట్ ఏజెన్సిని పెట్టి నాపై కేసులను పెట్టిస్తున్నారు. ఈ కథకు మొత్తం డైరెక్టర్ ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు. అక్రమంగా వ్యాపారం చేసుకోవడానికి ఫిర్యాదు దారులకు సహకరిస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. నేనంటే ఎంపీ శ్రీకృష్ణదేవరాయలకు ఎక్కువ కోపమే. 2020లో గురజాల డీఎస్పీ, సీఐలకు లంచం ఇచ్చి నాతో పాటు నా కుటుంబ సభ్యుల కాల్ డేటాను తీయించారు. బీసీ మహిళ, ఎమ్మెల్యే అయిన నా కాల్ డేటాను తీయించారు. నా వ్యక్తి గత జీవితంలో ఎందుకు రావాలనుకున్నారో తెలియదు. మీ ఇంటిలో ఉన్న ఆడపిల్లల కాల్ డేటా తీస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. అంతటి నీచుడు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు’’ అని విడదల రజిని ధ్వజమెత్తారు.

వైఎస్ జగన్ ఎంపీని ప్రశ్నించారు. అప్పుడే ఆయన మనసులో శ్రీకృష్ణదేవరాయలు నమ్మకాన్ని కోల్పోయారు. అప్పటి నుండి ఎంపీ నాపై కక్ష పెంచుకున్నాడు. పది నెలల నుండి ఒకే ఫిర్యాదును పదేపదే అందరికి ఇప్పించారు. ప్రస్తుతం విజిలెన్స్ ఎస్పీగా ఉన్న శ్రావణ్ టీడీపీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు కొడుకు. ఆ ఎస్పీ ఇచ్చే విజిలెన్స్ నివేదిక ఏవిధంగా ఉంటుందో ఆలోచించండి. ఆయన ఇచ్చిన రిపోర్ట్ తెలుగుదేశం రిపోర్ట్. అవినీతి ఘనాపాటి ప్రత్తిపాటి... నా మీద, జర్మనీలో ఉండే నా మరిది మీద అక్రమ కేసులు పెట్టించారు. నా మామ కారుపై దాడి చేయించారు. ఎవరూ ఎటువంటి వారో అందరికి తెలుసు. నా కళ్లలో భయం చూద్దామనుకుంటున్నారు. ఇటువంటి వాళ్లను చూస్తే నాకు భయమనిపించదు’’ అని విడదల రజిని చెప్పారు.
లావు రత్తయ్య అంటే నాకు గౌరవం. శ్రీకృష్ణదేవరాయలు వైజాగ్‌లో చెరువు భూములను కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పోసానిని రాష్ట్రమంతా తిప్పి ఇబ్బందిపెట్టారు. వడ్లమూడి యూనివర్సిటీ నుంచి చిలకలూరిపేట ఎంత దూరమో? చిలకలూరిపేట నుంచి వడ్లమూడి యూనివర్సిటీ అంతే దూరం. శ్రీకృష్ణదేవరాయలు ఇది గుర్తుపెట్టుకోవాలి’’ అని విడదల రజిని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment